రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, జనవరి 2017, మంగళవారం


సినిమా కథ రాయడానికి చక్కగా కూర్చుని, కాగితం పై భాగాన రాముడో కృష్ణుడో, ముత్యాలమ్మో మైసమ్మో ఇష్టదైవ నామ స్మరణం చేసుకుని, రాయడం మొదలెట్టినప్పుడు, ఆ స్మరించుకున్న దైవాలు ఎక్కడ్నించో కాదు- ఆ రాసుకున్న కాగితం పై భాగం అక్షరాల్లోంచే తొంగి తొంగి చూస్తూంటారు-  మనోడు ఏం రాస్తున్నాడని కాదు, ఎలా రాస్తున్నాడని. వీణ్ణి ఎలా ఎక్కడ సెట్ చేయవచ్చా అని. ఓం నమఃశ్శివాయ అని శ్రీకారం చుట్టి ఆ దేవుణ్ణి మర్చిపోతే కాదు- దేవుళ్ళకో ప్రోగ్రాం ఇచ్చేశాక వాళ్ళు పని మొదలెట్టేసుకుంటారు. కోటి రూపాయల సినిమాకి వీణ్ణి అడ్జెస్ట్ చేస్తే సరిపోతుందా, చిరంజీవి 151వ రేంజికి  సెట్ చేయాలా అని గమనిస్తూంటారు. కాబట్టి గిల్లుకున్నాక ఈ రాడార్ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేరు. ముందే తాము ఏ తరగతికి చెందుతారో నిర్ణయించుకుని ఆ తర్వాత గిల్లుకుంటే  ఏ ఇలవేల్పులైనా  ఇంప్రెస్ అవుతారు. 

         తరగతులు మూడు-  సెల్ఫ్ స్టార్టర్, కిక్ స్టార్టర్, క్లిక్ స్టార్టర్ అన్నవి. ఏ తరగతికి చెందితే ఆ తరగతికే కట్టుబడి వుండాలి. ఈ తరగతిలోంచి ఆ తరగతి గదిలోకి, ఆ తరగతి లోంచి ఈ తరగతి గదిలోకీ రాకపోకలు సాగిస్తే  అవన్నీ కలిసి ఏ తరగతీ కాకుండా చేస్తాయి.

          ఒక్కో తరగతిని చూద్దాం :
సెల్ఫ్ స్టార్టర్ – దీనికి పెద్దగా రచనా జ్ఞానం అవసరం లేదు. ఈ విధానంలో కథకి ఓ పాయింటు దొరుకుతుంది గానీ, పూర్తి కథ వుండదు. ఎలా చేసుకోవాలో తెలీదు. ఆ పాయింటుని  పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి సీన్లు రాసుకుంటూ పోతూంటే కథ అదేవస్తుంది. అప్పుడప్పుడు పాయింటు ఆగుతూంటే వేరే సీన్లతో భర్తీ చేసుకోవచ్చు. బారెడు  కామెడీ సీన్లో, లవ్ సీన్లో, ఫైట్సో పెట్టుకోవచ్చు. 

     ఏది ఎలా తోస్తే అలా రాసుకుంటూ పోవడమే ఈ సెల్ఫ్ స్టార్టర్ విధానం. చివరి సీనుకి వచ్చేటప్పటికి పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు. అక్కడ కథని తేల్చి చెప్పామా లేదా అన్నదే స్క్రీన్ ప్లే. End justifies the means అనడం లాంటిదన్న మాట. హైదరాబాదు నుంచి ఒక రూటులో బెజవాడ వెళ్లకపోయినా, డొంక దారులు పట్టుకునైనా బెజవాడ ముంగిట వాలామా లేదా  అని దబాయించడం లాంటిదన్న మాట. పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు, ఎలా చేరామన్నది కాదు. ఇందుకు ఉదాహరణ కావాలంటే ‘నందినీ నర్సింగ్ హోం’ లాంటివి కన్పిస్తాయి. 

          ఉపయోగాలు :  కథ లేకుండా కథ రాసుకోచ్చు. ప్లాట్ పాయింట్స్ తో పని లేదు, క్యారక్టర్ డెవలప్ మెంట్ అవసరం లేదు. సొంత ధోరణిలో రాసుకుపోతూ  ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడా ఆలోచలనకి పదును పెట్టుకునే శ్రమ వుండదు. చాలా ఫన్నీగానూ ఈజీగానూ వుంటుంది స్క్రిప్ట్ రైటింగ్. ఎడమ పక్క బ్రెయిన్ మొత్తుకునే లాజిక్ తో, విశ్లేషణలతో  పని లేకుండా,  రైట్ బ్రెయిన్ చెప్పినట్టూ బోలెడు ఫీలింగ్స్ తో సెంటిమెంటల్ గా, సగం బుర్ర వాడుకుని  రాసుకుపోవచ్చు. స్ట్రక్చర్ తో పనిలేకుండా కేవలం క్రియేటివిటీనే  చూపించుకుంటూ రాసుకోవచ్చు.

          మొత్తం రాసేసి చదువుకుంటే అప్పుడు కథేమిటో, ఏం చెప్పాలనుకున్నారో అర్ధమవుతుంది. ఈ విధానంలో ఎన్నెన్నో  ఐడియాలతో ఏవేవో సీన్లు పడిపోతాయి. కథకి పని వచ్చే వరకే వాటిని ఎడిట్ చేసుకుని, మిగిలిన వాటిని డేటా బ్యాంకులో భద్రపర్చు కోవచ్చు  భవిష్యత్ అవసరాల కోసం.

          సమస్యలు : ఈ విధానం సెల్ఫ్ గా రాసుకున్న రచయిత ఆలోచనాధార ( చైతన్య స్రవంతి- స్ట్రీమ్  ఆఫ్ కాన్షస్ నెస్) కాబట్టి చాలా ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఎన్నోసార్లు తిరగరాసుకోవాల్సి వస్తుంది. సంతృప్తి అనేది వుండదు. ఎక్కడో తేడా కొడుతున్నట్టు అన్పిస్తుంది, అదేమిటో తెలీదు. తెలిస్తే అసంతృప్తి తీరిపోయే దిద్దుబాటు చేసుకోవచ్చు. తెలీదు కాబట్టి సెట్లో కూడా అసంతృప్తితో  ఏదో మార్చి మార్చి రాసుకునే పరిస్థితి.

          ఈ విధానంలో కథలో సస్పెన్స్ అనేది వుండదు. ముందు జరగబోయే దాన్ని సూచనాప్రాయంగా చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే రచయితకి ముందు చూపువుండాలి. రాస్తున్నప్పుడు చేతిలో కథే వుండదు కాబట్టి ముందు చూపు వుండే అవకాశం లేదు. అలాగే పాత్ర పాసివ్ గా వస్తుంది.

          కథకి స్ట్రక్చర్ వుండదు. కచ్చితంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే వస్తుంది. కథలో చాలా ఎలిమెంట్స్  మిస్సయి సినిమా కథలా వుండదు. అనుభవమున్న రచయిత సాయం కోరితే సరిదిద్దడం దుస్సాధ్యంగా  మారిపోతుంది. పాయింటుని కూడా సంస్కరించి, మొత్తం సరికొత్తగా రాసుకు రావాల్సి వుంటుంది. ఈ ‘కూల్చు మరల కట్టు’ పద్ధతికి సెల్ఫ్ స్టార్టర్ రచయిత గుండె పగులుతుంది. అది తన రచనా సామర్ధ్యానికే అవమానంగా తోచి ఒప్పుకోకపోవచ్చు.

          చేయకూడనివి:  రచయిత తనని తాను గట్టిగా నమ్ముకుని  సెల్ఫ్ స్టార్టర్ కే బద్ధుడయ్యాక, మరింకో వైపు కన్నెత్తి చూడకూడదు. అంటే అహాన్ని చంపుకుని ఇతర సినిమాల కథలెలా వున్నాయి, వాటి నడక ఎలా వుందీ, ఆ నడకని బట్టి లైన్ ఆర్డర్ వేసుకుందామా, ఆ సీన్లని మార్చి పెట్టుకుందామా- లాంటి చోరకళకి పాల్పడకూడదు. అప్పుడు తన సరుకుతో ఆ సరుకులూ  కలిసిపోయి మొత్తం గజిబిజి అయిపోతుంది.  సెల్ఫ్ స్టార్ట్ కే నమ్మి కట్టుబడ్డాక ఇక వేరే  కిక్ స్టారర్, క్లిక్ స్టార్టర్ తరగతుల్లోకి తొంగి చూడకూడదు. ఆ విధానాలని తెచ్చి కలుపుకోకూడదు. కల్తీ చేసుకోకూడదు.

           ఫలితం :  ‘ఒక మనసు’, లేదా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాంటిది తెర కెక్కుతుంది.

          కర్తవ్యం :  ఇప్పటి కాలంలో పాపులరవుతున్న ఇండీ (ఇండిపెండెంట్) ఫిలిమ్స్ కిందికి ఈ స్క్రిప్టు  వస్తుంది. సందీప్ కిషన్ నటించిన తమిళ డబ్బింగ్ ‘రన్’  లాగా ఇండీ ఫిలిం అని ముందే చెప్పుకుని నిర్మాతలని ప్రయత్నించాలి. అంతేగానీ  కమర్షియల్ గా కలరిచ్చి మభ్య పెట్ట కూడదు. ఈ సిన్సియారిటీని మెచ్చి, మొదటి పేజీ పైభాగంలో ఆనాడు స్మరించుకున్న దేవుడే ఓకే చేయిస్తాడు. లేదూ కమర్షియల్ అనే మభ్య పెట్టదల్చుకుంటే, స్మరించుకున్న దేవుణ్ణి కొట్టేసి ఇంకో దేవుణ్ణి రాసుకున్నా లాభముండదు. దేవుళ్ళంతా  ఒకే దర్బారులో వుంటారు, తెలిసిపోతుంది. కాబట్టి ఓ డాన్ పేరు రాసుకుంటే సరిపోతుంది. ఎలాటి పనికి అలాటి వాడు. అవసరమైతే నిర్మాతకి డాన్ ఫోన్ చేస్తాడు.

          ఇండీ ఫిలిం అని ముందే  ప్రమోట్ చేసుకోవడంలో జరిగే ఇంకో మేలు ఏమిటంటే, రివ్యూ రైటర్లు దాన్ని ఇండీ ఫిలిం దృష్టితోనే చూసి, ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకుండా  ఆ మేరకే  అందమైన రివ్యూలు రాసిచ్చేసే వీలుంటుంది. లేకపోతే కమర్షియల్ ఇలా తీశాడేమిటని ఆ ప్రకారం వేరే రివ్యూలు ఇచ్చేసే ప్రమాదముంది- అప్పుడు బాధపడి, విరుచుకుపడి ప్రయోజనముండదు. 

          ఈ తరగతికి ఎంట్రీ లెవెల్ రచయితలే కాదు, ఎంటరై చక్రం తిప్పుతున్న వాళ్ళూ చెంది వుంటారు. వీళ్ళు 90 కి అటు వైపా, ఇటు వైపా రాయడానికి శ్రీకారం చుట్టే ముందే తేల్చుకోవాలి. 90 అంటే ప్రతీ ఏటా ఇస్తున్న 90 శాతం ఫ్లాపులన్న మాట.
                                                   ***

          కిక్ స్టార్టర్:  దీనికి రచనా సామర్ధ్యం బాగా అవసరమే. ఇదివరకు వచ్చిన సినిమాలే ఈ విధానంలో మార్గదర్శకాలుగా వుంటాయి. భారీ కమర్షియల్స్ ఆదర్శంగా వుంటాయి. వాటిని కిక్ కొట్టి వాటిలోంచే కథల్ని స్టార్ట్ చేయొచ్చు. వాటిని అనుసరించే కథనాలు చేసుకోవచ్చు. ఒకేలాంటి కథలు, ఒకేలా వుండే కథనాలతో సులభంగా రాసెయ్యొచ్చు. స్టార్ వేల్యూతో అవే నడిచిపోతాయి.

          ఉపయోగాలు : సాంప్రదాయంగా, సెంటి మెంటుగా, పాత స్కూలుగా  వస్తున్న ఈ పద్ధతికే ఎక్కువ డిమాండ్ వుంటుంది- ఫ్లాపులే ఎక్కువ ఇచ్చినా సరే, ఆత్మవిమర్శ చేసుకుని పధ్ధతి మార్చుకునే, ఎడ్యుకేట్ అయ్యే పనే వుండదు. ఇది పక్కా కమర్షియల్ – మూస ఫార్ములా విధానం. ఈ విధానంలో స్ట్రక్చర్ తో పనుండదు, ఈ విధానం స్ట్రక్చర్ ని దగ్గరికి రానివ్వదు. కొత్తది నేర్చుకునే శ్రమా వుండదు. అప్డేట్ అయ్యే అవసరముండదు.  స్ట్రక్చర్ కి దూరంగా దేవుడి మీద భారం వేసి  కేవలం క్రియేటివిటీనే నమ్ముకుని రాసుకోవచ్చు. పాసివ్ గా వచ్చిన సినిమాలనే టెంప్లెట్స్ గా పెట్టుకుని రాయల్ గా రాసెయ్యొచ్చు. ఫీలింగ్స్ , ఎమోషన్స్ తో కూడిన కుడి  బ్రెయిన్ ని ధారాళంగా వాడుతూనే, అప్పుడప్పుడు కామన్ సెన్స్ ని, సమయస్ఫూర్తినీ  గుర్తు చేసే ఎడమ  బ్రెయిన్ ని పొదుపుగా వుండీ లేనట్టుగా వాడవచ్చు. అంటే సగం పైచిలుకు బుర్ర ఉపయోగంలోకి వస్తుందన్న మాట.

          సమస్యలు : ఈ కిక్ స్టార్ట్ లో తప్పులున్న సినిమాలనే కిక్ కొట్టి అవే తప్పులతో స్టార్ట్ చేసుకుని రాయడం వల్ల పాసివ్ పాత్రల విడిది  కేంద్రాలుగా వుంటాయి. ప్రతీ యేటా పెద్ద  స్టార్స్ ని  పాసివ్ క్యారక్టర్స్ గా మార్చేసే కార్ఖానాలుగా వుంటాయి. అదృష్టం మీద ఆధారపడి హిట్టవుతూంటాయి. ఈ విధానంలో స్ట్రక్చర్ వుంటుంది గానీ, అది శాస్త్రీయంగా లేక, అంకాలు ఒకదాని మీద ఒకటి స్వారీ చేస్తూంటాయి. అందుకని కథ ఇంటర్వెల్ లోపు మొదలుకాని పరిస్థితి వుంటుంది. శాస్త్రీయత, స్ట్రక్చారాస్యత అనే వాటికి  దూరం కాబట్టి  పాసివ్ పాత్రలతో బాటు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సిండ్రోంలవంటి భారీ తూఫాను గండాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎన్నో వెర్షన్లు రాయిస్తూంటారు. అయినా సమస్యలు అలాగే వుంటాయి. పాత  స్కూలు పథికులు కావడం చేత పైన చెప్పుకున్న సమస్యలతో బాటు ఇంకా ఎన్నో లోపాల్ని కనిపెట్టలేరు.

          చేయకూడనివి:  చిన్న తరహా సెల్ఫ్ స్టార్టర్  విధానం వైపు చూసే స్థాయి కాదు కాబట్టి, అలాగే క్లిక్ స్టార్టర్  విధానం వైపూ చూసేందుకు ఆ  స్ట్రక్చర్ కి బద్ధవ్యతిరేకం కాబట్టీ,  ఈ కిక్ స్టార్టర్ రాయల్ విధానంతో అలాటి పనులు జరగవు. అంటే ఈ విధానం జడమైనది కాబట్టి ఇతర తరగతుల్లోకి తొంగి చూసే పని ఎలాగూ వుండదు. 

          ఫలితం :  ‘సమరసింహా రెడ్డి’ దగ్గర్నుంచీ ‘శతమానం భవతి’ వరకూ హిట్ ఫ్లాప్ భారీ కమర్షియల్స్ అన్నీ.

          కర్తవ్యం :  మభ్య పెట్టడాలు వుండవు- తామే రాజీ పడడాలు వుంటుంది. స్మరించుకున్న దేవుడు కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. క్షమించమని వేడుకోవాల్సి వుంటుంది. నీ ఖర్మలే ఫో- అనేస్తాడు  దేవుడు చేతులు దులుపుకుని. 90 కి అటా ఇటా అని ఆందోళన మొదలవుతుంది.
                                                           
***
క్లిక్ స్టార్టర్  
      ఒక్క క్లిక్ తో స్క్రీన్ ప్లే అంతా  కళ్ళ ముందు పర్చుకుంటుంది  బ్లూ ప్రింట్ లా. ఇది శాస్త్రీయ స్ట్రక్చర్ సహిత విధానం. ఈ తరగతి  రచయిత వేరే తరగతి గదులవైపు, కన్నాల వైపూ చూడడు తస్కరణావకాశాల కోసం - అంత స్వావలంబనతో, ఒరిజినాలిటీతో, వృత్తితత్వంతో వుంటాడు. ఇది పాశ్చాత్య  సిడ్నీ ఆల్విన్  ఫీల్డ్ (సిడ్ ఫీల్డ్), రాబర్ట్ మెక్ కీ, జాన్ ట్రూబీ, క్రిస్ ఓల్గర్ ల వంటి ఆధునిక స్కూలు కమర్షియల్ విధానం. ‘శివ’ రచనా విధానం ఈ స్కూలుకే  చెందుతుంది. కొన్ని వందల సినిమాల్ని పరిశీలించిన అనుభవంతో స్క్రీన్ ప్లే మోడల్ కో స్ట్రక్చర్ ని ఏర్పరచారు. ఈ స్ట్రక్చర్ తో  కథలో ఏది ఎక్కడ ఎలా వుండాలో బ్లూప్రింట్ అంతా  వుంటుంది. అయితే ముందుగా కథని  అన్ని కోణాల్లో, అని విధాలా రీసెర్చి చేసుకోకుండా  ఈ విధానంలో ఒక్క సీను కూడా రాయడం సాధ్యం కాదు. ఒక్కో మెట్టులో ఐడియా, సినాప్సిస్, లైన్ ఆర్డర్ విస్పష్టంగా, నిర్దుష్టంగా వర్కౌట్ చేసుకున్నాక,  వారం  రోజుల్లో  రఫ్ కాపీ రాసెయ్యొచ్చు. 

         
ఉపయోగాలు : అవే కథలు కొత్త భాష్యం చెప్పుకుంటాయి. పైగా పాసివ్ పాత్రలు  సహా ఎలాటి లోపాలూ, బోరూ  ఇందులో చొరబడే అవకాశం వుండదు. ఇందులో స్ట్రక్చర్- క్రియేటివిటీ రెండూ విడదీయరానంతగా కలగలిసిపోయి వుంటాయి. ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ సమాన నిష్పత్తిలో పనిలోకి వస్తాయి. అంటే  తుప్పు పట్టకుండా పూర్తి బుర్ర మేకిన్ ఇండియాగా అమల్లోకి వస్తుందన్న మాట. ఇలా విమర్శనాత్మక, విశ్లేషణాత్మక, కళాత్మక  దృష్టితో స్క్రీన్ ప్లే తయారవుతుంది కాబట్టి – ఇలా రాసుకున్న కథ ఒకవేళ కాన్సెప్ట్ పరంగా ఎవరికైనా నచ్చకపోయినా,  వీడి దగ్గర విషయముందని గుర్తించే అవకాశం వుంటుంది. 

          సమస్యలు :  ఈ  విధానంలో మొట్ట మొదట ఎదురయ్యే సమస్య, నేను స్ట్రక్చరాస్యుణ్ణని రచయిత పెద్ద ఫోజు పెడితే గేట్లు ధడాల్న పడిపోవడం. కాబట్టి అఆలైనా నేర్చుకున్నట్టు తెలియకుండా మేనేజ్ చేయాలి. పాత స్కూల్లోనే నలుగుతున్నట్టు ఫీలింగ్ నివ్వాలి. ఎప్పుడూ ప్లాట్ పాయింట్, పాసివ్  క్యారక్టర్, త్రీయాక్ట్ స్ట్రక్చర్ అంటూ కొత్త స్కూలు పదాలేవీ వాడకూడదు. ఏ స్క్రీన్ ప్లే పుస్తకాలూ తీసికెళ్ళి చూపించ కూడదు, ఏ స్క్రీన్ ప్లే పండితుణ్ణీ ప్రస్తావించ కూడదు. డిస్కషన్స్ లో ఫస్ట్ టర్నింగ్, సెకండ్ టర్నింగ్, వీక్ క్యారక్టర్, పవర్ఫుల్  క్యారక్టర్ ... ఇలా సాంప్రదాయ పదకోశాన్నే వాడాలి. అవతలి వ్యక్తి  సేమ్ స్కూలైతే ఈ సమస్యలేవీ వుండవు- అదొక హనీమూన్ లా గడిచిపోతుంది. 

     ఈ విధానంలో ఇంకో సమస్య ఏమిటంటే, అంత  కచ్చితమైన కొలత లేసుకుని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుండడంతో,  కథా కథనాలు  కృతకంగా అన్పిస్తాయి. అందుకని  ప్లాట్  పాయింట్స్, పించ్ పాయింట్స్, మిడ్ పాయింట్ - వీటన్నిటినీ క్రియేటివ్ అవుట్ లుక్ తో,  స్ట్రక్చర్ వున్నట్టే అన్పించకుండా పూత పూసేయాలి. స్ట్రక్చర్ అనేది కేవలం కథని నిలబెట్టే ఆస్థి పంజరం మాత్రమే. ఈ ఆస్థి పంజరానికి క్రియేటివిటీ అనే డ్రామాతో రక్తమాంసాలద్దినప్పుడే  స్క్రీన్ ప్లే ఒక రోబోలా అన్పించకుండా, నడిచి వస్తున్న రోమన్ వీరుడులా వుంటుంది. ఉదా : ‘దంగల్’, ‘భజరంగీ భాయిజాన్’. 

          చేయకూడనివి: మూస ఫార్ములా పాత్రలూ కథనాలూ ఇందులో చేయకూడదు. అయితే సెల్ఫ్ స్టార్టర్ , కిక్ స్టార్టర్  తరగతులు  రెండూ క్లిక్ స్టార్టర్  కి ఫ్రెండ్లీ తరగతులే. అన్ని తరగతులూ ఫ్రెండ్లీ తరగతులే ఇన్ స్పైర్ అవడానికి, అప్ డేట్ అవడానికీ. కిక్ స్టార్టర్  కి కాపీ కొట్టే ఖర్మ వుండదు గాబట్టి- ఎడ్యుకేషన్ మాత్రంగా పనికి రావొచ్చు ఇతర తరగతులు. న్యూస్ ఛానెల్స్ లో కొన్ని వార్తా కథనాలు కూడా కథానికి సంబంధించిన టెక్నిక్కుల్ని అందిస్తాయి.  

          ఫలితం :  ‘శివ’, ‘మనం’, ‘క్షణం’ మొదలైనవి...

          కర్తవ్యం:  స్ట్రక్చర్ తో రాజీ పడకూడదు. స్ట్రక్చర్ పైన క్యారక్టర్ ప్లే విషయంలో పాసివ్ పాలబడనంత వరకూ పట్టువిడుపులు తప్పవు. ఇవి కూడా మరీ గాడి తప్పితే తప్పుకోవడానికే సిద్ధపడాలి. దేవుడి విషయానికొస్తే, వీడికి  (శాస్త్రీయ) జ్ఞానం వుండీ దాస్తున్నాడే అనే జాలిపడతాడు. ఇంకో చోట సెట్ చేయడానికి బిజీ అయిపోతాడు. 90 కి ఎటువైపు వుండాలన్న విషయంలో మాత్రం సొంతవ్యక్తిత్వంతో నిశ్చితాభిప్రాయంతో వుంటాడు ఈ టైపు రచయిత.


-సికిందర్