రంగబలి సెంటర్ తో సహజ తండ్రికున్న సంబంధమేమిటి? ఎందుకు ఆ పేరు విని శౌర్యని తిరస్కరిస్తున్నాడు? సొంత వూరు వదిలి రాలేని శౌర్య తన ప్రేమకి అడ్డుగా వున్న రంగబలి సెంటర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నాడు? ఆ వూళ్ళో వుంటున్న ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో) కీ, సహజ తండ్రికీ మధ్య వున్న సంబంధమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.
కొత్త దర్శకుడు వినోదాత్మకంగానే కథని మొదలుపెట్టి దాన్ని సీరియస్ గా మార్చేయడంతో, సీరియస్ గా మార్చివేశాక సంఘర్షణని బలంగా తీర్చిదిద్దక పోవడంతో- మొత్తానికే ఎసరు వచ్చింది. నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ జమ పడింది. రిలీజ్ చేసిన ట్రైలరే చప్పగా వున్నప్పుడు, సినిమా గొప్పగా వుండే అవకాశం లేదు. కనీసం ముగింపయినా అర్ధవంతంగా లేదు, ఇంటర్వెల్ మలుపు సహా. ఫస్టాఫ్ ని కామెడీతో లాక్కొచ్చినా, హీరోకి రంగబలి సమస్య ఎదురయ్యాకా, కథ ఎలా నడపాలో అర్ధంగాక, గజిబిజి చేసేయడంతో సెకండాఫ్ బోల్తా పడింది.
ఫస్టాఫ్ లో వూళ్ళో నాగ శౌర్య ఆవారా తనం, తండ్రితో చీవాట్లు వందల సినిమాల్లో వచ్చేసిన అరిగిపోయిన విషయమే. అలాగే వైజాగ్ లో హీరోయిన్ యుక్తితో లవ్ ట్రాక్ లోనూ కొత్తదనం లేదు. నాగశౌర్యతో ఫస్టాఫ్ లాగలేక పోతున్నప్పుడు, కమెడియన్ సత్యని ప్రవేశపెట్టి ఫస్టాఫ్ కి అతడ్ని హీరోగా చేశాడు దర్శకుడు. ఈ సినిమా గురించి ఏదైనా చెప్పుకుంటే సత్య చేసిన కామెడీ గురించే చెప్పుకుంటారు ప్రేక్షకులు- ఇది అద్భుతమైన కామెడీ ఏమీ కాదు- చీప్ కామెడీయే బూతుతో కలిసి.
హీరోయిన్ తండ్రితో హీరోకి సమస్య ఎదురయ్యాక సెకండాఫ్ లో పడుతుంది కథ. ఇక్కడ్నించే రంగబలి పేర్చు మార్చే కథనం సీరియస్ యాక్షన్ సినిమాలాగా మారిపోయి- అర్ధం పర్ధం లేకుండా దారితప్పి పోయింది కథ. రంగబలి కాదు, ప్రేక్షకులు బలి అన్నట్టు తయారయ్యింది. ఈ తయారీలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో- ఇటీవలి ‘దసరా’ లో తను చేసిన విలనీ లాగా, మరోసారి హాస్యాస్పదంగా తయారయ్యాడు.
వూళ్ళో ఒక సెంటరు పేరు మార్చే కథనే రాజకీయ విలన్ పాత్రతో రాజకీయ సెటైర్లతో, చురకలతో కొత్త కథగా చేసి నడపొచ్చు. స్థలాల పేర్లు రాజకీయ అవసరాల కోసం వివాదాస్పదమవుతున్న వైనాన్ని చిత్రించి- ఒక మెసేజితో ఈ బలహీన రోమాంటిక్ కామెడీని బలంగా నిలబెట్టి, బాక్సాఫీసు ప్రయోజనాలు పొంది వుండొచ్చు.
కమెడియన్ సత్య మాత్రం ఎవరైనా సంతోషంగా వుంటే ఓర్వలేని పాత్రలో చేసిన కామెడీతో సినిమాకి తనవంతు న్యాయం చేశాడు. హీరోయిన్ యుక్తి రొటీనే. చెప్పుకోదగ్గ పాత్ర కాదు. తండ్రుల పాత్రల్లో గోపరాజు రమణ, మురళీ శర్మ ప్యాడింగ్ కి నిండుదనం తెచ్చారు. విలన్ ఎమ్మెల్యేగా మలయాళ నటుడు షైన్ చాకో ఆటలో అరటిపండు.
అరడజను ఫ్లాపుల తర్వాత ‘దసరా’ తీసి హిట్ అన్పించుకున్న అగ్ర నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా ప్రొడక్షన్ విలువలకి బాగా ఖర్చు పెట్టారు. అయితే కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి తన క్రాఫ్టుకి ఇంకా చాలా సానబెట్టు కోవాల్సిన అవసరం వుంది.