రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

609 : సందేహాలు -సమాధానాలు!




 Q :   ‘అ!’  మూవీ కథని  ‘ఐడెంటిటీ’ (2003) లోంచి ఎత్తేశారు. అవసరాల శ్రీనివాస్ ట్రాక్ ‘ప్రీ డెస్టినేషన్’ (2014) నుంచి కాపీ చేశారు. ప్రియదర్శి పాత్ర Ratatouille (2007) నుంచి కాపీ కొట్టారు...??
కె. శ్రవణ్, అసోసియేట్
 
A :   అలాగేమీ కన్పించడం లేదు. ‘ఐడెంటిటీ’ కథ వేరు. ఒక రెస్టారెంట్ కి ఓ పది మంది వచ్చి ఒకరొకరే హత్యకి గురవుతారు. ఇది 1939 లో అగథాక్రిస్టీ నవల ‘అండ్ దెన్ దేర్ వర్ నన్’ కాధారం. దీన్ని 1945196519741987, 1989 లలో ఐదుసార్లు తెరకెక్కించారు. నవల మొట్టమొదట ‘టెన్ లిటిల్ నిగ్గర్స్’  పేరుతో  విడుదలయ్యింది. హిందీలో 1969 లో మనోజ్ కుమార్ తో ‘గుమ్నామ్’ తీశారు. దీన్ని తెలుగులో 1974 లో ‘గుండెలు తీసిన మొనగాడు’ గా కాంతారావు నటించి నిర్మించారు. 1970 లో తమిళంలో ‘నడు ఇరవిల్’ గా, 2012 లో ‘ఆడుత్తత్తు’ గా తీశారు.  2015 లో కన్నడలో ‘ఆటగారా’ గా తీశారు. 2015 లో మళ్ళీ హిందీలో ‘ఖామోష్...ఖౌఫ్ కీ రాత్’ గా తీశారు. 
          క్రైం – మిస్టరీ నవలా సాహిత్యంలో ఇది ఆగథా క్రిస్టీ మరో గేమ్ ఛేంజర్ నవల.  హోటల్లో వున్న పదిమందీ ఒకరొకరే హత్యకి గురైతే, మరి చంపిందెవరనే పెద్ద పజిల్ తో ఈ కథ వుంటుంది. దీనికి ‘అ!’ తో సంబంధంలేదు. ఒక హోటల్ – లేదా రెస్టారెంట్, అక్కడికి కొన్ని పాత్రల రాక  అన్న సెటప్ తప్పితే.
          ‘ప్రీ డెస్టినేషన్’ హీరో కాలంలో వెనక్కి వెళ్లి 1975 లో ఒక బాంబు పేలకుండా చేస్తాడు. కాలంలో వెనక్కి ప్రయాణించే కథలతో సినిమా లెన్నో వున్నాయి. ‘ప్రీ డెస్టినేషన్’ లో ఏమిటంటే, ఫ్యామిలీ ఎలిమెంట్ ని కూడా జోడించారు. అతను గడిచిపోయిన  కాలంలో తల్లి దండ్రుల్ని కూడా కలుసుకోవాలనుకుంటాడు. తీరా తనే తండ్రి, తనే తల్లినని తెలుసుకుంటాడు.  ఏకకణ జీవి అమీబాలాగా తనే సంతానోత్పత్తి చేసుకోగలడు. ఇదంతా ఎలా జరిగిందో కాలంలో వెనక్కి వెళ్తూ చూపించుకొచ్చే కథ వుంటుంది. కానీ అవసరాల శ్రీనివాస్ పాత్రకి ఈ పాయింటుతోనే పోలిక. అతను కాలంలో వెనక్కి వెళ్ళడు. దేవదర్శిని వచ్చి అంటుంది, నువ్వూ నేనూ ఒకే మనిషికి రెండు రూపాలమని, అంతే.
          ఇక  పిక్సార్ సంస్థ తీసిన యానిమేషన్ కామిక్ ‘రాటచ్యుల్లీ’ (
Ratatouille ఫ్రెంచి పదాన్ని ఉచ్ఛారణ యాప్ రాటచ్యుల్లీ అనే పలుకుతోంది, అంటే అయోమయ నివృత్తి అట) లో కథ షెఫ్ (వంటవాడు లేదా బావర్చీ) కీ, అతడికి వంట నేర్పే ఎలుకకీ మధ్య వుంటుంది. దీన్నుంచి స్ఫూర్తి పొంది, చేపా ఇంకా చెట్టూ కలిపి ప్రియదర్శి తో చేసి వుండవచ్చు.  

 Q :   మీ బ్లాగులో రివ్యూలు మిస్ అవుతున్నందుకు నాతో పాటు చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ‘శివ’ సినిమా కాకుండా మూడంకాల నిర్మాణంలో పక్కాగా వున్న ఓ పది ప్రముఖ సినిమాల పేర్లు మీ బ్లాగులో చెప్తారా? ఏ భాషా చిత్రమైనా, ఏ దేశ చిత్రమైనా సరే!
 
మహేష్ రెడ్డి, డైరెక్షన్ / రైటింగ్
 
A :   భజరంగీ భాయిజాన్, దంగల్, ఒక్కడు, జయం, నువ్వు –నేను, పాండురంగ మహాత్మ్యం, ప్రముఖం కాకపోవచ్చు కానీ తమిళ 24, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, టైటానిక్, ఫస్ట్ బ్లడ్... ఇలా ఓ పది చెప్పుకోవచ్చు. ఇతర దేశాల సినిమాలంటే హాలీవుడ్, కొరియన్, చైనీస్ దేశాల సినిమాలు కమర్షియల్స్ గా వుంటాయి. మిగిలిన దేశాల సినిమాల గురించి చెప్పలేం.  ఎక్కువగా పరిమిత మార్కెట్ – ప్రేక్షకులు వుండే వరల్డ్ మూవీస్ (యూరోపియన్) కేటగిరీకి చెందుతాయి. ఒకటి అర్ధంజేసుకుంటే  ఏమిటంటే, వరల్డ్ మూవీస్ వేరు, కమర్షియల్ సినిమాలు వేరు. భారతీయ కమర్షియల్ సినిమాలు, హాలీవుడ్, కొరియన్ సినిమాలు మూడూ విస్తృత మార్కెట్ ని కలిగి వుండే పక్కా వ్యాపార సినిమాలు. కొరియన్ సినిమాలు కమర్షియల్ గా వుండే అమెరికన్ మార్కెట్ ని కూడా ఆక్రమించాయి. అందువల్ల ప్రధాన స్రవంతి సినిమాలకే  తెలుగులో మార్కెట్ అని గ్రహించి అలాటి వ్యాపార సినిమాలే తీసుకోవాలి. వ్యాపార సినిమాల రంగంలో వుంటూ ఎక్కడో పనికిరాని వరల్డ్ మూవీస్ ఆలోచనలు, షార్ట్ ఫిలిమ్స్ ని పొడిగించే ఆలోచనలు చేస్తే సర్వనాశనమే
కొనితెచ్చు
కుంటారు. హాలీవుడ్ లో దేశదేశాల నుంచి వచ్చి స్థిరపడిన నిర్మాతలు, నటులు, దర్శకులు,  రచయితలు, సాంకేతికులూ వుంటారు.  వీళ్ళందరూ హాలీవుడ్ ఏకైక మంత్రం వినోదాత్మక కమర్షియల్  సినిమాలు తీయడానికే ఏకత్రాటిపై కదం తొక్కుతూంటారు. టాలీవుడ్ లో అలాకాదు. వివిధ జిల్లాలనుంచి, లేదా ఓవర్సీస్ నుంచి వచ్చే కేవలం తెలుగు వాళ్ళే,  ఒకళ్ళు వరల్డ్ మూవీస్ అంటూ దూసుకొస్తారు,  ఇంకొకళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అని తోసుకుంటారు, మరోకళ్ళు ఇండీ ఫిలిమ్స్ అని నెట్టి పారేస్తూంటారు... వీటికి పైసలొస్తాయనుకుంటారు. అందరూ కలిసి తోపులాటతో టాలీవుడ్ ని మంటగలిపి, చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు సపరేట్ గా ఖాళీవుడ్ పెట్టుకుని, టాలీవుడ్ లో తలదూర్చకుండా  ఇంటలెక్చువల్ సినిమాలతో కోరికలు తీర్చుకోవచ్చు. అసలు యూరప్ కే వెళ్ళిపోయి వరల్డ్ సినిమాలు తీసి  తృప్తి తీర్చుకోవచ్చు. 
          చెప్పొచ్చేదేమిటంటే, మూడంకాల కమర్షియల్ నిర్మాణంలో ప్రముఖ విదేశీ సినిమాలేమిటీ అని అమెరికా, దక్షిణ కొరియా,  యూరోపియన్, ఇరాన్, జపాన్ వగైరా వగైరా దేశాల సినిమాలన్నీ కలగలిపేసి చూడకూడదు. కేవలం హాలీవుడ్, కొరియన్ మూవీస్ వరకే హద్దులు గీసుకుని ఆ హద్దుల్లో వుండి అవే చూస్తూంటే చాలు. కొరియన్ మూవీస్ ఎన్ని కాపీ కొట్టినా హిట్ కావు, అది వేరే సంగతి. ఇక హాలీవుడ్ సినిమాల్ని కాపీకొడితే ఇక్కడే ఆఫీసులు తెరచిన హాలీవుడ్ వాళ్ళు  ఇప్పుడు  పట్టుకుంటారు. బాలీవుడ్ లో పెద్దపెద్ద వాళ్ళనే పట్టుకున్నారు.
          ఇండియన్ కమర్షియల్ సినిమాలు, హాలీవుడ్, కొరియన్ సినిమాలు యూరోపియన్ దేశాల సినిమాల్లాగా ఇంటలెక్చువల్ సినిమాలుకావు. కాబట్టి తెలుగులో ఇంటలెక్చువల్స్ అవసరం లేదు, కాస్త ఇంటలిజెంట్ గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తే చాలు- ఒక అమీతుమీ, ఒక ఘాజీ లాంటివి తీసుకోవచ్చు. ఒక్క కమర్షియల్  సినిమాలే మూడంకాల నిర్మాణంలో వుంటాయి. ఎందుకంటే కమర్షియల్ గా  ఆడాలి కాబట్టి. ఇతర వరల్డ్, ఇండీ, షార్ట్ సినిమాలు వగైరాలు రెండకాల్లోనే వుంటాయి. ఆదిమధ్యంతాల్లో మధ్యమం వుండదు. ఆది, అంతం రెండే వుంటాయి. ఎందుకంటే, మేధావితనం ప్రదర్శించుకోవాలి కాబట్టి దాని తాలూకు ఎడమ మెదడు ఒక్కటే పనిచేసి అలా సగం మెదడు సినిమాలు తయారవుతాయి. మూడంకాల (త్రీ యాక్ట్ స్ట్రక్చర్) కమర్షియల్ వాళ్ళకి కుడి మెదడు కూడా పనిచేస్తుంది. ఇది తెలీక కమర్షియలేతరులు అదీ ఇదీ అంతా ఒకటే, మనమంతా భాయీ భాయీ అని ఆవురావురంటూ వచ్చేసి,  ప్రేక్షకుల చేత హాహాకారాలు పెట్టిస్తూంటారు. నిర్మాతల కళ్ళల్లో కారాలు.
          ముడి ఫిల్ము వున్న కాలంలో బి. నరసింగ రావు, శ్యాం బెనెగళ్, రుత్విక్ ఘటక్,  గౌతమ్ ఘోష్, గోవింద్ నిహలానీ లవంటి వాస్తవిక సినిమాలు తీసే ఆర్ట్ సినిమా దర్శకులు,  కమర్షియల్ సినిమాల వైపే తొంగి చూసే వాళ్ళు కాదు. రెండు రంగాలూ  విడివిడిగా వుండేవి. నటులు కూడా విడివిడిగా వుండే  వాళ్ళు. ఎప్పుడయితే ఆర్టు సినిమాల ఉద్యమం అంతరించి చాలా కాలం గ్యాప్ వచ్చిందో, ఇక ప్రేక్షకుల్ని ఆర్ట్ సినిమాలవైపు ఆకర్షింపజేసుకోవడానికి, శ్యాం బెనెగళ్ పూనుకుని, బాలీవుడ్ స్టార్స్ ని పెట్టి తీయడం ప్రారంభించారు. గోవింద్ నిహలానీ అనుసరించారు. దీంతో వీటికి క్రాసోవర్ (ఆర్టు నుంచి కమర్షియల్ కి క్రాసోవర్ అవడం) సినిమాలనీ, కమర్షియలార్టు సినిమాలనీ కొత్త పేరుపెట్టారు. ఇక అప్పుడప్పుడే మల్టీ ప్లెక్సులు రావడంతో, కొత్తకొత్త దర్శకులకి ఇదే బాటలో చిన్నచిన్న బడ్జెట్ లతో సినిమాలు తీసే వీలుకలిగింది. అప్పుడు మల్టీ ప్లెక్స్ సినిమాలుగా పేరు మారింది. అప్పుడివి కూడా క్వాలిటీతోనే వుండేవి.
          కానీ ఎప్పుడైతే ముడి ఫిల్ముపోయి డిజిటల్ వచ్చిందో, ఇక సినిమాలంటే ఓనమాలు తెలీని యంగ్ బ్యాచీలు షార్ట్ ఫిలిమ్స్ పట్టుకుని దిగిపోయారు. ముడి ఫిల్ము వున్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ దర్శకులు కూడా వేరే వుండే వాళ్ళు. ఒక అవగాహనతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, యూట్యూబు లేనికాలంలో  దేశ విదేశాల్లో ఫెస్టివల్స్ లో మాత్రమే ప్రదర్శిస్తూ గొప్ప వాళ్ళయి పోయేవాళ్ళు. డిజిటల్ వచ్చాక, గల్లీకొక షార్ట్ ఫిలిం తీయడం, యూ ట్యూబులో పారెయ్యడం, పారేశాక వచ్చిన  వ్యూవ్స్ లెక్కెట్టుకుని టాలీవుడ్ లో పడ్డం.
          చాలావరకూ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళకి వరల్డ్ మూవీస్ తో అక్రమ సంబంధాలుంటాయి. అవే చూస్తూంటారు. హాలీ – బాలీ -  టాలీవుడ్ సినిమాలు చీప్ గా కన్పిస్తాయి. కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ అనుభవాల్ని వరల్డ్ మూవీస్ కి పెంచి, గొప్పగా చూపించబోతారు.  ఇదెంత కాలం సాగదు. షార్ట్ / వరల్డ్ – కమర్షియల్ ఒక వొరలో ఎప్పుడూ ఎక్కడా ఏ భాషలోనూ ఇమడలేదు. వాళ్ళంతా ముందు కమర్షియల్ సినిమాలకి పనిచేసి అవి తీయడం తెలుసుకోవడం, కమర్షియల్ సినిమాలకి పని చేసేవాళ్ళు కూడా పొరపాటున కమర్షియల్ సినిమాలు తప్ప,  ఇతర కేటగిరీలు చూడకపోవడం ఒక్కటే చెయ్యాలి. పది దేశ విదేశ సినిమాల పేర్లడిగినందుకు,  పాలూ నీళ్ళు వేరుచేసి చెప్పడానికే ఇదంతా.

 Q :   తొలిప్రేమ రివ్యూ ఇవ్వలేదు, అ! రివ్యూ ఇవ్వనన్నారు. కనీసం క్లుప్తంగా అదేంటో చెప్పండి.
కొందరు పాఠకులు
 A :   తొలిప్రేమ చూడలేదు. అ! గురించి క్లుప్తంగా కాన్సెప్ట్ వరకే చూస్తే -
          ఆమె బాల్యం నుంచీ పురుష ప్రపంచంలో ఎదుర్కొన్న బాధాకర అనుభవాలు –లైంగిక హింసా వికటించి, ఆమెలో మానసికంగా మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపిడి) కి దారితీశాయి –‘అపరిచితుడు’ లాగా.
          ఇక ఆమె ఆ పుట్టిన రోజు కొందర్ని చంపి కక్ష తీర్చుకుని, చచ్చిపోవాలనుకుంది.
          1. మగాళ్ళంటే ఆమె దృష్టిలో మాయగాళ్ళు. అందుకని తన ఎంపిడి తాలూకు చిత్త భ్రాంతితో, మాయలు చేసే మేజీషియన్ ని ఎమోషనల్ గా సృష్టించుకుని, వాడితో ఆడుకుని,  జోకర్ని చేసి కసి తీర్చుకుంది.
          2. తను కోల్పోయిన తల్లిదండ్రుల్ని కలుసుకోవాలన్న కాంక్షతో, కాలంలో వెనక్కి వెళ్ళే ప్రయత్నంతో సైంటిస్టు (అవసరాల) ని సృష్టించుకుంది. కానీ తల్లిదండ్రులంటే ఆడా - మగ. మగవాడి అవసరం ఎక్కడుంటే అక్కడ అతణ్ణి తొలగిస్తూ,  ఆడపాత్రనే (దేవదర్శిని) ప్రవేశపెట్టుకుని, నేనే నీ రెండో రూపాన్నీ అంటూ సైంటిస్టుకి చెప్పించింది. నీకు తల్లిదండ్రు లేమిటి, నువ్వే తండ్రివి - నువ్వే తల్లివి, మగాడి అవసరం లేకుండా ఏక కణ జీవి అమీబాలాగా కణభజన చేసుకుంటే,  నీదే సంతానమన్న స్వైరకల్పన.
          3. మగవాళ్ళ పట్ల అసహ్యంతోనే లెస్బియన్ పాత్రల్ని సృష్టించుకుంది. ఆడదానికి ఇక మగాడి అవసరమే లేదని, వాణ్ణి నిషేధించాలనీ ధిక్కార స్వరం. మాతృస్వామ్య వ్యవస్థ కోరుకుందేమో బహుశా.
          4. తనని క్రేజీగా (రేజీనా పాత్ర) ని సృష్టించుకుని, ఆడపిల్లంటే ఇక తెగించాల్సిందే, అన్నీ మరిగి చెడిపోయి – కోన్ కిస్కా గాళ్ళని దోచుకుని బతికేయాల్సిందే నన్నఇంకో ధిక్కారం. దీనికి వత్తాసుగా అక్కడ దెయ్యం తాలూకు నెక్లేసు మెళ్ళో వేసుకోమని చెట్టు తొర్రలో దొరికింది.
          5.  ఒక ఇల్లుండి, అందులో గృహిణిగా సంసారం చేసుకునే అదృష్టానికి నోచుకోకుండా మగప్రపంచం సమాధి  చేసిందా కలల్ని(ఇంటిని కూల్చి అదే  రెస్టారెంట్ కట్టిన వైనం లోంచి). ఆ ప్రతీకారానికి ప్రతిరూపమే ఆ పీడించే దెయ్యంగా మారిన  తను.
          6. ఆఖరికి వంట చేసుకునే స్త్రీ సహజ లక్షణాన్ని కూడా చంపేసుకుంది. అందుకని వంటే తెలీని తన ప్రతిరూపంగా చెఫ్ (ప్రియదర్శి) తో నానా పాట్లు.
          ఈ ఆరు ఎమోషన్స్ ఆమె అణగారిపోయిన స్త్రీత్వపు శిథిలాల్ని పెకిలించుకొచ్చి బాహ్యంగా నర్తించాయి. ఆ పాత్రలన్నీ ఆమె భావోద్వేగాల ప్రతీకాలంకారాలే (metaphors). చివరికి వాటన్నిటినీ కాల్చి పారేసి, తనూ కాల్చుకుని చచ్చిపోయింది.
          మగప్రపంచంలో జీవితమంతా లైంగిక హింసే / వివక్షే  మోసిన బాధితురాలి ఆక్రందన. వయసుతో నిమిత్తంలేకుండా ఇదీ ఇప్పుడున్న కాలం. దీన్ని వరల్డ్ మూవీ దృష్టితో చూడాలి.
          జాతీయ పత్రికలు  మంచి మార్కులేశాయి : హిందూస్తాన్ టైమ్స్ 5 / 5, టైమ్స్ ఆఫ్ ఇండియా 4 / 5, ఇండియన్ ఎక్స్ ప్రెస్ 4 / 5,  ఇండియా టుడే 3 / 5,  ఫస్ట్ పోస్ట్  3 / 5... ది హిందూ రేటింగ్స్ ఇవ్వదు. బెస్ట్ అని చెప్పింది.

సికిందర్