రచన - దర్శకత్వం : ఉదయ్ గుర్రాల
తారాగణం : ప్రియదర్శి, హర్షిత్ మల్గి రెడ్డి, గౌరీ ప్రియా
రెడ్డి, అనూషా,రవీందర్ బొమ్మకంటి తదితరులు
సంగీతం : స్వీకార్ ఆగస్తీ, ఛాయాగ్రహణం : ఉదయ్
గుర్రాల, శ్యామ్ దూపాటి నిర్మాతలు : ప్రియాంకా దత్, స్వప్నా దత్
విడుదల : ఆహా
***
తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ మోజు తగ్గి వెబ్
సిరీస్ సీజన్ ప్రారంభమై కూడా చాలా కాలమైంది. ఈ వెబ్ సిరీస్ కూడా సినిమాల్లాగే రోమాంటిక్
కామెడీల మయమై యూత్ ప్రేక్షకులతో సరిపెట్టుకున్నాయి.
థియేటర్లలో సినిమాకొక కొత్త జంటగా రోమాంటిక్ కామెడీల బెడద వదిలిందనుకుంటే వెబ్
లో మొదలయ్యాయి. వేదిక మార్చుకున్నాయే తప్ప విషయం అదే. వెబ్ లో కూడా ఇవి వెలవెల
బోతున్న వేళ కోవిడ్ మొదలయ్యింది. కోవిడ్ తో ఓటీటీ ముఖ చిత్రమే మారిపోయింది. కోవిడ్ కాలంలో ఓ 15
కొత్త ఓటీటీ కంపెనీలు వివిధ భాషల్లో వెలిశాయి దేశవ్యాప్తంగా. ఇంకొన్ని ప్లానింగ్
లో వున్నాయి. ఇవి ముందుకు తెచ్చిన కాన్సెప్ట్ ఏమిటంటే, లోకల్ కథలు చెప్పడం.
కారణం, కోవిడ్ తో ఇంట్లో బందీలైన పెద్దవాళ్ళు, స్త్రీలు ఓటీటీకి కొత్త ప్రేక్షక వర్గమయ్యారు. దీంతో ఈ వర్గాన్ని టాప్ చేసేందుకు, స్థానిక జీవితాల సహజ కథలు అందించడం మొదలెట్టాయి ఓటీటీలు. అత్తాకోడళ్ళ
టీవీ సీరియల్స్ చూసి చూసి వేసారిన స్త్రీలు, ముఖ్యంగా పట్టణ, గ్రామీణ స్త్రీలు, వెబ్ సిరీస్ లో దగ్గరగా తమ
జీవితాల్ని చూసుకోవడం మొదలెట్టారు. అటు థియేటర్లలో చూడదగ్గ సినిమాలు లేక, ఇటు
ఇంట్లో టీవీ భరించలేక ఉక్కపోతకి గురైన పెద్దవాళ్ళకి కూడా లోకల్ ఓటీటీలు వరంలా కన్పిస్తున్నాయి.
స్థానిక భాష, సంస్కృతి, వారసత్వం, జీవితాలు, కమర్షియల్ సినిమాల కృత్రిమత్వాలకి దూరంగా
సహజ కథలు, ప్రాంతీయ ఓటీటీల కాన్సెప్ట్ అయింది. బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, తుళు, కొంకణి, కన్నడ, మలయాళం ...ఇలా ప్రాంతీయ భాషల్లో వెబ్ సిరీస్
ఇప్పుడు కొత్త మార్కెట్ ని పట్టుకున్నాయి.
ఒక సర్వే ప్రకారం ఓటీటీ ప్రేక్షకులు నగరాల్లోనే
కాదు గ్రామాల్లో కూడా పెరుగుతున్నారు. కోవిడ్ తో దాదాపు 90 శాతం గ్రామాలకి ఇంటర్నెట్ విస్తరించడం వల్ల ఓటీటీ చొచ్చుకెళ్లింది.
మల్టీ లాంగ్వేజ్ ఓటీటీల కంటే, పోటీ తక్కువ వుండే ఈ సింగిల్ లాంగ్వేజ్ ఓటీటీల నిర్వహణ, వ్యాపారం లాభసాటిగా వుంటోంది. ఇప్పటికే 50 కోట్ల యూజర్లతో అమెరికా తర్వాత
ఇండియా పెద్ద మార్కెట్ గా వుంది. 2023 కల్లా ఇంకో 45 శాతం పెరిగి, 13 వేల కోట్ల రూపాయల భారీ మార్కెట్ గా విస్తరించే అవకాశముంది. మల్టీ లాంగ్వేజ్ ఓటీటీల్లో
క్వాలిటీ కంటెంట్ కి అలవాటుపడ్డ ప్రేక్షకులు, సింగిల్ లాంగ్వేజీ ఓటీటీల్లో
కూడా క్వాలిటీ కంటెంట్ కే ఓటు వేస్తున్నారనేది ఇక్కడ పాయింటు. కాబట్టి సంక్రాంతి
సినిమాలు సహా 90% అట్టర్ ఫ్లాపయ్యే అడ్డగోలు సినిమాలు తీస్తున్నట్టు గాక, ఓటీటీ కంటెంట్ ని బాగా కష్టపడి, నిజాయితీగా తీయాలన్న మాట.
ఈ నేపథ్యంలో తెలుగుకే పరిమితమైన సింగిల్ లాంగ్వేజ్
ఓటీటీ ‘ఆహా’
నుంచి గ్రామీణ వెబ్ సిరీస్ ‘కంబాల పల్లి కథలు’ వెలువడింది. మొదటి చాప్టర్ గా ‘మెయిల్’ విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. దర్శకుడు ఉదయ్ గుర్రాల. మరి దీని
కథేంటి, ఇదెంత క్వాలిటీతో వుందీ చూద్దాం...
కథ
తెలంగాణా మహబూబాబాద్ దగ్గర్లో నిద్రాణంగా వుండే కంబాల పల్లి గ్రామం, నిదానంగా సాగే కాలం, జీవితాలు 2005 లో. అప్పటికింకా కంప్యూటర్లు కొత్త. రవి (హర్షిత్ మల్గిరెడ్డి) అనే విద్యార్థి ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆన్ లైన్లో ఫలితాలు ప్రకటిస్తుంది ప్రభుత్వం. రవి ఆ కేంద్రాని కెళ్ళి రిజల్ట్స్ చూసుకుంటున్నప్పుడు, మొట్ట మొదటి సారిగా కంప్యూటర్ ని చూస్తాడు. కంప్యూటర్ సహా ఆ కేంద్రం మాయా ప్రపంచంలా కన్పిస్తుంది. థర్డ్ క్లాసులో పాసయిన అతను ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి పోవాలనుకుంటాడు. బీకాంలో చేరాల్సి వస్తుంది.
గ్రామంలో హైబత్ (ప్రియదర్శి) అనే అతను, ఫోటో
స్టూడియో బోర్డు తీసేసి, కంప్యూటర్ గేమింగ్ సెంటర్
ప్రారంభిస్తాడు. ఇతను ఫోటో స్టూడియో నడుపుకుంటూంటే, పని
నేర్చు కుంటామని ఇద్దరు చేరి, పదిహేను రోజుల్లో అటొకడు, ఇటొకడు ఫోటో స్టూడియోలు తెరిచేసి మధ్యలో తనని ముంచేశారు. దీంతో కంప్యూటర్
గేమింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని రవి చూసి ఉద్రేక పడతాడు. కంప్యూటర్
నేర్చుకుంటానంటే, వీడెక్కడ ముంచుతాడోనని హైబత్ ఎలర్ట్
అవుతాడు. వదలకుండా సతాయిస్తూంటే కొన్ని షరతులు పెట్టి నేర్పుతాడు. ఈమెయిల్
ఎక్కౌంట్ క్రియేట్ చేసి, ఈమెయిల్ సౌకర్యం గురించి చెప్తాడు. దీంతో
తనకి మెయిల్ వచ్చిందేమోనని రవి రోజూ చూస్తూంటాడు. ఒక రోజు రెండు కోట్లు లాటరీ
తగిలినట్టు వస్తుంది. భయపడి వెళ్ళి ఫ్రెండ్ సుబ్బు (మణి) కి చెప్తాడు. సుబ్బు ధైర్యం
చెప్పి, ఏంచేయాలో చెప్తాడు. ఆ ప్రకారం అడ్రసు పంపి ఎదురు
చూస్తూంటే, లక్ష కట్టాలని మెయిల్ వస్తుంది. ఇప్పుడు రవి ఏం
చేశాడన్నది, ఎలాటి చిక్కుల్లో పడ్డాడన్నది మిగతా కథ.
నటీనటులు - సాంకేతికాలు
ప్రియదర్శి తప్ప అందరూ కొత్తవాళ్లే. ప్రియదర్శి సహాయ పాత్ర వేశాడు. సీరియస్ గా వుంటూ నవ్వు తెప్పించే పాత్ర. తక్కువ మాటలు. సీన్లు కూడా తక్కువే. కంప్యూటర్ తెలిసిన వాడుగా హీరోలా ఫోజు కొట్టకుండా గ్రామీణ అమాయకత్వంతో కూడా వుంటాడు. కంప్యూటర్ వైరస్ అంటే అదేదో మనుషుల ద్వారా సోకే వైరస్ అనుకునే రకం. చెప్పులు బయట విడిచి రావాలని రూలు. ఆ రోజుల్లో నగరాల్లో కూడా కంప్యూటర్ రూములోకి చెప్పులు బయట విడిచే వాళ్ళు ఎడ్యుకేటెడ్ బ్యాచి. ఇలా ప్రియదర్శి గేమింగ్ కి వచ్చిన ఒక కుర్రాడి వల్ల కంప్యూటర్ కి వైరస్ సోకిందని పంచాయితీ పెట్టించి జరిమానా వేయిస్తాడు. వైరస్ ని తీయించడానికి ఒక బైరాగిలా వుండే ‘టెక్నీషియన్’ ని పిలిపిస్తాడు. వాడు అటుచూసి ఇటు చూసి ఒక నొక్కు నొక్కితే వైరస్ పోతుంది. 500 వసూలు చేసుకుంటాడు. ఈ ‘టెక్నీషియన్’ ఎక్స్ ప్రెషన్స్ తో బాగా గుర్తుండి పోతాడు. ప్రియదర్శిది ఇలాటి అమాయకత్వం. పాత్ర గుర్తుండిపోయే విధంగా నిలబెట్టాడు.
రవిగా నటించిన హర్షిత్ ఆ లేత వయస్సుకి
తగ్గట్టుగా మాటలు పలకడంలో గానీ, సున్నిత భావాలు ముఖంలో
పలికించడంలో గానీ, కంప్యూటర్ తో అమాయకత్వంలో గానీ, లాటరీతో భావోద్వేగాలతో గానీ, నిద్రణంగా వుండే
గ్రామంలో ఒదిగిపోతున్నట్టే నిదానంగా వుంటాడు.
పాత్రని ఇతను కూడా నిలబెట్టాడు. అలాగే ఇతడి స్నేహితుడు సుబ్బు పాత్ర వేసిన మణి
గురించి కూడా చెప్పుకోవాలి. ఇక రవి ప్రేమించే స్టూడెంట్ రోజాగా గౌరీ ప్రియా రెడ్డి, ఇంకో అమ్మాయి గిరిజ పాత్రలో అనూషా తెలంగాణా అమ్మాయిల వాలకంతోనే వుంటారు.
అప్పులిచ్చే శివన్నగా రవీందర్ బొమ్మకంటి ఇంకో ఎస్సెట్ నటవర్గానికి. వీళ్లే గాక
ప్రతీ వొక్కరూ, చుట్టూ కొండలూ పచ్చటి ప్రకృతీ వుండే కంబాల
పల్లి నేపథ్య వాతావరణంలో కలిసిపోయినట్టు వుంటారు.
ఛాయాగ్రహణం
దర్శకుడే నిర్వహించాడు. కెమెరావర్క్ క్వాలిటీతో వుంది. మిగతా అన్ని ప్రొడక్షన్
విలువలు ఉన్నతంగా వున్నాయి. సున్నిత సంగీతం సహా సాంకేతిక విభాగాలు కంబాలపల్లి
పరిసర వాతావరణాన్ని, నిద్రాణంగా వుండే మూడ్ ని కళాత్మకం చేశాయి.
దర్శకత్వంలో కథ డిమాండ్ చేస్తున్న ఒక వస్తుగత శైలి వుంది. ఆ శైలిని చివరంటా చెడకుండా శిల్పం చెక్కాడు దర్శకుడు. సంభాషణలు
పనిగట్టుకుని రాసినట్టుగాక నిజంగా ఎలా మాట్లాడతారో ఆ మాటలు రాసేశాడు. ఈ కంబాల
పల్లి మొదటి చాప్టర్ ని దాచుకో దగ్గ ఒక ఆల్బంగా రూపొందించాడు అభిరుచిగల
ప్రక్షకులకి. నిడివి గంటా 56 నిమిషాలు మాత్రం ఎక్కువే.
ఎలావుంది కథ
2005 లో కంప్యూటర్ తో పీరియెడ్ కథ. గ్రామీణ నేపథ్యంలో కంప్యూర్ తో వైజ్ఞానిక విప్లవంగా కాక ఫక్తు వినోద ప్రధాన కథ. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు గ్రామాల్లో కంప్యూటర్ల ప్రవేశం తల్లిదండ్రులకి తమ పిల్లల విద్యాభివృద్ధికి కొత్త కెరటంలా కన్పించింది. ఈ కోణం నేపథ్య మాత్రంగా కూడా స్పృశించకుండా కేవలం వినోద వస్తువుగా కథ వుంది. రవి పాత్ర కంప్యూటర్ కొనాలంటే తండ్రి మందలించడంలోనే విషయ ప్రాధాన్యాన్ని తగ్గించడం వుంది. కాస్త చారిత్రక వాస్తవాలు కూడా రికార్డు చేసి వుండాలి. ఈ వాస్తవిక కథలో పాయింటు కూడా ఫార్ములా సినిమా పాయింటులా రెండు కోట్ల ఫేక్ లాటరీ కాలక్షేప కథతో వుంది. హైబత్ పాత్ర కంప్యూటర్ గేమింగ్ ప్రారంభించినప్పుడు, కంప్యూటర్ రాక అనేది వినోదంతో పిల్లల్ని చెడగొట్టడానికా, పిల్లల విద్య కోసమా అన్న చర్చలేని గ్రామ పెద్దల ఉదాసీనత కాన్సెప్ట్ తో ఒక లోపంలా కన్పిస్తుంది. విద్య వర్సెస్ వినోదం కథ ఇంతే వినోదాత్మకంగా చెప్పివుండొచ్చు.
ఆర్కే నారాయణ్ రాసిన క్లాసిక్ కథల సంపుటి ‘మాల్గుడి డేస్’ దూరదర్శన్ సిరీస్ గా కూడా సంచలనం సృష్టించింది. మాల్గుడి అనే దక్షిణాది కల్పిత వూళ్ళో జరిగే కథలు. ఇవి అంతర్జాతీయ ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికీ కాలదోషం పట్టలేదు. మాల్గుడిలో జీవితాలు, ఎదుర్కొనే సమస్యలు, సాధారణంగా కన్పించే అసాధారణ చిత్రణలు. అనితర సాధ్యమైనవి కూడా. విజువల్ మీడియాకి వాస్తవిక రూరల్ కథలు తీయాలనుకునే వాళ్ళకి ఒక గైడ్ అనొచ్చు.
ఇందులో ‘జంటిల్ మాన్స్ గిఫ్ట్’ అనే కథలో రిటైరైన పాత్రకి పోస్ట్ లో ఒక కవర్ వస్తుంది. తను పని చేసిన కంపెనీ జనరల్ మేనేజర్ నుంచి. ప్రతీ నెలా పెన్షన్ అందినప్పుడల్లా బంక మన్నుతో ఒక ప్రతిమ తయారు చేసి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడల్లా గత నెల ఇచ్చిన బొమ్మ ఎలా వుందని అడిగేవాడు. మెచ్చుకునే వాడు జనరల్ మేనేజర్. అయితే ఇప్పుడిలా కవర్ రావడంతో కవరులో బొమ్మ విషయంలో ఏం కోప్పడుతూ రాశాడోనని భయం పట్టుకుంటుంది. కవరు విప్పే ధైర్యంలేక ఎక్స్ రే టెక్నీషియన్ కి చూపించి లోపలేముందో చెప్పమంటాడు. అతను టెస్టు చేసి ఆరోగ్యం బాగా లేదని రాసి వుందంటాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగికి దిగులు పట్టుకుంటుంది. ఇక బొమ్మలు చేసే వృత్తి చేయలేక పోతాడు. బొమ్మ వల్లే జనరల్ మేనేజర్ ఆరోగ్యం చెడిందనుకుని పిచ్చివాడైపోతాడు. ఇంతకీ ఆ కవర్లో ఏం రాశాడు జనరల్ మేనేజర్. అతి విధేయత, అమాయకత్వం మనిషిని ఎలా తయారు చేస్తాయి అన్న వొక క్యారక్టర్ స్టడీ ఈ కథ. ఆర్కే నారాయణ్ సున్నిత హాస్య ప్రియుడనేది కూడా తెలిసిందే. ఏ ప్రయోజనం కోసం కథ రాయాలన్న దృష్టి అదనపు హంగు. కంబాలపల్లి ‘మెయిల్’ కథ చూస్తే ఈ కథ మెదిలింది. పోలికలు కనిపిస్తాయి గానీ ప్రయాణాలు వేరు.
చివరి కేమిటి
వాస్తవికత అనగానే ఇంకా ఆర్ట్ సినిమా ధోరణిలోకి వెళ్లి పోతూంటాయి కథలు. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లి మూడు దశాబ్దాలయింది. మళ్ళీ శ్యామ్ బెనెగల్ తేరుకుని 2000 లో కొత్త రూపమిచ్చాడు. దీన్నికొత్త దర్శకులు మల్టీ ప్లెక్స్ సినిమాలుగా మార్చి చెడగొట్టాక, 2015 లో కర్నాటక నుంచి కొత్త దర్శకుడు రాంరెడ్డి, ఆర్ట్ సినిమాకి ఆధునిక రూపమిస్తూ లోకల్- నేషనల్- ఇంటర్నేషనల్ అన్నితరగతుల ప్రేక్షకులకీ వర్తించేలా ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేశాడు. ఇదెలా చేశాడో ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.
‘మెయిల్’ కథ గంట సేపటికి గానీ ఫేక్ లాటరీ పాయింటు కొచ్చి కథలోకి వెళ్ళదు. పాత్రల పరిచయానికి ఇంత సేపా? ఫేక్ లాటరీ కోసం అప్పులు చేసిన రవి పాత్ర సమస్యకి చివరి పది నిమిషాల్లో ఇచ్చిన ముగింపు ఫార్ములా ముగింపుగా కాకుండా, ప్రత్యర్ధి శివన్న పాత్ర వెర్రిబాగుల తనంతో ఫన్నీగా వుంది మంచి విషయమే - అయితే కథ పాయింటుకి రాకముందు బిగినింగ్ నడక, పాయింటు కొచ్చాక ముగింపు వరకూ మిడిల్ నడక, ఆర్ట్ సినిమాల పోకడతో వుండడమే సమస్య. నిద్రాణంగా వుండే గ్రామమని నిద్రాణంగా వుండే కథనం చేయకూడదుగా. హైబత్ పాత్ర వూరికి పోతూ రవికి తాళాలు ఇచ్చి పోవడం, అలాగే శివన్న పాత్ర రవికి లక్ష అప్పు ఇచ్చేయడం వంటి రెండు ప్రధాన మలుపులు కథా సౌలభ్యం కోసం చేసినట్టే వుంది. తాళాలివ్వడానికి, లక్ష అప్పు ఇవ్వడానికి లాజికల్ కారణాలు జతపడక పోతే వాస్తవికత బలహీన పడుతుంది. ఆర్ట్ సినిమాల్నిఇక మర్చిపోయి, వాస్తవిక కథల్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చి, అన్నివర్గాల ప్రేక్షకులకీ దగ్గర చేయడమే ఇప్పటి అవసరం.
―సికిందర్