రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

520 : స్పెషల్ ఆర్టికల్






     మెయిన్ స్ట్రీమ్  కమర్షియల్ స్టార్ మూవీస్ కి కథ రాయడమే మీ ధ్యేయమైతే, హై కాన్సెప్ట్ ప్రక్రియలో కథల్ని ఆలోచించండి.  ఇతర ప్రక్రియలు  అంతగా వర్కౌట్ కావు. ఏ స్టార్లు నటించినా నటించకపోయినా, ఏ స్టార్ డైరెక్టర్లు దర్శకత్వం వహించినా వహించకున్నా, రివ్యూలు ఎలా రాసినా రాయకున్నా, సోర్స్ మెటీరియల్ ఎక్కడిదో తెలిసిపోతున్నా,  మౌత్ టాక్ ఎలా వున్నా  - వీటితో సంబంధం లేకుండా  ప్రేక్షకుల్ని ఆకర్షించే హై కాన్సెప్ట్ కథల్ని ఎంచుకోండి. మౌలికంగా హైకాన్సెప్ట్ కథలు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ, రోమాంటిక్ కామెడీ, హార్రర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ మొదలైన జానర్లకి చెందినవై వుంటాయి. ఏకవాక్యంలో కథ తెలిసిపోయేట్టు వుంటాయి. కథలో స్టార్ ధరించే పాత్రకి అత్యంత డోలాయనమాన స్థితిని, గడ్డు పరిస్థితిని  సృష్టిస్తాయి. ఇది వరకే  వచ్చేసిన సినిమాల్లోని కొన్ని ఎలిమెంట్స్ తో బాటు, ఇదివరకెన్నడూ చూడని విశిష్టతలు గల  ఎలిమెంట్స్ ని కూడా కలిగి వుంటాయి. ఇవి పక్కా కమర్షియల్ మూవీస్ గా తయారవుతాయి. వీటిలో కళాత్మకత, సృజనాత్మఅంటూ కూర్చోకండి.  వీటికి అటువంటి విజయాలుండవు. మీరు కళ కోసమే తపిస్తూ, విశాలప్రాతిపదికన మాస్ మీడియా మార్కెట్ తో సరిపోలే  వ్యాపార కోణాన్ని నిర్లక్ష్యం చేస్తే, మీ కథ ఎన్నటికీ తెరకెక్కే అవకాశముండదు. ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి - హై కాన్సెప్ట్ కొస్తే మీరు ప్రేక్షకులకి కథని అమ్మరు, స్టార్ నే అమ్ముతారు. అడ్వర్టైజ్ మెంట్ రంగంలో స్టార్ ఉత్పత్తిని అమ్ముతాడు, కానీ సినిమా రంగాని కొచ్చేసరికి  సినిమా అనే ఉత్పత్తి స్టార్ ని అమ్ముతుంది! 

          హై కాన్సెప్ట్ కథలు కొత్త కొత్త పాయింట్లతో వుంటాయి. ఐడియాయే కింగ్. గుర్తుండి పోయే టైటిల్స్ , ఆ టైటిల్స్ తో కథదేని గురించో తెలిసిపోయేట్టు వుంటాయి. విజువల్ లాగ్ లైన్స్  వుంటాయి. అంటే ఒక లైన్లో పాయింటు చెప్తేస్తే  కథ కళ్ళకి కడుతుంది. పైగా యూనివర్సల్ అప్పీల్ ని కలిగి వుంటాయి.  సింపుల్ గా వుండే సింగిల్ యాక్షన్ లైన్, బలమైన ఒక సమస్య, దాంతో దేనికైనా తెగించే సాహసం, ఒక ట్విస్టు...ఇంతే హై కాన్సెప్ట్ కథల స్వరూపం.  
          ఇవి పాత్ర చిత్రణలకంటే వేగంగా సాగే కథనాలపై దృష్టి పెడతాయి. దీంతో విజువల్ యాక్షన్ పెరిగి ఉత్కంఠ రేపుతాయి. ఇలా కాకుండా లో - కాన్సెప్ట్ కథలైన ఇతర డ్రామాలు, కామెడీలు క్యారెక్టర్ ఆధారిత కథనాలతో వుండడం వల్ల- విజువల్ యాక్షన్ కంటే ఫీలింగ్స్, సెంటిమెంట్స్, పాత్రచిత్రణలతో కూడిన కంటెంట్ తో బరువెక్కి వుంటాయి.
నిర్మాణం 
       హై కాన్సెప్ట్ కథల నిర్మాణం ఇలా వుంటుంది : కేవలం రెండు  పిల్లర్స్ మీద కట్టిన బ్రిడ్జి లాగా. మహాసముద్ర తీరంలో ఒక బలమైన పిల్లర్ (ప్లాట్ పాయింట్ వన్) ఏర్పాటు చేసి,  సుదూరంగా నడిసముద్రంలో మరో  పిల్లర్ (ప్లాట్ పాయింట్ టూ) వేసి, మొదటి పిల్లర్ దగ్గర్నుంచి రెండో పిల్లర్ కి కథని చేరవేస్తూ వుంటాయి. ఈ రెండు పిల్లర్ల మధ్య వారధిగా కథనం వుంటుంది.  ఇంతేనా విషయం? ఇంత సింపుల్ గానా? ఔను, షేక్స్ పియర్ ఇలాగే చేశాడు, మిల్టన్ ఇలాగే  చేశాడు, డాంటే ఇలాగే చేశాడు, యురెపిడిస్ ఇలాగే చేశాడు, సఫక్లిస్ ఇలాగే చేశాడు, ఈస్కలస్ కూడా ఇలాగే చేశాడు. మహాకావ్యాలు ఇలాగే  వున్నాయి. ఇందుకే ఇంతకాలం నిలబడ్డాయి. ఇందులో చౌకబారుగా, నేలబారుగా, ఫార్ములాగా ఏమీ లేదు – కథంటూ థ్రిల్ చేస్తూ ఒక నియమిత వేగంతో క్లయిమాక్స్  కేసి పరుగులు దీస్తున్నాక.   ఇక్కడ తెలియాల్సిన కిటుకేమిటంటే, మీ కథలో వుండే విషయం ఏదైతే ‘సంగతి’ చెబుతూ వుంటుందో, అది ప్రకటితమయ్యే విధంగా హై కాన్సెప్ట్ ఎలిమెంట్స్ ని వాడుకోగలగడమే.
అప్పుడొక ‘గాడ్ ఫాదర్’  అవుతుంది, ఒక ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’ అవు
తుంది, ఒక ‘టైటానిక్’ కూడా అవుతుంది... మీ ఇష్టం! 
       హై కాన్సెప్ట్ కి ఇంకా ఈ ఎలిమెంట్స్ వుంటాయి :  హై లెవెల్లో  వినోదాత్మక విలువలు, అంతే హై లెవెల్లో ఒరిజినాలిటీ, వైభవోపేత దృశ్యాలు, స్పష్టమైన ఎమోషనల్ ఫోకస్, ఇప్పుడేం జరుగుతుంది? అన్న ఉత్కంఠ మొదలైనవి.  హై లెవెల్లో  వినోదాత్మక విలువల విషయానికొస్తే, దీన్ని నిర్వచించడం కష్టమే. ఇది పోర్నోగ్రఫీని నిర్వచించడం లాంటిది. చూసే కంటిని బట్టి వుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, మీ దృష్టినాకర్షించి చప్పున ఓ ఊహాలోకాల్లోకి మిమ్మల్ని బదిలీ చేసేదేవైనా,  హై లెవెల్లో  వున్న వినోదాత్మక విలువలవుతాయి. ఇలాకాక, మిమ్మల్ని లాజికల్ గా ఆకర్షిస్తే, మీకు కుతూహలమూ ఆసక్తీ కల్గిస్తే, వినోదం కల్గించే అవకాశం లేదు.

          హై లెవెల్ ఒరిజినాలిటీ గురించి చెప్పుకుంటే, ఒరిజినాలిటీ అంటే ఏమిటో అర్ధం జేసుకోవాలి. ఒరిజినాలిటీ అంటే ఫ్రెష్ గా, కొత్తగా, నూతన కల్పన చేసినదిగా, నోవెల్ గా వుండే ఐడియా. ఉన్న ఒక ఐడియాని భిన్నమైన అప్రోచ్ తో చూస్తే  హై లెవెల్ ఒరిజినాలిటీ అన్పించుకుంటుంది.  ఒక ఐడియా తెలిసిన సెట్టింగ్ తోనే వుండొచ్చు.  దాన్ని కొత్త అప్రోచ్ తో మార్చివేయగలిగితే  హై కాన్సెప్ట్ ఐడియాగా మారిపోతుంది. ‘ఫ్రాంకెన్ స్టీన్’  తెలిసిన కథ- దుష్టశక్తి మనుషుల పని బట్టడం. దీని కొత్త అప్రోచ్ వచ్చేసి, మనుషులే ఆ దుష్ట శక్తి పనిబట్టడం. ‘డాగ్ డే ఆఫ్టర్ నూన్’ తెలిసిన ఐడియా - డబ్బు కోసం బ్యాంకుని దోచుకోవడం.
కొత్త అప్రోచ్ : ప్రేమించిన ‘మగరాయుణ్ణి’ లింగమార్పిడి చేయించడం కోసం బ్యాంకు దోచుకోవడం. ‘లార్డ్ ఆఫ్ ది ఫైల్స్’  తెలిసిన కథ :  దీవిలో చిక్కుకున్న ఓడ ప్రమాద బాధితుల్ని కాపాడడం. కొత్త అప్రోచ్ : దీవిలో చిక్కుకున్నది స్కూలు పిల్లలైతే, వాళ్ళు నాగరికత వదిలేసి మృగ లక్షణాలతో చెలరేగడం. కనుక  ఒరిజినాలిటీ అనేది కొత్తగా సృష్టించడం కాకపోయినా, ఉన్నదానికి నూతన కల్పన చేయడంలో కూడా వుంటుంది.  కాబట్టి హై కాన్సెప్ట్ ఐడియాల్ని అప్రోచ్ - సెంట్రిక్ గా చూడాలి. 

          విజువల్ వైభవం గురించి చెప్పుకోవాలంటే,  హై కాన్సెప్ట్ ఐడియాలే  విజువల్ వైభవం ఉట్టి పడుతూ వుంటాయి. విన్నా చదివినా కళ్ళముందు ఆ దృశ్య వైభవాలని  ఆటోమేటిగ్గా మెదడు పిక్చరైజ్ చేసేస్తుంది. కాబట్టి ఐడియాలోనే దృశ్య వైభవమంతా  ఇమిడి వుంటుంది. వుండేట్టు చూసుకోవాలి.  ఎమోషనల్ ఫోకస్ కొస్తే, హై కాన్సెప్ట్ ఐడియా వినగానే విజువల్ వైభవాన్ని  మెదడు ఎలా జనరేట్ చేస్తుందో, ఎమోషన్స్ ని  కూడా అలా ప్రసారం చేసేస్తుంది. ఏ ఎమోషన్ పడితే ఆ ఎమోషన్ కాదు. భయం, సంతోషం, హాస్యం, ప్రేమ, ద్వేషం, క్రోధం – ఈ భావోద్వేగాలు మాత్రమే ఉత్పన్నయ్యేట్టు ఐడియా వుండాలి. ఈ మౌలిక భావోద్వేగాలు త్వరగా, బలంగా, గాఢంగా ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. ఇక పోతే, మాస్ ఆడియెన్స్  అప్పీల్ గురించి : హై కాన్సెప్ట్ స్టార్ సినిమాల మాస్ అప్పీల్ పరిధికి అంతు వుండదు. దీనికోసం ఫ్యామిలీ ఆడియెన్స్ ని, ఉత్తమాభిరుచులుగల ప్రేక్షకులనీ  కూడా దాటుకుని మాస్ ప్రేక్షకుల్ని కలుపుకోవడం కోసం ఏమైనా చేస్తాయి, ఎలాగైనా సాగిపోతాయి.

          ఇక ఇప్పుడేం జరుగుతుందన్న ఆదుర్దా పుట్టించే ఎలిమెంట్ : డైనోసారస్ లని క్లోనింగ్ చేస్తే ఏం జరుగుతుంది? (జురాసిక్ పార్క్), ఆడవాళ్ళు కనడం ఆపేస్తే ఏం జరుగుతుంది? (చిల్డ్రెన్  ఆఫ్ మెన్), మార్షియన్స్ భూమ్మీదికి దండయాత్ర చేస్తేనో? (వార్ ఆఫ్ ది వరల్డ్స్).  ఇలా ఆదుర్దా కల్గించేట్టుగా  ఐడియా లేకపోతే  హై కాన్సెప్ట్ లో కాన్సెప్ట్ అవుతుంది.
పిచింగ్ 
      స్టోరీ అయిడియాలు, ట్రీట్ మెంట్లు, స్క్రీన్ ప్లేలూ ఇవన్నీ హై కాన్సెప్ట్ పరిధిలో ఏర్పడవచ్చు. ఐతే హై కాన్సెప్ట్ ఐడియాలు ‘పిచ్’ కి పనికి రావాలి. అంటే,  ఒక సెల్ ఫోన్ ని అమ్మాలనుకుందాం. దాన్ని చూపించగానే ఇంకేం వివరించనక్కర్లేకుండా అవతలి వ్యక్తికి దాని విలువ అర్ధమైపోయి కొనేసేట్టు వుండాలి.  బస్సు హైజాక్ అయింది - హైజాక్ చేసిన వాళ్ళలో ఒకడి భార్య బస్సులో వుంది – ఆమె పిల్లాడికి  అర్జంటుగా గుండాపరేషన్ చేయించేందుకు తీసికెళ్తోంది.... ఇలా చెప్పగానే మొత్తం సినిమా కళ్ళ ముందు కట్టి ఉత్సుకత రేపుతుంది. ఇంకేం వివరించక్కర్లేదు. దీన్ని పిచింగ్ అంటారు. ఇలాటి ఐడియాల్ని పిచ్ – డ్రైవెన్ ఐడియాలంటారు. పిచ్ – డ్రైవెన్ ఐడియాలే హై కాన్సెప్ట్ స్టార్ మూవీ కి అమ్ముడుపోతాయి. ఇలాకాక, మొత్తం చాలాసేపు వివరిస్తే గానీ అర్ధంగాని ఐడియాల్ని ఎగ్జిక్యూషన్ – డ్రైవెన్ ఐడియాలంటారు. అంటే ఒక సెల్ ఫోన్ విడి భాగాలన్నీ పట్టుకెళ్ళి, ఒకొక్కటి వివరిస్తూ, బిగిస్తూ,  పూర్తి చేసి - ఇదిగో ఇలా వుంటుంది సెల్ ఫోన్ అని చూపించడంలాంటిదన్నమాట. ఇలాటి ఎగ్జిక్యూషన్ – డ్రైవెన్ ఐడియాల్ని చెప్పి ఒప్పించాలంటే చాలా కాలం పడుతుంది. ఈ కారణం చేతనే ‘పల్ప్ ఫిక్షన్’, ‘స్టార్ వార్స్’, ‘సైడ్  వేస్’ లాంటి ఐడియాల్ని  పిచింగ్ తో నిర్మాతలకి అమ్మలేక పోయారు. 

            ఒక కథని ఒక్కరే ఓకే చెయ్యరు. కంపెనీలో వివిధ ఎగ్జిక్యూటివ్ ల పాత్ర కూడా వుంటుంది. ఒకరు మరొకరికి ఆ ఐడియాని పాస్ చేస్తూంటారు. ఇందుకు ఏకవాక్యంలో పిచింగ్ కి పనికొచ్చే ఐడియాలైతే  ఒకరి నోటి మాటగా ఇంకొకరికి సులభంగా వినిమయమవుతాయి. అదే ఎగ్జిక్యూషన్ – డ్రైవెన్ ఐడియాలైతే చాలా సేపు చెబుతూ కూర్చుంటే గానీ అర్ధంగావు.  జేమ్స్ బానెట్ స్క్రిప్టులు రాస్తున్నప్పుడు, ఒక ఐడియా తట్టి ఏజెంట్ కి కాల్ చేశాడు. బెర్ముడా ట్రయాంగిల్ లో హీరోయిన్ తప్పిపోయిందని ఐడియా చెప్పాడు. ‘ఐ లవ్ ఇట్, ఐవిల్ కాల్ బ్యాక్’ అన్నాడా ఏజెంట్. పది నిమిషాల తర్వాత కాల్ చేసి, ‘డన్, స్క్రిప్టు రాసేయ్యండి’ అని గ్రీన్ సిగ్నలిచ్చాడు. ఆ పదినిమిషాల్లో జరిగిందేమిటంటే, ఆ ఏజెంట్ ఒక నిర్మాతకి కాల్ చేసి బానెట్ ఐడియాని పిచింగ్ చేశాడు. వెంటనే ఆ నిర్మాత ఓకే చేసి, ఆఫీసులో ఒక నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్ కి ఏజెంట్ కాల్  చేసి పిచింగ్ చేస్తే, ఆ ఎగ్జిక్యూటివ్ కి వెంటనే నచ్చి తన పై ఎక్జిక్యూటివ్ కి పిచింగ్ చేశాడు. ఆ పై ఎగ్జిక్యూటివ్ కి కూడా వెంటనే నచ్చి నిర్మాతకి కన్ఫర్మ్ చేశాడు. నిర్మాత ఏజెంట్ కి కాల్ చేసి గో ఎహెడ్ చెప్పాడు.

          ఇలా తూటాలా పిచింగ్ కి పనికొచ్చే ఐడియాలే హై కాన్సెప్ట్ అయిడియాలు. ఇలా కాని అయిడియాలు హై కాన్సెప్ట్ కి పనికి రావు (మన లోకల్ లెవెల్లో ఇలాటిదే ఒకసారి జరిగింది – టైటిల్ భూకైలాస్, భూములు అమ్ముకుంటే యాబై కోట్లు వచ్చాయి, హీరో వేణుమాధవ్ -  అనగానే వెంటనే ఆఘమేఘాలమీద నిర్మాతల్నీ, వేణుమాధవ్ నీ ఓకే చేసుకున్నారు దర్శకుడు శివనాగేశ్వర రావు.  పిచింగ్ పవర్ ఎలా వుంటుందో చెప్పడానికే ఈ ప్రస్తావన). 
      బెర్ముడా ట్రయాంగిల్ లో హీరోయిన్ తప్పిపోయింది...గాలి దుమారం లేచింది - ఎడారి లో కాదు - నడి  మధ్య నగరంలో... గుమ్మంలో పసి పాపని వదిలేసి పోయారు - ఆయా గుమ్మంలో కాదు – బ్రహ్మచారుల గుమ్మంలో... విధి కలిపిన ప్రేమికులు వాళ్ళు -  చర్చిలో కాదు - టైటానిక్ షిప్ లో... భార్య కిడ్నాప్ అయింది - డబ్బులివ్వడానికి భర్త ఒప్పుకోలేదు...టీనేజి అమ్మాయిని దుష్టశక్తి ఆవహించింది....ఇవన్నీ హై కాన్సెప్ట్ సినిమాలుగా తెరకెక్కిన కిల్లర్ ఐడియాలే. హై కాన్సెప్ట్ కథల్లో పాత్రలు డెప్త్ తక్కువ వుంటాయి. పత్రాల మధ్య సంబంధాల చిత్రణ అంతంత మాత్రంగా వుంటుంది. హై కాన్సెప్ట్ కథల్లో భారమంతా స్టార్ మోసేట్టు వుండవు. యాక్షన్ అయినా, లవ్ అయినా, కామెడీ అయినా, ఫ్యామిలీ అయినా హై కాన్సెప్ట్ కథలు యాక్షన్ ఓరియెంటెడ్ గానే వుంటాయి గనుక బరువైన పాత్రలు, బరువైన కథలుండవు. స్టార్ పాత్ర సాధించాల్సిన సమస్యకి క్లియర్ గోల్, ఆ గోల్ కోసం వినూత్న వ్యూహాలూ వుంటాయి. బ్యాక్ గ్రౌండ్ లో తలపెట్టిన కాన్సెప్ట్ రన్ అవుతూనే,  పాత్ర ఆ బ్యాక్ డ్రాప్ లో కథ నడిపిస్తూ వుంటుంది. నడిపిస్తున్న కథ ఎంత ముఖ్యమో, బ్యాక్ డ్రాప్ లో విషయం పరోక్షం గా ఒక మెసేజ్ ఇచ్చేట్టు వుండడం అంతే ముఖ్యం. ‘జురాసిక్ పార్క్’ లో లవ్ ట్రయాంగిల్ నడిపిస్తూనే, దీని బ్యాక్ డ్రాప్ లో వున్న డైనోసారస్ క్లోనింగ్ ప్రమాదాలేమిటో పరోక్షంగా హెచ్చరిస్తూంటుంది.  
(వివిధ ప్రాప్తి స్థానాల నుంచి)
-సికిందర్