రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, February 16, 2018

605 : రివ్యూ!



రచనదర్శకత్వం : మంజుల ఘట్టమనేని 
తారాగణం : సందీప్కిషన్, అమైరా దస్తూర్,  బేబీ జాహ్నవి, త్రిధా చౌదరి, అదిత్అరుణ్,  ప్రియదర్శి, నాజర్ తదితరులు 
సంగీతం: రధన్, ఛాయాగ్రహణం : రవీ యాదవ్
బ్యానర్స్: ఆనంది ఆర్ట్స్, ఇందిరా ప్రొడక్షన్స్
నిర్మాత: పి.కిరణ్, సంజయ్స్వరూప్
విడుదల : ఫిబ్రవరి 16, 2018
          టి, నిర్మాత మంజుల దర్శత్వంలో కూడా తానేమిటో నిరూపించుకోవాలని ‘మనసుకు నచ్చింది’ తో ముందుకు వచ్చారు. డెబ్భై శాతం ప్రేమ సినిమాలతో నిండిపోయిన తెలుగు మార్కెట్లో తానేం  విభిన్న ప్రేమ సినిమాని అందిస్తున్నారా అని ఆశతో ఎదురు చూశారు అభిమానులు. ఆకర్షణీయమైన  తారాగణం,  నిపుణులైన సాంకేతికులు, ప్రముఖ నిర్మాణ సంస్థలూ సమకూరి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఎలా వచ్చారో చూద్దాం...

కథ
          బావా మరదళ్ళయిన సూరజ్ (సందీప్ కిషన్),  నిత్య (అమైరా దస్తూర్) లకి పెళ్ళిచేస్తూంటాడు తాత (నాజర్). పెళ్లి ఇష్టంలేని ఇద్దరూ మేం ఎవర్ని చేసుకోవాలో మేమే చూసుకుంటామని పెళ్లి పీటల మీంచి పారిపోతారు. గోవాలో బస చేస్తారు. నిత్య ప్రకృతి  ప్రేమికురాలు, సూరజ్  ఫోటో గ్రాఫర్. వీళ్ళిద్దరికీ అక్కడ నిక్కీ (త్రిదా చౌదరి) అభి (అదిత్ అరుణ్) అనే ఇద్దరు పరిచయమవుతారు. సూరజ్ నిక్కీ తో ప్రేమలో పడతాడు, నిత్య అభితో ప్రేమలో పడుతుంది. కానీ తనకి సూరజ్ తోనే ప్రేమ వుందని గుర్తిస్తుంది. ఈ విషయం సూరజ్ కెలా చెప్పాలో తెలీక క్షోభిస్తుంది. నిత్యకి ఈ క్షోభ  ఎలా తీరింది? ఆమె మనసు సూరజ్ అర్ధం జేసుకున్నాడా? ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది? ... అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ
          మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామని చెప్పే కథ.  జానర్ వచ్చేసి రోమాంటిక్ డ్రామా. మార్కెట్ యాస్పెక్ట్  వచ్చేసి సున్నా. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి రొటీన్ ముక్కోణ ప్రేమ. మనసుకి నచ్చింది చేస్తే ఏమైనా సాధిస్తామన్న ప్రకారం మొదటి సగంలో సూరజ్ ఫోటోగ్రఫీకి వర్తింపజేసి చూపించినంత వరకూ బలంగానే వుంది.  రెండో సగంలో ఫ్లేటు ఫిరాయించి ప్రేమకి అన్వయించడంతో కథ ఏకసూత్రత దెబ్బతినిపోయింది. ఎత్తుకున్న కథకీ నడిపి ముగించిన కథకీ సంబంధం లేకుండాపోయింది. మార్కెట్ యాస్పెక్ట్ కి యూత్ అప్పీల్ కూడా ఏమీ లేదు. కథలో ప్రకృతిని భాగం చేసి పదేపదే ఫిలాసఫీ చెప్తూ పోవడంలో కథకురాలి నాలెడ్జిని రుద్దడమే వుంది తప్ప కమర్షియల్ విలువల పట్టింపు లేదు. రోమాంటిక్ కామెడీలుగా నడుస్తూ రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయే తెలుగు ప్రేమ సినిమాల మధ్య ఈ కథ ఇప్పుడు మార్కెట్ లేని  పూర్తి స్థాయి రోమాంటిక్ డ్రామా. క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసినా మాసిపోయిన అదే ముక్కోణ ప్రేమ డ్రామా. 2000 లనుంచీ చూసి చూసి వున్న  ‘నువ్వేకావాలి’ టైపు వడ్డన.  ఇంకా బావామరదళ్ళ కథ చూపించే బడాయి. ఫీల్డులో పాతుకుపోయి వున్న నిర్మాతలే,  దర్శకురాలే,  ఎవరో కొత్త వాళ్ళన్నట్టు మార్కెట్ అవగాహన లేకుండా ఇలా సినిమాలు తీస్తారా అనేది మిలియన్ రూకల ప్రశ్న.

ఎవరెలా చేశారు
          సందీప్ కిషన్ తో కలిసి అమైరా, త్రిధా, జాహ్నవీలు నటించారు. నిజానికిది బ్యూటిఫుల్ కాంబినేషన్. పాత్రలు లవబుల్ గావున్నాయి. ప్లేనే ఎలాగో వుంది. ఫస్టాఫ్ లో సందీప్ పాత్ర ప్రయాణం  ఫోటోగ్రఫీకి సంబంధించినంతవరకూ ఎంతోకొంత అర్ధవంతంగా,  యాక్టివ్ గా వున్నాయి. కనుక నటన కూడా బెటర్ అన్పించుకుంది. అతను నటించలేక కాదు, పాత్ర బావుండాలి. ఫోటోగ్రాఫర్ గా అతడి ఇగో దెబ్బతిన్నప్పుడు రేగే భావోద్వేగ ప్రదర్శన దీనికి నిదర్శనం. కానీ ఇలా నిలబెట్టుకున్న పాత్ర ఇటు వృత్తిరీత్యా, అటు ప్రేమ రీత్యా సస్పెన్స్ ని పోషించుకుంటూ ఇంటర్వెల్ కి చేరాక, అక్కడి మలుపుతో కుదేలైపోయింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో రెండో హీరోయిన్ తో ఇది ముక్కోణ ప్రేమ అన్నారో అక్కడ్నించీ సందీప్ పాత్రా,  దాని కథా దిగజారిపోయాయి. సెకండాఫ్ సహన పరీక్ష పెట్టడంతోనే సరిపోయింది. చివరికి ప్రేమలో ఏం చేయాలో కూడా తెలీక వెక్కి వెక్కి ఏడ్చి, రోమాంటిక్ డ్రామా మూస టెంప్లెట్  ప్రకారం పెద్ద వయసు పాత్ర (తాత ) ని ఆశ్రయించే పాసివ్ పాత్రగా మారిపోయింది. ఎలా మొదలైన పాత్ర ఎలా ముగిసింది! ఇలాటి పాత్రలో యూత్ తనని ఎందుకు చూడాలి? 

          అమైరా దస్తూర్ వండర్ఫుల్ నటి, ఫస్టాఫ్ వరకే. వొళ్ళంతా కళ్ళు చేసుకుని దిగ్భ్రమతో ప్రకృతిని చూసే, ఆరాధించే, ప్రకృతిలోనే గడిపే, ప్రకృతినే ప్రేమించి, అది చెప్పే వూసులు వినే, ఆ వూసుల్లోంచి జీవించడం నేర్చుకునే, ధ్యానమూ యోగా నేర్పే  ఫ్రెష్ క్యారక్టర్. ఈ పాత్ర ప్రయాణం ఎటువైపనేది ఒక సస్పెన్స్ పోషణ ఫస్టాఫ్ వరకే. కచ్చితంగా దర్శకురాలు తనదైన స్త్రీ దృక్కోణంలో పాత్రలకి ప్రకృతిని ఆపాదించి నడిపిస్తున్నదల్లా, ఇంటర్వెల్ రాగానే మేల్ డైరెక్టర్ ల మూసలో పడే సహజ బుద్ధినే ప్రదర్శించుకుంది కొందరు  దర్శకురాళ్ళ లాగే. ఒక దర్శకురాలిగా తీస్తున్నప్పుడు కూడా స్త్రీ స్పర్శతో  సినిమాలు వుండకపోతే ఇక తీయడమెందుకు?  ఇంటర్వెల్ దగ్గర్నుంచీ దర్శకురాలు మంజుల మంజులమైన తన అనుసృజనని వదులుకుని, తనతో బాటు అమైరా పాత్రనీ తీసికెళ్ళి మేల్   డైరెక్టర్ల మొరటు ముక్కోణ ప్రేమ డొమైన్ లో పడేశారు! 

          డిటో త్రిధా చౌదరి. ఫస్టాఫ్ మజా, సెకండాఫ్ సఫా. సఫా కాకుండా మంజుల కుమార్తె జాహ్నవియే చక్కగా మిగిలింది. ఆమె మాట తీరు, నటనలో వేగం ఇవే ఆద్యంతం ఈ సినిమా చూడగల్గేట్టు మిగిలాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి యాడ్ ఫిలిమ్స్ మేనేజర్ గా సీరియస్ పాత్రలోనే వుంటాడు. యాడ్ కంపెనీ హెడ్ గా సంజయ్ స్వరూప్ ది స్వల్ప పాత్ర, తాతగా నాజర్ దీ స్వల్ప పాత్రే. 

          రవీ యాదవ్ ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ క్వాలిటీతో కూడుకుని వుంది. గోవా లొకేషన్స్ ని కొత్తగా చూపించారు. ఈ విజువల్స్ కి రాధన్ సంగీతం, పాటలు ఓ మోస్తరుగా వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఇక ఫిలాసఫికల్ గా ప్రకృతి గురించి అన్నేసి మాటలు రాయడం సాయి మాధవ్  బుర్రాకి అనవసర ప్రయాసే. ప్రకృతిని చూపిస్తూ దాని గురించే చెప్పడంతో ఫీల్ పోవడమేగాక, ఫాలో కాలేని  ఫైలాసఫీతో ఇబ్బంది వచ్చింది. దీనికి ప్రారంభంలో చెప్పిన మహేష్ బాబు వాయిసోవర్ చాలు. ఇక మిగతా మాటలు ఫర్వా  లేదనిపించే స్థాయిలోనే రాశారు ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో పాత కథకి ఎంత డైలాగులు రాసినా లభంలేకుండా పోయింది. 


చివరి కేమిటి 
          ఏ దర్శకులైనా  సరీగ్గా రాయలేకపోతే తీయలేరు. రాత దగ్గరే వుంటుంది తలరాత. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దర్శకులు రాయకూడదు, తీయడం మీద దృష్టి పెట్టి రాయించుకోవాలి. అప్పుడే కథ, పాత్రచిత్రణలు, స్క్రీన్ ప్లే – వీటికి సంబంధించిన రీసెర్చి పూర్తి స్థాయిలో సాధ్యమవుతాయి. ఫైనల్ అవుట్ పుట్ పరిపూర్ణంగా వికాసం చెందే అవకాశముంటుంది. తమకే తెలీని లోతుపాతులు బయటపడతాయి. దర్శకులే రాస్తూ కూర్చుంటే,  వాళ్ళకుండే వివిధ వొత్తిళ్ళతో ఏ దశలోనూ రచన సమగ్ర రూపం సంతరించుకోదు. లోపాల పుట్టగానే మిగిలిపోతుంది. 90 శాతం ఫ్లాపుల ప్రధాన కారణమిదే. 

          దర్శకురాలు మంజుల సమస్య ఇదే. ఆమె చెప్పి రాయించుకుని వుంటే ఇంత ఆత్మాశ్రయ ధోరణిలో స్క్రిప్టు వుండేది కాదు స్వగతం చెప్పుకుంటున్నట్టు. ధోరణి కవితాత్మకమే, కానీ అదెలా చెప్పాలో తెలియలేదు. మణిరత్నం ప్రకృతిని వాడుకునే విధానం చూస్తే, ఆయన పాత్రల చేత భాష్యం చెప్పించడు, కామెంటరీలు చెప్పించడు- ప్రకృతే దాని చర్యలతో మాట్లాడుతున్నట్టు  చూపిస్తాడు, చెప్పడు ( ‘show, don’t tell’ సూత్రం). తాజా ‘చెలియా’ లో కూడా వొళ్ళు గగుర్పొడిచే మంచు తూఫాను నేపధ్యంలో ప్రేమికుల వాగ్యుద్ధం ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిత్రీకరించాడు. 

          మంజుల కూడా ప్రకృతితో అలజడి సృష్టించారు. సెలయేళ్ళు, జలపాతాలు, సముద్రాలు, వర్షం- వాటర్ వాటర్ ఎవ్విరీ వేర్ అన్నట్టుగా జల నేపధ్యం సృష్టించారు ప్రతీ కీలక సన్నివేశానికీ. అయితే వాటికి హీరోయిన్ పాత్ర ఫీలవ్వాలేగానీ,  ఆమే పక్క పాత్రలకి వాటి ప్రశస్తి జీవితాలకి అన్వయించి నూరిపోస్తే అభాసు అవుతుంది. ప్రకృతిని ప్రేక్షకులు ఫీలై అర్ధం చేసుకునే సబ్ టెక్స్ట్ గా వదిలెయ్యక – మంజుల తనకెంతో తెలుసన్న ధోరణిలో కామెంటరీలు చెప్పించారు. దీంతో విజువల్ పోయెట్రీ అంతా చెడి, సోదిలా మారింది. సోది ఎందుకంటే, అంత చెప్పడానికి ఆ లేత హీరోయిన్ పాత్ర జీవితానుభవమెంత. అంత జీవితానుభావమే వుంటే,  అలా పారిపోయి ఎందుకొస్తుంది. అంత మెచ్యూరిటీయే వుంటే, ఆ మెచ్యూరిటీతో పెద్దల్ని ఎందుకు ఒప్పించ లేకపోయింది. అంత యోగా  బోధిస్తూ తనెందుకు ఆరోగ్యకరంగా లేదు. అంత ధ్యానం నేర్పిస్తూ తనెందుకు సమస్యకి పరిష్కారం కనుగొనలేక సెకండాఫ్ అంతా ఏడుస్తూ కూర్చుంది. మెచ్యూరిటీ అంతా ప్రకృతికే వుంటుంది. మెచ్యురిటీ లేని పారిపోయి వచ్చిన పాత్రలు అందులో భాగమై నేర్చుకుంటాయి మేడం, నేర్పవు. పాత్రలు ఎదగడం నేర్చుకుంటాయి, ఎదిగిన పాత్రలతో కథ వుండదు. వుంటే కథకాదు. 

          ఫస్టాఫ్ స్ట్రక్చర్ లో వుంది. ముప్పావుగంటలో సందీప్ పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ సంఘటన బలమైన చిత్రీకరణ. ఫోటోగ్రాఫర్ గా అసమర్ధుడని అతను పొందే అవమానంతో రెబెల్ అయ్యే దృశ్య చిత్రీకరణ అద్భుతం. ఇలాటి బలమైన సంఘటనలతో ప్లాట్ పాయింట్ వన్ మలుపులు  సృష్టించడం సర్వసాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించదిప్పుడు. దీంతో అతను ఫోటోగ్రాఫర్ గా నిరూపించుకోవాలని సమకడ్తాడు. ప్రకృతిలో ఒక బాలిక (జాహ్నవి), ఆ బాలిక సీతాకోక చిలుక అబ్సెషన్, దాన్ని అతడికి అంటించడం, దాంతో అతను ప్రకృతిలో భాగమై, లీనమై- తనేం చేయాలో, ఎలా చేయాలో , హోరెత్తే జలపాతం దగ్గర  రియలైజేషన్ కొచ్చే మలుపు అంతా ఒక టెర్రిఫిక్ టేకింగ్. అద్భుత ఛాయాచిత్రాలు సృష్టించి సమాధానం చెప్తాడు. నిజానికి హీరోయిన్ వెంట వుండి  ప్రకృతి గురించి ఆమె పెట్టిన సొదకి  బోరు కొట్టించుకున్న తనే, ఇప్పుడా ప్రకృతితో బాగుపడ్డాడు. ఈ సైకో థెరఫీ కథనానికి మంచి డైనమిక్స్ గా  కుదిరింది. ఇక తనకి ప్రేమ చెప్తాడని ఆశిస్తుంది హీరోయిన్. అంతా సస్పెన్స్. జలపాతం దగ్గరికి రమ్మంటాడు. ఏం చెప్తాడు? ప్రేమ చెప్తాడా, లేక ప్రేమ తిరస్కరించి ఫోటోగ్రఫీ అంటాడా అని తీవ్ర ఉత్కంఠ. ప్రేమ చెప్పకూడదు, ప్లాట్ పాయింట్ వన్ ప్రేమ మీద లేదు. ఫోటోగ్రఫీ మీద వుంది. కాబట్టి ప్రేమ చెప్పడు, ఫోటోగ్రఫీ అంటాడేమో - తనొక స్పిరిచ్యువల్ అనుభవాన్ని పొందాక ప్రేమ ఎంత, కేవలం  నాన్సెన్స్. అంతకంతకీ సస్పెన్స్ తో చంపే ట్రాక్ ఇది ఇంటర్వెల్ ముందు. 

          అప్పుడు జలపాతం దగ్గరికి ఆమె వచ్చేసరికి - సెకండ్ హీరోయిన్ ని హగ్ చేసుకుంటూ మొత్తం చెడగొడతాడు హీరో. ఇక ప్లాట్ పాయింట్ వన్ ప్రకారం కథలేదు! వుండదు, నడవదు! ప్రేమలో రెండో హీరోయిన్ తో తుస్సుమనే ఇంటర్వెల్ - అంత సస్పెన్స్ సృష్టించీ!!

          ఇక స్ట్రక్చర్ లేదు, సెకండాఫ్ లో ప్రకృతి లేదు, హీరో ఫోటోగ్రఫీ గోల్ లేదు. మూడు పాత్రల మధ్య చూసి చూసి విసిగిన అదే ముక్కోణ ప్రేమ గోల!
          మంజులకి ఇంకా ఇలాటి కథ మార్కెట్ లో పోతుందని ఎలా అన్పించిందో తెలీదు. తను ఆలశ్యంగా వచ్చారు.  పదేళ్ళ క్రితం వచ్చి వుంటే వర్కౌట్ అయ్యేదేమో. ఇప్పుడు ప్రేక్షకులు చాలా ముందు కెళ్ళి పోయారు. 

          నీతి : ఈ రోమాంటిక్ డ్రామాలతో అసమర్ధ పాత్రలు సృష్టించి ఏం చెప్పదల్చుకున్నారు?  కమిటయ్యే ఆలోచన లేకపోయినా ప్రేమస్నేహాలు చేస్తూ తిరిగి,  తీరా చెప్పమంటే నువ్వు కాదు అదీ (వాడూ) అని ఇంకో శాల్తీని చూపించడమా? దాంతో అదీ సాధ్యం చేసుకోలేక ఏడ్చి,  మొదటి ఆప్షన్ కే సెటిలవడమా? 

          ప్రాక్టికల్ గా వ్యవహరించే  పాత్రలు కమిట్ మెంట్ గురించి ఆలోచిస్తాయి. ఇప్పుడు కమిటయ్యే పరిస్థితుల్లేకపోతే, ఎఫైర్స్ కి దూరంగా వుంటాయి. కమిటయ్యాయంటే ఇక బ్యాండ్ బాజా బారాత్ లే - ఇంకా ఎఫైర్స్ తో కాలం  గడపడం వుండదు. ప్రేమ కమిట్ మెంట్ కాదు, పెళ్లిని కలుపుకున్న ప్రేమే కమిట్ మెంట్ అన్నట్టు వుంటాయి రియలిస్టిక్ పాత్రలు. కమిటయ్యామా, బ్యాండ్ బాజా బారాత్ లే, పిచ్చి ప్రేమలు కాదు.


సికిందర్


Wednesday, February 14, 2018

604 : ఇంటర్వ్యూ!


        జి. ధనుంజయన్ తమిళ మలయాళ హిందీ సినిమా రంగాల్లో పేరున్న నిర్మాతగా, కాలమిస్టుగా క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. నిర్మాతగా సంకట్ సిటీ (2009), కందెం కథలై (2009),  ముగమూడి ( 2012), అంజాన్ (2014),  ఇరుది సుత్రు (2016) వంటి సినిమాలు నిర్మించారు. కాలమిస్టుగా గలాటా సినిమా, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికల్లో విస్తృతంగా సినిమా రంగానికి సంబంధించి వ్యాసాలు రాస్తున్నారు. మంచి స్క్రిప్తులు రాయడం,  నిర్మాతల్ని పొందడం, మార్కెట్ ని అవగాహన చేసుకోవడం, ఫైనాన్స్, ట్రెండ్స్, జానర్స్ వంటి అనేక అంశాల పైన విశేషంగా రాశారు. గత డిసెంబరులో తను రాసిన వ్యాసాలని  ‘ది ఆర్ట్ అండ్ బిజినెస్ అఫ్ సినిమా’ పేరుతో  గ్రంథంగా  వెలువరించారు. ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం...
మీరు నిర్మాతగా వుంటూ కాలమిస్టుగా ఎలా మారారు?
         
నేనేదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడల్లా దాని గురించి రాసుకోవడం అలవాటు. నిర్మాతగా  అలా రాసుకున్న నా అనుభవాలు, చేసిన పొరపాట్లు షేర్ చేసుకుంటే ఇతరులకి ఉపయోగ పడొచ్చన్న ఉద్దేశంతో పత్రికలకి పంపసాగాను. వుంటున్న రంగం గురించే రాస్తున్నాను కాబట్టి పెద్దగా శ్రమ అనిపించదు. సమయం లేకపోవడమంటూ వుండదు. 
          చాలా మంది కొత్తగా వచ్చే నిర్మాతల్ని కలుస్తూంటాను. వాళ్ళు తాము ఎదుర్కొన్న కష్టాల గురింఛి చెప్పుకుపోతూంటారు. డబ్బెలా నష్టపోయిందీ, కథల విషయంలో ఎలా పొరపాట్లు చేసిందీ చెప్తూంటారు. 2017 లో చాలా మంది కొత్తవాళ్ళు దర్శకులయ్యారు. మొత్తం 160 మంది దర్శకులుగా కొత్తగా పరిచయమైతే, వాళ్ళల్లో ఏడుగురు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా 153 మంది సంగతేమిటి? వాళ్లకి మళ్ళీ అవకాశాలు రావడం కల్ల.  2017 లోనే కొత్తగా వచ్చిన నిర్మాతలు 160 సినిమాలు నిర్మించారు. ముగ్గురే సక్సెస్ కాగల్గారు. ఏ అనుభవమూ, విషయ పరిజ్ఞానమూ అవసరం లేకుండా ప్రవేశించగల్గే రంగం సినిమా రంగమొక్కటే. కొత్తగా వస్తున్న నిర్మాతల ధోరణి  ఎలా వుంటోందంటే - బాగా డబ్బుండి, కొన్నిసినిమాలు చూసి వుంటే చాలు,  సినిమాలు నిర్మించెయ్య వచ్చను కుంటున్నారు. ఇదే నిర్మాతలకి క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు.
మీరు రాసిన ఒక వ్యాసంలో, తమిళ సినిమా రంగంలో దర్శకులు తాము సవ్య సాచులుగా ఫీలవుతారని రాశారు. దీన్ని వివరిస్తారా?
          వాళ్ళొక్కరే కథ, మాటలు, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం అంతా చేసేయ వచ్చనుకుంటారు.  ఈ మోజులో సినిమా నిర్మాణం ఒక సమిష్టి సృజనాత్మక ప్రక్రియ కాకుండా పోయింది. ఇది కె.  బాలచందర్, భాగ్య రాజాలతో ప్రారంభమైంది. దాంతో ఇక ప్రతి వొక్కరూ భాగ్యరాజాలూ, లేదా టి. రాజేందర్ లూ  అయిపోవాలని ఆలోచించడం మొదలెట్టారు. క్రెడిట్స్ అన్నీ తమకే వుండాలి, పేరంతా తమకే రావాలి. మహేంద్రన్ లాంటి ఏ కొద్ది మందో ఇతరుల కథలు తీసుకుని  సినిమాలు తీశారు. ఇప్పుడు దర్శకులు తామే కథ రాసుకుని,  తామే స్క్రీన్ ప్లే రాసుకుని, తామే మాటలు రాసుకుని,  దర్శకత్వం వహించాలని మోజు పెంచుకున్నారు. కొందరైతే కెమెరా కూడా తామే, ఎడిటింగ్ కూడా తామే అయిపోయారు. దీని వల్ల శాఖలు ఒక్కచోటే కేంద్రీకృతమవుతాయి. దీంతో పనిభారం పెరుగుతుంది. పనిభారం పెరిగితే ఒక్కోశాఖమీద పెట్టాల్సిన దృష్టి నంతా పెట్టలేరు. కథ మీద పెట్టాల్సిన దృష్టి నంతా కథ మీద పెట్టలేరు, స్క్రీన్ ప్లే మీద చేయాల్సిన ఆలోచనంతా స్క్రీన్ ప్లే మీద చెయ్యలేరు, అలాగే మాటల  మీద వెచ్చించాల్సిన సమయం మాటల మీదా  వెచ్చించ లేరు. కథ రాసుకునేప్పటికే క్రియేటివిటీ అంతా తోడేసినట్టవుతుంది. స్క్రీన్ ప్లేకి క్రియేటివ్ వూట వూరదు. మాటలకొచ్చేటప్పటికి  పూర్తిగా ఎండిపోయి వుంటుంది. ఇది తెలుసుకోరు. ఈ పనులన్నీ అసిస్టెంట్స్ ని కూర్చోబెట్టుకునే చేస్తూంటారు. ఆ అసిస్టెంట్స్  ప్రతీ దానికీ గ్రేట్ సర్! గ్రేట్ సర్! అని వంత పాడుతూంటారు. మొత్తం సమస్యంతా ఈ ఆల్ రౌండర్ దర్శకులతోనే వస్తోంది. వీళ్ళ వల్లే ఇన్ని ఫ్లాపులు వస్తున్నాయి.
స్టారు సినిమా కన్నా ఎక్కువ కాదని మీరన్నారు?
          పూర్తిగా  నిజం. స్టార్ అనే అతను ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబట్ట గలడు. ఆ తర్వాత సినిమాలో దమ్ముంటేనే కలెక్షన్సు వస్తాయి. మొదటి ఆట పూర్తయ్యాక ఆ సినిమా కథ, దాని మెరిట్ ఇవి మాత్రమే  సినిమా జాతకాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని సార్లు స్క్రిప్టుని స్టార్ కనుగుణంగా మార్చాల్సి వస్తుంది నిజమే. అది మంచిది కూడా. అయితే ముందుగా ఆ స్క్రిప్టు దానికది బావుండాలి.  వున్నప్పుడు స్టార్ కోసం కొంత క్వాలిటీ తగ్గినా  సోల్ దెబ్బ తినకుండా వుంటుంది. ఇక ఒక స్టార్ కోసమే అని స్క్రిప్టు రాయడం ఎవరికీ సాధ్యం కాదు, ఆది వర్కౌట్ కాదు కూడా.  
పాజిటివ్ మెసేజి ఇవ్వడం తమిళ సినిమాలకి ఒక ప్రత్యేకతగా భాసిస్తోంది. ఎందువల్ల? ‘యాంగ్రీ యంగ్ మాన్ - ఎవర్ గ్రీన్ తమిళ సినిమా జానర్’  అని మీరొక వ్యాసం కూడా రాశారు. 
          ప్రజల కంటే స్టార్ పై స్థాయిలో వుండాలన్న అవసరంలోంచి మెసేజిల ట్రెండ్ ప్రారంభమయింది. బిగ్ స్టార్ గా ఒకరున్నప్పుడు, కొన్ని ఉన్నత విలువల్ని సినిమాల్లో ప్రకటించే అవకాశం లభిస్తుంది. ఒక స్థాయికి వచ్చిన హీరో లందరూ సినిమాల ద్వారా ఏదోవొకటి తాము చెప్పాలనే విశ్వసిస్తారు. ఇప్పుడున్న పాపులర్ హీరోలు రాజకీయ ఆకాంక్షలతో వున్నారు కూడా.
          మెసేజి సినిమాల ఆద్యుడు ఎమ్జీఆర్. వినోదాత్మక సినిమాల్లో  మెసేజిలిచ్చే ట్రెండ్ ని ఆయనే ప్రారంభించారు. ఎమ్జీఆర్ కి నటన ఒక్కటే ముఖ్యంకాదు, ఆ వినోదంతో బాటు సందేశం కూడా  అందించాలన్నదే ఆయన  నమ్మిన సూత్రం. ఇందులో ఆయన  సక్సెస్ అయ్యారు. కాబట్టి రజనీకాంత్ ఫాలో అవుతున్నారు. రజనికాంత్ ఫాలో  అవుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ  ఫాలో అవుతున్నారు.
          యాంగ్రీ యంగ్  మాన్ జానర్ తమిళంలో 1950 లనుంచీ వుంది. అప్పట్లో సమాజంలో అణచివేతని, దానిపట్ల ప్రజల ఆగ్రహాన్నీఅప్పటి  సినిమాలు ప్రతిబింబించాయి. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఇక  అస్పృశ్యతా భావం, బాల్యవివాహాలూ లాంటి అనాచారాలు పోవాలనే ప్రజలు కోరుకున్నారు. అలా సమాజాన్ని సంస్కరించే యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో అప్పట్లో శివాజీ గణేశన్ నటించిందే ‘పరాశక్తి’.

         
ఇవ్వాళ చూస్తే, రాజకీయాల పట్ల చాలా ఆగ్రహం నెలకొని వుంది. గత ఏడాది కాలంగా తమిళ నాడు రాజకీయాలు బాగా భ్రష్టుపట్టాయని  ప్రజలు కోపంగా వున్నారు. ఈ వాతావరణంలో  కొత్త నాయకులు వచ్చి చక్కదిద్దాలన్న కోరికతో వున్నారు. ఇందుకే యాంగ్రీ యంగ్ మాన్ ఇంకా సజీవంగా వున్నాడు.
తమిళ సినిమా రంగం ఎందుకని అస్తవ్యస్తంగా వుంది? ప్రత్యేకించి సినిమాల విడుదల తేదీల విషయంలో?
         
ఐకమత్యం లేకపోవడమే కారణం. ప్రొఫెషనలిజం అసలే లేదు. లేకపోతే ఆరు సినిమాలు ఒకే రోజు ఎందుకు విడుదల చేస్తారు? అవన్నీ ఎవరు చూస్తారు? మార్కెట్ పై అవగాహన లేకుండా విడుదల తేదీల్ని నిర్ణయించేస్తున్నారు. థియేటర్ లు దొరుకుతాయా  లేదా అని  నిర్మాత లెవరూ కేర్ చేయడం లేదు. అందుకే కష్టాల పాలవుతున్నారు. పెద్ద సినిమాలు 90 శాతం ఫ్లాపవడం, చిన్న సినిమాలు 95 శాతం ఫ్లాపవడం ఒక పారంపర్య సాంప్రదాయంగా మారింది. కేవలం ప్రొఫెషనలిజం లోపించడమే దీనికంతటికీ కారణం.
ఇవ్వాళ తమిళ సినిమా మార్కెట్ ఎంత? 
          ఇవ్వాళ తమిళ సినిమాలు 35 దేశాల వరకూ విస్తరించాయి. అంటే పెద్ద మార్కెట్ నే కలిగి వుందని చెప్పొచ్చు. అయితే ఇది పెద్ద సినిమాలకి మాత్రమే. చిన్న సినిమాలకి విదేశీ మార్కెట్ లేదు. అవి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా చేరుతున్నాయి.
తెలుగు -  తమిళ ద్విభాషా చిత్రాల ఫార్ములాతో బాగానే సినిమాలు వస్తున్నా
యేమో?

          లేదు. ‘స్పైడర్’ తో చేదు అనుభవమే ఎదురయింది. నిర్మాతలెవరూ ఇక ద్విభాషా చిత్రాల ఆలోచన చేయడం లేదు. ప్రయోగాత్మకంగా ప్రారంభించారు., ప్రయోజనం లేదని విరమించుకున్నారు.
మీరు ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం రావాలని రాశారు. అంటే ఏమిటి?
         
ఫ్లెక్సీ టికెట్ ప్రైసింగ్ విధానం అమలుపరచాలని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మార్నింగ్ షోలకి తక్కువ టికెట్ ధరలు, వారాంతపు షోలకి ఎక్కువ టికెట్ ధరలు. అలాగే చిన్నసినిమాలకి తక్కువ టికెట్ ధరలు, పెద్ద సినిమాలకి అధిక టికెట్ ధరలు ... ఇలా చేయడంవల్ల,  చిన్నా పెద్దా సినిమాలన్నిటికీ మంచి రెవెన్యూ వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా చిన్న సినిమాలు బాగా ఆడతాయి.
మీరు అమ్ముడుపోని సినిమాల మీదొక వ్యాసం రాశారు. దీని గురించి చెప్పండి.  
          సినిమాల కొనుగోళ్ళ విషయానికొస్తే శాటిలైట్ నెట్వర్కుల నిర్వాహకులు సెలెక్టివ్ గా వుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలైతేనే  కొనుగోలు చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలని పట్టించుకోవడం లేదు. ఏదో వొక రేటుకైనా  వాటిని కొనడం లేదు. ఇక నిర్మాతలు తప్పని సరై డిజిటల్ ఆప్షన్స్ వంక చూడాల్సి వస్తోంది.
బాక్సాఫీసు ఫిగర్స్ ని ఓవర్ రిపోర్టింగ్ చేసే ధోరణి ప్రబలిపోయింది. థియేటర్లకి కంప్యూట రైజుడు బిల్లింగ్ విధానం లేదు. దీంతో ఎదురవుతున్న సవాళ్లేమిటి?
          థియేటర్ల యాజమాన్యాలు నిజమైన కలెక్షన్స్ ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా ఎల్లకాలం ఫిగర్స్ ని దాచిపెట్ట లేరు, అవునా? ఈ పరిస్థితి తప్పక మారుతుందని నేను నమ్ముతున్నాను.
***


Sunday, February 11, 2018

603 : క్రియేటివిటీ సంగతులు!


స్ట్రక్చర్ ని  కాస్సేపు పక్కన పెడదాం, అసలు ఈ క్రియేటివిటీ ఏంటో చూద్దాం. తెలుగు సినిమా అనేది క్రియేటివ్ ఆలోచనల పరంగా ఇంకా సంధి కాలంలోనే కొట్టు మిట్టాడుతోంది. గడిచిపోయిన తొలి వ్యాపార యుగం దాటిరావడానికి మొరాయిస్తోంది. తొలిస్వర్ణయుగం (1931 - 51), మలిస్వర్ణ యుగం (1951 -71) ముగిసిపోయి,  తొలి వ్యాపార యుగం (1971 – 2001) కూడా గడిచి పోయి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా 1971 – 2001 నాటి తొలి వ్యాపార యుగం దగ్గరే తచ్చాడుతోంది తెలుగు సినిమా క్రియేటివిటీ. నేటివిటీ పేర, ప్రేక్షకుల భావోద్వేగాల పేరా ఆ సంధి కాలంలోనే అవాస్తవిక, కృత్రిమ సర్కస్సులు చేస్తోంది. దాంతో చేదు అనుభవాలు చవి చూస్తోంది. నేటివిటీలు మారిపోతున్నాయి, సంస్కృతులు సన్నగిల్లుతున్నాయి,ఇంటర్నెట్ జీవితాల
వుతున్నాయి, భావోద్వేగాలూ అందుకనుగుణమైన  సంగతులు పట్టుకుని కొత్త పుంతలు తొక్కు
తున్నాయి. తరాల అంతరాలు చెరిగిపోయాయి. ఇంటర్నెట్  కలిపేస్తున్న జీవితాల్లో అన్ని వయసుల వారూ కలిసిమెలిసి  సాగుతున్నారు. పరస్పర ఫిర్యాదులు లేవు, జనరేషన్ గ్యాప్ సంఘర్షణల్లేవు. అయినా ఇంకా  అదే ముప్పై ఏళ్ళనాటి పాతకాలం మూస క్రియేషన్లతో  సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ మూసతో అనుసంధానం కాలేక మలి వ్యాపార యుగపు ప్రేక్షకులు  గోలెడుతున్నారు. యుగ ధర్మాల్ని క్రోడీకరించుకుని దిశా నిర్దేశం చేయాల్సిన గొప్ప గొప్ప సీనియర్లు, అనుభవజ్ఞులు సైతం  సంధికాలంలోనే గడ్డ కట్టిన క్రియేటివిటీతో  అక్కడే  ఇరుక్కుపోయారు. సినిమా క్రియేటివిటీ వ్యాపారంతో  కూడుకున్నదని తెలిసికూడా కాలం చెల్లిపోయిన పాత ఫ్యాషన్ చొక్కాలు సినిమాలకి ధరింప జేస్తున్నారు.  తొలి వ్యాపార యుగం దాని కాలజ్ఞానంతో ఎంత విజయవంతమో, మలి వ్యాపార యుగాన్ని  అజ్ఞానంతో అంత దివాలా కోరుతనంగా తయారు చేస్తున్నారు  – నిత్యం  90 శాతం ఫ్లాపుల పుణ్యంతో ఇంకా ఇంకా. సింపుల్ గా చెప్పాలంటే , శుభ్రంగా  వ్యాపారం మర్చిపోయారు! 

         
కల్చర్ తాజా బాధితురాలు ‘గాయత్రి’. దీనికి సంధి కాలపు మార్కెటబిలిటీ లేని క్రియేటివిటీ తప్ప స్ట్రక్చర్ పట్టలేదు. స్ట్రక్చర్ లో ఆలోచిస్తే,  కూతురి అన్వేషణలో వున్న శివాజీ (బిగినింగ్),  తీరా కన్పించిన కూతురు దుర్మార్గుడని తిరస్కరించాక (మిడిల్) - ఆమె అపార్ధం తొలగించడానికి స్ట్రగుల్ చేస్తూంటే, పటేల్ ఇచ్చిన ఆఫర్ తో అతని బదులు తను జైలుకెళ్ళి ఇరుక్కుని,  కూతురి  అపార్ధం తొలగడంతో ( ఎండ్) -   ఆమెతో కలిసి పటేల్ అంతు చూశాడు – అనే క్రమంలో వుండాలల్సిన  కథ. 

          ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఇలా కూతురితో తలెత్తిన సమస్యా,  దాని పరిష్కారమూ  అన్న రెండు మూల స్తంభాలాధారంగా వున్నప్పుడే, ఈ కథకి స్క్రీన్ ప్లే అనే సౌధం నిలబడగల్గేది. 

          కానీ ఈ స్క్రీన్ ప్లేకి మొదటి మూలస్తంభమే వుంది, రెండోది కన్పించడంలేదు. శివాజీ యాక్టివ్ పాత్రగా లేడు, పాసివ్ గా కన్పిస్తున్నాడు. ఏది ప్రధాన కథో తెలియడం లేదు, గాయత్రీతో  -  పటేల్ తో రెండు వేర్వేరు కథల్లాగా అన్పిస్తున్నాయి. ఏది ప్రధాన జానరో, ఏది దాని తాలూకు సబ్ జానరో తెలియడంలేదు, రెండూ కలిసి పోయి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
ఫ్యామిలీ డ్రామానో, ఫ్యామిలీ థ్రిల్లరో అర్ధం గావడం లేదు.  గాయత్రితో ఫ్యామిలీ డ్రామాగా వుంటూ,  ఒక్కసారిగా  పటేల్ రాకతో ఫ్యామిలీ థ్రిల్లర్ గా మారిపోయి,  సెకండాఫ్ సిండ్రోంలో పడిపోతోంది.  ఇలా సెకండాఫ్ లో కథ ప్లేటు ఫిరాయించి వేరే కథలుగా మారిపోయిన సెకండాఫ్ సిండ్రోములు - సర్దార్ గబ్బర్ సింగ్, దొంగోడు, ధమ్, తేరేనామ్, హవా, జ్యోతిలక్ష్మి, సైజ్ జీరో వగైరా వగైరా  ఎన్నో అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోతోంది ‘గాయత్రి’ కూడా. క్రియేటివ్ యాస్పెక్ట్ రీత్యా స్ట్రక్చర్ పరిస్థితి ఇదీ.

―2―
మార్కెట్ యాస్పెక్ట్  కొద్దాం. ఇక మోహన్ బాబు యువతరం ప్రేక్షకుల్లో పాగా వేయాలనుకుంటే, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా తన పాత్రల తీరుతెన్నుల్ని  మార్చుకోవాల్సిందే. ఇవాళ్ళ సినిమాలు  ప్రధానంగా యూత్ కోసం, తర్వాత మిగిలితే వాళ్ళ అమ్మా బాబుల కోసం. సీనియర్ మోహన్ బాబు అయినా రంగంలో వుండాలంటే యూత్ కోసమే వుండాలి తప్ప, వాళ్ళ అమ్మా బాబుల్ని రంజింప జేస్తానంటే అమ్మాబాబులు ఆల్రెడీ అలసిపోయారు. ఇవాళ్ళ తెలుగు సినిమాలకి యూత్ అప్పీల్  గా మిగిలిన  అంశాలు రెండే రెండు - ఎకనమిక్స్, రోమాంటిక్స్. మోహన్ బాబు మొదటిది ప్రతిబింబించేలా మొదటి పాత్ర పోషణ చేశారు. డబ్బుకోసం ఇతరుల బదులు జైలు కెళ్ళడం. అయితే ఆ ఎకనమిక్స్ తో ఎక్కడా ఆకట్టుకోలేదు. డబ్బు నెక్కడా చూపించలేదు. మాటల్లో తప్ప విజువల్ ప్రెజెన్స్ లేదు. ఆ డబ్బుతో విలాసవంతమైన ఎదుగుదల లేదు. అది నెగెటివ్ షేడ్ అవుతుందని అభ్యంతరం చెప్పదల్చుకుంటే, అసలలా చట్టాన్ని ఏమారుస్తూ ఒకరి బదులు జైలు కెళ్ళడమే పెద్ద నేరం. ఆ డబ్బుతో అనాధ పిల్లల్ని పోషించడం ఇంకా తప్పు. 

          రెండోది, ఈ వుండీ లేని ఎకనమిక్స్ తో యూత్ అప్పీల్ కి,  అనాధాశ్రమం నడపడమనే ఏ మాత్రం పొంతన లేని సంధి కాలపు పాత సుత్తి వ్యవహారం తోడయ్యింది. దీంతో మోహన్ బాబు మొదటి పాత్ర యూత్ అప్పీల్ కి పూర్తిగా దూరమైపోయింది. యూత్ కి కనెక్ట్ కాకుండా పోయారు. మోహన్ బాబు ఇంకా మధ్య వయస్కులైన తన పాత అభిమానుల కోసమో, మరెవరి కోసమో ఆ కాలపు పాత్ర చిత్రణ చేసుకుంటానంటే కుదిరే పరిస్థితి లేదు. వర్గాల కతీతంగా  ప్రేక్షకులందరి అప్పీలూ ఇవాళ్ళ  ఈ రెండిటికే - ఎకనమిక్స్, రోమాంటిక్స్. 

          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ – ఇదే మలి వ్యాపార యుగపు సినిమా స్టయిల్.

―3―
పోనీ రోమాంటిక్స్ చూద్దామన్నా, దీని జాడ ఎక్కడా కనబడదు. యువ గాయత్రి పాత్రతో కూడా. మోహన్ బాబు మొదటి పాత్ర శివాజీకి యుక్త వయసు వెర్షన్ పోషించిన విష్ణుతో కూడా రోమాన్స్ కన్పించదు, ఏదో కాసేపు ఫ్లాష్ బ్యాకులో శ్రియతో పాత తరహా ప్రేమ తప్ప. యూత్ అప్పీల్ కి వీలుండే గాయత్రికి ప్రేమాయణం లేకుండానే డ్రైగా చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ అయిన రోమాంటిక్స్ కి విరుద్ధం. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ కి  వుండాల్సిన ఎకనమిక్స్ లేదు, రోమాంటిక్స్ లేదు. మార్కెట్లో యువ ప్రేక్షకులు -  యువ ప్రేక్షకులు అంటూంటారే గానీ ఎవరా యువప్రేక్షకులు? వాళ్ళల్లో అమ్మాయిల్లేరు. చాలా వరకూ అబ్బాయిలే యువప్రేక్షకులుగా పోషిస్తున్నారు సినిమాల్ని. అమ్మాయిల్ని ఆకట్టుకునే పాత్ర చిత్రణలు లేకపోవడం అమ్మాయిలు దూరమవడానికి కారణం. కాబట్టి ‘గాయత్రి’ అని టైటిల్ పెట్టుకున్నప్పటికీ  అమ్మాయిలు డుమ్మా కొట్టడానికి కారణమిదే. కనీసం - ‘గాయత్రి’ క్యారక్టర్ యూత్ అప్పీల్ తో వుందని, ఆమె యూత్ ఫుల్ రోమాంటిక్స్ కి మోహన్ బాబు చేసే డిగ్నిఫైడ్ హెల్ప్ ‘పింక్’ లో అమితాబ్ లాగా ఏంతో అప్డేట్ అయి  వుందనీ, మౌత్ టాక్ వచ్చేలా సినిమా ధోరణి వుంటేగా!

―4―
          ఫ్యామిలీ డ్రామాలు నేటి దైనందిన  జీవితాల్లో  ఎదురవుతున్న సమస్యలతో (ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్) ఎంతో పకడ్బందీగా, ఆధునికంగా  తీస్తే తప్ప ఈ రోజుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కథని ఎకనమిక్స్ తోనో, రోమాంటిక్స్ తోనో ముడి పెట్టి ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ప్రధాన కథగా చేసి చూపించాల్సి వుంటుంది. అంటే శివాజీకి కూతురు కన్పించడం లేదన్న ధ్యాస తప్ప, దాంతో కూతురికోసం సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్లేవర్ తో తీవ్ర ప్రయత్నాలు తప్ప, ఇంకో వ్యాపకం వుండడానికి కుదరదు. ఉపాధి కోసం స్టేజి నటుడి టాలెంట్ ని నేరస్థులకి డబుల్ గా వ్యవహరిస్తూ జైలుకెళ్ళి వస్తూండే బిజినెస్ గా వుంటే వుండొచ్చు. కూతరు కన్పించడం ప్లాట్ పాయింట్ వన్ గా వుంటూ, ఆమె తిరస్కరించడంతో మిడిల్ సంఘర్షణగా కొనసాగుతూ,  మధ్యలో విలన్ గాయత్రీ పటేల్ పరిచయంతో, సంఘర్షణ కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్నగా మారుతూ, చివరికి జైలు కెళ్ళి పటేల్ తో మోసపోయి, కూతురి ఆర్గ్యుమెంటే నెగ్గి తను తలొగ్గి,  ప్లాట్ పాయింట్ టూ కొచ్చి, ఇక కూతురితో కలిసి పటేల్ ని ఎదుర్కొనే ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా ముగియాలి. ఇందులో ఫ్యామిలీ డ్రామా వుంటే అంతర్లీనంగా ఎలాగూ వుంటుంది. దానికోసం తహతహలాడుతూ కథనే ఫ్యామిలీ డ్రామాగా మార్చేయ నవసరం లేదు.


―5―
          కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్న అంటే ఏమిటి? కథంటే ఆర్గ్యుమెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. రెండు పాత్రల మధ్య తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత  కథనమనీ, చివరికి ఆ ఆర్గ్యుమెంట్ తాలూకు జడ్జి మెంట్ తో ముగింపనీ. ఇది ఏ కథయినా డిమాండ్ చేసే దాని ప్రాథమిక హక్కు. దీన్ని కాదనడానికి వీల్లేదు. 

         గాయత్రి ఆర్గ్యుమెంట్ ఏమిటి? పుట్టగానే తన తండ్రి శివాజీ తాగుడు కోసం వెయ్యి రూపాయలకి తనని అమ్మే ప్రయత్నం చేశాడని కదా? ఇదామె అపార్ధమే కావొచ్చు. కానీ ఆమె పుట్టక ముందు నుంచీ తను చేస్తున్న పనేమిటి? తన నాటక కళని తప్పుడు విధానంలో జీవిక కోసం వాడుకుంటూ - చట్టాన్ని ఏమారుస్తూ -  ఆయా నేరస్థుల రూపంలో వాళ్ళ బదులు తను జైలు కెళ్ళి వస్తున్నాడు. ఒక క్రిమినల్ గా రూపాంతరం చెందాడు. అదామె అపార్ధమైతే, ఇది తన నైతిక విలువల ప్రశ్న. దీనికేం సమాధానం చెప్తాడు కూతురికి? ఈ అనైతిక ప్రవర్తన ఆమె చేసుకున్నఅపార్ధాన్ని పూర్తిగా బలపర్చేట్టు లేదా? ఇది కాదా ఫ్యామిలీ డ్రామా అంటే? తప్పిపోయిన కూతురు దొరికి, ఆ తండ్రీ కూతుళ్ళు కన్నీళ్లు కార్చే  పై పై ఉపరితల  మెలో డ్రామాయేనా ఇంకా తెలుగు సినిమా మార్కు ఫ్యామిలీ డ్రామా అంటే?  పాత్రల లోలోపలి కుళ్ళు అలాగే మిగిలిపోతూ? ఈ హిపోక్రసీకే  - ఫాల్స్ డ్రామాకే ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారా?

―6―
        అనాధ పిల్లల సంరక్షణతో, జైలుకి రాకపోకలతో, ఇంకొన్ని మంచి పనులతో  శివాజీని చూపించుకొస్తూ, ఒకచోట అనుకోకుండా కూతురు గాయత్రితో సంఘటన సృష్టించారు. తండ్రీ కూతుళ్ళమని వాళ్ళిద్దరికీ తెలియని డ్రామా బావుంది. దుండగుల బారి నుంచి ఆమెని కాపాడేస్తాడు. ఆమె సెల్ ఫోన్ కింద పడిపోయి వుంటుంది. తీసి ఆమె కివ్వబోయేంతలో ఆమె ఆటోలో వెళ్లిపోతూంటుంది. ఇంటికొచ్చి ఛార్జింగ్ పెడతాడు. సెల్ ఛార్జి అయ్యాక స్క్రీన్ వెలుగుతుంది. అప్పుడా స్క్రీన్ సేవర్ గా ఆమె తల్లి ఫొటో డిస్ ప్లే అవుతుంది. ఆ తల్లి (శ్రియ) శివాజీ భార్యే! ఇదెంతో కదలించే  మంచి మెలో డ్రామాగా వుంటుంది (ఇది తప్ప ఈ ఫ్యామిలీ డ్రామాగా తీసిన సినిమాలో ఇంకొక్క కదిలించే సన్నివేశం కూడా లేదు). 

          పుట్టగానే కన్పించకుండా పోయిన కూతురి కోసం తను పడుతూ వచ్చిన ఆవేదన ఇక తీరిపోయిన క్షణాలు! పట్టరాని ఆనందం. సర్వసాధారణంగా ప్లాట్ పాయింట్ ఘట్టం ఒక సీరియస్ గా తలెత్తే సమస్యతో ఉద్రిక్తంగా వుంటుంది. ఆ సీరియస్ సమస్యని సాధించే గోల్ తో పాత్ర ప్రయాణం మిడిల్లోకి సంఘర్షణాత్మకంగా వుంటుంది. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా వుంది అపూర్వంగా. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఆనందభరితంగా తయారైంది. కథకి అనితరసాధ్యంగా కుదిరిన ప్లాట్ పాయింట్ వన్ మలుపు ఇది. సర్వ సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచి పాత్రకి సీరియస్ ప్రయాణంగానే వుంటుంది. ఇక్కడ దీనికి విరుద్ధంగా,  ఇక్కడ్నించీ శివాజీకి సంతోషకరమైన ప్రయాణంగా వుంది - కూతురు దొరికిందనీ, కూతుర్ని కలుసుకోబోతున్నాననీ!

          ఇంతమంచి ప్లాట్ పాయింట్ వన్ తో శివాజీ ఓ హేపీ సాంగ్ కూడా పాడుకోవడం ప్లాట్ పాయింట్ వన్ ని విజువల్ గా ఇంకెంతో ఎలివేట్ చేసింది. ప్లాట్ పాయింట్ వన్ ని అనుసరించి పాటెప్పుడూ వుండదు. ఇక్కడ ఇలా చక్కగా  కుదిరింది.  తీరా పాట తర్వాత ఆ కూతుర్ని కలుసుకోబోతూంటే, నిండు సభలో తండ్రి గురించి ఆమె చెప్పే మాటలు వింటాడు - తండ్రి ఎంత దుర్మార్గంగా తాగుడు కోసం తనని అమ్మేశాడో అని. దీంతో శివాజీ ప్రపంచం తలకిందు లవుతుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ ఇలా రివర్స్ అయింది. నిజానికి హేపీ గా వున్న ప్లాట్ పాయింట్ వన్ తో,  మిడిల్ కూడా కూతురి కలయిక పరంగా హేపీగా కొనసాగుతుందనీ, సంఘర్షణకి బదులు మిడిల్ కూడా ప్రయోగాత్మకంగా ఇక్కడ హేపీగా కొనసాగబోతోందనీ అన్పించి అత్యంత  ఆసక్తి రేపుతుంది. అలా కలుసుకునీ జీవితాల్ని ఆనందమయం చేసుకున్న తండ్రీ కూతుళ్ళకి  వూహించని విపత్తు ఏదో ఎదురవుతుందనీ ఒక అభిప్రాయం కల్గుతుంది. విపత్తు లేకపోతే ఇది కథగా వుండదు, కమర్షియల్ సినిమాకి పనికి రాని గాథగానే  ముగిసే ప్రమాదముంది.

          అయితే విపత్తు కూతురి మాటల్లోంచే పుట్టింది. శివాజీలో సంఘర్షణ మొదలవుతుంది. తను తాగుడు కోసం పురిటి పిల్లని అమ్మేశాడా? ఇరవై ఏళ్ళనాటి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో నాటక నటుడుగా ప్రేమించి పెళ్ళిచేసుకున్నగురువు కూతురు క్యాన్సర్ సోకడంతో,  శివాజీ తన నట వృత్తిని నేరప్రవృత్తిగా మార్చుకుంటాడు. వైద్యం డబ్బుల కోసం మొదటి సారిగా ఒకరిలా నటిస్తూ జైలుకెళ్ళి వస్తాడు. వస్తే భార్య చనిపోయిందని తెలుస్తుంది. ప్రసవించిన కూతుర్ని అనాధాశ్రమం వాళ్ళు తీసికెళ్ళి పోయారని అంటాడు స్నేహితుడు. తాగుబోతు అయిన స్నేహితుడు,  పుట్టిన శివాజీ కూతుర్ని వెయ్యి రూపాయలకి అమ్మేయబోతూంటే అనాధాశ్రమం వాళ్ళు  పట్టుకుని తీసికెళ్ళి పోయారు. ఇదీ విషయం.

          పెద్ద విషయం కాదు. ఆ అనాధాశ్రమం తెలుసుకుని శివాజీ వెళ్లి కూతుర్ని అప్పుడే తెచ్చుకోవచ్చు. ఈ లాజిక్ ని (కామన్ సెన్స్ ని) దాటవేశారు.

          ఈ ఫ్లాష్ బ్యాక్ కూతురు గాయత్రికి శివాజీ పంపిన డైరీలో రివీలవుతుంది. అతడి డైరీ చదువుకున్న ఆమె వెంటనే తండ్రి మీది ద్వేషం తొలగించుకుంటుంది. ఆమె పాయింటాఫ్ వ్యూలో ఒక ఫ్లాష్ కట్ పడుతుంది. అందులో పదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి యేడని  అనాధాశ్రమం అతణ్ణి అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ,  పుట్టగానే తాగుడుకోసం నిన్నమ్మేసి  పోయాడని  అసహ్యభావంతో అంటాడతను. 


           ఇక్కడ ఈ రెండూ గందరగోళంగా వున్నాయి. ఒకటి- తండ్రి పంపిన డైరీ చదవగానే ఆమె  ద్వేషమంతా తొలగిపోవడం. ఆ డైరీలో రాసిందే నిజమని ఎలా నమ్ముతుంది తను? అసలు డైరీ ఎలా రాస్తాడు? ఆ డైరీ లోనే నటుడిగా తన నేరప్రవృత్తి గురించి ఎలా బయట పెట్టుకుంటాడు? దొరికిపోడా? ఇప్పుడు కూతురికి దొరికిపోలేదా? ఒక తప్పు చేయలేదని ఆమెకి చెప్పబోతూ రెండో తప్పుతో దొరికిపోలేదా? అయినా డైరీ చదివిన కూతురుకి ఈ విషయమే పట్టదు. 

          ఇక ఇప్పుడామెకి  పదేళ్ళ వయసులో అనాధాశ్రమం అతనితో కట్ షాట్ పడుతుంది. తన తండ్రి ఏమయ్యాడని అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ, పుట్టిన నిన్ను తాగుడికి అమ్మేయబోతే పట్టుకున్నాం – అని అసహ్య భావంతో అంటాడతను. ఒక అనాధా శ్రమం నడిపే అతను  అనాధ పిల్ల సందేహం ఇలాగే తీర్చి గాయపరుస్తాడా? జీవితాంతం బాధ పడేలా చేస్తాడా? 

          ఇలాటి అవాస్తవిక, అసహజ చిత్రణలతో, పైపై కథనాలతో చాలా బలహీనపర్చారు. 

దీన్నిసినిమాని సినిమాలాగే చూడాలన్న గొప్ప కొటేషన్ తో సమర్ధించుకో వచ్చు కథకుడు. అతడి విచక్షణకే వదిలెయ్యాలి. సినిమాని సినిమాలాగా చూడడానికి అడ్డగోలుగా రాసి పారేయ్యొచ్చు.

.         ఇలా కూతురికి అపార్ధం కల్గించడమూ (అనాధాశ్రమం అతనితో), ఆ అపార్ధాన్ని తొలగించడ మూ (తండ్రి డైరీతో) ఇలా చాలా ఆషామాషీగా చేసేశాక, ఇక మోహన్ బాబు రెండో పాత్ర గాయత్రీ  పటేల్ అనే విలన్ ఎంట్రీ. ఇక్కడ్నించీ ఫ్యామిలీ డ్రామాగా నడుస్తున్న కథ కాస్తా ఫ్యామిలీతో సంబంధంలేని వేరే థ్రిల్లర్ గా మారిపోతుంది. దీనికైతే ఏ  కామన్ సెన్సూ పట్టించుకోలేదు. పెద్ద మొత్తానికి ఆశపడి గాయత్రీ పటేల్ బదులు అతడిలా నటిస్తూ తను జైలు కెళ్తున్నప్పుడు, అసలు పటేల్ కి పడ్డ శిక్షేంటో తెలుసుకోడా? పటేల్ కి ఉరి శిక్ష పడితే, ఆ విషయం తెలుసుకోకుండా జైలుకెళ్ళి పోయి, ఉరి సమయానికి లబలబలాడడమేనా? లబలబలాడితే ఆడియెన్స్ కేంటి? అది అతడి ఖర్మ, అనుభవించాలి. ఈ అరగంట పాటు దృశ్యాల్లో ఇలాటి కామన్ సెన్సే లేని ట్విస్టు మీద ట్విస్టులెన్నో. శివాజీ తను పటేల్ కాదని చెప్పడానికి ఒక్క ఆధార్ కార్డు చాలు, కూతురితో ఒక్క బ్లడ్ టెస్టు చాలు. ఎందుకీ నసంతా,  ఏదో గొప్ప థ్రిల్లర్ లాగా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తూ? 

          అసలు అంతకి ముందు జైలు కెళ్ళే ఒక సందర్భంలో,  శివాజీ పృథ్వీలా నటిస్తూ అతడి బదులు జైలు కెలా వెళ్తాడు? పృథ్వీ హైట్ ఎక్కడ?  తన హైట్ ఎక్కడా? పోలీసులు అంత లాలీపాప్ గాళ్ళా? కోర్టుల్ని కూడా ఇలాగే ఏమారుస్తాడు శివాజీ. తను నేరం చేస్తున్నట్టుగానే ఫీల్ కాడు. ఇరవై ఏళ్లుగా ఇలా మారువేషాలతో మోసాలు చేస్తున్నాడని యంత్రంగానికీ తెలీదు. ఇలాగే  ముగుస్తుంది కథ!

          క్రియేటివిటీని ఇంత అడ్డగోలుగా చేసుకుంటూ స్ట్రక్చర్ ని ద్వేషించడం ఎంతవరకు సబబు? ఇది బాగా ఆలోచించుకోవాలి.  స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలే 90 శాతం ఫ్లాపులకి కారణం. క్రియేటివిటీ స్ట్రక్చర్ లోకొచ్చినప్పుడు ‘గాయత్రి’ లాంటివి  గాయపడవు. శివాజీకీ, గాయత్రీ పటేల్ కీ మధ్య గాయత్రులు గల్లంతవరు.
.
సికిందర్   
         

Saturday, February 10, 2018

602 : రివ్యూ!


దర్శకత్వం: మదన్
తారాగణం:  మోహన్ బాబు, విష్ణు, నిఖిలా విమల్, శ్రియ, అనసూయ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, శివప్రసాద్, నాగినీడు, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, సత్యం రాజేష్, రాజా రవీంద్ర తదితరులు  
కథా విస్తరణ : పరుచూరి బ్రదర్స్, కథ – మాటలు : డైమాండ్ రత్న బాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
బ్యానర్ : లక్ష్మీ  ప్రన్న పిక్చర్స్
నిర్మాత:  మోహన్ బాబు
విడుదల : ఫిబ్రవరి 9, 2018
***
     
లెక్షన్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మాతగా ఓ ఫ్యామిలీ డ్రామా / థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ద్విపాత్రాభినయాలు, నిర్మాణాలూ ఆయనకి కొట్టిన పిండే. 40 ఏళ్లుగా తన ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ తరం ప్రేక్షకులకి తన బయోడేటా ఇచ్చుకోవాల్సి వుంటుంది గనుక,  అది  కూడా ఎన్నో పరిచయ సీన్లతో నెరవేర్చి, పాతా కొత్తా ప్రేక్షకులని సంతృప్తిపర్చే ఒక  టూ ఇన్ వన్ ప్యాకేజీలా సమర్పించే సంకల్పంతో,  దర్శకుడు మదన్ తో కలిసి ఈ ప్రయత్నం చేశారు. దర్శకుడు మదన్ ‘పెళ్ళయిన కొత్తలో’, ‘ఆ నల్గురు’ వంటి ఫ్యామిలీ డ్రామాలతో పరిచితుడే. కాకపోతే రెండేళ్ళ  గ్యాప్ తర్వాత వస్తున్నారు. మోహన్ బాబు కూడా మూడేళ్ళ తర్వాత కన్పిస్తున్నారు. ఈ విరామంలో వీళ్ళిద్దరూ కాలానుగుణంగా అప్డేట్ అయ్యారా? లేక ప్రేక్షకులకంటే వెనుకబడి వున్నారా? ‘గాయత్రి’ తో చివరి కేం సాధించారు?... వీటికి సమాధానాలు అన్వేషిద్దాం. 

కథ 
      దాసరి శివాజీ (మోహన్ బాబు) స్టేజి నటుడు. ప్రసవంలోనే భార్య శారద (శ్రియ) ని కోల్పోతాడు. కూతురు  గాయత్రి ( నిఖిలా విమల్) కూడా పుట్టగానే కన్పించకుండా పోతుంది. ఇరవై ఏళ్లుగా కూతుర్ని  అన్వేషిస్తూ, మరో పక్క భార్యా కూతుళ్ళ జ్ఞాపకంగా అనాధాశ్రమాన్ని నడుపుతూంటాడు. దీని ఖర్చుల కోసం జైలు కెళ్ళి వస్తూంటాడు. స్టేజి నటుడుగా మారు వేషాలెయ్యడంలో దిట్ట. దీంతో జైలు శిక్షలు పడ్డ పెద్ద మనుషుల స్థానంలో డబ్బులు తీసుకుని,  వాళ్ళలాగా తనే వెళ్లి శిక్షాకాలం పూర్తి చేసి వస్తూంటాడు. 

         ఒకరోజు ఒకమ్మాయిని దుండగుల బారి నుంచి కాపాడుతాడు. ఆ అమ్మాయే  కూతురు గాయత్రీ అని తెలుసుకుని ఆమెని కలవబోతే, ఆమెకి తన మీద దురభిప్రాయాలున్నాయని తెలుసుకుని కలవకుండా వెళ్ళిపోతాడు. తీవ్ర క్షోభతో గడుపుతూంటాడు. ఇంతలో  గాయత్రి పటేల్ (మోహన్ బాబు డబుల్) అనే ఘరానా మనిషికి ఒక కేసులో శిక్ష పడుతుంది. అచ్చం తనలాగే వున్న ఇతడి బదులు తను జైలు కెళ్ళి రావడానికి ఒప్పుకుంటాడు డబ్బు కోసం. అలా జైలుకెళ్ళి ఇరుక్కుంటాడు. గాయత్రీ పటేల్ ఆడుతున్న గేమ్ లో పావు అయిపోతాడు. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి ఎవరు తనని కాపాడాలి? కూతురు కాపాడుతుందా? ఎలా కాపాడుతుంది? ఇదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఐడియాపరంగా  కథ 1980 నాటిది అనుకోలేం. 1930 ల నాటి ఐడియాతో  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ని 2017 లో కాలానికి తగ్గట్టు ఆధునికంగా మార్చి తీశారు. ఐడియాలు పాతబడవు. వాటికి కాలం చెల్లిన కథనాలు చేస్తేనే పాడవుతాయి. ‘గాయత్రి’  ఐడియాకి  ఆధునికంగా కథనం చేయకపోవడం వల్ల, మొత్తం కథే  1980 ల నాటి పాత వాసనలతో   నిండిపోయింది. ఈ కథా విస్తరణ పరుచూరి బ్రదర్స్ చేశారు. వాళ్లకి మనం చెప్పేంత వాళ్ళం కాము. కానీ కథ నందించిన మాటల రచయిత డైమండ్ రత్నబాబుకి చెప్ప వచ్చు. ఈ కథ ఫ్యామిలీ డ్రామా జానరా, లేక ఫ్యామిలీ థ్రిల్లర్ జానరా? లేక రెండూనా?  రెండూ కావడానికి వీల్లేదు. ఒక ఒరలో విడివిగా, దేనికదిగా రెండూ ఇమడవు. జానర్ల మిశ్రమంలో ఒక ప్రధాన జానరే  కథ చెప్తుంది. మిగతా జానర్లు అనుబంధంగా సాగుతాయి. ఒక ప్రధాన జానర్ గా నడిచే కథ ఆకస్మికంగా ఇంకో ప్రధాన జానర్ గా మారిపోదు. ‘గాయత్రీ’ లోలాగా ఫ్యామిలీ డ్రామా జానర్ కాస్తా ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ గా మారిపోదు. ఇదే ‘గాయత్రి’ కథతో  వచ్చిన ఇబ్బంది. పూర్తి రసభంగం. సరీగ్గా టబు – గోవిందాల ఫ్లాపయిన ‘హవా’ తో వచ్చిన ఇబ్బంది లాంటిది. సైకో హార్రర్ కాస్తా,  కూతురితో తల్లి సెంటిమెంటల్ డ్రామాగా మారిపోయిన వైనం. 

           కృష్ణ, కాంచనలతో జడ్జి పాత్రలో గుమ్మడి విలన్ గా నటించిన, ‘నేనూమనిషినే’ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ థ్రిల్లర్ అనే రెండు జానర్లు గా లేదు. అది ఫ్యామిలీ థ్రిల్లర్ జానరే. ఆ ఫ్యామిలీ డ్రామా అనేది కేవలం థ్రిల్లర్ లో ఇమిడిన పరిమిత ఎమోషనే. ఒక పోలీసు అధికారి తమ్ముడు, ఆ తమ్ముడి కాబోయే భార్య- వీళ్ళతో  కిల్లర్ జడ్జిగా  గుమ్మడి రక్తి కట్టించే అనుబంధాల ఎమోషనల్ సస్పెన్స్ – ఫ్యామిలీ థ్రిల్లర్! 

          ఇంకా ఇలాటి ఫ్యామిలీ థ్రిల్లర్లు  హిందీలో, ఇంగ్లీషులో చాలా వున్నాయి. అవి చూసి వుండాల్సింది. ముందుగా కావలసిన జానర్ ని నిర్ణయించుకుని,  ఆ జానర్ మర్యాదకి బాగా కట్టుబడి,  ఈ నాటికి తగ్గ ఆధునిక కథనం చేయకపోవడం వల్ల అవుట్ డేటెడ్ కథగా పేరొచ్చింది  ‘గాయత్రి’ కి.  ఆధునిక కథనం  చేస్తే మోహన్ బాబు ఇమడరనా? ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ చక్కగా ఇమిడారు. అమితాబ్ లేకపోతే అమ్మాయిల సమస్యతో ఆధునిక కోర్టు డ్రామా థ్రిల్లర్ ‘పింక్’ లేదు. ‘గాయత్రి’ కథంతా చూసి బయటి కొస్తోంటే,  తెలుగు సినిమాల వ్యాపార యుగం - 1 నాటి కథాకథనాలు చూసిన ఫీల్ తో అడుగులు భారంగా పడసాగాయి. 2000 నుంచి నడుస్తోంది వ్యాపార యుగం – 2 కదా?  

          సినిమాకి కావాల్సింది ప్రాథమికంగా మార్కెట్ యాస్పెక్ట్,  దాంతో క్రియేటివ్ యాస్పెక్ట్ అనే  రెండూ. ఇవి కన్పించట్లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో దీనికి యూత్ అప్పీల్ లేదు. యూత్ అప్పీల్ వుండడానికి తండ్రీ కూతుళ్ళ  ఈ కథలో కీలకమైన మెడిసిన్ చదివే కూతురి పాత్ర వుంది. యూత్ అప్పీల్ కి ఈ మెడిసిన్ చదవడమొక్కటే కనెక్ట్ అయ్యే అంశంగా వుంది.  మిగతా ఏ విషయంలోనూ నేటి తరానికి పరిచయమేలేని 1980 నాటి ఓల్డ్ మోడల్ పాత్రే. నేటి తరానికి,  అందునా గర్ల్స్ కి ఎక్కడా కనెక్ట్ అవని పరాయి పాత్ర. ‘పింక్’ తో ఈ పరిస్థితి లేదు. అందులోని హీరోయిన్ నవతరానికి ప్రతినిధిలా కనపడింది కాబట్టే, తెలుగమ్మాయిలు సైతం  దాన్ని విరగబడి చూశారు.  అదే ‘గాయత్రి’ టైటిల్ చూసి,  ‘గాయత్రి’కి వచ్చిన నల్గురైదుగురు తెలుగమ్మాయిలు ముక్కున వేలేసుకుని గబగబా వెళ్లి పోయారు.

ఎవరెలా చేశారు
      ఇది పూర్తిగా మోహన్ బాబు వన్ బై టూ మాన్ షో. ఒక శివాజీ,  ఒక గాయత్రీ పటేల్ షో. ఆయన గురించి కొత్తగా చెప్పుకునేదేముంది? డీసెంట్ గా రెండు పాత్రల్ని పోషించారు.  శివాజీగా ఎంతో కదిలించే విధంగానూ నటించారు. భర్తగా ఆయనకి నటించే అవకాశం లేదు. తన యుక్త వయసులో భర్త పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో విష్ణు కిచ్చారు. అక్కడ్నించీ తను కూతురి అన్వేషణలో వున్న తండ్రిగా ఒక పాత్ర,  విలన్ గా ఇంకో  పాత్రా  నటించారు. విలన్ గాయత్రీ పటేల్ గా ఎదురుచూడని  హాట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు. ఎవరైనా అలా కళ్ళప్పగించి చూస్తూ వుండి  పోవాల్సిందే. ఇలాటి మెస్మరైజింగ్ మేకోవర్ యువ స్టార్స్ ఎవరికీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. హేర్ స్టయిలే ఆయనకి అపూర్వంగా అంత హాట్ లుక్ నిచ్చింది. పలికే డైలాగులతో మరింత టెర్రిఫిక్. 

          శివాజీ సౌమ్యుడిగా ఒక పేజీ మీద  కన్పిస్తాడని ఇతర పాత్రలు చెప్పుకుంటాయి. అదే పేజీ తిప్పితే రెండో పేజీ వేరేగా  వుంటుందని జాగ్రత్త చెప్పుకుంటారు. పాత్రకి హై పాయింట్ ప్లాట్ పాయింట్  వన్ ఘట్టం, దాన్ని అనుసరించి పాట. కూతురెవరో తెలిసిందన్న ఆనందంతో ప్రదర్శించిన నటన కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. దీని వెంటనే అదే ఆనందంతో వచ్చే పాట ఒక బలమైన సెంటిమెంటల్ నాటకీయత. అసలీ రెండిటితో ప్లాట్ పాయింట్ వన్ ఒక అపూర్వ ప్రయోగమనే అనాలి. దీని విషయం తర్వాత చూద్దాం. 

          ఫ్లాష్ బ్యాక్ లో యువ శివాజీగా విష్ణు పౌరాణిక డైలాగులు పలికే ఒక దృశ్యం మొదటిసారిగా అతడికా టాలెంట్ వుందన్న సంగతిని బయట పెడుతుంది. శివాజీగా  పౌరాణిక డైలాగులతో మోహన్ బాబు వెండి తెరని చించెయ్యడం ఒకెత్తు. విష్ణు తక్కువేం కాదు. అయితే ఇతరంగా చూస్తె పాత్రలో బాగానే నటించినా, పాతకాలం పాత్ర కావడంతో తను గుర్తుండడానికి స్కోపు లేకుండా పోయింది. శ్రియతో ప్రేమ గానీ, చేసే కాపురంగానీ   పాత  సినిమా చూస్తున్నట్టు వున్నాయి. శ్రియతో ‘ఒక నువ్వూ ఒక నేనూ ఒకటయ్యాం మనం’ డ్యూయెట్ మాత్రం సినిమాకి హైలైట్.

          శ్రియ కూడా పాత విశ్వనాథ్ సినిమా హీరోయిన్ లా కన్పిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ ఇది. ఆనాడు కూడా సినిమాల్లో హీరోయిన్లు ఇలాటి వేష భాషలతో  కన్పించరు. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి 40 ఏళ్ల నాటి పాత్రలు  దృశ్యాలు సంగతులు చూపించారు. శ్రియది చనిపోయే పాత్రయినప్పుడు,  దానికుండే డైనమిక్స్ తో కూడా పాత్రచిత్రణ చేయలేదు. యాక్టివ్ పాత్ర చనిపోతే డైనమిక్స్ వుంటాయి. ఆ పాత్ర గుర్తుంటుంది. పాసివ్  పాత్ర పాసివ్ గానే చనిపోతే ప్రభావమే వుండదు. ‘మనం’ లో శ్రియ ని ఇంకా పూర్వపు ఫ్లాష్ బ్యాక్ లో ఎంతో యాక్టివ్ గా చూపించారు గుర్తుండి పోయేలా. 

          కూతురి పాత్రలో హీరోయిన్ నిఖిలా విమల్ మంచి భావప్రకటనా సామర్ధ్యమున్న నటి. కానీ చేయడానికి పాత్రగా ఏమీ లేదు. కారణం, తండ్రీ కూతుళ్ళ కథ ఒక భావోద్వేగ భరిత పతాక స్థాయికి చేరకముందే, గాయత్రీ పటేల్ పాత్ర అడ్డురావడం, కథని అతను తన వైపు తిప్పుకోవడం. పైగా పాత్రకి నేటి తరాన్ని ఆకర్షించే లక్షణాలేవీ కూడా కన్పించవు. శ్రియ పాత్రకి లాగే పాసివ్ గా, సాత్వికంగా కన్పించే పాత్ర. పైగా ఫస్టాఫ్ లో శివాజీ డామినేషన్ -  సెకండాఫ్ లో గాయత్రీ పటేల్ డామినేషన్ ల  మధ్య తనకి సీన్లు కూడా తక్కువే. క్లయిమాక్స్ లో తప్పదు కాబట్టి కొంత హడావిడీ.

          టీవీ జర్నలిస్టుగా అనసూయ మరో ‘క్షణం’ తడాఖా చూపించాలనుకుంటే కుదర్లేదు. అసలీ కథంతా శివాజీ డబుల్ గా వ్యవహరిస్తూ,  నేరస్తుల బదులు తను జైలుకెళ్ళి వస్తున్నాడన్న  ఆమె ఇన్వెస్టిగేషన్ పరంగా ఛానెల్ బాస్ (రఘుబాబు)కి చెప్పుకురావడంగా వుంటుంది. క్లయిమాక్స్ లో ఆమె స్థానాన్ని కూతురి పాత్ర ఆక్రమించడంతో ఆమె అంతంత మాత్రంగా  మిగిలిపోతుంది. అయితే ఒక జర్నలిస్టుగా ఎక్కడా నవ్వకుండా, ప్లెజెంట్ గా వుండకుండా అంత సీరియస్ గా  వుండాల్సిన అవసరమేమిటో అర్ధంగాదు. 

          జడ్జిగా ఒక సీనులో కోట, లాయర్ గా రెండు సీన్లలో తనికెళ్ళ, జైలర్ గా కొన్ని సీన్లలో నాగినీడు, శివాజీ పాత్ర స్నేహితుడిగా శివ ప్రసాద్ కన్పిస్తారు. బ్రహ్మానందం, అలీ, సత్యం రాజేష్ ల కామెడీ కాలం చెల్లిన కామెడీ. నవ్వేం రాదు. సహాయపాత్రల తారాగణం ఎంపికలో  కూడా యూత్  అప్పీల్ లేదు. నిఖిలా విమల్, అనసూయలు తప్ప ఇంకో యువనటీ,  యువ నటుడూ లేరు. 

          డైమండ్ రత్నం రాసిన డైలాగులు బావున్నాయి. నేటి రాజకీయాల మీద భిన్నమైన డైలాగులు రాశారు. రాజకీయాల మీద నేటికి వర్తింప జేసి  డైలాగులు రాయాలన్న సామా జిక స్పృహ గల తను, కథని మాత్రం నేటికి వర్తించని విధివిధానాలతో రాసేశారు. 

          సాంకేతిక ప్రమాణాలు బావున్నాయి. సర్వేష్  మురారీ మరోసారి నీరెండ లాంటి తన సినిమాటోగ్రఫీ చమక్కులు చూపించారు. పాటల చిత్రీకరణలో మరీ అద్భుతం. పాటలకొస్తే, ఆశ్చర్యకరంగా తమన్ ఒక నిజమైన మ్యూజికల్ అనుభావాన్నిచ్చారు. నేపధ్య సంగీతమైతే సన్నివేశాలనే ఎలివేట్ చేసింది. 

          అయితే మదన్ దర్శకత్వమే పాత స్కూలు దర్శకత్వంలా వుంది. ఉన్న కథనంతో కూడా వేగం లేదు. ఫస్టాఫ్ దాదాపూ విషయం లేకుండానే మోహన్ బాబు టాలెంట్ ని చూపించే రిపీట్ దృశ్యాలతో నింపేశారు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సహా, మిగతా యాక్షన్ స్టోరీ అదే పాత పోకడలతో నడిపారు. ఇందులో ఫాలోకాలేని ఎన్నో ట్విస్టులు పెట్టారు. తండ్రీ కూతుళ్ళ అసలు కథ సెకండాఫ్ లో వదిలేసి గాయత్రీ పటేల్ మీద పడ్డారు. ముందు స్ట్రక్చర్ చూసుకోవడం ముఖ్యం, చూసుకోకుండా జర్నలిస్టు చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రధాన కథ, అందులో మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ కథ, ఈ రెండిటికీ కవరింగ్ లెటర్ లాగా ప్రస్తుత కథా -కఫ్యూజింగ్ క్రియేటివిటీతో  ఏమేమో చేశారు. వీటి గురించి రేపు స్క్రీన్ ప్లే సంగతులు లో చూద్దాం.


సికిందర్