రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2017, గురువారం

రిపబ్లిక్ డే స్పెషల్!




వీరుడి మరణ దృశ్యమిది...
    
ద్యం మత్తులో జోగుతున్న ఆ సైనికుడు తుపాకీ ఎత్తి- ‘ఏంటాలోచిస్తున్నావ్? ఈ దెబ్బకి అమరుడై పోవాలనే?’ అన్నాడు వ్యంగ్యంగా. ఆలోచన తన అమరత్వం గురించి కాదన్నాడు తుపాకీ ఎదురుగా గుండె దిటవుతో వున్నతను. తన ఈ విప్లవ జ్వాల భావితరాలకి  స్పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. వెటకారంగా నవ్వాడు సైనికుడు. ‘ఏంటా నవ్వు? కాల్చారా నన్ను పిరికి పందా!  నువ్వు కాల్చి చంపేది నీ ఎదుట నిస్సహాయంగా వున్న మనిషినే – బెదరకు, కానీయ్!’ అరిచాడు గట్టిగా, తాళ్ళతో బంధించి  బందీగా వున్నతను. చావంటే భయం లేని అతణ్ణి చూసి పిచ్చెత్తి పోయిన సైనికుడు తుపాకీ దడదడ లాడించేశాడు క్షణమాలస్యం చెయ్యకుండా.  నిట్ట నిలువునా శరీరాన్ని జల్లెడ చేసేశాయి తొమ్మిది తూటాలూ.  అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. జగత్ప్రసిద్ద విప్లవకారుడతను – ఎర్నెస్టో చేగువేరా!

         
చాలా అరుదుగా విప్లవకారులకి చట్టరీత్యా శిక్షలు పడతాయి. సూపర్ స్టార్ కృష్ణ 1974  లో అల్లూరి సీతారామరాజు చరిత్రని వెండి తెర కెక్కించి నప్పుడు అప్పటి ప్రేక్షకులకి ఎన్ కౌంటర్ అనే పదం తెలిసివుండదు. అలాటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూసి వుండరు. తెలుగు సినిమాకి మొదటి కలర్ కౌబాయ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 ఎంఎం, మొదటి ఆప్టికల్ స్టీరియో సౌండ్...ఇలా ప్రపంచంలో  ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తనే మొదటిసారిగా తెలుగులో అందిస్తూ కొత్త చరిత్రలు రాసుకుంటూ పోయిన డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా కృష్ణని  ఇప్పటి వరకూ కీర్తించడం జరుగుతోంది.  

     అభ్యుదయకరంగా  ఈ వినూత్న సాంకేతిక దృష్టే కాకుండా, ‘అల్లూరి సీతారామ రాజు’ తో కృష్ణ చరిత్రలోంచి అసంకల్పితంగా ఇంకేం శంఖం పూరించారో గ్రహించి గ్రంథస్థం చేయలేదెవరూ. సూపర్ స్టార్ కృష్ణ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాల్లో- తర్వాతి కాలంలో పోలీసులు చేపడుతూ పోయిన, ఇంకా ఇప్పటికీ చేపడుతూ వస్తున్న ‘ఎన్ కౌంటర్’ అనే చర్యని ఆనాడే అల్లూరి చరిత్ర ద్వారా ఎత్తి చూపారని మనం చెప్పుకు తీరాలి.

        సినిమాలో ఈ ఎన్ కౌంటర్ లేదా రాజ్య హింస అనే దుశ్చర్య  స్వాతంత్ర్య పూర్వం తెలుగు ప్రాంతంలో జరిగిందే. కాకపోతే అప్పట్లో బ్రిటిష్ ఏలుబడిలో వుంది. ఆనాడు బ్రిటిషర్లు అల్లూరి సీతారామారాజుతో పాల్పడింది ఎన్ కౌంటరే – కాకపోతే పక్కా బూటకపు ఎన్ కౌంటర్, పచ్చి హత్య. ఆ బ్రిటిష్ అధికారి కనీసం దీనికి ఎన్ కౌంటర్ అనే ముసుగు కూడా వేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,  అల్లూరిని ఎలా హతమార్చాడో కళ్ళకి కట్టారు కృష్ణ.

     సినిమాని సర్వకళా సమ్మేళనమనగానే సరిపోదు. అందులో ప్రజల చైతన్య పరిధిని విస్తృత పర్చే విషయం లేకపోతే ఆ కళలన్నీ వృధాయే. కళే ఒక సాధనం. సృజనాత్మక దృష్టితో కళల్తో  ఏమైనా సాధించవచ్చు. అల్లూరి సీతారామ రాజు చరిత్ర ఫక్తు డ్రై సబ్జెక్టు అనుకుంటూ సినిమా తీయడానికి పదిహేడేళ్ళుగా ఎన్టీఆర్ తాత్సారం చేస్తూంటే, అప్పటికి 34  ఏళ్ల హీరో కృష్ణ, ఆ డ్రై నెస్ ని కాస్తా  భక్తిరస పారవశ్యాలతో సస్యశ్యామలం చేసేశారు!
        అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి దైవత్వాన్ని కూడా ఆపాదించి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి.  విప్లవకారుడి మత దృష్టి రాజకీయ నాయకుడి మత దృష్టిలా విభజించదు, కలుపుకుంటుంది. నాస్తికులైన విప్లవకారులు ఉద్యమాలు నడపడంలో విఫలమైపోతూంటారు. 

    విప్లవకవిత్వంలో భావ కవిత్వ వుండదు. కానీ ఈ సినిమా ఈ రూలునే బ్రేక్ చేసింది. రూల్సు బ్రేక్ చేయాలంటే అసలంటూ రూల్స్ ఏమిటో తెలిసివుండాలి. ఈ సినిమాకి ఏకైక రచయితగా త్రిపురనేని మహారథి స్థాయికి ఇదేం పెద్ద సమస్య కాదు. ఓ వైపు సామాజికంగా అమాయక గిరిజనుల కోసం పోరాడే వీరుడిగా అల్లూరిని చూపిస్తూనే, మరో వైపు కథా శిల్పం చెడకుండా- జానర్ దెబ్బ తినకుండా- అల్లూరిని మహిషాసుర మర్ధిని స్తోత్రం పాడగల పారంగతుడిగానూ చిత్రించడం ఆయనకే చెల్లింది. విప్లవపాత్రలో పురాణ పాత్ర మమేకమన్న మాట. ఇలా మెజారిటీ ప్రజల సెంటిమెంట్సుని దృష్టిలో పెట్టుకునే కళే ఎన్నాళ్ళయినా బ్రతుకుతుందని కూడా రుజువు చేశారు.


      చరిత్ర పుస్తకాలు, డాక్యుమెంట్లు, పోలీసు ఫైళ్ళు, చింతపల్లి - కృష్ణ దేవిపేట అడవులు, అల్లూరి పరిచయస్థులూ ...ఇవన్నీ ఈ తొలి తెలుగు సినిమా స్కోప్ సినిమా కథా రచనలో  తోడ్పడ్డాయి మహారథికి  (ఈ వ్యాసం చదివాక ఫోన్ చేసి, తనని కలిసి వుంటే ఇంకా చాలా సమాచారం అందించే వాణ్ణని అన్నారు మహారథి- కానీ ఏ వారానికా వారం మూడురోజుల్లో ఈ సినిమా వ్యాసాలందించే డెడ్ లైన్ల కారణంగా కొన్నిసార్లు కొందర్ని కలవడం సాధ్యం కాలేదు). “రెండ్రోజుల క్రితం వేసుకున్న చొక్కా ఇమ్మంటేనే ఏడుస్తున్నావ్, 200 ఏళ్ల నుంచీ పరిపాలిస్తున్న తెల్లోడు స్వరాజ్యం ఇమ్మంటే ఇస్తాడ్రా సన్నాసీ?” అన్న డైలాగు మహారథి పేల్చ గల్గారంటే, అది ఆ  ప్రజల మధ్య తిరుగాడితేనే  తప్ప, ఏసీ రూంలో ఎంచక్కా కొలువుదీరి చొక్కా నలక్కుండా కూర్చుంటే రాదు. 


       మన్యం వీరుడు అల్లూరి (1897-1924) . విశాఖ ఏజెన్సీలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టం (1882) ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే చూసి చలించాడు అల్లూరి. ఇక సమస్తం త్యజించి ఆ గిరిజనుల కోసం తెల్లవాడితో ప్రాణాంతక పోరాట బాట పట్టాడు. జీవితం నీ కిచ్చిన పిలుపుని నువ్వు నిరాకరించావంటే, నిన్ను సృష్టించిన శక్తిని నువ్వు అవమానించుకున్నట్టేనని అంటాడు రాబిన్ శర్మ- ‘ది మాంక్ హూ సోల్డ్  హిజ్ ఫెరారీ’ అన్నతన  పాపులర్ పుస్తకంలో. అలా తనకి జీవితం ఇస్తున్న పిలుపు నందుకుని ఆలోచించకుండా ముందుకే సాగి పోయాడు అల్లూరి. చదువు నైన్త్ దగ్గరే ఆగి పోవచ్చు, పాతిక నిండకుండానే అతడి రాజకీయ పరిజ్ఞానం అపారమైనది. తటాలున తుపాకీ పట్టి బరిలోకి  దూకలేదు, ముందుగా కాంగ్రెస్ సభకి హాజరవుతాడు. నేతలు అక్కడ స్థానిక పరిపాలన మన చేతుల్లో వుండాలని ప్రసంగిస్తూంటారు. స్థానిక పాలన కాదు, మొత్తం దేశ పాలనే  మన చేతికి రావాలని యావద్దేశ సంక్షేమాన్నీకాంక్షిస్తాడు అల్లూరి. ఆ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటమెలా సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన  చేస్తానని ప్రేమించిన సీతతో చెప్తాడు. “ ఏ మార్గంలో స్వాతంత్ర్యం లభిస్తుందో, ప్రజాభిప్రాయానికీ, దేశ ప్రగతికీ ప్రయోజనకరమో గ్రహించాలంటే,  ముందుగా దేశ పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలి,  ప్రజా సమస్యల్ని అర్ధం జేసుకోవాలి”  అని చెప్పి దేశాటనకి  వెళ్ళిపోతాడు. 

       తిరిగి వచ్చి, “అజ్ఞానంలో, శోకంలో ఈ జాతి ఎంత భయంకరంగా బతుకుతోందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తం కావాలి. అందుకు విప్లవ మార్గ మొక్కటే శరణ్యం” అని సీతకి చెప్పి మళ్ళీ  సాగిపోతాడు. 

        కాంట్రాక్టర్ల మెడలు వంచి గిరిజనులకి కూలీ డబ్బు లిప్పిస్తాడు. తగాదాలు మీరే పరిష్కరించుకోండి  గానీ పోలీసుల దగ్గరికి వెళ్ళవద్దని జాగ్రత్త చెప్తాడు. కూలీ డబ్బులు కడుపు నిండా తాగడానిక్కాదనీ, మీ భార్యా బిడ్డలు కడుపు నిండా తినడానికనీ చెప్పి తాగుడు మాన్పిస్తాడు.

         గిరిజనుల దాస్య బుద్దిని ఇలా పటాపంచలు చేస్తున్న అతడి నిశబ్ద విప్లవం చూసి ఠారెత్తి పోతారు తెల్లవాడి తొత్తులు. ఇక అతను  చెట్లు నరికి, పోడు  వ్యవసాయం కూడా చేపట్టడంతో రసకందాయంలో పడుతుంది కథ. అప్పటికి గిరిజనుల్లో దైవ సమానుడిగా ఎదిగిన అల్లూరి తనతో బాటు అనుచరులైన ఘంటం దొర, మల్లన్న దొర, అగ్గి దొర తదితరుల్ని దళంగా చేసుకుని,  బ్రిటిష్ పాలకుల మీద ప్రత్యక్ష పోరాటానికి దిగుతాడు. మొదట స్పెషల్ పోలీసుల్ని ఓడించి, చివర్న అస్సాం  రైఫిల్స్ రెజిమెంటుకి చిక్కి, వైజాగ్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ ఎదుట నిలబడతాడు బందీగా  చింతపల్లి అడవుల్లో. అతడి ఇంత దేశభక్తినీ, ప్రజాపోరాటాన్నీ ఏమాత్రం గుర్తించని రూథర్ ఫర్డ్-  కాల్పులకి ఆదేశిస్తాడు. కానీ కాల్చబోతే  సిబ్బందికి చేతులు రావు. అల్లూరిలో ఒక రాముడు, ఒక జీసస్, ఒక అల్లాయే కన్పిస్తూంటారు. ఆఖరికి విప్లవ నినాదాలతో గర్జిస్తూనే తుపాకీ గుళ్ళకి నేలకొరుగుతాడు అల్లూరి సీతారామరాజు.

       ఇది ఓపెన్ మర్డర్. చేగువేరా విషయం వేరు. కనీసం ఆ బొలీవియా అధ్యక్షుడు ప్రపంచ భయంతో చేగువేరా మరణం ఎన్ కౌంటర్ లా కన్పించాలని ఆదేశించాడు. రూథర్ ఫర్డ్ ది  దేని  భయామూ లేని బరితెగింపు. భూమ్మీద న్యాయ వ్యవస్థకి తామే పట్టు గొమ్మలమని చెప్పుకునే బ్రిటిషర్లు ఇలా ఆటవిక న్యాయాన్ని అమలు చేయడం సిగ్గు చేటైన విషయం. దీన్ని ఎత్తి చూపిస్తున్న ఈ మహోజ్వల చిత్రరాజం ప్రయోజనం ఇంతకంటే నెరవేరడం వుండదు. 
         
          ఈ మహాయజ్ఞంలో తెర వెనుక రచయిత మహారథితో బాటు, దర్శకుడు రామచంద్ర రావు, ఆయన హఠాన్మరణంతో  దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు, గీత రచయితలు  సినారె, కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ...అపూర్వ  సేవలందించారు. తెలుగు వీర లేవరా,  వస్తాడు నారాజు వంటి ఆల్ టైం హిట్ పాటల సంగతి  చెప్పుకోనక్కర్లేదు. ‘తెలుగు వీర లేవరా’  పాట రచనకి మహాకవి శ్రీ శ్రీకి  జాతీయ ఉత్తమ గీతం అవార్డు లభించింది. అలాగే సంగీత  దర్శకుడు ఆదినారాయణ రావు రాసిన ‘హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్’ అనే పూర్తి ఇంగ్లీషు పాటకూడా వుంది. తెలుగు సినిమాల్లో ఇంగ్లీషు పాటకూడా ఇదే తొలిసారి. 

      ఇక వస్తాడు నారాజు...’ పాట తర్వాత  సన్నివేశం గురించి చెప్పుకోవాలి. గానకోకిల పి. సుశీల కంఠ స్వరంలో విజయనిర్మల మీద చిత్రీకరించిన ఈ పాట భావాత్మకంగానే కాదు, ఆథ్యాత్మికంగానూ  మనల్ని ఏ లోకాలకో   తీసికెళ్ళి పోతుంది తనవెంట. పాట  పూర్తవుతూండగా, దేశాటన ముగించుకుని కృష్ణ వస్తాడు. వెళ్తున్నప్పుడు కార్తీక  పౌర్ణమి నాటికి  తిరిగి వచ్చి ప్రేమ విషయంలో నిర్ణయం చెప్తానని చెప్పి  వెళ్ళాడు. ఈ నిరీక్షణలోనే ఆ పాట పాడుకుందామె. ఇప్పుడతను వచ్చాక ఈ సీనుని  ఎలా ప్రారంభించాలి? ఇవాళ్టి  డివిడిల ‘రచైత’ పాత్ర అంతరంగంలోకి వెళ్ళకుండా, పాత్రని ఉన్నతీకరించకుండా- ‘నేనొచ్చేశా సీతా!’ అని చైల్డిష్ గా కృష్ణ  చేత పలికించేస్తాడనడంలో ఎలాటి సందేహమూ అక్కర్లేదు. లేదా కాస్త వెనకటి వీడియో టేపు తరం ‘రచైత’ ఐతే – ‘వచ్చావా నాథా!’ అని ప్రేమోన్మాదిలా అరిపించేస్తాడు విజయనిర్మల చేత. మిడిమేలపు ప్రేక్షకులేమో  ఈలలేసి చప్పట్లు కొట్టేస్తారు సూపర్ డైలాగు అనేసి!

          విజయనిర్మల పాత్ర సీతది అంత నేలబారు పాత్రేం  కాదు. ఆమె ప్రేమని ఇచ్చేదే గానీ కోరుకునేది కాదు. అతడి మనసెరిగి మాటాడే స్వభావమామెది. అప్పుడతను అలా తిరిగి ఇంటికి రాగానే చూసి  తన గురించి  సర్వమూ మర్చిపోయి, అతడి సంఘర్షణలో తనూ బేషరతుగా భాగస్వామిని అయిపోతున్నట్టూ, దేశాటనలో అతను పొంది వుంటాడనుకుంటున్న  జ్ఞాన సంపదని వూహించుకుని ఉప్పొంగిపోతూ,  ఒకే మాట అంటుంది- ఒకే మాట మెచ్యూర్డ్ గా చటుక్కున - “దేశమంతా చూశావా?” అని! 

          మతులు పోవాల్సిందే మనుషులకి ఇలా అన్న ఆమెని చూసి.  గ్రేట్ క్యారక్టర్. పాత్ర అంతరంగ మెరిగి, పాత్రోచితంగా ఇంత గొప్ప  డైలాగు సృష్టించిన మహారథి  నిజంగా జీనియస్!


***
       1965  లో రంగ ప్రవేశం చేసిన హీరో కృష్ణకి తొమ్మిదేళ్ళకే  1974 లో వందవ సినిమా ఇది!  ఇవాళ్టి హీరోలు ఇది చూసి కళ్ళు తేలేయాల్సిందే. రెండు ప్రధాన పాత్రల్లో కృష్ణ- విజయనిర్మలతో బాటు, కె జగ్గయ్య రూథర్ ఫర్డ్ గా కన్పిస్తే,  గుమ్మడి వెంకటేశ్వరరావు, ( ఘంటం దొర) ప్రభాకర రెడ్డి, (మల్లన్న దొర),  బాలయ్య (అగ్గి దొర) మన్యం వీరులుగా కన్పిస్తారు. పేకేటి శివరాం, రాజనాల, త్యాగరాజు బ్రిటిష్ అధికారులుగానూ, కల్పిత పాత్రల్లో మోహన్ బాబు, చంద్ర మోహన్, అల్లురామలింగయ్య, కెవి చలం, రాజబాబు, మంజుల జయంతి,  రాజశ్రీ కన్పిస్తే, ఓ ప్రత్యేక పాత్రలో  టి ఎల్ కాంతారావు  దర్శనమిస్తారు. 



       హిందీలో కమల్ అమ్రోహీ ‘పాకీజా’ తీసినప్పుడు వాడిన కెమెరాలూ  లెన్సులూ తెప్పించుకునే ఈ సినిమా స్కోపు యజ్ఞానికి తెరతీశారు కృష్ణ. 19  కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ‘అల్లూరి సీతారామ రాజు’ కి రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు లభించింది. హిందీలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ గా డబ్ అయింది.

-సికిందర్
( ‘సాక్షి’- 2009 ఆగస్టు)







23, జనవరి 2017, సోమవారం




      కలం కోతి  చూసీ చూసీ ఇక ఇలా ఓపెన్ అయిపోవాలనుకుంటోంది - ఈ బ్లాగులో వెలువడే సినిమా రివ్యూలు నెగెటివ్ గా వుంటాయని చెబుతున్న వాళ్ళు ఒక విషయం గ్రహించాలి – ఈ రివ్యూలు నెగెటివే  అయితే,  ఏళ్లతరబడి ప్రతీ ఏటా తొంభైకి 90 శాతమూ పక్కా అట్టర్ ఫ్లాపులు తీసి నిర్మాతల్ని నిండా ముంచేస్తున్న తాము పాజిటివా? ఎందుకుంటున్నారు ఫీల్డులో? ఆ  ముంచడంలో కూడా రకరకాల వెరైటీలు వున్నాయి- మిడి మిడి జ్ఞానంతో బడ్జెట్లు కూడా పెంచేసి సినిమాలు తీయడం (ఎంజాయ్ చేయడం),  నిర్మాతకి తెలీకుండా నొక్కేస్తూ సినిమా ఏమైపోయినా  ఫర్వా లేదు -ముందు  ఆర్ధికంగా తాము సెటిలై పోతే చాలనుకోవడం లాంటివెన్నో. ఇవి పాజిటివ్ లక్షణాలా? ఈ సినిమాలు చూసి నాల్గు డబ్బులు జేబులో వేసుకుని ‘పాజిటివ్’ గా రివ్యూలు రాస్తే ఓకేనా? ఈ బ్లాగులో రివ్యూలు నెగెటివ్ గానూ వుండవు, పాజిటివ్ గానూ వుండవు- తటస్థి వైఖరితో ‘నిర్మాణాత్మకంగా’ మాత్రమే వుంటాయి. ‘నిర్మాణాత్మక విమర్శ’ అని ఒకటుంటుందని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. నిర్మాణాత్మక విమర్శ బెటర్ మెంట్ కోసమే వుంటుంది. బెటర్ మెంట్ కోసమే శాస్త్రమో, ఇతర సినిమాలో ఇంకేవో, ఎక్కడ్నించో సమాచారాన్ని వెతికి పట్టుకొచ్చి  రివ్యూలు రాస్తే,  అది నెగెటివ్ అనుకోవడం అజ్ఞానాల్లో కెల్లా అజ్ఞానం.  విజ్ఞానాన్ని ఖండించే వాళ్ళు ఇక నేర్చుకునేదేమీ వుండదు, 90 శాతం మంది నిర్మాతల డబ్బుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. ఈ బ్లాగు సినిమాలకి వ్యతిరేకమే అయితే, గత పదిహేనేళ్ళుగా తమ కథలతో ఈ బ్లాగు రచయితని ఎందుకు సంప్రదిస్తున్నారన్న ప్రశ్న వొకటి వస్తోంది. ఎందుకు ఇంతమంది అసోషియేట్లు, కుర్ర అసిస్టెంట్లూ ఈ బ్లాగు పాఠకులుగా పెరుగుతున్నారన్న మరో ప్రశ్న వస్తోంది.  ప్రతీ రోజూ బ్లాగులో వ్యాసం రాయకపోతే ఎందుకు పదే పదే  క్లిక్ చేసి చూసుకుంటున్నారన్న ఇంకో  ప్రశ్నా వస్తోంది. ఇంకా పది  పన్నెండు దేశ విదేశాల నుంచి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నసందేహమూ వస్తోంది....
-సికిందర్




21, జనవరి 2017, శనివారం



 సంక్రాంతికి  విడుదలైన ‘శతమానం భవతి’  ఫ్యామిలీ డ్రామా ప్రారంభంలోనే  బయటపడుతున్న  ఒక రహస్యాన్ని గుర్తించ గల్గితే  ఇలాటి కుటుంబ కథల్లో గొప్ప ముందడుగునీ,  ఒక వేళ ఆ రహస్యాన్ని గుర్తించినా పట్టుదలకి పోతే  అంతే గొప్ప ఆశాభంగాల్నీ పొందాల్సి రావొచ్చు భవిష్యత్తులో! టీవీ సీరియల్స్ మొదలైన కొన్నేళ్ళ వరకూ కుటుంబ కథలతో సినిమాలు తీయాలంటే జంకే వాళ్ళు. తర్వాత ఫ్యాక్షన్ సినిమాల్లో  కుటుంబ కథల్ని కలిపి కొన్నాళ్ళు  కాలక్షేపం చేశారు. ఈ నరుక్కునే రాక్షసుల కుటుంబ కథలు కూడా ముగిశాక, కుటుంబ కథలకి దూరంగా యాక్షన్ సినిమాలకీ, యాక్షన్ కామెడీలకీ  వెళ్ళిపోయారు. మళ్ళీ కుటుంబ కథ టీవీ సీరియల్స్ నీ, ఫ్యాక్షన్ సినిమాల్నీ బీట్ చేసే మార్గాన్ని ఎంచుకుని, కుటుంబ కథలకి పాత సంసారాల వాసనల్నీ, పెల్లుబికిన హింసాప్రవృత్తినీ వదిలిస్తూ, ‘మనం’ రూపంలో నూతన శకపు క్రియేటివ్ – ఇన్నోవేటివ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చేసి ఆబాలగోపాలాన్నీ అలరించింది అనూహ్యంగా. కుటుంబ కథలకి పాత సంసారమో, విపరీత హింసో అనే  నిర్వచనాన్ని తిరగ రాసింది. ఈ పూర్వరంగంలో  ఇప్పుడు తగుదునమ్మా అని  ‘శతమానం భవతి’ వచ్చేసి మళ్ళీ వెనక్కి- చాలా వెనక్కి - ముగిసిపోయిన పాత శకంలోకి లాక్కెళ్తోంది. కానీ యూ ట్యూబ్ లో చూస్తే ఎప్పట్నించో తెలుగు వంటకాలకి పాత పోకడలు వదిలిపోయాయ్. పూర్వీకులనుంచి సాంప్రదాయంగా వస్తున్న గోంగూర పప్పు, పాలకూర పప్పు, పాలకూర వేపుడు, చుక్క కూర టమాటా లాంటి ఏకాకు కూరస్వామ్యంతో విసిగి, రెండు మూడు రకాల ఆకు కూరల్ని కూడా కలిపి  జానర్  మిక్సింగ్  చేసి ట్రెండీగా వండి చూపించేస్తున్నారు. ఆకు కూరల్నెప్పుడూ  ఒకే ఆకుకూరగా  వండాలన్న రూలుని  బ్రేక్  చేసిన  ఈ తరం ఆడవాళ్ళు- కోడళ్ళూ    వంటల్లో ఇంత ట్రెండీగా ముందడుగు వేస్తూంటే, నేటి యువ సినిమా రచయితలేమో  అదే  పాత రోట్లో అదే  పాత చింతకాయ పచ్చడి చెమట్లు  కక్కుకుంటూ నూరుకుంటూ, 21వ శతాబ్దపు  న్యూ ఏజ్ లేడీస్ కి ఫ్యామిలీ సినిమాలంటూ వడ్డించాలని ఉబలాట పడుతున్నారు.  పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలీని  అమాయక పసి బాలలు కదా!

            క్కటి గ్రహించడం లేదు, ఇవాళ్టి రోజున ఫ్యామిలీ సినిమాల పేరుతో తీస్తున్నవి ఓ నలభై  ఏళ్ల క్రితం వరకూ ఏర్పడిన ఒక నమూనాని అనుసరించేనని. ఆ కాలానికి అప్పుడు స్థిర పడిన నమూనానే అని. అప్పటి కాలం ఏమిటి? 1970-80 ల వరకూ కూడా భూస్వామ్య వ్యవస్థా,  దాన్నాశ్రయించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థా  కొనసాగుతున్నప్పుడు ఆ నేపధ్యంలోంచి అలాటి కథలు వచ్చేవి. అప్పుడున్న అవసరాన్నిబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడే విలువలతో- కలిసి జీవించడంలో వుండే ఆనందాలు, అనుబంధాలు, ఆత్మీయతలూ ఆకూపోకలతో  కూడిన సినిమాలు వచ్చేవి. 1940- 50 లలో మొదలు పెట్టి  ‘ఇల్లాలు’, ‘తోడి కోడళ్ళు’ లాంటి కుటుంబ సినిమాలు,  1970- 80 లలో ‘పండంటి కాపురం’, ‘ఆదిదంపతులు’ వరకూ కొనసాగి కొన్ని వందలు వచ్చాయి. 

          కానీ ఎనభైల తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతూ వచ్చింది. కారణాలనేకం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, విద్యా ఉద్యోగావకాశాలు, స్త్రీవిద్య, పాశ్చాత్యీకరణ, వివాహ వ్యవస్థలో మార్పులు, అధిక జనాభా; వ్యవసాయ రంగం,  కుటీర పరిశ్రమల రంగం క్షీణించడం, సమాచార రవాణా వ్యవస్థలు మెరుగవడం, ఇరుకు నివాసాలు, కుటుంబ కలహాలతో పాటూ - హిందూ వారసత్వ, స్త్రీ ఆస్తి హక్కు, వివాహ, ప్రత్యేక వివాహ, వరకట్న నిరోధక చట్టాల సవరణల నేపధ్యంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చరిత్ర పరిసమాప్తమయ్యిందని సామాజిక వేత్తలు విశ్లేషించారు.  

          దీంతో  ఇక ’90 లలో కొంతకాలం కుటుంబ సినిమాలు ‘రౌడీ అల్లుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘కలెక్టర్ గారి అల్లుడు’ లాంటి ఫక్తు ఎంటర్ టైనర్స్ గా మారిపోయాయి. కానీ అంతరించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాధని మరిపించడానికా అన్నట్టు- 1994 లో హిందీలో ‘హమ్  ఆప్ కే  హై కౌన్’ మరిన్ని వెలుగుజిలుగులతో, వంటకాల ఆరగింపులూ త్రేన్పులతో, ఆడీపాడే  వ్యాయామాలతో,  మార్వాడీ కల్చర్ నేసుకుని అట్టహాసంగా రావడంతో,  దాన్ని అనుసరించి 1996 లో తెలుగులో ‘నిన్నే పెళ్ళడతా’,  ‘పెళ్లి సందడి’ వచ్చాయి.  అక్కడ్నించీ మొదలయ్యింది  గుంపుగా ఆభరణాల ధగధగలతో, పట్టు  చీరెల ఫెళపెళలతో, అనవసరంగా పడీ పడీ నవ్వుతూ, వొయ్యారాలుపోతూ, ఎడాపెడా ఆటాపాటలతో,  వ్యాపార యుగపు వెండితెరని ఆడవాళ్ళ (పాత్రల) తో నింపెయ్యడం. వీటిలో కథ హీరో హీరోయిన్ల పెళ్లి జరిపించడమే
.

అయినా ఉమ్మడి బడిలోనే 
     ఇదే సమయంలో 1991 లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితాలు 2000  నాటికి కనిపించ సాగాయి. యువతరం చదువులు, వృత్తి ప్రాథమ్యాలూ సమూలంగా మారిపోయి విదేశాల బాట పట్టడం ప్రారంభమయ్యింది.  ఈ చారిత్రిక  మూల మలుపులో గమనించాల్సిన ముఖ్యాంశమిటంటే- కుటుంబ సంబంధాలు పరోక్ష సంబంధాలుగా మారిపోయే క్రమం మొదలయ్యింది. కానీ రెండు దశాబ్దాలు వెనక్కెళ్ళి చూస్తే, ఎనభైల తర్వాత ఎలాగైతే ఉమ్మడి కుటుంబాల ఉపసంహార నేపధ్యంలో, న్యూక్లియర్ కుటుంబాల  ఏర్పాటు క్రమం మొదలయ్యిందో,  అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోని కొడుకులు, కూతుళ్ళు తల్లిదండ్రుల్ని వదిలి వేరే పట్టణాల్లో కాపురాలు పెట్టడమనే ట్రెండ్ మొదలయ్యింది న్యూక్లియర్ కుటుంబాలు అని  నామకరణం చేసుకుని. ఉమ్మడి కుటుంబాలు పైన మూడో పేరాలో వివరించుకున్న కారణాలతో చిన్న చిన్న (న్యూక్లియర్) కుటుంబాలుగా విడిపోయినా,  కనీసం ఆ కొడుకులు  కూతుళ్ళూ రాష్ట్రంలోనే, దేశంలోనే ఏదో ఒక పట్టణంలో వున్నార్లే అన్న తృప్తి వుండేది కన్నవాళ్ళకి. రాకపోకలు, ఇచ్చి పుచ్చుకోవడాలు అలాగే కొనసాగేవి. విచిత్రమేమిటంటే,  ఈ న్యూక్లియర్ కుటుంబాలతో దూరంగా వెళ్ళిన వాళ్ళే ఇబ్బందులు, బాధలూ  పడేవారు. దీని మీద ఇతర భాషల్లో సినిమాలు కూడా వచ్చేవి. తెలుగు సినిమాలు మాత్రం ఈ ముఖ్య దశని  రికార్డు చేయలేకపోయాయి. అవెంత సేపూ ‘హమ్ ఆప్ కే  హై కౌన్’ ని పట్టుకుని లేని సమూహిక సంబరాలే చిత్రించుకున్నాయి. టీవీ సీరియళ్ళ విజృంభణతో ఈ తరహా సామూహిక సంబరాల కథలు కూడా ఖతం అయ్యాయి.  దీంతో యాక్షన్ జోడించి ఫ్యాక్షన్ కుటుంబాల కథలు మొదలయ్యాయి. 

          కానీ ఇప్పటికి గ్లోబలైజేషన్ ఊపందుకుని, ఉమ్మడి  కుటుంబాల ఊసూ ఉనికీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయి, న్యూక్లియర్ కుటుంబాలే ఆధునిక కుటుంబ వ్యవస్థకి గుర్తులుగా మారాయి. ఇప్పుడు ఇవే న్యూక్లియర్ కుటుంబాల నుంచి విదేశాలకి యువత వలసలు మొదలయ్యాయి. ఇక్కడొచ్చింది సమస్య. ఆనాడు ఉమ్మడి కుటుంబాల నుంచి తాము విడిపోతే ఆ తరం పెద్దలు ఎంత బాధ పడ్డారో, ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాల నుంచి తమ పిల్లలూ  విడిపోతూంటే ఈ తరం పెద్దలకి  అలాటి బాధే  మొదలయ్యింది. అయితే ఉమ్మడి కుటుంబ పెద్దలకి ఎదురవని తీవ్ర  కష్టాలు న్యూక్లియర్ కుటుంబ పెద్దలకి ఎదురవసాగాయి. పలకరించే నాథుడు లేక వాళ్ళు వృద్ధాశ్రమాల పాలవసాగారు. కొందర్ని వాళ్ళ  పిల్లలే వదిలించుకుని వెళ్ళిపోయారు. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు ఓ 
వృద్ధాశ్రమంలో  తన కెదురైన దిగ్భ్రాంతికర అనుభవాన్ని చెప్పుకొచ్చారు.  ఇప్పుడే వస్తానని వృద్ధాశ్రమం బయట వదిలి విదేశాలకి వెళ్ళిపోయిన కొడుకు కోసం, ప్రతిరోజూ ఆ వృద్ధురాలు బయట నిలబడి ఎదురు చూసేదట అదే సూటుకేసు పట్టుకుని ...

          ఈ వ్యాసకర్తకి బాగా తెలిసిన విద్యాధికుడు, వ్యాపార వేత్తా, సంపన్నుడూ అయిన ఒకరు ఎనిమిది పదుల వయసులో, హృద్రోగంతో వున్నా, నగరంలో అందరూ వుండీ 
వృద్ధాశ్రమం  పాలయ్యారు. హైదరాబాద్ లో ఒకప్పుడు లేని అనాధాశ్రమాలు ఇప్పుడు నాల్గు వందలకి పైగా పెరిగాయి. కొడుకులు నగరంలోనే వుంటున్నా అనేక మంది తల్లి దండ్రులు వృద్ధాశ్రమాల్లో వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధాశ్రమాలు  పెద్ద ఇండస్ట్రీ గా ఎదిగాయి.  

          ఇంకో కుటుంబంలో రెండేళ్ళ క్రితం నగలమ్మి కొడుకుని విదేశం  పంపిస్తే నాల్గు నెలలు డబ్బు పంపి, ఐదో నెలలో తగ్గించాడు. ఆరో నెలలో పంపించనా? అన్నాడు. నీ ఇష్టముంటే పంపమన్నారు. పంపడం మానేశాడు. ఇలాటి కేసులు కొన్ని ఎప్పుడూ వుంటాయి. చాలా వరకూ సంబంధాలు  బాగానే వుంటున్నాయి – సెల్, స్కైపుల వంటివి కల్పించే  పరోక్ష సంబంధాలతో. ఇక  ఏడాది కోసారైనా రాకపోకలు కూడా వుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలప్పటి  పెద్దల మైండ్ సెట్ ఇప్పటి న్యూక్లియర్ కుటుంబ పెద్దలకి అంతగా లేదు. పరిణామాలని వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. 

          కానీ ఈ పరిణామాల్లోంచి సినిమాలకి కథలవసరం. దీన్ని ఇంకోలా మార్చి, రోమాంటిక్ యాంగిల్లో మేనరికాల కథలుగా తీర్చి దిద్ది, పాతికేళ్ళ క్రితమో  ముప్పై ఏళ్ల క్రితమో తెగిపోయిన  బంధుత్వాల్ని అతికించే ఎన్నారై కథాకళులు మొదలయ్యాయి. ఒకే దర్శకుడు ‘అత్తారింటికి దారేది’ తీసి,  వెంటనే  ‘సన్నాఫ్ సత్య మూర్తి’ తీశాడు. ఆతర్వాత ‘అ ఆ’ కూడా! ఇక ‘చిన్నదానా నీకోసం’, ‘పండగ చేస్కో’ ఇదే దారిపట్టాయి...

కాలం చెప్పని కథలు
       ఈ మేనరికాల కథలు రిపీట్ అవుతున్నాయని కావొచ్చు, ఇద్దరు స్నేహితుల కుటుంబాల్ని కలిపే ‘ఆటాడుకుందాం రా’ అంటూ వచ్చాయి. మరోవైపు రెండు కుటుంబాల కథల నుంచీ జరిగి ఒకే కుటుంబంలో దూరమయ్యే కొడుకుల కథలతో ఇప్పటికి ‘శతమానం భవతి’ దగ్గర కొచ్చి ఆగాయి.   ఈ ట్రెండ్ లో గత ఏడెనిమిది నెలల  కాలంలో ఇలాటి ఓ మూడు స్క్రిప్టులు ఈ వ్యాసకర్త దగ్గరికి వచ్చాయి. కలిసుందాం, కలిసుందాం, కలుపుకుందామని నినదిస్తూ వున్న ఈ కథల మూలాలెక్కడున్నాయని రీసెర్చి చేసుకొస్తే,  బయటపడినవే పై పేరాల్లో చెప్పుకున్న కుటుంబ, సామాజిక పరమైన పరిణామాలతో కూడిన  అంశాలు. ఉమ్మడి కుటుంబాల పైన, న్యూక్లియర్ కుటుంబాల పైనా  ఐపీ దేశాయ్, బిపి అగర్వాలా, మిల్టన్ సింగర్, హెచ్ లక్ష్మీ నారాయణ్ ల వంటి సామాజిక వేత్తలు చేసిన పరిశోధనలు. 

          పరిశోధనలు ఇలా వుంటే, ఇప్పటి సమస్య న్యూక్లియర్ కుటుంబాల సమస్యే  అయితే, ఈ కథలు ఇంకా ఉమ్మడి కుటుంబాలనే పట్టుకుని వున్నాయి అవే వాసనలతో. ఉమ్మడి కుటుంబాలప్పటికీ ఇప్పటికీ భావోద్వేగాలు ఒకటే కావొచ్చు. భావోద్వేగాలెప్పుడూ ఒకటే- బాహ్య పరిస్థితులే మారతాయి. కాలీన స్పృహ లేని బాహ్య పరిస్థితుల కల్పన భావోద్వేగాల నుంచి వేర్పడిపోతుంది. ఏ కాలానికి అప్పటి పరిస్థితుల కల్పనే జరగాలి. ఎంత ఊహా కల్పనైనా వాస్తవాల పునాదుల మీద జవాబుదారీ గా నిలబడాల్సిందే తప్ప, పలాయన వాదం పనికి రాదు. ఇదంతా నేటి సీదా సాదా కమర్షియల్ సినిమాల గురించే- భారీ కళాఖండాల గురించి కాదు. చెప్పుకోవాలంటే బాధపడాల్సివస్తున్న  నేటి యువ సినిమా రచయితలు,  తామే అనుభవించని జాయింట్ ఫ్యామిలీల ముచ్చట్లు అంతగా తీర్చుకోవాలని వుంటే – ‘1979 – ఓ ఉమ్మడి కుటుంబం కథ’ అని కథని ఆ కాలంలో స్థాపించుకుని రాసుకోవచ్చు. ఇప్పుడు ముంబాయిలో మఫియాలే  లేకపోయాక,  ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి’  అని మాఫియాల కాలంలోనే  కథని స్థాపించి తీశారు. అదే ఇప్పుడింకా మఫియాలున్నట్టుతీస్తే, ముందు రాం గోపాల్ వర్మకే  జీవితం మీద విరక్తి పుట్టి ఎటో వెళ్ళిపోయే అవకాశముంది.

అదే వరస                                                           
      న్యూక్లియర్ కుటుంబాల నుంచి దూరమవుతున్న నేటి యువతకి ఎప్పటివో తాము పుట్టి వుండనప్పటి  ఉమ్మడి కుటుంబాల్లోని ఆత్మీయతానురాగాలూ,  ఆ సంబంధాలూ, బంధుత్వాలూ తెలీవు. వాళ్ళు  ఫీల్ కారు. మరి ఆ వాతావరణపు  కథలు ఎవరి కోసం? అప్పటి ఉమ్మడి కుటుంబాల్లోని తండ్రులు ఇప్పుడు ముత్తాతలై వుంటారు, వాళ్ళ కోసమా? ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల తండ్రులు  ఇప్పుడు తాతలై వుంటారు,  వీళ్ళ కోసమా? బాక్సాఫీసు అప్పీల్ ఏది? కమర్షియాలిటీ ఏది? తాత ముత్తాతల కథలు చిన్నప్పుడు పడుకునేప్పుడు చిన్న పిల్లలకి చెప్పుకుంటే వాళ్లకి  బావుంటాయి. అదే మీసాలొచ్చాక, చున్నీలేసుకున్నాక కూడా సినిమాలుగా తీసి వెంటాడితే యాక్సిడెంట్లు అవుతాయి బాక్సాఫీసుకి. 

          కుటుంబ కథ అనగానే పైన చెప్పుకున్నట్టు 1980 దగ్గర ఆగిపోయిన ఉమ్మడి కుటుంబ కథలే అన్న వ్యామోహం- ఎటాచ్ మెంట్   పెంచుకున్నారు. ఆనాడు నాల్గు  దశాబ్దాల మన్నికతో ఆ ఉమ్మడి కుటుంబ కథలు తెలియకుండానే కుటుంబ కథలకి ఒక నమూనాగా మనసుల్లో ముద్రేసుకున్నాయి ఇప్పటికీ. ఆ సినిమా కథలే తప్ప, పాత్రలే తప్ప , అవి  ఏ నేపధ్య పరిస్థితుల్లోంచి వచ్చాయీ,  ఆ పరిస్థితులు ఇప్పుడూ వున్నాయా అన్న ఆలోచనే  అక్కర్లేకుండా పోయింది. కాస్త పాపం పుణ్యం ప్రపంచమార్గం తెలీని పసి బాలల స్థితినుంచి, చుట్టూ మారిపోయిన ప్రపంచ, కుటుంబ, ఆర్ధిక సంబంధాల మదింపు చేసుకునే అలవాటు పెంచుకుంటే తప్పకుండా యూత్ అప్పీల్ అవసరమున్న బాక్సాఫీస్ దాహార్తిని తీర్చగల్గుతారు. 

          అయినా సరే మేం రాసుకున్నట్టే ప్రొసీడవుతామనేసరికి, ఆ మూడు స్క్రిప్టుల కథా  ముగిసిపోయింది. ఇప్పుడు ‘శతమానం భవతి’ తర్వాత వాటి భావిష్యత్తేమిటో  చూడాలి.  ఇలాగే ఇంకో ప్యూర్ ఉమ్మడి కుటుంబ కథ- మళ్ళీ  కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబాల్లో కి వచ్చెయ్యాలని (!!)డిమాండ్ చేసే కథ కూడా ఈ వ్యాసకర్తని రాచి రంపాన పెట్టి మాయమైపోయింది. 

          అయిపోలేదు- ‘శతమానం భవతి’ విడుదలైన మర్నాడే, ఇలాటిదే ఇంకో పూర్తి  స్థాయి స్క్రిప్టు  కింకర్తవ్యం కోసం ఈ వ్యాసకర్త దగ్గరికి వచ్చి ఎదురుగా టేబుల్ మీద ఆశీనురాలై వుంది. బట్ - ‘శతమానం భవతి’  మొదటి సీన్లలోంచే తొంగి చూస్తున్న సీక్రెట్ తో ఇప్పటికైనా ఒక నూతన శకపు క్రియేటివ్ –ఇన్నోవేటివ్ – బాక్సాఫీసు ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాకపోతే కాలం క్షమిస్తుందేమో చూడాలి.

ఏమిటా రహస్యం?
        ‘శతమానం భవతి’ విడుదల కాక మునుపు ఆదివారం ఎప్పట్లాగే  వ్యసనాన్ని చంపుకోలేక, మూడు రూపాయలు పెట్టి ఆంగ్ల ఆథ్యాత్మిక పత్రిక ‘స్పీకింగ్ ట్రీ’ కొనుక్కుని చదివాడీ వ్యాసకర్త. అందులో బ్యానర్ ఐటెం గా ములాయం సింగ్ యాదవ్- అఖిలేష్ యాదవ్ తండ్రీ కొడుకుల సిగపట్ల గురించి వుంది. దీని మీద ఓషో రజనీష్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే పూర్తి వ్యాసం వుంది. ఓషో రజనీష్  జీవితాల్లోనే కాదు, సమాజంలో, రాజకీయంలో, ప్రపంచంలో తలెత్తే సమస్యలకి కారణాలూ, వాటి పరిష్కారాలూ అపూర్వంగా చెప్పేసి 59 ఏళ్లకే మరణించాడు. 
         
       ఈ వ్యాసంలో పాత తరానికీ యువతరానికీ జనరేషన్ గ్యాప్ ( తరాల అంతరం) సమస్య ఎప్పట్నించీ మొదలై ఎందుకేర్పడిందో, పరిష్కార మేమిటో వివరించాడు. జనరేషన్ గ్యాప్ తో సమస్యలు కేవలం తండ్రీ కొడుకుల మధ్యే కాదు, అన్నదమ్ముల మధ్య కూడా ఏర్పడతాయి. అన్నకీ, చివరి తమ్ముడికీ పదేళ్ళకి పైన గ్యాప్ వుందంటే, జనరేషన్ గ్యాప్ తో తమ్ముడు అన్నని అవుట్ డేటెడ్ గా లెక్కేసి దూరంగా వుండే అవకాశాలున్నాయి. అలాగే రక్త సంబంధీకుల మధ్యే కాదు, బయట ఇతర అన్ని సంబంధాలలోనూ ఈ సమస్య తలెత్తుతుంది. బాస్ కీ ఉద్యోగికీ మధ్య, గురువుకీ శిష్యుడికీ మధ్య.....ఇలా తరాల అంతరాలతో  తంపులుంటాయి. ఈ సమస్య ఎప్పట్నించీ ఎందుకని మొదలయ్యిందో, అంతకి ముందు ఎందుకు లేదో, దీనికి సముచిత పరిష్కారమేమిటో ఈ లింక్ ని క్లిక్ చేసి http://www.speakingtree.in/article/leadership-tussle  రజనీష్ మాటల్లోనే తెలుసుకుంటే ఒక కొత్త విజన్ ఏర్పడుతుంది. 

          ఇలా కుటుంబ కథలకి ఒక కొత్త కోణం దొరికిందని నోట్ చేసుకుని, ఆ పై శనివారం ‘శతమానం భవతి’ కెళ్తే,  మొదటి మూడు నాల్గు సీన్లలోనే ఆ కోణం ఇక్కడ కనెక్ట్ అయిపోయి- ‘శతమానం భవతి’ లాంటి స్టక్ అయిపోయిన కథల్ని నవీకరించి ముందుకి నడిపించగల రహస్యం తెలిసిపోయింది!

          ఏమిటా రహస్యం? ప్రకాష్ రాజ్ పాత్ర, జయసుధ పాత్రల ఆక్రోశం ఏమిటంటే, పదేళ్లుగా విదేశాల్లో వుంటున్న కొడుకులు తమని పట్టించుకోవడం లేదని. పట్టించుకోరు, ఐతే ఏంటి? రేపా కొడుకుల పిల్లలు (మనవళ్ళు)కూడా ఆ కొడుకుల్ని(వాళ్ళ తండ్రుల్నీ) పట్టించుకోరు, అప్పుడేంటి? ఇంకాపైన ఆ మనవళ్ళ కొడుకులు కూడా ఆ మనవళ్ళని  పట్టించుకోరు, అప్పుడు కూడా ఏంటి? ఇలా వంశంలో తమ తర్వాత తరాలు ఎలాపోయినా ఫరవా లేదు, తామొక్కరే ఇప్పుడు కొడుకుల కోసం ఆక్రోశించి, వాళ్ళని రప్పించుకుని, సాధించి  సుఖపడితే చాలా?  ప్రకాష్ రాజ్, జయసుధల పాత్రలు ఇలా తమ సుఖం మాత్రమే చూసుకుంటూ, స్వార్ధంతో, అజ్ఞానంతో అరిచి గీ పెడితే  పెద్దరికానికి ఓకేనా? 

          ప్రకాష్ రాజ్ పాత్ర ఇప్పుడు ఇరవయ్యేళ్ళ మనవరాలి (హీరోయిన్) కి తాత అంటే, 1990 లలో ఇరవై ఏళ్ల కూతురికి తండ్రి అయి వుండాలి. అంటే 1970 లలో తన పెళ్ళయి వుండాలి. అంటే అదే పల్లెటూళ్లో ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం చూసింతర్వాత, తన కొడుకుల న్యూక్లియర్ కుటుంబాలూ చూసింతర్వాత, ముందు తరాల్లో ఈ న్యూక్లియర్ కుటుంబాలైనా  ఏమౌతయోనన్న ఆందోళన వుండాలి- అది అప్పుడు ఆ వయసుకి, ఆ అనుభవానికి, పాత్రోచిత న్యాయం అవుతుంది. కుటుంబ పెద్ద పాత్రే  ఇలా ఆలోచించకపోతే అదెలాంటి  పాత్ర చిత్రణ అవుతుంది? ఇది చూసిన ప్రేక్షకులకి ఏం ప్రయోజనం దక్కుతుంది? 

          సరే నా కొడుకువల్ల నాకీ పరిస్థితి వచ్చింది, రేపు వాడి కొడుకువల్ల వాడికి కూడా నాలాంటి పరిస్థితి రాకూడదని ఆ కొడుకు శ్రేయస్సు ఆలోచించే  తండ్రి మనసు గొప్పదా, ఆ మేరకు చర్యలు తీసుకుని పాటుపడితే మంచిదా – లేక ఇలా తనవరకే ఏడుస్తూ కూర్చుని, రేపా కొడుకుల న్యూక్లియర్ కుటుంబాలు కూడా ముక్కలై,  మున్ముందు వంశస్థులు వాయిదాల పద్ధతిలో కోన్ కిస్కా లై తిరుగుతూంటే మంచిదా? ఫలానా కుటుంబరావుగారి వంశమేదీ? ఎక్కడ? – అని ఎవరు ఆరాతీయాలి? 

          ఉమ్మడి కుటుంబాలు పోయాక - 'సబ్ కే సాథ్ సబ్ కా వికాస్’ మంత్రం  ఇక్కడ అస్సలు పని చెయ్యదు. ‘ఉస్కే సాథ్ (మనవళ్ళతో) ఉస్కా (కొడుకుల) వికాస్’ కోసం మాత్రమే తను కృషి చేయాల్సి వుంటుంది.

          ఇలాటి కథల్లో హీరో హీరోయిన్లు కూడా తమ తాతతో పదేళ్ళు పోయినా కలవని తల్లిదండ్రుల్ని ఉత్త పుణ్యానికి  తీసి కెళ్ళి కలిపేస్తూంటారు కామెడీలు చేసి. వాళ్ళు పరిహారం చెల్లించుకోనక్కర్లేదా?  ఈ దిశగా హీరో హీరోయిన్ల పాత్ర చిత్రణలున్నప్పుడే కదా కుటుంబ సినిమాలు కూడా యూత్ అప్పీల్ తో బాక్సాఫీసు కడుపు నింపేది.
                                              ***
         ఉమ్మడి  కుటుంబాల నాటి  
పాటల  సాహిత్యం ఇప్పుడు లేదు,  పాటల బాణీలూ ఇప్పుడు లేవు, ఆ డాన్సులూ ఇప్పుడు లేవు, సంభాషణల్లో ఆ పదాలూ ఇప్పుడు లేవు, పాత్రల తీరు తెన్నులూ అప్పట్లా లేవు,  ఫైట్లూ అప్పట్లా లేవు... అన్నీ మారిపోతూ వచ్చాయి...ఇంకా మారిపోతూ వుంటాయి.  రచయిత రాసుకునే అక్షరాలెందుకు మారవు!! మారిస్తే ట్రెండీ కర్రీస్ లేడీస్ వచ్చి కొడతారా?

-సికిందర్ 





17, జనవరి 2017, మంగళవారం


సినిమా కథ రాయడానికి చక్కగా కూర్చుని, కాగితం పై భాగాన రాముడో కృష్ణుడో, ముత్యాలమ్మో మైసమ్మో ఇష్టదైవ నామ స్మరణం చేసుకుని, రాయడం మొదలెట్టినప్పుడు, ఆ స్మరించుకున్న దైవాలు ఎక్కడ్నించో కాదు- ఆ రాసుకున్న కాగితం పై భాగం అక్షరాల్లోంచే తొంగి తొంగి చూస్తూంటారు-  మనోడు ఏం రాస్తున్నాడని కాదు, ఎలా రాస్తున్నాడని. వీణ్ణి ఎలా ఎక్కడ సెట్ చేయవచ్చా అని. ఓం నమఃశ్శివాయ అని శ్రీకారం చుట్టి ఆ దేవుణ్ణి మర్చిపోతే కాదు- దేవుళ్ళకో ప్రోగ్రాం ఇచ్చేశాక వాళ్ళు పని మొదలెట్టేసుకుంటారు. కోటి రూపాయల సినిమాకి వీణ్ణి అడ్జెస్ట్ చేస్తే సరిపోతుందా, చిరంజీవి 151వ రేంజికి  సెట్ చేయాలా అని గమనిస్తూంటారు. కాబట్టి గిల్లుకున్నాక ఈ రాడార్ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేరు. ముందే తాము ఏ తరగతికి చెందుతారో నిర్ణయించుకుని ఆ తర్వాత గిల్లుకుంటే  ఏ ఇలవేల్పులైనా  ఇంప్రెస్ అవుతారు. 

         తరగతులు మూడు-  సెల్ఫ్ స్టార్టర్, కిక్ స్టార్టర్, క్లిక్ స్టార్టర్ అన్నవి. ఏ తరగతికి చెందితే ఆ తరగతికే కట్టుబడి వుండాలి. ఈ తరగతిలోంచి ఆ తరగతి గదిలోకి, ఆ తరగతి లోంచి ఈ తరగతి గదిలోకీ రాకపోకలు సాగిస్తే  అవన్నీ కలిసి ఏ తరగతీ కాకుండా చేస్తాయి.

          ఒక్కో తరగతిని చూద్దాం :
సెల్ఫ్ స్టార్టర్ – దీనికి పెద్దగా రచనా జ్ఞానం అవసరం లేదు. ఈ విధానంలో కథకి ఓ పాయింటు దొరుకుతుంది గానీ, పూర్తి కథ వుండదు. ఎలా చేసుకోవాలో తెలీదు. ఆ పాయింటుని  పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి సీన్లు రాసుకుంటూ పోతూంటే కథ అదేవస్తుంది. అప్పుడప్పుడు పాయింటు ఆగుతూంటే వేరే సీన్లతో భర్తీ చేసుకోవచ్చు. బారెడు  కామెడీ సీన్లో, లవ్ సీన్లో, ఫైట్సో పెట్టుకోవచ్చు. 

     ఏది ఎలా తోస్తే అలా రాసుకుంటూ పోవడమే ఈ సెల్ఫ్ స్టార్టర్ విధానం. చివరి సీనుకి వచ్చేటప్పటికి పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు. అక్కడ కథని తేల్చి చెప్పామా లేదా అన్నదే స్క్రీన్ ప్లే. End justifies the means అనడం లాంటిదన్న మాట. హైదరాబాదు నుంచి ఒక రూటులో బెజవాడ వెళ్లకపోయినా, డొంక దారులు పట్టుకునైనా బెజవాడ ముంగిట వాలామా లేదా  అని దబాయించడం లాంటిదన్న మాట. పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు, ఎలా చేరామన్నది కాదు. ఇందుకు ఉదాహరణ కావాలంటే ‘నందినీ నర్సింగ్ హోం’ లాంటివి కన్పిస్తాయి. 

          ఉపయోగాలు :  కథ లేకుండా కథ రాసుకోచ్చు. ప్లాట్ పాయింట్స్ తో పని లేదు, క్యారక్టర్ డెవలప్ మెంట్ అవసరం లేదు. సొంత ధోరణిలో రాసుకుపోతూ  ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడా ఆలోచలనకి పదును పెట్టుకునే శ్రమ వుండదు. చాలా ఫన్నీగానూ ఈజీగానూ వుంటుంది స్క్రిప్ట్ రైటింగ్. ఎడమ పక్క బ్రెయిన్ మొత్తుకునే లాజిక్ తో, విశ్లేషణలతో  పని లేకుండా,  రైట్ బ్రెయిన్ చెప్పినట్టూ బోలెడు ఫీలింగ్స్ తో సెంటిమెంటల్ గా, సగం బుర్ర వాడుకుని  రాసుకుపోవచ్చు. స్ట్రక్చర్ తో పనిలేకుండా కేవలం క్రియేటివిటీనే  చూపించుకుంటూ రాసుకోవచ్చు.

          మొత్తం రాసేసి చదువుకుంటే అప్పుడు కథేమిటో, ఏం చెప్పాలనుకున్నారో అర్ధమవుతుంది. ఈ విధానంలో ఎన్నెన్నో  ఐడియాలతో ఏవేవో సీన్లు పడిపోతాయి. కథకి పని వచ్చే వరకే వాటిని ఎడిట్ చేసుకుని, మిగిలిన వాటిని డేటా బ్యాంకులో భద్రపర్చు కోవచ్చు  భవిష్యత్ అవసరాల కోసం.

          సమస్యలు : ఈ విధానం సెల్ఫ్ గా రాసుకున్న రచయిత ఆలోచనాధార ( చైతన్య స్రవంతి- స్ట్రీమ్  ఆఫ్ కాన్షస్ నెస్) కాబట్టి చాలా ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఎన్నోసార్లు తిరగరాసుకోవాల్సి వస్తుంది. సంతృప్తి అనేది వుండదు. ఎక్కడో తేడా కొడుతున్నట్టు అన్పిస్తుంది, అదేమిటో తెలీదు. తెలిస్తే అసంతృప్తి తీరిపోయే దిద్దుబాటు చేసుకోవచ్చు. తెలీదు కాబట్టి సెట్లో కూడా అసంతృప్తితో  ఏదో మార్చి మార్చి రాసుకునే పరిస్థితి.

          ఈ విధానంలో కథలో సస్పెన్స్ అనేది వుండదు. ముందు జరగబోయే దాన్ని సూచనాప్రాయంగా చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే రచయితకి ముందు చూపువుండాలి. రాస్తున్నప్పుడు చేతిలో కథే వుండదు కాబట్టి ముందు చూపు వుండే అవకాశం లేదు. అలాగే పాత్ర పాసివ్ గా వస్తుంది.

          కథకి స్ట్రక్చర్ వుండదు. కచ్చితంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే వస్తుంది. కథలో చాలా ఎలిమెంట్స్  మిస్సయి సినిమా కథలా వుండదు. అనుభవమున్న రచయిత సాయం కోరితే సరిదిద్దడం దుస్సాధ్యంగా  మారిపోతుంది. పాయింటుని కూడా సంస్కరించి, మొత్తం సరికొత్తగా రాసుకు రావాల్సి వుంటుంది. ఈ ‘కూల్చు మరల కట్టు’ పద్ధతికి సెల్ఫ్ స్టార్టర్ రచయిత గుండె పగులుతుంది. అది తన రచనా సామర్ధ్యానికే అవమానంగా తోచి ఒప్పుకోకపోవచ్చు.

          చేయకూడనివి:  రచయిత తనని తాను గట్టిగా నమ్ముకుని  సెల్ఫ్ స్టార్టర్ కే బద్ధుడయ్యాక, మరింకో వైపు కన్నెత్తి చూడకూడదు. అంటే అహాన్ని చంపుకుని ఇతర సినిమాల కథలెలా వున్నాయి, వాటి నడక ఎలా వుందీ, ఆ నడకని బట్టి లైన్ ఆర్డర్ వేసుకుందామా, ఆ సీన్లని మార్చి పెట్టుకుందామా- లాంటి చోరకళకి పాల్పడకూడదు. అప్పుడు తన సరుకుతో ఆ సరుకులూ  కలిసిపోయి మొత్తం గజిబిజి అయిపోతుంది.  సెల్ఫ్ స్టార్ట్ కే నమ్మి కట్టుబడ్డాక ఇక వేరే  కిక్ స్టారర్, క్లిక్ స్టార్టర్ తరగతుల్లోకి తొంగి చూడకూడదు. ఆ విధానాలని తెచ్చి కలుపుకోకూడదు. కల్తీ చేసుకోకూడదు.

           ఫలితం :  ‘ఒక మనసు’, లేదా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాంటిది తెర కెక్కుతుంది.

          కర్తవ్యం :  ఇప్పటి కాలంలో పాపులరవుతున్న ఇండీ (ఇండిపెండెంట్) ఫిలిమ్స్ కిందికి ఈ స్క్రిప్టు  వస్తుంది. సందీప్ కిషన్ నటించిన తమిళ డబ్బింగ్ ‘రన్’  లాగా ఇండీ ఫిలిం అని ముందే చెప్పుకుని నిర్మాతలని ప్రయత్నించాలి. అంతేగానీ  కమర్షియల్ గా కలరిచ్చి మభ్య పెట్ట కూడదు. ఈ సిన్సియారిటీని మెచ్చి, మొదటి పేజీ పైభాగంలో ఆనాడు స్మరించుకున్న దేవుడే ఓకే చేయిస్తాడు. లేదూ కమర్షియల్ అనే మభ్య పెట్టదల్చుకుంటే, స్మరించుకున్న దేవుణ్ణి కొట్టేసి ఇంకో దేవుణ్ణి రాసుకున్నా లాభముండదు. దేవుళ్ళంతా  ఒకే దర్బారులో వుంటారు, తెలిసిపోతుంది. కాబట్టి ఓ డాన్ పేరు రాసుకుంటే సరిపోతుంది. ఎలాటి పనికి అలాటి వాడు. అవసరమైతే నిర్మాతకి డాన్ ఫోన్ చేస్తాడు.

          ఇండీ ఫిలిం అని ముందే  ప్రమోట్ చేసుకోవడంలో జరిగే ఇంకో మేలు ఏమిటంటే, రివ్యూ రైటర్లు దాన్ని ఇండీ ఫిలిం దృష్టితోనే చూసి, ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకుండా  ఆ మేరకే  అందమైన రివ్యూలు రాసిచ్చేసే వీలుంటుంది. లేకపోతే కమర్షియల్ ఇలా తీశాడేమిటని ఆ ప్రకారం వేరే రివ్యూలు ఇచ్చేసే ప్రమాదముంది- అప్పుడు బాధపడి, విరుచుకుపడి ప్రయోజనముండదు. 

          ఈ తరగతికి ఎంట్రీ లెవెల్ రచయితలే కాదు, ఎంటరై చక్రం తిప్పుతున్న వాళ్ళూ చెంది వుంటారు. వీళ్ళు 90 కి అటు వైపా, ఇటు వైపా రాయడానికి శ్రీకారం చుట్టే ముందే తేల్చుకోవాలి. 90 అంటే ప్రతీ ఏటా ఇస్తున్న 90 శాతం ఫ్లాపులన్న మాట.
                                                   ***

          కిక్ స్టార్టర్:  దీనికి రచనా సామర్ధ్యం బాగా అవసరమే. ఇదివరకు వచ్చిన సినిమాలే ఈ విధానంలో మార్గదర్శకాలుగా వుంటాయి. భారీ కమర్షియల్స్ ఆదర్శంగా వుంటాయి. వాటిని కిక్ కొట్టి వాటిలోంచే కథల్ని స్టార్ట్ చేయొచ్చు. వాటిని అనుసరించే కథనాలు చేసుకోవచ్చు. ఒకేలాంటి కథలు, ఒకేలా వుండే కథనాలతో సులభంగా రాసెయ్యొచ్చు. స్టార్ వేల్యూతో అవే నడిచిపోతాయి.

          ఉపయోగాలు : సాంప్రదాయంగా, సెంటి మెంటుగా, పాత స్కూలుగా  వస్తున్న ఈ పద్ధతికే ఎక్కువ డిమాండ్ వుంటుంది- ఫ్లాపులే ఎక్కువ ఇచ్చినా సరే, ఆత్మవిమర్శ చేసుకుని పధ్ధతి మార్చుకునే, ఎడ్యుకేట్ అయ్యే పనే వుండదు. ఇది పక్కా కమర్షియల్ – మూస ఫార్ములా విధానం. ఈ విధానంలో స్ట్రక్చర్ తో పనుండదు, ఈ విధానం స్ట్రక్చర్ ని దగ్గరికి రానివ్వదు. కొత్తది నేర్చుకునే శ్రమా వుండదు. అప్డేట్ అయ్యే అవసరముండదు.  స్ట్రక్చర్ కి దూరంగా దేవుడి మీద భారం వేసి  కేవలం క్రియేటివిటీనే నమ్ముకుని రాసుకోవచ్చు. పాసివ్ గా వచ్చిన సినిమాలనే టెంప్లెట్స్ గా పెట్టుకుని రాయల్ గా రాసెయ్యొచ్చు. ఫీలింగ్స్ , ఎమోషన్స్ తో కూడిన కుడి  బ్రెయిన్ ని ధారాళంగా వాడుతూనే, అప్పుడప్పుడు కామన్ సెన్స్ ని, సమయస్ఫూర్తినీ  గుర్తు చేసే ఎడమ  బ్రెయిన్ ని పొదుపుగా వుండీ లేనట్టుగా వాడవచ్చు. అంటే సగం పైచిలుకు బుర్ర ఉపయోగంలోకి వస్తుందన్న మాట.

          సమస్యలు : ఈ కిక్ స్టార్ట్ లో తప్పులున్న సినిమాలనే కిక్ కొట్టి అవే తప్పులతో స్టార్ట్ చేసుకుని రాయడం వల్ల పాసివ్ పాత్రల విడిది  కేంద్రాలుగా వుంటాయి. ప్రతీ యేటా పెద్ద  స్టార్స్ ని  పాసివ్ క్యారక్టర్స్ గా మార్చేసే కార్ఖానాలుగా వుంటాయి. అదృష్టం మీద ఆధారపడి హిట్టవుతూంటాయి. ఈ విధానంలో స్ట్రక్చర్ వుంటుంది గానీ, అది శాస్త్రీయంగా లేక, అంకాలు ఒకదాని మీద ఒకటి స్వారీ చేస్తూంటాయి. అందుకని కథ ఇంటర్వెల్ లోపు మొదలుకాని పరిస్థితి వుంటుంది. శాస్త్రీయత, స్ట్రక్చారాస్యత అనే వాటికి  దూరం కాబట్టి  పాసివ్ పాత్రలతో బాటు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సిండ్రోంలవంటి భారీ తూఫాను గండాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎన్నో వెర్షన్లు రాయిస్తూంటారు. అయినా సమస్యలు అలాగే వుంటాయి. పాత  స్కూలు పథికులు కావడం చేత పైన చెప్పుకున్న సమస్యలతో బాటు ఇంకా ఎన్నో లోపాల్ని కనిపెట్టలేరు.

          చేయకూడనివి:  చిన్న తరహా సెల్ఫ్ స్టార్టర్  విధానం వైపు చూసే స్థాయి కాదు కాబట్టి, అలాగే క్లిక్ స్టార్టర్  విధానం వైపూ చూసేందుకు ఆ  స్ట్రక్చర్ కి బద్ధవ్యతిరేకం కాబట్టీ,  ఈ కిక్ స్టార్టర్ రాయల్ విధానంతో అలాటి పనులు జరగవు. అంటే ఈ విధానం జడమైనది కాబట్టి ఇతర తరగతుల్లోకి తొంగి చూసే పని ఎలాగూ వుండదు. 

          ఫలితం :  ‘సమరసింహా రెడ్డి’ దగ్గర్నుంచీ ‘శతమానం భవతి’ వరకూ హిట్ ఫ్లాప్ భారీ కమర్షియల్స్ అన్నీ.

          కర్తవ్యం :  మభ్య పెట్టడాలు వుండవు- తామే రాజీ పడడాలు వుంటుంది. స్మరించుకున్న దేవుడు కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. క్షమించమని వేడుకోవాల్సి వుంటుంది. నీ ఖర్మలే ఫో- అనేస్తాడు  దేవుడు చేతులు దులుపుకుని. 90 కి అటా ఇటా అని ఆందోళన మొదలవుతుంది.
                                                           
***
క్లిక్ స్టార్టర్  
      ఒక్క క్లిక్ తో స్క్రీన్ ప్లే అంతా  కళ్ళ ముందు పర్చుకుంటుంది  బ్లూ ప్రింట్ లా. ఇది శాస్త్రీయ స్ట్రక్చర్ సహిత విధానం. ఈ తరగతి  రచయిత వేరే తరగతి గదులవైపు, కన్నాల వైపూ చూడడు తస్కరణావకాశాల కోసం - అంత స్వావలంబనతో, ఒరిజినాలిటీతో, వృత్తితత్వంతో వుంటాడు. ఇది పాశ్చాత్య  సిడ్నీ ఆల్విన్  ఫీల్డ్ (సిడ్ ఫీల్డ్), రాబర్ట్ మెక్ కీ, జాన్ ట్రూబీ, క్రిస్ ఓల్గర్ ల వంటి ఆధునిక స్కూలు కమర్షియల్ విధానం. ‘శివ’ రచనా విధానం ఈ స్కూలుకే  చెందుతుంది. కొన్ని వందల సినిమాల్ని పరిశీలించిన అనుభవంతో స్క్రీన్ ప్లే మోడల్ కో స్ట్రక్చర్ ని ఏర్పరచారు. ఈ స్ట్రక్చర్ తో  కథలో ఏది ఎక్కడ ఎలా వుండాలో బ్లూప్రింట్ అంతా  వుంటుంది. అయితే ముందుగా కథని  అన్ని కోణాల్లో, అని విధాలా రీసెర్చి చేసుకోకుండా  ఈ విధానంలో ఒక్క సీను కూడా రాయడం సాధ్యం కాదు. ఒక్కో మెట్టులో ఐడియా, సినాప్సిస్, లైన్ ఆర్డర్ విస్పష్టంగా, నిర్దుష్టంగా వర్కౌట్ చేసుకున్నాక,  వారం  రోజుల్లో  రఫ్ కాపీ రాసెయ్యొచ్చు. 

         
ఉపయోగాలు : అవే కథలు కొత్త భాష్యం చెప్పుకుంటాయి. పైగా పాసివ్ పాత్రలు  సహా ఎలాటి లోపాలూ, బోరూ  ఇందులో చొరబడే అవకాశం వుండదు. ఇందులో స్ట్రక్చర్- క్రియేటివిటీ రెండూ విడదీయరానంతగా కలగలిసిపోయి వుంటాయి. ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ సమాన నిష్పత్తిలో పనిలోకి వస్తాయి. అంటే  తుప్పు పట్టకుండా పూర్తి బుర్ర మేకిన్ ఇండియాగా అమల్లోకి వస్తుందన్న మాట. ఇలా విమర్శనాత్మక, విశ్లేషణాత్మక, కళాత్మక  దృష్టితో స్క్రీన్ ప్లే తయారవుతుంది కాబట్టి – ఇలా రాసుకున్న కథ ఒకవేళ కాన్సెప్ట్ పరంగా ఎవరికైనా నచ్చకపోయినా,  వీడి దగ్గర విషయముందని గుర్తించే అవకాశం వుంటుంది. 

          సమస్యలు :  ఈ  విధానంలో మొట్ట మొదట ఎదురయ్యే సమస్య, నేను స్ట్రక్చరాస్యుణ్ణని రచయిత పెద్ద ఫోజు పెడితే గేట్లు ధడాల్న పడిపోవడం. కాబట్టి అఆలైనా నేర్చుకున్నట్టు తెలియకుండా మేనేజ్ చేయాలి. పాత స్కూల్లోనే నలుగుతున్నట్టు ఫీలింగ్ నివ్వాలి. ఎప్పుడూ ప్లాట్ పాయింట్, పాసివ్  క్యారక్టర్, త్రీయాక్ట్ స్ట్రక్చర్ అంటూ కొత్త స్కూలు పదాలేవీ వాడకూడదు. ఏ స్క్రీన్ ప్లే పుస్తకాలూ తీసికెళ్ళి చూపించ కూడదు, ఏ స్క్రీన్ ప్లే పండితుణ్ణీ ప్రస్తావించ కూడదు. డిస్కషన్స్ లో ఫస్ట్ టర్నింగ్, సెకండ్ టర్నింగ్, వీక్ క్యారక్టర్, పవర్ఫుల్  క్యారక్టర్ ... ఇలా సాంప్రదాయ పదకోశాన్నే వాడాలి. అవతలి వ్యక్తి  సేమ్ స్కూలైతే ఈ సమస్యలేవీ వుండవు- అదొక హనీమూన్ లా గడిచిపోతుంది. 

     ఈ విధానంలో ఇంకో సమస్య ఏమిటంటే, అంత  కచ్చితమైన కొలత లేసుకుని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుండడంతో,  కథా కథనాలు  కృతకంగా అన్పిస్తాయి. అందుకని  ప్లాట్  పాయింట్స్, పించ్ పాయింట్స్, మిడ్ పాయింట్ - వీటన్నిటినీ క్రియేటివ్ అవుట్ లుక్ తో,  స్ట్రక్చర్ వున్నట్టే అన్పించకుండా పూత పూసేయాలి. స్ట్రక్చర్ అనేది కేవలం కథని నిలబెట్టే ఆస్థి పంజరం మాత్రమే. ఈ ఆస్థి పంజరానికి క్రియేటివిటీ అనే డ్రామాతో రక్తమాంసాలద్దినప్పుడే  స్క్రీన్ ప్లే ఒక రోబోలా అన్పించకుండా, నడిచి వస్తున్న రోమన్ వీరుడులా వుంటుంది. ఉదా : ‘దంగల్’, ‘భజరంగీ భాయిజాన్’. 

          చేయకూడనివి: మూస ఫార్ములా పాత్రలూ కథనాలూ ఇందులో చేయకూడదు. అయితే సెల్ఫ్ స్టార్టర్ , కిక్ స్టార్టర్  తరగతులు  రెండూ క్లిక్ స్టార్టర్  కి ఫ్రెండ్లీ తరగతులే. అన్ని తరగతులూ ఫ్రెండ్లీ తరగతులే ఇన్ స్పైర్ అవడానికి, అప్ డేట్ అవడానికీ. కిక్ స్టార్టర్  కి కాపీ కొట్టే ఖర్మ వుండదు గాబట్టి- ఎడ్యుకేషన్ మాత్రంగా పనికి రావొచ్చు ఇతర తరగతులు. న్యూస్ ఛానెల్స్ లో కొన్ని వార్తా కథనాలు కూడా కథానికి సంబంధించిన టెక్నిక్కుల్ని అందిస్తాయి.  

          ఫలితం :  ‘శివ’, ‘మనం’, ‘క్షణం’ మొదలైనవి...

          కర్తవ్యం:  స్ట్రక్చర్ తో రాజీ పడకూడదు. స్ట్రక్చర్ పైన క్యారక్టర్ ప్లే విషయంలో పాసివ్ పాలబడనంత వరకూ పట్టువిడుపులు తప్పవు. ఇవి కూడా మరీ గాడి తప్పితే తప్పుకోవడానికే సిద్ధపడాలి. దేవుడి విషయానికొస్తే, వీడికి  (శాస్త్రీయ) జ్ఞానం వుండీ దాస్తున్నాడే అనే జాలిపడతాడు. ఇంకో చోట సెట్ చేయడానికి బిజీ అయిపోతాడు. 90 కి ఎటువైపు వుండాలన్న విషయంలో మాత్రం సొంతవ్యక్తిత్వంతో నిశ్చితాభిప్రాయంతో వుంటాడు ఈ టైపు రచయిత.


-సికిందర్












16, జనవరి 2017, సోమవారం

స్పెషల్ ఆర్టికల్- 3




    A movie is told with pictures, not words- అన్నాడు స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని  నేలకు దించి యువతరానికి  సులభతరం చేసిన దివంగత సిడ్ ఫీల్డ్. కథకి టీజర్ గా పాత్రని కూడా ఎక్కు పెట్టొచ్చు. ఆ పాత్ర హీరో, హీరోయిన్, విలన్, ఎవరైనా కావొచ్చు. మనం సినిమా కెళ్తే,  అక్కడ టైటిల్స్ పూర్తవగానే హీరోని చూపిస్తూ- పండు గాడు వీడు. మహా అల్లరి గాడు సుమండీ! చిన్నప్పుడు బామ్మ నేర్పిన అల్లరి అట.  బామ్మ వీడికి జడ లేసి వంశంలో ఆడపిల్ల ల్లేని ముచ్చట కూడా తీర్చుకునేది. అదిగో దాని తాలూకు గుర్తే ఆ పిలక! అందుకే వీడికి ఆడపిల్లలంటే సిగ్గండీ. వీడు ఇంటర్ మూడు సార్లు తప్పి పుస్తకాల ఖర్చూ ఆదా చేస్తున్నాడు. అదిగో- అదిగో-వాడి నడక స్టయిల్ చూశారా..ఎంటా కుంటి నడక అంటారూ? ఎంతకీ వీడు ఆడపిల్లల వెంట పడి చావడంలేదనీ, వీడి నాన్న ఠపీ విరగ్గొట్టిన కాలు కదూ అలా అయిపోయిందీ...ఇలా కామెంటరీ సాగుతూంటుంది....

         
దీన్ని క్యారక్టర్ టీజర్ అందామా? మూకీ సినిమాల కాలంలో తెర పక్కన నించుని ఒకడు మాటలు పలకని పాత్రల భావాల్ని అరిచి చెప్పేవాడట- ఇది రానురానూ 2000 నాటికల్లా తెలుగు సినిమాల్లో తెర వెనుక నుంచి ఓ  గొంతుక (వాయిసోవర్- డబ్బింగ్ ఆర్టిస్టు కూడా కావొచ్చు) పాత్రల్ని పైన చెప్పుకున్న విధంగా పరిచయం చేసే పద్ధతికి మారింది. 

          పాత్రల్ని ఇలా పరిచయం చేసే విధానం శాస్త్రంలో లేదు.  సినిమా శాస్త్రం కంటే నాటక విధానాలతోనే తెలుగు సినిమాల తీరుతెన్నులుంటాయి కాబట్టి, ఇది శాస్త్రీయ దృష్టికి  
లో- కేటగిరీకళా ప్రదర్శన అయ్యింది.    పాత్ర తీరుని అది పాల్పడే చర్యలు గానీ, లేదా ఈ పాత్ర తో ఇంకో పాత్రకి అనుభవమైనప్పుడు ఈ పాత్ర గానీ, పరిచయం చేయడం సరైన విధానం. ఒకప్పుడు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్  అననే అన్నాడు – తన గురించి తాను అంతా వాగేసే పాత్ర మహా బోరు.  అలా పాత్ర వాగినా, వాయిసోవర్లో కథకుడు సంబరపడినా పాత్రలో సరుకంతా సఫా – అని!

          రచయిత చమత్కార శక్తిని ప్రదర్శించుకోవడం తప్ప దీనివల్ల ఒరిగేదేమిటి
. గమనిస్తే పాత్రల్ని ఇలా  టీజర్స్  గా ప్రయోగించిన సినిమాలు  ఫ్లాపయ్యాయి- లేదా పెద్దగా  సక్సెస్ కాలేదు. కామెడీకైనా ఈ నాటకీయ విధానం  రచయిత  అసమర్ధతని పట్టిచ్చేస్తుంది. తనకి కథనం ద్వారా పాత్రని పరిచయం చేసే విజువల్ సెన్స్ లేదనీ, ఇలా నాల్గు మాటల్లో  చెప్పేసి తప్పించుకుంటున్నాడనీ అర్ధం వస్తుంది. అందుకే –
a movie is told with pictures, not words’  మీద పట్టు సాధించాలి. 

         
 కామెడీ సినిమాయే కదాని కూడా టీజర్ గా పాత్రని అల్లరి చిల్లరిగా పరిచయం చేయడమే కాదు, ఇతర జానర్ సినిమాల్లో కూడా స్టార్ గారిని ఎంత గౌరవనీయంగానూ, లేదా బీభత్సభరితంగానూ వాయిసోవర్ వేసి,  పరిచయం చేయడమనేది కూడా  దృశ్య మాధ్యమమైన సినిమా విధానమే కాదనేది గ్రహించాల్సి వుంటుంది. 

          క్యారక్టర్ టీజర్ కి
 వాయిసోవర్ వేసి, అందులో క్యారక్టర్ తాలూకు భూత  వర్తమాన భవిష్యత్ గానాలూ చేసేసి, క్యారక్టరైజేషన్  ఫలానా ఇదీ అని చెప్పేయడమంటే, అటు పైన ఆ క్యారక్టర్ కథలో ఎలా ప్రవర్తిస్తుందో ముందు చెప్పేయడమే. అంటే క్యారక్టర్ తాలూకు వుండాల్సిన సస్పెన్సుని చంపేసి   పలచబారేట్టు చేయడమే. భలే వున్నాడ్రా క్యారక్టర్-  అని ముందే చెప్పేస్తే ఆతర్వాత ఆ క్యారక్టర్ తో బాటు కథకూడా ముందే తెలిసిపోతూంటుంది. ప్రేక్షకులు ఇక యాక్టివ్ గా కాక,  ఇన్వాల్ మెంట్ తగ్గి పాసివ్ గా సినిమా చూడ్డం  మొదలెడతారు. ప్రతీ అక్షరం ప్రేక్షకుల మెంటాలిటీని బేరీజు వేసుకుంటూ సినిమా రచన చేయకపోతే అది సినిమా రచన అవదు, వార్తా రచన  అవుతుంది- వార్తా రచనలో మొదటి పేరాలో విషయం చెప్పేసి, తర్వాత ఆ వార్త తాలూకు వివరాల్లోకి వెళ్లినట్టు. 

      జానర్ కీ జానర్ కీ తేడాలు తెలీక అన్ని జానర్లకీ ఒకే టైపు రచన చేసేయడం, ఆ చేసిన రచనకూడా సినిమా రచనలా వుండకపోవడం గమనిస్తున్నాం. సినిమాటిక్ గా డైలాగులు రాయడంలో  చూపినంత ప్రతాపం, మిగతా కథా కథనాల్లో, పాత్ర చిత్రణల్లో చూపించడం లేదు.  

          సినిమా విడుదలయ్యే వరకూ ఆ సినిమా కథేమిటో టీజర్స్ లోనో, ట్రైలర్స్ లోనో  బయట పడకుండా ఎలా జాగ్రత్త పడతారో, అలా కథని పాత్రనీ గుప్పెట్లో పెట్టుకుని వాటి తాలూకు తురుపు ముక్కల్ని సమయోచితంగా ప్రయోగిస్తున్నపుడే  థ్రిల్ వుంటుంది.

         
సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ విధానాలని తెలిపే శాస్త్రాల్లో మోనోలాగ్, నేరేషన్, టైం లాప్స్, స్పేస్ బ్రిడ్జింగ్, మూవ్ మెంట్ బ్రిడ్జింగ్ మొదలైన సౌండ్ ట్రాన్సిషన్ పద్ధతుల గురించే చెప్పారు తప్ప, పాత్రల్ని పరిచయం చేసే  వాయిసోవర్ ప్రక్రియ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలటువంటిది లేదు.

         
 కథకి నేరేషన్ ఇవ్వొచ్చు వాయిసోవర్ ద్వారా. అది కథని ముందుకి నడిపించేందుకు ( స్పేస్ బ్రిడ్జింగ్) పనికి రావొచ్చు (హీరోహీరోయిన్లు స్టెప్పు లేస్తూ డ్యూయెట్లు పాడుకునే రోజులుపోయి మాంటేజ్ సాంగ్స్ మొదలయ్యాక- కథని ముందుకు నడిపించేందుకు ఈ మాంటేజ్ సాంగ్స్ కూడా పనికొస్తున్నాయి). దీన్ని డైజెసిస్అంటారు. న్యూస్ రీళ్ళల్లో మనకి విన్పించే వ్యాఖ్యానం ఈ డైజెసిస్సే. ఇలా రికార్డు చేసిన ధ్వనిని డైజెటిక్ సౌండ్ అంటారు. ఇలా కథా గమనం గురించి కథకుడు వ్యాఖ్యానం చేసే డైజెటిక్ సౌండ్ కాక, పాత్ర తన గురించి తాను చెప్పుకునే వాయిసోవర్ కూడా వుంటుంది. దీన్ని ఇంట్రా డైజెటిక్ సౌండ్ అంటారు.  దీంతో సినిమా ప్రారంభిస్తే ఇది ఫ్లాష్ బ్యాక్ కి దారితీస్తుంది- ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాగా. కానీ ఇది క్యారక్టర్ టీజర్ అన్పించుకోదు. ఆ మాటకొస్తే ఒక టీజరే అన్పించుకోదు. పాసివ్ ప్రారంభం అన్పించుకుంటుంది. యాక్టివ్ గా క్యారక్టర్ టీజర్ అన్పించుకోవాలంటే,  పాత్ర దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్ మొదలవకూడదు- అది  కథకుడి దృక్కోణ మవ్వాలి. 

          ఉదాహరణకి ఇదే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో హీరో శ్రీనివాసరెడ్డి ఓపెనింగ్ సీనులో
సముద్రపుటొడ్డున ఎమోషనల్ గా నిలబడి చూస్తూ, మెళ్ళో  తాయత్తు  తెంపి సముద్రంలోకి విసిరేస్తాడు. ఆ తాయెత్తుతో అతడి  కథేమిటో చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో టీజర్ ఎఫెక్ట్ ఏముంది? ఏమీ లేదు. ప్రేక్షకులు కంగారు పడేట్టు శ్రీనివాస రెడ్దికి ఏమీ కాలేదు. తాయెత్తు సముద్రంలో కలిస్తే ఆడియెన్స్ కి వీసమెత్తు వర్రీ ఎందుకుంటుంది- తాళి తెంపి సముద్రంలోకి హీరోయిన్ విసిరేస్తే వుంటుంది గానీ! 

           తాళి స్థాయి వేరు, తాయెత్తు లెవెల్ వేరు. పవిత్రమైన తాళి కట్టుకోవడం, దాన్ని తెంపి పారెయ్యడం శ్రీనివాసరెడ్డికి సాధ్యం కాదు గనుక, అన్యధా భావించకుండా తనే సముద్రంలోకి దూకెయ్యాలి. మూఢ నమ్మకాలకి బలయ్యానని తాయెత్తుని  తెంపినంత మాత్రాన అవి మనసులోంచి తొలగిపోతాయా? కాబట్టి ఫ్రస్ట్రేషన్ తో తనే సముద్రంలోకి దూకెయ్యాలి. కథకి ఒక విజయవంతమైన క్యారక్టర్ టీజర్ని అందించడానికి ఈ త్యాగం తప్పదు. అప్పుడు మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్ తో చక్కగా రెండు  జరుగుతాయి : ఒకటి- అంత తీవ్ర నిర్ణయం తీసుకున్న శ్రీనివాస రెడ్డి కథ ఏమై వుంటుందో తెలుసుకోవాలన్న ఆదుర్దా ఒకవైపు పెరిగిపోతూ,  రెండు- అలా దూకిన  శ్రీనివాసరెడ్డి ఏమయ్యాడు, బయటికి వస్తాడా, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేసరికి కొంపదీసి అతను....ఇలా సస్పెన్స్ ఇంకోవైపు అనుభవిస్తూ యాక్టివ్ గా సినిమా చూడ్డంలో లీనమవుతారు ప్రేక్షకులు. 

          ప్రేక్షకులని కూడా కలుపుకుని సీన్స్ ని ఎనాలిసిస్ చేసుకుని రాసుకోకపోతే అది కేవలం కథకీ- రచయితకీ (రచయితల బృందానికీ) మధ్య లీనియర్ రైటింగ్ అవుతుంది. శుష్క రచన అవుతుంది. చాలా లోపాలు వచ్చి చేరిపోతాయి.  రాత పని ఎప్పుడూ ఒంటరి పని కాదు. అక్కడ కన్పించని ప్రేక్షకులు కూడా వుంటారు. కాబట్టి కథ ఏం డిమాండ్ చేస్తోంది,  రచయిత ఏమనుకుంటున్నాడూ అనే గాక, ఫ్రేక్షకులెలా ఫీలవుతారనే ఇంకో దృక్కోణాన్ని కూడా కలుపుకుని ట్రయాంగిల్ బంధం రాత పని. 

          కథ- దాని ఎదురుగా రచయిత - వర్చువల్ గా ప్రేక్షకులూ - ఈ ముగ్గురూ కలిసి పాల్గొనేదే రాత పని. దురదృష్ట వశాత్తూ కథ ముందు పెట్టుకుని నల్గురైదుగురు రచయితలూ కుస్తీ పడతారు గానీ, వాళ్ళ మనసుల్లో ప్రేక్షకులుండరు. పైన శ్రీనివాసరెడ్డి ఉదంతంలో  కారక్టర్ టీజర్ అలా ఎందుకు మారిందంటే,  ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఆలోచించడం వల్లే. లీనియర్ రైటింగ్ బదులు ట్రయాంగులర్ రాతపనిని ఆశ్రయించడం వల్లే- అక్కడ కథ సాంతం వెంటాడే రెండు అవస్థలు ఏర్పడ్డాయి- ఫ్లాష్ బ్యాక్ తాలూకు ఆదుర్దా, శ్రీనివాస రెడ్డి క్యారక్టర్ టీజర్ తాలూకు సస్పెన్స్. 

          బృందంలో ఇలా ఆలోచించే వాళ్ళుంటే- వాళ్ళ వెర్షన్ ని  తోసి పుచ్చడమే సర్వసాధారణంగా జరుగుతుంది. ప్రేక్షకుల్ని కూడా కలుపుకుని ఆలోచించడానికి అస్సలు ఇష్టపడరు. శాస్త్రీయత కంటే అశాస్త్రీయ లీనియర్ రైటింగ్ కే మెజారిటీ ఓట్లు పడతాయి. కానీ రచయితలు  అథమస్థానానికి చెందుతారు. వాళ్లకి  పై స్థాయిలో కథ- ప్రేక్షకులూ వుంటారు. ట్రయాంగులర్ బంధాన్ని గౌరవిస్తూ కథ ఏం చెప్తోంది,  ప్రేక్షకులేం ఫీలవుతారో వింటూ కింద కూర్చుకుని రాసుకుపోయే వాళ్ళే  నిజమైన రచయితలు. 

          రాతపనిలో వర్చువల్ గా ప్రేక్షకుల్ని భాగస్వాములుగా చేసుకోవాలంటే రచయిత విమర్శకుడు కూడా కావాలి. విమర్శకుడు సినిమా చూస్తూ ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఆలోచిస్తాడు – ట్రయాంగులర్ బంధంతో. స్క్రిప్టు నుంచి స్క్రీన్ ప్లే,  స్క్రీన్ ప్లే నుంచి  స్క్రిప్టు నీ  ఎలా విడదీయలేమో-  రచయిత లోంచి విమర్శకుడూ, విమర్శకుడి లోంచి రచయితా తొంగి చూసినప్పుడే వాళ్ళ రాత పనికి న్యాయం జరుగుతుంది. ఇద్దరికీ కామన్ భాగస్వామ్యులు ప్రేక్షకులే. 

                                    ***
    'Amovie is told with pictures, not words’  కి ప్రత్యక్ష ఉదాహరణగా హాలీవుడ్  ‘సెవెన్’  క్యారక్టర్ టీజర్ ని చూద్దాం- ఈ కథ ఐదు సింపుల్ షాట్స్ తో మొదలవుతుంది. ఎలాటి వాయిసోవర్ గానీ డైలాగులూ గానీ లేకుండా, ఈ ఐదు షాట్స్ ద్వారా కొన్ని  సెకన్ల కాలంలో మోర్గాన్ ఫ్రీమాన్ క్యారక్టర్ ఏంటో తెలిసిపోతుంది...

          అపార్ట్ మెంట్ లోంచి కన్పించే  దృశ్యంతో అతను  మహానగరంలో నివసిస్తున్నాడని తెలుస్తుంది. అతను ధరించిన బ్యాడ్జి ద్వారా అతను పోలీసే కానీ, మామూలు పోలీసు కాదు- డిటెక్టివ్ పోలీసని తెలుస్తుంది. బెడ్ మీద అతను సరంజామా సర్దే పద్దతి  చూస్తే అతడిది నిశిత దృష్టి అనీ తెలుస్తుంది, అక్కడ డబుల్ బెడ్ వున్నా అతను  సింగిల్ గా వుంటున్న మనిషనీ తెలుస్తుంది, అతని దగ్గర కత్తి కూడా వుండడాన్ని బట్టి అతడి కేదో చీకటి చరిత్ర వుందని కూడా అర్ధమౌతుంది....ఇదంతా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో అయిదు షాట్లలో! 

          క్యారక్టర్ గురించి మాటలతో చెప్పకుండా బొమ్మలతో చూపిస్తే క్యారక్టర్ కి సస్పెన్స్ పెరుగుతుంది, క్యారక్టర్ గుంభనంగా వుంటుంది. క్యారక్టర్ థ్రిల్లింగ్ గా వుంటుంది, క్యారక్టర్ పవర్ఫుల్ గా వుంటుంది...
(ఇంకా వుంది) 

-సికిందర్