రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

523 : రివ్య్తూ!





రచనదర్శకత్వం : మారుతీ
తారాగణం: ర్వానంద్, మెహరీన్ పీర్జాదా, నాజర్, వెన్నెలకిషోర్, వేణు, ఘుబాబు దితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.న్, ఛాయాగ్రణం: నిజార్ ఫీ
బ్యానర్యువి క్రియేషన్స్
నిర్మాతలు  : ప్రమోద్, వంశీ
విడుదల : సెప్టెంబర్ 29, 2017
***
        
       దర్శకుడు మారుతీ  నానితో  ‘భలేభలే మగాడివోయ్’  సూపర్ హిట్ ఇచ్చాక పెద్ద రేంజికి  వెళ్లి పోవాలనుకున్నారు. దీంతో వెంకటేష్ తో ‘బాబు బంగారం’ తీశారు. చిన్న కథలతో తనకున్న టాలెంట్ ని  పాత మూస ఫార్ములాకి బలిపెట్టి ‘బాబుబంగారం’ తో కంగుతిన్నారు. పెద్ద స్టార్ మూవీస్ కి ఒక మూసలో వుండే అవే ఫార్ములా కథలు తన సెక్షన్ కాదని తేల్చుకుని, తిరిగి బయల్దేరిన చోటికి వచ్చారు. ఈసారి శర్వానంద్ తో  చేయి తిరిగిన తన కామెడీ ప్రతిభనే నమ్ముకుని ‘మహానుభావుడు’ తీశారు. నానికి మతిమరుపు పాత్రతో ‘భలేభలే మగాడివోయ్’ తీసినట్టే, మళ్ళీ శర్వానంద్  పాత్రకి ఇంకో వ్యాధిని కట్టబెట్టారు. ఇక ఇదేదో ఫార్ములా బాగానే  వర్కౌట్ అవుతోందని తలా ఓ వ్యాధి హీరోలకి తగిలిస్తూ కామెడీలు తీసే అబ్సెషన్ కి లోనవుతారా, వెంటనే దూరమవుతారా?
       
        శర్వానంద్ కూడా టాప్ స్టార్లు చేసే సినిమా ఒకటి తన ఖాతాలో వుండేందుకు  ‘రాధ’ తో ఓ పాత మూస ఫార్ములా చేసి దెబ్బతిని , మారుతితో చేయికలిపి  సౌభాతృత్వాన్ని చాటుకున్నారు. జ్ఞానోదయమైన ఈ సౌభాతృత్వం ఇప్పుడు ఇద్దరికీ మేలు చేసిందా? ఇద్దరూ కలిసి సృష్టించిన ఆ బాక్సాఫీసు వ్యాధి ఏమిటి? దానితో ఏ మేరకు మెప్పించ
గల్గారు?... ఓసారి చూద్దాం...

కథ 
     ఆనంద్ (శర్వానంద్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతడికి అబ్సెసివ్  కంపల్సివ్ డిజార్డర్ (ఒసిడి) అనే మనోవ్యాధి వుంటుంది.  ప్రతీదీ పరిశుభ్రంగా వుండాలని కోరుకుంటాడు. పరిశుభ్రత లేకపోతే తట్టుకోలేడు. మనుషులతో ఆచితూచి కరచాలానం చేస్తాడు. అతడి ఈ అతిశుభ్రత ఆఫీసులో, ఇంట్లో అందరికీ సమస్యవుతుంది. తల్లికి జ్వరం వచ్చినా ముట్టుకోడు. ఇలాటి ఇతను మేఘన (మేహరీన్ పీర్జాదా) ని చూడగానే ప్రేమలో పడతాడు. ఆమెకూడా శుభ్రత  కోరుకునే మనిషి కావడంతో ప్రపోజ్ చేస్తాడు. ఆమె తండ్రి (నాజర్) ని అడగాలంటుంది. ఆ తండ్రి భోజనం చేసే విధానం నచ్చక డిస్టర్బ్ అయిపోతాడు ఆనంద్. ఇతడి పరిశుభ్రత పిచ్చిని  ఆ తండ్రి కూతురి కోసం ఓర్చుకుంటాడు. అయినా ఆ తండ్రి అస్వస్థత పాలై ఆస్పత్రికి తీసికెళ్ళాల్సి వస్తే జంప్ అయిపోతాడు ఆనంద్. దీంతో మేఘన అతణ్ణి కట్ చేసి పారేస్తుంది. ఆనంద్ ఇప్పుడేం చేశాడు? మేఘన కోసం పరిశుభ్రత పిచ్చిని కుదుర్చు కున్నాడా? ఎలా? ఇతడి పిచ్చి ఎలా కుదిరి పెళ్లి కుదిరింది? ఇందుకేమేం చేశాడు?... ఇవి తెలుసుకోవాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే.

ఎలావుంది కథ
      ‘భలేభలే మగాడివోయ్’ లో మతి మరుపు కథలాగే కొన్ని మార్పులతో ఈ అతిశుభ్రత అనే కామెడీ. కానీ ఇది ‘భలేభలే మగాడివోయ్’ లాగా పూర్తి స్థాయి రోమాంటిక్ కామెడీ కాలేదు. సగం కథ తర్వాత హీరోయిన్ వైపునుంచి కామెడీ వుండదు. ఆమె రోమాంటిక్ డ్రామా మూడ్ లో కెళ్ళి పోతుంది. ఇక ఒసిడి మీద ఈ కథ  అన్నారు. నిజానికిది ఒసిడి  కాదు. అపరిశుభ్రత పట్ల ఎలర్జీ మాత్రమే. అతిసున్నితత్వం మాత్రమే. అబ్సెసివ్  కంపల్సివ్ డిజార్డర్ పేరు చూస్తేనే తెలిసిపోతుంది. అబ్సెసివ్ అంటే మనసులో ఒకే ఆలోచన పదేపదే కలగడం. కంపల్సివ్ అంటే ఆ ఆలోచనతో పదేపదే అదే చర్యకి పాల్పడ్డం. అబ్సెసివ్ = పునరావృతమయ్యే ఆలోచన, కంపల్సివ్ = పునరావృతమయ్యే చర్య.  అంటే మనసులో అన్పించే ఒకే పనిని పదేపదే చేయడం : పదేపదే చేతులు కడుక్కోడడం, పదేపదే గ్లాసు కడగడం, పదేపదే టేబుల్ తుడవడం లాంటివి వుంటాయి. అలాగే  గడియారం ఆగిపోయిందని పదేపదే కీ ఇవ్వడం, లైటు ఆర్పామా లేదాని  పదేపదే వెళ్లి చూడ్డం లాంటివి కూడా వుంటాయి. దీన్నే ఒసిడి అంటారు. ఇది మనసులో పుడుతుంది. ఎలర్జీ అనేది చుట్టూ పరిసరాలని చూసి పుడుతుంది.  పరిసరాల పరిశుభ్రతతో ఒసిడికేం  సంబంధం లేదు. ఈ కథానాయకుడి సమస్య కూడా  చుట్టూ పరిసరాల, మనుషుల అపరిశుభ్రత తోనే. ఒకసారి శుభ్రం చేస్తే అతడి ఎలర్జీ తీరిపోతూంటుంది. చిన్నప్పుడు ప్రకృతితో కలిసిపోయి పెరక్కపోవడం వల్ల ఇలాటి ఎలర్జీ పుడుతుంది. మట్టిలో ఆడుకునే పిల్లలకి ఈ పరిస్థితి రాదు. ఇందుకే ఈ కథ ముగింపు కథానాయకుణ్ణి  మట్టితో – ప్రకృతితో – కలిపి సమస్య తీర్చింది. ఒసిడి కి ఇలాటి పరిష్కారం వుండదు, మానసిక చికిత్సే వుంటుంది. కాబట్టి ఒసిడి మీద సినిమా – ఒసిడి మీద సినిమా అనే మిస్ ఇన్ఫర్మేషన్ ఆపెయ్యాలి - సగటు ప్రేక్షకులకి తప్పుడు అవగాహన కలక్కుండా. 

ఎవరెలా చేశారు 
       శర్వానంద్ కామిక్ టైమింగ్ పాత్రని కలర్ఫుల్ గా మార్చింది. అయితే ఈ పెప్ ని ‘రన్ రాజా రన్’ స్థాయికి తీసికెళ్ళి వుండొచ్చు. ఇది జరగలేదు. పాత్రకి సంభాషణల బరువు తగ్గివుంటే కామిక్ యాక్షన్ మరింత థ్రిల్ చేసేది. అతి శుభ్రత పిచ్చిగల వాడి పాత్రలో మొదట్లో తను తాట తీయడం, తర్వాత తన తాట అందరూ తీయడంలాంటి హస్యప్రహసనాలతో మంచి వినోదాన్నేపంచాడు. ఐతే కొంత సేపయ్యాక దీనికీ మొనాటనీ రావడానికి కారణం తర్వాత చూద్దాం. సినిమా అంటేనే  2000 నుంచి  ఎంటర్ టైన్మెంట్ - ఎంటర్ టైన్మెంట్ - ఎంటర్ టైన్మెంట్ గా అర్ధం మారిపోయింది. తెలిసో తీలీకో ఈ పల్స్ ని పట్టుకున్నందుకే శర్వానంద్  యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తూ దీంతో సక్సెస్ అయ్యాడు. 

          హీరోయిన్ పాత్రలో మెహరీన్ రోమాంటిక్ కామెడీగా సాగినంత వరకూ ఫర్వాలేదుగానీ, జానర్ ఫిరాయించి రోమాంటిక్ డ్రామాగా మారేక అంత ప్రభావం కనబరచలేదు. రోమాంటిక్ డ్రామాకి ఎక్కువ అనుభవమున్న నటి వుంటే బావుంటుంది. 

          మిగిలిన పాత్రల్లో నాజర్ దే కీలక పాత్ర. కానీ ఆయన గెటప్ పాత స్టయిల్ లో వుంది. హీరో పక్కన వెన్నెల కిషోర్, వేణుల కామెడీ ఫర్వాలేదు. ఈ సినిమాలో ఎక్కువగా టాయిలెట్ కామెడీయే వుంది –  ఎక్కడపడితే అక్కడ - మారుతి బూతుని ఇలా ఏమార్చారేమో తెలీదు. 

          తమన్ సంగీతంలో రెండు మెలోడీ పాటలు చూస్తున్నంత సేపూ ఫర్వాలేదు. నిమిషం తర్వాత గుర్తుండవు. ఈ పరిస్థితిని ఎన్నాళ్ళు కొనసాగిస్తారో సంగీత దర్శకులూ పాటల రచయితలూ. నిమిషంలో మర్చిపోయే పాటలెందుకు? పాడే వాళ్ళెవరో కూడా మనకి తెలీదు. మ్యూజిక్ ఇండస్ట్రీ చాలా ట్రాష్ ని ఉత్పత్తి చేస్తోంది. 

          కెమెరా వర్క్, ఎడిటింగ్, ఇతర సాంకేతికాలూ నిర్మాతల స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా వున్నాయి. మారుతీ దర్శకత్వం ప్రారంభ దృశ్యాల్లో అలసటని, బద్దకాన్ని వెల్లడిస్తాయి. ఈ దృశ్యాలు చివరి షెడ్యూల్లో చిత్రీకరించి వుంటే  హుషారుగా వచ్చేవేమో! 

చివరికేమిటి 
        కామెడీ కూడా నీతి చెప్పాల్సిన అవసరం లేదు. చెబితే పాత వాసనేస్తుంది. ‘భలేభలే మగాడివోయ్’ హిట్ కామెడీ నీతి చెప్పకుండా జాయ్ రైడ్ గా ఎప్పటికీ అలరిస్తుంది. ప్రస్తుతం మారుతి మనిషి ప్రకృతితో కలిసి వుండాలని ఓ పాత్రచేత కూడా చెప్పి ముగించారు. జడ్జి మెంటు ఇవ్వని కామెడీ స్వేచ్ఛగా వుంటుంది. కామెడీని స్వేచ్ఛగా కాసేపు నవ్వుకోవడానికి వదిలెయ్యాలి. ముగింపు ఇచ్చారంటే కూడా అది నవ్వొచ్చేలా వుంటే  ఎక్కువకాలం గుర్తుంటుంది. 

           మారుతి  ‘భభమ’ లాంటి ఫార్ములాని రిపీట్ చేశారు గానీ, అది అంతగా ఎలా వర్కౌట్ అయ్యిందో గమనించినట్టు లేదు. రెండు కథలూ ఒక చట్రంలోనే  వుంటాయి. ప్రేమికుడు- ప్రేమిక- ప్రేమిక తండ్రి అనే చట్రం. అయితే అక్కడ ముగ్గురి మధ్య పూర్తి స్థాయి రో మాంటిక్ కామెడీగా వుంది, ప్రస్తుత ప్రయత్నం డ్రామాగా మారింది. డ్రామాగా మారినప్పుడే నీతి  చెప్పాలనిపిస్తుంది. అందులో హీరోయే కథ, కథే హీరో. స్ట్రక్చర్ ని ఎగేసి పది నిమిషాలకో సారి కథలో నాని క్రేజీ పాత్ర బ్యాంగు లిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. శర్వానంద్ తో ఇదే రిపీట్ చేసివుండాల్సింది. అయితే అప్పట్లో ‘భభమ’ రివ్యూలోనే రాశాం- మళ్ళీ మారుతి వల్లకూడా ఇది సాధ్యం కాకపోవచ్చని. 

          సినిమా ప్రారంభం ట్రెండ్ కి దూరంగా చాలా నిదానంగా పాత పద్దతిలో వుంటుంది. ఇక ప్రేక్షకులు ఇదివరకు చూడని కొత్త పాయింటుకి కనెక్ట్  చేయడానికి శర్వానంద్ తో అతిపరిశుభ్రత దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూపోయారు. దీనివల్ల ఒక  ప్రమాదం తప్పింది. హీరోకి ఈ సమస్య లేకపోతే ఈ కామెడీ సీన్లన్నీ హీరోయిన్ వెంట హీరోయిన్ ప్రేమ కోసంగా టెంప్లెట్ లో పడి తేలిపోయేవి. అపరిశుభ్రతతో హీరోకున్న ఎలర్జీయే ప్రేమలో సమస్య పుట్టిస్తుందని ఎవరైనా వూహిస్తారు. అయితే కేవలం ఈ ఎలర్జీకే హీరోయిన్ ఎదురుతిరిగితే కథ  బలంగా వుండదు. ఎలర్జీతో వచ్చే అరిష్టాలు చూపించినప్పుడే కథ  రసకందాయంలో పడుతుంది. అస్వస్థత పాలైన  హీరోయిన్ తండ్రిని వదిలి పారిపోయేంత రేంజిలో అతడి ఎలర్జీ వుంటే అది తిరుగులేని బ్యాంగే  కథకి. పైగా ఆ తండ్రి రక్తమంతా తన వొంటికి అంటుకోవడాన్ని మించిన పరాకాష్ఠ ఏముంటుంది ఎలర్జీకి? అదే సమయంలో అది అతడి మిర్రర్ ఇమేజి. ఎవరో అన్నాడు, ఇంటర్వెల్ కొచ్చేటప్పటికల్లా ప్రధాన పాత్రకి తన నమ్మకాలు వమ్ము అయ్యే వ్యతిరేక చిత్ర పటం కళ్ళెదుట కట్టాలని. దేన్నుంచైతే తప్పించుకుంటున్నాడో అదే తనలో కలుపుకుని దర్శన మివ్వాలని. అపరిశుభ్రతని ఎవగించుకునే శర్వానంద్ పాత్రకి ఎదుటి మనిషి రక్తమంతా ముంచెయ్యడం ఇలాంటి కనువిప్పే. 

          దీని  తర్వాత సెకండాఫ్ లో వాతావరణాన్ని మళ్ళీ తేలికబర్చి పల్లెటూరికి తీసికెళ్ళారు. అక్కడి మనుషులు, పద్ధతులు అతణ్ణి మరింత కంపరం పుట్టించే హాస్య దృశ్యాలతో నింపారు. ఇక్కడే మొనాటనీ ఏర్పడింది. సినిమా ప్రారంభం నుంచి చూస్తున్నవే ఇవన్నీ. కాకపోతే ప్రారంభంలో దేన్నైతే అస్యహించుకున్నాడో, ఇప్పుడు  అందులోనే మునిగి తేలడం- అతడి భాషలో అపరిశుభ్రతలో. కానీ ప్రకృతికి దగ్గరవుతున్నాడు, పాత్రకి కావాల్సిందిదే.  ఇది చెప్పడానికి ఏవైతే దృశ్యాలు వేస్తూపోయారో వాటిలో బాగా పేలిన చెరువు సీను, అన్నం సీను సరిపోతాయి. మిగిలినవి రిపీటిషన్ బారిన పడి- కథలో దమ్ము లేదన్నట్టుగా చేశాయి చాలా సేపు. ఒక చిన్న పాయింటుని రెండు గంటల పైగా సినిమాగా నిలబెట్టడమనే వ్యూహం చెల్లుబాటు కాలేదు.  క్లయిమాక్స్ కొచ్చాకే కుస్తీ పోటీల వల్ల ఆసక్తి ఏర్పడింది. అయితే కుస్తీ పోటీలూ, గెలిచిన వాళ్ళు సర్పంచ్ అవడం పాత  ఫార్ములా క్లయిమాక్సే. ఇందులో హీరో ఎమోషన్, మెలోడ్రామా కామెడీ జానర్ కి వ్యతిరేకమే. 

          ఎలర్జీని ఒసిడి అనడాన్ని, కామెడీని డ్రామా చేయడాన్ని, కామెడీతో నీతి చెప్పడాన్ని ఓర్చుకోగలిగితే  శర్వానంద్ – మారుతీలు మరీ బోరు కొట్టించరు ఈ  ‘మహానుభావుడు’ తో.

-సికిందర్ https://www.cinemabazaar.in