రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 20, 2018

608 : స్పెషల్ ఆర్టికల్




          స్క్రిప్టు రాయడానికి కూర్చుంటే మూడ్ రాదు. గది బాగా లేదనో, సౌకర్యాలు బాగా లేవనో, ఇంకేదో తగ్గిందనో మూడ్ రాదు. ప్రతిఘటన వల్ల రాని మూడ్ ఇది. నచ్చని బాహ్యపరిస్థితుల పట్ల ప్రతిఘటన. ఇది తనకే నష్టం. ప్రతిఘటనతో బోలెడు స్కిల్స్ ని చంపుకుని కూర్చోవడం. ఇది కండిషనల్. రాయాలంటే  ఇంకేదో  వుండాలనే కండిషన్ వల్ల మూడ్ రాకపోవడం. ఇలాకాక, బద్ధకం వల్ల మూడ్ లేకపోవడం వుంటుంది. ఇది అన్ కండిషనల్. దీనికి  బాహ్య పరిస్థితులతో సంబంధం  వుండదు. ఇది లాభం కల్గించేది.  బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా,  రాయాలనుకున్న విషయం మీద మెదడు దాని పని అది చేస్తూనే వుంటుంది. అదే ప్రతిఘటనతో  మూడ్ రాకపోవడంలో ఆలోచనలు కూడా బంద్ అయిపోతాయి. బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా  మెదడులో ఆలోచనలు పోగు పడిపోతూనే వుంటాయి.  అంతే గాక ఆలోచనలని పొదగడం కూడా వుంటుంది. మూడ్ వచ్చేటప్పటికల్లా మెదడు ఆలోచనల్ని పొదిగి పొదిగి పిల్లని బయటికి తీస్తుంది. అప్పుడు రాసుకుపోవడం సులభంగా, వేగంగా జరిగిపోతుంది. బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా మెదడు గుడ్లు పెట్టక మానదు. ఆ గుడ్లని పొదగకా మానదు. ఆ పిల్లని బయటికి తీయకా మానదు. బద్ధకం వల్ల రాని  మూడ్ ని బలవంతంగా తెచ్చుకుని రాసే ప్రయత్నం చేస్తే మెదడు మొరాయిస్తుంది. అప్పుడు రాయడానికి ఆలోచనలు సరీగ్గా కుదరవు. పూర్తి చేయడానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. 

         
మెదడు ద్విపాత్రాభినయం కూడా చేస్తుంది. ఒకవైపు పూర్తి చేయాల్సిన పని గురించి ఆలోచిస్తున్నా, మరో వైపు ఆ పనిని  వాయిదాలు వేయడానికి సాకులు వెతుకుతుంది.  ఒక సినిమా గురించి ఏదో రాస్తూ, ఆ సినిమా ఎప్పుడు విడుదలయ్యిందా అని నెట్ లో సెర్చి చేస్తూంటే, అక్కడ ఒక గాసిప్పో ఇంకేదో  ఆసక్తిగా కన్పిస్తుంది. అది చదువుకుంటూ అసలు విషయాన్ని పక్కన పడేస్తుంది మెదడు. ఆ రాయడం కంటే ఈ చదువుకోవడమే  హాయిగా అన్పిస్తుంది  మెదడుకి. ముందా పని  పూర్తి చెయ్ అని మెదడు గుర్తుచేస్తే,  ఆకలిగా వుందిగా, తిన్నాక పూర్తి  చేయవచ్చులే అని  సాకులు వెతుకుతుంది మెదడే.

          మెదడుని జయించగల వాడే వృత్తి రచయిత. వృత్తి రచయితకి అసలు మూడ్ తో పనేముంది? సినిమా కెళ్ళి  బయట వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో టకటకా టైపు చేసేసుకుంటాడు ఐడియాల్ని. సబ్జెక్టు మీద ఎక్కడ ఎప్పుడు ఏ ఆలోచన తట్టినా ఫోన్లో వాయిస్ రికార్డర్ లో  చెప్పేస్తూంటాడు. హైదరాబాద్ - విజయవాడ హైవే మీద నార్కెట్ పల్లి దగ్గర్లో  హోటల్ వివేరా అని వుంటుంది. అక్కడొక వ్యక్తి  బైక్ మీద వచ్చాడు. కాఫీ తెచ్చుకున్నాడు. కాఫీ తాగుతూ బ్యాగులోంచి పెన్సిలు, రబ్బరు, పేపర్లు తీసి రాయడం మొదలు పెట్టాడు. రాస్తూ చెరిపేస్తూ మళ్ళీ రాస్తూ వున్నాడు. మీరేం చేస్తూంటారని అడిగితే, టీవీ సీరియల్ అని చెప్పాడు. డిస్టర్బ్ చేయకుండా దూరంగా నించుని గమనిస్తోంటే, కాఫీ పూర్తయ్యే వరకూ రాసుకోవడం చేసి, పేపర్స్ పెన్సిలు రబ్బరూ తిరిగి  బ్యాగులో పెట్టేసుకుని,  బైక్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అతడికి మూడ్ తో పనిలేదు, ఎప్పుడు పడితే అప్పుడు రాయగలడు. ప్లేస్ తో పనిలేదు, ఎక్కడ పడితే అక్కడ రాయగలడు. టైంతో పనిలేదు, ఐదు నిముషాలు వీలుంటే ఆ ఐదు నిమిషాలూ రాసెయ్యగలడు. బైక్ మీద ప్రయాణిస్తూ కూడా పనిచేయగలడు, రాస్తున్న విషయం  గురించిన ఆలోచనలతో. అతను వృత్తి రచయిత. 

          ఒకసారి స్క్రీన్ ప్లే గురు సిడ్ ఫీల్డ్ సినిమా కంపెనీలో పని చేస్తున్నప్పుడు, కాళ్ళు టేబుల్ మీద ఎత్తి పెట్టుకుని, కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. ఆ నిర్మాత ఆఫీసులో ఎవరేం చేస్తున్నారో కనిపెట్టడానికి బూట్లు తీసేసి  స్లిప్పర్స్ వేసుకుని పిల్లిలా వచ్చేవాడు. అలా వచ్చేసి సిడ్ ఫీల్డ్ అలా లేజీగా కూర్చుని కన్పించడంతో పట్టేసుకున్నాడు. ఫైరయ్యాడు. తను కిటికీ లోంచి చూస్తూ సబ్జెక్టు గురించే ఆలోచిస్తూ కూర్చున్నానని సిడ్ ఫీల్డ్  ఎంత చెప్పినా విన్పించుకోలేదు. సబ్జెక్టు గురించే ఆలోచిస్తున్నట్టు ఎలా నిరూపించుకోవాలి?  చేసిన ఆలోచనల్ని తీసి చూపించలేం కదా?  ఈ తగాదా తేలలేదు. రచయిత ఖాళీగా కన్పిస్తే ఇతని పనై పోయిందనో, పనికిరాడనో అనుకుంటారు. అతను రాయాల్సిన ఆలోచనల్నే భారంగా మోస్తూ వుంటాడని అర్ధంజేసుకోరు.

బ్రేక్ లేదు
          వృత్తి రచయిత అనేవాడికి జీవితంలో బ్రేక్ అనేది వుండదని అంటారు. రచన నుంచి విరామం తీసుకుని విహారయాత్ర కెళ్ళినా ఆలోచనలు రచనల గురించే వుంటాయి. బ్రేక్ లేదు. ఏ మెదడుతో వెళ్ళిన వాడు అలాగే ఆ మెదడుతోనే వచ్చి మళ్ళీ రచన చేస్తాడు. ఒక సబ్జెక్టు మీదే పనిచేసే వృత్తి రచయితలకే ఇలావుంటే, ఇక ఒకేసారి ఎక్కువ సబ్జెక్టులు చేయాల్సి వస్తే? ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయిత, క్రిమినల్ లాయర్ పెర్రీమేసన్ పాత్ర సృష్టి కర్త,  ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ కి నాలుగు వేల ఎకరాల ఎస్టేట్ వుండేది. అక్కడే వుంటూ ఏడుగురు సెక్రెటరీలకి  ఏకకాలంలో ఏడు నవలలు డిక్టేట్ చేసేసే వాడు. మరోవైపు, ఒక పేరు మోసిన లాయర్ గా పేదల కోసం ఉచిత న్యాయసంస్థ స్థాపించి, వివిధ కోర్టుల్లో కేసులు పోరాడేవాడు. 

          రచనలతో కూర్చుని మానసిక, కేసులతో బయట తిరిగి భౌతిక - దినచర్యలు రెండూ సునాయాసంగా నిర్వహించేవాడు. ఇదెలా సాధ్యం? ఆయన మెదడు ప్రత్యేకంగా ఏమైనా తయారైందా? అదేం కాదు. అందరి మెదడు లాంటిదే. కాకపోతే దాదాపు మనుషులందరూ పది శాతం  మెదడునే వాడుకుని పనిచేస్తారు, గార్డెనర్  ఇంకొంచెం ఎక్కువ వాడుకున్నాడు. పనిచేయించుకుంటే మెదడుకి అసాధ్య మనేదేదీ లేదు. ఇక సాధారణంగా రచయితలు రాసే పనుంటే తిరగలేరు, తిరిగే పనులుంటే రాయలేరు. ఏకకాలంలో ఏడు నవలలనే సంగతి పక్కన పెడితే, ఏడు పేజీలు  రాయడానికే ఎన్నో వాయిదా లేస్తూంటారు. వృత్తి రచయితలిలా వుండరు. 

          ఈ వాయిదాలేయడం పైన చెప్పుకున్నట్టు ద్విపాత్రాభినయం చేసే మెదడు (సాకులు వెతికే) రెండో స్వభావమైతే, దీనికి బద్ధకం కూడా కారణమవుతుంది. ఐతే  బద్ధకం వల్ల కాకుండా,  మెదడు రెండో స్వభావంతో సంబంధం లేకుండా, బుద్ధిపూర్వకంగా వాయిదా వేస్తే?  అప్పుడు మెదడు పొదిగే పనిని ఇంకా బలంగా యాక్టివేట్ చేసుకుంటుంది. బుద్ధిపూర్వకంగా రాయడాన్ని ఆపాం కాబట్టి, రాసే మూడ్ లో మంచి వూపు మీదున్న మెదడు, ఆ అవాంతరానికి అంతే దీటుగా సమాధానమిస్తూ పని చేస్తుంది. అంటే ఆలోచనల్ని మరింత బలంగా పొదగడం చేస్తుంది. బద్ధక స్థితిలో ఆలోచనల్ని పొదగడం పాసివ్ చర్య అయితే, కావాలని రాయడం ఆపిన స్థితిలో ఆలోచనల్ని పొదగడమనేది యాక్టివ్ చర్య. 

          బద్ధకంతో మూడ్ లేక అసలే రాయకపోవడం, చురుగ్గా రాస్తున్నప్పుడు ఇంకేదో దానిమీదికి దృష్టి మళ్ళి రాయలేకపోవడం రెండూ వేర్వేరు. మొదటి దాని విషయంలో మెదడు ఆలోచనలని పొదుగుతుంది. రెండో దాని విషయంలో రాయడానికి చేస్తున్న ఆలోచనలని ఆపేస్తుంది. పైన చెప్పుకున్నట్టు ఏ గాసిప్సో చదువుకుంటూ కూర్చుంటుంది. 

          గాసిప్స్ వరకూ చదువుకుంటూ కూర్చుంటే  ఫర్వాలేదు, అదేదో పూర్తయ్యాక మళ్ళీ రాసేపని మీదికి వస్తుంది మెదడు. కానీ రాస్తూరాస్తూ వుండగా, చెయ్యి స్మార్ట్ ఫోను మీద పడిందా, ఇకంతే. బుక్కయిపోతుంది మెదడు. దాన్నుంచి విమోచనం పొందదు.  సోషల్ మీడియాలో మునకలేయడం మొదలెడుతుంది. ఏవేవో పోస్టులు చదివి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అంతుండదు. వూరుకోక తానో పోస్టు పెట్టేస్తుంది- ఈ రోజు నేను చాలా లక్కీ అని.  దీనికి ఎన్ని లైకులు వచ్చాయా అని పదేపదే చూసుకోవడం మొదలెడుతుంది. ఎన్ని కామెంట్లు వచ్చాయా అని చీటికీ మాటికీ చూసుకుంటుంది. రాసుకుంటున్నప్పుడు స్మార్ట్ ఫోన్ మీద చెయ్యి పడిందా, ఇక రాసేపని గోవిందా.

సోషల్ మీడియా నిషా!
          కొత్త రచయితలు ఇంకో ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటారు. తమగురించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం. ఆ రకమైన పోస్టులూ, సెల్ఫీలూ నిత్యం పెట్టుకోవడం. రచయితలుగా విజిబిలిటీ పెంచుకోవడం. ఎక్కడ చూసినా తామే కన్పించడం. ప్రపంచ ప్రసిద్ధ థ్రిల్లర్  రచయిత జేమ్స్ హేడ్లీ ఛేజ్ మీడియాలో ఎక్కడా కన్పించే వాడే కాదు. జీవితకాలమంతా ఇంటర్వ్యూలే ఇవ్వలేదు. ఒకటే చెప్పే వాడు – ప్రపంచవ్యాప్తంగా ముప్పయ్యారు భాషల్లో నా నవలల్ని కోట్లాది మంది చదువుతూండగా, పదేపదే రీప్రింట్లు అవుతూండగా, నేనెందుకు పాఠకుల ముందుకొచ్చి నాగురించి చెప్పుకోవాలి? వాళ్ళకీ,  వాళ్ళు చదివే నా నవలలకీ మధ్య నేనెందుకు పానకంలో పుడకలా? నవలలు అమ్ముడుపోకపోతే కదా వాళ్ళ ముందుకెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలతో పబ్లిసిటీ చేసుకోవాలి? – అని నిర్మొహమాటంగా అనేవాడు. 

          షాడో మధుబాబుదీ  ఇదే పధ్ధతి. మొన్న మొన్నటి వరకూ ఆయనెలా వుంటారో ఎవరికీ తెలీదు. ఎంత పాపులర్ అయినా నవలల మీద ఫోటోలే వేసుకోలేదు. పేరొచ్చాకైనా నేనే మధుబాబు నంటూ ముందుకూ  రాలేదు. అజ్ఞాతంగా వుంటూ ఎన్నో షాడో నవలల్ని సృష్టిస్తూ లక్షలాది మంది పాఠకులని నిలుపుకున్నారు. అంటే రాసింది పాఠకుల్లోకి వెళ్ళాలే గానీ, రచయిత కాదు. రచయిత ఫేసుని, కబుర్లనీ ఎవరూ కేర్ చెయ్యరు- నువ్వేం రాశావయ్యా అనే చూస్తారు. ఈ విజిబిలిటీ హీరోహీరోయిన్లకి, దర్శకులకి, నిర్మాతలకీ సినిమా పబ్లిసిటీ కోసం అవసరం. కదలిక వాళ్ళకవసరం. రచయితకి కదలిక కాదు, తెర వెనుక కదలకుండా కూర్చుని రాయడం అవసరం. పరుచూరిబ్రదర్స్, సత్యానంద్, దివాకర్ బాబు, పోసాని, తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరాం వంటి రచయిత లెవరూ పబ్లిసిటీ చేసుకుని పాపులర్ అవలేదు. రాయగల్గి పాపులర్ అయ్యారు. కొత్త రచయితలు సినిమా అవకాశం రాగానే సోషల్ మీడియాలో ధూం ధాం చేసేస్తూంటారు. సక్సెస్ కొట్టామని పోస్టులు పెట్టేస్తూంటారు. వాళ్ళేం సక్సెస్ కొట్టలేరు. ఈ ప్రపంచంలో విజయాలనేవి లేవు, త్యాగాలే వున్నాయి. అలాగే ఆయా నిర్మాతలు త్యాగం చేస్తేనే ఒక రచయితకి ఒక అవకాశం, అంతే. అది తన విజయం కాదు. వాస్తవాల పునాది మీద నిలబడి రచయితలు  కూడా ఆలోచించకపోతే ఎలా? 

          ఇతర రచయితలు రాసింది పత్రికలకి పంపుకుంటారు, లేదా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, లేదా సొంత బ్లాగులో పెట్టుకుంటారు. సినిమా రచయిత ఫైలు తయారు చేసుకుని నిర్మాతల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ఫైలు ఇంకెప్పుడు తయారుచేసుకుంటారు – సోషల్ మీడియాతో ఏకాగ్రత చెదరగొట్టుకుంటూ! 

          సోషల్ మీడియాని వృత్తిరీత్యా వాడుకుంటే అది వేరు. స్కిల్స్ పెంచుకోవడానికి నిర్మాతలతోనో,  దర్శకులతోనో, సీనియర్ రచయితలతోనో సమాచార వినిమయం కోసం  సోషల్ మీడియాని పరిమితం చేసుకుంటే ఏకాగ్రతతో వుండగల్గుతారు. ఇదివరకంటే నిర్మాతల, దర్శకుల, సీనియర్ రచయితల గేట్ల దగ్గర కాపేయాల్సి వచ్చేది.  ఇప్పుడలా  కాదు, ఆన్ లైన్ లో స్పందించి తమ విలువైన సూచనలివ్వడానికి వాళ్ళకేం  అభ్యంతరం వుండదు. అలా వాళ్ళ దగ్గర విజిబిలిటీ పెంచుకోవచ్చు. ఇది వదిలేసి వూరికే సోషల్ మీడియాలో వెలిగిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం కొత్త రచయితలు మలిగిపోతారు. సోషల్ మీడియాలో అంత  యాక్టివ్ గా  వుండే కొత్త రచయితలు వృత్తిగతంగా ఏం రాశారా అని చూస్తే ఏమీ కన్పించదు. వృత్తి రచయితలైతే రాసిన కట్ట కనపడాలి, సోషల్ మీడియాలో డప్పులు కాదు. అయితే, పక్కాగా సినిమా ఫీల్డులో స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళతో ఇలా వుండదు. అత్యధికశాతం స్ట్రగుల్ చేస్తున్న రచయితలకి, అసోషియేట్స్ కి, అసిస్టెంట్స్ కి ఫేస్ బుక్ ఎక్కౌంట్ కూడా వుండదు. వుంటే నామమాత్రమే.  వాళ్ళ ధ్యాసంతా  క్రియేషన్ మీదే,  రిక్రియేషన్ మీద కాదు. అనుత్పాదక కార్యకలాపాల మీద కాదు. షూటింగ్ నుంచి అర్ధరాత్రి రూముకొచ్చినా రాసుకుంటారు, లేదా ఓ సినిమా చూస్తారు.

కుడి ఎడమల కుసుమ పరాగం!
          ఒకసారి చెన్నై సన్ టీవీ ఆఫీసు రిసెప్షన్ లో పక్కనే ఒక పెద్దాయన లాప్ టాప్ మీద బిజీగా వున్నాడు. అది తమిళ సీరియల్ స్క్రిప్టులా వుంది. ఆయన ఇటు వైపు చూసి, ఏం పనిమీద వచ్చారని అడిగాడు. ‘చివరకు మిగిలేది’ శాటిలైట్ హక్కులు అమ్మడానికి వచ్చినట్టు చెప్తే, బయటికి తీసికెళ్ళి టీ ఇప్పించాడు ( ‘చివరకు మిగిలేది’ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ ఎం ఆర్ కొండలరెడ్డి కోరిక మేరకు వెళ్ళాల్సి వచ్చింది).  టీ తాగుతూ ‘చివరికిమిగిలేది’ గురించీ, అందులో సావిత్రి గారి నటన గురించీ గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. సార్, ఇప్పుడు కూడా మీరింత టైం వేస్ట్ చేయకుండా రాస్తున్నారే అంటే, ‘వయసులో వున్నప్పుడు అబ్బిన డిసిప్లిన్. ఇప్పుడు రిలాక్స్ అయి లీజర్ గా రాసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. శరీరాన్ని కష్ట పెట్టుకోవాల్సి వస్తోంది. ఇది శిక్షో భిక్షో తెలియడం లేదు’ అన్నాడు.

          క్రమశిక్షణ పురుగు దొల్చిందంటే అది శిక్షలా అన్పిస్తూనే, భిక్షలా కూడా ఊరిస్తూ చివరిశ్వాస  దాకా నడిపిస్తుంది. క్రమశిక్షణే బద్ధకానికి విరుగుడు. క్రమశిక్షణే ఏకాగ్రతకి ఎరువు. క్రమశిక్షణే ఉత్పాదకతకి ఇంధనం. ఇందుకే వృత్తి రచయిత అనుత్పాదక కార్యకలాపాలకి దూరంగా వుంటాడు, లేదా బాగా పరిమితం చేసుకుని, కాసేపు ఉపశమనానికి వాడుకుంటాడు. వృత్తి రచయిత రాసింది ప్రజల మధ్యకి పంపుతాడు, తను వెళ్ళడు. ఇంకా రాయడంలో తలమునలకై వుంటాడు. మధుబాబు ఎంత పేరొచ్చినా  దాన్ని ఎంజాయ్ చేయలేదు. పేరొచ్చిన సినిమా రచయితలు కూడా ఎంజాయ్ చేయరు. అంత తీరిక వుండదు. అంతేగాక,  ఎంజాయ్ చేయడానికి అదేమన్నా తమ గొప్పా? పాఠకులో ప్రేక్షకులో ఒప్పుకుని పెట్టిన భిక్ష! 

          ఇలా వృత్తి రచయిత లక్షణాల గురించి, అవసరాల గురించీ  చెప్పుకున్నాక, ఇప్పుడు తిరిగి బుద్ధిపూర్వక బద్దకం విషయానికొద్దాం. రాయలేక బద్ధకించినా దాని గురించే ఆలోచిస్తూ వుంటామని చెప్పుకున్నాం. అలాగే బుద్ధిపూర్వకంగా రాయడం ఆపడం గురించి కూడా చెప్పుకున్నాం. దీన్ని ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. దీన్ని బుద్ధిపూర్వకంగా బద్దకించడం అందాం. 

          ఎంత మూడ్ లో వుండి టకటకా రాసుకుపోతున్నా పొద్దంతా రాయకూడదు. తెలియకుండానే క్వాలిటీ తగ్గిపోతూ వుంటుంది.  అందుకని ఎంత ఊపు మీద రాస్తున్నా సమయం చూసి ఆపెయ్యాలి. ఆపేసి బద్ధకించాలి. బద్ధకించమంటే పట్టపగలు నిద్రపొమ్మని కాదు. ఇంకో పనేదో చెయ్యాలి. రాయడానికి  బద్ధకించమన్నామే గానీ, ఇతర పనులు చేసుకోవడానికీ బద్దకించమనలేదు. ఆ ఇతర పనుల్లో మళ్ళీ చదవడం, టీవీ చూడడం మాత్రం  వుండకూడదు. అలాచేస్తే దృష్టి మళ్ళి,  రాస్తున్న విషయం మీద మెదడు ఆలోచనలు చెయ్యదు. బయట తిరిగి రావచ్చు, వ్యాయామం చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఆఖరికి టేబుల్ తుడుచుకోవచ్చు. మాన్యువల్ పనులేవైనా  చేసుకోవచ్చు.  ఈ సమయమంతా మెదడు పట్టుబట్టి ఇంకా ఏమేం ఆలోచిస్తోందో తెలుస్తూనే వుంటుంది.అప్పుడుకూర్చుని రాయడం మొదలెట్టాలి. అప్పుడా క్వాలిటీ తెలిసి పోతూనే వుంటుంది.  పైగా త్వరగా పనై పోతుంది. నాలుగు గంటలు పట్టే పని రెండు గంటల్లో పూర్తయిపోతుంది.  ఏకబిగిన రాసుకుంటూ కూర్చుంటే  నాలుగుగంటలు పట్టే టైము, ఆరుగంటలు తీసుకుంటుంది.

          ఈ వ్యాసకర్త జయించలేని సమస్య ఒకటుంది. రాస్తున్నప్పుడు ఏదైనా నవ్వొచ్చే వాక్యం పడిందా, ఇక ఫక్కున నవ్వొచ్చి లేచి బయటి కెళ్ళి పోతాడు. ఆ వాక్యాన్ని తల్చుకుంటూ తల్చుకుంటూ నవ్వుకోవడంతోనే సరిపోతుంది. ఇది తప్పని తెలుసు. మనం రాసి మనమే నవ్వుకోవడం. ఇందులోంచి తేరుకోవడానికి నిముషాలు కాదు,  కొన్ని సార్లు గంటలూ పట్టి టైం వేస్టయి పోతూంటుంది. ఇలా ఎన్ని వాక్యాలకి నవ్వొస్తే అన్నిసార్లు లేచెళ్లి పోయి నవ్వుకోవడమే. ఇలాటి వాక్యాలు పడకుండా చూద్దామంటే అవి పడిపోతాయి. పడ్డాయా సమయమంతా వృధా. డెడ్ లైన్లు సఫా. దీనికి పరిష్కారమనేది కన్పించడం లేదు. నవ్వడం టానిక్కే, కానీ ఇక్కడ టైటానిక్ అవుతోంది. ‘హౌ టు స్టాప్ లాఫింగ్ అండ్ స్టార్ లివింగ్’ అని డేల్  కార్నెగీ రాసి వుంటే బావుండేది. 

          మెదడు రెండుగా వుంటుంది : కుడి మెదడు ఎమోషనల్ గా, ఎడమ మెదడు లాజికల్ గా అని తెలిసిందే.  కుడి మెదడే రచన చేసుకుపోతుంది, ఎడమ మెదడు సహేతుకత చూస్తుంది. కుడి మెదడు కథ ఆలోచిస్తూ రాసుకుపోతుంది  – ఎడమ మెదడు దాన్ని పరిశీలిస్తుంది, ఎడిట్ చేస్తుంది, పాలిష్ చేస్తుంది. కాబట్టి బుద్ధిపూర్వకంగా రాయడం ఆపి నప్పుడు, మెదడు పనిచేయడాన్ని నియంత్రించాలి. ఇంకా రాయడం ముగించలేదు కాబట్టి, రాయడం మీదే కుడి మెదడు ఆలోచించేందుకు వదిలెయ్యాలి. ఇలా కాక, అంతవరకూ రాసిన దాన్ని ఇది కరెక్టా? ఇందులో లాజిక్ వుందా?  అని ఆలోచిండం మొదలెడితే, కుడి మెదడుని ఆపేసి,  ఎడమ మెదడు దాని పని అందుకుంటుంది. అంతవరకూ రాసి ఆపిన దాన్ని పరిశీలించడం, ఎడిట్ చేయడం, పాలిష్ చేయడం మొదలెడుతుంది. అప్పుడు తిరిగి రాయడానికి కూర్చున్నప్పుడు ఆలోచనలు సాగవు.  ఎందుకంటే,  బుద్ధిపూర్వకంగా కథ రాయడాన్ని ఆపినప్పుడు, కథ ఆలోచించే కుడి మెదడుని బంద్ చేసుకుని,  పోస్ట్ మార్టం చేసే ఎడమ మెదడుని తట్టి లేపాం కాబట్టి.

          అందుకని అప్రమత్తంగా వుండాలి. రాయడం పూర్తయ్యే వరకూ ప్రశ్నించుకోకూడదు. ఎమోషనల్ గా (కుడి మెదడు) రాసుకుపోవాలి. రాసేశాక లాజికల్ గా (ఎడమ మెదడు) చెక్ చేసుకుంటూ పోవాలి. ఏకకాలంలో రెండూ చేస్తే మెదడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే, ఏకకాలంలో కుడి - ఎడమ రెండు మెదడులూ పనిచేయడం అసాధ్యం.

          ఇదీ బుద్ధిపూర్వకంగా బద్ధకిస్తూ రాసే (ఆలోచించే) విధానం. రాస్తున్నప్పుడు ఎడమ లాజికల్ మెదడు పనిచేయడమే మూడ్ చెడిపోవడానికి, మూడ్ లేకపోవడానికి కారణం. రాస్తున్నప్పుడే కాక, కథ ఆలోచిస్తునప్పుడు కూడా లాజికల్ మైండ్ ని అనుమతిస్తేనే ఆ కథ ఆలోచించే మూడ్ పోతుంది...

సికిందర్
.


Monday, February 19, 2018

607 : నోట్ - 2


       
       ష్యూ క్లోజ్ అయ్యేట్టు లేదు. వాట్సాపులు, మెసెంజరులు బిజీ అవుతున్నాయి. ఫోన్ కాల్స్ లో చెప్పిందే చెప్పి నచ్చజెప్పాల్సి వస్తోంది. ఫైనల్ గా  ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చి ఇష్యూ క్లోజ్ చెయ్యాలి. ప్రపంచం ఆగిపోదు, the show must go on! ఈ బ్లాగులో రివ్యూలు రానంత  మాత్రాన కొంపలేమీ అంటుకోవు. కానీ ఇలా రివ్యూలు మానెయ్యాల్సిన పరిస్థితిని కల్పించిన వాళ్ళెవరు?  సినిమా వాళ్ళే!  రివ్యూలు రాస్తున్నంత కాలం ఈ వ్యాసకర్త ఏనాడూ సినిమా ప్రయత్నాలు చేసిందీ లేదు. ఎందుకంటే ఒకర్ని అడుక్కోవాలంటే మనసొప్పదు. చాలా వరకూ అజ్ఞాతంగా వుంటూ రివ్యూలూ ఇతర వ్యాసాలూ రాసి అవతల పడెయ్యడమే తప్ప, వాటినుంచి  మైలేజీ ఆశించే పని కూడా పెట్టుకోలేదు. సినిమా రచయితల సంఘంలో సభ్యత్వం లేదు. క్రిటిక్ అని భావించుకోలేదు కాబట్టి ఆ సంఘాల్లోనూ సభ్యత్వం లేదు. ఏ బంధనాలూ లేని ఫ్రీ బర్డ్ లా  వుంటే, ఒకరొకరే వచ్చి పట్టుకోవడం మొదలెట్టారు. 

          ఎవరు వీళ్ళు? ఒక దర్శకుడు దశరథ్ దగ్గర్నుంచీ అమలాపురంలో ఆటో డ్రైవర్ దుర్గారావు వరకూ వున్నారు. బెల్లంపల్లిలో ఒక అనంత్ దగ్గర్నుంచీ,  విజయవాడలో ఆదిత్యా చౌదరి వరకూ వున్నారు. 1996 లో ప్రారంభించి ఆంధ్రభూమిలో రాస్తున్నప్పట్నించే మొదలయ్యింది. కేరాఫ్ ఆంధ్ర భూమికి ఉత్తరాలు రాసి మేమొచ్చేస్తున్నామని అనే వాళ్ళు. వచ్చి రివ్యూలు రాసేవాడితో ఏంచేస్తారో అర్ధమయ్యేదిగాదు. రావద్దనే చెప్పాల్సి వచ్చేది. ఇక్కడొచ్చి బాధలు పడేకంటే అక్కడే ఫాస్ట్  ఫుడ్ సెంటర్ నడుపుకుని జీవించడం బెటరని చెప్పినా వినేవాళ్ళు కాదు. దుర్గారావొక్కడే  ఆగిపోయాడు. ఇప్పటికీ ఫోన్లు చేసి సినిమాల్ని ఎనాలిసిస్ చేస్తూంటాడు. ఇలా బయటి వాళ్లెందరో వున్నారు. దర్శకుడు దశరథ్ పిలిపించుకుని స్క్రీన్ ప్లే బుక్ ప్లాన్ చేద్దామన్నారు. అది ముందుకు సాగలేదు. ఇక అసిస్టెంట్లు, అసోషియేట్లు సరేసరి. సినిమా ఫీల్డులో అమాయకులకి ఒక నమ్మకముండేది. ఆంధ్రభూమి వెన్నెల్లో రివ్యూలు రాసే వాళ్ళు గొప్ప మేధావులని. ఎంత మేధావులో రాస్తున్న వాళ్లకి పరస్పరం తెల్సు. తెలుగు సినిమాలు తీయడానికీ, రివ్యూలు రాయడానికీ పెద్దగా మేధావితనం అవసరం లేదనీ తెలుసు. కానీ అమాయకులు అలా  బిల్డప్ ఇచ్చేసి ఆంధ్రభూమి ఆఫీసుకొచ్చేసి, బయట టీస్టాల్  దగ్గర ఫ్యాన్స్ గా ప్రకటించుకునే వాళ్ళు. కొందరు కృష్ణానగర్ లో ఫ్యాన్స్ క్లబ్ పెట్టుకుంటామంటే తిట్టి పంపాల్సి వచ్చింది. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారు ఈ వ్యాసకర్త ఏం రాస్తున్నా, ఎలా రాస్తున్నా  ఏమీ అనేవారు కాదు. పైగా కొన్ని రివ్యూలకి  హెడ్డింగులు మార్చి ఘాటు హెడ్డింగులు పెట్టేవారు. నిర్మొహమాటంగా రాయడం ఆయనిచ్చిన స్వేచ్ఛ వల్లే సాధ్యమైంది. ఆయన లేకపోతే ఈ వ్యాసకర్త డబ్బాలు కొడుతూ అందర్నీ సంతోష పెట్టేలా రివ్యూలు రాస్తూ బతికే వాడేమో. ఈ నిర్మాణాత్మక నిర్మోహమాటానికి నెగెటివ్ అనే పేరొచ్చింది. ఏటేటా 90 శాతం అట్టర్ ఫ్లాపులు తీస్తున్న వాళ్ళే  సినిమా ఫీల్డుకి నెగెటివ్ లు కారేమో అన్పించేది మనకి.  దర్శకుడు వీర శంకర్ వెబ్ సైట్ పెట్టి రివ్యూలు రాయిస్తున్నప్పుడు, వీడికి దర్శకత్వం ఛాన్సు రాక, రైటర్ గా అవకాశాలు దొరక్క అక్కసు తీర్చుకుంటున్నాడనీ, కృష్ణా  నగర్ చీప్ లిక్కర్ బ్యాచి అనీ బూతులతో దీవిస్తూ  కామెంట్లు పెట్టే వాళ్లు  సినిమా వా
ళ్ళే. పట్టించుకోలేదు. ఇలాటి వాళ్ళు 90 శాతం అట్టర్ ఫ్లాపులిచ్చే  ఫీల్డుకి పట్టిన అదృష్టవంతులనీ తెలుసు. ఇలా రివ్యూలు రాస్తే కాదు, ఒక సినిమా తీసి చూపించమనే వాళ్ళూ వున్నారు. వాళ్ళే  ఒక్క రివ్యూ రాసి చూపించగల్గితే,  సినిమాలు తీయడానికి వాళ్ళెంత అర్హులో తేలిపోతుంది కదా?  రివ్యూలు రాయడం చాలా ఆషామాషీ బాధ్యత లేని తనమనుకుంటున్నారు ఇప్పటికీ.

          మొత్తానికి వెన్నెల ఇంఛార్జులుగా మారుతూ వుండే చల్లా శ్రీనివాస్, అబ్దుల్, వీఎస్ ఎన్ మూర్తి ముగ్గురూ శాస్త్రి గారిచ్చిన  స్వేచ్ఛ ని అనుభవించారు. కానీ మొదట్లో వెన్నెల ఇంఛార్జిగా  వున్న అఫ్సర్ గారు ఈ వ్యాసకర్తచేత ఆదివారం ఆంధ్రభూమికి క్రైం కథలు రాయించుకునే వారు. ఒక రోజు అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీయోంకా ఖిలాడీ చూసి నవ్వొచ్చి,  రివ్యూలాంటిది రాసి అఫ్సర్ గారికి చూపిస్తే, ఆయనా నవ్వుకుని కంటిన్యూ చేయమన్నారు. ఆ నవ్వులాట వెన్నెల ద్వారా ప్రసిద్ధ రచయిత మైనంపాటి భాస్కర్ కీ చేరి ఆంధ్రభూమి గేటు బయట ఆలింగనం చేసుకున్నారు. అలా యాక్సిడెంటల్ రివ్యూ రైటర్ అయ్యాక, మొదలయ్యింది అసిస్టెంట్ల, అసోషియేట్ల రాక. ఇప్పటికొచ్చి చూసుకుంటే ఓ డెబ్బై మంది వుంటారు. 

          చల్లా శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వెళ్ళాక అక్కడ ఆదివారం ఆంధ్ర జ్యోతి ఇంఛార్జి ఎడిటర్ కె. వసంత లక్ష్మి గారికి చెప్పి క్రైం కథలు రాయించాడు. రెండేళ్ళు రాశాక  ఆపమని చెప్పి, వసంత లక్ష్మి గారు ఒక సినిమా కాన్సెప్ట్ ఇచ్చారు. వివిధ శాఖల టెక్నీషియన్లని వారం వారం పరిచయం చెయ్యమని. అలా 45 మంది వివిధ శాఖల టెక్నీషియన్లని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, సాహిత్యాభిలాష గల ఛోటా కె నాయుడు,  ఇంటర్వూ రాశాక తనకి చూపించి మరీ ముద్రించాలన్నారు. రాసి చూపించాక చాలా ఫీలయ్యారు శైలికి. భుజం మీద చెయ్యేసి అటూ ఇటూ ఫిలాసఫర్ లాగా నడిచారు. అప్పటికి దశరథ్ కావాలని అడిగి రాయించుకున్న బిగ్ కమర్షియల్ స్క్రిప్టు ఈ వ్యాసకర్త దగ్గరుంది. ఇప్పుడు ఛోటా కె నాయుడు గారికి చెప్తే ఎక్కడో ఆయన సెట్ చేసేస్తారు. అయినా చెప్పలేదు.  మనం వెళ్ళింది పత్రిక తరపున ఇంటర్వ్యూ చేయడానికే గానీ, ఈ అవకాశాన్ని సొంత అవసరాలకి వాడుకోవడానికి కాదు. తిరిగి చల్లా  శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వచ్చి క్రైం స్టోరీలు అడిగితే ప్రస్తుతం తొమ్మిది  నెలలుగా అవి రాయడం జరుగుతోంది. ఇలా అడిగితే తప్ప ఒకర్ని ఇబ్బంది  పెట్టి అడుక్కుని మరీ వెంటపడి రాసే అలవాటు లేకపోవడం చేత, సినిమా రైటర్ కాలేకపోయాడీ వ్యాసకర్త.  ఇది మంచిదే అయ్యింది కదా రివ్యూలు రాసుకుంటూ హేపీగా గడపడానికి? 

          ఇలాటి వాణ్ణి  అసిస్టెంట్లు, అసోషియేట్లు ముగ్గులోకి లాగడం  మొదలెట్టారు. వాళ్ళ కథలకోసం ఏళ్లతరబడి ఎంతో సమయం, శక్తీ కరిగిపోయేది.  కానీ ఏదీ వృధా పోదు – 
nothing goes waste  in God’s grand economy .  ప్రతీ ఒక్కరూ ఎదగాలని  స్ట్రగుల్ చేస్తూంటారు.  ఎవర్నీ చిన్న చూపు చూడలేం, ఎదుగుదల వైపు మనం వుండక తప్పదు. నమ్మి వచ్చిన వాళ్లకి సాయపడాలి. అపాత్ర దానమనేది ఒక నమ్మకం మాత్రమే –nothing goes waste  in God’s grand economy అనేదే సత్యం. చేజారిన నీళ్ళు కూడా నేలని తడుపుతాయి. అక్కడో మొక్కో సూక్ష్మ జీవులో బతుకుతాయి. ఏదీ వృధా పోదు. 

          ప్రతీ ఏటా 70 మంది కొత్త దర్శకులు వస్తే డెబ్బై మందీ అట్టర్ ఫ్లాపవుతున్నారు. వాళ్ళల్లో ఒకరో ఇద్దరో ఈ వ్యాసకర్తతో సంబంధమున్న వాళ్ళే. తీరా సమయం వచ్చేసరికి వాళ్ళేదో రాసుకుని, తీసుకుని,  వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతున్న వాళ్ళే. ఇది తప్పేం కాదు. మనసుకి నచ్చినట్టు  చెయ్యాలి. ఎక్కువమంది అవకాశాల కోసం ఇప్పటికీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే వున్నారు. ఎప్పుడూ కాంటాక్టులో  వుంటూ,  అవసరమైతే కొత్తవి రాయించుకుంటూ కొన్నేళ్లుగా మిత్రులైపోయి వున్నారు. ఇలా వివిధ దశల్లోనో  (వన్ లైన్ ఆర్డరో, ట్రీట్ మెంటో,  డైలాగ్ వెర్షనో), మొత్తంగానో,  మూడు డజన్ల స్క్రిప్టులు రాసి,  ఒక్కటీ తెరకెక్కకుండా తిరుగుతున్న రైటర్ కాని  రైటర్ ఎవరైనా ప్రపంచంలో వున్నాడంటే,  అది ఈ వ్యాసకర్తేనని ఇప్పటికీ జోకులేసుకోవాల్సి వస్తోంది. మనం సాధించిన రికార్డు ఇదే! 

          టాప్ స్టార్ కి స్క్రిప్టు రాసి, కొన్నేళ్ళు చూసి చూసి,  అపాయింట్ మెంట్ కి కూడా మనమే పూనుకుని ఏర్పాట్లు చేస్తే, ఆ అసోషియేట్ అప్పుడే డాక్టర్ దాసరి నారాయణ రావు గారిలా ఎక్స్ ప్రెషనిచ్చి అపాయింట్ మెంటే లేకుండా చేసుకుంటే ఏం చేయగలం. ఇలాటి మన డొమైన్ కాని పన్లు కూడా చేయాల్సి వచ్చేది. ఒక పేరున్న కో డైరెక్టర్ ఏరికోరి స్క్రిప్టు రాయించుకుని, తీరా ఇంకో సినిమాకి కో డైరెక్టర్ గానే జంప్ అయిపోతే ఏం చేయగలం. దశాబ్డంన్నర కాలంగా ఇలాటి ఫన్నీ సీన్లు ఎన్నో. 

          ఈ కాలంలో వేరే దర్శకుల ఓ నాల్గు సినిమాలు చేయకపోలేదు. వాటిలో రెండిటికి పే రేసుకోలేదు. ఒకదానికి మారు పేరు వేశాం. ఇంకోదానికి వద్దన్నా పేరేసేశారు. ఒక సినిమా చేస్తే మళ్ళీ చేస్తామో లేదో నమ్మకమే లేనప్పుడు, పేరేసుకోకుండా వుంటే రివ్యూ రైటర్ గా  కొనసాగ వచ్చన్న ముందు చూపుతోనే తప్ప మరొకటి కాదు. పేరేసిన సినిమా ఒక్క రోజే ఆడడంతో ఎవరి దృష్టిలో పడలేదు. చాలా హేపీ అన్పించింది. కానీ అప్పటికే యూసుఫ్ గూడా సెంటర్లో పోస్టర్ మీద పేరు చూశామని ఎవరో చెప్పనే చెప్పేశారు. విషయమేమిటంటే,  బతుకమ్మ అప్పట్నించీ సీనియర్ దర్శకుడు టి. ప్రభాకర్ గారంటే  గౌరవముంది. విభేదించి వెళ్ళిపోయినా ఫీలవకుండా మళ్ళీ పిలిపించుకుంటారు. ఆయన ఒక లిమిట్ లో ఆలోచిస్తారు. మనం ఇంకెక్కువ ఆలోచిస్తాం. కాబట్టి ఆయన లిమిట్ లో తీసే సినిమాలకి వర్క్ చేసి పే రేసుకోకుండా వుంటే చాలనుకుంటాం. ప్రస్తుతం ఆయన బిత్తిరి సత్తితో చేస్తున్న ‘తుపాకీ రాముడు’కి కూడా పిలిపించుకుని వర్క్ చేయించుకున్నారు. ఇలా పేరేసుకోకుండా వర్క్ చేసినా, బయట వేరే సినిమాలకి రివ్యూలనేవి రాయకూడదు. ఈ మానసిక సంఘర్షణ వుంటూనే వుంది.

          ఇప్పుడు పదేళ్లో ఐదేళ్లో స్ట్రగుల్ చేసి, క్రియేటివిటీ పరంగా ఈ వ్యాసకర్తతో ఒకే వేవ్ లెంత్ తో వుంటూ వస్తున్న నమ్మిన  మిత్రులకి  రాసిచ్చాంగా  పొమ్మనలేం. ఇంకా వాళ్ళతో పూర్తి స్థాయిలో రాసి, చివరంటా అందుబాటులో వుండాలి. మరో ఇద్దరో ముగ్గురో  మంచి గాలప్ మీద  వచ్చేస్తున్నారు. రేపో ఎల్లుండో ఫైనల్ గా వచ్చి పడతారు అనేట్టున్నారు. ఇలాంటప్పుడు ఇది పూర్తి స్థాయి వృత్తి అయిపోతుంది. రివ్యూలు ఇక ప్రవృత్తి కూడా కాదు. మానెయ్యాలి. ఇంత ఎథిక్స్ ఆలోచిస్తే ఎలా అని కొందరు అంటున్నారు. రివ్యూలు రాయాల్సిందే అంటున్నారు. ఇలా సినిమా వాళ్ళే  అనడం విచిత్రం, ఇతర పాఠకులు సరే. ఇదిక కుదరదని అంటున్నాం. ఇలాటి తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోక తప్ప లేదు. ఇటు వైపు లాగిందే సినిమా వాళ్ళు. ఇది గమనించాలి. 

          రివ్యూలు లేకపోయినా బ్లాగులో ఇతర పనికొచ్చే ఆర్టికల్స్ కొనసాగుతాయి. స్క్రీన్ ప్లేకి సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు  ప్రత్యక్ష మవుతాయి. ఇప్పుడు స్వీయానుభవం లోంచి రాసేవి కూడా కొన్ని జత కలుస్తాయి.ఇంతేకాకుండా ఎప్పట్లానే అసోషియేట్లకి అందుబాటులో వుండడం జరుగుతుంది. సేవలు యధావిధిగా కొనసాగుతాయి. అవన్నీ కథల గురించే. నిర్మాతలకి డబ్బులొచ్చే కమర్షియల్ కథల గురించి. వీటికి సంబంధించిన రీసెర్చ్ ఎప్పుడూ వుంటుంది. హాలీవుడ్డే  టాలీవుడ్ కి ఆదర్శం. వేరే  డబ్బులు రాని వరల్డ్ మూవీస్ బాపతు కథలు కాదు, షార్ట్ ఫిలిమ్స్  బాపతు కథలు కాదు. వీటికి దూరం.

-సికిందర్
         



         

.
 
         




Sunday, February 18, 2018

606 : విజ్ఞప్తి

డియర్ రీడర్స్! 
          కపైన  బ్లాగులో సినిమా రివ్యూలు వెలువడే అవకాశం లేదు. రాసిన స్క్రిప్టుల్లో రెండు నిర్మాణ దశకి చేరుకుంటుంన్నందున, ఇక రివ్యూలు రాయకూడదని నిర్ణయించాం. ఇతర శీర్షికలు, స్క్రీన్ ప్లే ఆర్టికల్స్  వెలువడుతాయి. బ్లాగుని పర్సనల్ వెబ్ సైటుగా మార్చే ప్రయత్నాల్లో వున్నాం. బ్లాగులోని కంటెంట్ అంతా వెబ్ సైటుకి బదిలీ అవుతుంది. అప్పుడు ఆయా విభాగాలని సెర్చి చేయడం సులభతరమవుతుంది.
          ఇంతకాలం రివ్యూలని ఆదరించిన, వ్యతిరేకించిన పాఠకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
సికిందర్
         (ps : డిసపాయింట్ అవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ ప్లేకి సంబంధించిన ఆర్టికల్స్ యధావిధిగా కొనసాగుతాయి. రివ్యూల్లో ఏముంటుంది ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి – ఎంత సేపూ తెలిసిన తప్పొప్పులే రాయడం, వాటినే తెలుసుకోవడం. రివ్యూలని ఫాలో అయిన వారికి, ఇకపైన చూసే సినిమాల స్ట్రక్చర్ లోటు పాట్లు ఇట్టే  తెలిసిపోతూ వుంటాయి. వచ్చిన రివ్యూలు కూడా రిఫరెన్సులుగా వుంటాయి. ఒక అనివార్య పరిస్థితి లోంచి నిర్ణయం తీసుకుని రివ్యూలని ఆపివేయాల్సి వస్తోంది )

Friday, February 16, 2018

605 : రివ్యూ!



రచనదర్శకత్వం : మంజుల ఘట్టమనేని 
తారాగణం : సందీప్కిషన్, అమైరా దస్తూర్,  బేబీ జాహ్నవి, త్రిధా చౌదరి, అదిత్అరుణ్,  ప్రియదర్శి, నాజర్ తదితరులు 
సంగీతం: రధన్, ఛాయాగ్రహణం : రవీ యాదవ్
బ్యానర్స్: ఆనంది ఆర్ట్స్, ఇందిరా ప్రొడక్షన్స్
నిర్మాత: పి.కిరణ్, సంజయ్స్వరూప్
విడుదల : ఫిబ్రవరి 16, 2018
          టి, నిర్మాత మంజుల దర్శత్వంలో కూడా తానేమిటో నిరూపించుకోవాలని ‘మనసుకు నచ్చింది’ తో ముందుకు వచ్చారు. డెబ్భై శాతం ప్రేమ సినిమాలతో నిండిపోయిన తెలుగు మార్కెట్లో తానేం  విభిన్న ప్రేమ సినిమాని అందిస్తున్నారా అని ఆశతో ఎదురు చూశారు అభిమానులు. ఆకర్షణీయమైన  తారాగణం,  నిపుణులైన సాంకేతికులు, ప్రముఖ నిర్మాణ సంస్థలూ సమకూరి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఎలా వచ్చారో చూద్దాం...

కథ
          బావా మరదళ్ళయిన సూరజ్ (సందీప్ కిషన్),  నిత్య (అమైరా దస్తూర్) లకి పెళ్ళిచేస్తూంటాడు తాత (నాజర్). పెళ్లి ఇష్టంలేని ఇద్దరూ మేం ఎవర్ని చేసుకోవాలో మేమే చూసుకుంటామని పెళ్లి పీటల మీంచి పారిపోతారు. గోవాలో బస చేస్తారు. నిత్య ప్రకృతి  ప్రేమికురాలు, సూరజ్  ఫోటో గ్రాఫర్. వీళ్ళిద్దరికీ అక్కడ నిక్కీ (త్రిదా చౌదరి) అభి (అదిత్ అరుణ్) అనే ఇద్దరు పరిచయమవుతారు. సూరజ్ నిక్కీ తో ప్రేమలో పడతాడు, నిత్య అభితో ప్రేమలో పడుతుంది. కానీ తనకి సూరజ్ తోనే ప్రేమ వుందని గుర్తిస్తుంది. ఈ విషయం సూరజ్ కెలా చెప్పాలో తెలీక క్షోభిస్తుంది. నిత్యకి ఈ క్షోభ  ఎలా తీరింది? ఆమె మనసు సూరజ్ అర్ధం జేసుకున్నాడా? ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది? ... అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ
          మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామని చెప్పే కథ.  జానర్ వచ్చేసి రోమాంటిక్ డ్రామా. మార్కెట్ యాస్పెక్ట్  వచ్చేసి సున్నా. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి రొటీన్ ముక్కోణ ప్రేమ. మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామన్న ప్రకారం మొదటి సగంలో సూరజ్ ఫోటోగ్రఫీకి వర్తింపజేసి చూపించినంత వరకూ బలంగానే వుంది.  రెండో సగంలో ఫ్లేటు ఫిరాయించి ప్రేమకి అన్వయించడంతో కథ ఏకసూత్రత దెబ్బతినిపోయింది. ఎత్తుకున్న కథకీ నడిపి ముగించిన కథకీ సంబంధం లేకుండాపోయింది. మార్కెట్ యాస్పెక్ట్ కి యూత్ అప్పీల్ కూడా ఏమీ లేదు. కథలో ప్రకృతిని భాగం చేసి పదేపదే ఫిలాసఫీ చెప్తూ పోవడంలో కథకురాలి నాలెడ్జిని రుద్దడమే వుంది తప్ప కమర్షియల్ విలువల పట్టింపు లేదు. రోమాంటిక్ కామెడీలుగా నడుస్తూ రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయే తెలుగు ప్రేమ సినిమాల మధ్య ఈ కథ ఇప్పుడు మార్కెట్ లేని  పూర్తి స్థాయి రోమాంటిక్ డ్రామా. క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసినా మాసిపోయిన అదే ముక్కోణ ప్రేమ డ్రామా. 2000 లనుంచీ చూసి చూసి వున్న  ‘నువ్వేకావాలి’ టైపు వడ్డన.  ఇంకా బావామరదళ్ళ కథ చూపించే బడాయి. ఫీల్డులో పాతుకుపోయి వున్న నిర్మాతలే,  దర్శకురాలే,  ఎవరో కొత్త వాళ్ళన్నట్టు మార్కెట్ అవగాహన లేకుండా ఇలా సినిమాలు తీస్తారా అనేది మిలియన్ రూకల ప్రశ్న.

ఎవరెలా చేశారు
          సందీప్ కిషన్ తో కలిసి అమైరా, త్రిధా, జాహ్నవీలు నటించారు. నిజానికిది బ్యూటిఫుల్ కాంబినేషన్. పాత్రలు లవబుల్ గావున్నాయి. ప్లేనే ఎలాగో వుంది. ఫస్టాఫ్ లో సందీప్ పాత్ర ప్రయాణం  ఫోటోగ్రఫీకి సంబంధించినంతవరకూ ఎంతోకొంత అర్ధవంతంగా,  యాక్టివ్ గా వున్నాయి. కనుక నటన కూడా బెటర్ అన్పించుకుంది. అతను నటించలేక కాదు, పాత్ర బావుండాలి. ఫోటోగ్రాఫర్ గా అతడి ఇగో దెబ్బతిన్నప్పుడు రేగే భావోద్వేగ ప్రదర్శన దీనికి నిదర్శనం. కానీ ఇలా నిలబెట్టుకున్న పాత్ర ఇటు వృత్తిరీత్యా, అటు ప్రేమ రీత్యా సస్పెన్స్ ని పోషించుకుంటూ ఇంటర్వెల్ కి చేరాక, అక్కడి మలుపుతో కుదేలైపోయింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో రెండో హీరోయిన్ తో ఇది ముక్కోణ ప్రేమ అన్నారో అక్కడ్నించీ సందీప్ పాత్రా,  దాని కథా దిగజారిపోయాయి. సెకండాఫ్ సహన పరీక్ష పెట్టడంతోనే సరిపోయింది. చివరికి ప్రేమలో ఏం చేయాలో కూడా తెలీక వెక్కి వెక్కి ఏడ్చి, రోమాంటిక్ డ్రామా మూస టెంప్లెట్  ప్రకారం పెద్ద వయసు పాత్ర (తాత ) ని ఆశ్రయించే పాసివ్ పాత్రగా మారిపోయింది. ఎలా మొదలైన పాత్ర ఎలా ముగిసింది! ఇలాటి పాత్రలో యూత్ తనని ఎందుకు చూడాలి? 

          అమైరా దస్తూర్ వండర్ఫుల్ నటి, ఫస్టాఫ్ వరకే. వొళ్ళంతా కళ్ళు చేసుకుని దిగ్భ్రమతో ప్రకృతిని చూసే, ఆరాధించే, ప్రకృతిలోనే గడిపే, ప్రకృతినే ప్రేమించి, అది చెప్పే వూసులు వినే, ఆ వూసుల్లోంచి జీవించడం నేర్చుకునే, ధ్యానమూ యోగా నేర్పే  ఫ్రెష్ క్యారక్టర్. ఈ పాత్ర ప్రయాణం ఎటువైపనేది ఒక సస్పెన్స్ పోషణ ఫస్టాఫ్ వరకే. కచ్చితంగా దర్శకురాలు తనదైన స్త్రీ దృక్కోణంలో పాత్రలకి ప్రకృతిని ఆపాదించి నడిపిస్తున్నదల్లా, ఇంటర్వెల్ రాగానే మేల్ డైరెక్టర్ ల మూసలో పడే సహజ బుద్ధినే ప్రదర్శించుకుంది కొందరు  దర్శకురాళ్ళ లాగే. ఒక దర్శకురాలిగా తీస్తున్నప్పుడు కూడా స్త్రీ స్పర్శతో  సినిమాలు వుండకపోతే ఇక తీయడమెందుకు?  ఇంటర్వెల్ దగ్గర్నుంచీ దర్శకురాలు మంజుల మంజులమైన తన అనుసృజనని వదులుకుని, తనతో బాటు అమైరా పాత్రనీ తీసికెళ్ళి మేల్   డైరెక్టర్ల మొరటు ముక్కోణ ప్రేమ డొమైన్ లో పడేశారు! 

          డిటో త్రిధా చౌదరి. ఫస్టాఫ్ మజా, సెకండాఫ్ సఫా. సఫా కాకుండా మంజుల కుమార్తె జాహ్నవియే చక్కగా మిగిలింది. ఆమె మాట తీరు, నటనలో వేగం ఇవే ఆద్యంతం ఈ సినిమా చూడగల్గేట్టు మిగిలాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి యాడ్ ఫిలిమ్స్ మేనేజర్ గా సీరియస్ పాత్రలోనే వుంటాడు. యాడ్ కంపెనీ హెడ్ గా సంజయ్ స్వరూప్ ది స్వల్ప పాత్ర, తాతగా నాజర్ దీ స్వల్ప పాత్రే. 

          రవీ యాదవ్ ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ క్వాలిటీతో కూడుకుని వుంది. గోవా లొకేషన్స్ ని కొత్తగా చూపించారు. ఈ విజువల్స్ కి రాధన్ సంగీతం, పాటలు ఓ మోస్తరుగా వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఇక ఫిలాసఫికల్ గా ప్రకృతి గురించి అన్నేసి మాటలు రాయడం సాయి మాధవ్  బుర్రాకి అనవసర ప్రయాసే. ప్రకృతిని చూపిస్తూ దాని గురించే చెప్పడంతో ఫీల్ పోవడమేగాక, ఫాలో కాలేని  ఫైలాసఫీతో ఇబ్బంది వచ్చింది. దీనికి ప్రారంభంలో చెప్పిన మహేష్ బాబు వాయిసోవర్ చాలు. ఇక మిగతా మాటలు ఫర్వా  లేదనిపించే స్థాయిలోనే రాశారు ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో పాత కథకి ఎంత డైలాగులు రాసినా లభంలేకుండా పోయింది. 


చివరి కేమిటి 
          ఏ దర్శకులైనా  సరీగ్గా రాయలేకపోతే తీయలేరు. రాత దగ్గరే వుంటుంది తలరాత. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దర్శకులు రాయకూడదు, తీయడం మీద దృష్టి పెట్టి రాయించుకోవాలి. అప్పుడే కథ, పాత్రచిత్రణలు, స్క్రీన్ ప్లే – వీటికి సంబంధించిన రీసెర్చి పూర్తి స్థాయిలో సాధ్యమవుతాయి. ఫైనల్ అవుట్ పుట్ పరిపూర్ణంగా వికాసం చెందే అవకాశముంటుంది. తమకే తెలీని లోతుపాతులు బయటపడతాయి. దర్శకులే రాస్తూ కూర్చుంటే,  వాళ్ళకుండే వివిధ వొత్తిళ్ళతో ఏ దశలోనూ రచన సమగ్ర రూపం సంతరించుకోదు. లోపాల పుట్టగానే మిగిలిపోతుంది. 90 శాతం ఫ్లాపుల ప్రధాన కారణమిదే. 

          దర్శకురాలు మంజుల సమస్య ఇదే. ఆమె చెప్పి రాయించుకుని వుంటే ఇంత ఆత్మాశ్రయ ధోరణిలో స్క్రిప్టు వుండేది కాదు స్వగతం చెప్పుకుంటున్నట్టు. ధోరణి కవితాత్మకమే, కానీ అదెలా చెప్పాలో తెలియలేదు. మణిరత్నం ప్రకృతిని వాడుకునే విధానం చూస్తే, ఆయన పాత్రల చేత భాష్యం చెప్పించడు, కామెంటరీలు చెప్పించడు- ప్రకృతే దాని చర్యలతో మాట్లాడుతున్నట్టు  చూపిస్తాడు, చెప్పడు ( ‘show, don’t tell’ సూత్రం). తాజా ‘చెలియా’ లో కూడా వొళ్ళు గగుర్పొడిచే మంచు తూఫాను నేపధ్యంలో ప్రేమికుల వాగ్యుద్ధం ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిత్రీకరించాడు. 

          మంజుల కూడా ప్రకృతితో అలజడి సృష్టించారు. సెలయేళ్ళు, జలపాతాలు, సముద్రాలు, వర్షం- వాటర్ వాటర్ ఎవ్విరీ వేర్ అన్నట్టుగా జల నేపధ్యం సృష్టించారు ప్రతీ కీలక సన్నివేశానికీ. అయితే వాటికి హీరోయిన్ పాత్ర ఫీలవ్వాలేగానీ,  ఆమే పక్క పాత్రలకి వాటి ప్రశస్తి జీవితాలకి అన్వయించి నూరిపోస్తే అభాసు అవుతుంది. ప్రకృతిని ప్రేక్షకులు ఫీలై అర్ధం చేసుకునే సబ్ టెక్స్ట్ గా వదిలెయ్యక – మంజుల తనకెంతో తెలుసన్న ధోరణిలో కామెంటరీలు చెప్పించారు. దీంతో విజువల్ పోయెట్రీ అంతా చెడి, సోదిలా మారింది. సోది ఎందుకంటే, అంత చెప్పడానికి ఆ లేత హీరోయిన్ పాత్ర జీవితానుభవమెంత. అంత జీవితానుభావమే వుంటే,  అలా పారిపోయి ఎందుకొస్తుంది. అంత మెచ్యూరిటీయే వుంటే, ఆ మెచ్యూరిటీతో పెద్దల్ని ఎందుకు ఒప్పించ లేకపోయింది. అంత యోగా  బోధిస్తూ తనెందుకు ఆరోగ్యకరంగా లేదు. అంత ధ్యానం నేర్పిస్తూ తనెందుకు సమస్యకి పరిష్కారం కనుగొనలేక సెకండాఫ్ అంతా ఏడుస్తూ కూర్చుంది. మెచ్యూరిటీ అంతా ప్రకృతికే వుంటుంది. మెచ్యురిటీ లేని పారిపోయి వచ్చిన పాత్రలు అందులో భాగమై నేర్చుకుంటాయి మేడం, నేర్పవు. పాత్రలు ఎదగడం నేర్చుకుంటాయి, ఎదిగిన పాత్రలతో కథ వుండదు. వుంటే కథకాదు. 

          ఫస్టాఫ్ స్ట్రక్చర్ లో వుంది. ముప్పావుగంటలో సందీప్ పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ సంఘటన బలమైన చిత్రీకరణ. ఫోటోగ్రాఫర్ గా అసమర్ధుడని అతను పొందే అవమానంతో రెబెల్ అయ్యే దృశ్య చిత్రీకరణ అద్భుతం. ఇలాటి బలమైన సంఘటనలతో ప్లాట్ పాయింట్ వన్ మలుపులు  సృష్టించడం సర్వసాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించదిప్పుడు. దీంతో అతను ఫోటోగ్రాఫర్ గా నిరూపించుకోవాలని సమకడ్తాడు. ప్రకృతిలో ఒక బాలిక (జాహ్నవి), ఆ బాలిక సీతాకోక చిలుక అబ్సెషన్, దాన్ని అతడికి అంటించడం, దాంతో అతను ప్రకృతిలో భాగమై, లీనమై- తనేం చేయాలో, ఎలా చేయాలో , హోరెత్తే జలపాతం దగ్గర  రియలైజేషన్ కొచ్చే మలుపు అంతా ఒక టెర్రిఫిక్ టేకింగ్. అద్భుత ఛాయాచిత్రాలు సృష్టించి సమాధానం చెప్తాడు. నిజానికి హీరోయిన్ వెంట వుండి  ప్రకృతి గురించి ఆమె పెట్టిన సొదకి  బోరు కొట్టించుకున్న తనే, ఇప్పుడా ప్రకృతితో బాగుపడ్డాడు. ఈ సైకో థెరఫీ కథనానికి మంచి డైనమిక్స్ గా  కుదిరింది. ఇక తనకి ప్రేమ చెప్తాడని ఆశిస్తుంది హీరోయిన్. అంతా సస్పెన్స్. జలపాతం దగ్గరికి రమ్మంటాడు. ఏం చెప్తాడు? ప్రేమ చెప్తాడా, లేక ప్రేమ తిరస్కరించి ఫోటోగ్రఫీ అంటాడా అని తీవ్ర ఉత్కంఠ. ప్రేమ చెప్పకూడదు, ప్లాట్ పాయింట్ వన్ ప్రేమ మీద లేదు. ఫోటోగ్రఫీ మీద వుంది. కాబట్టి ప్రేమ చెప్పడు, ఫోటోగ్రఫీ అంటాడేమో - తనొక స్పిరిచ్యువల్ అనుభవాన్ని పొందాక ప్రేమ ఎంత, కేవలం  నాన్సెన్స్. అంతకంతకీ సస్పెన్స్ తో చంపే ట్రాక్ ఇది ఇంటర్వెల్ ముందు. 

          అప్పుడు జలపాతం దగ్గరికి ఆమె వచ్చేసరికి - సెకండ్ హీరోయిన్ ని హగ్ చేసుకుంటూ మొత్తం చెడగొడతాడు హీరో. ఇక ప్లాట్ పాయింట్ వన్ ప్రకారం కథలేదు! వుండదు, నడవదు! ప్రేమలో రెండో హీరోయిన్ తో తుస్సుమనే ఇంటర్వెల్ - అంత సస్పెన్స్ సృష్టించీ!!

          ఇక స్ట్రక్చర్ లేదు, సెకండాఫ్ లో ప్రకృతి లేదు, హీరో ఫోటోగ్రఫీ గోల్ లేదు. మూడు పాత్రల మధ్య చూసి చూసి విసిగిన అదే ముక్కోణ ప్రేమ గోల!
          మంజులకి ఇంకా ఇలాటి కథ మార్కెట్ లో పోతుందని ఎలా అన్పించిందో తెలీదు. తను ఆలశ్యంగా వచ్చారు.  పదేళ్ళ క్రితం వచ్చి వుంటే వర్కౌట్ అయ్యేదేమో. ఇప్పుడు ప్రేక్షకులు చాలా ముందు కెళ్ళి పోయారు. 

          నీతి : ఈ రోమాంటిక్ డ్రామాలతో అసమర్ధ పాత్రలు సృష్టించి ఏం చెప్పదల్చుకున్నారు?  కమిటయ్యే ఆలోచన లేకపోయినా ప్రేమస్నేహాలు చేస్తూ తిరిగి,  తీరా చెప్పమంటే నువ్వు కాదు అదీ (వాడూ) అని ఇంకో శాల్తీని చూపించడమా? దాంతో అదీ సాధ్యం చేసుకోలేక ఏడ్చి,  మొదటి ఆప్షన్ కే సెటిలవడమా? 

          ప్రాక్టికల్ గా వ్యవహరించే  పాత్రలు కమిట్ మెంట్ గురించి ఆలోచిస్తాయి. ఇప్పుడు కమిటయ్యే పరిస్థితుల్లేకపోతే, ఎఫైర్స్ కి దూరంగా వుంటాయి. కమిటయ్యాయంటే ఇక బ్యాండ్ బాజా బారాత్ లే - ఇంకా ఎఫైర్స్ తో కాలం  గడపడం వుండదు. ప్రేమ కమిట్ మెంట్ కాదు, పెళ్లిని కలుపుకున్న ప్రేమే కమిట్ మెంట్ అన్నట్టు వుంటాయి రియలిస్టిక్ పాత్రలు. కమిటయ్యామా, బ్యాండ్ బాజా బారాత్ లే, పిచ్చి ప్రేమలు కాదు.


సికిందర్


Wednesday, February 14, 2018

604 : ఇంటర్వ్యూ!


        జి. ధనుంజయన్ తమిళ మలయాళ హిందీ సినిమా రంగాల్లో పేరున్న నిర్మాతగా, కాలమిస్టుగా క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. నిర్మాతగా సంకట్ సిటీ (2009), కందెం కథలై (2009),  ముగమూడి ( 2012), అంజాన్ (2014),  ఇరుది సుత్రు (2016) వంటి సినిమాలు నిర్మించారు. కాలమిస్టుగా గలాటా సినిమా, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికల్లో విస్తృతంగా సినిమా రంగానికి సంబంధించి వ్యాసాలు రాస్తున్నారు. మంచి స్క్రిప్తులు రాయడం,  నిర్మాతల్ని పొందడం, మార్కెట్ ని అవగాహన చేసుకోవడం, ఫైనాన్స్, ట్రెండ్స్, జానర్స్ వంటి అనేక అంశాల పైన విశేషంగా రాశారు. గత డిసెంబరులో తను రాసిన వ్యాసాలని  ‘ది ఆర్ట్ అండ్ బిజినెస్ అఫ్ సినిమా’ పేరుతో  గ్రంథంగా  వెలువరించారు. ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం...
మీరు నిర్మాతగా వుంటూ కాలమిస్టుగా ఎలా మారారు?
         
నేనేదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడల్లా దాని గురించి రాసుకోవడం అలవాటు. నిర్మాతగా  అలా రాసుకున్న నా అనుభవాలు, చేసిన పొరపాట్లు షేర్ చేసుకుంటే ఇతరులకి ఉపయోగ పడొచ్చన్న ఉద్దేశంతో పత్రికలకి పంపసాగాను. వుంటున్న రంగం గురించే రాస్తున్నాను కాబట్టి పెద్దగా శ్రమ అనిపించదు. సమయం లేకపోవడమంటూ వుండదు. 
          చాలా మంది కొత్తగా వచ్చే నిర్మాతల్ని కలుస్తూంటాను. వాళ్ళు తాము ఎదుర్కొన్న కష్టాల గురింఛి చెప్పుకుపోతూంటారు. డబ్బెలా నష్టపోయిందీ, కథల విషయంలో ఎలా పొరపాట్లు చేసిందీ చెప్తూంటారు. 2017 లో చాలా మంది కొత్తవాళ్ళు దర్శకులయ్యారు. మొత్తం 160 మంది దర్శకులుగా కొత్తగా పరిచయమైతే, వాళ్ళల్లో ఏడుగురు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా 153 మంది సంగతేమిటి? వాళ్లకి మళ్ళీ అవకాశాలు రావడం కల్ల.  2017 లోనే కొత్తగా వచ్చిన నిర్మాతలు 160 సినిమాలు నిర్మించారు. ముగ్గురే సక్సెస్ కాగల్గారు. ఏ అనుభవమూ, విషయ పరిజ్ఞానమూ అవసరం లేకుండా ప్రవేశించగల్గే రంగం సినిమా రంగమొక్కటే. కొత్తగా వస్తున్న నిర్మాతల ధోరణి  ఎలా వుంటోందంటే - బాగా డబ్బుండి, కొన్నిసినిమాలు చూసి వుంటే చాలు,  సినిమాలు నిర్మించెయ్య వచ్చను కుంటున్నారు. ఇదే నిర్మాతలకి క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు.
మీరు రాసిన ఒక వ్యాసంలో, తమిళ సినిమా రంగంలో దర్శకులు తాము సవ్య సాచులుగా ఫీలవుతారని రాశారు. దీన్ని వివరిస్తారా?
          వాళ్ళొక్కరే కథ, మాటలు, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం అంతా చేసేయ వచ్చనుకుంటారు.  ఈ మోజులో సినిమా నిర్మాణం ఒక సమిష్టి సృజనాత్మక ప్రక్రియ కాకుండా పోయింది. ఇది కె.  బాలచందర్, భాగ్య రాజాలతో ప్రారంభమైంది. దాంతో ఇక ప్రతి వొక్కరూ భాగ్యరాజాలూ, లేదా టి. రాజేందర్ లూ  అయిపోవాలని ఆలోచించడం మొదలెట్టారు. క్రెడిట్స్ అన్నీ తమకే వుండాలి, పేరంతా తమకే రావాలి. మహేంద్రన్ లాంటి ఏ కొద్ది మందో ఇతరుల కథలు తీసుకుని  సినిమాలు తీశారు. ఇప్పుడు దర్శకులు తామే కథ రాసుకుని,  తామే స్క్రీన్ ప్లే రాసుకుని, తామే మాటలు రాసుకుని,  దర్శకత్వం వహించాలని మోజు పెంచుకున్నారు. కొందరైతే కెమెరా కూడా తామే, ఎడిటింగ్ కూడా తామే అయిపోయారు. దీని వల్ల శాఖలు ఒక్కచోటే కేంద్రీకృతమవుతాయి. దీంతో పనిభారం పెరుగుతుంది. పనిభారం పెరిగితే ఒక్కోశాఖమీద పెట్టాల్సిన దృష్టి నంతా పెట్టలేరు. కథ మీద పెట్టాల్సిన దృష్టి నంతా కథ మీద పెట్టలేరు, స్క్రీన్ ప్లే మీద చేయాల్సిన ఆలోచనంతా స్క్రీన్ ప్లే మీద చెయ్యలేరు, అలాగే మాటల  మీద వెచ్చించాల్సిన సమయం మాటల మీదా  వెచ్చించ లేరు. కథ రాసుకునేప్పటికే క్రియేటివిటీ అంతా తోడేసినట్టవుతుంది. స్క్రీన్ ప్లేకి క్రియేటివ్ వూట వూరదు. మాటలకొచ్చేటప్పటికి  పూర్తిగా ఎండిపోయి వుంటుంది. ఇది తెలుసుకోరు. ఈ పనులన్నీ అసిస్టెంట్స్ ని కూర్చోబెట్టుకునే చేస్తూంటారు. ఆ అసిస్టెంట్స్  ప్రతీ దానికీ గ్రేట్ సర్! గ్రేట్ సర్! అని వంత పాడుతూంటారు. మొత్తం సమస్యంతా ఈ ఆల్ రౌండర్ దర్శకులతోనే వస్తోంది. వీళ్ళ వల్లే ఇన్ని ఫ్లాపులు వస్తున్నాయి.
స్టారు సినిమా కన్నా ఎక్కువ కాదని మీరన్నారు?
          పూర్తిగా  నిజం. స్టార్ అనే అతను ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబట్ట గలడు. ఆ తర్వాత సినిమాలో దమ్ముంటేనే కలెక్షన్సు వస్తాయి. మొదటి ఆట పూర్తయ్యాక ఆ సినిమా కథ, దాని మెరిట్ ఇవి మాత్రమే  సినిమా జాతకాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని సార్లు స్క్రిప్టుని స్టార్ కనుగుణంగా మార్చాల్సి వస్తుంది నిజమే. అది మంచిది కూడా. అయితే ముందుగా ఆ స్క్రిప్టు దానికది బావుండాలి.  వున్నప్పుడు స్టార్ కోసం కొంత క్వాలిటీ తగ్గినా  సోల్ దెబ్బ తినకుండా వుంటుంది. ఇక ఒక స్టార్ కోసమే అని స్క్రిప్టు రాయడం ఎవరికీ సాధ్యం కాదు, ఆది వర్కౌట్ కాదు కూడా.  
పాజిటివ్ మెసేజి ఇవ్వడం తమిళ సినిమాలకి ఒక ప్రత్యేకతగా భాసిస్తోంది. ఎందువల్ల? ‘యాంగ్రీ యంగ్ మాన్ - ఎవర్ గ్రీన్ తమిళ సినిమా జానర్’  అని మీరొక వ్యాసం కూడా రాశారు. 
          ప్రజల కంటే స్టార్ పై స్థాయిలో వుండాలన్న అవసరంలోంచి మెసేజిల ట్రెండ్ ప్రారంభమయింది. బిగ్ స్టార్ గా ఒకరున్నప్పుడు, కొన్ని ఉన్నత విలువల్ని సినిమాల్లో ప్రకటించే అవకాశం లభిస్తుంది. ఒక స్థాయికి వచ్చిన హీరో లందరూ సినిమాల ద్వారా ఏదోవొకటి తాము చెప్పాలనే విశ్వసిస్తారు. ఇప్పుడున్న పాపులర్ హీరోలు రాజకీయ ఆకాంక్షలతో వున్నారు కూడా.
          మెసేజి సినిమాల ఆద్యుడు ఎమ్జీఆర్. వినోదాత్మక సినిమాల్లో  మెసేజిలిచ్చే ట్రెండ్ ని ఆయనే ప్రారంభించారు. ఎమ్జీఆర్ కి నటన ఒక్కటే ముఖ్యంకాదు, ఆ వినోదంతో బాటు సందేశం కూడా  అందించాలన్నదే ఆయన  నమ్మిన సూత్రం. ఇందులో ఆయన  సక్సెస్ అయ్యారు. కాబట్టి రజనీకాంత్ ఫాలో అవుతున్నారు. రజనికాంత్ ఫాలో  అవుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ  ఫాలో అవుతున్నారు.
          యాంగ్రీ యంగ్  మాన్ జానర్ తమిళంలో 1950 లనుంచీ వుంది. అప్పట్లో సమాజంలో అణచివేతని, దానిపట్ల ప్రజల ఆగ్రహాన్నీఅప్పటి  సినిమాలు ప్రతిబింబించాయి. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఇక  అస్పృశ్యతా భావం, బాల్యవివాహాలూ లాంటి అనాచారాలు పోవాలనే ప్రజలు కోరుకున్నారు. అలా సమాజాన్ని సంస్కరించే యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో అప్పట్లో శివాజీ గణేశన్ నటించిందే ‘పరాశక్తి’.

         
ఇవ్వాళ చూస్తే, రాజకీయాల పట్ల చాలా ఆగ్రహం నెలకొని వుంది. గత ఏడాది కాలంగా తమిళ నాడు రాజకీయాలు బాగా భ్రష్టుపట్టాయని  ప్రజలు కోపంగా వున్నారు. ఈ వాతావరణంలో  కొత్త నాయకులు వచ్చి చక్కదిద్దాలన్న కోరికతో వున్నారు. ఇందుకే యాంగ్రీ యంగ్ మాన్ ఇంకా సజీవంగా వున్నాడు.
తమిళ సినిమా రంగం ఎందుకని అస్తవ్యస్తంగా వుంది? ప్రత్యేకించి సినిమాల విడుదల తేదీల విషయంలో?
         
ఐకమత్యం లేకపోవడమే కారణం. ప్రొఫెషనలిజం అసలే లేదు. లేకపోతే ఆరు సినిమాలు ఒకే రోజు ఎందుకు విడుదల చేస్తారు? అవన్నీ ఎవరు చూస్తారు? మార్కెట్ పై అవగాహన లేకుండా విడుదల తేదీల్ని నిర్ణయించేస్తున్నారు. థియేటర్ లు దొరుకుతాయా  లేదా అని  నిర్మాత లెవరూ కేర్ చేయడం లేదు. అందుకే కష్టాల పాలవుతున్నారు. పెద్ద సినిమాలు 90 శాతం ఫ్లాపవడం, చిన్న సినిమాలు 95 శాతం ఫ్లాపవడం ఒక పారంపర్య సాంప్రదాయంగా మారింది. కేవలం ప్రొఫెషనలిజం లోపించడమే దీనికంతటికీ కారణం.
ఇవ్వాళ తమిళ సినిమా మార్కెట్ ఎంత? 
          ఇవ్వాళ తమిళ సినిమాలు 35 దేశాల వరకూ విస్తరించాయి. అంటే పెద్ద మార్కెట్ నే కలిగి వుందని చెప్పొచ్చు. అయితే ఇది పెద్ద సినిమాలకి మాత్రమే. చిన్న సినిమాలకి విదేశీ మార్కెట్ లేదు. అవి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా చేరుతున్నాయి.
తెలుగు -  తమిళ ద్విభాషా చిత్రాల ఫార్ములాతో బాగానే సినిమాలు వస్తున్నా
యేమో?

          లేదు. ‘స్పైడర్’ తో చేదు అనుభవమే ఎదురయింది. నిర్మాతలెవరూ ఇక ద్విభాషా చిత్రాల ఆలోచన చేయడం లేదు. ప్రయోగాత్మకంగా ప్రారంభించారు., ప్రయోజనం లేదని విరమించుకున్నారు.
మీరు ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం రావాలని రాశారు. అంటే ఏమిటి?
         
ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం అమలుపరచాలని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మార్నింగ్ షోలకి తక్కువ టికెట్ ధరలు, వారాంతపు షోలకి ఎక్కువ టికెట్ ధరలు. అలాగే చిన్నసినిమాలకి తక్కువ టికెట్ ధరలు, పెద్ద సినిమాలకి అధిక టికెట్ ధరలు ... ఇలా చేయడంవల్ల,  చిన్నా పెద్దా సినిమాలన్నిటికీ మంచి రెవెన్యూ వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా చిన్న సినిమాలు బాగా ఆడతాయి.
మీరు అమ్ముడుపోని సినిమాల మీదొక వ్యాసం రాశారు. దీని గురించి చెప్పండి.  
          సినిమాల కొనుగోళ్ళ విషయానికొస్తే శాటిలైట్ నెట్వర్కుల నిర్వాహకులు సెలెక్టివ్ గా వుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలైతేనే  కొనుగోలు చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలని పట్టించుకోవడం లేదు. ఏదో వొక రేటుకైనా  వాటిని కొనడం లేదు. ఇక నిర్మాతలు తప్పని సరై డిజిటల్ ఆప్షన్స్ వంక చూడాల్సి వస్తోంది.
బాక్సాఫీసు ఫిగర్స్ ని ఓవర్ రిపోర్టింగ్ చేసే ధోరణి ప్రబలిపోయింది. థియేటర్లకి కంప్యూట రైజుడు బిల్లింగ్ విధానం లేదు. దీంతో ఎదురవుతున్న సవాళ్లేమిటి?
          థియేటర్ల యాజమాన్యాలు నిజమైన కలెక్షన్స్ ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా ఎల్లకాలం ఫిగర్స్ ని దాచిపెట్ట లేరు, అవునా? ఈ పరిస్థితి తప్పక మారుతుందని నేను నమ్ముతున్నాను.
***