ఒక ఐడియా అనుకున్నప్పుడు
దాంట్లో స్ట్రక్చర్ సెట్ చేసుకుంటారు. స్ట్రక్చర్ లోకి ఐడియా వచ్చేవరకూ ఐడియాతో కుస్తీ
పడతారు. ఐడియా స్ట్రక్చర్ లోకొచ్చాక దాన్ని పెట్టుకుని సినాప్సిస్ రాస్తారు. సినాప్సిస్
కూడా స్ట్రక్చర్ లో సెట్ అయ్యేవరకూ కసరత్తు చేస్తారు. అప్పుడా స్ట్రక్చర్ లో వున్న
సినాప్సిస్ పెట్టుకుని ఒన్ లైన్ ఆర్డర్ వేస్తారు. ఒన్ లైన్ ఆర్డర్ వేసేటప్పుడు కూడా
సీన్లు స్ట్రక్చర్ లో వుండేట్టు చూస్తారు. అలా సెట్ అయిన ఒన్ లైన్ ఆర్డర్ ని
పెట్టుకుని ట్రీట్ మెంట్ రాస్తారు. ఈ ట్రీట్ మెంట్ లో సీన్ల విస్తరణ కూడా స్ట్రక్చర్
లో వుండేట్టు చూసుకుంటారు. అలా ఫైనల్ చేసుకున్న ట్రీట్ మెంట్ ని పెట్టుకుని, దాని ప్రకారం డైలాగ్ వెర్షన్ రాస్తారు. డైలాగ్ వెర్షన్
కూడా స్ట్రక్చర్ లో వుండేట్టు రాస్తారు. దీంతో స్ట్రక్చరల్ గా స్క్రిప్టు
పూర్తయిపోతుంది.
ఐతే వచ్చిన ఐడియాకి కథలో పాత్రకి
పుట్టాల్సిన సమస్యతో ప్లాట్ పాయింట్ వన్ సీను ఇదీ అని, అలాగే ఆ సమస్యకి
పరిష్కారంగా ప్లాట్ పాయింట్ టూ సీను ఇదీ అని ఐడియా దశలోనే నిర్ణయమైపోతుంది. ఇది
మారదు. మారితే ఐడియా బ్రేక్ అవుతుంది. కానీ ఐడియాలో ప్లాట్ పాయింట్స్ ని
పెట్టుకుని సినాప్సిస్ రాస్తున్నప్పుడు, పాత్ర చేతిలో వుండక, మాట వినక, దాని
ఇష్టానుసారం ప్రవర్తించే సందర్భా లెదురవుతాయి. ఐతే ఆ పాత్ర ఐడియాలో ముందే సెట్
అయిన ప్లాట్ పాయింట్స్ ని మాత్రం గౌరవిస్తుంది. కానీ ఆ ప్లాట్ పాయింట్స్ మధ్య
కథకుడి ఇష్టప్రకారం అది నడవదు. దానిష్ట ప్రకారం అది నడుచుకుంటుంది. దీంతో ఐడియాని
పెట్టుకుని ఫలానా ఈ విధంగా సినాప్సిస్ రాద్దామనుకుంటే, అది మారిపోతుంది. ఆ మారిపోయిన సినాప్సిస్ ని పెట్టుకుని
ఒన్ లైన్ ఆర్డర్ వేశాక, ఆ ఒన్ లైన్ ఆర్డర్ కి కూడా సినాప్సిస్ తో పోలికే వుండదు. ఆ
ఒన్ లైన్ ఆర్డర్ తో ట్రీట్ మెంట్ రాశాక దీనికీ
ఒన్ లైన్ ఆర్డర్ తో పోలికే వుండదు. మళ్ళీ ఆ ట్రీట్ మెంట్ తో డైలాగ్ వెర్షన్
రాస్తే దానికీ ట్రీట్ మెంట్ తో పోలికే వుండదు. అన్నిటికీ పోలిక వుండేది ప్లాట్
పాయింట్స్ విషయంలోనే. ఎక్కువగా బెటర్ మెంట్ కోసమే ఇలా జరగవచ్చు. కానీ పాత్ర నడవడిక
కూడా ప్రభావం చూపిస్తుంది. ఆఖరికి పక్కాగా, విశ్వసనీయంగా మిగిలేది ఏమిటంటే డైలాగ్ వెర్షనే. సినాప్సిస్,
ఒన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ ఇవన్నీ డైలాగు వెర్షన్ అనే గమ్యానికి సోపనాలే తప్ప
అవే గమ్యాలు కావు. హాలీవుడ్ లో స్క్రీన్ ప్లేలుగా రూపాన్ని సంతరించుకునేది ఈ డైలాగ్
వెర్షన్లే.
సినాప్సిస్,
ఒన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ లు బెటర్ మెంట్ కోసమే స్ట్రక్చర్ లోనే వుంటూ, అవే ప్లాట్ పాయింట్ల
మధ్య కథనం మారుతూ వచ్చి, డైలాగ్ వెర్షన్లో ఫైనల్ అవొచ్చు. అప్పుడా డైలాగ్ వెర్షన్
పెట్టుకుని రాస్తే కొత్త సినాప్సిస్, కొత్త వన్ లైన్ ఆర్డర్, కొత్త ట్రీట్ మెంట్
వస్తాయి. అప్పుడు దీన్ని ఇదే ఈ సినిమాలో వున్న సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్
మెంట్ అనీ పుస్తకాలేసి అమ్మవచ్చా? ఆ పుస్తకాలతో స్క్రీన్ ప్లే కోర్సులు చెప్పొచ్చా? కుదరదు.
ఎందుకంటే, రైటింగ్ ప్రాసెస్ వరకే డైలాగ్ వెర్షన్ డైలాగ్ వెర్షన్ లా వుంటుంది.
షూటింగ్ లో అదికూడా అక్కడక్కడా మారవచ్చు. చివరిగా
ఎడిటింగ్ లోనూ సీన్ల క్రమమే మారిపోవచ్చు. చాలా
డైలాగులు కట్ అయిపోవచ్చు. ఆ ఎడిటింగ్ తర్వాతే ఫైనల్ గా సినిమా ఏమిటో తేలుతుంది. దీనికి రాసే
సెన్సార్ స్క్రిప్టే సినిమాకి నకలు అవుతుంది. ఈ సెన్సార్ స్క్రిప్టుని బట్టే ఒక
బైండింగులా సినాప్సిస్, ఒన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ లు కలిపి
పుస్తకాలేసుకోవాలి. దాంతో స్క్రీన్ ప్లే పాఠాలు చెప్పుకోవాలి.
ఇదలా
వుంచుదాం. ఇప్పుడు ఈ పాత్ర గొడవేంటి?
అదెందుకు కథకుడి మాట వినదు? కథకుడి మాట పాత్ర వినడం లేదంటే అది కృత్రిమత్వాన్ని
చేధించుకోవాలని అనుకుని కావొచ్చు. ఈ తిరుగుబాటు సినాప్సిస్ లోనే చేయవచ్చు. ఉదాహరణకి,
హీరోయిన్ కి ఒక జీరో అయిన హీరో దొరకడంతో సినాప్సిస్ ప్రారంభమయ్యిందనుకుందాం. వీడితో ఆమె ఫస్టాఫ్ అంతా ఆడుకోవాలనీ,
ఇంటర్వెల్లోనే హీరో జీరో నుంచి హీరో అయి
ఆమెని పడగొట్టాలనీ భావించి కథకుడు సినాప్సిస్ రాసుకుపోతున్నాడనుకుందాం. కానీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరో సమస్యలో
పడ్డాక మొరాయిస్తే? నేనిక జీరోగా వుండనంటే వుండను, ఇప్పుడే హీరోగా మారిపోయి ఇక
హీరోయిన్ తో నేనే ఆడుకుంటానని మొండికేస్తే?
వీడెందుకిలా చేస్తున్నాడని కథకుడు ఆలోచిస్తే, రొటీన్ ఇంటర్వెల్ మలుపుని తప్పించుకుని
సహజ కథని ఇవ్వాలనే ప్రయత్నిస్తున్నాడని అర్ధమవుతుంది.. అప్పుడు హీరో దృక్కోణంలో
చూస్తే, సినాప్సి స్ ఫ్రెష్ గా కన్పిస్తుంది.
ఇంటర్వెల్ దాకా హీరోయిన్ తో ఉత్తుత్తి కథ నడపకుండా హీరో అడ్డుకుంటూంటే కథకుడు తన క్రియేటివ్
పంథా మార్చుకోక తప్పదు. కథకుడు కథని నిర్ణయించలేడు. ఏపాత్ర గురించైతే కథ వుందో, ఆ
పాత్రే దాని కథని నిర్ణయించుకుంటుంది. కథకుడు జస్ట్ చరిత్రకారుడి పాత్ర పోషిస్తూ ఆ
హీరో కార్యకలాపాలు గ్రంథస్థం చేయాలి తప్ప, కాదని పోతే కృత్రిమ కథలు, పాసివ్ పాత్రలు
తయారవుతాయి.
―సికిందర్