రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 22, 2022

1160: మూవీ టెక్నిక్ -2


(‘ఓపెనింగ్ సీనే టీజర్’ తరువాయి భాగం)

        సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ వెనుక గల సైకాలజీని సినిమా స్క్రీన్ ప్లే కి ఎలా అన్వయించుకోవచ్చో   తెలిపే ప్రసిద్ధ ‘ది న్యూయార్కర్’ మ్యాగజైన్ ఆర్టికల్ ప్రకారం ఆ పరిశోధనాంశాల్లోకి మళ్ళీ వెళితే- సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ అవడానికి కారణమయ్యే నెటిజనుల మనస్తత్వ విశ్లేషణలో తేలిన అంశాలు- 1. ఇంటరెస్ట్, 2. ఆరిస్టాటిల్ సూత్రాలు, 3. ఎమోషనల్ అప్పీల్, 4. క్వాలిటీ...ఈ నాల్గూ ఏమిటో వివరంగా చూద్దాం : ఇంటరెస్ట్ విషయానికొస్తే- ఏదైనా ఆసక్తికరంగా అన్పిస్తేనే నెటిజనులు షేర్ చేస్తారు. కంటెంట్ ఎంత సంచలనాత్మకంగా అన్పిస్తే అంత శరవేగంగా క్షణాల్లో  షేర్ అయి వైరల్ అయిపోతుంది. ఆసక్తి రేపని కంటెంట్ షేర్స్ అంతంత మాత్రంగా వుంటాయి.

          రిస్టాటిల్ సూత్రాలు : ఒక కంటెంట్ ఆసక్తి ఎందుకు కల్గిస్తుంది? గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ (క్రీపూ 384 - 322) మూడు కారణాలు వివరిస్తాడు. ఇథాస్ (ethos), పేథాస్ (pathos), లేగాస్ (logos) ఈ మూడూ కారణమౌతాయి.  ఇథాస్ నైతికతలకి సంబంధించింది; పేథాస్ ఎమోషనల్ అప్పీల్ కి సంబంధించింది; లేగాస్ లాజిక్ కి సంబంధించింది. నైతికత, ఎమోషనల్ అప్పీల్, లాజిక్ ఈ మూడు మానసిక కారణాలూ  కంటెంట్ పట్ల ఆసక్తి కలగడానికి బీజాలు వేస్తున్నాయి. అలాగే ఈ మూడింట్లో ఏ ఒకటి లోపించినా సినిమాలు ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం లేదని ఈ ఆర్టికల్ వివరిస్తోంది. విశ్వసనీయత, ప్రేక్షకులతో అనుబంధం, హేతుబద్ధత ఈ మూడూ మంచి కథకి పునాది రాళ్ళ వంటివి. 

        ఎమోషనల్ అప్పీల్ : ‘ది న్యూయార్కర్’ ఆర్టికల్  ఎమోషనల్ అప్పీల్ కి ఇలా భాష్యం చెప్తోంది- పాజిటివిటీ, ప్రేరేపణ ఈ రెండూ నెటిజనుల షేరింగ్ బిహేవియర్ ని ప్రభావితం చేస్తున్నాయి.  విషయం లేని సినిమాలు కూడా సక్సెస్ అవుతూంటాయి. కానీ ఎక్కువ మంది హీరో పాత్ర ప్రయాణంలో ఎమోషనల్ అప్పీల్ కి కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ అప్పీల్ వాళ్ళ దృష్టినీ, హృదయాలనీ కట్టి పడేస్తుంది. ఎమోషనల్ గా ప్రేక్షకులకి ఏమీ ఇవ్వని హీరో పాత్ర,  ప్రేక్షకుల్లో తన పట్ల పాజిటివిటీనీ, ప్రేరణనీ కల్గించుకోదు. దీంతో  ప్రేక్షకులు తమ ఎమోషనల్ ఇన్వెస్ట్ మెంట్  పే-ఆఫ్ కాకుండా వేస్ట్ అయ్యిందే అని వెలితిగా ఫీలవుతారు.

          క్వాలిటీ : విజువల్ గా, వెర్బల్ గా క్వాలిటీ లేని కంటెంట్ షేర్ కాదు. అలాగే సినిమాలూ క్వాలిటీ కథ లేకపోతే సక్సెస్ కావు ( మనదగ్గర సక్సెస్ అయిపోతాయి!). క్వాలిటీ కథకున్న మన్నిక కలకాలం దాన్ని గుర్తుంచుకునేలా చేస్తుంది...

       ఇప్పుడు టీజర్ విషయానికొద్దాం. మన సినిమాల్లో ప్రారంభ దృశ్యాలు, లేదా ఓపెనింగ్ బ్యాంగులు ఏ సరళిలో వుంటున్నాయి? ఈ ప్రారంభ దృశ్యాలు గానీ, ఓపెనింగ్ బ్యాంగులు గానీ  పైన చెప్పుకున్న వైరల్ కంటెంట్ లా, వైరల్ కంటెంట్ సైకాలజీని పుణికిపుచ్చుకుని  వుంటున్నాయా? ప్రారంభ దృశ్యాలు, ఓపెనింగ్ బ్యాంగులు అనే భాష కంటే ఇప్పుడు కాలీన స్పృహతో టీజర్ అంటే ఎక్కువ సూటిగా మనసులో నాటుకుని, ఆ దిశగా సృష్టించుకునేందుకు ప్రేరణ అవుతుంది. సినిమాలకి ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ లా గంగవెర్రులెత్తిస్తే ఆ సినిమా ఏ స్థాయిలో వుంటుందో గత వ్యాసంలో వివరించుకున్న ‘డిస్కో డాన్సర్’ దృష్టాంతమే చాలు- ఆనాడు అప్పటికే వైరల్ అయిన ఆ సూపర్ హిట్ సాంగ్ తో ఓపెనింగ్ పిచ్చిగా పిచ్చిగా వైరల్ కంటెంటే! ఆ టీజర్ ఎక్కుపెట్టిన బాణంలా ప్రేక్షకుల హృదయాంతరాళ్ళల్లో సూటిగా నాటుకుపోయి లాక్కెళ్ళింది. సినిమా రాళ్ళూరప్పల పాలు కాలేదు.


          బయట చేసేపనే సినిమాలోనూ చేసుకుంటే మంచిదని  ‘ది న్యూ యార్కర్’ వ్యాసం తేల్చి చెబుతున్న సారాంశం. బయటంతా  సోషల్ మీడియాలో కంటెంట్ ని వైరల్ బాట పట్టించడానికి ఏ సైకాలజీ మనకి పనికొస్తోందో అదే  సైకాలజీని సినిమాల్లోనూ ఉపయోగిస్తూ కథలు చేసుకోవాలిగా? కథ చెప్పే టెక్నిక్ ని సినిమాలు సోషల్ బిహేవియర్ లోంచి  కూడా నేర్చుకోవాలిక. ఇంకా కాలం చెల్లిపోయిన పాత నడకలు నడవకుండా, కొత్త నడకల్ని ఎవరికి వాళ్ళు కనిపెట్టి ఆశ్చర్య పరుస్తూండాలి. తెలుగు సినిమాల ఓపెనింగ్ బ్యాంగులు వ్యాపార దృక్పథంతో వుండడం లేదని గత వ్యాసంలో చెప్పుకుందిందుకే. కాలంతో సంబంధం లేకుండా కేవలం క్రియేటివ్ ప్రదర్శనలతో అవి వెలవెలబోతున్నాయి. కాలం అంటే ఇప్పటి మార్కెట్. క్రియేటివిటీ అన్న పదం ఎప్పుడూ అపార్ధాలకి లోనవుతూ వుంది. కమర్షియాలిటీ  పూత  లేని క్రియేటివిటీ ఒక క్రియేటివిటీయే అన్పించుకోదు  కమర్షియల్ సినిమాలకి సంబంధించి. కమర్షియాలిటీ పూతని మార్కెట్టే నిర్ణయిస్తుంది. మార్కెట్ నుంచే కమర్షియల్ విలువల్ని తీసుకోవాలి. ఈ మార్కెట్ యాస్పెక్ట్ లో మిళితమై వుండే కమర్షియాలిటీని కాలమే అందిస్తూ వుంటుంది ఎప్పటికప్పుడు- ఇప్పుడు చెప్పుకుంటున్న సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ క్రేజ్ కి లాగే- ఈ క్రేజ్ వెనకాలున్న సైకాలజీకి లాగే. 
                                                                ***

       ‘డిస్కో డాన్సర్’ టీజర్ ఒక్కటే  జిందా తిలిస్మాత్ కాదు. అన్ని సినిమాలకీ అదే వర్తించదు.  ఆ టీజర్ నేరుగా కథ చెప్పేస్తోంది. అంటే థీమాటిక్ టీజర్ అన్నమాట అది. అన్ని సినిమాలకీ ఇదే పెట్టుకుంటే వికటిస్తుంది. అన్ని కథలకీ ఇదే కుదరదు కూడా. కథని బట్టి, జానర్ ని బట్టి వేర్వేరు  టీజర్లు వుంటాయి. అవేమిటో చూద్దాం –ఈ సందర్భంగా హాలీవుడ్ ఓపెనింగ్ సీన్లు ఎలా వుంటున్నాయా అని ఇప్పటి ఎవేర్ నెస్ తో టీజర్స్ గా పరిశీలిస్తే – సంభ్రమాశ్చర్యాలకి లోనవక తప్పదు. వాళ్ళు టీజర్లు ఎప్పట్నించో ప్రయోగిస్తున్నారు!  కాకపోతే వాటిని టీజర్స్ అనలేదు. ఓపెనింగ్ ఇమేజ్ అన్నారు. ప్రేక్షకుల సంగతి దేవుడెరుగు, ముందు స్క్రీన్ ప్లే ప్రారంభంలో స్టూడియో ఎగ్జిక్యూటివ్ ని కట్టిపడెయ్యాల్సిన అగత్యముంది- అందుకని మొదటి పేజీలోనే ఆ సబ్జెక్టు ఇమేజిని ప్రతిష్టించడం మొదలెట్టారు. పదీ పదిహేను పేజీల్లోగా స్క్రిప్టుతో ఎగ్జిక్యూటివ్ ని ఆకట్టుకోవాలనే ఎత్తుగడకి దీటుగా- అంతవరకూ కూడా వెయిట్ చేయకుండా మొదటి పేజీలో థీమాటిక్ ఇమేజితో థ్రిల్ కల్గించడం మొదలెట్టారు.
                                    
           ఈ ఓపెనింగ్ ఇమేజిలు ఎలా వుంటున్నాయో చూద్దాం. ఓపెనింగ్ ఇమేజిని  1975 లోనే దర్శకుడు స్టీవెన్  స్పీల్ బెర్గ్ తన క్లాసిక్ మూవీ ‘జాస్’ తో  ప్రవేశపెట్టినట్టు చెబుతున్నారు. కాకపోతే అది సరిగ్గా కుదర్లేదు. క్లుప్తత కరువయ్యింది. టైటిల్స్ పడుతున్నప్పుడే ఇమేజి స్టార్ట్ అయిపోతుంది- సముద్ర గర్భంలో జలచరాల్ని చూపిస్తూ- బ్లూ టింట్ లో-  అండర్ వాటర్ షూట్ తో. టైటిల్స్  పూర్తవగానే విజువల్స్ సముద్ర గర్భంలోంచి బీచి పైకి మారుతాయి. చూస్తే అది రాత్రిసమయం. ఆ సమయంలో బీచిలో ఒక గ్రూపు పార్టీ చేసుకుంటూ వుంటారు. నిశిరాత్రి సముద్రపుటొడ్డున పార్టీ జరుగుతున్న వాతావరణమంతా  ఒక మిస్టీరియస్ ఫీలింగునిస్తుంది- ఏదో జరగబోతుందన్నట్టుగా... సరే, ఆఖరికి ఉన్నట్టుండి సముద్రంలోంచి సొరచేప దూసుకొచ్చి దాడిచేసి ఒకమ్మాయిని లాక్కెళ్ళి పోతుంది...ఇదంతా ఎక్కువ సేపు సీనుగా సాగుతుంది. కానీ టైటిల్స్ తో ముందు సముద్ర గర్భం చూపిస్తూ, అక్కడ్నించి కెమెరా సముద్రపుటొడ్డుకి పొజిషన్ తీసుకోవడమనే విజువల్ కంటిన్యూటీ ముంచుకురానున్న ఉపద్రవాన్ని సూచిస్తోంది. అది సముద్ర గర్భం లోంచే ముంచు కొచ్చింది సొర చేప రూపంలో. ఇలా ఈ  ఓపెనింగ్ ఇమేజి ఇప్పుడు సోషల్ మీడియాలో షేరయ్యే బాపతు వైరల్ కంటెంట్ నే  పోలివుంది- అదే సైకలాజికల్ కనెక్ట్ తో. ‘డిస్కో డాన్స’ ది  అరటి పండు వొల్చి చేతిలో పెట్టినట్టు కథ విప్పేస్తున్న ‘థీమాటిక్ టీజర్’ అయితే, ఈ ‘జాస్’ లో మనం చూసేది నర్మగర్భంగా, సంకేత భాషలో కథనం చేస్తున్న ‘ప్లాట్ టీజర్’ అనవచ్చు. 

     ఇలాటిదే మరొకటి : 2000 లో  క్రిస్టఫర్ నోలాన్ తీసిన  ‘మెమెంటో’ లో చూస్తే,  ‘జాస్’ లో లాగే టైటిల్స్ తో ఇమేజి మొదలవుతూ,  ఒక పోలరాయిడ్ ఫోటోలో మనిషి మృతదేహం క్రమంగా ఫేడ్ అవుటయ్యే స్టాటిక్ షాట్ పడుతూంటుంది. ఆ ఫోటో ప్రింట్ పూర్తిగా తెల్లగా మారిపోయి- టైటిల్స్ పూర్తయి- కెమెరా పట్టుకున్న క్యారక్టర్ ఫిలిం ప్లేట్ ని లోడ్ చేస్తూ ఓపెనవుతాడు...ఈ మొత్తం దృశ్యం రివర్స్ లో జతుగుతున్నట్టు మనకి అర్ధమై ఎన్నో ప్రశ్నల్ని  రేకెత్తిస్తుంది ముందు ముందు  చూడబోయే కథ పట్ల...  దీన్ని మురుగదాస్ తమిళ హిందీ భాషల్లో ‘గజినీ’ గా తీశాడు. తెలుగులో ఇదే పేరుతో డబ్ అయ్యింది. మురుగ దాస్ మేకింగ్ లో ఈ ఓపెనింగ్ ఇమేజి వుండదు. ఏముందంటే- బ్లూ టింట్ లో మనిషి మెదడు అంతర్భాగ కదలికలతో టైటిల్స్ ప్రారంభమవుతాయి. టైటిల్స్ పూర్తయ్యాక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మీద పాత్రలు చర్చిస్తాయి. ఇలా ‘జాస్’ లో, ‘మెమెంటో’లో వున్నలాంటి  టైటిల్స్ నుంచి సీన్లోకి వచ్చే విజువల్ కంటిన్యూటీ ఇక్కడ లేదు. సీను ద్వారాలు తెరచుకుని టైటిల్స్ కంటెంట్ సీన్లోకి ప్రవహించలేదు. ‘జాస్’ లో టైటిల్స్ కంటెంట్ లోంచి సొర చేప సీన్లోకి వచ్చి దాడి చేసినట్టో, ‘మెమెంటో’లో టైటిల్స్ కంటెంట్ లోని పోలరాయిడ్ ఫోటో గ్రాఫ్ పూర్వపు ఫిలిం స్థితికి మారుతూ సీన్లోకి జొరబడినట్టో మురగదాస్ క్రియేషన్ లేదు. టైటిల్స్ కంటెంట్ లోని మనిషి మెదడు అంతర్భాగ చిత్రణ కట్ అయిపోయి – డిటాచ్డ్ గా వేరే సీనులో పాత్రలు షార్ట్  టర్మ్ మెమరీ లాస్ గురించి చర్చించడం  మొదలవుతుంది. ఇది ఓపెనింగ్ బ్యాంగ్ కాకపోగా, వైరల్ కంటెంట్ లాంటి టీజర్ కూడా కాలేకపోయింది. క్రిస్టఫర్ నోలాన్ మర్డర్ అనే తీవ్రాసక్తి కల్గించే ఓపెనింగ్ ఇమేజితో కథకి కనెక్ట్ చేస్తూ ప్రారంభిస్తే, మురుగదాస్ టైటిల్స్ కంటెంట్ తో, చర్చతో, ఇంకా ఉపోద్ఘాతం చెప్పే దగ్గరే ఉండిపోయాడు. ఇది థీమాటిక్ టీజర్ కాలేదు సరికదా, ప్లాట్ టీజర్ కూడా కాలేకపోయింది. ఇందుకే మన సినిమాల్లో ఓపెనింగ్ సీన్లు, బ్యాంగులు అర్ధం లేకుండా వుంటున్నాయని చెప్పేది. 

          డేవిడ్ ఫ్లించర్ తీసిన ‘ఫైట్ క్లబ్’ (1999) కూడా మురగ దాస్ చేసిన పొరపాటుని  ఎత్తి చూపిస్తుంది. ఇందులో ఎలా వుంటుందంటే, మనిషి మెదడు అంతర్భాగ కదలికలతో టైటిల్స్ పడుతూ పడుతూ బ్లాస్ట్ అయి,  పాత్ర క్లోజప్ తో సీను మొదలవుతుంది అతడికి ముచ్చెమట్లు పట్టేస్తూ! అతను సెకండ్ హీరో ఎడ్ నార్టన్. అతడి  మెదడులో భయాందోళనలే నన్నమాట ఆ మెదడు అంతర్భాగపు కదలికలు. అవి ముఖం మీదికి చెమట రూపంలో తేలాయన్న మాట!  మెదడు లోంచి ముఖం పైకి ఈ విజువల్ కంటిన్యూటీ, టైటిల్స్ కంటెంట్ లోంచి సీన్లోకి భయాందోళనలు ప్రవహించి కలిసిపోవడమూ - ఇదీ అసలైన ఓపెనింగ్ బ్యాంగ్ అన్నా, ఓపెనింగ్ ఇమేజి అన్నా- లేదా టీజర్ అన్నా. దీంతో అయిపోలేదు- ఎందుకతడికి భయాందోళనలతో చెమట్లు పట్టేస్తున్నాయి? ఎందుకంటే,  అతడి నోట్లో పిస్తోలు కుక్కి నించున్నాడొకడు! తను చావబోతున్నాడు! ఇదీ కదా వైరల్ కంటెంట్ వున్న టీజర్ అంటే! ఇది కూడా ప్లాట్ టీజరే. 

          దేనికీ కారణం కాని  సీను ఒక సీనే కాదు అన్నట్టు - ఇదీ మురగదాస్ టైటిల్స్ కంటెంట్ వ్యవహారం. క్రిస్టఫర్ నోలాన్ అలా ఎందుకు తీశాడో అతను  ఆలోచించలేదు. దాదాపు అన్ని సినిమాల్లో ఇలా ఉత్సుకత రేపని బలహీన ప్రారంభాలే వుంటున్నాయి.  హాలీవుడ్డీయులు  తీసే ఏ సీనుకైనా అర్ధం లేకుండా వుండదు. వాళ్ళు చేతిలో పెన్నూ కెమెరా వున్నాయి కదాని పవిత్రమైన స్క్రీన్ స్పేస్ నీ, స్క్రీన్ టైమునీ దుర్వినియోగం చెయ్యరు. కవిత్వంలో వుండే సంక్షిప్తతని తెర మీద సాధించడానికి ప్రయత్నిస్తారు. జాస్ అయినా, మెమెంటో అయినా, ఫైట్ క్లబ్ అయినా ఆ ప్రారంభాలు తెర మీద పోయెట్రీలే. టీవీల్లో  టీజర్స్ చూసి ఆ ఉత్సాహంతో సినిమా కెళ్తే గజినీ లోలాగా  సముచితం కాని విధంగా, చప్పగా వుంటున్నాయి మన ప్రారంభాలు. ప్రారంభమే ఒక టీజరవ్వాలి. దాన్నందుకుని తారాజువ్వల్లా ఆడియెన్స్ ఆ సినిమా కథా ప్రపంచంలోకి దూసుకెళ్ళి పోవాలి. దీన్నెవరు కాదంటారు?
                                         ***
           ప్లాట్ టీజర్ తర్వాత  కామెడీ టీజర్ ఎలా వుంటుందో చూద్దాం.  ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే కామెడీ ఓపెనింగ్ సీను జానర్ తో సంబంధం లేని కాల్ మనీ వ్యవహారం లాంటి కామవికార విషయంతో, ఆ తర్వాత అతి కిరాతకమైన చైన్ స్నాచింగ్స్ సీనుతో రసభంగం కల్గిస్తూ రచయిత మానసిక స్థితిని బయట పెడుతూ వుంటుంది. దీని తమిళ ఒరిజినల్ ‘తిరుడాన్  పోలీస్’ లో నేరుగా హీరో అతడి ఫ్రెండ్ (ఇద్దరూ పోలీసు అధికారుల కొడుకులే) ఏదో తేడా వచ్చి రోడ్డు మీద కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తి,  అక్కడా కొట్టుకుని గలాభా సృష్టించి, మళ్ళీ బయటికి పారిపోతూ కొట్టుకుని... ఇలా ఓపెనింగ్ సీను తోనే కామెడీ జానర్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రీమేక్ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ లో ఈ హాస్యరసం గల్లంతై  జానర్- టీజర్ రెండూ కూడా  కాకుండా పోయాయి. 

          కనీసం ఒకటి చేసి వుండాల్సింది- ఏమిటంటే, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ని  లాజిక్ లేని ఒక మైండ్ లెస్ కామెడీ గా మార్చేసినప్పుడు (మత్తు ఇంజెక్షన్ లిచ్చి మనుషుల చేతులు నరుక్కుని వెళ్ళిపోవడం) ఆ మైండ్ లెస్ కామెడీకి  ప్రారంభం నుంచే ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేసి వుండాల్సింది. అలాటి ఒక మైండ్ లెస్ కామెడీ సీనుతోనే  సినిమా ప్రారంభించి వుంటే- తామెలాటి  సినిమా చూడబోతున్నారో ప్రేక్షకులకి ముందే అర్ధమైపోయి సర్దుకునే అవకాశం వుండేది.  ‘దేర్ ఈజ్ సంథింగ్ ఎబౌట్ మేరీ’ అనే సూపర్ హిట్ రోమాంటిక్ కామెడీ వుంది. ఇది మైండ్ లెస్ కామెడీయే. ప్రేక్షకులు తిట్టుకోకుండా ఇది మైండ్ లెస్ కామెడీయేరా  బాబూ, క్షమించండి  మమ్మల్నీ – అన్నట్టు  ముందే జంట దర్శకులు పీటర్ ఫరెల్లీ- బాబీ ఫరెల్లీలు ఒక తలాతోకా లేని కామెడీ సీనుతో ప్రారంభోత్సవం  చేస్తారు. హై స్కూలు పిట్ట గోడ మీద తీరి కూర్చుని ఒకడు ఏదో పాడుతూ, ఇంకొకడు వాయిస్తూ బుర్రకథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది ఓపెనింగ్ సీను. హిందీలో రోహిత్ శెట్టి తీసిన హిట్టయిన ‘గోల్ మాల్’ మైండ్ లెస్ కామెడీ సిరీస్ సినిమాల ప్రారంభాలు కూడా ఇలాగే వుంటాయి మైండ్ లెస్ గా. సమస్య ఎక్కడ వచ్చిందంటే, కామెడీ ఏదైనా ఒకటే అనే తప్పుడు అవగాహన వల్ల. లాజిక్ వుండని మైండ్ లెస్ కామెడీలు  వేరనీ,  దీన్ని అందరు ప్రేక్షకులూ భరించలేరనీ, అందుకే ముందే  ఈ విషయం స్పష్టం చేస్తూ అలాటి మైండ్ లెస్ కామెడీ సీను టీజర్ గా వేయాలనీ గ్రహించకపోవడం. గ్రహించివుంటే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’  ఓపెనింగ్ అలా అర్ధం లేకుండా వుండేది కాదు. ఆ తర్వాత టోన్ (స్వరం) మారిపోయిన ఆ కామెడీ కూడా మైండ్ లెస్ కామెడీ అవతారమెత్తి అందుకు ముందే సిద్ధంగా లేని ప్రేక్షకుల్ని హడలెత్తించేది కాదు. అనుక్షణం ప్రేక్షకుల మనసెరిగి సినిమానే కాదు, సీన్లు కూడా తీయాలనేది ఇందుకే. ఒక స్క్రీన్ ప్లే ట్యూటర్ అన్నట్టు- స్క్రీన్ ప్లే రచన ఎంత ప్రమాదకరమైన వ్యవహారమంటే, అప్రమత్తంగా వుండకపోతే ఏ క్షణంలో నైనా  ప్రేక్షకుల్ని కోల్పోవచ్చు! 

          కామెడీ టీజర్ గా శుభ్రంగా ‘తిరుడాన్ పోలీస్’ లో లాంటిది, మైండ్ లెస్ కామెడీకి .  ‘దేర్ ఈజ్ సంథింగ్ ఎబౌట్ మేరీ’ లో లాంటిదీ  వేసుకుంటే సరిపోతుంది.

-సికిందర్

Thursday, April 21, 2022

1159 : మూవీ టెక్నిక్

  సినిమా రచన పక్కా వ్యాపారం చేసుకునే కళయినప్పుడు, పక్కా వ్యాపార దృక్పథంతోనే ఓపెనింగ్ సీను వుండాలని  తెలిసిందే గానీ, తెలిసినట్టు వుండడం లేదు చిత్రీకరణలు. సినిమా వ్యాపారం కోసం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్ మొదలైన ప్రచార సాధనాలుపయోగించినట్టే, సినిమా కథనీ  ఒక ‘టీజర్’ తో మొదలెడితే అది ఆ కథని ప్రేక్షకులకి హాట్ కేకులా అమ్ముడుబోయే సరుకుగా మార్చేసే వీలుంది. సినిమా ప్రచారంకోసం ప్రసారం చేసే టీజర్ ఆ సినిమా మొత్తంగా ఏమిటో, దేని గురించో చెప్పవచ్చు. కథకి ఉపయోగించే ‘టీజర్ సీను’  ఆ చెప్పాలనుకున్న కథకి ప్రేక్షకులు వెంటనే అతుక్కుపోయేలా చేస్తుంది. హాలీవుడ్ లెక్కల్లో స్క్రీన్ ప్లే మొదటి పదీ పదిహేను పేజీల్లో ఆకట్టుకోకపోతే ఆ స్క్రీన్ ప్లేని నిర్మాతలు తిరస్కరిస్తారు. టాలీవుడ్ లెక్కల్లో  ఇంటర్వెల్ సమయం ముంచుకొస్తున్నా కథ ఆకట్టుకోకపోతే  నిర్మాతలకి ఏమీ అన్పించక పోవచ్చుగానీ  ప్రేక్షకులకి ఏదో అన్పిస్తుంది. ఇలాకాకుండా మొదటి పేజీతో నే, లేదా మొదటి షాటుతోనే, లేదా మొదటి సీనుతోనే, ఇంకా లేదా మొదటి  సీక్వెన్సు తోనే అయస్కాంతంలా కథకి ఆకర్షిస్తే అంతకన్నా బలమైన చిత్రణ వుండదు- పైగా ఎన్నో విధాలుగా కాలం కూడా పొదుపయ్యే అవకాశం వుంటుంది- స్క్రీన్ టైముని సేవ్ చేసుకునే అవకాశం.  


      ఆల్రెడీ తెలుగు సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగులు లేవా? వున్నాయి. వాటితో ప్రేక్షకుల్ని కట్టి పడెయ్యడం లేదా? లేదు. ఎందుకులేదు? వాటితో  వ్యాపార దృక్పథం కాక గొప్ప క్రియేటివిటీ ఏదో ప్రదర్శించుకోవాలన్న కోణం వుండడం వల్ల. గ్లామర్ కి కళ తోడయినప్పుడే రాణిం చినట్టు, పక్కా వ్యాపార యావ వున్నప్పుడే కమర్షియల్ సినిమా క్రియేటివిటీ క్రియేటివిటీ అన్పించుకుంటుంది. లేకపోతే కొందరు మేధావులు చూసే ఆర్ట్ సినిమా హస్తకళా నైపుణ్యం అన్పించుకుంటుంది. తెలుగు సినిమాల ఓపెనింగ్ బ్యాంగులు  హస్తకళా నైపుణ్యాలు. కమర్షియల్ బ్యాంగు లిచ్చే లెక్క వేరే వుంటుంది. అదే తెలుసుకోబోతున్నాం.

          ప్రేక్షకుల్ని థియేటర్లకి పరిగెత్తించడానికి రకరకాల క్రేజీ టీజర్లు ఛానెళ్ళలో వదుల్తారు. తీరా ఆ సినిమాల్ని చూస్తే బలహీనంగా ఎత్తుకుంటాయి కథని. టీజర్లు చూసి ఏ ఉత్సాహంతో ప్రేక్షకులు థియేటర్లకి వస్తారో, ఆ ఉత్సాహం రెట్టింపయ్యేలా సినిమా ఓపెనింగ్ దృశ్యాలున్నప్పుడే బయటి టీజర్లకి అర్ధంపర్ధం వుంటుంది. అడ్వర్టైజింగ్ కొత్త పుంతలు తొక్కుతూంటే, సినిమా మేకింగ్ మాత్రం అదే పాత హొయలు పోతోంది. కొందరంటారు- రేపు టీజర్ కి కట్ చేయాల్సిన షాట్లని దృష్టిలో పెట్టుకునే సీన్లు తీస్తున్నామని. టీజర్! టీజర్ ని దృష్టిలో పెట్టుకుని షాట్లు! కథని దృష్టిలో పెట్టుకుని కాదు! ఫోటో షూట్స్ తోనూ ఇలాగే చేస్తున్నారు. పోస్టర్ల కోసం చేసే ఈ క్రేజీ ఫోటో షూట్ దృశ్యాలు సినిమాల్లో  వుండవు. ఇలా ఆధునిక వ్యాపార దృక్పథం సినిమా చుట్టే కన్పిస్తుంది- సినిమాలోపల పక్కా వ్యాపార దృక్పథం ఏమీ వుండదు. 


         ఒకప్పుడు టీవీ ఛానెళ్ళే లేనప్పుడు, థియేటర్ లకి మాత్రమే కొన్ని సినిమాల ట్రైలర్లు వచ్చేవి. థియేటర్లో ట్రైలర్లు చూసి థియేటర్లకే  వెళ్లి సినిమాలు చూసేవాళ్ళు. రెండూ అక్కడే కానిచ్చుకోవడం.  కొన్ని సినిమాలు ఆ ట్రైలర్లు ఇచ్చే కిక్కు కంటే ఎక్కువ కిక్కుతో కథని ఎత్తుకునేవి. అలాటి ఒక సినిమా 1982 లో మిథున్ చక్రవర్తి మ్యూజికల్ సూపర్ హిట్ ‘డిస్కో డాన్సర్’ (బాలకృష్ణతో ‘డిస్కో కింగ్’). విడుదలకి ముందే అన్నీ సూపర్ హిట్ సాంగ్సే బప్పీ లహరీ సంగీతంలో. సినిమా ప్రారంభమే డిస్కో డాన్సర్ సిగ్నేచర్ ట్యూన్ తో ఉత్సాహపరుస్తూ టైటిల్స్ పడతాయి- టైటిల్స్ పూర్తవగానే వెంటనే చాలా సర్ప్రైజింగ్ గా ఇంకో పాటతో కిక్కిస్తూ దృశ్యం  మొదలవుతుంది. బయట వింటూ వున్న ఈ పాట ఇప్పుడే వుంటుందని ఎవరూ వూహించరు. చాలా ఆనందపడి పోతారు. ఇంతే కాదు,  ఇంకా సర్ప్రైజింగ్ గా ఈ పాటలో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కన్పిస్తాడు! రాజేష్ ఖన్నా చిన్నప్పుడు మిథున్ చక్రవర్తి తండ్రిగా  అప్పీయరెన్స్ ఇస్తాడు! ఈ రాజేష్ ఖన్నా- చిన్నప్పటి మిథున్ చక్రవర్తిల మీద వీధిలో చుట్టూ జనం మధ్య సూపర్  హిట్ సాంగ్ మొదలవుతుంది. ఈ సాంగ్ ద్వారా (ఓపెనింగ్ సీన్ ద్వారా) మిథున్ చిన్నప్పుడే ఒక నిరుపేద స్ట్రీట్ సింగర్ కొడుకనీ, తనకీ ఆ విద్య అబ్బిందనీ మనకి తెలిసేలా చేస్తాడు దర్శకుడు. అంతే కాదు, వీధిలో తండ్రితో కలిసి పాడుతూంటే, ఎదుటి బంగళా లోంచి  రిచ్ బాలిక (హీరోయిన్ అన్నమాట) చూస్తూంటుంది...  ఇంతకీ ఆ సూపర్ హిట్ పాట – ‘గోరోఁ కీ నా కాలోఁ కీ,  యే దునియా హై దిల్ వాలోఁ కీ...(తెల్లోళ్ళదీ కాదు, నల్లోళ్ళదీ కాదు, ఈ లోకం మనసున్నవాళ్ళదే!). ఇలా పాటతో కలిపి కథ చెబుతూ ఈ ఓపెనింగ్ సీనుని ఒక పరిపూర్ణ ఈవెంట్ గా మార్చేశాడు దర్శకుడు బి. సుభాష్. 


          ప్రారంభ సీనుని  ఒక ఈవెంట్ గా మార్చడం! మళ్ళీ ఒక ‘గాడ్ ఫాదర్’ లోనే చూస్తాం! కానీ  ఈ సుభాష్ ఓపెనింగ్ సీను నేడు  చెప్పుకుంటున్న ఓపెనింగ్ బ్యాంగే! కమర్షియల్ విలువలతో కూడిన ఈ ఓపెనింగ్ బ్యాంగు ఒక టీజర్ లా పనిచేస్తోంది కథకి! ఇది చూసింతర్వాత ఇక కథ మొత్తం చూడాలని ఉత్సుకతకి లోనవకుండా వుంటారా ప్రేక్షకులు! దటీజ్ రియల్ టీజర్ అన్నమాట స్టోరీకి!  

          టీజర్ సినిమాలో ఉండాలే గానీ, బయట ఎన్నుంటే ఏం లాభం. ఒకసారి  ‘డిస్కో డాన్సర్’ వీడియో యూ ట్యూబ్ లో చూస్తే బాగా అర్ధమవుతుంది  స్టోరీ టీజర్ మహత్తు. ఎప్పట్నుంచో  టీజర్ పేరుతో కాదుగానీ, ఒక క్యాచీ ట్యూన్ గల పాటతో తో సినిమా ప్రారంభిస్తే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుందని ఎందరికో చెప్పి చూశాడీ వ్యాసకర్త. ఇందులోని మజా వాళ్ళకి తెలీడం లేదు. బోరు ఫీలవుతూ సినిమాలకి ఆలస్యంగా వచ్చే వాళ్ళు కూడా ఆ పాట చూడాలని ముందే వచ్చేస్తారు...


          నేటి సినిమాల క్రియేటివిటీ వీలైనన్ని కోణాల్లో కమర్షియాలిటీలో భద్రతని చూసుకోవాల్సి వుంటుంది. ఇదివరకు చెప్పుకుంటూ వున్న ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో భాగంగా సినిమా కథకి క్రియేటివ్ యాస్పెక్ట్ తో బాటు, మార్కెట్ యాస్పెక్ట్ కూడా వుండాలని చెప్పుకున్నాం. తమలోకంలో తాముండి  రాసే వాళ్ళకి, తీసే వాళ్ళకీ ప్రపంచ పోకడ అంతగా పట్టదు. తాము రాసిందే, తీసిందే ఎప్పటికీ చెల్లుబాటు అవుతుందను కుంటారు. కానీ మార్కెట్ ఎప్పటి కప్పుడు మారిపోతూ వుంటుంది. సినిమా రంగాన్ని కాస్సేపు పక్కన పెడదాం, పత్రికా రంగాన్నే తీసుకుంటే అది క్షణం క్షణం సోషల్ మీడియాతో పోటీ పడాల్సి వస్తోంది. పత్రికలే కాకుండా ఛానెళ్ళూ సోషల్ మీడియా వేగాన్ని అందుకోవడానికి ఉరుకులు  పరుగులు తీయాల్సి వస్తోంది. వార్త వీటికి అందేలోగా సోషల్ మీడియాలో ప్రపంచం చుట్టేస్తోంది. పైగా మీడియా సంస్థలకి ఏ వార్త ఎలా ఇవ్వాలో ఒక పాలసీ వుంటుంది. స్వేచ్చా విహంగమైన సోషల్ మీడియాకి ఏ పాలసీ వుండదు గనుక నిజాలు ఆ వేదికపై బయటపడుతూంటాయి. ఇది కూడా తలనొప్పిగా మారింది మీడియా సంస్థలకి. అయితే నిజాల కంటే అబద్ధాలే సులువుగా బాగా త్వరగా అర్ధమవుతాయి కాబట్టి ఈ వంకతో సోషల్ మీడియా అభిశంసనలకి గురవుతూంటుంది సదా. అయినా ఒక్కోసారి మీడియా సంస్థలకి శృంగభంగం తప్పడం లేదు- ఎలాగంటే, ఇటీవలే ఒక తెలుగు ఛానెల్లో ఒక ‘వివాదాస్పద అంశం’ పైన అన్ని పక్షాల వాళ్ళూ కూర్చుని వేడివేడిగా వాదించుకుంటున్నారు. అంతలో ఒకాయన ఫోన్ చేసి, అదేం చర్చ- ఈ అంశంపైన కోర్టు స్టే ఇస్తే ఇక ఒకర్నొకరు నిందించుకునే పాయింటు ఎక్కడిది – అనేసరికి అందరి పరువూ పోయి తెల్లమొహాలేశారు యాంకరు సహా! వేగంలో, వేడిలో కోర్టు స్టే ఇచ్చిన విషయం కూడా తెలుసుకోకుండా భారీ చర్చపెట్టుకుని తమ విశ్వసనీయతే కోల్పోయారు. ఇదంతా సోషల్ మీడియాతో ఎడతెగని పోటీ వల్లే!

           సినిమా రంగం కూడా దీనికి అతీతం కాదు. ఇటీవల ‘న్యూ యార్కర్’  మ్యాగజైన్ ఒక ఆర్టికల్ ని ప్రచురించింది. సోషల్ మీడియాలో షేర్ చేసే వైరల్ కంటెంట్ ఫండమెంటల్స్ ని వివరిస్తూ రాసిన ఈ ఆర్టికల్ సినిమా రైటర్స్ కి పనికొస్తుందని తెలిపింది. వైరల్ కంటెంట్ ఫండమెంటల్స్ మీద  రీసెర్చర్లు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసంఖ్యాక నెటిజనులు వైరల్ కంటెంట్ ని షేర్ చేయడం వెనుక గల సైకలాజీ ఏమిటన్న దాని  మీద ఈ పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికి వెలువడిన ఫలితాలు  విజయవంతమైన స్క్రీన్ ప్లేలు రాయాలంటే ఇక పైన ఏం చేయాలో సూచిస్తాయి.

        సోషల్ మీడియాలో కొన్ని కంటెంట్స్ మాత్రమే వైరల్ అవుతూ, కొన్నిఅంతగా షేర్ అవకపోవడం వెనకాల నెటిజనుల సైకాలజీ ఏమిటంటే ఒకటి- ఆ కంటెంట్ ఇంట్రస్టింగ్ గా వుండాలి, రెండు- అరిస్టాటిల్ సూత్రాలకి న్యాయం చేయాలి, మూడు- ఎమోషనల్ అప్పీల్ వుండాలి, నాల్గు- క్వాలిటీ వుండాలి...ఈ నాల్గు ఎలిమెంట్స్ వున్న కంటెంట్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(మిగతా రేపు)
-సికిందర్

Wednesday, April 20, 2022

1158 : ఓటీటీ రివ్యూ!

రచన - దర్శకత్వం :  చందూ మొండేటి
            తారాగణం : నివేదా పేతురాజ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, కిరీటి దామరాజు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు
            కథ : ప్రశాంత్ కుమార్, సంగీతం : కాలభైరవ, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
            బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
            నిర్మాత : టిజి విశ్వప్రసాద్
            ***

హా ఓటీటీ కోసం చందూ మొండేటి దర్శకత్వంలో విడుదలైన వెబ్ మూవీ బ్లడీ మేరీ – హీరోయిన్ క్యారక్టర్ ఎలివేషన్ తో  లో- బడ్జెట్ కేజీఎఫ్ అనుకునేలా వుంది. లేత హీరోయిన్ నివేదా పేతురాజ్ ని ఎక్కడికో తీసికెళ్ళి మాఫియా డాన్ గా ఎస్టాబ్లిష్ చేసి, సీక్వెల్ హింట్ కూడా ఇచ్చారంటే, పెద్ద ప్రణాళికలే వున్నాయి పానిండియా మూవీ లెవెల్లో.

        ముగింపులో నివేదా క్యారక్టర్ కి అట్టహాసంగా కేజీఎఫ్ 2 లెవెల్లో ఎలివేషన్ ఇవ్వడం చూస్తే, ఈ ముగింపు ఎలివేషనే ప్రధానం -మిగతా కథ అనవసరమన్న ధోరణిలో ఈ గంటన్నర వెబ్ మూవీ వుంది సహనాన్ని పరీక్షిస్తూ.

        ఒక మూవీ ఏ తీరున కథనం చేస్తే అది స్టేజి నాటకంలా తయారై బాధపెడుతుందో భావి దర్శకులు తెలుసుకోవడానికి ఒక మోడల్ స్క్రీన్ ప్లే కూడా ఇది.

        రెండు రోజులు జరిగే కథ చూపించి, హీరోయిన్ కి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఎలివేషన్ ఇస్తే, పాపం నివేదా పేతురాజ్  అటు గాడ్ మదర్ షబనా అజ్మీ కాలేక, ఇటు  గంగూబాయి ఖఠియావాడీ ఆలియా భట్టైనా కాలేక సతమతమై పోయింది.

        కేజీఎఫ్ హీరో రాకీభాయ్ అనాధగా మొదలై బిగ్ డాన్ అయినట్టూ, నివేదా పాత్ర  అనాధ మేరీ కూడా బ్లడీ మేరీగా, బిగ్ డాన్ గా మారడం ఈ  మినీ కేజీఎఫ్ కి జస్టిఫికేషన్.

        వైజాగ్ లో అనాధ మేరీ (నివేదా) ఇంకో ఇద్దరు అనాధలు రాజు (రాజ్ కుమార్ కాశీ రెడ్డి), బాషా (కిరీటి దామరాజు) లకి చిన్నప్పట్నుంచీ పెద్ద దిక్కుగా వుంటుంది. ఒక ఫ్లాట్ లో వుంటారు. తను నర్సుగా పనిచేస్తూంటుంది. తనకి దృష్టి లోపం, అందుకని కాంటాక్ట్ లెన్సులు వాడుతుంది.

        రాజు చెవిటి వాడు. ఇతడికి కెమెరామాన్ అవ్వాలని కోరిక. బాషా మూగవాడు. ఇతడికి సినిమా హీరో నవ్వాలని ఆశయం. ఇలా గాంధీగారి మూడుకోతుల సారాంశాన్ని సర్వ్ చేస్తూ ఈ పాత్రలుండవు. సరికదా, చెప్పిన పాత్రల ఆశయాలు కూడా పాత్ర చిత్రణల్లో కనిపించవు.

        ఒకరోజు డాక్టర్ మిస్ బిహేవ్ చేస్తూంటే, మేరీ నెట్టేస్తే కింద పడి ఏదో గుచ్చుకుని చచ్చిపోతాడు డాక్టర్. ఈ కేసు పట్టుకుని మేరీ దగ్గరి కొస్తాడు సీఐ ప్రభాకర్ (అజయ్). వచ్చే ముందు తన భార్యతో మిస్ బిహేవ్ చేసిన సినిమా దర్శకుణ్ణి తొక్కి చంపేసి వస్తాడు.

        ఈ హత్య అక్కడికి వేషం కోసం  వెళ్ళిన మూగ బాషా చూస్తాడు. ఈ హత్య రికార్డయిన కెమెరా చెవిటి రాజుకి దొరుకుతుంది.

        దీన్ని పెట్టుకుని సీఐ ప్రభాకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మేరీ. ఇంతవరకు సెటప్ బావుంది బిగినింగ్ కథకి. మేరీ చేసిన హత్యలో ఆమెని పట్టుకోవాలని సీఐ, అలా చేస్తే సీఐ చేసిన హత్య బైట పెడతానని మేరీ బ్లాక్ మెయిల్ చేసేలాంటి సిట్యుయేషన్ ఏర్పడిందని మనకి అర్ధమవుతుంది. ఇప్పుడేం జరుగుతుందన్న ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా క్రియేట్ అయ్యిందన్పిస్తుంది.

        ఈ డ్రామాలో ఎవరు గెలుస్తారు? హంతకులైన ఈ ఇద్దరితో హతుల కెలా న్యాయం జరుగుతుంది? దీనికి ఎవరి అంతరాత్మ మేల్కోవాలి? న్యాయాన్ని డిమాండ్ చేసే నైతిక ఆవరణ గల కథ అన్పిస్తుంది.

        న్యాయమంటే నేరస్థుడికి శిక్షపడడం కాదు, బాధితుడికి న్యాయం జరగడం. శిక్ష న్యాయంలో ఒక భాగం మాత్రమే. ఈ సెటప్ లో వెంటాడే ప్రశ్న- హతులైన వాళ్ళకి న్యాయమెలా లభిస్తుందన్నదే.

         కథంటే తప్పొప్పుల జడ్జ్ మెంట్ చెప్పేదే అయినప్పుడు, తలెత్తిన డ్రమెటిక్ క్వశ్చన్ కి సమాధానం చెప్పగల్గితే, ఆ కథ ఏర్పాటైన సెటప్ తో సరైన దారిలో వున్నట్టు.

        కానీ హంతకులైన ఈ ఇద్దరితో హతుల కెలా న్యాయం జరుగుతుందన్న తలెత్తిన ప్రశ్ననుంచి జరిగిపోయి -  పెడదారి పట్టిపోయినదే ఈ బ్లడీ మేరీ కథ.

        మేరీ ఏమని బ్లాక్ మెయిల్ చేయాలి? డాక్టర్ హత్య కేసులో తన పేరు లేకుండా చేస్తే, సీఐ చేసిన హత్యా దృశ్యాలున్న కెమెరా సీఐ కిచ్చేస్తానని బ్లాక్ మెయిల్ చేయాలి. ఇలా కాకుండా అయిదు లక్షలిస్తే కెమెరా ఇస్తానని అంటుంది. ఆ డబ్బుతో లోకల్ మాఫియా శేఖర్ (బ్రహ్మాజీ) సాయం తీసుకుని బోటు నెక్కి పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. తన మీద హత్యకేసు అలాగే వుంచుకుని!

        సీఐ ప్రభాకర్ కూడా డాక్టర్ హత్య వూసే ఎత్తడు. డాక్టర్ హత్య ఇక కథలో ఎక్కడా ప్రస్తావనకి రాదు. మరి ఆ హత్య ఎందుకంటే, తన ఆశయ సాధనలో ఎవరడ్డు వచ్చినా వూరుకునేది లేదని చెప్పడానికే. ఆ ఆశయమేమిటో చెప్పదు. ఈ ఎలివేషన్ డాన్ గా ఎదగడం కోసమని మనకిప్పుడు అర్ధం గాదు.

        ఎందుకంటే, ఇది క్రైమ్ డ్రామా అనే అనుకుంటాం. క్రైమ్ డ్రామా ఇలా నడుస్తోందేమిటాని అనుకుంటాం. ఇది క్రైమ్ డ్రామా జానర్ వదిలేసుకుని, ఫార్ములా మాఫియా కథగా మారిపోతోందని గ్రహించం ముగింపు చూసేవరకూ.

        లేతపిల్ల మేరీ సీఐతో, లోకల్ డాన్ శేఖర్ తో ఎత్తుకు పైఎత్తులేసి చిత్తు చేస్తూ కమర్షియల్ యాక్షన్ హీరోలాగా సాగి సాగి కట్ చేస్తే - సడెన్ గా ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా ఎలివేట్ అయ్యే దృశ్యాలు. పీడిత జనం కోసం పెద్ద నాయకురాలు. పెద్ద బహిరంగసభ. ప్రత్యర్ధుల్ని అంతమొందించడం, ఎక్కడో ఒక దీవిలో పెద్ద బంగాళాలో నివాసం, హెలీకాప్టర్ వగైరా వగైరా వగైరాలతో -  ఇక సీక్వెల్ - చాప్టర్ టూ రాబోతోందని హింట్ ఇస్తూ ముగింపు!!

        ఇంత చిన్న బడ్జెట్ లో కేజీఎఫ్ అంతటి సినిమా చూపిస్తే, అదీ ఓటీటీలో 400 రూపాయలకి ఏడాది చందా స్కీములోనే మనం చూసేస్తే ఎంత అదృష్టం! ఒక్క కేజీఎఫ్ టూ చూడ్డానికే టికెట్టుకి 400 పెట్టాం కదా.

        భామాకలాపం లాంటి రియలిస్టిక్ హోమ్లీ క్రైమ్ థ్రిల్లర్ అందించిన ఆహా నుంచి, సహజత్వానికి దూరంగా థియేటర్ సినిమా రావడం విచారకరం. దర్శకుడు చందూ మొండేటికి థియేటర్ సినిమా -ఓటీటీ మూవీ రెండూ ఒకటే అన్పించడంతో ఈ సమస్య.

—సికిందర్

 

Friday, April 15, 2022

క్యారెక్టర్ సంగతులు!

 

    సినిమా కథ ఆలోచించడమంటే ‘పాత్ర – ఆ పాత్ర పాల్పడే చర్యలు’  అనే రూట్లో ఆలోచించడ మేనని తెలుకుంటున్న దాఖలాలు  ఈ మధ్య కన్పించడంలేదు. ఒక్క తెలుగులో అనే కాదు, అటు హిందీలో,  ఇంకా అటు హాలీవుడ్ లో సైతం ఇదే పరిస్థితి. తాజాగా ‘చార్లీస్ ఏంజెల్స్- 2’ లో చూడవచ్చు. ఇటీవల విడుదలైన ఓ అగ్ర హీరో సినిమాని ఒక ఇంగ్లీషు పత్రికా సమీక్షకుడు విశ్లేషిస్తూ,  స్క్రీన్ ప్లే అద్భుతంగా వుందని రాశాడు. ఏ సీనుకా సీను విడివిడిగా ఆనందం కలిగిస్తే అదే అద్భుత స్క్రీన్ ప్లే అయిపోతుందన్న మాట. ఇక మొత్తంగా కథేంటో, దాని  నడకేంటో చూడనవసరం లేదన్న మాట. ఇలాగే  వుంటే ఇక భవిష్యత్తు ఇలాటి భయపెట్టే స్క్రీన్ ప్లేలదే!  

          సినిమా కథకి ఏది ముఖ్యం? ఖచ్చితంగా స్ట్రాంగ్  హీరో క్యారెక్టరే.  మార్కెట్లో ఆడుతున్న ఇంకో పది సినిమాలు చూసినా మరపురానంత బలమైన పాత్రచిత్రణతో వుండే స్ట్రాంగ్ హీరో పాత్రే. దీని తర్వాతే మిగతా హంగులన్నీ. మరైతే ఏది స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది? అదెలా పుడుతుంది? ఇక్కడే మనసు చేసే  మాయలోపడి పాసివ్ పంథాలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు  రచయితలు / దర్శకులు. తామో  అద్భుత పాత్ర సృష్టించామని ఉబ్బి తబ్బిబ్బయిపోతారు. చూస్తే అది ఉత్త మనసు రెచ్చగొడితే రొచ్చులో  పడ్డ లేకి పాత్రగానే  కన్పిస్తుంది. ఈ మధ్య గీత రచయిత చంద్రబోస్ ఒక రేడియో ప్రోగ్రాంలో ఒక పనికొచ్చే మాట చెప్పారు : కూలి వాడు చేతులుపయోగించి పనిచేస్తే సరిపోతుందని, కానీ శిల్పి చేతులతో పాటు మెదడు నుపయోగిస్తే, అదే రచయిత ఆ చేతులూ మెదడుతో పాటూ, మనసూ ఉపయోగించి పని చేస్తాడని. 

       రచన చేత్తోనే చేస్తారు గానీ అది మెదడూ మనసుల దోబూచులాట. మెదడూ మనసూ రెండూ కన్పించే రచనే శక్తిమంతమైన రచన. ఇలాకాక కేవలం మనసు మాత్రమే వాడి రాసుకుంటూ పోతే పుట్టుకొచ్చేది బలహీన పాత్రే, అంటే పాసివ్ క్యారెక్టరే. పాసివ్ పంథాలో తిరుగాడే పాత్రలన్నీ కేవలం మనసు చెబితే పుట్టుకొచ్చేవే. అలాటి స్క్రీన్ ప్లే సమీక్షకుడికి గొప్పగా అన్పిస్తే, అతనూ మనసుతో మాత్రమే సినిమా తీసిన దర్శకుడిలాగే,  మనసుతోనే  సినిమా చూశాడనుకోవాలి. మరి దర్శకుడు మెదడు వాడకుండా మనసుతో సినిమా తీస్తే,  ప్రేక్షకులు కూడా మెదడు ఇంటి దగ్గర వదిలేసి మనసుతోనే సినిమా చూసినప్పుడు, హిట్టవ్వాలి గా? ఎందుకని ఇలాటి సినిమాలు హిట్టవడం లేదు?  సినిమాల్లో మెదడు కూడా లేకే హిట్టవడం లేదు. ఇది ఇద్దరి (దర్శకుల, ప్రేక్షకుల) మనసూ తెలుసుకోవడంలేదు. 

          పాత్రల సృష్టిలో మొదట మెదడు పని కల్పించుకుంటుంది. ఎందుకంటే ప్లానింగ్ కి మెదడే కావాలి. మనసు కాదు. మెదడుతో చేసిన ప్లానింగ్ ని తర్వాత మనసుతో చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రక్రియలో మెదడు మిస్సయ్యిందో, ఇక అప్పుడా సృష్టిస్తున్న పాత్ర పాసివ్ నడకలు నడుస్తూ ఎంచక్కా చతికిలబడి ఉస్సూరన్పిస్తుంది. లేదా కథని ఇతర పాత్రలకి అప్పగించేసి ఔటైపోతుంది. ఉదాహరణకి,  హీరోపాత్ర  తన కొచ్చిన ఒక బంగారు అవకాశాన్ని మిత్రుడికి త్యాగం చేసి వెళ్ళిపోవడం ముగింపు అనుకుందాం. అలా వెళ్ళిపోతూ శుభం పడితే బాగానే వుంటుంది. కానీ వెళ్ళిపోడు,  వెళ్ళిపోతూ వుంటాడు. ఇంతలో మిత్రుడికి కనువిప్పవుతుంది. ఇక ఆ బంగారు అవకాశానికి హీరో మాత్రమే పూర్తిగా అర్హుడని, అతడికి ధారాదత్తం చేశాడనుకుందాం - అప్పుడు హీరో ఎవరవుతారు? హీరోనా, మిత్రుడా? అంతిమంగా త్యాగం ఎవరిదైంది?  మిత్రుడిదే అయింది. కాబట్టి మిత్రుడే  గొప్పోడు, అతనే హీరో... హీరో వచ్చేసి తను త్యాగం చేసిందే తిరిగి తనే తీసుకున్నాడు కాబట్టి పాసివ్ పాత్రయిపోయాడు. 

      త్యాగం చేసిన స్ట్రాంగ్ క్యారెక్టర్, అంటే యాక్టివ్ పాత్ర  వెనుదిరగదు. ‘అమరదీపం’ లో కృష్ణంరాజు తమ్ముడి కోసం త్యాగం చేసి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన భావముద్ర ప్రేక్షకులకి మిగలాలి. తన కోసం త్యాగం చేసిన వాళ్ళ కోసమైతే హీరోపాత్ర తిరిగి వస్తుంది. ఆ ఋణం తీర్చుకుంటుంది. 

          మనసు పాలిస్తే పాత్రల సృష్టి మట్టి పాలవుతుంది. అసలిలా జరగడం వెనకున్న మెకానిజం ఏమిటి? మనసు ఏ రకంగా చెప్తే పాత్రలలా తయారవుతాయి? మొదటే చెప్పుకున్నట్టు, పాత్ర – ఆ పాత్ర పాల్పడే చర్యల చట్రంలో కథని ఆలోచించకపోవడం వల్ల, రాస్తున్న రచయితే ఆ పాత్రమీద బోలెడు జాలిగొంటాడు. అయ్యో హీరో ఇలా అయిపోతున్నాడా పాపమనుకుని, ఇతడి కోసం తానేమైనా చేయాల్సిందేనని నడుం కట్టి, పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే రచయిత వచ్చేసి హీరో కోసం కథని దున్నుతున్నాడో, అప్పుడా హీరో కుదేలై కుక్కిన పేనల్లే వుండిపోతాడు. ఇది ఆ పాత్ర నటించే స్టార్ కూడా తెలుసుకోలేడు. 
*
          ఉదాహరణకి – హీరో చెల్లెల్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమె కుయ్యోమొర్రో మంటున్న సౌండ్స్ విన్పిస్తున్నాయి. హీరో విషాదంగా మొహం పెట్టుకుని నడుస్తున్నాడు. ఆ చెల్లెలితో తన సెంటిమెంటు దృశ్యాలన్నీ కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. సిస్టర్ సెంటిమెంటుతో బాగా కన్నీళ్లు వస్తున్నాయి. పార్కులో కూర్చుని ఏడ్చాడు. లేచి టాంక్ బండ్ మీదికి నడిచాడు. అలా  టాంక్ బండ్  తటాకాన్ని చూస్తూంటే చెల్లెలి జ్ఞాపకాలే సుళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ డీటీఎస్ లో కుయ్యో మొర్రోలు విన్పిస్తున్నాయి. థియేటర్ ఆపరేటర్ కి పట్టరాని కోపం వస్తోంది. హీరో పిడికిళ్ళు బిగించాడు, పళ్ళు నూరాడు. ఫర్వాలేదనుకున్నాడు ఆపరేటర్. హీరో పంజా గుట్ట సెంటర్ కొచ్చాడు.  అక్కడ పక్కింటి  పరమానందం ఎదురై, మీ చెల్లెమ్మ గురించేనా? త్వరగా అమీర్ పేట సెంటర్ కెళ్ళమన్నాడు. వెళ్తే అక్కడ రెండు  గ్రూపులు కొట్టుకుంటున్నాయి. హీరో అర్ధంగాక చూస్తున్నాడు. ఆపరేటర్ ఓపిగ్గా చూస్తున్నాడు. హీరో ఏం జరిగిందని పక్కవాణ్ణి  అడిగాడు. మధుబాల అనే అత్యంత బ్యూటిఫుల్ గాళ్ ని వాళ్ళె త్తుకుపోతే, వీళ్ళు కొట్టడానికొచ్చారని పక్కోడు వివరిస్తున్నాడు...ఆపరేటర్ కిక అర్ధమైపోయింది. మ్యాట్నీకల్లా ఈ మొత్తమంతా ఎడిట్ చేసి పారేశాడు  ( సినిమాలకి ఫైనల్ ఎడిటింగ్, ఫైనల్ షేపు థియేటర్లలో ఆపరేటర్ల చేత ప్రొజెక్టర్ల మీద మాత్రమే చేయబడును). 

          ఇలా హీరోకి ఎవరెవరో చెప్తూంటేనే గానీ విషయాలు తెలియడంలేదు. హీరో తన ముందున్న సమస్య గురించి చేసిన ప్రయత్నమేదీ లేదు. పచ్చి పాసివ్ గా వుంటున్నాడు. ఇతడి మీద జాలిపడుతూ రచయిత విషాదంగా మార్చాడు. ఇదే రచయిత తనకే ఇలా జరిగితే ఇలా వుండడు. ఆరాలు తీస్తాడు, పరుగులు తీస్తాడు. కానీ ఎందుకనో కథకొచ్చేసి  అర్ధంలేని మెలోడ్రామాలు సృష్టిస్తూ కూర్చుంటాడు. పై సీనులో గమనిస్తే, రచయితే హీరోకోసం సంఘటనల్నీ, పాత్రల్నీ సృష్టించాడు. ఇలా రచయిత డ్రైవ్ చేస్తేనే గానీ హీరోకి తన చెల్లెలి అదృశ్యం గురించిన విషయాలు ఒక్కోటీ తెలియడం లేదు. దీన్ని కథ  వచ్చేసి పాత్రని నడపడం అంటారు. హీరో కోసం రచయిత వచ్చేసి కథని అల్లుతున్నాడు. రచయిత కథ వైపే వుంటున్నాడు. అదే హీరోవైపు వుంటే, సమస్యలో వున్న హీరోలా ఆలోచించడానికి పరకాయ ప్రవేశం చేస్తాడు. అప్పుడు ఇదే తనకి జరిగితే ఏంచేస్తాడో అలా యాక్టివ్ గా  రాసుకుపోతాడు.

          అప్పుడు చెల్లెలు అపహరణకి గురైందని హీరో పోలీస్ స్టేషన్ కి పరుగెడతాడు. అక్కడ ఎందు
కనో ఎస్సై నవ్వి హేళన చేస్తాడు. హీరో చెల్లెలి ఫ్రెండ్స్ దగ్గరికి పరుగెడతాడు. వాళ్ళేమీ చెప్పలేకపోతారు. వెతకాల్సిన చోట్లన్నీ వెతుకుతాడు. రాత్రంతా వెతుకుతూనే వుంటాడు. ఆ మాంటేజీలు పడుతూంటాయి. తెల్లారి కాలేజీ కెళ్తాడు. ప్రిన్సిపాల్ కి  చెప్తాడు. ఆమె పోలీసులకి కాల్ చేస్తుంది. అదే ఎస్సై  వచ్చి మళ్ళీ అలాగే హేళనగా నవ్వుతాడు. ఇప్పుడు హీరోకి అర్ధమైపోతుంది. కీలకమంతా ఎస్సై దగ్గరే వుందని... 

       ఇక్కడ హీరో తనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలా చెయ్యి అ లా చెయ్యమని ఎవరూ చెప్పడం లేదు. తన ఆలోచనల ప్రకారమే సాగుతున్నాడు. కథనం చాదస్తంగా లేదు.  ప్రమాద నేపధ్యంలో వుండాల్సినంత చురుగ్గా వుంది. తన కథని తనే నడుపుకుంటున్నాడు హీరో. మొదటి కథనంలో ప్రతీదీ హీరో కాళ్ళ దగ్గరికి తెస్తున్నాడు రచయిత. అలా కథని తను నడిపిస్తున్నాడు.  రెండో కథనంలో ప్రతీ అడుగూ తనే వేస్తూ పోతున్నాడు హీరో. ఇలా పాత్ర-  అది పాల్పడే చర్యల చట్రంలో కథ వుంది. ఇలా పాత్ర పాల్పడే చర్యలు మాత్రమే కథవుతోంది. ఇలాటి యాక్టివ్ పాత్రతో  కథనం చైతన్యవంతంగా వుంటుంది. పాసివ్ పాత్రకి రచయిత చేసే కథనం మృతప్రాయంగా వుంటుంది. దేవుడి మీద భారం వేసి కూర్చునే బాపతు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని విధికొదిలేసి కూర్చునే విషాద కథనం. 

          యాక్టివ్ పాత్రలతో పూర్వం చాలా సినిమాలే వున్నాయి. ఖైదీ, విజేత, గ్యాంగ్ లీడర్, జానకీ రాముడు, బొబ్బిలిరాజా, గణేష్, శివ...లాంటివి. వీటిని పరిశీలిస్తే  ఈ పాత్రలు కథ నడిపే తీరుకి ఏవేవి మూలమవుతున్నాయో స్పష్టంగా, విజువల్ గా  తెలుస్తాయి.

సికిందర్
(ఆంధ్రభూమి వెన్నెల – జులై 25, 2005)

Thursday, April 14, 2022

1157 : రివ్యూ!


 రచన  - దర్శకత్వం : ప్రశాంత్ నీల్
తారాగణం : యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ఈశ్వరీరావు, రావురమేష్, ప్రకాష్ రాజ్, రామచంద్ర రాజు, టిఎస్ నాగాభరణ, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం : రవీ బస్రూర్, ఛాయాగ్రహణం : భువన్ గౌడ
బ్యానర్ : హోంబోలే ఫిలిమ్స్

నిర్మాత : విజయ్ కిరగందూర్
బడ్జెట్ :  100 కోట్లు
విడుదల : ఏప్రెల్ 14, 2022
***
    2018 లో కేజీఎఫ్ : చాప్టర్ -1 సక్సెస్ తర్వాత కేజీఎఫ్ : చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టించింది. నార్త్ లో కేజీఎఫ్ : చాప్టర్ -1 లైఫ్ టైమ్ వసూళ్ళు ఒక్క రోజులోనే  కేజీఎఫ్ : చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చేశాయి. ఇంత సంచలనం సృష్టిస్తున్న కేజీఫ్ తెలుగు రాష్ట్రాల్లో సైతం పెంచిన రేట్లతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ముందుంది. మరో సారి రాకింగ్ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ టీమ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు ఈ కల్ట్ మూవీ సీక్వెల్ తో వచ్చేశారు. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కథ

    చాప్టర్ వన్ గరుడ మరణంతో ముగిశాక, ఇప్పుడు గరుడ వల్ల నరకం అనుభవించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లక్షలాది కార్మికులు గరుడని అంతమొందించిన రాకీ భాయ్ (యశ్) ని తమ దైవంగా కొలుస్తారు. కేజీఎఫ్ కి సుల్తాన్ గా ప్రకటించుకున్న రాకీ, ఇలాటి బంగారు గనులు ఇంకా చాలా వున్నాయని తెలుసుకుని, కార్మికుల కొడుకులతో యువ సైన్యం తయారు చేసుకుని ఆ గనుల మీద దండెత్తుతాడు. అక్కడ జయంట్ కింగ్ ధీర (సంజయ్ దత్) భారీ సైన్యంతో వుంటాడు. అక్కడ అధీరతో తలపడ్డ రాకీ తీవ్రంగా గాయపడి మృత్యుముఖంలోకి పోతాడు. రీనా (శ్రీనిధీ శెట్టి) అతడికి సపర్యలు చేస్తుంది. రాకీ ఇక ఇక్కడుండ కూడదని దుబాయ్ వెళ్ళిపోతాడు, అక్కడ గోల్డ్ స్మగ్లర్ ఇనాయత్ ఖలీల్ (బాలకృష్ణ) ని డబుల్ క్రాస్ చేసి, భారీ ఎత్తున మారణాయుధాలతో తిరిగి వచ్చి  అధీరనీ, అతడి సైన్యాన్నీ చావగొడతాడు. ప్రాణాలతో వున్న ఆధీరని పారిపొమ్మని చెప్పి, అతడి ఇలాకాని కబ్జా చేసుకుంటాడు. దీంతో పూర్తి స్థాయిలో గనుల్ని సొంతం చేసుకున్న రాకీకి ఇంకో ప్రమాదం ఎదురవుతుంది...

        రాకీ ని పట్టుకోవడంలో విఫలమవుతున్న సీబీఐ  చీఫ్ రాఘవన్ (రావు రమేష్) ప్రధాన మంత్రి  రమికా సేన్ (రవీనా టాండన్) ని ఆశ్రయిస్తాడు. దీంతో ప్రధాని రాకీని టార్గెట్ చేస్తుంది. మరోవైపు ఆధీర తిరిగొస్తాడు. ఇక రాకీ ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథ కాదు, గాథ. దీన్ని కథ లాగా చూసి అదిలేదు, ఇది లేదని అనుకోకూడదు. మొదటి భాగం కూడా గాథే. జీవితంలో నువ్వు ధనవంతుడిగానే చనిపోవాలని పేదరికం అనుభవించిన తల్లి చెప్పిన మాట పట్టుకుని హీరో కొనసాగించే ప్రయాణమే ఈ రెండు భాగాల గాథ. ఈ గాథని బిగినింగ్-ఇంటర్వెల్- ఎండ్ గా మొదటి భాగంలో కథనాన్ని విభజించినట్టే, రెండో భాగంలో కూడా విభజించానన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

        రెండు భాగాల గాథని, లేదా కథని దేనికది పూర్తి గాథ లేదా కథ అన్పించేలా విభజించడం కరెక్టు పద్ధతి. పుష్ప లో ఇలా చేయలేదని చెప్పుకున్నాం. పుష్ప మొదటి భాగంలో వున్నది సాంతం బిగినింగ్ విభాగమే. దీంతో ఏమిటో అర్ధంగాని వెలితి ఫీలయ్యారు ప్రేక్షకులు.

        ఎడ్డీ మర్ఫీతో బేవర్లీ హిల్స్ కాప్ సినిమా లుంటాయి. దాని నిర్మాత రచయితలకి ఒకటే మాట చెప్పేవాడు- మీరేం చేస్తారో నాకు తెలీదు, కథనంలో పది నిమిషాలకో సారి మాత్రం బ్యాంగ్ పడాలంతే - అని. అలాగే బుర్ర బద్ధలు చేసుకుని బ్యాంగులు తయారు చేసేవాళ్ళు రచయితలు. అలా ఆ సిరీస్ సినిమాలు హిట్టయ్యాయి.

        ఈ టెక్నిక్ మారుతీ నానితో తీసిన భలే భలే మగాడివోయ్ లో కన్పిస్తుంది. కథలో నాని పాత్రకి కథకి ముఖ్యావసరమైన గోల్ వుండదు. కానీ నాని కథనంలో ఏదో చేసి పది నిమిషాలకోసారి బ్యాంగ్ ఇస్తూ పోతాడు. ఇదే కథని నిలబెట్టింది.

        కేజీఎఫ్ సినిమాలు కూడా ఇంతే. హీరోకి ధనవంతుడయ్యే గోల్ వుంటుంది. ఈ గోల్ కోసం పోరాటం ఒక విలన్ తో వుండదు. ఒకరి తర్వాత ఒకరు విలన్లు మారుతూ వుంటారు. ఈ ఒక హీరో- ఒక గోల్- ఒక విలన్ అనే చట్రంలో గాథ లేని లోపాన్ని కవర్ చేస్తూ, దర్శకుడు చేసిందే పది నిమిషాలకో బ్యాంగ్ అనే టెక్నిక్ ప్రయోగమనుకోవాలి. ఈ బ్యాంగులన్నీ హీరో పాత్ర ఎలివేషన్ గురించే. విరోధులతో హీరో భారీ యాక్షన్ సీన్స్ కి దిగి ఎలివేట్ అవడం, కార్మిక సమూహం జేజేలు పలకడం. ఇలా ఓ వ్యక్తి పూజే ఈ గాథ.

        దీంతో గోల్ కోసం ప్రయాణంలో హీరో ఎలివేషన్స్ పరంపరే ఈ గాథకి కథనమయ్యింది. అయితే గాథ అన్నాక రిపీట్ ఆడియెన్స్ వుండరు. ఒకసారి చూసిన ప్రేక్షకులు మరోసారి రారు. ఒకసారి చూడడమే ఎక్కువ. కథ అయితేనే, అదీ బావుంటేనే, రిపీట్ ఆడియెన్స్ వుంటారు.

నటనలు -సాంకేతికాలు

    రాకింగ్ స్టార్, యశ్ (నవీన్ కుమార్ గౌడ) చాప్టర్ వన్ తో ఆల్రెడీ        గ్లోబల్ కల్ట్ ఫిగర్ అయ్యాడు. నార్త్ లో రికార్డు స్థాయిలో 4400 థియేటర్లలో చాప్టర్ టూ విడుదల చేయడాన్ని బట్టి అర్ధం జేసుకోవచ్చు అతడి పాపులారిటీ స్థాయి. ఇది సీరియస్ గా వుండే డార్క్ క్యారక్టర్. హార్డ్ కోర్ డైలాగులు. రక్తం కళ్ళజూసే క్రూరత్వం. మదర్ వాక్పాలన అనే ఏకసూత్ర కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో అమలుపర్చే సంకల్పం. ఈ క్యారక్టరైజేషన్ ఎక్కడా కుంటు పడకుండా నిర్వహించిన తీరుతో ఉత్తీర్ణుడయ్యాడు. ఒకదాన్ని మించొకటి యాక్షన్ సీన్స్ తన ఫ్యాన్ బేస్ సంతృప్తి పడేలా చేశాడు. నిన్న బీస్ట్ భరించలేక ఏకంగా సినిమాహాల్లో వెండితెరకి విజయ్ ఫ్యాన్స్ నిప్పంటించిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే.  

        ఇక అధీర గా సంజయ్ దత్ క్రూర విలనీ, రూపం, మార్వెల్ మల్టీవర్స్ సినిమాల్లోని విలన్ థెనోస్ ని పోలి వుందని తనే చెప్పుకున్నాడు గనుక, దీన్నే దృష్టిలో పెట్టుకుని నటించినట్టున్నాడు. అయితే వయసు బాగా మీద బడింది.

        మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ కథ చెప్పే పాత్రలో ప్రకాష్ రాజ్, కథ వినే జర్నలిస్టు పాత్రలో మాళవికా అవినాష్ కన్పిస్తారు. ప్రధానమంత్రిగా రవీనా టాండన్ ప్రధాని పాత్ర నటించిన ఇతర నటీమణుల్లాగే ఇందిరాగాంధీనే రిఫరెన్స్ గా పెట్టుకున్నట్టుంది. ఇక హీరోయిన్ గా ముందు హీరోకి యాంటీగా, తర్వాత రోమాంటిగ్గా కనిపించే శ్రీనిధీ శెట్టి ప్రత్యేకాకర్షణ.

        కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంతా దర్శకుడి విజన్లో వొక మాయా జగత్తు. ఔటాఫ్ ది వరల్డ్ కాల్పనిక ప్రపంచం. ఈ విజువల్ సృష్టి, కళాదర్శకత్వం, సెట్స్ నిర్మాణం, దీనికి డార్క్ మూడ్ సినిమాటోగ్రఫీ, అసంఖ్యాక కార్మిక జనులు, క్రూర మానవ మృగాలూ -ఇదంతా మనల్ని ఉన్న లోకాన్ని మరిపించేసి ఫాంటసీ జర్నీలోకి బదలాయించేస్తాయి.

        దీనికి బిజీఎం, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకో యెత్తు. విజువల్ స్ట్రక్చర్  వచ్చేసి మిడ్ షాట్స్, క్లోజప్స్, ఎక్స్ ట్రీమ్ క్లోజప్ షాట్స్ తో నటుల్ని చూపించడంతో అవి కదలకుండా కూర్చోబెట్టేస్తాయి. యాక్షన్ సీన్స్ కి కూడా ఈ విజువల్ స్ట్రక్చరే వుంది. అరుదుగా  లాంగ్ షాట్స్ వుంటాయి.

        అయితే ఫస్టాఫ్ ఒక యాక్షన్ సీన్లో బ్లీచవుట్ షాట్స్ వేసి కళ్ళకిబ్బంది కల్గించడం వుంది. ఇలా ఏనాడో 2002 లో చెన్నకేశవ రెడ్డి లో వేసి మానేసిన విషయం తెలిసిందే. ఐతే వేర్వేరు లొకేషన్స్ లో సీన్స్ ని, కొన్ని చోట్ల టైమ్ అండ్ స్పేస్ ఐక్యతతో రియల్ టైమ్ లో ఎడిట్ చేయడం బావుంది.

చివరికేమిటి
బిగ్ స్క్రీన్ మీద ఈ నాన్ స్టాప్ యాక్షన్ విజువల్ వండర్ చూస్తూ పోవాలంతే, లాజిక్ చూడకూడదు. మొదట అధీర రాకీని చంపకుండా ఎందుకు వదిలాడు, తర్వాత రాకీ కూడా అధీర ని చంపకుండా ఎందుకు వదిలాడు-లాంటి ప్రశ్నలు వస్తే సహించాలి.  కొన్ని చోట్ల ఏ సీను ఎందుకొస్తోందో కన్ఫ్యూజన్ గా వున్నా, హీరో ఎలివేషన్స్ చూడాలంతే. ఎలివేషన్ తర్వాత ఎలివేషన్ గా యాక్షన్ సీన్స్ వస్తూ, లాజిక్ ఎలిమినేట్ అవుతూంటే హీరో జర్నీ చూడాలంతే.

        ఒక విలన్ చుట్టూ గాథ కాకుండా, గోల్ కోసం హీరో జర్నీ కావడంతో సినిమాటిక్ లిబర్టీని అంగీకరించాలి.  ఇలా ఎంత వరకని హీరో ఎలివేట్ అవగలడు. చాప్టర్ వన్ లోనే ఎలివేషన్ల పరంపరతో ఏం చేసినా ఒప్పించ గల  స్టార్ డమ్ వచ్చేయడంతో, ఇప్పుడు సెకండ్ చాప్టర్లో గన్ పట్టుకుని పార్లమెంటు లోకెళ్ళి పోయి కాల్చి పారెయ్య గడు. గన్ తోనే  ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుని, తన శిలాశాసనం చెప్పేయగలడు.

        అతన్ని అంతమొందించడానికి ఏకంగా ప్రధాని త్రివిధ దళాల్ని ఆదేశించకపోతే ఎలివేషన్ ఏముంటుంది. అతను ఏకంగా గోల్డు రాశులతో షిప్ లో పారిపోకపోతే ఎలివేషనేం వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నప్పుడు డబ్బు మూటగట్టుకుని పారిపోయిన ప్రధాని విజువల్స్ ని చూశామా? ఇప్పుడు హీరో అలా పారిపోతూంటే చూడొచ్చు. యూక్రేన్ మీద రష్యా వైమానిక దాడుల్ని బిగ్ స్క్రీన్ మీద చూశామా? ఇప్పుడు హీరో స్థావరాల మీద వైమానిక దాడుల్ని చూడొచ్చు. హీరో ఎలివేషన్, ఎలివేషన్, ఎలివేషన్, ఇంతే. ఇంకేమీ అడక్కూడదు.

        కొసమెరుపు :  ఇందులో ఒక ముస్లిం మదర్ క్యారక్టర్, ఆమె కొడుకు క్యారక్టర్ క్రియేట్ చేసి చాలా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. కొడుకు హీరో సైన్యంలో వుంటాడు. హీరోకోసం ఏం చేయాలో చేసి ప్రాణాలర్పిస్తాడు. అయినా మదర్ ఓర్చుకుని, హీరో గెలుపు కోసం ఆశీర్వదించి, ప్రోత్సహించి, అతడితోటే వుండడం చేస్తుంది. పాత్రకి ముగింపు కూడా ఎమోషనల్ గా వుంటుంది. ఐతే ప్రస్తుతం కర్నాటకలో నెలకొన్న మత ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఈ కన్నడ సినిమా దృశ్యాలు వుండనిస్తారా?

—సికిందర్