రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, సెప్టెంబర్ 2017, బుధవారం

522 : రివ్యూ!




రచన దర్శకత్వం : ఆర్ మురుగ దాస్
తారాగణం :  మహేష్ బాబు, కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె. సూర్య, ప్రియదర్శి, త్ దితరులు
సంగీతం
: హేరిస్  జయరాజ్, ఛాయాగ్రహణం : సంతోష్ శివన్
బ్యానర్స్ : ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ఎంటర్టైన్మెంట్
నిర్మాతః ఎన్‌.వి. ప్రసాద్
విడుదల : సెప్టెంబర్ 27, 2017

***
          ‘1-నేనొక్కడినే’ తో పక్కకెళ్ళి ఇంకో జానర్ ని ప్రయత్నించిన మహేష్ బాబు, ‘గజినీ’ తో పక్కకెళ్ళి ఇంకో జానర్ ని ప్రయత్నించిన మురుగదాస్, ఇద్దరూ కలిసి పక్క కెళ్ళి ప్రయత్నించిన  అదే సైకలాజికల్ జానర్ తో వచ్చారు. ఇద్దరూ కలిస్తే ఏ అద్భుతం చేస్తారోనని ప్రేక్షకులు ఆశిస్తూ వచ్చారు. ఆశలు తీరడానికి పండగ సందర్భాన్ని మించిందేముంటుంది. ప్రమోషన్ లో భాగంగా స్పైడర్ బ్యాగులు, క్యాపులు, పెన్నులు, పెన్సిళ్ళు మొదలైన ఉత్పత్తులతో  మార్కెట్ లో ప్రభంజనం సృష్టించకపోయినా, నిత్యం ప్రజల నోళ్ళల్లో నానుతూ ఓ మేనియాని మాత్రం సృష్టించింది. మేనియాతోబాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ ‘బ్రహ్మోత్సవం’ తో అంత వెన్నుపోటు పొడిచిన మహేష్ బాబు ‘స్పైడర్’ తో మరిస్తారని, ఇక వెన్నుపోట్లు మర్చిపోయి హాయిగా పండగ కానుక ఎంజాయ్ చేయవచ్చని ప్రేక్షకులు సిద్ధమయ్యారు. మరి మహేష్ బాబు మురిపించారా మురుగదాస్ తో కలిసి? దసరాకి ఎలాగూ కోళ్ళు కోసుకుని తింటారు సరే, తనేం కోశారు సినిమాలో ఈసారి చూద్దాం...

కథ 
      ఇంటలిజెన్స్ విభాగంలో పని చేసే శివ (మహేష్ బాబు)  ఒక  సాఫ్ట్ వేర్ ని రూపొందిస్తాడు. ప్రజలు మాట్లాడుకునే ఫోన్ కాల్స్ లో కొన్ని పదాలకి అలర్ట్ వచ్చేలా సాఫ్ట్ వేర్ ని సిద్ధంచేసుకుని, ఆ అలర్ట్స్ తో వెళ్లి ఆపదలో వున్న వాళ్ళని కాపాడుతూంటాడు. నేరాలు జరక్కుండా చూస్తూంటాడు. అతడి టాపింగ్  లోకి మెడికల్ స్టూడెంట్ చార్లీ (ర కుల్ ప్రీత్ సింగ్) కూడా వచ్చేస్తుంది. ఆమె స్నేహితురాలితో మాట్లాడే మాటలు విని ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడతాడు. ఇలావుండగా,  ఒకమ్మాయి ప్రమాదంలోవుందని అలర్ట్ రావడంతో ఆ ఏరియాలో వున్న లేడీ కానిస్టేబుల్ కి సమాచారమందిస్తాడు. ఆ అమ్మాయి తోబాటు లేడీ కానిస్టేబుల్ హత్యకి గురవుతారు. శరీరాలు ముక్కలు ముక్కలు చేసి పారిపోతాడు హంతకుడు. ఈ హంతకుడి అన్వేషణలో శివ కర్నూలు వెళ్లి వాడి పుట్టుపూర్వోత్తరాలు తవ్వితే, భైరవుడు (ఎస్ జే సూర్య ) అనేవాడు శాడిస్టు కిల్లర్ అనీ, మనుషులు ఏడుస్తూంటే చూసి  ఆనందిస్తాడనీ, తమ్ముడి (భరత్) తో కలిసి  చిన్నప్పటినుంచీ మనుషుల్ని చంపి, బంధువులు ఏడుస్తూంటే వెళ్లి  చూసి  ఆనందిస్తూంటాడనీ తెలుస్తుంది. దీంతో శివ వీళ్ళిద్దర్నీ ఎలా పట్టుకున్నాడు, భైరవుడి ఇంకొన్ని దుర్మార్గాల్ని ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ  
      ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జానర్. దీనికి సాటి మనిషి ఆపదల్లో వుంటే ఆదుకునే మనుషులు కరువయ్యారనే కథా ప్రయోజనాన్ని ఆశించారు. అలా ఆదుకోని మనుషుల్ని చూపించ
కుండానే మెసేజి ఇవ్వాలని ప్రయత్నించారు. మనుషులు వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్  మీద గడుపుతూ బయటేం జరుగుతోందో తెలుసుకోవడంలేదని చెప్పారు. ఎన్నిరకాలుగా చెప్పినా అలాటి మనుషుల్ని చూపించకపోవడం ఒక వెలితి. ఆపదల్లో వున్న మనుషుల్ని ఆదుకునే గుణం నశించిందన్న ఫిర్యాదు ఇప్పటిది కాదు. ఇది పాతది. దర్శకుడే ఇప్పుడు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడ్డం  లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగితే చుట్టూ చేరి బాధితుల్ని మొబైల్స్ లో చిత్రీకరించడం, సెల్ఫీలు తీసుకోవడం దాకా వెళ్ళింది సహాయ నిరాకరణ. ఇదీ మనుషులు బయట పెట్టుకుంటున్న శాడిజం. దర్శకుడు మామూలు మనుషుల్లో 4 శాతం శాడిజం, శాడిస్టులుగా నేరాలు చేసే వాళ్ళలో 15 శాతం శాడిజం వుంటుందన్నాడు. నిత్యవ్యవహారాల్లో ప్రతీ మనిషీ సైకోతనాన్ని ప్రదర్శిస్తాడని శతాబ్దం క్రితమే రష్యన్ రచయిత డాస్టోవిస్కీ చెప్పేశాడు. మురగదాస్ చెబుతున్న 4 శాతం శాడిజం అందరిలో వున్నా, అది తీర్చుకోవడానికి బాధితులతో పాల్పడుతున్న అనైతికాన్ని చూపించివుంటే,  ఈ కథ  సమకాలీనమయ్యేది. కాలీన స్పృహ ఈ కథలో కొట్టొచ్చినట్టు కన్పించే లోటు.

ఎవరెలా చేశారు 
     స్పైడర్ కథలో మహేష్ బాబు ‘స్పై’ పాత్ర పోషించారు. నిజానికి స్పైలు విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తారు. ఇంటలిజెన్స్ బ్యూరోలో కూడా స్పై లుండరు. కాబట్టి మహేష్ నటించిన శివ పోలీసు పాత్రే. ఈ పోలీసు పాత్రలో సీరియస్ మహేష్ ని మనం చూస్తాం - ఇటీవల ‘లై’ లో  సీరియస్ స్పై పాత్రలో నితిన్ ని చూసినట్టు. ఒక స్టార్ గా మహేష్ బాబు కమర్షియల్ హంగులేవీ పాత్రకి పెట్టుకోలేదు. చాలా అందంగా, కాస్ట్యూమ్ పరంగా చాలా టెర్రిఫిక్ గా మాత్రం కన్పిస్తారు. హీరోయిన్ తో రోమాన్స్ ని కూడా పాత్ర సీరియస్ అవుతున్నప్పుడు మాత్రమే గుర్తు తెచ్చుకుంటారు. ఆమెతో రెండు నిమిషాలు తెచ్చి పెట్టుకున్న రోమాన్స్ చేసి, ఓ పాట వేసుకుని మళ్ళీ సీరియస్ యాక్షన్ లోకి వెళ్ళిపోతారు. హీరోయిన్ తో రోమాన్స్ కి సమయం కాదనుకున్నప్పుడు, మదర్ క్యారక్టర్ తో మదర్ సెంటి మెంటు కోసం వెళ్ళిపోయి వస్తారు. ఒక సీరియస్ సీను మధ్యలో హీరోయిన్ చిలిపిగా ఫోన్ చేస్తే, ఆడియెన్స్ మూడ్ ని గమనించినట్టు – రోమాన్స్ కి నీకు సమయం సందర్భం లేదా అని ఆమెకి చీవాట్లు పెట్టి తప్పించుకుంటారు. సైకో కిల్లర్ బారినుంచి మదర్ ని కాపాడుకునే ఎపిసోడ్ లో, ఆతర్వాత ఆడవాళ్ళ చేత సైకో కిల్లర్ మీద ఆపరేషన్ చేయించే ఎపిసోడ్ లో మాత్రం ప్రేక్షకులనుంచి విపరీతం గా చప్పట్లు కొట్టించుకుంటారు. ఇక ముగిపులో రెండు క్లయిమాక్సులు రావడంతో  ప్రేక్షుకులకి అలసట వచ్చేసి ఆ  హీరోయిజమంతా వృధా చేసుకుంటారు. రెండు క్లయిమాక్సుల వల్ల ముగిపులో ఏం మెసేజి డైలాగు చెప్పినా అది మాస్టర్ స్ట్రోక్ కాలేకపోయింది- పైన చెప్పుకున్న కారణాలతో  ఆ మెసేజికి ప్రేక్షకులనుంచి స్పందనా కరువయ్యింది 

          రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత పాత రొటీన్ మూస ఫార్ములా పాత్ర. కథలో ఏంతో జరుగుతున్నా, ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తున్నా ఆమె ఎక్కడుంటుందో, రోమాంటిక్ మూడ్ తోనే వుంటుంది.  ఇంకొక్క పాత్ర,  సైకో విలన్ గా ఎస్ జే సూర్య. ‘డార్క్ నైట్’ జోకర్ పాత్రకి తను అనుసరణ. అయినా బాగానే చేశాడు. సైకో కిల్లర్ గా హావభావ ప్రదర్శనతో  గానీ, హల్చల్ తో గానీ పనెక్కువ వున్న పాత్ర తనదే. ఇంకో హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి కన్పిస్తాడు, కామెడీ చేయకుండా. మిగిలిన పాత్రల్లో నటులు తమిళులే, ఒకరిద్దరు హిందీ వాళ్ళు తప్ప. 

          దీన్ని తెలుగు – తమిళం  ద్విభాషా చిత్రంగా తీశారు. అయితే తమిళ తనమే ఎక్కువ కన్పిస్తుంది. విలన్ చిన్నపటి గ్రామీణ కథలో మరీ తమిళ నేటివిటీయే వుంటుంది. 

          సాంకేతికంగా సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఎప్పట్లాగానే చెప్పుకోదగ్గది. హేరీస్ జయరాజ్ సంగీతం లోని  పాటలు మాత్రం మహేష్ బాబు స్టార్ డమ్ కి తగ్గట్టులేవు. పీటర్ హేన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ- ప్రధానంగా హాస్పిటల్ శిథిలాల్లో, రోలర్ కోస్టర్ యాక్షన్లో థ్రిల్లింగ్ గా వుంది. హాస్పిటల్ కూలిపోయే దృశ్యాల సీజీ వుంన్నంత బాగా , పెద్ద బండ దొర్లి వచ్చే ఎపిసోడ్ లో లేదు. 

చివరికేమిటి 
      సినిమాలో చాలా మరణాలు చూపించారు. కసకసా చంపడమే. మూకుమ్మడిగా వందలమందిని చంపడం కూడా. పండగకి ఇదేంటని ప్రేక్షకుల అసహనం. ఇవన్నీ విలన్ శాడిజాలే. ‘డార్క్ నైట్’ లోని  ఈ పాత్ర తీసుకుని, హాలీవుడ్ లో వుండే డిజాస్టర్ మూవీస్ అనే జానర్ ని కలిపి – ఒక కషాయం తయారు చేశారు. సైకో థ్రిల్లర్, డిజాస్టర్ యాక్షన్ సజాతి జానర్లు కావు. డిజాస్టర్ జానర్  హై - కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్స్ కి చెందుతుంది. దీన్ని విడిగా తీయాలి- ఇలా సైకో థ్రిల్లర్ తో కలిపి కాదు. దర్శకుడు ఈ హై కాన్సెప్ట్ డిజాస్టర్ తో అత్యుత్సాహం ప్రదర్శించి, క్లయిమాక్స్ లో వెంటవెంటనే రెండు డిజాస్టర్స్ పెట్టేశాడు. నగర రోడ్లమీద బండ దొర్లి రావడం, హాస్పిటల్ కూలిపోవడం. దీంతో హాస్యాస్పదంగా తయారయ్యింది. వీటికోసం ముగిసిపోయిన కథని రెండు సార్లు పొడిగించాడు. మొదటిసారి రెండు గంటల్లో సైకో ని పట్టుకుంటాననే హీరో పట్టుకుంటాడు. పోలీసులు బంధిస్తారు. మళ్ళీ సైకో ఛాలెంజి చేస్తాడు. బండ దొర్లిపోయే ఏర్పాటు చేశానని. దీన్నాపడానికి  వెళ్ళే హీరో ఆపలేకపోతాడు. చాలామంది చనిపోతారు. దానికదే బండ  ఆగిపోతుంది. ఇంతలో సైకో మళ్ళీ తప్పించుకుంటాడు. మళ్ళీ గంటలో పట్టుకుంటానంటాడు హీరో. ఈ రెండోసారి సైకో వెళ్లి పోయి హాస్పిటల్ ని పేల్చేస్తాడు. చాలామంది చనిపోతారు, చివరి కెలాగో సైకోని చంపేస్తాడు హీరో. వీటికంటే ముందు సైకో ఎందర్నో చంపి కడుతున్న మెట్రో పిల్లర్స్ లో పడేశానంటాడు. 

          కథతో ఈ చాలా మిస్ మేనేజి మెంటు వల్ల చెప్పాలనుకున్న పాయింటు గల్లంతై పోగా, ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎమోషనల్ కనెక్ట్ లేదు. హీరోకి ఎక్కడా ఫీలవడానికి వ్యక్తిగత నష్టం జరగలేదు. ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటి సైకో థ్రిల్లర్ చూసినా, ‘ఇండిపెండెన్స్ డే’ లాంటి హై కాన్సెప్ట్ డిజాస్టర్ మూవీ చూసినా బలమైన ఎమోషనల్ ట్రాక్ తో కట్టిపడేస్తాయి.

          మురుగదాస్ బలహీన కథ, బలహీన దర్శకత్వం చాలా ఆశ్చర్యపరుస్తాయి. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ కి ఒక సైకో కథ ఎలా సూటవుతుందనుకున్నాడో ఏమో - ఈ బలహీనతని కప్పిపుచ్చడానికి  చివర్లో  ‘డిజాస్టర్స్’ ని జోడించి రేంజి పెంచే ప్రయత్నం చేసినట్టుంది. దీనికి మహేష్ కూడా చేయి కలిపి లాగడంతో, మహేష్ తో బాటు మురుగ దాస్ కూడా వచ్చి తిరిగి  ‘బ్రహ్మోత్సవం’ లో పడ్డాడు. 


-సికిందర్