రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, అక్టోబర్ 2017, ఆదివారం

524 : స్క్రీన్ ప్లే టిప్




    ఈ వారం ‘స్పైడర్’,  ‘మహానుభావుడు’ రెండూ రెండు  నీతులు చెబుతూ వచ్చాయి. నీతి చెప్పాల్సిందే, లేకపోతే సమాజం చెడిపోతుందనికంగారుపుట్టినప్పుడు ఆ నీతిని ఎలా చెబితే ప్రభావశీలంగా వుంటుంది?  ఇదొకసారి పరిశీలిద్దాం. ‘మహానుభావుడు’ లో పరిసరాలపట్ల ఎలర్జీ వున్న హీరో తిరిగి ఆ పరిసరాల్లోనే - ప్రకృతిలోనే కలిసిపోయి పునీతుడవుతాడు. జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం హీరో పాత్ర ప్రయాణం కనువిప్పుతో మోక్షం పొందడం వైపే కొనసాగుతుంది. తప్పుని సరిదిద్దుకుని ఒప్పుని అంగీకరించే దిశకే వుంటుంది. ఈ రీత్యా ‘మహానుభావుడు’ హీరో అక్షరాలా మట్టిని మొహం మీద కొట్టుకుని తప్పుని ఒప్పుకున్నాడు. రోమాంటిక్ కామెడీని రోమాంటిక్ డ్రామాగా మార్చేశాక, ఇలా ఒక నీతిని చెప్పి పాతని రుచి చూపించినట్టయింది వేరే సంగతి.


          అయితే ఈ నీతి చెప్పడం పట్ల కూడా వున్న నిబద్ధత, చెప్పాలనుకుంటున్న పాయింటుని స్పష్టంగా, విజువల్ యాక్షన్ తో కలిపి చూపించిన పధ్ధతి ‘స్పైడర్’ లో లోపించడాన్ని గమనించవచ్చు.  ‘స్పైడర్’ లో మానవత్వం, సహాయగుణం తగ్గిపోవడం పట్ల అభ్యంతరం చెప్పారు.  ఐతే చిన్నప్పట్నుంచీ హత్యలు చేస్తున్న సైకోని పట్టుకోలేకపోవ డమనే అసమర్ధత ఇలా మెసేజి లివ్వడానికి అడ్డుపడలేదు కాబోలు. ఇదికూడా అలా  వుంచుదాం. అలా మానవత్వం, సహాయగుణం లేకుండా ప్రవర్తించే పాత్రల్ని చూపించకుండానే ఫిర్యాదులు  చేశారు. ఆఖరికి  హాస్పిటల్ కూలినా, బండ దొర్లి వస్తున్నా, సహాయానికి రాని మనుషులెవర్నీ చూపించకుండానే ఫిర్యాదులు, అభ్యంతరాలూ  వ్యక్తం చేశారు. మనుషులు మానవత్వంతో, సహాయ గుణంతో వుండాలని హీరో తనని తానే  చూపించుకుని చెప్పుకున్నాడు. మనుషుల్లో ఈ రెండు గుణాలు తగ్గిపోవడానికి ఆన్ లైన్లో రకరకాల స్క్రీన్ లకి అంకితమైపోవడం కారణమన్నాడు. ఇలా మాటలు చెప్పడం పాసివ్ ఉదాహరణల్ని ఉటంకించడమే. దీంతో సినిమాకి పెరిగే బలం ఏమీ లేదు. ప్రేక్షకులూ  స్పందించడానికి ఏమీ వుండదు. 

          ‘మహానుభావుడు’ లో చూపించింది ఎలర్జీ, దాంతో  విజువల్ గా యాక్టివ్ ఉదాహరణలు. చివరికి హీరో ప్రకృతిలో  కలవడం కూడా యాక్టివ్ గా వున్న విజువల్ ఎగ్జాంపులే. ఇలాగే ‘స్పైడర్’ లో ఇప్పుడున్న పోకడల్ని దృష్టిలో పెట్టుకుని - బండ దొర్లుతున్నప్పుడు, హాస్పిటల్ కూలుతున్నప్పుడూ మనుషులు ఎగబడి వీడియోలూ సెల్ఫీలూ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తునట్టు చూపించివుంటే, అది యాక్టివ్ విజువల్ ఎగ్జాంపుల్ అయ్యేది, చెప్పే నీతి బలంగా చొచ్చుకెళ్లేది. రోజూ ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలప్పుడు చూస్తూనే వుంటాం ఛానెళ్ళ ప్రసారాల్లో -  దారిన పోతున్న వాళ్ళు సాయపడకపోగా ఫోటోలూ  వీడియోలూ తీసుకుని వెళ్ళిపోవడం. అది గొప్పని ఫీలవడం. సోషల్ మీడియాలో లైకులకోసం, వైరల్ అవడం కోసం పోస్టులు  చేసుకోవడం. ఏనాడో ఐన్ స్టీన్ భయపడింది నిజం చేస్తున్నారు. టెక్నాలజీ మనుషుల మధ్య ముఖాముఖీ స్పర్శని డామినేట్ చేసినప్పుడు మనుషులు ఈడియెట్స్ లా తయారవుతారేమోనని తనకి భయంగా వుందన్నాడు ఐన్ స్టీన్!

          అసలు ఒక నీతికి సంబంధించి మనుషులు ఎప్పుడేం చేస్తున్నారో చూసి, దాన్ని డ్రమటైజ్ చేసినప్పుడు కదా నీతి బలంగా నాటుకునేది. మరొకటేమిటంటే, ఆ బండ దొర్లడానికీ, హాస్పిటల్ కుప్ప కూలడానికీ పూర్తిగా సైకోతో హీరో ఆశక్తతే  కారణం. ఇంకా చెప్పుకుంటే చాలా లోపాలున్నాయి మొత్తం సెటప్ లో. మెసేజి ఇవ్వడానికే ఇంత గందరగోళం వుంటే, మనుషులు సాయపడడానికీ ఇంకా గందరగోళానికి లోనైపోతారు. ఆ సినిమాలో చూపించినట్టు ఇది ఫలానా వాడి అశక్తతతకి ఎగ్జాంపులేమో,  మనం సాయపడకూడదేమో నని సెల్ఫీలు తీసుకుంటారు.

-సికిందర్ https://www.cinemabazaar.in