"సంతోషంగా
వుండే కుటుంబాలన్నీ ఒకే సంతోషాన్ని కలిగివుంటాయి, కానీ సంతోషంగా
లేని కుటుంబాల అసంతోషానికి చాలా కారణాలుంటాయి”- అన్న సుప్రసిద్ధ వాక్యంతో ‘అన్నా కరెనినా’ నవల ప్రారంభిస్తాడు లియో టాల్ స్టాయ్. అంటే ఒక కుటుంబం సంతోషంగా వుండాలంటే, అనేక కీలకాంశాలు ఇవ్వాలి (కుటుంబ సభ్యులందరి
మంచి ఆరోగ్యం, ఆమోదయోగ్యమైన ఆర్థిక భద్రత, పరస్పర ఆప్యాయతలతో కూడిన సంబంధాలు వంటివి).
ఇప్పుడు
మన విషయానికొద్దాం : మూస కుటుంబ సినిమాలన్నీ ఒకేలా సంతోషాన్నిస్తాయి, కానీ
మూసలో వుండని కుటుంబ సినిమాలు అనేక
కీలకాంశాల వల్ల అసంతోషాన్నిస్తాయి (అపసవ్య పాత్ర చిత్రణలు,
అర్ధంలేని మానసిక సంఘర్షణలు, అసంతృప్త కథాకథనాలు వంటివి).
సినిమా హిట్టయితే అవుతుంది. దాంతో మనకి సంబంధం లేదు. ఎలాటి సినిమా హిట్టయిందన్నది
తెలుసుకోవడమే ముఖ్యం. ఇలాటి సినిమాలు ఇలాగే హిట్టయితే ఇలాగే తీయొచ్చని చెప్పడం కూడా
ఉద్దేశం. కనుక ముందుగా కథలోకి వెళ్దాం..
కథలోకి
వెళ్ళేముందు ఒక మనవి. ఎందరో ఈ స్క్రీన్ ప్లే సంగతుల కోసం తొందర పెడుతూ మెసేజిలు,
ఫోన్లు చేశారు. సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల పట్ల ఇప్పటికీ తగ్గని ఆసక్తి వుండడం మంచి
విషయం. అయితే ఈ సినిమా కథలో అనేక ట్విస్టులు, సస్పెన్స్ వగైరా
వున్నాయి. వీటిని బహిర్గతం చేయకుండా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం కష్టం. కనుక
ఈ స్పాయిలర్స్ కారణంగానే సినిమా విడుదలైన వెంటనే ఈ ఆర్టికల్ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపాం. ఆలస్యానికి ఇదీ కారణం.
ఇక విషయంలోకి వెళ్దాం...
1. బిగినింగ్ (ఫస్టాఫ్) :
ముంబాయిలో విరాజ్ (నాని) ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతడికి మహిమ (కియారా ఖన్నా) అనే ఆరేళ్ళ కూతురు వుంటుంది. ఈమెకి పుట్టుకతోనే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధి వుంటుంది. విరాజ్ తండ్రి (జయరాం) విరాజ్ తోనే వుంటాడు. విరాజ్ కి జస్టిన్ (ప్రియదర్శి) అనే ఫ్రెండ్ వుంటాడు. స్కూల్లో చదివే కూతురికి విరాజ్ కథలు చెబుతూ వుంటాడు. ఆ కథల్లోని పాత్ర స్థానంలో ఆమె తండ్రిని ఊహించుకుంటూ వుంటుంది. ఇక ఇలా నాన్న కథలు కాదు, అమ్మ కథలు చెప్పాలని పట్టుబడుతుంది. క్లాసులో ఫస్ట్ వస్తే చెప్తానంటాడు. కానీ క్లాసులో ఫస్ట్ వచ్చినా చెప్పడు. పైగా కసురుకోవడంతో హర్ట్ అవుతుంది. ఇంట్లోంచి బయటికెళ్ళిన పెంపుడు కుక్క ప్లూటో కోసం వెళ్ళి ప్రమాదం బారిన పడుతూంటే, యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం తో బిగినింగ్ ముగుస్తుంది.
2. మిడిల్-1 : విషయం తెలుసుకుని విరాజ్ కాఫీ షాప్ కొస్తే, ఇక్కడ కూతురితో యష్ణ వుంటుంది. పరిచయాలవుతాయి. ఇక తప్పక, యష్ణ ప్రోద్బలంతో కూతురికి అమ్మ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కథలో అమ్మగా యష్ణని వూహించుకుంటానంటుంది కూతురు. అలా కూనూరు (తమిళనాడు) లో యష్ణ లాగా అమ్మని ఊహించుకుంటున్న వర్ష (మృణాల్ ఠాకూర్) కథ అంటే ఫ్లాష్ బ్యాక్ -1 ప్రారంభమవుతుంది.
2. మిడిల్-1 : విషయం తెలుసుకుని విరాజ్ కాఫీ షాప్ కొస్తే, ఇక్కడ కూతురితో యష్ణ వుంటుంది. పరిచయాలవుతాయి. ఇక తప్పక, యష్ణ ప్రోద్బలంతో కూతురికి అమ్మ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కథలో అమ్మగా యష్ణని వూహించుకుంటానంటుంది కూతురు. అలా కూనూరు (తమిళనాడు) లో యష్ణ లాగా అమ్మని ఊహించుకుంటున్న వర్ష (మృణాల్ ఠాకూర్) కథ అంటే ఫ్లాష్ బ్యాక్ -1 ప్రారంభమవుతుంది.
వర్ష సింగర్. ఈమెని చూడగానే ప్రేమలో పడతాడు విరాజ్. కీచులాడుకునే తల్లిదండ్రులతో మనశ్శాంతి వుండదు వర్షకి. ఆమెకి ఒక తమ్ముడుంటాడు. ఆమె విరాజ్ తో ప్రేమలో పడుతుంది. కానీ విరాజ్ తో పెళ్ళికి వర్ష తల్లి అంగీకరించదు. అంతస్తుల తారతమ్యం. ఆమెకి భరోసా ఇచ్చి వర్షని పెళ్ళి చేసుకుంటాడు.
అయితే పిల్లలు వద్దని ముందే చెప్పి పెళ్ళికి ఒప్పుకుంటుంది వర్ష. మూడేళ్ళు గడిచాక పిల్లలు కావాలంటాడు. ఇక్కడ గొడవపడుతుంది. తర్వాత ఒప్పుకుంటుంది. మహిమ పుడుతుంది. పుట్టగానే సిస్టిక్ ఫైబ్రోసిస్ తో పుట్టిందని చెప్తాడు డాక్టర్ రంజన్ (నాజర్). ఇద్దరూ షాక్ అవుతారు. ఈ ఫ్లాష్ బ్యాక్-1 ఇక్కడి వరకు చెప్పి ఆపుతాడు.
యష్ణ బలవంతం చేస్తే ఫ్లాష్ బ్యాక్-2 చెప్తాడు : హాస్పిటల్లో ఇంక్యుబేటర్లో
వుంటుంది పుట్టిన వ్యాధిగ్రస్తురాలైన కూతురు మహిమ. వర్ష తో విరాజ్ తో మాటలు మానేస్తుంది..
ఏదేదో వేదాంతం మాట్లాడుతుంది. డ్రైవింగ్ లో ఈ మాటలప్పుడు అదుపు తప్పి కారు
యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్లో చేర్చిన వర్షకి మెమరీ లాస్ అని తెలుస్తుంది.
దీనికి ఆమె తల్లి వర్ష ఇక గతాన్ని మర్చిపోయిందనీ, కూతురు
పుట్టింది కూడా తెలియదనీ, విడాకులివ్వడం మంచిదనీ చెప్పేస్తుంది.
ఇక్కడ ఫ్లాష్ బ్యాక్-2 ఇక్కడ ఆపేసి ఇక చెప్పడు విరాజ్.
తర్వాత ఇంట్లో లాప్ టాప్ ఓపెన్ చేసి యష్ణ ఫోటోనే చూస్తాడు. ఈమె యష్ణ కాదు. కథలో తల్లి పాత్రని యష్ణ లాగా ఊహించుకుంది కూతురు. కాబట్టి ఈ పాత ఫోటోలో వున్నది యష్ణ కాదు, ఈమె వర్ష అయుంటుంది. అంటే యష్ణే వర్ష. విరాజ్ చెప్పింది యష్ణ కథే. తనకిప్పుడు యష్ణ లాగా పరిచయమైంది మెమరీ లాస్ అయిన వర్షే. ఈ డిక్లరేషన్ తో మిడిల్ -1 అంటే ఫస్టాఫ్ ముగుస్తుంది.
3. మిడిల్ -2 (సెకండాఫ్) :
మెమరీ లాస్ అయిన వర్ష యష్ణ లాగా విరాజ్
కూతురితో ఫ్రెండ్ షిప్ చేస్తూ విరాజ్ కి దగ్గరవడానికి ప్రయత్నిస్తూంటుంది. విరాజ్
కిది నచ్చదు. కూతురి పుట్టింరోజుకి తీసుకుని గోవా వెళ్ళిపోతాడు.
అక్కడికొచ్చేస్తుంది యష్ణ. యష్ణకి డాక్టర్ అరవింద్ (అంగద్ బేడీ) తో సంబంధం
చూస్తుంది ఆమె తల్లి. యష్ణ కిది ఇష్టముండదు. విరాజ్ కి దగ్గరవడానికి
ప్రయత్నిస్తుంది. విరాజ్ దూరం దూరంగా వుంటాడు. యష్ణ చెల్లెల్నంటూ ఒకమ్మాయి
వస్తుంది. విరాజ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు తమ్ముడని చెప్పాడుగానీ నిజానికామె ఈ
చెల్లెలే. ఇక విరాజ్ యష్ణ ఇద్దరూ తాగేసి కీచులాడుకుంటారు. యష్ణ
కి డాక్టర్ అరవింద్ తో పెళ్ళి ఏర్పాట్లు
జరుగుతాయి. అడ్డుగా వున్న విరాజ్ ని కొట్టిస్తాడు డాక్టర్ అరవింద్.
ఇప్పుడు విరాజ్ తండ్రి (జయరాం) వచ్చి యష్ణ తల్లి చేసిన కుట్రని బయటపెడతాడు. అతను విరాజ్ తండ్రి కాదనీ, యష్ణ తల్లితో పడక వెళ్ళిపోయిన యష్ణ తండ్రేననీ ఇప్పుడు బయటపడుతుంది. చాలా గొడవల తర్వాత యష్ణని విరాజ్ కే వదిలేస్తాడు డాక్టర్ అరవింద్. ఇప్పుడు కూతురికి అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తుంది. ఈ సంఘటనతో ప్లాట్ పాయింట్- 2 వస్తుంది. అంటే మిడిల్ -2 ముగుస్తుంది.
4. ఎండ్ : కూతురికి ఆపరేషన్ ఏర్పాట్లు జరుగుతాయి. యష్ణ తల్లి ఈ కూతురికి యష్ణ గురించి నిజం చెప్పేస్తుంది -ఈమే మెమరీ లాస్ అయిన నీ తల్లి వర్ష అని. మెమరీ లాస్ తోనే వున్న యష్ణ తనని తల్లిగా అంగీకరిస్తుందో లేదోనని మహిమని అడిగి చూస్తుంది. తలూపుతుంది మహిమ. దీంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.
మార్కెట్
యాస్పెక్ట్ : మొదలు పెడితే ముగించే వరకూ ట్రాజడీని పోషించే ఈ కాన్సెప్ట్
బాక్సాఫీసు అప్పీలుకి వ్యతిరేకమైనదే. జానర్ ఫ్యామ్-రోమ్ కామెడీగా వుంటే బాక్సాఫీసు
అప్పీలుంటుంది. మార్కెట్ యాస్పెక్ట్ తో వుంటుంది. అయినా ఈ కథకి మంచి రెస్పాన్స్ వచ్చిందంటే పర్టిక్యులర్ స్టార్
కాస్ట్ వల్ల కావొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్
జానర్ ఫ్యామ్-రోమ్ కామెడీగా వుండుంటే ఇంతకంటే చాలా పెద్ద తక్షణ వైరల్ హిట్
కి అవకాశముండేది.
క్రియేటివ్ యాస్పెక్ట్ : ఈ కాన్సెప్ట్ కి క్రియేటివ్ యాస్పెక్ట్ తికమక పెట్టేస్తుంది. హాయ్ నాన్నా అనడంలో ఇది విరాజ్ సమస్యతో కూడిన విరాజ్ కథ అనిపిస్తుంది. కానీ వర్ష/యష్ణ సమస్య కేంద్రంగా కథ సాగుతుంది. అలాగే కూతురు మహిమ అమ్మ కథ కోసం విరాజ్ ని ఇబ్బంది పెడుతూ వుంటుంది. కాబట్టి తల్లి కోసం మహిమ కథలా కూడా అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి కథ? ఎవరి కథ ఆధారంగా ఐడియాని విస్తరించి ఈ కథ చే శారు?
ఫస్టాఫ్ అమ్మ కథ కోసం /అమ్మ కోసం మహిమ కథగా సాగి, సెకండాఫ్ మహిమ కథ అదృశ్యమై, ఆ అమ్మ వర్ష/యష్ణ మెమరీలాస్ కథగా మారుతుంది. అంటే ఫస్టాఫ్ కంటిన్యూటీ లేక సెకండాఫ్ -సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది. ఇక్కడ విరాజ్ కథ అదృశ్యమయిపోయింది. ఫస్టాఫ్ తో సంబంధం తెగి సెకండాఫ్ తెగిన గాలి పటంలా ఎలా పడితే అలా సాగింది. ఇలా క్రియేటివ్ యాస్పెక్ట్ ఏక సూత్రత లోపించడంతో బోలెడు కన్ఫ్యూజన్.
అంటే అనుకున్న ఐడియా స్ట్రక్చర్ లో లేదు. స్ట్రక్చర్ అంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్. ముందు తట్టిన ఐడియాకి స్ట్రక్చరుందా లేదా చూసుకోకపోవడం వల్ల స్క్రీన్ ప్లేకీ స్ట్రక్చర్ లేక గజిబిజి కథలా తేలింది. ముందుగా ప్రధాన పాత్ర ఎవరో తేల్చుకుని, దాన్ని బేస్ చేసుకుని, దాని కథగా ఐడియాని విస్తరించినప్పుడే స్క్రీన్ ప్లేకి తగిన బలమైన పునాది పడుతుంది.
విరాజ్, వర్ష, యష్ణ, మహిమ 4 పాత్రల్నే ముఖ్యంగా చూడాలి. విరాజ్ అంటే సూర్యుడు, రాజు, దేదీప్యమానం, వైభవం, ఘనత,
అగ్ని, సుందర రూపుడు, తెలివైనవాడు, సమర్ధుడు ఇంకా - బుద్ధుడి
మారుపేరు అని కూడా అర్ధాలున్నాయి. వీటిలో
ఏ ఒక్కటీ విరాజ్ పాత్ర లక్షణంగా లేదు. కథ సాంతం పాథోస్ (శోకరసం) వొలికిస్తూ డల్ గా
వుంటాడు. అంటే పూర్తి స్థాయి పాసివ్ క్యారక్టర్. కథని నడిపే కథా నాయకుడుగా కాక, కథే తనని నడిపే బాధితుడుగా సినిమా సాంతం డల్ గా వుంటాడు. హీరో ఏం
చేస్తాడని ఎదురు చూసే ప్రేక్షకులకి, పాసివ్ క్యారక్టర్ గా
హీరో కర్తవ్య హీనుడై సినిమాలో కాలక్షేపం చేస్తాడు. కథ హీరోని ఫాలో అవడం గాక, హీరోయే కథని ఫాలో అవుతున్నాడు. అంటే హీరో నడపాల్సిన కథలో కథకుడు జోక్యం
చేసుకోవడం వల్ల, కథకుడు తనకి అనుకూలంగా హీరో కథ నడపడం వల్ల, హీరో కథా నాయకుడు కాకుండా పోయాడు. ఇది కథా రచనలో మౌలిక సూత్రాల ఆలోచన లేకుండా
చేసిన ప్రయత్నంలా వుంది.
ఇక రెండో పాత్ర వర్షకి పాటలంటే ఇష్టం. నిర్ణయాలు చప్పున మార్చుకుంటుంది. అలాగని స్థిరత్వం లేకపోవడం ఈమె స్వభావమన్నట్టు పాత్ర చిత్రణ వుండదు. కాబట్టి కన్నీళ్ళు వర్షించినప్పుడు సానుభూతి ఏర్పడదు. పైగా పాటలు పాడే వర్షగా గతాన్ని మర్చిపోయిన తను, యష్ణగా పాటలు పాడుతుంది.
మూడో పాత్ర యష్ణ అంటే ప్రార్థించడం, తెల్ల గులాబీ, స్వచ్ఛత, దయ, ఆధ్యాత్మికం అనే అర్ధాలున్నాయి. వర్షగా గతాన్ని (విరాజ్ ని) మర్చిపోయి యష్ణగా విరాజ్ ప్రేమకోసం ప్రయత్నిస్తూ వుంటుంది. ఈమె ఒక్కతే ఒక లక్ష్యం, గమ్యం, ప్రయత్నం అంటూ వున్న యాక్టివ్ లక్షణాలున్న పాత్రగా కన్పిస్తుంది. కానీ కాదు. కథకుడు విరాజ్ ని కథ నడుపుకొనిస్తే యష్ణ పాత్రే వుండదు. ఇదెలాగో చివర్లో తెలుసుకుందాం. అయితే .పేరుకున్న అర్ధాలకి తగ్గట్టే పాత్ర వుంది.
నాలుగో పాత్ర మహిమ అమ్మ కథ కోసం ఫస్టాఫ్ లో యాక్టివ్ గా వుంటూ, అదే యాక్టివ్ నెస్ తో కథలో అమ్మలాగా వూహించుకున్న యష్ణని నాన్నతో కలిపే కార్యక్రమం చేపట్టకుండా, సెకండాఫ్ లో పాసివ్ గా మారిపోతుంది. పేరుకి తగ్గ మహిమల్నేం మెరిపించదు. విరాజ్ ఈమెకి ఇలాటి కథలు చెప్పకుండా ‘ముత్యాలముగ్గు’ సినిమాని చూపించాల్సింది. అద్భుత రసంతో ఎంటర్ టైన్ చేస్తూ పిల్లలు తల్లిదండ్రుల్ని కలిపే సూపర్ హిట్ ఫ్యామ్ జానర్ సినిమా.
పాత్రల తీరుతెన్నులు ఇలావుంటే కథ తిన్నగా ఎలా వుంటుంది. ఏ కథ కైనా పాత్రలతో బలాబలాల సమీకరణ వుంటుంది. అప్పుడే సరైన, ఏకోన్ముఖ సంఘర్షణ పుడుతుంది. కౌరవులెవరో, పాండవులెవరో, కృష్ణుడెవరో, అర్జునుడెవరో గీత గీసి ఆట మొదలెట్టక పోతే అది కురుక్షేత్రమవదు.
కథ
మొత్తాన్నీ ఫస్టాఫ్ లో కుక్కడం వల్ల సెకండాఫ్ కి కథ లేకుండా పోయింది. ఇదే సెకండాఫ్
సిండ్రోమ్ కి కారణం. ఇదెలా జరిగిందో చూద్దాం...బిగినింగ్ (ఫస్టాఫ్) లో -ముంబాయిలో ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ గా విరాజ్ దిన
చర్యతో కథ మొదలవుతుంది. అతను ఆరేళ్ళ కూతురితో,
తండ్రితో వుంటాడు. ఈ ప్రారంభంలోనే కూతురు మహిమకి కథ చెప్తాడు. ఆమె నాన్న కథ కాదు, అమ్మ కథ చెప్పాలంటుంది. అంటే ప్రారంభంలోనే ఆమెకి అమ్మలేదన్న విషయం మనకి చెప్పేశాడు
కథకుడు. అంటే ఈ కథ భార్యా భర్తల కొట్లాట అని ముందే తెలిసిపోయేలా చేశాడు. పైగా ఏదో
ట్రాజడీ జరిగి వుంటుందన్న శాడ్ మూడ్ (పాథోస్) ఏర్పడుతోంది ప్రారంభమే. ఇదే మూడ్ సినిమా చివరంటా
కొనసాగుతుంది. శాడ్ మూడ్ (లో- వైబ్రేషన్) యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవుతుంది?
ఇలా వెంటనే అమ్మ ప్రస్తావన దేనికి? దాన్ని వాయిదా వేసి, తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని జాలీ లైఫ్ గా ఎంటర్ టైన్ చేస్తూ చూపించ వచ్చుగా? ఈ ఎంటర్ టైన్మెంట్ లో తల్లి కనిపించక పోతే తల్లి ఏమైందన్న ప్రశ్న, సస్పెన్స్ అంతర్లీనంగా మనకుంటే సరిపోతుందిగా? పాత్రల చేత కన్ఫమ్ చేసి రసభంగం కల్గించడం దేనికి? అమ్మ లేదనే అర్ధంలో అప్రస్తుత డైలాగులతో థియేటర్ లో లో- వైబ్రేషన్ ప్రసారం చేయడం దేనికి? పరమ హేపీ లైఫ్ చూపిస్తూ ప్రేక్షకులకి- బాక్సాఫీసుకీ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అందించొచ్చుగా హుషారొచ్చేలా? సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా - ప్రారంభించింది మొదలు ముగించే వరకూ ఒకటే లో- వైబ్రేషన్ తో పాథోస్ తోనే వుంటుంది భారంగా. కఠినమైన స్ట్రక్చర్ స్కూల్ అవసరం ఫీలవక పోయినా, క్రియేటివ్ స్కూల్ తోనైనా స్కిల్స్ కనబర్చి వుంటే బావుండేది.
అయితే ఆరేళ్ళ క్రితం విరాజ్ కి భార్యతో జరిగిన ట్రాజడీ దృష్ట్యా ఇప్పుడతను హేపీగా ఎలా వుంటాడనొచ్చు. వుండొచ్చు. స్టీవ్ హార్వే అనే లా ఆఫ్ ఎట్రాక్షన్ హోస్ట్ టీనేజీలో తల్లిని కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళి పోయాడు. అప్పుడొక చర్చి మినిస్టర్, నీ మదర్ నీకు చేసిన మంచి పనులు తల్చుకోమన్నాడు. తల్చుకుంటే స్టీవ్ ముఖంపై నవ్వు వెలసింది. అంతే, ఇక మదర్ తోవున్న అలాటి తియ్యటి జ్ఞాపకాలతో హేపీగా గడప సాగాడు. తమవాళ్ళు ఏడుస్తూంటే వెళ్ళిపోయిన ఆత్మలకి నచ్చదు, ఆత్మలంటూ వుంటే. అవి సంతోషంగా వుండాలనే కోరుకుంటాయి.
విరాజ్ కూడా సంతోషంగా వుండొచ్చు.
ఇప్పుడు సంతోషంగా వుంటేనే తర్వాత ఫ్లాష్ బ్యాకులు రివీలైనప్పుడు ట్రాజడీ
అనుభవించవచ్చు. పాత్ర రెండూ అనుభవించాలి. ఈ డైనమిక్స్ (ద్వంద్వాలు) లేకుండా
అట్టముక్క (కార్డ్ బోర్డు) పాత్ర సృష్టించడం క్రియేటివిటీ అన్పించుకోదు. సుఖం వెంట
పరిగెత్త వద్దు- సుఖం వెంట పరిగెత్తితే దుఖం మన వెంట పరిగెత్తుకొస్తుంది
(బుద్ధుడు). అలా కూతురికి నాన్న కథలే చెప్తూ జీవితాన్ని తెగ
ఎంజాయ్ చేస్తూంటే, అప్పుడు యష్ణ రూపంలో ఫ్లాష్ బ్యాక్స్
తగిలి, దాంతో భార్య కథ గుర్తు చేసుకునే అనివార్య పరిస్థితితో
డైనమిక్స్ మారిపోయి, శాడ్ మూడ్ ఏర్పడొచ్చు. రస పోషణ ఇలా జరిగి
వుండాలి.
మరొకందుకు కూడా విరాజ్ కూతుర్ని సంతోష పెడుతూ గడపాలి. ఎందుకంటే విరాజ్ కి తన ట్రాజడీ కంటే ఎక్కువ కూతురికి పుట్టుకతోనే ప్రాణాంతక సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధి వుంది. ఈ వ్యాధి ఇప్పుడు కాకపోయినా టీనేజీలో తిరగబెట్ట వచ్చు. కనుక కూతుర్ని వీలైనంత సంతోష పెడుతూనే గడపక తప్పదు.
వ్యాధి విషయం చూద్దాం. కథకి గండి
పడేలా కూతురికి ఏ వ్యాధీ అవసరం లేదు. మరొకందుకు కూడా అవసరం లేదు. ఎలాగంటే, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జన్యు పరంగా వంశ పారంపర్యంగా సంక్రమించే
వ్యాధి. అంటే విరాజ్ వైపు నుంచి కావచ్చు, లేదా భార్య వైపు
నుంచీ కావచ్చు. ఇద్దర్లో ఒకరి వంశం నుంచి సంక్రమించి వుంటుంది. అలాంటప్పుడు విరాజ్, యష్ణ/వర్షల పరిస్థితేమిటనేది ఆలోచించాలి. ఎవరు కూతురి వ్యాధికి బాధ్యులు? ప్రశ్న ఇదైతే, కూతుర్ని ఆమె ఖర్మానికి వదిలేసి
కీచులాడుకుంటూ కూర్చోలేరు.
ఈ వ్యాధికి చికిత్స లేదు. సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ గీపరేషన్ ఏమీ వుండదు. ఎందుకంటే జెనెటిక్ థెరఫీ సాధ్యం కాదు. మందులతో నియంత్రించ వచ్చు, నివారణ లేదు. పూర్వం ఈ వ్యాధితో 30 ఏళ్ళు బ్రతికే వారు. ఇప్పుడు మందులు అభివృద్ధి చెందడం వల్ల ఆయుప్రమాణం 50 ఏళ్ళకి పెరిగింది. ఆ తర్వాత బతకడం కష్టం. మందులు వాడుతూ అరుదుగా 80 ఏళ్ళు బ్రతికిన వారున్నారు. కూతురికి ఇంత శిక్ష దేనికి? ఈ ప్రశ్న వేసుకుంటే కూతురికి ఈ వ్యాధి అంటగట్టి వుండడు కథకుడు.
కథలో ఆడ పాత్రలకి ట్రాజడీలే కాక శిక్షలు కూడానా? లేక- ‘సంతోషంగా వుండే కుటుంబాలన్నీ ఒకే సంతోషాన్ని కలిగివుంటాయి, కానీ సంతోషంగా లేని కుటుంబాల అసంతోషానికి చాలా కారణాలుంటాయి’- అన్న టాల్ స్టాయ్ భావాన్ని కథకుడు ఇలా చూపించ దల్చుకున్నాడా- ఇన్ని పాయింట్లూ సమస్యలూ కలిపేసి? విరాజ్ కుటుంబం అసంతోషానికి భార్యకున్న మెమరీ లాస్ కారణం ఒక్కటి చాలు. ఈ మెమరీ లాస్ కారణంగా పుట్టే సమస్యలు ఎన్నయినా చూపిస్తే -అసంతోష కుటుంబాలకి టాల్ స్టాయ్ నిర్వచనం సరిపోవచ్చు.
మరొకటి : విరాజ్ కి భార్యంటే కోపమెందుకు? ఆమె ఏం తప్పు చేసింది? ఫ్లాష్ బ్యాక్ లో కారు యాక్సిడెంట్ చేసి ఆమె మెమరీ హరీ మనేలా చేసింది తను. అలాటిది కూతురు అమ్మ కథ చెప్పమన్నప్పుడల్లా చిరాకు పడతాడెందుకు? అసలు కథలు చెప్తూంటే ఆమెకి అమ్మ గుర్తొస్తున్నప్పుడు కథలు చెప్పడమెందుకు? చెప్పినా చక్కగా అమ్మ గురించి కట్టుకథలు చెప్పి ఎంటర్టయిన్ చేయొచ్చు. కథకి ఏ నష్టం రాదు. నాన్న కథలు చెప్పడానికి అతను సాధించిందేమీ లేదు- భార్యకి మెమరీ లాస్, కూతురికి వ్యాధి తెచ్చి పెట్టడం తప్ప!
హీరో బ్యాక్ స్టోరీని సరిగ్గా వర్కౌట్ చేయకుండా, బిగినింగ్ విభాగం చేయడంతో ఈ 20 నిమిషాల బిగినింగ్ విభాగం ఇలా ఇన్ని లోపాలతో తయారయింది- పాత్రచిత్రణలతో, కథనంతో. సినిమా హిట్టవుతుందా లేదా తర్వాతి సంగతి, ముందు స్టార్ ని నమ్మి టికెట్ డబ్బులు పెట్టిన ప్రేక్షకులకి తగిన నాణ్యమైన వస్తువు అందించడం ఉత్పత్తిదారుడి బాధ్యత. ఈ సినిమాకి 65 కోట్లు బడ్జెట్ అయిందంటున్నారు- ఆ స్థాయి కంటెంట్ మాత్రం కనిపించడం లేదు. చూస్తూంటే అనుకున్న ఐడియాని విస్తరించి ముందుగా సినాప్సిస్ రాయలేదన్పిస్తోంది. క్రియేటివ్ స్కూల్ తో ఇదే జరుగుతుంది.
8. ప్లాట్ పాయింట్ వన్ కి లీడ్ సీను చూద్దాం :
ఇక
క్లాసులో ఫస్టొచ్చాక, చేసిన ప్రామీస్ ప్రకారం అమ్మ కథ చెప్పమంటుంది కూతురు. కసురుకుని వెళ్ళిపోతాడు. అమ్మ కథ చెప్పే ఆలోచనే లేకపోతే ఎందుకు ప్రామీస్ చేశాడు. నాన్న మాట తప్పే మనిషని అనుకోదా కూతురు? ఇక దేనికి నమ్ముతుంది? క్యారక్టర్ నిలబడాలంటే అమ్మ కథ చెప్పాల్సిందే. చెప్తున్నప్పుడు పెంపుడు కుక్క బయటికి పరిగెడితే అప్పుడు దానికోసం బయటికి పరుగెట్ట వచ్చు కూతురు. కథకి నష్టం లేదు.
ఇలాకాక, అతను కూతుర్ని కసురుకుని, కుక్క ఏదో డిస్టర్బ్ చేసిందని, దాన్ని ఎత్తుకెళ్ళి గుమ్మంలో వదిలి పెడతాడు. అలా కుక్క బయటికెళ్ళిందని, దానికోసం బయటికి పరిగెడుతుంది కూతురు. అంటే ఆమె అతను కథ చెప్పలేదని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోకుండా- కుక్క కోసమే బయటికి పరుగెట్టిందన్న అర్ధంలో రాంగ్ గా తేలింది ఈ సీను!!
ఇలాకాక, అతను కూతుర్ని కసురుకుని, కుక్క ఏదో డిస్టర్బ్ చేసిందని, దాన్ని ఎత్తుకెళ్ళి గుమ్మంలో వదిలి పెడతాడు. అలా కుక్క బయటికెళ్ళిందని, దానికోసం బయటికి పరిగెడుతుంది కూతురు. అంటే ఆమె అతను కథ చెప్పలేదని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోకుండా- కుక్క కోసమే బయటికి పరుగెట్టిందన్న అర్ధంలో రాంగ్ గా తేలింది ఈ సీను!!
కథని పాత్రలు నడుపుకో నివ్వకుండా అడ్డుపడి తను కథ నడుపుతున్నాడు కథకుడు. ఎలాగంటే కథ చెప్పలేదని కూతురు ఇంట్లోంచి బయటికెళ్ళి పోవాలి, అలా వెళ్ళి పోవాలంటే కావాలని అతను కుక్కని ఎత్తుకెళ్ళి గుమ్మంలో వదిలిపెట్టి రావాలి- అన్నట్టు వుంది ఈ సీను క్రియేటివిటీ. ఇలా కాక-
అతను కథ చెప్తూ వుంటే, ఆమెకి అతను చేసిన ప్రామీస్ ప్రకారం కథ చెప్పించుకున్నట్టూ వుంటుంది, ఇంతలో కుక్క బయటికెళ్తే దానికోసం వేరే బయటికెళ్ళినట్టూ వుంటుంది. రెండూ వేర్వేరు విషయాలకి చెందిన సరైన చర్యలు. అప్పుడు అమ్మ కథ చెప్పడమనే బిగినింగ్ విభాగం సెటప్, పే ఆఫ్ అవుతునట్టూ వుంటుంది, అలాగే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టానికి ఫ్రెష్ లీడ్ పడినట్టూ వుంటుంది. ఆమె అలగడం, కుక్క కోసం బయటికెళ్ళడం రెండూ ఒకే కారణంగా జరగడం సాధ్యం కాదు. అతను కథ చెప్పకపోతే, ఆమె అలిగి బయటికి వెళ్ళిపోతే, కుక్క వుండకూడదు మధ్యలో.
నిజానికిది సీనస్ ఇంటరప్టస్ (దృశ్య భంగం) సీను కావాలి. ఎలాగంటే అమ్మ కథ చెప్పడమనే బిగినింగ్ విభాగం సెటప్ ఏదైతే వుందో అది, అతను కథ చెప్తూ వుండగా పే ఆఫ్ అవుతూ వుండి- ఇంతలో కుక్క బయటికెళ్ళడంతో కూతురి దృష్టి మళ్ళి- దాని వెంట పరిగెత్తడంతో- పూర్తిగా పేఆఫ్ అవకుండా సీనస్ ఇంటరప్టస్ అయి, బయట ఫ్రెష్ సీనుకి లీడ్ పడాలి. అతను కథే చెప్పకపోతే ఇది సీనస్ ఇంటరప్టస్ సీను కాదు. అర్ధం లేకుండా వుంటుంది.
అంటే పైన చెప్పినట్టు సీనస్ ఇంటరప్టస్ జరిగితే, ప్రకృతి కల్పించుకుని ఆమెకి ఇలా చెప్తున్నట్టు అర్ధం - ఈ నాన్న చెప్పే కథలో ఫిక్షనల్ అమ్మ కాదుగానీ, బయట నీ రియల్ మమ్మీని మీటవుదువు గానీ పదా- అని కుక్క రూపంలో ప్రకృతి లాక్కెళ్ళినట్టూ వుంటుంది. లాజిక్ లేకుండా డ్రామా పండదు, ఎమోషన్స్ కూడా పండవు. సీన్లు ఫ్లాట్ గా వుంటాయి.
9. ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం చూద్దాం :
ఇప్పుడు కుక్కని వెతుక్కుంటూ రోడ్డు
మీది కెళ్తుంది కూతురు మహిమ. ఒక చోట యష్ణ కారు కోసం నిలబడి వుంటుంది. ఆమెని చూసి
ఆమె దగ్గరికి పరుగెత్తుతుంది కుక్క. కుక్కని నిమిరి అటు ఆగిపోయిన మహిమని చూస్తుంది
యష్ణ. మహిమ చూసుకోకుండా ముందుకి రాబోతూంటే ఒక వాహనం ఢీకొట్ట బోతూ ఆగిపోతుంది. యష్ణ
పరుగెట్టుకొచ్చి కాపాడుతుంది. మరోవైపు ఇంటిదగ్గర మహిమ కనిపించడం లేదని తండ్రి
చెప్పడంతో ఆమెకోసం బయటికి వురుకుతాడు విరాజ్. అప్పటికి ఒంటరిగా వున్న మహిమని
తీసికెళ్ళి పోతుంది యష్ణ.
ఈ సీనులో యష్ణ మహిమ తల్లి అని తర్వాత
ఇంటర్వెల్లో రివీలవుతుంది. అయితే యష్ణ బ్యాక్ స్టోరీ ప్రకారం ఈ ప్లాట్ పాయింట్ వన్
ఘట్టం ఇలా వుండాలి : కుక్క యష్ణని చూసి ఆమె దగ్గరికి ఎందుకు పరుగెట్టింది? బ్యాక్ స్టోరీలో చిన్నప్పుడు యష్ణ దాన్ని పెంచింది కాబట్టి ఇప్పుడామెని గుర్తు పట్టి
దగ్గరికి పరుగెట్టింది. అప్పుడు యష్ణ దూరంగా వున్న మహిమని చూస్తే ఏం జరగాలి?
ఆమె ఒంట్లో కరెంటు ప్రవహించాలి. ఆమె
సిక్స్త్ సెన్స్ ఆమెని మహిమ వైపు అయస్కాంతంలా లాగాలి. ఎందుకంటే బ్యాక్ స్టోరీలో
మహిమ తన కన్న కూతురే. మెమరీ లాస్ వల్ల ఈ విషయం ఆమెకి తెలీదు. ఇంత ఐరనీ వుంది ఈ
సీనులో. అప్రయత్నంగా ఆమె మహిమ వైపు అడుగులెయ్యాలి. అంతేగానీ ఏదో వాహనం ఢీ
కొట్టబోతూంటే కాపాడడానికి మహిమవైపు పరుగెట్టడం కాదు. ఇక్కడ కూతుర్ని కలిసేందుకు
హార్ట్ టచింగ్ గా మాతృహృదయ స్పందన వుంటే, ఏదో వాహనంవచ్చేసి
మెకానికల్ గా కలపడం క్వాలిటీ కథనం కాదు. ఈ షాట్స్ తీయడానికి అయిన బడ్జెట్ వృధా.
కుక్క ఎలాగైతే తనవైపు
పరుగెట్టుకొచ్చిందో అలా తను మహిమవైపు వెళ్ళాలి. విధి ఆడుతున్న వింత నాటకం. కుక్క-
యష్ణ- మహిమల పరస్పర పునఃస్సమాగ సన్నివేశమిది. ఇంత అంతరార్ధం,
ప్రాధాన్యమూ వున్నాయీ సీనులో. అంతేగానీ ప్రొడక్షన్ మేనేజర్ తెప్పించుకుని ఠపీమని ముందుకు
తోసిన వాహనం వచ్చేసి తల్లీకూతుళ్ళు కలిసేలా చేయడం కాదు సిల్లీగా. వాహనం రెంటు, డ్రైవర్ బత్తాలు వేస్టు. పాత్రల బ్యాక్ స్టోరీస్ ని దృష్టిలో పెట్టుకుని
సీన్లు చేయకపోతే ఇలా పేలవంగానే వుంటాయి సీన్లు. కథ లోతుల్లోకి వెళ్ళకుండా పైపైన
రాసేసి పైపైన తీసేస్తే పిప్పి తప్ప రసం వుండదు. కథకుడు పాత్రలు వాటి కథని అవి
నడుపుకోవడానికి ఎందుకని వదిలెయ్యకుండా మాఫియా బాస్ లా పట్టుకు కూర్చోవాలి?
ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం మొత్తం
స్క్రీన్ ప్లేకి మూల స్తంభం వంటింది. ఈ స్తంభంలో వ్యూహాత్మకంగా ఏర్చి కూర్చిన గోల్
ఎలిమెంట్స్ తోనే ముందు కథ నడుస్తుంది. ఆ గోల్ ఎలిమెంట్స్- 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్.
ఈ కథలో ప్రధాన పాత్ర విరాజ్
అనుకుంటే, ప్లాట్ పాయింట్ ఘట్టంలో అతనుండాలి. కానీ ఇక్కడ
అనుబంధ పాత్రలున్నాయి, ఫర్వాలేదు. తమిళ హిట్ ‘మండేలా’ లో కమెడియన్ యోగిబాబు పోషించిన ప్రధాన పాత్ర
ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో వుండదు. ప్లాట్ పాయింట్ వన్ విలన్ల మధ్య ఘర్షణతో
వుంటుంది. తర్వాత వీళ్ళ కథలోకి యోగిబాబు జొరబడి మలుపు తిప్పేస్తాడు. కథని తను
చేజిక్కించుకుని ముందుకి నడిపిస్తాడు. ఇలా దాదాపు ఏ సినిమాలోనూ జరగలేదు. ఈ
రియలిస్టిక్ జానర్ లో ఇదొక ప్రయోగం. రూల్స్ తెలిసి వుంటే ఆ రూల్స్ ని బ్రేక్ చేసే
ఉపాయం తెలుస్తుంది. ఇదే జరిగిందిక్కడ.
విరాజ్ తో కూడా ఇదే సిట్యుయేషన్ ఏర్పడింది.
అతను మహిమని వెతుక్కుంటూ ఎక్కడో వున్నాడు. ఇక్కడ కుక్క- యష్ణ- మహిమ అనుబంధ
పాత్రలతో ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం జరిగిపోయింది. కాబట్టి విరాజ్ గోల్ ఎలిమెంట్స్
ఏమిటనేవి మిడిల్-1 కి బదలాయింపు జరిగాయి. అక్కడ చూద్దాం...
10. మిడిల్-1:
విషయం తెలుసుకుని విరాజ్
కాఫీ షాప్ కొచ్చాక, ఇక్కడ కూతురితో యష్ణ వుంటుంది. పరిచయాలయ్యాక యష్ణ ప్రోద్బలంతో కూతురికి అమ్మ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కథలో అమ్మగా యష్ణని వూహించుకుంటానంటుంది కూతురు. ఈ మిడిల్ 1 ని ఇక్కడ ఆపి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు కథకుడు.
ఈ
మిడిల్ 1 లో ఇంటర్వెల్ లోపు రెండు ఫ్లాష్ బ్యాకులున్నాయి. ఫ్లాష్ బ్యాకులెప్పుడూ
కథ కావు. నడుస్తున్న కథకి కావాల్సిన సమాచారాన్ని అందించే వనరులు మాత్రమే. అంటే
పూర్వం జరిగిన కథనం. అంటే బిగినింగ్ విభాగానికి చెందిన కథనం.
లీనియర్ నేరేషన్ ని నాన్ లీనియర్
చేస్తూ మధ్యలో వచ్చే ఒక ఫ్లాష్ బ్యాకైనా, ఒకటికి మించి మల్టీపుల్
ఫ్లాష్ బ్యాకులైనా స్క్రీన్ ప్లే మొదట్లో ప్రారంభించిన బిగినింగ్ విభాగపు ఖండికలే.
బిగినింగ్ విభాగాన్ని ముక్కలు చేసి అక్కడొకటీ ఇక్కడొకటీ విసిరేస్తూ పోతే పుట్టే
కలుపు మొక్కలే ఫ్లాష్ బ్యాకులు. కలుపు మొక్కలెందుకంటే ఇవి ముందు కెళ్తున్న కథకి
అడ్డు తగిలి ఆపేస్తాయి. కాకపోతే ఫ్లాష్ బ్యాక్స్ ని డ్రీంటైమ్ అనీ, నడుస్తున్న కథని ప్రెజెంట్ టైమ్
అనీ అంటాడు 5
C'S of Cinematography
అన్న
క్లాసిక్ పుస్తకంలో జోసెఫ్ మార్సెల్లీ.
ఇక ఏ స్క్రీన్ ప్లేలో నైనా బిగినింగ్
విభాగంలో కథ వుండదు. మిడిల్ 1 తో ప్రారంభమై, మిడిల్ 2 తో కొనసాగే కథకి ఉపోద్ఘాతం
(సెటప్) మాత్రమే బిగినింగ్ అంటే. కనుక ఏ కథలోనైనా వచ్చే ఫ్లాష్ బ్యాకులన్నీ అసలు
కథకి కావల్సిన సమాచారాన్ని అందించే వనరులు- ఉపోద్ఘాతాలు అయ్యాయి.
విరాజ్ ఇప్పుడు మిడిల్ 1 లో
అనుభవిస్తున్న కథకి ఉపోద్ఘాతమిస్తున్నాడు... ఇదంతా వర్షాతో తన ప్రేమా పెళ్ళీ కథ.
మహిమ ఇందులో అమ్మగా యష్ణని వూహించుకుంటానంది
కాబట్టి వర్షగా మృణాల్ ఠాకూరే కన్పిస్తోంది ఇక్కడ మనకి. ఇది చాలా తెలివైన
ఎత్తుగడతో కూడిన క్రియేటివిటీ. మహిమ అమ్మగా యష్ణని ఊహించుకుంటాననడమంటే కథలో యష్ణ
వేరు, ఫ్లాష్ బ్యాక్స్ లో వర్ష వేరనే అభిప్రాయాన్ని
కలిగిస్తున్నాడు కథకుడు లాజికల్ గా. కానీ వాస్తవం లో ఇద్దరూ ఒకటే నని ఫ్లాష్
బ్యాక్స్ తర్వాత తెలుస్తుంది. ఇది మంచి క్రియేషన్.
అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ 1 లో ప్రేమకథ
రెగ్యులర్ టెంప్లెట్ లోనే వుంటుంది. ఫ్రేమలో పడడానికి బలమైన,
వినూత్న కారణమేదీ కనిపెట్టలేదు కథకుడు. రూ. 65 కోట్ల సినిమాకి 3 కోట్ల సినిమా
ప్రేమే చూపించారు. చిన్న సినిమాలు ఏడాదికి 90 వస్తే, పెద్ద
సినిమాలు 10 వస్తాయి. 90 సార్లు చిన్న సినిమాల్లో చూసి చూసి వున్న ప్రేమల్నే మళ్ళీ
10 సార్లు పెద్ద సినిమాల్లో కూడా చూడాల్సి వస్తోంది. చిన్న సినిమాలతో పెద్ద
సినిమాలకి తేడా స్టార్లు, వాళ్ళ పెద్ద రెమ్యూనరేషన్లేనా? ఇందుకే పెద్ద సినిమాలా? మ్యాటర్ లో కాదని ఫిక్స్
అయ్యారా?
మ్యాటర్ ఏమిటంటే, విరాజ్ ఫోటోగ్రాఫర్, వర్ష సింగర్ అనేది రొటీన్
కాంబినేషనే. అసలే రొటీన్ కాంబినేషన్, ఈ
రొటీన్ కాంబినేషన్లో కెమిస్ట్రీ లేకపోవడం ఒకటి. మరీ టీనేజర్స్ లా ఎందుకు ప్రేమలో
పడ్డారో వాళ్ళకే తెలీదు, టెంప్లెట్- ఫార్ములా ప్రేమకి
పెద్దగా కారణం అవసరం లేదు కాబట్టి. వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధంగా పెనవేసిన
అంశం ఏమైవుంటుంది? ఫోటో గ్రాఫర్ గా అతను చూసే ప్రకృతి దృశ్యంలో
ఆమె తన పాట చూస్తోందా? ఆమె పాటలో అతను తన ఫోటోగ్రఫీ చూస్తున్నాడా? ఆమె లేకపోతే అతడి ఫోటోగ్రఫీ లేదు, అతను లేకపోతే ఆమె
పాట లేదు- అనే కవిత్వం, బలమైన బాండింగ్ ఏమైనా వుందా?మరి దేనికి కథకుపయోగపడని ఫోటోగ్రాఫర్, సింగర్
పాత్రలు?
సరే, ప్రేమలో
పడ్డారు. వర్ష చిన్నప్పట్నుంచీ పేరెంట్స్ కీచులాటలతో టార్చర్ అనుభవిస్తోంది. వర్ష
తల్లి విరాజ్ తో పెళ్ళికి అంతస్తులు చూపించి అభ్యంతర పెట్టింది. విరాజ్ ఆమెని
ఒప్పించాడు. పెళ్ళయిపోయింది. మూడేళ్ళు గడిచాక విరాజ్ పిల్లలు కావాలంటే, పిల్లలు వద్దంటే ఒప్పుకునే చేసుకున్నావు కదాని ఆమె అంది. విరాజ్ ఇలాగే
మాట తప్పుతాడు- అమ్మ కథ చెప్తానని కూతురికి ప్రామీస్ చేసి ఎగ్గొడతాడు, పిల్లలు వద్దన్న షరతుతో పెళ్ళి చేసుకుని భార్యకి అడ్డం తిరుగుతాడు. ఇలా
రాజకీయాల్లో ఎన్నికల హామీ లివ్వడానికి బాగా పనికొచ్చేలా వున్నాడు. కూతురితో, భార్యతో ‘విరాజ్ కా గ్యారెంటీ’ ఇలా వున్నాక, ఈ భార్య అసలు ప్రాబ్లం ఏమిటి?
తన పేరెంట్స్ వల్ల తను ఇలా అయినట్టు, తన వల్ల తన పిల్లలు సఫర్ కాకూడదన్న వాదన ఆమెది. అందుకని పిల్లలు వద్దంది. తను తన
పేరెంట్స్ లాగా తయారు కాకూడదని, అంతకంటే బాగా తన పిల్లల్ని ప్రేమగా పెంచి చూపించాలనీ అనుకోవడం
లేదు. తను పెళ్ళి చేసుకుంటే ఎక్కడ భర్తతో కీచులాడతానోనని భయం. ఈ ఊహాజనిత భయాలు
పెంచుకున్న ఆమెకి తగు కొన్సెలింగ్ చేసి పెళ్ళి చేసుకోకుండా,
పిల్లలు వద్దన్న ఆమె షరతుతో అలాగే చేసుకున్నాడు.
చేసుకున్నాక షరతు కాదన్నాడు.
అతను ఇలా మాట తప్పితే కూడా ఏమైంది? మూడేళ్ళూ అతడితో ఏ సమస్యలూ లేకుండా బాగానే కలిసి వుందిగా? పేరెంట్స్ లాగా కొట్లాటలు రాలేదుగా? ఇంకెంత
నమ్మకమేర్పడాలి రిలేషన్ షిప్ మీద? జీవితాంతం నమ్మదా? మరెందుకు పెళ్ళి చేసుకుంది? ఆ తల్లిగారు ఏం
చేస్తోంది? అల్లుడితో కూతురి ఆర్ధిక భద్రత గురించి అంతగా ఆలోచించిన
తను, ఆ కూతురు పిల్లల్ని కనకపోతే ఆందోళన చెందడం లేదా? కూతురు అల్లుడితో ఆర్ధిక భద్రత పొంది, బదులుగా అల్లుడికి
పిల్లల్ని నిరాకరించడం తప్పని తెలుసుకోవడం లేదా?
వర్ష పిల్లల గురించి ఆలోచిస్తోంది, కానీ పేరెంట్స్ వల్ల తనతో పాటే టార్చర్ అనుభవిస్తున్న తమ్ముడ్ని
కాపాడుకుంటూ వస్తున్న తను, పెళ్ళి చేసుకున్నాక తమ్ముడ్ని ఆ
పేరెంట్స్ టార్చర్ కే వదిలేసి వచ్చింది
వెంట తెచ్చుకోకుండా.
సరే, పిల్లల
విషయంలో మాటామాటా పెరిగి, బై చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ
కోపంతో పోతే పోయాడనుకుంటుంది. కానీ ఇద్దరి హృదయాల్లో దెయ్యాలు వదిలి ఎక్కడో
కొట్టుకున్నాయి. వెంటనే అతను వెనుదిరిగి వస్తూంటే,
అప్రయత్నంగా ఆమె కూడా ముందుకురుకుతుంది. అదే క్షణం ఇద్దరికీ కలిసి వుండాలనే
అన్పించింది. ఎలా? పిల్లలు లేకపోయినా
ఫర్వాలేదనుకుని వెనుదిరిగి వచ్చాడా? ఆమె పిల్లల్ని కందామనే
ముందుకురుకిందా? మనసులో ఏమనుకున్నారో ఆడియెన్స్ కి తెలియక్కర్లేదా?
ఈ చిక్కు ముడి విడదీయడం అంత సులభం
కాదు- పాత్ర చిత్రణల్ని దెబ్బ తీయకుండా. అసలు ఈ పిల్లల గురించిన సమస్యే కథకి అవసరం
లేదు. ఈ డ్రామాలో ఇద్దరూ అట్నుంచీ ఇట్నుంచీ టీనేజర్స్ లా పరుగెట్టుకొచ్చి
ఒకరికొకరు దొరికిపోయారనుకుందాం- పిల్లల సంగతి కాసేపు పక్కన బెట్టి. ఇంత బాండింగ్ ఇప్పుడెలా వచ్చింది? మొదట్లో ప్రేమకి కామన్ బాండింగ్ ఎలిమెంట్ ఏమీ లేదుగా? ఏం కోల్పోతారని ఇప్పుడు కలిసి వుండాలని కంగారుపడ్డారు? ఈ చిక్కు ముడి విడదీసినా కూడా పాత్రలు ఇక్కడికిక్కడే కిల్ అయిపోతాయి.
అందుకే ఈ డ్రామా - సీను అవసరమే లేదు
కథకి. చక్కగా పెళ్ళి చేసుకున్నారు, ఏంచక్కా కవిత్వమై కూతురు
పుట్టింది, అంతే. ఆ తర్వాత యాక్సిడెంట్
అయింది, భార్య మెమరీ కోల్పోయింది - అనే క్లీన్ లైనాఫ్
యాక్షన్ హీరో కిస్తే సరిపోతుంది బిల్లీ వైల్డర్ ఎప్పుడూ చెప్పే స్క్రీన్ ప్లే టిప్
ప్రకారం. పిల్లల గురించి గొడవ వల్ల విరాజ్ క్యారక్టర్ ఇంకెంత దెబ్బ తిందో ముందు
ముందు చూద్దాం.
ఇక ఒకటయ్యాక మహిమ పుడుతుంది.
పుట్టగానే సిస్టిక్ ఫైబ్రోసిస్ తో పుట్టిందని చెప్తాడు డాక్టర్. షాక్ అవుతారు. ఫ్లాష్
బ్యాక్ 1 ఇక్కడి వరకు చెప్పి ఆపుతాడు విరాజ్.
తిరిగి మిడిల్ 1 కథ కొస్తే, విషయం పూర్తి చేయాలని పట్టుబడతారు మహిమ, యష్ణ. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ 2లో- హాస్పిటల్లో
ఇంక్యుబేటర్లో వుంటుంది వ్యాధితో పుట్టిన కూతురు మహిమ. వర్ష విరాజ్ తో మాట్లాడడం
మానేస్తుంది. ఒక రకమైన వేదాంతంలోకి వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ లో ఈ మాటలప్పుడు
అదుపు తప్పి కారు యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్లో చేర్చిన వర్షకి మెమరీ లాస్
అని తెలుస్తుంది. దీనికి ఆమె తల్లి - వర్ష ఇక గతాన్ని మర్చిపోయిందనీ, కూతురు పుట్టింది కూడా తెలియదనీ, విడాకులివ్వడం
మంచిదనీ చెప్పేస్తుంది. దీని తర్వాత ఇంకేం
జరిగిందో చెప్పడు విరాజ్.
కానీ ఇక్కడ యష్ణ ఇలా అడగాలి
నిజానికి- నీ కూతురికి ఇలాటి ట్రాజడీ కథలు కాదు చందమామ కథలు చెప్పాలి. కథలో నాన్న షరతు
ఉల్లంఘించి డిమాండ్ చేయడం వల్లే కదా అమ్మ కంది- ఆ కన్న కూతురు నొసట వ్యాధితో
పుట్టింది? దీనికి బాధ్యుడు నాన్న కాదా?- అని.
ఇలా అడిగితే విరాజ్ మొహం ఎక్కడ
పెట్టుకుంటాడు కిల్ అయిన పాత్రగా? ఇందుకే కథలో పిల్లల
గురించి ముళ్ళ కంప కదప వద్దనేది. ఈ కథ తన గురించేనని వ్యాధితో వున్న మహిమా
పసిగట్టేస్తే- హాయ్ నాన్నా కాదు, ఫో నాన్నా- అని యష్ణ తో
వెళ్ళిపోవచ్చు, ఒరిజినల్ నాన్న కన్నా డూప్లికేట్ అమ్మే బెటరనుకుని.
ఒక సినిమా కథ ఒక కాన్ఫ్లిక్ట్ (ఇక్కడ కూతురికి వ్యాధి) గురించే వుంటుంది.
క్యాన్సర్ సినిమా కథ క్యాన్సర్ గురించే వుంటుంది. కౌంటర్ గా ఇంకో కాన్ఫ్లిక్ట్
(ఇక్కడ భార్యకి మెమరీ లాస్ ) సృష్టిస్తే కథ గందరగోళమై స్క్రీన్ ప్లే
ఫ్రాక్చరవుతుంది- లేదా పంక్చరవుతుంది. ఎవరో ఒక్కరికే ఆరోగ్య సమస్య వుండాలి.
11. ఇంటర్వెల్
ట్విస్టు -ట్రంప్ కార్డు :
ఫ్లాష్ బ్యాక్ 2 అక్కడితో ఆపాక ఇంటికొచ్చి లాప్ టాప్ లో చూసుకుంటాడు. యష్ణ ఫోటో వుంటుంది. ఇదెలా సాధ్యం, యష్ణ అతడికి ఇంతకి ముందు తెలీదు. ఈ ఫోటోలో వున్నది వర్ష అయుంటుందని ఒక అద్భుతమైన ట్విస్టు ఇక్కడ ప్లే అవుతుంది. అంటే విరాజ్ చెప్తున్న కథలో తల్లి పాత్రని యష్ణ లాగా ఊహించుకుంటానంది మహిమ - కానీ ఈ యష్ణే తన కన్న తల్లి వర్ష అని ఆమెకి తెలీదు. అంటే యష్ణ లాగా విరాజ్ తో కథ చెప్పించుకుంది మెమరీ లాస్ అయిన వర్షే నన్న మాట!
ఫ్లాష్ బ్యాక్ 2 అక్కడితో ఆపాక ఇంటికొచ్చి లాప్ టాప్ లో చూసుకుంటాడు. యష్ణ ఫోటో వుంటుంది. ఇదెలా సాధ్యం, యష్ణ అతడికి ఇంతకి ముందు తెలీదు. ఈ ఫోటోలో వున్నది వర్ష అయుంటుందని ఒక అద్భుతమైన ట్విస్టు ఇక్కడ ప్లే అవుతుంది. అంటే విరాజ్ చెప్తున్న కథలో తల్లి పాత్రని యష్ణ లాగా ఊహించుకుంటానంది మహిమ - కానీ ఈ యష్ణే తన కన్న తల్లి వర్ష అని ఆమెకి తెలీదు. అంటే యష్ణ లాగా విరాజ్ తో కథ చెప్పించుకుంది మెమరీ లాస్ అయిన వర్షే నన్న మాట!
ది బెస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్. అయితే ఇది తొందరపడి విప్పేసిన సస్పెన్స్. దీంతో సెకండాఫ్ కి కథ లేకుండా పోయింది. మెమరీ లాస్ పాత్రగా యష్ణ - విరాజ్ ఎలా ఇప్పుడు ఒకటవుతారన్న అరిగిపోయిన పాత కథే తప్ప, సెకండాఫ్ లో ఏమీ లేకపోవడానికి దారితీసిందీ ఇంటర్వెల్ ట్విస్టు. ముందు కథ మొత్తాన్నీ ఇంటర్వెల్ ముందు రెండు ఫ్లాష్ బ్యాకుల్లో కుక్కడం వల్ల సెకండాఫ్ కి సెకండాఫ్ సిండ్రోమ్ అనే రుగ్మత పట్టేసింది. తల్లీ కూతుళ్ళకి రెండు రుగ్మతలతో బాటు.
కేవలం క్రియేటివిటీతో సినిమా రైటింగ్ చేయలేరు. అసలు రైటింగ్ పనికిరాదు. క్రియేటివిటీకి స్ట్రక్చర్ తోడై స్టోరీ మేకింగ్ చేస్తే సినిమా కథ! స్క్రిప్టు రచనలో కొత్త డెవలప్ మెంట్స్ తెలుసుకోవాలి.
12. గోల్స్ ఎలిమెంట్స్ మిస్ : పాసివ్ పాత్ర విరాజ్ కి ఒక గోలే లేకపోవడంతో పైన చెప్పుకున్న 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అనే కథని పరిపుష్టం చేసే గోల్ ఎలిమెంట్స్ లేకుండా పోయాయి.
ఈ కథకి స్ట్రక్చరల్ రిపేరు ఫ్లాష్
బ్యాక్ 1 లో జరగాలి. కూతురు మహిమని ఆరోగ్యంగానే పుట్టనిచ్చి ఫ్లాష్ బ్యాక్1 ని ఆపేయాలి. ఇక
ఫ్లాష్ బ్యాక్ 2 చెప్పకూడదు. యాక్సిడెంట్, వర్షాకి మెమరీ
లాస్ ఇవేవీ చెప్పకూడదు. ఫ్లాష్ బ్యాక్ 2 ని పూర్తిగా ఎత్తేయాలి. ఫ్లాష్ బ్యాక్ 2
లో వున్న విషయాన్ని దాచి పెట్టి సెకండాఫ్ కి వాడుకోవాలి. అప్పుడే సెకండాఫ్
సిండ్రోమ్ లో పడకుండా సెకండాఫ్ అంటే, మిడిల్ 2 కథ వుంటుంది. ఇంటర్వెల్
దగ్గర ఆపేసిన ఫ్లాష్ బ్యాక్ 2 ని తర్వాత కథ ముగింపులో తురుపు
ముక్క (ట్రంప్ కార్డు) గా వాడుకుని సర్ప్రైజ్ చేయడానికి అట్టి పెట్టుకోవాలి.
అంటే అప్పటివరకూ అసలేం జరిగిందో చెప్పకుండా మెమరీ లాస్ అన్న విషయాన్ని దాచిపెట్టాలి. దీని వల్ల సెకండాఫ్ లో మెమరీ లాస్ అనే భారమైన అరిగిపోయిన పాత కథే నడిపే ప్రమాదం తప్పుతుంది.
ఫ్లాష్ బ్యాక్ 1 తో కథ చెప్పడం ఆపేసి- యష్ణని విరాజ్ ఫాలో అవుతూ- ఆమెని వర్షా అని పిలిస్తే, వర్షా ఎవరు అని ఆమె అంటే- నువ్వే కదా వర్షా అని అతనంటే- షటప్, నేను వర్షా ఏమిటి, నీ కూతురికి కథ చెప్పి చప్పి బ్రెయిన్ డ్రెయిన్ అయిందా, భేజా ఖాళీ అయిందా, చెక్ చేయించుకో ఫో - అనేసి ఆమె వెళ్ళిపోతే- ఇక్కడ ఇంటర్వెల్ కి డ్రమెటిక్ క్వశ్చన్- విరాజ్ యష్ణని వర్షగా ఎందుకు పిలిచాడు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాగా. ఇలా సెకండాఫ్ కి కుతూహలం రేపే లీడ్ ఏర్పాటవుతుంది.
సినిమాలో ఈ విధంగా లేదు. యష్ణా వర్షా ఒకరేనని ఇప్పుడే చెప్పేస్తే సెకండాఫ్ కి లీడ్ లేకుండా పోయింది. సినిమా కథకి డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటు చేసేది ఇంటర్వెల్. డ్రమెటిక్ క్వశ్చన్ లోంచి పుట్టే లీడ్ అనేది కథ తెగిపోకుండా, ఫస్టాఫ్ - సెకండాఫ్ లని కలిపి వుంచి కుతూహలం కల్గిస్తుంది. అప్పుడు స్క్రీన్ ప్లే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడడం గానీ, ఫ్రాక్చర్ అవడం గానీ జరగదు. ఈ సినిమాలో రెండూ జరిగాయి.
13. మిడిల్ 2 బాక్సాఫీసు ప్లే :
ఇంటర్వెల్ తర్వాత
సెకండాఫ్ లో ప్రారంభమయ్యే మిడిల్ 2 పైన చెప్పినట్టు- చూసి చూసి వున్న క్యాన్సర్ కథ
లాగా, రిలేషన్ షిప్ లో మెమరీ లాస్ పాత కథగా తెరకెక్కింది. థ్రిల్లర్స్ వేరు- థ్రిల్లర్స్ లో మెమరీ లాస్ ఎన్నిసార్లు తీసినా రకరకాలుగా థ్రిల్ చేస్తాయి. రిలేషన్ షిప్ లో పదే పదే ఒకే డ్రామాతో బోరు కొట్టేస్తాయి.
అసలు మిడిల్లో జరగాల్సిన బిజినెస్ ఏమిటి? ఫస్టాఫ్
బిగినింగ్ ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ తో పాత్రకి పుట్టిన సమస్యతో సంఘర్షణ అనేది
మిడిల్లో జరిగే బిజినెస్. ఫస్టాఫ్ మిడిల్ 1, సెకండాఫ్ మిడిల్
2 రెండూ కూడా క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ని అంతకంతకూ పెంచుతూ
సఘర్షణని కొనసాగిస్తాయి. ఈ కథలో ఇది
కనిపిస్తోందా? ఫస్టాఫ్ మిడిల్ 1 లో ఫ్లాష్ బ్యాకులు అడ్డు
పడ్డాయి. ఇప్పుడు సెకండాఫ్ మిడిల్ 2 లో సంఘర్షణకి తావులేకుండా, విషయం ఏమిటో తెలియని మెమరీలాస్ పాత్రగా యష్ణ యాక్షన్- రియాక్షన్ ఇంటర్
ప్లేకి దూరమైంది. మిడిల్ సంఘర్షణ యాక్షన్- రియాక్షన్ ఇంటర్ ప్లేనే ఆధారపడి జరుగుతుంది.
అంటే సమస్యని సాధించడానికి ప్రధాన
పాత్ర ఒక యాక్షన్ కి పాల్పడితే, దీనికి అడ్డుపడి ప్రత్యర్ధి
పాత్ర రియాక్షనిస్తుంది. ఈ రియాక్షన్ మీద ప్రధాన పాత్ర ఇంకో యాక్షన్ తీసుకుంటే, దాన్ని కూడా విఫలం చేస్తూ ప్రత్యర్ధి పాత్ర ఇంకో రియాక్షనిస్తుంది. ఈ
సైకిల్ రిపీట్ అవుతూ వుంటుంది అంతకంతకూ టెన్షన్ ని పెంచుతూ,
అప్పుడు మిడిల్ 2 చివర ప్లాట్ పాయింట్ 2 దగ్గర ఈ సంఘర్షణకి ఒక పరిష్కారమార్గం
దొరుకుతుంది ప్రధాన పాత్రకి. దీంతో మిడిల్ విభాగం పూర్తయి,
ఎండ్ విభాగం కథ ముగింపు దిశగా వెళ్తుంది.
ఈ బిజినెస్ ఈ కథ సెకండాఫ్ లో కనిపిస్తోందా? విరాజ్- యష్ణలు ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రలుగా
వున్నారా? విరాజ్ కథా ప్రారంభం నుంచీ పాసివ్ పాత్రగానే
వున్నాడు. ఎక్కడా దేని మీదా యాక్షన్ తీసుకోవడం లేదు. ఇక మెమరీ లాస్ వల్ల యష్ణకి ఈ
బిజినెస్సేమిటో కథేమిటో తెలియడమే లేదు. ఇదికూడా పాసివ్ పాత్రే. పాసివ్ పాసివ్
రాసుకుంటే స్పార్క్ పుడుతుందా- దాచి పెట్టుకున్న బూడిద రాలుతుందా? ఇంటర్ ప్లేకి ఈ పాత్రల దగ్గర బూడిద తప్ప ఏమీ లేదని తెలిసిపోతోంది.
పాత్రలు నడుపుకోవాల్సిన కథని కథకుడు
నడిపితే ఇలాగే జరుగుతుంది. పాత్రలైతే కథ నడుపుకోకుండా ఆటోపైలట్ లో పెట్టేసినా కథ
నడుస్తూనే వుంటుంది. కనుక ఈ కథలో మిడిల్ బిజినే లుప్తమవడం వల్ల కథ ఎలా పడితే అలా
సాగింది జోక్యం చేసుకునే ఇతర పాత్రలతో. యష్ణ పెళ్ళికొడుకు పాత్ర, తల్లిపాత్ర, తండ్రి పాత్ర,
ఇంకో యంగ్ డాక్టర్ పాత్రా ఇలాటివే. ఇందులో మళ్ళీ కథకి అదనపు విలువ చేకూర్చని
ట్విస్టులు. ఫ్లాష్ బ్యాక్ 1 లో చూపించిన వర్ష తమ్ముడు తమ్ముడు కాదనీ, చెల్లెలనీ ఇప్పుడు చూపిస్తూ ట్విస్టు. అలాగే విరాజ్ తో వుంటున్న తండ్రి
విరాజ్ తండ్రి కాదనీ యష్ణ/వర్ష తండ్రి అనీ ఇంకో ట్విస్టు. వీటివల్ల కథకేం
ఒనగూడినట్టు?
ఇలా మిడిల్ 2 ని నెట్టుకొస్తూ, ప్లాట్ పాయింట్ 2 కొస్తే, వ్యాధి తిరగబెట్టిన మహిమకి
ఆపరేషన్ ఏర్పాట్లు. సమస్యకి పరిష్కార మార్గంగా మహిమా యష్ణల మధ్య ఒక అండర్
స్టాండింగ్. దీనికి యష్ణ నీ మదరేనని యష్ణ మదర్ మహిమకి చెప్పేస్తుంది. మెమరీ లాస్
తోనే వున్న యష్ణ, నన్ను మదర్ గా స్వీకరిస్తావాని అడిగితే తలూపుతుంది మహిమ.
విరాజ్ టో సంబంధం లేకుండా ఇలా సుఖాంతం.
మహిమకి వ్యాధే ఈ కథకి అక్కర్లేదంటే, చికిత్స లేని వ్యాధికి ఆపరేషన్ ఏర్పాట్లు కూడా. యష్ణే నీ మదరని యష్ణ మదర్
చెప్పేవరకూ మహిమకి తెలియకపోవడం. విరాజ్ ఎవరెవరి గురించి ఫ్లాష్ బ్యాకులు చెప్పాడో
అప్పుడే మహిమ పసిగట్టేసి వుండదా? నన్ను మదర్ గా
స్వీకరిస్తావా అని, మహిమే తన కూతురని తెలీని మెమరీ లాస్ యష్ణ
అడగడం. కథకుడు కుట్ర చేయకుండా, మీయిద్దరి డీఎన్ఏ టెస్టులు
ఎప్పుడో సెకండాఫ్ ప్రారంభంలోనే చేయించి వుంటే- నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లే ఈ మహిమా
అని నీకు అప్పుడే తెలిసిపోయేది యష్ణమ్మా!! ఈ ఉష్ణం దేనికి?
చెప్పడానికి మనమెవరం. సినిమా అలా
కాదు ఇలా వుండాలని జడ్జ్ మెంటు ఎలా ఇవ్వగలం? మనకి తెలిసిన
లోపాలు ఇతరులకి మురిపాలుగా వుండొచ్చు. క్రియేటివిటీకి కొలబద్ద లేదు. క్రియేటివ్
పరికల్పనలు కాకుండా స్ట్రక్చర్ ప్రమాణాలతో చూసినప్పుడు తెలిసే లోపాలకి విశ్వసనీయత
వుంటుంది. యాక్టివ్- పాసివ్ క్యారక్టర్ తేడాలు క్రియేటివ్ కొలబద్దకి తెలియవు. ఎవరు
చూసే క్రియేటివ్ కోణంలో వారికి కనిపిస్తాయి తలా ఓ రకంగా. క్యారక్టర్ ఆర్క్, డ్రమెటిక్ క్వశ్చన్, గోల్ ఎలిమెంట్స్, యాక్ట్స్ బిజినెస్, సెకండాఫ్ సిండ్రోమ్, డైనమిక్స్, మార్కెట్
యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ మొదలైన పదుల సంఖ్యలో పని ముట్లు క్రియేటివ్
స్కూలు పరికరాలు కావు. మనసుకి ఎలా మంచి అనిపిస్తే ఆలా చేసుకు పోవడమే క్రియేటివ్
స్కూల్. కనుక మనస్సుని నమ్మే క్రియేటివ్ స్కూల్ స్ట్రక్చర్ స్కూల్ ని ఒప్పుకోదు. రెండు
దశాబ్దాలుగా ఇదే గొడవ.
స్ట్రక్చర్ స్కూల్ ముందు స్ట్రక్చర్
పరంగా కథ ఆలోచించి, దాని మీద క్రియేటివ్ పరికల్పన చేస్తుంది.
క్రియేటివ్ పరికల్పనలు లేకుండా స్ట్రక్చర్ స్కూలు వుండదు- కానీ స్ట్రక్చర్ తో
పనిలేకుండా క్రియేటివ్ స్కూలు యమ జోరుగా నడుస్తోంది. వివిధ ఆఫీసుల్లో జోరు
చూస్తూంటే చాలా సంతోషమేస్తోంది! ఇది కదా అసలైన కాయకష్టం,
కసరత్తు! ట్రైనర్ అవసరం లేని బాడీ బిల్డింగ్, కుస్తీ పట్లు!
అయితే ఈ స్క్రీన్ ప్లే సంగతులు రాసే
క్రమంలో చాలా లోపాలూ వాటికి పరిష్కారాలూ చెప్పేసుకుంటూ పోయాం చాపల్యం కొద్దీ- లేకపోతే
స్క్రీన్ ప్లే సంగతులు కుదరవు- ఈ సినిమాకి అసలేం జరగాలీ చెప్పక తప్పని ట్రాప్ లో
పడిపోయాం. ఇక రెండు ముక్కల్లో అదేదో పూర్తి చేయక తప్పదు.
అసలు విషయమేమిటంటే ఈ సినిమా కథ కథ
కాదు, గాథ (కథకి, గాథకి తేడాల గురించి
ఈ బ్లాగులో చాలా సార్లు చెప్పుకున్నాం). గాథ కాబట్టే పాసివ్ క్యారక్టర్లున్నాయి.
ప్రధాన క్యారక్టర్ కి గోల్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు, డ్రమెటిక్ క్వశ్చన్ లేదు, యాక్ట్స్ (బిగినింగ్, మిడిల్, ఎండ్) లో మిడిల్ కి మిడిల్ బిజినెస్ లేదు, డైనమిక్స్ లేవు- ఇంకా భవన నిర్మాణానికి అవసరమైన చాలా చాలా ఇటుకలు లేవు.
గాథ అనేది కథకుడో, ఇతర పాత్రలో, విధి
లీలలో నడిపిస్తే నడిచే కథనం. గాథతో కమర్షియల్ సినిమాలు తెలిసి తీయరు. కథతోనే
తీస్తారు.
ఇప్పుడీ కథ ఇంటర్వెల్లో - యష్ణని
వర్షా అంటాడేమిటి, యష్ణ బ్రెయిన్ చెక్ చేయించుకో అంటోందేమిటి-
ఇంతకీ ఈమె యష్ణా, వర్షా? ఎవరు? - అనే థ్రిల్లింగ్
డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటయ్యాక- దీని ఆధారంగా సెకండాఫ్ నడుస్తుంది.
ఏమీ చేయక్కర్లేదు- డ్రమెటిక్
క్వశ్చన్ లొంచే ప్రధాన పాత్ర విరాజ్ కథ పుట్టించుకుంటూ పోతాడు- తనమీద తనకే
ఆడియెన్స్ కి సందేహం క్రియేట్ చేసుకుంటాడు. ఆమెని వర్షాగా ప్రూవ్ చేయడానికి
వెంటపడుతోంటే, ఆమె తిప్పికొడుతూ బ్రెయిన్ చెక్ చేసుకో మంటే-
నిజంగానే అమ్మ కథ చెప్పీ చెప్పీ విరాజ్ బ్రెయిన్ పాడయ్యిందా అన్న ప్రశ్నతో కథనం-
ఇద్దరి మధ్యా యాక్షన్ -రియాక్షన్ ఇంట్లర్ ప్లేలోకి వచ్చేస్తుంది.
సైకలాజికల్ పరిభాషలో చెప్పుకుంటే
ఆమె సబ్ కాన్షస్ వరల్డ్ అయితే, అతను ఆ సబ్ కాన్షస్ వరల్డ్ ని
మధించే కాన్షస్ మైండ్ అవుతాడు. తెలియకుండానే ఆడియెన్స్ అంతరంగంతో కనెక్ట్
అయిపోతుంది కథ. స్క్రీన్ ప్లే అంటేనే మన అంతరంగంలో నిత్యం మనం పడే కాన్షస్ -సబ్
కాన్షస్ మైండ్ ల సంఘర్షణే. ప్రపంచ పురాణాలన్నిట్లో ఈ మానసిక శాస్త్రమే, సైకో థెరఫీయే.
అప్పుడు దాచిపెట్టిన ఫ్లాష్ బ్యాక్
2 ని తీసుకొచ్చి ప్లాట్ పాయింట్ 2 లో ఇప్పుడు సస్పెన్స్ విప్పొచ్చు. విప్పినప్పుడు, వార్నీ ఇది విరాజ్ బ్రెయిన్ దొబ్బిన కథ కాదా? వర్షా మెమరీ లాస్ కథా?- ఒర్నీయబ్బ భలే వున్నాడే ఈ కథకుడూ అని
నిలువు దోపిడీ ఇచ్చేయొచ్చు ప్రేక్షకులు. మెమరీ లాస్ పాత చింతకాయ బోరు కథ సెకండాఫ్
అంతా నడపకుండా, మెమరీ లాస్ ని దాచి పెట్టి ముగింపులో ఓపెన్
చేసి, వెంటనే పరిష్కారం అందించేస్తే మాస్టర్ స్ట్రోక్ లా వుండొచ్చు.
ఇదంతా కాదు,
ఇవన్నీ పక్కనబెట్టి -సినిమా హిట్టయింది కాబట్టి ఇలాగే స్క్రిప్టులు చేసుకుని
తీసుకుంటామంటే- నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. క్రియేటివ్ స్కూలుకి రూల్సు అవసరం లేదు.
—సికిందర్