రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, జనవరి 2021, ఆదివారం

1012 : సందేహాలు - సమాధానాలు




 Q : నేను మీ బ్లాగ్ ఫాలోవర్ ని. నాదొక చిన్న డౌట్. ప్రతీ మూవీలో హీరోకి ఒక గోల్ వుంటుంది. హీరో ఆ గోల్ తో సంఘర్షణ అనుభవించి చివరికి ఆ గోల్ సక్సెస్ లేక ఫెయిల్యూర్ అయి కదా పూర్తవుతుంది. ఐతే అర్జున్ రెడ్డి లాంటి కొన్ని మూవీస్ లో హీరోకి గోల్ వుండదు. ఇలాటి స్టోరీస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి. కాస్త సలహా ఇవ్వండి.
రాజేష్ దమ్ము, అసిస్టెంట్

A :అర్జున్ రెడ్డి రోమాంటిక్ డ్రామా జానర్. రోమాంటిక్ డ్రామా గోల్ లేకపోయినా ఒక్కోసారి చెల్లుతుంది. ఇదే రోమాంటిక్ కామెడీ అయితే చెల్లదు. రోమాంటిక్ డ్రామాలు, ఇంకెవైనా ఫ్యామిలీ డ్రామాలు గాథల కిందికొస్తాయి. గాథలు తప్ప కథలనే వాటికి గోల్ వుండాల్సిందే. జీవితంలో గోల్ లేకుండా ఏ మనిషి వుంటాడు. వుంటే ఇంట్లోంచి వెళ్ళగొడతారు. వెళ్ళ గొట్టించుకునే గాథలు రాసుకోవచ్చు. సినిమా తీయాలన్న గోల్ తో వచ్చి, హీరోకి గోల్ ని ఎలా కాదంటారు. దర్శకుడికి కెరీర్ గోల్ వుండాలి గానీ హీరోకి, నిర్మాతకి బాక్సాఫీసు గోల్ వుండ కూడదా? కథ కి చక్రాల్లాంటిగి గోల్. చక్రాల్లేకుండా కథెలా డిజైన్ చేస్తారో తెలియదు. ఆర్ట్ సినిమాల గురించి శివాజీ గణేశన్ ఒకసారి చెప్పారు : నదిలో పడవ పోతూ వుంటుందిఇంకా పోతూ వుంటుంది ... పోతూనే వుంటుందికథలో ఏమీ జరగదని! పడవకి చక్రాలుండవు. అలలు ఎటు తోస్తే  అటు వెళ్ళి పోవాల్సిందే. గాథ చేయాలనుకున్నప్పుడు గోల్ లేకుండా రాసుకోవచ్చు. కథ చేయాలంటే చాలా ప్లస్ లు, మైనస్ లు దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. గోల్ ఒక ప్లస్.

Q : మీరు డ్రమెటిక్ క్వశ్చన్ అని తరచూ అంటారు. అంటే ఏమిటి? కథలో అదెలా వుంటుంది?
అశోక్ గౌడ్, అసోషియేట్

A : మనం బ్లాగులో హాలీవుడ్ పదాలు వాడడంతో ఇలాటి సందేహాలు వస్తూంటాయి. ఏదైనా తెలుసుకోవడానికి మనకి హాలీవుడ్ తప్ప దిక్కులేదు. వాళ్ళు శాస్త్రాల్ని నిత్యం అభివృద్ధి చేసుకుంటూ వుంటారు కాబట్టి. డ్రమెటిక్ క్వశ్చన్ అంటే మరేమీ కాదు పాయింటు. కథలో పాయింటు. అయితే గమనించాల్సిందేమిటంటే, రెండిటి అర్ధం ఒకటే అయినా సైకాలజికల్ గా రచయిత మీద వేర్వేరుగా పనిచేస్తాయి. పాయింటు అనే పదం జడంగా వుండే భావం కల్గిస్తుంది. అదే డ్రమటిక్ క్వశ్చన్ చలనంలో వుండే ఉత్సాహం కల్గిస్తుంది. పాయింటు గురించి - పాయింటా? ఆఁ... కథలో అలా పడుంటుందిలే పాయింటు అన్పిస్తుంది తేలిగ్గా. దాంతో రచయిత కూడా పాసివ్ గా పడుంటాడు. అదే డ్రమెటిక్ క్వశ్చన్ అనుకుంటే - అమ్మో ఏదో చేయాలనుకుంటాడు. క్వశ్చన్, అంటే ప్రశ్న తలెత్తిందంటే అది కార్యాచరణకి సిద్దం చేస్తుందిగా? యాక్టివ్ గా మారతాడు. అప్పుడా కథలో డ్రమెటిక్ క్వశ్చన్ కి జవాబు వెతికే ఎజెండాతో, క్వశ్చన్ ని  ఫోకస్ చేస్తూ కథని ఉరుకులు పెట్టిస్తాడు.

    కథలో డ్రమెటిక్ క్వశ్చన్ విడిగా వుండదు. ప్రధాన పాత్రకి వుండే గోలే డ్రమెటిక్ క్వశ్చన్. ఆల్ డ్రామా ఈజ్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు సిడ్ ఫీల్డ్. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎప్పుడయితే కాన్ఫ్లిక్ట్ పుడుతుందో, అక్కడ్నించి ఆ మిడిల్ అంతా డ్రామానే. డ్రామా కానిది కాన్ఫ్లిక్ట్ కాదు. కాన్ఫ్లిక్ట్ కానిది డ్రామా కాదు. సినిమా ప్రారంభిస్తే చివరిదాకా వుండే కథనమంతా డ్రామా కాదు. కథ కానిది డ్రామా కాదు. డ్రామా కానిది కథ కాదు. ప్లాట్ పాయింట్ వన్ కి, ప్లాట్ పాయింట్ టూ కీ మధ్యన వుండేదే కథ, డ్రామా, లేదా కాన్ఫ్లిక్ట్. ప్లాట్ పాయింట్ వన్ కివతల, బిగినింగ్ లో వుండేది కేవలం సెటప్, లేదా ఉపోద్ఘాతం. అందుకని ఈ సోది ఎక్కువ చూపించ కూడదు. ప్లాట్ పాయింట్ టూ కవతల, ఎండ్ లో వుండేది మిడిల్లోని కథకి, లేదా డ్రామాకి, లేదా కాన్ఫ్లిక్ట్ కి పరిష్కారం.

     ఈ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రధాన పాత్రని టార్గెట్ చేసే వుంటుంది.  అందుకని ఆ క్వశ్చన్ కి సమాధానం లేదా పరిష్కారం వెతికే ప్రయత్నం, లేదా సంఘర్షణ ఆ ప్రధాన పాత్రకే వుంటుంది. అంటే సమాధానం అంత త్వరగా దొరక్కుండా కథనాన్నిజటిలం చేస్తూ పోవాలన్న మాట. ఇంకోటేమిటంటే, గోల్ అనే పదం వాడినప్పుడు నేరోగా అది పాత్రకి మాత్రమే అంటి పెట్టుకుని ఫ్లాట్ గా వుంటుంది. కథలో ఫీల్ వుండదు. డ్రమెటిక్ క్వశ్చన్ అనుకున్నప్పుడు, కథంతా కూడా ఆ క్వశ్చన్ పుట్టించే ఫీల్ నిండి పోతుంది. అంటే సోల్ అన్నమాట. అందుకే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడే ముందు, ఆ గోల్ లో గోల్ ఎలిమెంట్స్ వుండాలనేది. ఏమిటా గోల్ ఎలిమెంట్స్? కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. వీటిని బిగినింగ్ సెటప్ లో ప్రధాన పాత్రకి ఏర్పడేలా కథనం చేసుకోవాలి. ఒకసారి శివ ని చూసి ఈ మొత్తమంతా  స్టడీ చేసుకోండి.

 సికిందర్