ఇన్పుట్స్ పట్ల ఆసక్తి లేకపోతే ఏం జరగవచ్చో చూద్దాం... ఒక
ఐడియా తడుతుంది. ఆ ఐడియాలో ఒక హీరో వుంటాడు. అతను చేసిన ఒక పని వల్ల ఇంకెక్కడో వున్న తనకు తెలీని హీరోయిన్ జీవితం దెబ్బతింటుంది.
ఇది హీరో తెలుసుకుని ఎలా చక్కదిద్దాడు...? అన్నప్రశ్న దగ్గర ఆగిపోయింది ఐడియా. దీన్నేం
చేయాలా అని నల్గుర్నీ అడగడం ప్రారంభిస్తాడు సదరు కథకుడు. ఆ నల్గురూ తనలాంటి
వాళ్ళే. వాళ్ళ దగ్గరా సమాధానం వుండదు. బాగా చర్చించుకుంటారు. అసలు హీరో చేసిన అంత
దారుణమైన పనేమిటనేది కథకుడికి కూడా తెలీదు. హీరోయిన్ జీవితం దెబ్బతిందంటే ఏం
జరిగిందో కూడా తెలీదు. ఇదే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోమంటాడు. అది తెలిస్తే
హీరోయిన్ జీవితాన్ని చక్కదిద్దే మార్గం తెలుస్తుంది. ఇలాకాదని ఇలాటి కథలతో ఏమేం
సినిమాలు చూశామా అని వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. ఫలానా ఫలానా సినిమాలు చూడమంటూ కథకుడికి సలహా ఇస్తారు. కథకుడు
ఎన్నో సినిమాలు చూస్తాడు. ఎక్కడా తను అనుకుంటున్న ఐడియా కనెక్ట్ అవదు. అంటే తన
కొచ్చిన ఐడియాతో సినిమాలే రాలేదంటే తన ఐడియా ఎంత గొప్పదోనని ఆత్మవిశ్వాసం
పెరిగిపోతుంది. ఎక్కడో వున్న హీరో ఇంకెక్కడో వున్న హీరోయిన్ జీవితాన్ని తెలియకుండా
పాడుచేశాడు... ఎంత మంచి బంపర్ ఐడియా! కానీ మళ్ళీ అదే చిక్కు ప్రశ్న... ఎలా పాడు
చేశాడు హీరోయిన్ జీవితాన్నీ?
సర్లేరా, అసలా హీరో ఏం
చేస్తూంటాడో చెప్పిచావు – అంటారు స్నేహితులు. ఇది కూడా ఇప్పుడాలోచించి చావాలంటాడు కథకుడు.
అన్నీ మేమే ఆలోచించి చావాలంటే ఎలారా అని చచ్చిపోతూంటారు స్నేహితులు. భీకరంగా
మేధోమధనం జరుగుతుంది. మధ్య మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ తోకూడా అంతర్మధనం
జరుగుతూంటుంది. ఏరా, మా జీవితాల్నేపాడు చేసే ఐడియాలు కావాల్రా మీకూ - అని గొడవలు
కూడా జరుగుతూంటాయి వాళ్ళతో.
ఇదే
గనుక ఇన్పుట్స్ వుంటే ఎలా వుంటుంది? ఎక్కడో వున్న హీరో వల్ల ఇంకెక్కడో వున్న
హీరోయిన్ జీవితం పాడయ్యిందా? హీరో ఏం చేసివుంటాడు? అప్పుడు ఒకానొక దేశంలో ఒక
వెడ్డింగ్ యాప్ వల్ల కొందరి పెళ్ళిళ్ళు పెటాకులైన వార్తా విశేషాలు గుర్తుకొస్తాయి.
దాన్ని తనకొచ్చిన ఐడియాకి వాడుకుంటాడు కథకుడు. అంటే హీరో అలాటి యాప్ ని డెవలప్ చేశాడు.
దాన్ని హీరోయిన్ వాడుకుని పెళ్లి చేసుకోబోయి ఘోరంగా పరువు పోగొట్టుకుంది. కానీ ఆ యాప్ అసలు హీరో విడుదల చేయలేదు. అదింకా ప్రయోగ దశలోనే వుంది. హీరో ఫ్రెండ్ వుంటాడు. అతడికి
హీరోయిన్ తో చెడింది. కనుక ఆమె పెళ్లి చెడగొట్టాలని ఫ్రెండ్ దగ్గర ప్రయోగ దశలో వున్న
యాప్ కొట్టేసి ఆమెకి పంపాడు... ఇలా కథని విస్తరించుకుంటూ పోగలడు కథకుడు తనదగ్గర ఇన్పుట్స్
వుంటే.
ఏరంగంలో
వున్నా కథకుడన్నాక అతడిలో జర్నలిస్టు అంశ, జిజ్ఞాస తప్పకుండా వుంటాయి. తనలో జర్నలిస్టు పనిచెయ్యని కథకుడు
కథకుడు కాదు. జర్నలిస్టులు వేరు, మనం వేరు –మనకి వివిధ ప్రపంచ విషయాలతో సంబంధం
లేదు, మన కథకి మనం డ్రామా వరకూ ఆలోచించుకుంటే సరిపోతుందనుకుంటే ఆ కథకుడు డొల్లగా
తయారవుతాడు. లోపలేమీ వుండదు, కాబట్టి బయటికేమీ తీయలేడు. డ్రామా అంటే ఏమిటి? అది
జడప్రాయం కాదు. టెంప్లెట్ కాదు. అది కూడా ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ విషయాలని
తనలోకి తీసుకుంటుంది. తనని తాను సంస్కరించుకుంటుంది. తమకి ఉద్యోగాలివ్వలేదని
నిరుద్యోగులు కాపేసి నాయకుణ్ణి చంపాలనుకోవడం మూస డ్రామా, లేదా టెంప్లెట్. నాయకుడే
అనూహ్యంగా ఆ కాపేసిన నిరుద్యోగుల మీద కాల్పులు జరిపి చంపడం సీన్ రివర్సల్, చలనంలో
వున్న యాక్షన్ – డ్రామా. యాక్షన్ కూడా టెంప్లెట్ లో బందీ అవదు. అది జడప్రాయం కాదు.
ఫారిన్లో హీరో బర్త్ డే జరుపుకోవడం, వూళ్ళో తాత భోజనాలు పెట్టడం మూస. అన్ని వయసుల
వాళ్ళూ సినిమాలు చూస్తున్న కాలంనాటి ఫార్ములా. కొన్ని వయసుల వాళ్ళే సినిమాలు
చూస్తున్ననేటి డైనమిక్స్ కాదు.
దర్శకుడు 90 - కథకుడు10
కాలీన
స్పృహ వుండని కథకుల గురించి ఒక కొటేషన్ వుంది : వీళ్ళు తమ పధ్నాల్గవ యేట వరకూ తెలిసిన
జ్ఞానంతో అక్కడే వుండిపోతారని. తెలుగులో
వచ్చే ప్రేమ సినిమాలు చూస్తే ఈ అపరిపక్వతే
కన్పిస్తుంది. ప్రపంచ విషయాల
పట్ల,ఇన్పుట్స్ పట్లా ఆసక్తి లేకపోవడం. ఇలాటి కథకులకి కథ రాయాలన్న ఆసక్తి
ఎప్పుడు పుడుతుందంటే, సినిమాల మీద మోజు పెంచుకున్న తర్వాతే. చిరంజీవి, బాలకృష్ణ,
నాగార్జున, వెంకటేష్, విజయశాంతిలు నటించిన
ఎన్నో సినిమాలు చూసేశాం కదా, ఇక మనకి కూడా సినిమాలు తీయాలన్న కోరిక పుట్టేసింది,
ఇక మనమే కథకులై పోవచ్చని వచ్చేస్తూంటారు.
కానీ
ఏ మనిషిలోనూ ఎకాఎకీన కథకుడు పుట్టడు. ఎప్పటి నుంచో ఒక జర్నలిస్టు అంశ తనలో పడే
వుంటుంది. జర్నలిస్టు అంశే ప్రాచీన కాలంలో రాయించడం మొదలెట్టించింది. మొట్ట మొదట చరిత్రలు రాయించింది. అంటే శోధనతో రచన చేయడం మొదలైంది. శోధన అంటే జర్నలిజమే. ఆ రాసిన చరిత్రల్ని శోధించి నాటకాలు రాశారు. నాటకాల నుంచి కావ్యాలూ, ఇతర
సాహిత్య ప్రక్రియలూ వెలువరించడం
మొదలెట్టారు. ఇలా ఒకదాన్ని శోధిస్తూ ఇంకొకటి కళా ప్రక్రియలు అవతరించాయి. నాటక కళని శోధించే
సినిమాకళ వచ్చింది.
కనుక
దేన్నీ ఊహల్లోంచి సృష్టించ లేరు. ఇది బాగా
గుర్తుపెట్టుకోవాలి. ఊహించి ఏదీ సృష్టించడం సాధ్యం కాదు. శాస్త్రాలన్నీ పదార్థ
ఫలితాలే. పదార్థముంటేనే శాస్త్రం. ప్రాచీనకాలంలో రాజులనే పదార్ధముంది కాబట్టే వాళ్ళని
గమనించి చరిత్రలు. చరిత్రలనే పదార్థముంది కాబట్టే అవి చూసి నాటకాలు. నాటకాలనే
పదార్ధముంది కాబట్టే ఇవి చూసి ఇతర కావ్యాలూ కథలూ కాకరకాయలూ, అన్ని కళలూ! నాట్యాలనే
పదార్థాలున్నాయి కాబట్టే వాటిని చూసి భరతముని నాట్య శాస్త్రమూ. సినిమాలనే పదార్థాలున్నాయి కాబట్టే వాటిని చూసి
స్క్రీన్ ప్లే శాస్త్రమూ. విశ్వముంది
కాబట్టే దాన్ని చూసి ఖగోళ శాస్త్రమూ. యాపిల్ కింద పడింది కాబట్టే దాన్ని చూసి
గురుత్వాకర్షణ సిద్ధాంతమూ. పదార్థాలే ముందు, శాస్త్రాలు తర్వాత. వీటన్నిటి చోదక
శక్తి మళ్ళీ శోధించే జర్నలిస్టు అంశే.
కాబట్టి
సినిమాల మీద ఓ పొద్దుటే కోడెగిత్తలా పుట్టిన మోజుతో కథకులై పోవడానికి సినిమాలనే పదార్థముంది ఓకే, మరి
జర్నలిస్టు అంశ ఏదీ? పదార్థాన్ని (సినిమాల్ని) చూసి మోజైతే బాగానే రేగింది, మరి ఇప్పటికప్పుడు
జీవితాల్నీ ప్రపంచాన్నీ శోధించాలంటే జర్నలిస్టు అంశ ఎలా పొడుచుకు వస్తుందీ? ఇంకా
సినిమాల్ని ఏమని శోధిస్తావ్? ఆల్రెడీ నాటకాల్ని శోధించి బిగినింగ్ - మిడిల్ - ఎండ్
లతో ఓ సినిమా కళని స్థాపించారు. ఇంకా నువ్వేం స్థాపిస్తావ్? ఆల్రెడీ తెలుగు సినిమాల
యాక్షన్ కి ఒక టెంప్లెట్, లవ్ కి ఇంకో టెంప్లెట్ వున్నాయి. వాటిలో నువ్వేం విషయం
వేస్తావ్? వేసిన విషయమే వేస్తూ పోతావా? ఇందుకా మళ్ళీ నువ్వూ వచ్చిందీ?
టాప్
దర్శకులు కూడా కొద్ది కాలంలోనే హతాశులవడానికి కారణం జర్నలిస్టు అంశ లోపించడమే. ఒక
ఫ్యాక్షన్ టెంప్లెట్ పట్టుకునో, ఒక యాక్షన్ కామెడీ టెంప్లెట్ పట్టుకునో నాల్గు
సినిమాలు తీసేసరికి వాళ్ళ పనై పోయింది. కానీ హిచ్ కాక్ చెప్పినట్టు, సినిమా అంటే 90 శాతం రాత, 10 శాతమే తీత. ఇదిప్పుడు
తారుమారైంది. 90 శాతం తీత, 10 శాతం రాతగా మారిపోయింది. కాబట్టి ఓ పొద్దుటే
సినిమాలు తీసేద్దామని వచ్చే నేటి దర్శక రచయితల్లో 90 శాతం దర్శకుడవ్వాలనే కోరికే తప్ప, ముందు కథకుడయ్యేందుకు
జర్నలిస్టు అంశ అసలే వుండదు, ఆసక్తి కూడా 10 శాతం మాత్రమే. కనుకే 90 శాతం
ఫ్లాపులు.
ఒక సీనియర్ దర్శకుడు పదిహేనేళ్ళ
క్రితమెప్పుడో ఈ వ్యాసకర్తతో చెప్పారు :
చదవాలండీ, చదువుతూనే వుండాలి. ఏదని కాదు, వీలైనన్నివిషయాల మీద చదువుతూనే
వుండాలి. దర్శకత్వమనేది శారీరకమే, మనం మానసికంగా స్ట్రాంగ్ గా వుండాలి... అని.
ఈ
చదువు కొరవడితే ఇన్పుట్స్ వుండవు. ఇన్పుట్స్ లేకపోతే అవుట్ పుట్ వుండదు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం తెలుగులో దర్శకుడే కథకుడు,
కథకుడే దర్శకుడనే ఫ్రెంచి ఓటర్ (auteur) విధానం అమల్లో వుంది. ఇది వరల్డ్ మూవీస్ కి యూరప్
దేశాల్లో పుట్టిన విధానం. హాలీవుడ్ లో 1920 ల నుంచే స్క్రీన్ రైటర్స్ అని విడిగా వుంటూ
వస్తు న్నారు. వాళ్ళందించే కథలతోనే, స్క్రిప్టులతోనే దర్శకులు సినిమాలు
తీస్తూంటారు. అరుదుగా క్వెంటిన్ టరాంటినో,
కోయెన్ బ్రదర్స్, రియాన్ జాన్సన్ లాంటి తామే
రాసుకుని తామే తీసే ‘ఓటర్స్’ వుంటారు. వీళ్ళు కూడా మామూలుగా వుండరు. వీళ్ళల్లో 90
శాతం కథకుడుంటే, 10 శాతమే దర్శకుడుంటాడు. అందుకే పల్ప్ ఫిక్షన్, బ్లడ్ సింపుల్,
బ్రిక్ లాంటి వీళ్ళు తీసిన కమర్షియల్ అద్భుతాలొచ్చాయి, యూనివర్సిటీల్లో
బోధనాంశాలయ్యాయి. పల్ప్ ఫిక్షన్ తో టరాంటినో ఆధునిక గ్యాంగ్ స్టర్ కథ స్క్రీన్
ప్లే స్ట్రక్చర్ లో అపూర్వ క్రియేటివిటీ ప్రదర్శించాడు. కోయెన్ బ్రదర్స్ 25 – 27 ఏళ్ల వయసులో వుండగానే తొలి సినిమా బ్లడ్ సింపుల్ తో ఆశ్చర్యపర్చారు. ఫ్రెంచి
జానరైన ఫిలిం నోయర్ ని 1930 లనుంచీ హాలీవుడ్ తన వ్యాపార తరహాకి అనుకూలంగా
మార్చుకుని, హాలీ వుడ్ లో దాన్ని కూడా ఒక జానర్ గా కలుపుకున్నాక, కాలానుగుణంగా కలర్ సినిమాలతో నియో నోయర్ గా మార్చుకుని,
ఇప్పటికీ తీస్తూనే వుంది. ఫ్రెంచి నుంచి
తెచ్చుకున్న ఫిలిం నోయర్ కథలకోసం అమెరికాలోనే డెషెల్ హెమెట్ రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల్నే
తీసుకున్నారు. తెలుగులో జానపద సినిమాలు ఎలా వచ్చేవో అంత విరివిగా హాలీవుడ్
నోయర్ సినిమాలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. 1980 లలో కోయెన్ బ్రదర్స్
వచ్చేటప్పటికి, వాళ్ళు వచ్చిన నోయర్ సినిమాలనే చూసి బ్లడ్ సింపుల్ తీయలేదు. వాళ్ళల్లో
జర్నలిస్టు అంశ మేల్కొంది. అసలు డెషెల్ హెమెట్ ఏం ప్రతిపాదించాడబ్బా అని హెమెట్ నవలలు చదవడం ప్రారంభించారు. అప్పుడు
మాత్రమే ఆ జానర్ కి దగ్గరగా వెళ్లి అనుభవించగల్గి, బ్లడ్ సింపుల్ తీసి రికార్డు సాధించారు.
2005
లో రియాన్ జాన్సన్ బ్రిక్ తీసినప్పుడు కూడా హెమెట్ సాహిత్యాన్ని అధ్యయ నం చేశాడు.
అతడికి ఫిలిం నోయర్, నియో నోయర్ లాగా అడల్ట్ కథతో, పెద్ద నటులతో తీసే ఉద్దేశం
లేదు. అడల్ట్ ప్రపంచంగా వుంటూ వస్తున్న నోయర్ జానర్‌ని, కాలేజీ టీనేజీ నోయర్ గా మార్చేసి సంచలనం
సృష్టించాడు. ‘ఓటర్’ బాధ్యతల్ని నిర్వహించుకోవడం ఇలా వుంటుంది అధ్యయనాలతో కలుపుకుని.
100 శాతం ఓటర్సేనా?
అయితే
తెలుగులో ఈ తరం దర్శక రచయితల్ని పూర్తిగా ఓటర్స్ అనలేం. యూరోపియన్ సినిమా ఫీల్డులో
ఓటర్ అంటే రచన నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ దాకా అన్నిశాఖలూ తనవే అన్నట్టు ముద్రవేసుకునే దర్శకులని ఓటర్స్ అంటారు. సినిమాలో
ఏ శాఖ పనితనం చూసినా ఆ దర్శకుడి ప్రత్యేక శైలియే కన్పిస్తుంది. యూరప్ లో జీన్ లక్ గొడార్డ్,
ఇంగ్మార్ బెర్గ్ మన్, ఫ్రాంకోయిస్ ట్రూఫాట్ లాంటి గొప్ప దర్శకులు నిజమైన ఓటర్స్
అన్పించుకున్నారు. తెలుగులో చూస్తే, వంశీ సినిమాల అణువణువులో ఆయన శైలియే కొట్టొచ్చినట్టు
కన్పిస్తుంది. నటీనటుల నటనల దగ్గర్నుంచీ భావోద్వేగాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం,
సంగీతం, కళా దర్శకత్వం, పోరాటాలూ సమస్తం ఆయన శైలిలోకి మారిపోయి కన్పిస్తాయి. క్వెంటిన్
టరాంటినో, కోయెన్ బ్రదర్స్, రియాన్ జాన్సన్ లు ఓటర్స్ గా ఇదే సాధించారు. ఇది
సాధించాలంటే ముందు జర్నలిస్టు అంశతో, శోధనతో పూర్తి 90 శాతం కథకులవగల్గాలి.
యూరోపియన్ యూనియన్ చిన్న చిన్న దేశాల్లో అక్కడి కొద్దికొద్ది జనాభాకి, చిన్న చిన్న బడ్జెట్లతో ‘ఓటర్స్’ తీసే పర్సనల్ సినిమాలు నప్పుతాయి. ‘ఓటర్స్’ తీసే
సినిమాలు ఎంత వరల్డ్ మూవీస్ అని ఇప్పుడు ఫ్యాషన్ గా చెప్పుకుంటున్నా అవి ఆర్ట్
సినిమాలే. జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు కళ వాటికి
మూలం. ఈ సినిమాలు అక్కడి జీవితాల గురించి వుంటాయి, వినోదం గురించి వుండవు.
కాబట్టి వాటి నేటివ్ జీవితాలతో అవి మిగతా ప్రపంచంలో ఆడవు. భారత దేశంలో కూడా, కాశ్మీరు నుంచీ కన్యాకుమారీ దాకా కాదుకదా, కనీసం ఆబిడ్స్ నుంచి అమీర్ పేట వరకూ కూడా ఎక్కడా ఆడినట్టు మనం
చూడలేదు. హాలీవుడ్ సినిమాలే మన గల్లీల్లో కూడా
ఆడతాయి.
ఈ సినిమాల్లో కథనం హాలీవుడ్ లాగా
సంఘటనలతో సాగదు, డైలాగులతో నెమ్మదిగా సాగుతుంది. హాలీవుడ్ లాగా యాక్టివ్ పాత్రలు ఎప్పుడో గానీ వుండవు. భావాలు
హాలీవుడ్ లాగా డైలాగులతో పలకరు, ముఖభావాల మీద ఫోకస్ చేసి అర్ధం జేసుకోమంటారు. హలీవుడ్ లాగా కథకి స్ట్రక్చర్ వుండదు. పర్సనల్ సినిమాలు కాబట్టి ‘ఓటర్’ ఫీలింగ్సే సినిమాలుగా వుంటాయి. ఈ వరల్డ్
మూవీస్ పైన స్క్రీన్ ప్లే పుస్తకాలుండవు. స్ట్రక్చర్ అనేది వుంటే కదా? స్క్రీన్
ప్లే పుస్తకాలన్నీ హాలీవుడ్ సినిమాల గురించే వుంటాయి.
మరి
ఇంతా చేసి యూరప్ అంతటా అక్కడి వరల్డ్
మూవీస్ ఆడేదెంతా అంటే, అక్కడ 80 శాతం
మార్కెట్ ని హాలీవుడ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. అందుకని హాలీవుడ్ సినిమాలు విశాల
ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ఆడాలి కాబట్టి,
అక్కడి స్టూడియోలు స్క్రిప్టు బాధ్యతల్ని ఒక్క ‘ఓటర్’ చేతిలో పెట్టేయవు. ఒక దర్శకుడు, కథ ఇచ్చిన స్క్రీన్
ప్లే రచయిత, మరికొందరు డెవలప్ మెంట్ రచయితలూ, స్టూడియో ఎగ్జిక్యూటివ్ లూ, మార్కెట్
నిపుణులూ మొత్తం కలిసి మహా ‘హుండీ’ యాగం నిర్వహిస్తారు. హుండీ ముఖ్యం. ఏ వొక ‘ఓటర్’ కపాల మోక్షమో కాదు.
అదృష్టవశాత్తూ
తెలుగు సినిమాలు ఒక చిన్న తెలంగాణా ప్రాంతం,
ఇంకో ఒక చిన్న కోస్తాంధ్ర ప్రాంతం, మరింకో చిన్న రాయల సీమ ప్రాంతమని విడివిడిగా, చిన్న చిన్న ఏరియాలుగా విడిపోయి లేవు. అలా వుంటే
యూరప్ లో చిన్న చిన్న ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నేటివ్ జీవితాల వరల్డ్ మూవీస్
లాగే ‘ఓటర్’ సినిమాలే వర్కౌట్ అవచ్చు. అలాలేదు. సినిమాల
విషయంలో తెలుగు ప్రజలందరిదీ ఒకే అభిరుచి. అది కమర్షియల్ అభిరుచి. మరి హాలీవుడ్ అంత
కాకపోయినా, హాలీవుడ్ లాగే వ్యాపారాత్మకంగా అన్ని ప్రాంతాల తొమ్మిది పది కోట్లమంది తెలుగు ప్రేక్షకులకి కమర్షియల్ సినిమాలు
అందించాలంటే, ఇప్పుడు కొనసాగుతున్న ‘ఓటర్’ సాంప్రదాయంలో, ఆ దర్శకుడు ఏ స్థాయి సినిమా
కథకుడై వుండాలి?
ఇన్పుట్స్
ఎక్కడ?
కేవలం సినిమాలు చూస్తూ సినిమా కథకులు కాలేరు. అందునా వరల్డ్
మూవీస్ చూసి కమర్షియల్ కథకులు కాలేరు. నాటకాలు చూసినా ఆ చూసే ప్రత్యక్ష డ్రామా
వల్ల కమర్షియల్ రచన రాణించే అవకాశముంది. కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే పక్కా కమర్షియల్
సినిమాలే చూడాలి. కళాత్మక సినిమాలకంటే, వరల్డ్ మూవీస్ కంటే కమర్షియల్ సినిమాలు
తీయడమే కష్టం. కమర్షియల్ సినిమాలతో పండిత పామరులందనీ వినోదపర్చాల్సి వుంటుంది. కమర్షియల్
సినిమాలు చూస్తే డేటా బ్యాంక్ కి ఉపయోగపడాలి. కొన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలూ, కొన్ని
డౌన్ లోడ్ చేసుకున్న సినిమాలూ ఇవి మాత్రమే లైబ్రరీ అన్పించుకోవు. బ్యాకప్ గా డేటా
బ్యాంక్ వుండాలి. డేటా బ్యాంక్ వుండాలంటే చదవడానికి కొంత టైము కేటాయించుకోవాలి. ఇక్కడే
వస్తోంది సమస్య. అసలేమీ చదవరని ఒక సీనియర్ రచయిత విసుక్కున్నారు. అసలు ఇంగ్లీషు
పరిజ్ఞానమే వుండదని ఒక సినిమా విమర్శకుడు విమర్శించారు. ఈ రెండూ సీరియస్ సమస్యలే
ఇన్పుట్స్ కి. ఈ వ్యాసకర్త ఒక డిస్కషన్లో ఓ దర్శకుడుకి చెప్పిన కామెడీ
సీక్వెన్సుని, అక్కడున్న ఇంకో కథకుడు
వేరేచోట తీసికెళ్ళి అమ్మేశాడు. ఆ పెద్ద
సినిమాలో ఆ సీక్వెన్స్ హిట్టయ్యింది. వేరే ఆఫీసులో ఈ వ్యాసకర్తే రాస్తున్న సీన్లని అక్కడున్న కథకుడు కాపీ
చేసుకుని పై అంతస్తులోనే వున్న వేరే ఆఫీసులో ప్రతిరోజూ చేరవేస్తూంటే ఒకరోజు
పట్టుకున్నారు. ఇన్పుట్స్ లేకపోవడం వల్లే ఇలాటివి చేసే ఖర్మ పడుతుంది. వీళ్ళని
చూస్తే నవ్వొస్తుంది – అడిగితే మనమే కావాల్సినన్ని ఇన్పుట్స్ ఇస్తాంగా? పని చేస్తున్న సినిమాలకే ద్రోహం చేయడమెందుకు? ఒకసారి ద్రోహి ఇంకెప్పటికీ అచ్చోసిన ద్రోహియే.
ఇప్పటికిప్పుడు కథకుల్లో జర్నలిస్టు అంశ
పుట్టుకు రావాలంటే రాదు. అది దాదాపు పుట్టుకతోనే వుంటుంది. కాకపోతే కనీసం ఇప్పుడు
ఆపద్ధర్మంగా జిజ్ఞాస అయినా పెంచుకుంటే కొంతలో కొంత బెటర్. శోధన అనేది నిత్య
కార్యక్రమం అవ్వాలి. నీరవ్ మోడీ పారిపోయిన రోజు చానెల్లో ఒక క్యాబ్ వాలా బాధ
వెళ్ళబోసుకున్నాడు. తన క్యాబ్ ఈఎంఐకి ఒక్క రూపాయి తక్కువ కట్టినందుకు సీజ్ చేస్తామని బ్యాంకు వాళ్ళు నోటీసులిచ్చారని
లబలబ లాడేడు. దీనికి నవ్వూ రావొచ్చు, కోపంతో తిట్టుకోనూ వచ్చు. ఇది సాధారణ ఓటర్లు
చేసే పని. కానీ సినిమాలు తీసే ‘ఓటర్’ ఏం చేయాలి? ఓట్లేసే ఓటర్లలాగా తనుకూడా
నవ్వుకునో తిట్టుకునో వదిలెయ్యాలా? అలా చేస్తే అతడికి సినిమాల గురించి మాట్లాడే
అర్హత వుండదు. వెంటనే నోట్ చేసుకుని డేటా
బ్యాంకులో పెట్టుకోవాలి. తను స్వార్ధంతో వుండాలి. చూసే, వినే, చదివే ప్రతీదీ, రాసే
– తీసే సినిమాల దృష్టితోనే వుండాలి. ఇది మనకి పనికొస్తుందా అని పరిశీలించి, పనికొస్తుందనిపిస్తే డేటా బ్యాంకుకి పంపాలి.
న్యూస్ పేపర్ విధిగా చదవాల్సి వుంటుంది. ఏదో పైపైన చదివేస్తే కాదు. అండర్ లైన్లు
చేసే దృష్టితో పెన్ను పట్టుకుని చదవాలి. లైట్ రీడింగ్ మెటీరియల్ లాగా కొన్ని
వార్తలు మాత్రమే చదివితే కాదు. ఎడిట్ పేజీ వ్యాసాలూ కూడా చదివితే వివిధ అంశాలపైన
అభిప్రాయాలు తెలుస్తాయి. అలాగే పత్రికల్లో కథలూ ఇతర ఆర్టికల్సూ తప్పవు. ఇవన్నీ డేటా
బ్యాంకు అవుతాయి. డేటా బ్యాంకు వున్న కథకుడు మంచి ఆస్తిపరుడు.
ఇదంతా
ఒకెత్తు అయితే డిజిటల్ ప్లాట్ ఫాం ఒకెత్తు. ఇవ్వాళ వచ్చిన ఒక కథ ఐడియాకి సంబంధించి
ఏది తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ ని మించిన వనరు లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో
జర్నలిస్టులు, రచయితలూ అహర్నిశలూ పనిచేస్తూ వెబ్ సైట్స్ ద్వారా అందిస్తున్న
సమాచారం మనకి ఉత్తపుణ్యాన లభిస్తోంది. లేని అంశమంటూ లేదు. రోమాన్స్ ఎలాటి పోకడలు
పోతోందో, బ్రేకప్స్ ఎన్ని విధాలుగా జరుగుతున్నాయో ప్రతీదీ అప్డేట్ అవుతూ వుంటాయి.
లవర్స్ ఇంకెలాటి కొత్తకొత్త సమస్యలెదుర్కొంటున్నారో, వాటికి పూజాబేడీ లాంటి వాళ్ళు
చెప్పే పరిష్కారాలేమిటో చదువుకుంటే, మూస ప్రేమ
డ్రామాలకి ఎలా తెరదించవచ్చో తెలుస్తుంది.
డేటాబ్యాంక్
సృష్టించుకోవడానికి యాప్స్ వున్నాయి. క్లిపిక్స్, పాకెట్ మొదలైనవి. వివిధ వెబ్
సైట్లలో వచ్చే ఆసక్తికర వార్తల్ని, ఆర్టికల్స్ ని అప్పటికప్పుడు క్లిప్ చేసి ఈ యాప్ లో సేవ్
చేసుకుంటే అరచేతిలో ఇన్పుట్స్ వున్నట్టే. టాపిక్స్ వారీగా వీటి బాక్సుల్లో సేవ్ చేసుకోవచ్చు.
ఇవేకాక లోర్ ఫోర్జ్ అనే రైటర్ రిసోర్సెస్ యాప్ వుంది. ఇందులో చాలా జనరేటర్లు వుంటాయి.
ముఖ్యంగా ప్లాట్, మోటివ్, కాన్ ఫ్లిక్ట్ జనరేటర్లు, క్యారక్టర్ టైప్స్, ఇన్ స్పిరేషన్,
ఐడియా జనరేటర్లు మొదలైనవి.
రాయలేక
పోవడానికి కారణమొక్కటే, చదవకపోవడం. కొత్తగా
రాయలేకపోవడానికి కారణమొక్కటే, చదవకపోవడం. చూసిన సినిమాలే చూసి ఆ పాత మూసే రాయడానికి
కారణమొక్కటే, చదవకపోవడం. చదివితే మెదడుకి బాగా ఎక్కుతుంది. అదిక వూరుకోదు. ప్రాసెస్
చేసుకుంటూ వుంటుంది. ఎప్పుడో ఎక్కడో అవసరమొచ్చి ఆలోచిస్తూంటే, అది యాప్ లో సేవ్ చేశావ్ చూసుకో ఫో అని గుర్తుచేస్తుంది.
మనం యాప్ ని క్లిక్ చేస్తాం. ఇంతే, చాలా సింపుల్. ఈ మాత్రం దానికి రూమ్మేట్స్ తో, వాళ్ళ
గర్ల్ ఫ్రెండ్స్ తో గరీబోళ్ళలాగా చొక్కాలు చించుకోవాలా? చుట్టూ ప్రపంచాన్ని, తీసే సినిమాల
కోసం సమాచార కక్కుర్తితో చూడని కథకుడికి, గరీబీ
హటావో ఎప్పుడుంటుంది?
―సికిందర్