రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

521 : స్క్రీన్ ప్లే సంగతులు



హాలీవుడ్ ప్రస్తావన  అవసరం లేకపోయినా  ఒక మాట చెప్పుకుని ముందుకెళ్దాం.  హాలీవుడ్ లో ఎవరికీ ఏమీ తెలీదని తేల్చేశాడు  రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్. ఇది శిలాక్షరమై కూర్చుంది. హాలీవుడ్ లోనే కాదు, ఎక్కడైనా ఇంతే. ఎవరికీ ఏమీ తెలీదు. సినిమాలు తీసేవాళ్ళకి, చూసేవాళ్ళకి, చూసి రివ్యూలు రాసేవాళ్ళకీ  ఎవరికీ ఏమీ తెలీదు. ఏ సినిమా ఎందుకు బావుందో, బాలేదో రూల్స్ ని దృష్టిలో పెట్టుకుని  చెప్పడం తెలీదు  – ఇంక్లూడింగ్ ఈ వ్యాసకర్త. ఇరవై ఏళ్ళుగా రివ్యూలు రాస్తున్నా ఈ వ్యాసకర్తకి నిజానికి ఏమీ తెలీదు, నలుగురితో పాటు నారాయణే. అయితే హాలీవుడ్ లో ఒక్కటి తెలుసు – కథకి మూడంకాలు (త్రీ యాక్ట్స్) తోబాటు ఓ కిల్లర్ హుక్ వుండాలనీ. దీంతో గెస్ చేసి మిగతా కథా కమామిషూ అంతా లాగించేస్తారు.

నిర్మాత :  ఏంటి హుక్కు?
రచయిత  : పాములు పడ్డాయండి  విమానంలో.
నిర్మాత : బావుందే, కొత్తగా వుంది  హుక్కు. మరి పోస్టర్ ఎలా డైజన్ చేయొచ్చని అనుకుం
టున్నావ్?
రచయిత : పాములు చుట్టేసి వుంటాయండి విమానాన్ని.
నిర్మాత : ఎక్సెలెంట్. మరి టైటిల్?
రచయిత :  శామ్యూల్ జాక్సన్ నటించిన ‘స్నేక్స్ ఆన్  ఏ ప్లేన్’ అండి.
నిర్మాత : సోల్డ్! అమ్మేశాం ఫో, రాసుకో ఫో ...

ఇంతే, ఇలా వెంటనే  డిసైడ్ అయిపోయిన ప్రాజెక్టు అదే టైటిల్ తో, అలాటిదే పోస్టర్ తో, అదే స్టార్ తో అలాగే  తెరకెక్కింది. 32 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 63 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు వచ్చింది. బాక్సాఫీసు వస్తే గొప్ప సినిమా జ్ఞానులుగా కన్పించడం, రాకపోతే మొహం దాచుకుని కూర్చోవడం. ఏంటా సముపార్జించుకునే గొప్ప సినిమా జ్ఞానమంటే గెస్సింగ్ గేమే.  ఏదో గెస్ చేసేసి తీసేస్తే అదృష్టవశాత్తూ తగిలే  లక్కీ డ్రానే.  గెస్సులు చేసి, ఏవో నమ్మకాలతో కూడిన అంచనాలు పెట్టుకుని సినిమాలు తీసేస్తారు. దీనికి కావాల్సిందల్లా  ఓ కొత్తగా వుండే, వెంటనే అమ్ముడయ్యే  కిల్లర్ హుక్ (కత్తి లాంటి కొత్త ఐడియా) మాత్రమే. ఓ టైటిల్, పోస్టర్ డిజైన్, స్టార్ మాత్రమే. సినిమాల్ని అమ్మగల ఉపరితల ఆకర్షణలే కావాలి. ఇలా ఎందుకని మనమొకసారి ఆలోచిస్తే - అర్ధంకాని, అర్ధంజేసుకునే ఓపికలేని, ప్రవేశం లేని -  స్క్రీన్ ప్లేలూ స్ట్రక్చర్ ల సంగతులూ  ఎలర్జీ పుట్టించడం వల్లే. కానీ స్థూలంగా ఒక స్ట్రక్చర్ వుండాలనేది మాత్రం తెలుసు. ఇదైనా తెలిసినందుకు హాలీవుడ్ సినిమాలు బతికిపోతున్నాయి. 

          కథంటే ఏమిటో తెలుసుకునేందుకు ఇరవై ఏళ్ల పాటు పరిశోధనచేసిన స్క్రీన్ ప్లే గురు జేమ్స్ బానెట్ ఒక మాట చెప్పాడు. లిపిలేని ప్రాచీన కాలంలో కథలు మౌఖికంగా చెలామణి అవుతూ వుండేవి. ఆ నోటా ఈ నోటా ప్రాకుతూ నిత్యం మారిపోతూ వుండేవి. ఒకరు విన్న కథ తమ సృజనాత్మకత కొద్దీ ఇంకొకరికి ఇంకోలా  చెప్పేవారు. అలా కథలు అప్ డేట్ అవుతూ వుండేవి. ఎప్పుడైతే లిపి ఏర్పడిందో, ఇక ఆ జానపద కథలు అక్షరబద్ధమైపోయి పరిణామం చెందడం ఆగిపోయింది.  ఆనాటి అక్షర బద్దమై స్థిరపడిపోయిన ఆ జానపద కథల్నే ఈనాటికీ అదే రూపంలో అలాగే చదువుకుంటున్నాం, పిల్లల చేత చదివిస్తున్నాం. పిల్లలకి కథలు చెప్పే కాలం పోయింది. చదువుకోమనడమే. దీంతో పెద్దవాళ్ళకి పూర్వులకున్న  కథలు చెప్పే జ్ఞానం పోయింది. అచ్చులో కథలున్నాక ఇంకా బుర్రకి పనిచెప్పి కథలు చెప్పడం ఎందుకనుకుంటున్నారు.  అచ్చు వచ్చేసి నోళ్లకి సీలు వేసేసింది. దీంతో మెదళ్లకీ  తాళాలు పడ్డాయి. 

          అంటే ఎప్పుడైతే ఊహకి ఆకారం వస్తుందో,  ఇక ఊహాశక్తి నిర్లిప్తమై పోతుందన్న మాట. దీన్నే సినిమాలకి అన్వయిస్తే, సినిమాలంటూ లేనికాలంలో వూహించి సినిమాలు తీశారు. తెలుగులో ఊహకీ ఓ ఆకారం కనపడింది. దాంతో పౌరాణిక నాటకాలని ఆధారంగా చేసుకుని పౌరాణిక  గాథల్నే మూకీ సినిమాలుగా  తీస్తూపోయారు.  ఇలా కన్పిస్తున్న పౌరాణికాల్ని పట్టుకుని సినిమాలుగా ఎంతకాలం తీస్తారు. స్వయంగా వేరే కథా కథనాలు చేసుకోలేమా? ఈ ఆలోచనతో 1936 లో మొట్ట మొదటిసారి ఒక సాంఘీక కథని కల్పిన చేసి  ‘ప్రేమవిజయం’ అనే స్వతంత్ర టాకీ సినిమా తీశారు. దీని తర్వాత ‘గృహలక్ష్మి’, ‘మాలపిల్ల’ లతో స్వయంగా ఫిక్షన్ చేసిన సినిమాల ఒరవడి వూపందుకుంది. ఇక సినిమా కథల్ని మస్తిష్కం లోంచి తీసి ఊహాశక్తికి పదునుపెట్టి, స్వయంగా ఫిక్షన్ చేసి, ఎలా వుంటే తెర మీద ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో, ఆ విధమైన  స్ట్రక్చర్ లో పెట్టి తీసి విజయాలు సాధించడం మొదలెట్టారు. ఇలా చేయడానికి ప్రకృతి మెదడులో చేసిన ఒక ఏర్పాటే తోడ్పడింది. 

          మెదడు కథల్ని రిసీవ్ చేసుకునే పధ్ధతి ఒకటుంటుంది. ఒక వ్యక్తి వచ్చి గంటల తరబడి కబుర్లు చెప్తూ కూర్చున్నాడనుకుందాం. ఇతనెందుకొచ్చాడబ్బా  అన్పిస్తుంది. అప్పుడు  తీరిగ్గా  ఓ వెయ్యి అప్పు అడిగాడనుకుందాం, ఇది అడగడానికి  ఇంత టైము తినెయ్యాలా అని మెదడు ప్రతిఘటిస్తుంది. సినిమాల పట్ల కూడా మెదడు ఇంతే. చెప్పాల్సిన కథ ( స్టోరీ పాయింటు) సకాలంలో ప్రారంభం కాకపోతే మెదడు  ప్రతిఘటించడం మొదలు పెడుతుంది. అంటే  బోరు కొట్టడం ప్రారంభమన్న మాట. ఇది మనుషుల మెదళ్ళలో ప్రకృతి ఎప్పుడో చేసిన ఏర్పాటు. ఈ ఏర్పాటుతోనే మెదడు ప్రకారం బిగినింగ్ - మిడిల్ - ఎండ్ విభాగాలతో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ యాదృచ్ఛికంగా సినిమాల్లో కన్పించడం మొదలయ్యింది. దీన్ని పట్టుకునే స్క్ర్తీన్ ప్లే మీద పుస్తకాలు రాశారు. అంతే గానీ స్క్రీన్ ప్లే శాస్త్రాల్ని ఆకాశంలోకి చూస్తూ వూహించి, సొంత అభిప్రాయాలు కలిపి రుద్దుతూ డాంబికంగా తయారు చేయలేదు. ప్రత్యక్ష పదార్ధం లేనిది ఏ శాస్త్రమూ లేదు. నాట్య శాస్త్రం కూడా నాట్యాలు చూస్తూ అభివృద్ధి చేసిందే.    

కాబట్టి స్క్రీన్ ప్లే శాస్త్రానికి ఆధారం ప్రత్యక్షంగా కన్పించిన విజయవంతమైన సినిమాలనే పదార్ధాలే. ఆ విజయవంతమైన సినిమాల కథలు అలా  మెదడులో ప్రకృతి చేసిన ఏర్పాటుతో ఓ స్ట్రక్చర్ గా ఏర్పడి రూపొందినవే. కథల విషయంలో ప్రకృతి మెదడులో చేసిన ఏర్పాటు ప్రకారం,  మెదడు ఎలా పనిచేస్తుందో దాన్నే  త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అంటూ స్క్రీన్ ప్లే గురూస్  తయారు చేసి మనకి అందించారు. అసలు సైన్స్ సుబోధకం చేశారంతే. అందువల్ల సినిమాలు తీస్తున్న మనకి బయటనుంచి వీళ్ళేదో చెప్తున్నారని, స్క్రీన్ ప్లే పుస్తకాలు రాసిన వాళ్ళని, రాసే వాళ్ళనీ  చులకన చేసి అవమానకరంగా మాట్లాడడం అనవసరం. శాస్త్రం  లేని రంగం లేదు. సినిమా రంగానికి శాస్త్రం అక్కర్లేదనుకుంటే అనాగరికంగా కనబడుతుంది. 

          ఇలా పూర్వపు  సినిమాకర్తలు తమ మస్తిష్క ఖచిత ప్రకృతి సిద్ధ భాండాగారాల్లోంచి సృష్టిస్తూపోయిన సినిమా స్క్రిప్టులతో  తెలుగులో తొలి, మలి స్వర్ణయుగాలు  వర్ధిల్లాయి. ఎప్పుడైతే  ’70 లలో వ్యాపారయుగం ప్రారంభమయ్యిందో ఇక క్రమక్రమంగా ఆ భాండాగారం మూతబడుతూ వచ్చింది. మెదడులో ప్రకృతి చేసిన ఏర్పాటుని వదులుకుని, లేదా ఆ ఏర్పాటు వుందని తెలీక - వస్తున్న సినిమాల్నే  అలా అలా చూసేస్తూ వాటి నమూనాలతో  స్క్రిప్టులు రాయడం మొదలెట్టారు. 

          పైన చెప్పుకున్నట్టు జానపద కథలకి  అక్షరూపం ఏర్పడ్డాక ఇక వాటి విషయంలో క్రియేటి
విటీ ఎలా తెగిపోయిందో, సినిమాలతో కూడా అదే జరిగింది. వూహలకి ఆకారాలుగా పూర్వీకులు తీసి పెట్టిన  సినిమాలు ఎప్పుడైతే కన్పించడం మొదలెట్టాయో, ఇక ఊహాశక్తి నిర్లిప్తమైపోసాగింది. కథల విషయంలో ప్రకృతి మెదడులో  చేసిన ఏర్పాటుని వదిలేసి,   సినిమాల్ని బయట కళ్ళతో చూసి, చెవులతో విని,  ఆ ప్రకారం స్క్రీన్ ప్లేలు  తయారు చేసుకో వడం మొదలెట్టుకున్నారు.  మెదడు కూడా - ఇంతే ఖర్మ - అనుకుని ఆ కళ్ళూ చెవులూ అందించే  సెకెండ్ హేండ్ సమాచారం ప్రకారమే కథలల్లి చేతులకి అందిస్తూంటే,  ఆ చేతులు గొప్పగా వయ్యారాలు పోతూ స్క్రీన్ ప్లేలు  రాసుకోసాగాయి. మదర్ బోర్డు మరణించింది. కీ బోర్డు మీద గడుసు వేళ్ళు ఎడాపెడా బ్రేక్ డాన్సులు చేస్తున్నాయి. 

          అన్నీ తమలోనే వుంటే  బయట వెతుక్కోవడం. తమలో ఏదైతే వుందో అది  ప్రకృతి మెదడుకి అందించిన ఏర్పాటు. అదే సార్వజనీన స్ట్రక్చర్. దీనికే  దేశాల ఎల్లలు దాటి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే,  ప్రకృతి మెదడులో కథల్ని సృష్టించడానికీ, వాటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి చేసిన ఏర్పాటు ఇదొక్కటే - త్రీయాక్ట్ స్ట్రక్చర్.  తమలో వున్నది గుర్తించకుండా, గుర్తించమని  చెప్పే శాస్త్రాలనీ కూడా పక్కన పెట్టేసి,  నాల్గు సినిమాలు చూసి నా క్రియేటివిటీ నా ఇష్టమని తీసుకుపోతూంటే- ఇలాగే ఏడాది తర్వాత ఏడాది 90 శాతం అట్టర్ ఫ్లాపుల చరిత్రే మిగులుతుంది. టాలీవుడ్  అంటే ఫ్లాపుల పురిటి గడ్డ అని  సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాల్సి వుంటుంది. సొంత క్రియేటివిటీ, అభిరుచులూ వ్యక్తిగతమే. వీటితో సినిమాలు తీస్తే వ్యాపారానికి పనికి రావు. ఇంట్లో చూసుకోవాలి. స్ట్రక్చర్ ఒక్కటే సార్వజనీన కళా వ్యాపారం. క్రియేటివిటీ, సొంత అభిరుచులూ ఇవన్నీ ప్రకృతి నుంచి తెగిపోయిన గెస్సింగ్ గేములు, ఆధారాల్లేని అంచనాలు, గాలిలో విన్యాసాలు. 

          ఇందుకే ఈ రంగంలో ఎవరికీ ఏమీ తెలీదనే మాట వచ్చింది. డార్విన్ ప్రకారం ఉపయోగంలో లేని అంగాలు అంతరించిపోతాయి. స్క్రిప్టులు రాయడానికి కళ్ళూ చెవులనే బాహ్య జ్ఞానేంద్రియాల  మీదే ఆధారపడుతూంటే, మెదడులో ప్రకృతి ఏర్పాటు చేసిన అంతః చక్షువు కాస్తా ఎప్పుడో చచ్చూరుకుంది. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లోంచి త్రిశంకు స్వర్గంలో పడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఏ సినిమా ఎందుకు హిట్టవుతోందో, ఎందుకు ఫ్లాపవుతోందో చెప్పడానికి కూడా వూహాగానాలే. ఇక ప్రకృతే ఎప్పుడో చూసి చూసి విసిరింది ‘శివ’ రూపంలో తన ఏర్పాటుని. ఐనా ఇది గుర్తించకుండా దారితప్పి అలాగే తిరుగుతున్నారు. రాం గోపాల్ వర్మ తీసిన ‘శివ’ ఏవో నాల్గు హాలీవుడ్ సినిమాలు చూసి సీన్లు పేర్చిన స్క్రిప్టు కాదు. తెలీకుండానే ప్రకృతి ఆయన చేత అలా  చేయించింది - దాంతో ‘శివ’  చూడ్డం, సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే పుస్తకం చదవడం ఒకటే అయిపోయింది!  ‘శివ’ ని ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ లోనైనా పాఠంగా చెప్పి నేర్పుతున్నారా అంటే నో  - తెలిస్తేగా!!

          సినిమా స్క్రిప్టుల వైభవం చివరికి పరుచూరి బ్రదర్స్ తో ఆగిపోయింది. వాళ్ళు కూడా రాసినంత కాలం పాసివ్ పాత్రలతో రాయలేదు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు రాయలేదు, ఎండ్ సస్పెన్స్ కథలు రాయలేదు. ఎప్పుడైతే 2000 నుంచి కొత్త కొత్త దర్శకులు వాళ్ళే రచయితలుగా రావడం మొదలెట్టారో- ఇక  పాసివ్ పాత్రలతో, మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లేలతో, ఎండ్ సస్పెన్స్ కథలతో, ఇంకా కథకి – గాథకి తేడా తెలీని తనంతో   సినిమాల్ని పట్టి పల్లార్చడం  మొదలెట్టారు. ఈ నాల్గు  చీడలు అసలేమిటో, ఇవి సినిమాల విజయాల్ని ఎలా తినేస్తాయో తెలుసుకోకుండా తీసుకుంటూ పోవడమే. గెస్సింగ్ గేమే. సినిమాలు చూసేటప్పుడు శాస్త్రం తెలీదు, తీసేటప్పుడూ తెలీదు. చీడ పీడలని తెలీకుండా సినిమాలు చూస్తూ,  అలా తీశాడు గాబట్టి దాన్ని మనం కూడా అలా ఫాలో అయిపోదామని ఇంకిన్ని అవే చీడ పీడలని  ఉత్పత్తి చేయడం నిరంతరాయంగా సాగిపోతోంది. ఈ తంతు బాగా పరాకాష్టకి చేరిపోయింది
***
కథకి గుండెకాయ మోకాళ్ళలో వుండదు. అందుకనే మోకాళ్ళలో  మెదళ్ళున్న ప్రేక్షకులు కూడా పారిపోతూంటారు. కథకి గుండెకాయ  మోకాళ్ళలో వుంటుందనుకోవడం క్రియేటివిటీ. గుండెకాయ మోకాళ్ళలో వుండదని ఘంటాపథంగా చెప్పగలం - ప్రక్కటెముకల అవసరం దానికుంటుందని చూపించి. అలాగైతే ఆ  ప్రక్కటెముకలు మోకాళ్ళలోనే వుండచ్చని  కుండబద్దలు కొట్టడం అరివీర క్రియేటివిటీ. ఈ అరివీర భయానక క్రియేటివిటీకి రక్తమాంసాల యావే తప్ప అస్థిపంజరంతో పనుండదు. అదుంటుందని  తెలీదు. తెలిస్తే గుండెకాయ ఛాతీ దగ్గర ప్రక్కటెముకల మధ్య పెట్టాలని తెలుస్తుంది. అస్థి పంజరం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అయితే, రక్తమాంసాలు దాన్నాధారంగా  చేసుకుని అద్దే కేవల క్రియేటివ్ ఆకృతులే.  స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకోకపోతే ఆ ఆకృతులు వికృతులవుతాయి. రక్త మాంసాల్లేక అస్థిపంజరం వుంటుంది గానీ, అస్థిపంజరం లేక రక్త మాంసాల్లేవ్. స్క్రీన్ ప్లే సాఫ్ట్ వేర్లు సార్వజనీన స్ట్రక్చర్ ని సరఫరా చేస్తాయిగానీ, క్రియేటివిటీని కాదు. ఎవరికి  తోచిన క్రియేటివిటీని  వాళ్ళు  ఆ స్ట్రక్చర్ మీద అద్దుకోవాల్సి వుంటుంది. క్రియేటివిటీ వైయక్తిక వ్యాసంగమే. ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది మానవ అస్థిపంజరంలాగా ఒకే శాశ్వత ఆకారంలో వుంటుంది.  మార్పు చెందని  ఈ ఆకారాన్ని ఒప్పుకోలేని క్రియేటివిటీ వృధా. స్ట్రక్చ రాస్యులు కాకపోతే సినిమా నిరక్షరాస్యులుగా మిగిలిపోవడమే.
***
    ఈ వ్యాసం బాగా బోరు కొడుతూండవచ్చు. ఎందుకని? అసలు విషయంచెప్పకుండా ఏదేదో రాసుకొచ్చి చిట్ట చివరికెప్పుడో పాయింటుకి వస్తున్నాడు కాబట్టి. అంటే మోకాళ్ళలో విషయం పెట్టి ఈ వ్యాసం రాస్తున్నాడు. కథకి గుండె కాయని మోకాళ్ళలో పెట్టి సినిమాలు తీస్తే కూడా ఇలాగే బోరు కొడుతుంది. ఇది అనుభవమవడానికే వ్యాసాన్ని ఇలా స్ట్రక్చర్ లేకుండా విషయం మోకాళ్ళల్లో పెట్టి  రాసుకుపోతున్నాడు. మెకాలే పోయి మోకాలే వచ్చినట్టు. 

          కథకి గుండెకాయ మోకాళ్ళలో వుంటే అది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. మిడిల్ మటాష్ కి సరైన  ఇంగ్లీషు పదం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇలాటి స్క్రీన్ ప్లేలు తగిలి వుండవు. పదిహేనేళ్ళ క్రితం ఈ వ్యాసకర్తే  తెలుగులో ఈ వింత చూసి దీనికి ‘మిడిల్ మటాష్’ అని నామకరణం చేశాడు.  మిడిల్ మటాష్ అంటే స్క్రీన్ ప్లేలో కథకి గుండెకాయ వంటి మిడిల్ విభాగం మటాష్ అయిపోవడం. ఇదెలా మటాష్ అవుతుంది? మిడిల్  ప్రారంభం ఇంటర్వెల్ కి జరిగిపోతేనో, లేదా సెకండాఫ్ మధ్యకి జరిగిపోతేనో (చిత్రపటాలు  చూడండి), ఇంకా లేదా క్లయిమాక్స్ దగ్గరకి వెళ్ళిపోతేనో మిడిల్ మటాషై పోతుంది. ఇలా ఏ  హాలీవుడ్ సినిమాలోనూ వుండదు. హాలీవుడ్ సినిమాలు ఏం చేసైనా త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో వుంటాయి. అంటే బిగినింగ్, మిడిల్, ఎండ్ లు 1:2:1 నిష్పత్తిలో వుంటాయి. స్క్రీన్ ప్లేలో బిగినింగ్ 25 శాతం నిడివితో వుంటే, మిడిల్ 50 శాతంతో వుంటుంది, ఎండ్ 25 శాతంతో వుంటుంది. ఇదే మెదడులో ప్రకృతి చేసిన ఏర్పాటు. దీనికి భిన్నంగా ఏం జరిగినా వికృతే.

          స్క్రీన్ ప్లేలో 50 శాతం ఆక్రమించే మిడిల్లో నే కథ వుంటుంది. అందుకే సినిమాకిది గుండెకాయ. దీని శాతం  ఎంత తగ్గుతూంటే ఆ మేరకు కథాబలం తగ్గుతూంటుంది. అయితే ఇండియన్ సినిమాల విషయం వేరు. వీటిలో పాత్రల పరిచయాలు, పాటలు, కామెడీలు, ప్రేమలు, ఫైట్లు అన్నీ సర్దుకు రావాల్సి వుంటుంది. దీంతో 25 శాతం వుండాల్సిన బిగినింగ్ నిడివి ఇంటర్వెల్ దాకా సాగి స్క్రీన్ ప్లేలో 50 శాతం తినేస్తుంది. బిగినింగ్ అంటే కథకి ఉపోద్ఘాతమే, కథ కాదు. ఉపోద్ఘాతం ఎప్పటికి ముగుస్తుందో  అప్పుడే  బిగినింగ్ ముగిసి మిడిల్ తో కథ  ప్రారంభమవుతుంది. కథ ప్రారంభమవడమంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడడమే. ప్లాట్ పాయింట్ వన్ అంటే పాయింటేమిటో తెలిసి, హీరోకి సమస్య పుట్టి, దాని సాధించే గోల్ ఏర్పడి, కథేమిటో అర్ధమవడమే. 

          ఇలా అన్ని సినిమాలూ ఇంటర్వెల్ దగ్గరే కథ ప్రారంభిస్తున్నాయని కాదు. ఇంకా లోపు ఫస్టాఫ్ అరగంటకి, ముప్పావు గంటకీ ప్రారంభమయ్యేవి కూడా వుంటున్నాయి. ఎక్కువగా  ఇంటర్వెల్ దగ్గరే ప్రారంభమయ్యేవి  వుంటున్నాయి. గరిష్టంగా ఇంటర్వెల్ వరకూ మినహాయింపు ఇవ్వొచ్చు. ఫస్టాఫ్  బిగినింగ్ 25 శాతం. మిడిల్ 25 శాతం వుండాలి. మళ్ళీ సెకండాఫ్ లో మిడిల్ 25 శాతం, ఎండ్ 25 శాతం వుంటే ప్రకృతి ఏర్పాటు చేసిన సార్వజనీన స్క్రీన్ ప్లే అవుతుంది. ఫస్టాఫ్ లో వుండే 25 శాతం మిడిల్ ని బిగినింగే అక్రమించేస్తే అప్పటికి మిడిల్ తన సగం బలాన్ని కోల్పోతుంది. ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే 25 శాతం మిడిల్, అంటే సగం బలం పైనే ఆధారపడి మిడిల్ సినిమాని సక్సెస్ చేయాలి. ఎలాగో తంటాలు పడి సక్సెస్ చేస్తోంది చాలాసార్లు. 

          కానీ ఇదే బిగినింగ్ ఇంటర్వెల్ ని కూడా దాటేసి, సెకండాఫ్ లోవుండే మిగతా సగం మిడిల్ విభాగాన్ని కూడా కబ్జా చేస్తే మిడిల్ పూర్తిగా మటాషై పోయిన స్క్రీన్ ప్లే మిగులుతుంది. ఖాయంగా అట్టర్ ఫ్లాపే.

          అంటే ఇంటర్వెల్ దగ్గర కూడా మెదడు ఎదురు చూసే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడక, పాయింటూ ఎస్టాబ్లిష్ కాకా, సాధించేందుకు హీరోకి సమస్యే లేకా, గోలూ లేకా, ఇంకెప్పుడో  సెకండాఫ్ సగంలో ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే  అప్పటికి గంటన్నర గడిచిపోతుంది. ఇంతసేపూ విషయం లేని బిగినింగ్ ని చూపించడమే. ఇలా బిగినింగ్ వచ్చి మిడిల్ మీద పడితే,  మిడిల్ వెళ్లి ఎండ్ విభాగంలో కొంత జాగా అడుక్కుంటుంది. కథకి  ఎంత దీనస్థితి. అడుక్కునే గతి. ఇక ఆ చివర మిగిలిన ఎండ్ విభాగపు జాగాలోనే మిడిలూ ఎండూ క్రిక్కిరిసి బిగినింగ్ చేసిన దుర్మార్గాన్ని అనుభవిస్తాయి. ఎవరో  సామ్రాజ్యవాద జీన్స్ వున్న రచయితలే ఇలా చేస్తారు. అశ్వమేధ యాగాలు కూడా చేస్తారు. సరస్వతికి స్థానం లేకుండా చేసి, దాంతో లక్ష్మికి ఎంట్రీ లేకుండా చేసిపారేస్తారు. సరస్వతి లేక లక్ష్మి ఎక్కడ్నుంచొస్తుంది? ఇలా మూవీని  మురిక్కాలవలోకి తోసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో మూవీ కావాలి తోసివేత కార్యక్రమానికి.

***
దేని స్థానం లో అవి వున్న బిగినింగ్ (1) మిడిల్ (2) ఎండ్ (3) లు – మిడిల్ మధ్యలో ఇంటర్వెల్ (MP). 
కాబట్టి బిగినింగ్ ఎప్పుడు ముగుస్తుందో కథ  అప్పుడే ప్రారంభమైనట్టు. ఈ బ్లాగులోనే ఎన్నోసార్లు దీన్ని వివరించాం. బిగినింగ్ ముగిసే చోటుని – ప్లాట్ పాయింట్ వన్ ని ఎలా గుర్తించాలి? ఇది కూడా పైన చెప్పుకున్నాం. ఏ పాత్రని పట్టుకుని సాగితే ఇది గుర్తించగలం?  హీరో పాత్రని. ఇద్దరు ముగ్గురు హీరోలుంటే ఏ హీరో కథ అని గుర్తించాలి? ఏ హీరోకి గోల్ ఏర్పడుతుందో ఆ హీరో కథగా గుర్తించాలి. జై కి గోల్ ఏర్పడినప్పుడు జై కథే అవుతుంది. లవకుశలది కాదు.

          జైకి గోల్ ఎప్పుడు ఏర్పడింది? సెకండాఫ్ లో లవకుశల్ని కుదేసి, తను ఎంపీ గా నిలబడాలనుకుంటున్న  గోల్ చెప్పినప్పుడు. లవకుశలకి చెరో  టాస్క్ ఇచ్చినప్పుడు.  లవకి తనలా వెళ్లి ఎన్నికల ప్రచారం, కుశకి తను ప్రేమిస్తున్న అమ్మాయిని సెట్ చేయడం. 

         
ఈ ఘట్టంతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక్కడ్నించీ కథ ప్రారంభమైంది. ఇప్పటి దాకా నడిచింది ఈ పాయింటుకి రావడానికి జరిగిన కథలేని బిగినింగ్ విభాగపు బిజినెస్సే. శృతిమించిన ఉపోద్ఘాతమే.  గుండె కాయ మోకాళ్ళలోకి జారిపోవడమే. వెయ్యి అప్పడ గడానికి వచ్చి గంటన్నర నస పెట్టడమే. ఇదంతా ఎప్పుడు జరిగిపోవాలి? పైన వివరించుకున్నట్టు ఫస్టాఫ్ లో ఏదైనా చోట, లేదంటే ఇంటర్వెల్లో. ఇలా జరక్కపోవడంవల్ల మిడిల్ మటాష్ కి వెళ్ళింది. 

          మిడిల్ మటాష్ తో జయించలేమా? మిడిల్ మటాష్ లు ప్రారంభమైందే 2000 నుంచి తామరతంపగా యూత్ సినిమాలతో. అవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. సింగీతం శ్రీనివాసరావూ ఇలా యూత్ లవ్ తీసి ఫ్లాపయ్యారు. స్టార్ సినిమాలూ ఫ్లాపయ్యాయి. సింగిల్ స్టార్ సినిమాలు మిడిల్ మటాష్ తో గట్టెక్కడం కష్టం. ఇటీవలే మజ్నూ, కిక్ -2  గట్టెక్క లేకపోయాయి. మల్టీ స్టారర్స్ తో స్టార్ వేల్యూ మరిపించవచ్చు. త్రిపాత్రాభినయంతో అదృష్టం మీద ఒడ్డు చేరవచ్చు. నటనలు ఒక్కోసారి స్ట్రక్చర్ ని ఎగేస్తాయి. ‘భలేభలే మగాడివోయ్’ లో నాని క్యారక్టర్ ఈ పనే చేసింది. స్ట్రక్చర్ ని ఎగేసి సక్సెస్ చేసింది. ఇందుకు క్యారక్టర్ కి తోడ్పడిన ఎలిమెంట్ – పది నిమిషాలకో బ్యాంగ్. ప్రతీ పది నిమిషాలకో గట్టి బ్యాంగ్ తో ఓ ట్విస్టు ఇస్తూ పోయింది నాని పాత్ర. 

          హాలీవుడ్ లో ఒకప్పుడు సినీ మొబైల్ కంపెనీ నడిపిన ఈజిప్షియన్ నిర్మాత ఫువాద్ సయీద్ వుండే వాడు. ఈయన కంపెనీలో సిడ్ ఫీల్డ్ స్క్రిప్టులు చదివేవాడు. అప్పుడు సయీద్  - స్ట్రక్చర్ గిక్చర్ జాంతానై భయ్యా,  అది నువ్వు చూసుకో. నాకు మాత్రం పది నిమిషాలకో బ్యాంగ్ పడాలి, దట్సాల్- అని ఆర్డరేసే వాడు. ఈ బ్యాంగు లేమిట్రా దేవుడా అన్పించేది. అది సయీద్ మార్కు నమ్మకం, గేస్సింగ్ గేమ్. అలా ఎడ్డీ మర్ఫీతో అతను తీసిన ‘బెవర్లీ హిల్స్ కాప్’ సిరీస్ సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఇవి స్ట్రక్చర్ లో వుంటూనే బ్యాంగులిచ్చాయి- నాని సినిమా స్ట్రక్చరే లేకుండా బ్యాంగు లిచ్చి సక్సెస్ అవడం గోల్డెన్ రికార్డు. 

          ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఇలాటి బ్యాంగు లివ్వకపోయినా - త్రిపాత్రాభినయమే మిడిల్ మటాష్ ని మరిపించి వుండొచ్చు. ఇదే ఒక పాత్రతో చేసి వుంటే వెంటనే ఫ్లాపయ్యేది. 
***
బిగినింగ్ మిడిల్ ని సగం ఆక్రమించి ఇంటర్వెల్ ని తాకింది
ఎందుకు మిడిల్ మటాష్ పరిస్థితి ఏర్పడింది? మూడు పాత్రల ఉపోద్ఘాతాలూ  విడివిడిగా చెప్పుకు రావడం వల్ల,  ప్లస్ చిన్నప్పటి ముగ్గురి ఉపోద్ఘాతం చెప్పడం వల్ల. వీటికే ముప్పాతిక సినిమా పట్టింది. ఇదంతా డాక్యుమెంటరీ లకి వాడే ఎపిసోడిక్ కధనం పాల బడింది. అంటే సినిమాలకి పనికిరాని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ వచ్చి చొరబడిపోయింది. పెద్దయ్యాక ఫస్టాఫ్ లో లవకుశలు తిరిగి కలుసుకున్నపుడు ప్లాట్ పాయింట్ వన్ లా అనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన పాత్ర జై వస్తాడని అనుకుంటాం. కానీ కాదు. ఈ ఎపిసోడ్ ఒక చోట స్టాప్ అయి,  ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఇంటర్వెల్లో జై పాత్ర రాకకి దారితీస్తుంది. ఇంటర్వెల్లో జై పాత్రతో, అతడి గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుందని, కథా ప్రారంభమవుతుందనీ  ఆశపడతాం.  ఇది కూడా  జరగదు. ఈ ఎపిసోడ్ కూడా స్టాప్ అయి,  జై పాత్ర తాలూకు ఉపోద్ఘాతంతో ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది.  ఇంటర్వెల్ తో ఇది కూడా స్టాప్ అవుతుంది. ఇలా ఇంటర్వెల్ లోకూడా కథ  తేలకపోవడంతో, ఈ ఘట్టం తేలిపోయి- ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ లో పడిందని అర్ధమై పోతుంది.  ఎన్టీఅర్ కి ఎపిసోడిక్ కథనపు ఫలితాలెలా వుంటాయో ఆయన తండ్రిగారు నటించిన ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ తోనే తెలిసిపోయుండాలి.

  ఈ ఎపిసోడిక్ కథనం ఏ మూలాల్లోంచి వచ్చింది? దీని వెనుకనున్న రచయితల మెంటాలిటీ ఏమిటి?  నిజానికి ఈ వ్యాసకర్త సినిమా చూసినప్పుడు ఇది మరో టెంప్లెట్ మూవీ కాదని భావించాడు. తరచి చూస్తే, ఎపిసోడిక్ కథనమే టెంప్లెట్ కి పైపూతలా వుందని తేలి కాళ్ళు చేతులు ఆడలేదు. ఇలా కూడా మభ్య పెడతారన్న మాట. ఎక్కడికి పోతుంది టెంప్లెట్ మెంటాలిటీ!  ఈ సంవత్సరమే టెంప్లెట్ తో వచ్చిన  పెద్ద సినిమాలన్నీ ఫ్లాపయిన బాటలోనే టెంప్లెట్ ని ఎపిసోడిక్ చేస్తూ ఇది వచ్చింది. హీరో ఎంట్రీ, ఫైట్, సాంగ్, లవ్, కామెడీ, సాంగ్, లవ్, సాంగ్, విలన్ వచ్చి ఏదో  కెలకడంతో ఇంటర్వెల్. ఇదీ పెద్ద సినిమాలకి వాడుతున్న టెంప్లెట్. ఇదే ఫస్టాఫ్ లో వుంది ఇద్దరు ఎన్టీఆర్ లతో. ఇక ఇంటర్వెల్ లో విలన్ బదులు విలన్ కాని అసలు ఎన్టీఆర్ విలన్ లా బిల్డప్ ఇస్తూ వచ్చాడు, అంతే.

           ఇక  కోనవెంకట్ నిత్యం వాడుతూ వుండిన, ఈ మధ్య అవకాశం రాక  మూలన పడి వుంటున్న సింగిల్ విండో స్కీము సెకండాఫ్ లో లేదని కూడా బోల్తా పడ్డాడీ వ్యాసకర్త. ఏ స్టార్ నైనా ఒకే సింగిల్ విండోలోంచి తోసేస్తే వెళ్లి సెకండాఫ్ లో విలన్ ఇంట్లో పడి బకారాచేసే స్కీము - ఏక గవాక్ష శిక్ష – ఇక్కడ చక్కగా వుంది. సెకండాఫ్ లో అసలు ఎన్టీఆర్ కొసరు ఎన్టీఆర్ లని తెచ్చి ఇంట్లోపడేసుకుని ఏకే సీన్లు ఇవే.
***
బిగినింగ్ సెకండాఫ్ లో కూడా మిడిల్ ని ఆక్రమించడంతో, మిడిల్ ఎండ్ లోకి వెళ్లి చోటు పంచుకుంది
ఇంతకీ పెద్దయ్యాక జై పాత్రది పగా? కాదు,  చిన్నప్పుడే నాటకం స్టేజిని కాల్చి తమ్ముళ్ళ మీద, మేనమామ మీదా  పగ దీర్చుకుని పారిపోయాడు. పెద్దయ్యాక పగతో తమ్ముళ్ళని కిడ్నాప్ చేయలేదు. చిన్నప్పుడు తన తమ్ముళ్ళు పొందుతూ వుండిన గుర్తింపు తనకి వచ్చే అవకాశం లేకుండా చేశారన్న కసి వుంది. ఆ కసితోనే డాన్ గా మారి గుర్తింపు పొందాననుకున్నాడు. అది చంఢాలంగా వుందని ఎంపీగా మారి ఫేమస్ అవుదా మనుకున్నాడు. ఇందుకు వాడుకునేందుకే, పైగా ప్రేమిస్తున్న అమ్మాయిని పొందడానికే తమ్ముళ్ళని కిడ్నాప్ చేశాడు. చివరికి తను చెప్పే  మాటలు కూడా గుర్తింపు గురించే.  చిన్నప్పటి అవమానాల వల్ల  పడిన గుర్తింపు అనే బీజం వటవృక్షమయ్యేత్రెడ్ తెగకుండా – ఎమోషనల్ ఫోకస్ ని క్యారీ చేయడం కొంత మేలు.

   సైకాలజిస్టులు మురెల్ జేమ్స్, డరోతీ జోంగ్ వర్డ్ లు రాసిన ‘బోర్న్ టు విన్’ అన్న ప్రసిద్ధ పుస్తకంలో ఇలా అంటారు - శిశువు గర్భంలో వుండగా ఆ దేవుడు తలరాత  రాస్తాడో లేదో గానీ, పుట్టాక తల్లిదండ్రులు మనసు మీద రాస్తారని. అది జీవితాంతం బలంగా ముద్రేసుకుని వుంటుందని. జై తల్లి నిస్సహాయురాలైనా, మేనమామ జై మనసు మీద రాసింది అంతా ఇంతా కాదు – కసితో పెడదోవ పట్టిపోయాడుజై, ప్రాణాలూ కోల్పోయాడు.
***
ఇది కథా గాథా?
కథంటే పాత్రలమధ్య ఒక ఆర్గ్యుమెంట్ తో నడుస్తుంది. గాథ అంటే పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ లేకుండా ఏకపక్షమైన పాత్ర ప్రయాణం వుంటుంది. గాథలు సినిమాలకి పనికి రావు –ట్రాజడీలైతే తప్ప. కాబట్టి బ్రహ్మోత్సవం, నక్షత్రం, మొగుడు, పైసా మొదలైన  గాథలతో కూడిన సినిమాలు ఫ్లాపయ్యాయి. జైది కూడా పాత్ర ప్రయాణమే తప్ప ఆర్గ్యుమెంట్ లేదు. తమ్ముళ్ళు అతడితో ఆర్గ్యూ చేయలేదు. నువ్వు మంచి మార్గంలో లేవని వా దించలేదు. చెప్పిన పని చేసుకుపోయారు. వాళ్లకి ఎదురు చెప్పే అర్హత కూడా లేదు, చిన్నప్పుడు అన్నతో చేసిన తప్పుల దృష్ట్యా.

ఇలా ఇది మిడిల్ మటాష్, టెంప్లెట్, సింగిల్ విండో స్కీము, గాథ అనే సకల శకలాలతో వికలమవుతూకూడా ఎన్టీఆర్ చేతిలో భిన్నత్వంలో ఏకత్వం చేసుకున్న ఓ గెస్సింగ్  గేమ్ తప్ప మరోకటి కాదు. 


-సికిందర్