రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, February 14, 2018

604 : ఇంటర్వ్యూ!


        జి. ధనుంజయన్ తమిళ మలయాళ హిందీ సినిమా రంగాల్లో పేరున్న నిర్మాతగా, కాలమిస్టుగా క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. నిర్మాతగా సంకట్ సిటీ (2009), కందెం కథలై (2009),  ముగమూడి ( 2012), అంజాన్ (2014),  ఇరుది సుత్రు (2016) వంటి సినిమాలు నిర్మించారు. కాలమిస్టుగా గలాటా సినిమా, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికల్లో విస్తృతంగా సినిమా రంగానికి సంబంధించి వ్యాసాలు రాస్తున్నారు. మంచి స్క్రిప్తులు రాయడం,  నిర్మాతల్ని పొందడం, మార్కెట్ ని అవగాహన చేసుకోవడం, ఫైనాన్స్, ట్రెండ్స్, జానర్స్ వంటి అనేక అంశాల పైన విశేషంగా రాశారు. గత డిసెంబరులో తను రాసిన వ్యాసాలని  ‘ది ఆర్ట్ అండ్ బిజినెస్ అఫ్ సినిమా’ పేరుతో  గ్రంథంగా  వెలువరించారు. ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం...
మీరు నిర్మాతగా వుంటూ కాలమిస్టుగా ఎలా మారారు?
         
నేనేదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడల్లా దాని గురించి రాసుకోవడం అలవాటు. నిర్మాతగా  అలా రాసుకున్న నా అనుభవాలు, చేసిన పొరపాట్లు షేర్ చేసుకుంటే ఇతరులకి ఉపయోగ పడొచ్చన్న ఉద్దేశంతో పత్రికలకి పంపసాగాను. వుంటున్న రంగం గురించే రాస్తున్నాను కాబట్టి పెద్దగా శ్రమ అనిపించదు. సమయం లేకపోవడమంటూ వుండదు. 
          చాలా మంది కొత్తగా వచ్చే నిర్మాతల్ని కలుస్తూంటాను. వాళ్ళు తాము ఎదుర్కొన్న కష్టాల గురింఛి చెప్పుకుపోతూంటారు. డబ్బెలా నష్టపోయిందీ, కథల విషయంలో ఎలా పొరపాట్లు చేసిందీ చెప్తూంటారు. 2017 లో చాలా మంది కొత్తవాళ్ళు దర్శకులయ్యారు. మొత్తం 160 మంది దర్శకులుగా కొత్తగా పరిచయమైతే, వాళ్ళల్లో ఏడుగురు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా 153 మంది సంగతేమిటి? వాళ్లకి మళ్ళీ అవకాశాలు రావడం కల్ల.  2017 లోనే కొత్తగా వచ్చిన నిర్మాతలు 160 సినిమాలు నిర్మించారు. ముగ్గురే సక్సెస్ కాగల్గారు. ఏ అనుభవమూ, విషయ పరిజ్ఞానమూ అవసరం లేకుండా ప్రవేశించగల్గే రంగం సినిమా రంగమొక్కటే. కొత్తగా వస్తున్న నిర్మాతల ధోరణి  ఎలా వుంటోందంటే - బాగా డబ్బుండి, కొన్నిసినిమాలు చూసి వుంటే చాలు,  సినిమాలు నిర్మించెయ్య వచ్చను కుంటున్నారు. ఇదే నిర్మాతలకి క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు.
మీరు రాసిన ఒక వ్యాసంలో, తమిళ సినిమా రంగంలో దర్శకులు తాము సవ్య సాచులుగా ఫీలవుతారని రాశారు. దీన్ని వివరిస్తారా?
          వాళ్ళొక్కరే కథ, మాటలు, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం అంతా చేసేయ వచ్చనుకుంటారు.  ఈ మోజులో సినిమా నిర్మాణం ఒక సమిష్టి సృజనాత్మక ప్రక్రియ కాకుండా పోయింది. ఇది కె.  బాలచందర్, భాగ్య రాజాలతో ప్రారంభమైంది. దాంతో ఇక ప్రతి వొక్కరూ భాగ్యరాజాలూ, లేదా టి. రాజేందర్ లూ  అయిపోవాలని ఆలోచించడం మొదలెట్టారు. క్రెడిట్స్ అన్నీ తమకే వుండాలి, పేరంతా తమకే రావాలి. మహేంద్రన్ లాంటి ఏ కొద్ది మందో ఇతరుల కథలు తీసుకుని  సినిమాలు తీశారు. ఇప్పుడు దర్శకులు తామే కథ రాసుకుని,  తామే స్క్రీన్ ప్లే రాసుకుని, తామే మాటలు రాసుకుని,  దర్శకత్వం వహించాలని మోజు పెంచుకున్నారు. కొందరైతే కెమెరా కూడా తామే, ఎడిటింగ్ కూడా తామే అయిపోయారు. దీని వల్ల శాఖలు ఒక్కచోటే కేంద్రీకృతమవుతాయి. దీంతో పనిభారం పెరుగుతుంది. పనిభారం పెరిగితే ఒక్కోశాఖమీద పెట్టాల్సిన దృష్టి నంతా పెట్టలేరు. కథ మీద పెట్టాల్సిన దృష్టి నంతా కథ మీద పెట్టలేరు, స్క్రీన్ ప్లే మీద చేయాల్సిన ఆలోచనంతా స్క్రీన్ ప్లే మీద చెయ్యలేరు, అలాగే మాటల  మీద వెచ్చించాల్సిన సమయం మాటల మీదా  వెచ్చించ లేరు. కథ రాసుకునేప్పటికే క్రియేటివిటీ అంతా తోడేసినట్టవుతుంది. స్క్రీన్ ప్లేకి క్రియేటివ్ వూట వూరదు. మాటలకొచ్చేటప్పటికి  పూర్తిగా ఎండిపోయి వుంటుంది. ఇది తెలుసుకోరు. ఈ పనులన్నీ అసిస్టెంట్స్ ని కూర్చోబెట్టుకునే చేస్తూంటారు. ఆ అసిస్టెంట్స్  ప్రతీ దానికీ గ్రేట్ సర్! గ్రేట్ సర్! అని వంత పాడుతూంటారు. మొత్తం సమస్యంతా ఈ ఆల్ రౌండర్ దర్శకులతోనే వస్తోంది. వీళ్ళ వల్లే ఇన్ని ఫ్లాపులు వస్తున్నాయి.
స్టారు సినిమా కన్నా ఎక్కువ కాదని మీరన్నారు?
          పూర్తిగా  నిజం. స్టార్ అనే అతను ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబట్ట గలడు. ఆ తర్వాత సినిమాలో దమ్ముంటేనే కలెక్షన్సు వస్తాయి. మొదటి ఆట పూర్తయ్యాక ఆ సినిమా కథ, దాని మెరిట్ ఇవి మాత్రమే  సినిమా జాతకాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని సార్లు స్క్రిప్టుని స్టార్ కనుగుణంగా మార్చాల్సి వస్తుంది నిజమే. అది మంచిది కూడా. అయితే ముందుగా ఆ స్క్రిప్టు దానికది బావుండాలి.  వున్నప్పుడు స్టార్ కోసం కొంత క్వాలిటీ తగ్గినా  సోల్ దెబ్బ తినకుండా వుంటుంది. ఇక ఒక స్టార్ కోసమే అని స్క్రిప్టు రాయడం ఎవరికీ సాధ్యం కాదు, ఆది వర్కౌట్ కాదు కూడా.  
పాజిటివ్ మెసేజి ఇవ్వడం తమిళ సినిమాలకి ఒక ప్రత్యేకతగా భాసిస్తోంది. ఎందువల్ల? ‘యాంగ్రీ యంగ్ మాన్ - ఎవర్ గ్రీన్ తమిళ సినిమా జానర్’  అని మీరొక వ్యాసం కూడా రాశారు. 
          ప్రజల కంటే స్టార్ పై స్థాయిలో వుండాలన్న అవసరంలోంచి మెసేజిల ట్రెండ్ ప్రారంభమయింది. బిగ్ స్టార్ గా ఒకరున్నప్పుడు, కొన్ని ఉన్నత విలువల్ని సినిమాల్లో ప్రకటించే అవకాశం లభిస్తుంది. ఒక స్థాయికి వచ్చిన హీరో లందరూ సినిమాల ద్వారా ఏదోవొకటి తాము చెప్పాలనే విశ్వసిస్తారు. ఇప్పుడున్న పాపులర్ హీరోలు రాజకీయ ఆకాంక్షలతో వున్నారు కూడా.
          మెసేజి సినిమాల ఆద్యుడు ఎమ్జీఆర్. వినోదాత్మక సినిమాల్లో  మెసేజిలిచ్చే ట్రెండ్ ని ఆయనే ప్రారంభించారు. ఎమ్జీఆర్ కి నటన ఒక్కటే ముఖ్యంకాదు, ఆ వినోదంతో బాటు సందేశం కూడా  అందించాలన్నదే ఆయన  నమ్మిన సూత్రం. ఇందులో ఆయన  సక్సెస్ అయ్యారు. కాబట్టి రజనీకాంత్ ఫాలో అవుతున్నారు. రజనికాంత్ ఫాలో  అవుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ  ఫాలో అవుతున్నారు.
          యాంగ్రీ యంగ్  మాన్ జానర్ తమిళంలో 1950 లనుంచీ వుంది. అప్పట్లో సమాజంలో అణచివేతని, దానిపట్ల ప్రజల ఆగ్రహాన్నీఅప్పటి  సినిమాలు ప్రతిబింబించాయి. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఇక  అస్పృశ్యతా భావం, బాల్యవివాహాలూ లాంటి అనాచారాలు పోవాలనే ప్రజలు కోరుకున్నారు. అలా సమాజాన్ని సంస్కరించే యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో అప్పట్లో శివాజీ గణేశన్ నటించిందే ‘పరాశక్తి’.

         
ఇవ్వాళ చూస్తే, రాజకీయాల పట్ల చాలా ఆగ్రహం నెలకొని వుంది. గత ఏడాది కాలంగా తమిళ నాడు రాజకీయాలు బాగా భ్రష్టుపట్టాయని  ప్రజలు కోపంగా వున్నారు. ఈ వాతావరణంలో  కొత్త నాయకులు వచ్చి చక్కదిద్దాలన్న కోరికతో వున్నారు. ఇందుకే యాంగ్రీ యంగ్ మాన్ ఇంకా సజీవంగా వున్నాడు.
తమిళ సినిమా రంగం ఎందుకని అస్తవ్యస్తంగా వుంది? ప్రత్యేకించి సినిమాల విడుదల తేదీల విషయంలో?
         
ఐకమత్యం లేకపోవడమే కారణం. ప్రొఫెషనలిజం అసలే లేదు. లేకపోతే ఆరు సినిమాలు ఒకే రోజు ఎందుకు విడుదల చేస్తారు? అవన్నీ ఎవరు చూస్తారు? మార్కెట్ పై అవగాహన లేకుండా విడుదల తేదీల్ని నిర్ణయించేస్తున్నారు. థియేటర్ లు దొరుకుతాయా  లేదా అని  నిర్మాత లెవరూ కేర్ చేయడం లేదు. అందుకే కష్టాల పాలవుతున్నారు. పెద్ద సినిమాలు 90 శాతం ఫ్లాపవడం, చిన్న సినిమాలు 95 శాతం ఫ్లాపవడం ఒక పారంపర్య సాంప్రదాయంగా మారింది. కేవలం ప్రొఫెషనలిజం లోపించడమే దీనికంతటికీ కారణం.
ఇవ్వాళ తమిళ సినిమా మార్కెట్ ఎంత? 
          ఇవ్వాళ తమిళ సినిమాలు 35 దేశాల వరకూ విస్తరించాయి. అంటే పెద్ద మార్కెట్ నే కలిగి వుందని చెప్పొచ్చు. అయితే ఇది పెద్ద సినిమాలకి మాత్రమే. చిన్న సినిమాలకి విదేశీ మార్కెట్ లేదు. అవి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా చేరుతున్నాయి.
తెలుగు -  తమిళ ద్విభాషా చిత్రాల ఫార్ములాతో బాగానే సినిమాలు వస్తున్నా
యేమో?

          లేదు. ‘స్పైడర్’ తో చేదు అనుభవమే ఎదురయింది. నిర్మాతలెవరూ ఇక ద్విభాషా చిత్రాల ఆలోచన చేయడం లేదు. ప్రయోగాత్మకంగా ప్రారంభించారు., ప్రయోజనం లేదని విరమించుకున్నారు.
మీరు ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం రావాలని రాశారు. అంటే ఏమిటి?
         
ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం అమలుపరచాలని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మార్నింగ్ షోలకి తక్కువ టికెట్ ధరలు, వారాంతపు షోలకి ఎక్కువ టికెట్ ధరలు. అలాగే చిన్నసినిమాలకి తక్కువ టికెట్ ధరలు, పెద్ద సినిమాలకి అధిక టికెట్ ధరలు ... ఇలా చేయడంవల్ల,  చిన్నా పెద్దా సినిమాలన్నిటికీ మంచి రెవెన్యూ వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా చిన్న సినిమాలు బాగా ఆడతాయి.
మీరు అమ్ముడుపోని సినిమాల మీదొక వ్యాసం రాశారు. దీని గురించి చెప్పండి.  
          సినిమాల కొనుగోళ్ళ విషయానికొస్తే శాటిలైట్ నెట్వర్కుల నిర్వాహకులు సెలెక్టివ్ గా వుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలైతేనే  కొనుగోలు చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలని పట్టించుకోవడం లేదు. ఏదో వొక రేటుకైనా  వాటిని కొనడం లేదు. ఇక నిర్మాతలు తప్పని సరై డిజిటల్ ఆప్షన్స్ వంక చూడాల్సి వస్తోంది.
బాక్సాఫీసు ఫిగర్స్ ని ఓవర్ రిపోర్టింగ్ చేసే ధోరణి ప్రబలిపోయింది. థియేటర్లకి కంప్యూట రైజుడు బిల్లింగ్ విధానం లేదు. దీంతో ఎదురవుతున్న సవాళ్లేమిటి?
          థియేటర్ల యాజమాన్యాలు నిజమైన కలెక్షన్స్ ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా ఎల్లకాలం ఫిగర్స్ ని దాచిపెట్ట లేరు, అవునా? ఈ పరిస్థితి తప్పక మారుతుందని నేను నమ్ముతున్నాను.
***