రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

605 : రివ్యూ!



రచనదర్శకత్వం : మంజుల ఘట్టమనేని 
తారాగణం : సందీప్కిషన్, అమైరా దస్తూర్,  బేబీ జాహ్నవి, త్రిధా చౌదరి, అదిత్అరుణ్,  ప్రియదర్శి, నాజర్ తదితరులు 
సంగీతం: రధన్, ఛాయాగ్రహణం : రవీ యాదవ్
బ్యానర్స్: ఆనంది ఆర్ట్స్, ఇందిరా ప్రొడక్షన్స్
నిర్మాత: పి.కిరణ్, సంజయ్స్వరూప్
విడుదల : ఫిబ్రవరి 16, 2018
          టి, నిర్మాత మంజుల దర్శత్వంలో కూడా తానేమిటో నిరూపించుకోవాలని ‘మనసుకు నచ్చింది’ తో ముందుకు వచ్చారు. డెబ్భై శాతం ప్రేమ సినిమాలతో నిండిపోయిన తెలుగు మార్కెట్లో తానేం  విభిన్న ప్రేమ సినిమాని అందిస్తున్నారా అని ఆశతో ఎదురు చూశారు అభిమానులు. ఆకర్షణీయమైన  తారాగణం,  నిపుణులైన సాంకేతికులు, ప్రముఖ నిర్మాణ సంస్థలూ సమకూరి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఎలా వచ్చారో చూద్దాం...

కథ
          బావా మరదళ్ళయిన సూరజ్ (సందీప్ కిషన్),  నిత్య (అమైరా దస్తూర్) లకి పెళ్ళిచేస్తూంటాడు తాత (నాజర్). పెళ్లి ఇష్టంలేని ఇద్దరూ మేం ఎవర్ని చేసుకోవాలో మేమే చూసుకుంటామని పెళ్లి పీటల మీంచి పారిపోతారు. గోవాలో బస చేస్తారు. నిత్య ప్రకృతి  ప్రేమికురాలు, సూరజ్  ఫోటో గ్రాఫర్. వీళ్ళిద్దరికీ అక్కడ నిక్కీ (త్రిదా చౌదరి) అభి (అదిత్ అరుణ్) అనే ఇద్దరు పరిచయమవుతారు. సూరజ్ నిక్కీ తో ప్రేమలో పడతాడు, నిత్య అభితో ప్రేమలో పడుతుంది. కానీ తనకి సూరజ్ తోనే ప్రేమ వుందని గుర్తిస్తుంది. ఈ విషయం సూరజ్ కెలా చెప్పాలో తెలీక క్షోభిస్తుంది. నిత్యకి ఈ క్షోభ  ఎలా తీరింది? ఆమె మనసు సూరజ్ అర్ధం జేసుకున్నాడా? ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది? ... అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ
          మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామని చెప్పే కథ.  జానర్ వచ్చేసి రోమాంటిక్ డ్రామా. మార్కెట్ యాస్పెక్ట్  వచ్చేసి సున్నా. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి రొటీన్ ముక్కోణ ప్రేమ. మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామన్న ప్రకారం మొదటి సగంలో సూరజ్ ఫోటోగ్రఫీకి వర్తింపజేసి చూపించినంత వరకూ బలంగానే వుంది.  రెండో సగంలో ఫ్లేటు ఫిరాయించి ప్రేమకి అన్వయించడంతో కథ ఏకసూత్రత దెబ్బతినిపోయింది. ఎత్తుకున్న కథకీ నడిపి ముగించిన కథకీ సంబంధం లేకుండాపోయింది. మార్కెట్ యాస్పెక్ట్ కి యూత్ అప్పీల్ కూడా ఏమీ లేదు. కథలో ప్రకృతిని భాగం చేసి పదేపదే ఫిలాసఫీ చెప్తూ పోవడంలో కథకురాలి నాలెడ్జిని రుద్దడమే వుంది తప్ప కమర్షియల్ విలువల పట్టింపు లేదు. రోమాంటిక్ కామెడీలుగా నడుస్తూ రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయే తెలుగు ప్రేమ సినిమాల మధ్య ఈ కథ ఇప్పుడు మార్కెట్ లేని  పూర్తి స్థాయి రోమాంటిక్ డ్రామా. క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసినా మాసిపోయిన అదే ముక్కోణ ప్రేమ డ్రామా. 2000 లనుంచీ చూసి చూసి వున్న  ‘నువ్వేకావాలి’ టైపు వడ్డన.  ఇంకా బావామరదళ్ళ కథ చూపించే బడాయి. ఫీల్డులో పాతుకుపోయి వున్న నిర్మాతలే,  దర్శకురాలే,  ఎవరో కొత్త వాళ్ళన్నట్టు మార్కెట్ అవగాహన లేకుండా ఇలా సినిమాలు తీస్తారా అనేది మిలియన్ రూకల ప్రశ్న.

ఎవరెలా చేశారు
          సందీప్ కిషన్ తో కలిసి అమైరా, త్రిధా, జాహ్నవీలు నటించారు. నిజానికిది బ్యూటిఫుల్ కాంబినేషన్. పాత్రలు లవబుల్ గావున్నాయి. ప్లేనే ఎలాగో వుంది. ఫస్టాఫ్ లో సందీప్ పాత్ర ప్రయాణం  ఫోటోగ్రఫీకి సంబంధించినంతవరకూ ఎంతోకొంత అర్ధవంతంగా,  యాక్టివ్ గా వున్నాయి. కనుక నటన కూడా బెటర్ అన్పించుకుంది. అతను నటించలేక కాదు, పాత్ర బావుండాలి. ఫోటోగ్రాఫర్ గా అతడి ఇగో దెబ్బతిన్నప్పుడు రేగే భావోద్వేగ ప్రదర్శన దీనికి నిదర్శనం. కానీ ఇలా నిలబెట్టుకున్న పాత్ర ఇటు వృత్తిరీత్యా, అటు ప్రేమ రీత్యా సస్పెన్స్ ని పోషించుకుంటూ ఇంటర్వెల్ కి చేరాక, అక్కడి మలుపుతో కుదేలైపోయింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో రెండో హీరోయిన్ తో ఇది ముక్కోణ ప్రేమ అన్నారో అక్కడ్నించీ సందీప్ పాత్రా,  దాని కథా దిగజారిపోయాయి. సెకండాఫ్ సహన పరీక్ష పెట్టడంతోనే సరిపోయింది. చివరికి ప్రేమలో ఏం చేయాలో కూడా తెలీక వెక్కి వెక్కి ఏడ్చి, రోమాంటిక్ డ్రామా మూస టెంప్లెట్  ప్రకారం పెద్ద వయసు పాత్ర (తాత ) ని ఆశ్రయించే పాసివ్ పాత్రగా మారిపోయింది. ఎలా మొదలైన పాత్ర ఎలా ముగిసింది! ఇలాటి పాత్రలో యూత్ తనని ఎందుకు చూడాలి? 

          అమైరా దస్తూర్ వండర్ఫుల్ నటి, ఫస్టాఫ్ వరకే. వొళ్ళంతా కళ్ళు చేసుకుని దిగ్భ్రమతో ప్రకృతిని చూసే, ఆరాధించే, ప్రకృతిలోనే గడిపే, ప్రకృతినే ప్రేమించి, అది చెప్పే వూసులు వినే, ఆ వూసుల్లోంచి జీవించడం నేర్చుకునే, ధ్యానమూ యోగా నేర్పే  ఫ్రెష్ క్యారక్టర్. ఈ పాత్ర ప్రయాణం ఎటువైపనేది ఒక సస్పెన్స్ పోషణ ఫస్టాఫ్ వరకే. కచ్చితంగా దర్శకురాలు తనదైన స్త్రీ దృక్కోణంలో పాత్రలకి ప్రకృతిని ఆపాదించి నడిపిస్తున్నదల్లా, ఇంటర్వెల్ రాగానే మేల్ డైరెక్టర్ ల మూసలో పడే సహజ బుద్ధినే ప్రదర్శించుకుంది కొందరు  దర్శకురాళ్ళ లాగే. ఒక దర్శకురాలిగా తీస్తున్నప్పుడు కూడా స్త్రీ స్పర్శతో  సినిమాలు వుండకపోతే ఇక తీయడమెందుకు?  ఇంటర్వెల్ దగ్గర్నుంచీ దర్శకురాలు మంజుల మంజులమైన తన అనుసృజనని వదులుకుని, తనతో బాటు అమైరా పాత్రనీ తీసికెళ్ళి మేల్   డైరెక్టర్ల మొరటు ముక్కోణ ప్రేమ డొమైన్ లో పడేశారు! 

          డిటో త్రిధా చౌదరి. ఫస్టాఫ్ మజా, సెకండాఫ్ సఫా. సఫా కాకుండా మంజుల కుమార్తె జాహ్నవియే చక్కగా మిగిలింది. ఆమె మాట తీరు, నటనలో వేగం ఇవే ఆద్యంతం ఈ సినిమా చూడగల్గేట్టు మిగిలాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి యాడ్ ఫిలిమ్స్ మేనేజర్ గా సీరియస్ పాత్రలోనే వుంటాడు. యాడ్ కంపెనీ హెడ్ గా సంజయ్ స్వరూప్ ది స్వల్ప పాత్ర, తాతగా నాజర్ దీ స్వల్ప పాత్రే. 

          రవీ యాదవ్ ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ క్వాలిటీతో కూడుకుని వుంది. గోవా లొకేషన్స్ ని కొత్తగా చూపించారు. ఈ విజువల్స్ కి రాధన్ సంగీతం, పాటలు ఓ మోస్తరుగా వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఇక ఫిలాసఫికల్ గా ప్రకృతి గురించి అన్నేసి మాటలు రాయడం సాయి మాధవ్  బుర్రాకి అనవసర ప్రయాసే. ప్రకృతిని చూపిస్తూ దాని గురించే చెప్పడంతో ఫీల్ పోవడమేగాక, ఫాలో కాలేని  ఫైలాసఫీతో ఇబ్బంది వచ్చింది. దీనికి ప్రారంభంలో చెప్పిన మహేష్ బాబు వాయిసోవర్ చాలు. ఇక మిగతా మాటలు ఫర్వా  లేదనిపించే స్థాయిలోనే రాశారు ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో పాత కథకి ఎంత డైలాగులు రాసినా లభంలేకుండా పోయింది. 


చివరి కేమిటి 
          ఏ దర్శకులైనా  సరీగ్గా రాయలేకపోతే తీయలేరు. రాత దగ్గరే వుంటుంది తలరాత. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దర్శకులు రాయకూడదు, తీయడం మీద దృష్టి పెట్టి రాయించుకోవాలి. అప్పుడే కథ, పాత్రచిత్రణలు, స్క్రీన్ ప్లే – వీటికి సంబంధించిన రీసెర్చి పూర్తి స్థాయిలో సాధ్యమవుతాయి. ఫైనల్ అవుట్ పుట్ పరిపూర్ణంగా వికాసం చెందే అవకాశముంటుంది. తమకే తెలీని లోతుపాతులు బయటపడతాయి. దర్శకులే రాస్తూ కూర్చుంటే,  వాళ్ళకుండే వివిధ వొత్తిళ్ళతో ఏ దశలోనూ రచన సమగ్ర రూపం సంతరించుకోదు. లోపాల పుట్టగానే మిగిలిపోతుంది. 90 శాతం ఫ్లాపుల ప్రధాన కారణమిదే. 

          దర్శకురాలు మంజుల సమస్య ఇదే. ఆమె చెప్పి రాయించుకుని వుంటే ఇంత ఆత్మాశ్రయ ధోరణిలో స్క్రిప్టు వుండేది కాదు స్వగతం చెప్పుకుంటున్నట్టు. ధోరణి కవితాత్మకమే, కానీ అదెలా చెప్పాలో తెలియలేదు. మణిరత్నం ప్రకృతిని వాడుకునే విధానం చూస్తే, ఆయన పాత్రల చేత భాష్యం చెప్పించడు, కామెంటరీలు చెప్పించడు- ప్రకృతే దాని చర్యలతో మాట్లాడుతున్నట్టు  చూపిస్తాడు, చెప్పడు ( ‘show, don’t tell’ సూత్రం). తాజా ‘చెలియా’ లో కూడా వొళ్ళు గగుర్పొడిచే మంచు తూఫాను నేపధ్యంలో ప్రేమికుల వాగ్యుద్ధం ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిత్రీకరించాడు. 

          మంజుల కూడా ప్రకృతితో అలజడి సృష్టించారు. సెలయేళ్ళు, జలపాతాలు, సముద్రాలు, వర్షం- వాటర్ వాటర్ ఎవ్విరీ వేర్ అన్నట్టుగా జల నేపధ్యం సృష్టించారు ప్రతీ కీలక సన్నివేశానికీ. అయితే వాటికి హీరోయిన్ పాత్ర ఫీలవ్వాలేగానీ,  ఆమే పక్క పాత్రలకి వాటి ప్రశస్తి జీవితాలకి అన్వయించి నూరిపోస్తే అభాసు అవుతుంది. ప్రకృతిని ప్రేక్షకులు ఫీలై అర్ధం చేసుకునే సబ్ టెక్స్ట్ గా వదిలెయ్యక – మంజుల తనకెంతో తెలుసన్న ధోరణిలో కామెంటరీలు చెప్పించారు. దీంతో విజువల్ పోయెట్రీ అంతా చెడి, సోదిలా మారింది. సోది ఎందుకంటే, అంత చెప్పడానికి ఆ లేత హీరోయిన్ పాత్ర జీవితానుభవమెంత. అంత జీవితానుభావమే వుంటే,  అలా పారిపోయి ఎందుకొస్తుంది. అంత మెచ్యూరిటీయే వుంటే, ఆ మెచ్యూరిటీతో పెద్దల్ని ఎందుకు ఒప్పించ లేకపోయింది. అంత యోగా  బోధిస్తూ తనెందుకు ఆరోగ్యకరంగా లేదు. అంత ధ్యానం నేర్పిస్తూ తనెందుకు సమస్యకి పరిష్కారం కనుగొనలేక సెకండాఫ్ అంతా ఏడుస్తూ కూర్చుంది. మెచ్యూరిటీ అంతా ప్రకృతికే వుంటుంది. మెచ్యురిటీ లేని పారిపోయి వచ్చిన పాత్రలు అందులో భాగమై నేర్చుకుంటాయి మేడం, నేర్పవు. పాత్రలు ఎదగడం నేర్చుకుంటాయి, ఎదిగిన పాత్రలతో కథ వుండదు. వుంటే కథకాదు. 

          ఫస్టాఫ్ స్ట్రక్చర్ లో వుంది. ముప్పావుగంటలో సందీప్ పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ సంఘటన బలమైన చిత్రీకరణ. ఫోటోగ్రాఫర్ గా అసమర్ధుడని అతను పొందే అవమానంతో రెబెల్ అయ్యే దృశ్య చిత్రీకరణ అద్భుతం. ఇలాటి బలమైన సంఘటనలతో ప్లాట్ పాయింట్ వన్ మలుపులు  సృష్టించడం సర్వసాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించదిప్పుడు. దీంతో అతను ఫోటోగ్రాఫర్ గా నిరూపించుకోవాలని సమకడ్తాడు. ప్రకృతిలో ఒక బాలిక (జాహ్నవి), ఆ బాలిక సీతాకోక చిలుక అబ్సెషన్, దాన్ని అతడికి అంటించడం, దాంతో అతను ప్రకృతిలో భాగమై, లీనమై- తనేం చేయాలో, ఎలా చేయాలో , హోరెత్తే జలపాతం దగ్గర  రియలైజేషన్ కొచ్చే మలుపు అంతా ఒక టెర్రిఫిక్ టేకింగ్. అద్భుత ఛాయాచిత్రాలు సృష్టించి సమాధానం చెప్తాడు. నిజానికి హీరోయిన్ వెంట వుండి  ప్రకృతి గురించి ఆమె పెట్టిన సొదకి  బోరు కొట్టించుకున్న తనే, ఇప్పుడా ప్రకృతితో బాగుపడ్డాడు. ఈ సైకో థెరఫీ కథనానికి మంచి డైనమిక్స్ గా  కుదిరింది. ఇక తనకి ప్రేమ చెప్తాడని ఆశిస్తుంది హీరోయిన్. అంతా సస్పెన్స్. జలపాతం దగ్గరికి రమ్మంటాడు. ఏం చెప్తాడు? ప్రేమ చెప్తాడా, లేక ప్రేమ తిరస్కరించి ఫోటోగ్రఫీ అంటాడా అని తీవ్ర ఉత్కంఠ. ప్రేమ చెప్పకూడదు, ప్లాట్ పాయింట్ వన్ ప్రేమ మీద లేదు. ఫోటోగ్రఫీ మీద వుంది. కాబట్టి ప్రేమ చెప్పడు, ఫోటోగ్రఫీ అంటాడేమో - తనొక స్పిరిచ్యువల్ అనుభవాన్ని పొందాక ప్రేమ ఎంత, కేవలం  నాన్సెన్స్. అంతకంతకీ సస్పెన్స్ తో చంపే ట్రాక్ ఇది ఇంటర్వెల్ ముందు. 

          అప్పుడు జలపాతం దగ్గరికి ఆమె వచ్చేసరికి - సెకండ్ హీరోయిన్ ని హగ్ చేసుకుంటూ మొత్తం చెడగొడతాడు హీరో. ఇక ప్లాట్ పాయింట్ వన్ ప్రకారం కథలేదు! వుండదు, నడవదు! ప్రేమలో రెండో హీరోయిన్ తో తుస్సుమనే ఇంటర్వెల్ - అంత సస్పెన్స్ సృష్టించీ!!

          ఇక స్ట్రక్చర్ లేదు, సెకండాఫ్ లో ప్రకృతి లేదు, హీరో ఫోటోగ్రఫీ గోల్ లేదు. మూడు పాత్రల మధ్య చూసి చూసి విసిగిన అదే ముక్కోణ ప్రేమ గోల!
          మంజులకి ఇంకా ఇలాటి కథ మార్కెట్ లో పోతుందని ఎలా అన్పించిందో తెలీదు. తను ఆలశ్యంగా వచ్చారు.  పదేళ్ళ క్రితం వచ్చి వుంటే వర్కౌట్ అయ్యేదేమో. ఇప్పుడు ప్రేక్షకులు చాలా ముందు కెళ్ళి పోయారు. 

          నీతి : ఈ రోమాంటిక్ డ్రామాలతో అసమర్ధ పాత్రలు సృష్టించి ఏం చెప్పదల్చుకున్నారు?  కమిటయ్యే ఆలోచన లేకపోయినా ప్రేమస్నేహాలు చేస్తూ తిరిగి,  తీరా చెప్పమంటే నువ్వు కాదు అదీ (వాడూ) అని ఇంకో శాల్తీని చూపించడమా? దాంతో అదీ సాధ్యం చేసుకోలేక ఏడ్చి,  మొదటి ఆప్షన్ కే సెటిలవడమా? 

          ప్రాక్టికల్ గా వ్యవహరించే  పాత్రలు కమిట్ మెంట్ గురించి ఆలోచిస్తాయి. ఇప్పుడు కమిటయ్యే పరిస్థితుల్లేకపోతే, ఎఫైర్స్ కి దూరంగా వుంటాయి. కమిటయ్యాయంటే ఇక బ్యాండ్ బాజా బారాత్ లే - ఇంకా ఎఫైర్స్ తో కాలం  గడపడం వుండదు. ప్రేమ కమిట్ మెంట్ కాదు, పెళ్లిని కలుపుకున్న ప్రేమే కమిట్ మెంట్ అన్నట్టు వుంటాయి రియలిస్టిక్ పాత్రలు. కమిటయ్యామా, బ్యాండ్ బాజా బారాత్ లే, పిచ్చి ప్రేమలు కాదు.


సికిందర్