కథ : కుటుంబం, మతం, అధికారం, చమురు - నాల్గూ వాళ్ళిద్దరి జీవితాల్లో
పోషించిన నిర్ణాయక పాత్రని చిత్రించే మహోజ్వల ‘గాథ’. పైచేయి కోసం ఆయిల్ మోతుబరి డానీ, చర్చి పాస్టర్ ఇలై ల
మధ్య మానవత్వానికి చోటు లేని ఘర్షణ. స్వార్ధపు విష కౌగిట్లో డానీ దుష్టత్వం, దైవ చింతనని తుంగలో తొక్కిన ఇలై దౌర్జన్యం. ధనార్జన లక్ష్యాన్ని న్యాయ
సమ్మతంగా చూడలేని ఇద్దరు ఆస్తిక నాస్తిక దురదృష్టవంతుల అధోగతి యానం. చమురుతో ధనార్జనే
ఏకైక లక్ష్యంగా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన డానీ, వ్యాపార
విస్తరణకి ఆ పట్టణాని కేగినపుడు, అక్కడి మత ప్రచారకుడు ఇలై దురాశతో
తలపడే అధ్యాయంలో, ప్రతీ మానవ విలువ,
ప్రేమ, సమాజ మర్యాద ధ్వంసమైన క్రమం. వ్యాపారం, మతం ఇలా వుండకూడదన్న సందేశం. ప్రపంచాన్నినడిపే భవిష్యత్ ఇంధనం చమురు
అయినప్పుడు అది రక్తం కంటే విలువైనదని నమ్మిన డానీ, ఈ రక్తం
ముందు దేవుడు లేడు, పాపం లేదని ప్రకటించే స్థితికి దిగజారిన ఇలై
- ఇద్దరూ మానవ లోకం నుంచి వెలివేతకి అర్హులైన ఖల నాయకులే! 1927 అప్టన్ సింక్లేర్
నవల ‘ఆయిల్!’ కి చిత్రానువాదం....
కథా నిర్మాణం, బిగినింగ్
: 1898 లో న్యూ మెక్సికో. దూరాన మూడు కొండలు కనపడుతూంటాయి. ఆవిరి ఇంజన్ల చరిత్ర చరమ దశ కొస్తున్న కాలం. చమురు భవిష్యత్ ఇంధనం కాబోతోంది. ధనార్జనకి వెండి, బంగారం అన్వేషణల్లో ఎదుర్కొనే కష్టనష్టాలు ఇక లాభసాటి కావన్న భావం బలపడుతున్న సమయం. ధనవంతులు కావాలని యువత సాగించే ప్రయత్నాలు కొత్త మలుపు తీసుకుంటున్న వేళ. ఇలాటి యువకుల్లో ఒకడు డానీ. ఇంకా వెండి అన్వేషణలో వుంటాడు. వెండి కోసం బావి తవ్వుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. దొరికిన వెండి ముక్క గుప్పెట పట్టుకుని, విరిగిన కాలితో పాక్కుంటూ పోతాడు. దూరాన అవే మూడు కొండలు కనపడుతూంటాయి. దూరపు కొండలు నునుపనీ, ఈ మార్గాన ధనార్జన అంత లాభసాటి కాదనీ.
కాలిఫోర్నియా 1902. చమురు బావి తవ్వుతాడు డానీ. చిన్నపాటి ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తాడు. ఒక రోజు చమురు పడుతుంది. డానీ మొహం ఆనందంతో నిండిపోతుంది. చమురు పడిన ఈ శుభసందర్భంలో, పనివాళ్లలో ఒకడి ఏడాది కొడుకు ఏడ్వడం మొదలెడతాడు. పనివాడు
వాడి మొహానికి చమురు పూస్తాడు. తర్వాత చమురు తోడుతూంటే, యంత్రం విరిగిపడి పని వాడు చనిపోతాడు. విధిలేక అనాధగా మారిన ఆ పనివాడి కొడుకుని పెంచుకుంటాడు డానీ. హెచ్ డబ్ల్యీవ్ అని పేరు పెడతాడు. వాడికి పాలు పట్టి
లాలించే బదులు, పాలలో మద్యం కలిపి నిద్రపుచ్చేసి
వదిలించుకుంటాడు.
కాలచక్రం తిరిగిపోతుంది. డానీ కంపెనీ విస్తరణకి ప్రజల సహకారం కోరుతూ
సమావేశాలు నిర్వహిస్తూంటాడు. తమ చమురు భూముల్ని అమ్మాలన్నా,
లీజుకివ్వాలన్నా ప్రజలు వెనుకాడుతారు. కుటుంబం లేని తను విశ్వసనీయత కోసం పదేళ్ళ హెచ్ డబ్ల్యీవ్ ని కొడుకుగా చూపించుకుంటాడు. వ్యాపారానికి
కొడుకుని సెంటిమెంటల్ గా వాడుకుంటాడు. సరేలే గానీ,
మీ ఆవిడ ఏదని ఒకావిడ అడిగితే, వీణ్ణి కని, పురిట్లోనే పోయిందని అబద్ధం చెప్తాడు. డబ్బేతప్ప కుటుంబం గురించి అతడాలోచించ లేదు.
ఈ సమావేశాలు
విఫలమవుతున్నాక, ఒక రోజు పాల్ సండే అనే అతను డానీని
కలుస్తాడు. కలిసి, లిటిల్ బోస్టన్ లో వున్న తమ కుటుంబ
భూముల్ని అమ్మకానికి పెడతాడు. చమురు నిల్వలున్నాయనీ, వచ్చి
చూసుకోమనీ ఆహ్వానిస్తాడు.
***
వివరణ : ఈ బిగినింగ్ విభాగం 25 నిమిషాలు వస్తుంది. పాల్
సండే వచ్చి డానీకి భూముల్ని ఆఫర్ చేసే ఈ చివరి దృశ్యం ప్లాట్ పాయింట్ వన్ (పిపి
-1). ఇక్కడ పిపి -1 లో ఏముంది, కాన్ఫ్లిక్ట్
లేకుండా పిపి -1 ఎలా అవుతుందని కేకలు వేయనవసరం లేదు. ‘గాథ’ కి ఆకలి కేకలు వేయకూడదు. ‘పెదరాయుడు’ చూసి సూపర్ హిట్ చేసినప్పుడు కేకలేయ లేదుగా. ఉదాత్త పాత్రలతో ‘పెదరాయుడు’ లాంటి ఉదాత్త కథ చెప్పినప్పుడది గాథవుతుంది.
గాథల్లో ప్రధాన పాత్ర విలువల కోసం త్యాగం చేసే ఉదాత్త పాత్రగా వుంటుంది, లేదా విలువల్ని తుంగలో తొక్కుతూ పతనమయ్యే దుష్ట పాత్రగా వుంటుంది. గాథలు
రెండే పాయింట్స్ చుట్టూ వుంటాయి : విలువలతో మంచి తనం, లేదా విలువలతో
చెడు తనం. మంచి తనంతో ఉదాత్త పాత్ర,
చెడుతనంతో దురాత్మ పాత్ర. మొదటి దానితో త్యాగం, రెండో దానితో
పతనం. హీరోకి విజయమనే అలవాటయిన రొటీన్ ముగింపులు ఇక్కడ మర్చిపోవాలి. జీవితాలన్నీ
విజయాలతోనే ముగియవు. సినిమాలన్నీ విజయ ఢంకా మోగించవు.
‘పెదరాయుడు’ లో రజనీకాంత్, మోహన్ బాబుల ప్రధాన పాత్రలు మాట కోసం ప్రాణ త్యాగం చేసే పాత్రలు. ఈ
త్యాగాన్ని నిలబెట్టడం కోసం ఉపయోగపడేది కుట్ర చేసే ప్రతి నాయక పాత్ర. అందువల్ల
త్యాగం చేసే ఉదాత్త పాత్రకి గాథలో లక్ష్యం వుండదు. లక్ష్యముండదు కాబట్టి, తనవైపు నుంచి కాన్ఫ్లిక్ట్ వుండదు. ఈ ఉదాత్త
పాత్ర ఒక మాటనో, చేతనో నెగెటివ్ గా తీసుకున్న ప్రతినాయక
పాత్రకే లక్ష్యం వుంటుంది. దీంతో ఉదాత్త పాత్రని దెబ్బతీస్తుంది. ఇదే ‘పెదరాయుడు’ గాథ. మనమొక మంచి మాట చెప్తాం. ఇది నచ్చని
అతను వెనుక నుంచి వచ్చి కత్తి పోటు పొడిస్తే మనమేం చేస్తాం. ఉదాత్త పాత్రకి మంచి
తనం ఒక లక్ష్యం కాదు, దాని జీవితంలోనే మంచితనం ఆల్రెడీ ఒక
భాగం. ఏదైనా లోపించినప్పుడే అది సాధించాలన్న లక్ష్యం ఏర్పడుతుంది. ప్రతినాయకుడికి
తన చెడుతనం దెబ్బ తింటోందని అనిపిస్తుంది గనుకే, మంచి
తనాన్ని చంపాలన్న లక్ష్యం ఏర్పడుతుంది. కాబట్టి సరైన మహోజ్వల గాథల్ని చూసినప్పుడు ఫార్ములా
పొలికేక లేయకూడదు, జీవితపు ఏడ్పులు ఏడవాలి.
గాథల్లో
ప్రధాన పాత్ర యాక్టివ్ పాత్రగా వుండదు,
ప్రత్యర్ధి పాత్రే అసమంజస కోర్కెలతో యాక్టివ్ గా వుంటుంది- వుంటేనే ప్రధాన పాత్ర
నైతిక బలం తేలుతుంది. రామాయణం ఒక గాథనుకుంటే, ‘రామాయణం’ లో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో
దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే
పాసివ్ పాత్రలకి ఉనికే లేదు, ట్రాజడీల్లేవు, వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు.
ఇప్పుడు పై
కథ పిపి -1 లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడలేదంటే ఇదే కారణం. గాథ కావడం. అయితే డానీతో ఇది
ఉదాత్త పాత్ర గాథా, లేక దురాత్మ పాత్ర గాథా అన్న సందేహం ఈ
బిగినింగ్ విభాగంలో తలెత్తే ఆస్కారమే లేదు. పాజిటివ్ పాత్రగానే కన్పిస్తున్నాడు.
ఇలాగే కన్పించాలి. ఇప్పుడే నెగెటివ్ క్యారక్టర్ గా చూపించేస్తే పాత్ర పరంగా
సస్పెన్స్ ఏముంటుంది, గుప్పెట్లో కథ బయటపెట్టేస్తే
ఇంకేముంటుంది. పైగా కథనంలో డైనమిక్స్ ఏముంటాయి.
అంటే ఈ పిపి -1 తర్వాత, రాబోయే మిడిల్-1 కథనంలో ఇప్పుడు పాజిటివ్ గా కన్పిస్తున్న డానీకి ఎవరో ప్రత్యర్ధి
పాత్ర ఎదురు కావచ్చన్న మాట. అందుకని పిపి- 1 లోనే కాన్ఫ్లిక్ట్ ఏర్పడాల్సిన అవసరం
లేదు. కాన్ఫ్లిక్ట్ ఏర్పడ్డానికి తగిన తయారీ జరిగితే చాలు. ఈ తయారీ స్థల మార్పు
కావచ్చు. అంటే బిగినింగ్ విభాగపు నేపథ్యం లోంచి ఇంకో కొత్త నేపథ్యం లోకి స్థల
మార్పు. మొనాటనీగా అన్పిస్తున్న కథనానికి రీఫ్రెష్ బటన్ నొక్కినట్టు. పాత్రకి బిగినింగ్
విభాగంలోంచి స్థాన చలనం జరిగిందంటే, పిపి-1 వచ్చినట్టే. ఇలా
ఇక్కడ డానీ భూములు కొనడానికి లిటిల్ బోస్టన్ కి ప్రయాణం స్థాన చలనమూ, స్థల మార్పులతో కూడిన పిపి-1 అయింది.
***
ఈ బిగినింగ్
విభాగం సీనిక్ ఆర్డర్ చూద్దాం. 25 నిమిషాల ఈ కథనంలో అయిదే సీన్లుంటాయి. పాతిక నిమిషాల
కథనానికి అయిదే సీన్లా అని మళ్ళీ గుండెలు బాదుకో నవసరం లేదు. ఇలా దర్శకుడో, కథకుడో వచ్చి చెప్తే
పకపకా నవ్వుకుని, పోరాబై అననవసరం లేదు. కథకి రాసేసినట్టు ఐదు
పక్కన సున్నా చేర్చి, 50 సీన్లూ తనివిదీరా పక్కాగా రాసుకుని, తృప్తిగా నిద్రపోతే గాథయి పోదు. కథలదేముంది, ఎలా
తీసినా ఛోటా భాయీల నుంచీ బిగ్ స్టార్స్ వరకూ శుభ్రంగా నటించుకో వచ్చు. గాథలు బిగ్
స్టార్స్ కి సూటవుతాయి. బిగ్ స్టార్ పాత్రని కాక, పాత్రలోని
మనిషిని డిమాండ్ చేస్తాయి గాథలు. స్ట్రక్చర్ ఒకటే. త్రీ యాక్ట్ స్ట్రక్చరే. ఆ
స్ట్రల్చర్ లోపల గాథల కూర్పు వేరు, క్రియేటివిటీ వేరు, ఫ్లో వేరు, జానర్ మర్యాదలు వేరు.
పాత
దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, ‘మూవ్ మెంట్’ అన్న విభాగంలో ఇలాగంటాడు- ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం
దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ
స్థానం వహించాలి. అప్పుడే అతను ప్రేక్షకుల్ని చాలా ఈజ్ తో సినిమా చూసేట్టు
చేసేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సుబోధకం చేయగలడు. అంతే కాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి ఇట్టే తీసికెళ్ళి
కట్టిపడెయ్యనూ గలడు- ‘ అని.
‘పెదరాయుడు’ లో రవిరాజా పినిశెట్టి దిగ్విజయంగా సాధించిందిదే : స్లో మూవ్ మెంట్స్ తో, కథా నడకలో ఒక లయని స్థాపించి, కథాత్మ (సోల్) ని పోషించడం!
అందుకని
ఐదే సీన్లు. సనల్ శశిధరన్ అనే మలయాళ దర్శకుడు 2015 లో ఒకటి చెప్పాడు : మెయిన్ స్ట్రీమ్
సినిమాలకీ, ఇతర సినిమాలకీ మధ్య విభజన
రేఖ చెరిగిపోయే కాలం రానే వస్తుందని. ఆ కాలం ఇప్పుడొచ్చేసింది. ఇప్పుడు ఓటీటీ
సినిమాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. ఓటీటీలో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న విభిన్న
ప్రయోగాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. దీన్ని థియేటర్ విండో సినిమాలు ఒప్పుకుని
మారాల్సిన సమయం వచ్చేసింది...ఇక అల్లుడు అదుర్స్, రెడ్, బంగారు బుల్లోడు, జాంబీ రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, 3 రోజుల్లో సరీగ్గా తన్నుకు
చావడమెలా - లాంటి ఆమ్ల వర్షాలు కురిపించే చిలుము పట్టిన రీసైక్లింగ్ మిల్లుని మూసెయ్యాలి.
2021 ఋతువు మారి,
క్రతువు మార్చుకో మంటోంది.
***
పాతిక
నిమిషాల బిగినింగ్ విభాగంలో డానీ మీద ఐదు సీన్లు. మొదటి సీను వెండి కోసం బావిలో
ప్రయత్నం, రెండో సీను దొరికిన వెండికి సర్టిఫికేట్
పొందడం, మూడో సీను ఆయిల్ డ్రిల్లింగ్ ఏర్పాటు చేసుకోవడం, నాల్గో సీను భూముల కోసం ప్రజలతో సమావేశం, ఐదో సీను
పాల్ సండే భూములు అమ్ముతామని రావడం.
రెండో సీను తప్ప
మిగిలినవి దీర్ఘంగానే వుంటాయి. నాల్గో సీను వరకూ 15 నిమిషాలు డైలాగులే వుండవు-
ఒక్క వెండి బావిలో గాయపడినప్పుడు ‘నో’ అనడం తప్ప,
వెండి దొరకగానే ‘దొరికింది...దొరికింది...’ అనుకోవడం తప్ప. ఈ 15 నిమిషాలూ క్యారక్టర్ గురించి ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేసే
క్రమం నిదానంగా సాగుతుంది. ప్రేక్షకుల్ని తదేక ధ్యానంలోకి తీసికెళ్లి పోతుంది. దీనికి
ఒకే ఎడతెగని బాణీలో బిజీఎమ్ హార్రర్ సినిమాల్లో లాగా మిస్టీరియస్
అనుభవాన్నిస్తుంది. క్యారక్టర్ అంత మిస్టీరియస్ గా వుందని చెప్పడానికి. సినిమా
ఎత్తుగడలోనే ఇంట్రెస్టు పెంచడానికి.
సినిమా
మార్కెట్ యాస్పెక్ట్ కి ఒక ముఖ్య సూత్ర్ర మేమిటంటే, ఫస్ట్ డే
ఫస్ట్ షో ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ స్క్రిప్టులో సమ్ థింగ్ క్రేజీ థాట్ కి
పాల్పడ్డం. దాంతో ఆ థాట్ తో థ్రిల్లయిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుల్ని, మిగతా షోలకి మౌత్ టాక్ తో ప్రచారకులుగా మార్చెయ్యడం. సింపుల్ గా
చెప్పాలంటే మొదటి షోకే సినిమాని వైరల్ చేయడం.
డానీ క్యారక్టర్
ని అతడి చర్యల ద్వారానే బయట పెట్టారు. యాక్షన్ స్పీక్స్ క్యారక్టర్ అన్నమాట.
ఒంటరిగా వెండి బావితీసి ఒక్కడే ఒంటరిగా పని చేయడంలో అతడి సంకుచిత మనస్తత్వం
తెలుస్తుంది. ఇతరులతో సంబంధం లేకుండా తన కృషి తానే చేసుకుని, తన సంపాదన తానే సంపాదించుకుని, తానే
అనుభవించాలన్న మనస్తత్వం. కృషిని ఎంత సాహసించి, ఎంత ఓపికగా, ఎంత పట్టుదలగా, ఎంత నైపుణ్యంగా, నిశ్శబ్దంగా చేస్తాడో వెండి తీసే చర్యల్లోనే కన్పిస్తుంది. బావిలోంచి
బయటి కొచ్చి, చలిమంట వేసిన చోట మూత్రం పోస్తాడు. తానే ఒక మంట, ఇంకో మంట ఎదురుగా వుండకూడదన్న భావం. ఈ మంట సీను రాబోయే మంటలాంటి ఇలై
పాత్రతో ఫోర్ షాడోయింగ్ సీను. ప్రత్యర్ధి ఇలైని ఆర్పేస్తాడన్నమాట డానీ. ప్రతీ
చర్యకీ, ప్రతీ షాటుకీ కథతో, పాత్రతో
సంబంధముంది. మన స్టార్ అయితే ఇవన్నీ కామెడీ కోసం చేసి పోతాడు, అంతకంటే క్రియేటివ్ ఆర్ట్ తో ఏం చేయాలో అర్ధంగాక. పనైపోయాక డానీ తన ఖాళీ
సమయాన్ని తనే ఎంజాయ్ చేస్తాడు. పిల్లవాడ్ని వ్యాపారంలో సెంటి మెంటల్ గా
వాడుకుంటున్న డానీ, ఆ పిల్లాడితో ఎంత సెంటిమెంటల్ గా వుంటున్నాడో
పాలల్లో మద్యం కలిపి తాగించినప్పుడే బయట పడింది.
***
తర్వాత తప్పనిసరై కొందరు పనివాళ్లని
పెట్టుకుని ఆయిల్ డ్రిల్లింగ్ ప్రారంభించినప్పుడు, వాళ్ళతో అస్సలు మాట్లాడడు. మనుషులంటే పడదు
కాబట్టి. బావిలో ఆయిల్ పడ్డాక, పిల్లవాడి ఏడ్పు ఒక్కటే మానవ
స్వరం. ఆయిల్ పడగానే పిల్లవాడు ఏడ్చినట్టు చూపడం
రెండర్ధాల్ని సూచిస్తుంది : ఇంకాసేపట్లో అదే బావిలో తండ్రి మరణానికి హెచ్చరికా, ఆ పడ్డ ఆయిల్ తో ఒక కొత్త రక్త చరిత్ర మొదలవబోతున్న సంకేతం. పిల్లవాడి
నుదుట తండ్రి ఆయిల్ పూసినప్పుడు, ఆయిలూ క్యాపిటలిజమూ
కలగలిసిన కొత్త మతంలోకి పిల్లవాడి ఆగమన సందేశం కావొచ్చు. అయితే ఈ నుదుట ఆయిల్ పూత తలరాతలా
వాడి జీవితమంతా వెంటాడుతుంది... యాక్షన్ స్పీక్స్ స్టోరీ. యాక్షన్ స్పీక్స్ లౌడర్
దేన్ వర్డ్స్. పిల్లవాడి నుదుట చమురు పూయడమనే చర్యే కథ చెప్తోంది. అసలు డానీ
వంశంలో రక్తం ప్రవహిస్తే, రక్త సంబంధాలుంటే, ఆయిలుని రక్తంగా మార్చేసే వాడు కాదేమో.
పాతిక నిమిషాలూ వృధా కాకుండా నాల్గైదు
సీన్లలో ఇంత కథవుంటే,
ఇంత పాత్ర వుంటే, ఇంకెక్కడికి పోతారు ప్రేక్షకులు? ఈ పాత్ర నటించిన బ్రిటిష్ నటుడు డానియేల్ డే లెవిస్ కి, 2007 ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు లభించింది.
ఈ బిగినింగ్ విభాగంలో వుండాల్సిన బిజినెస్
వుంది. 1. ఆయిల్ ఉత్పత్తితో కథా నేపథ్యపు
ఏర్పాటు,
2. డానీ, పిల్లవాడు, పాల్ సండే కీలక
పాత్రల పరిచయాలు, 3. విఫల సమావేశాలతో సమస్యకి దారితీసే
పరిస్థితుల కల్పన, 4. భూముల ఆఫర్ తో పాల్ సండే రాకతో సమస్య
ఏర్పాటు.
ఆసక్తి పరులు తమ క్రియేటివ్ అప్డేట్స్
కోసం ముందుగా ఈ బిగినింగ్ విభాగాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసుకుంటే, ఆ తర్వాత మిడిల్-1
కెళ్దాం. సినిమా నెట్ ఫ్లిక్స్ లో వుంది.
―సికిందర్