సంక్రాంతికి విడుదలైన ‘శతమానం భవతి’ ఫ్యామిలీ డ్రామా ప్రారంభంలోనే బయటపడుతున్న ఒక రహస్యాన్ని గుర్తించ గల్గితే ఇలాటి కుటుంబ కథల్లో గొప్ప ముందడుగునీ, ఒక వేళ ఆ రహస్యాన్ని గుర్తించినా పట్టుదలకి
పోతే అంతే గొప్ప ఆశాభంగాల్నీ పొందాల్సి
రావొచ్చు భవిష్యత్తులో! టీవీ సీరియల్స్ మొదలైన కొన్నేళ్ళ వరకూ కుటుంబ కథలతో
సినిమాలు తీయాలంటే జంకే వాళ్ళు. తర్వాత ఫ్యాక్షన్ సినిమాల్లో కుటుంబ కథల్ని కలిపి కొన్నాళ్ళు కాలక్షేపం చేశారు. ఈ నరుక్కునే రాక్షసుల కుటుంబ కథలు
కూడా ముగిశాక, కుటుంబ కథలకి దూరంగా యాక్షన్ సినిమాలకీ, యాక్షన్ కామెడీలకీ వెళ్ళిపోయారు. మళ్ళీ కుటుంబ కథ టీవీ సీరియల్స్ నీ,
ఫ్యాక్షన్ సినిమాల్నీ బీట్ చేసే మార్గాన్ని ఎంచుకుని, కుటుంబ కథలకి పాత సంసారాల
వాసనల్నీ, పెల్లుబికిన హింసాప్రవృత్తినీ వదిలిస్తూ, ‘మనం’ రూపంలో నూతన శకపు క్రియేటివ్
– ఇన్నోవేటివ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చేసి ఆబాలగోపాలాన్నీ అలరించింది
అనూహ్యంగా. కుటుంబ కథలకి పాత సంసారమో, విపరీత హింసో అనే నిర్వచనాన్ని తిరగ రాసింది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు తగుదునమ్మా అని ‘శతమానం భవతి’ వచ్చేసి మళ్ళీ వెనక్కి- చాలా వెనక్కి
- ముగిసిపోయిన పాత శకంలోకి లాక్కెళ్తోంది. కానీ యూ ట్యూబ్ లో చూస్తే ఎప్పట్నించో
తెలుగు వంటకాలకి పాత పోకడలు వదిలిపోయాయ్. పూర్వీకులనుంచి సాంప్రదాయంగా వస్తున్న గోంగూర
పప్పు, పాలకూర పప్పు, పాలకూర వేపుడు, చుక్క కూర టమాటా లాంటి ఏకాకు కూరస్వామ్యంతో
విసిగి, రెండు మూడు రకాల ఆకు కూరల్ని కూడా కలిపి జానర్
మిక్సింగ్ చేసి ట్రెండీగా వండి
చూపించేస్తున్నారు. ఆకు కూరల్నెప్పుడూ ఒకే
ఆకుకూరగా వండాలన్న రూలుని బ్రేక్ చేసిన
ఈ తరం ఆడవాళ్ళు- కోడళ్ళూ వంటల్లో ఇంత ట్రెండీగా ముందడుగు వేస్తూంటే, నేటి
యువ సినిమా రచయితలేమో అదే పాత రోట్లో అదే పాత చింతకాయ పచ్చడి చెమట్లు కక్కుకుంటూ నూరుకుంటూ, 21వ శతాబ్దపు న్యూ ఏజ్ లేడీస్ కి ఫ్యామిలీ సినిమాలంటూ వడ్డించాలని
ఉబలాట పడుతున్నారు. పాపం పుణ్యం ప్రపంచ
మార్గం ఏమీ తెలీని అమాయక పసి బాలలు కదా!
ఒక్కటి గ్రహించడం లేదు, ఇవాళ్టి రోజున ఫ్యామిలీ
సినిమాల పేరుతో తీస్తున్నవి ఓ నలభై ఏళ్ల
క్రితం వరకూ ఏర్పడిన ఒక నమూనాని అనుసరించేనని. ఆ కాలానికి అప్పుడు స్థిర పడిన
నమూనానే అని. అప్పటి కాలం ఏమిటి? 1970-80 ల వరకూ కూడా భూస్వామ్య వ్యవస్థా, దాన్నాశ్రయించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థా కొనసాగుతున్నప్పుడు ఆ నేపధ్యంలోంచి అలాటి కథలు
వచ్చేవి. అప్పుడున్న అవసరాన్నిబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడే విలువలతో-
కలిసి జీవించడంలో వుండే ఆనందాలు, అనుబంధాలు, ఆత్మీయతలూ ఆకూపోకలతో కూడిన సినిమాలు వచ్చేవి. 1940- 50 లలో మొదలు
పెట్టి ‘ఇల్లాలు’, ‘తోడి కోడళ్ళు’ లాంటి
కుటుంబ సినిమాలు, 1970- 80 లలో ‘పండంటి కాపురం’,
‘ఆదిదంపతులు’ వరకూ కొనసాగి కొన్ని వందలు వచ్చాయి.
కానీ ఎనభైల తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతూ వచ్చింది. కారణాలనేకం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, విద్యా ఉద్యోగావకాశాలు, స్త్రీవిద్య, పాశ్చాత్యీకరణ, వివాహ వ్యవస్థలో మార్పులు, అధిక జనాభా; వ్యవసాయ రంగం, కుటీర పరిశ్రమల రంగం క్షీణించడం, సమాచార రవాణా వ్యవస్థలు మెరుగవడం, ఇరుకు నివాసాలు, కుటుంబ కలహాలతో పాటూ - హిందూ వారసత్వ, స్త్రీ ఆస్తి హక్కు, వివాహ, ప్రత్యేక వివాహ, వరకట్న నిరోధక చట్టాల సవరణల నేపధ్యంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చరిత్ర పరిసమాప్తమయ్యిందని సామాజిక వేత్తలు విశ్లేషించారు.
దీంతో ఇక ’90 లలో కొంతకాలం కుటుంబ సినిమాలు ‘రౌడీ అల్లుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘కలెక్టర్ గారి అల్లుడు’ లాంటి ఫక్తు ఎంటర్ టైనర్స్ గా మారిపోయాయి. కానీ అంతరించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాధని మరిపించడానికా అన్నట్టు- 1994 లో హిందీలో ‘హమ్ ఆప్ కే హై కౌన్’ మరిన్ని వెలుగుజిలుగులతో, వంటకాల ఆరగింపులూ త్రేన్పులతో, ఆడీపాడే వ్యాయామాలతో, మార్వాడీ కల్చర్ నేసుకుని అట్టహాసంగా రావడంతో, దాన్ని అనుసరించి 1996 లో తెలుగులో ‘నిన్నే పెళ్ళడతా’, ‘పెళ్లి సందడి’ వచ్చాయి. అక్కడ్నించీ మొదలయ్యింది గుంపుగా ఆభరణాల ధగధగలతో, పట్టు చీరెల ఫెళపెళలతో, అనవసరంగా పడీ పడీ నవ్వుతూ, వొయ్యారాలుపోతూ, ఎడాపెడా ఆటాపాటలతో, వ్యాపార యుగపు వెండితెరని ఆడవాళ్ళ (పాత్రల) తో నింపెయ్యడం. వీటిలో కథ హీరో హీరోయిన్ల పెళ్లి జరిపించడమే.
అయినా ఉమ్మడి బడిలోనే
ఇదే
సమయంలో 1991 లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితాలు 2000 నాటికి కనిపించ సాగాయి. యువతరం చదువులు, వృత్తి
ప్రాథమ్యాలూ సమూలంగా మారిపోయి విదేశాల బాట పట్టడం ప్రారంభమయ్యింది. ఈ చారిత్రిక
మూల మలుపులో గమనించాల్సిన ముఖ్యాంశమిటంటే- కుటుంబ సంబంధాలు పరోక్ష సంబంధాలుగా
మారిపోయే క్రమం మొదలయ్యింది. కానీ రెండు దశాబ్దాలు వెనక్కెళ్ళి చూస్తే, ఎనభైల
తర్వాత ఎలాగైతే ఉమ్మడి కుటుంబాల ఉపసంహార నేపధ్యంలో, న్యూక్లియర్ కుటుంబాల ఏర్పాటు క్రమం మొదలయ్యిందో, అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోని కొడుకులు,
కూతుళ్ళు తల్లిదండ్రుల్ని వదిలి వేరే పట్టణాల్లో కాపురాలు పెట్టడమనే ట్రెండ్
మొదలయ్యింది న్యూక్లియర్ కుటుంబాలు అని
నామకరణం చేసుకుని. ఉమ్మడి కుటుంబాలు పైన మూడో పేరాలో వివరించుకున్న
కారణాలతో చిన్న చిన్న (న్యూక్లియర్) కుటుంబాలుగా విడిపోయినా, కనీసం ఆ కొడుకులు కూతుళ్ళూ రాష్ట్రంలోనే, దేశంలోనే ఏదో ఒక
పట్టణంలో వున్నార్లే అన్న తృప్తి వుండేది కన్నవాళ్ళకి. రాకపోకలు, ఇచ్చి
పుచ్చుకోవడాలు అలాగే కొనసాగేవి. విచిత్రమేమిటంటే, ఈ న్యూక్లియర్ కుటుంబాలతో దూరంగా వెళ్ళిన వాళ్ళే
ఇబ్బందులు, బాధలూ పడేవారు. దీని మీద ఇతర
భాషల్లో సినిమాలు కూడా వచ్చేవి. తెలుగు సినిమాలు మాత్రం ఈ ముఖ్య దశని రికార్డు చేయలేకపోయాయి. అవెంత సేపూ ‘హమ్ ఆప్ కే హై కౌన్’ ని పట్టుకుని లేని సమూహిక సంబరాలే చిత్రించుకున్నాయి.
టీవీ సీరియళ్ళ విజృంభణతో ఈ తరహా సామూహిక సంబరాల కథలు కూడా ఖతం అయ్యాయి. దీంతో యాక్షన్ జోడించి ఫ్యాక్షన్ కుటుంబాల కథలు
మొదలయ్యాయి.
కానీ ఇప్పటికి గ్లోబలైజేషన్ ఊపందుకుని, ఉమ్మడి కుటుంబాల ఊసూ ఉనికీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయి, న్యూక్లియర్ కుటుంబాలే ఆధునిక కుటుంబ వ్యవస్థకి గుర్తులుగా మారాయి. ఇప్పుడు ఇవే న్యూక్లియర్ కుటుంబాల నుంచి విదేశాలకి యువత వలసలు మొదలయ్యాయి. ఇక్కడొచ్చింది సమస్య. ఆనాడు ఉమ్మడి కుటుంబాల నుంచి తాము విడిపోతే ఆ తరం పెద్దలు ఎంత బాధ పడ్డారో, ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాల నుంచి తమ పిల్లలూ విడిపోతూంటే ఈ తరం పెద్దలకి అలాటి బాధే మొదలయ్యింది. అయితే ఉమ్మడి కుటుంబ పెద్దలకి ఎదురవని తీవ్ర కష్టాలు న్యూక్లియర్ కుటుంబ పెద్దలకి ఎదురవసాగాయి. పలకరించే నాథుడు లేక వాళ్ళు వృద్ధాశ్రమాల పాలవసాగారు. కొందర్ని వాళ్ళ పిల్లలే వదిలించుకుని వెళ్ళిపోయారు. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు ఓ వృద్ధాశ్రమంలో తన కెదురైన దిగ్భ్రాంతికర అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడే వస్తానని వృద్ధాశ్రమం బయట వదిలి విదేశాలకి వెళ్ళిపోయిన కొడుకు కోసం, ప్రతిరోజూ ఆ వృద్ధురాలు బయట నిలబడి ఎదురు చూసేదట అదే సూటుకేసు పట్టుకుని ...
ఈ వ్యాసకర్తకి బాగా తెలిసిన విద్యాధికుడు, వ్యాపార వేత్తా, సంపన్నుడూ అయిన ఒకరు ఎనిమిది పదుల వయసులో, హృద్రోగంతో వున్నా, నగరంలో అందరూ వుండీ వృద్ధాశ్రమం పాలయ్యారు. హైదరాబాద్ లో ఒకప్పుడు లేని అనాధాశ్రమాలు ఇప్పుడు నాల్గు వందలకి పైగా పెరిగాయి. కొడుకులు నగరంలోనే వుంటున్నా అనేక మంది తల్లి దండ్రులు వృద్ధాశ్రమాల్లో వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధాశ్రమాలు పెద్ద ఇండస్ట్రీ గా ఎదిగాయి.
ఇంకో కుటుంబంలో రెండేళ్ళ క్రితం నగలమ్మి
కొడుకుని విదేశం పంపిస్తే నాల్గు నెలలు
డబ్బు పంపి, ఐదో నెలలో తగ్గించాడు. ఆరో నెలలో పంపించనా? అన్నాడు. నీ ఇష్టముంటే
పంపమన్నారు. పంపడం మానేశాడు. ఇలాటి కేసులు కొన్ని ఎప్పుడూ వుంటాయి. చాలా వరకూ
సంబంధాలు బాగానే వుంటున్నాయి – సెల్,
స్కైపుల వంటివి కల్పించే పరోక్ష
సంబంధాలతో. ఇక ఏడాది కోసారైనా రాకపోకలు
కూడా వుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలప్పటి
పెద్దల మైండ్ సెట్ ఇప్పటి న్యూక్లియర్ కుటుంబ పెద్దలకి అంతగా లేదు.
పరిణామాలని వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటున్నారు.
కానీ ఈ పరిణామాల్లోంచి సినిమాలకి కథలవసరం. దీన్ని ఇంకోలా మార్చి, రోమాంటిక్ యాంగిల్లో మేనరికాల కథలుగా తీర్చి దిద్ది, పాతికేళ్ళ క్రితమో ముప్పై ఏళ్ల క్రితమో తెగిపోయిన బంధుత్వాల్ని అతికించే ఎన్నారై కథాకళులు మొదలయ్యాయి. ఒకే దర్శకుడు ‘అత్తారింటికి దారేది’ తీసి, వెంటనే ‘సన్నాఫ్ సత్య మూర్తి’ తీశాడు. ఆతర్వాత ‘అ ఆ’ కూడా! ఇక ‘చిన్నదానా నీకోసం’, ‘పండగ చేస్కో’ ఇదే దారిపట్టాయి...
కాలం చెప్పని కథలు
ఈ మేనరికాల కథలు రిపీట్ అవుతున్నాయని కావొచ్చు, ఇద్దరు స్నేహితుల కుటుంబాల్ని కలిపే ‘ఆటాడుకుందాం రా’ అంటూ వచ్చాయి. మరోవైపు రెండు కుటుంబాల కథల నుంచీ జరిగి ఒకే కుటుంబంలో దూరమయ్యే కొడుకుల కథలతో ఇప్పటికి ‘శతమానం భవతి’ దగ్గర కొచ్చి ఆగాయి. ఈ ట్రెండ్ లో గత ఏడెనిమిది నెలల కాలంలో ఇలాటి ఓ మూడు స్క్రిప్టులు ఈ వ్యాసకర్త దగ్గరికి వచ్చాయి. కలిసుందాం, కలిసుందాం, కలుపుకుందామని నినదిస్తూ వున్న ఈ కథల మూలాలెక్కడున్నాయని రీసెర్చి చేసుకొస్తే, బయటపడినవే పై పేరాల్లో చెప్పుకున్న కుటుంబ, సామాజిక పరమైన పరిణామాలతో కూడిన అంశాలు. ఉమ్మడి కుటుంబాల పైన, న్యూక్లియర్ కుటుంబాల పైనా ఐపీ దేశాయ్, బిపి అగర్వాలా, మిల్టన్ సింగర్, హెచ్ లక్ష్మీ నారాయణ్ ల వంటి సామాజిక వేత్తలు చేసిన పరిశోధనలు.
పరిశోధనలు
ఇలా వుంటే, ఇప్పటి సమస్య న్యూక్లియర్ కుటుంబాల సమస్యే అయితే, ఈ కథలు ఇంకా ఉమ్మడి కుటుంబాలనే పట్టుకుని
వున్నాయి అవే వాసనలతో. ఉమ్మడి కుటుంబాలప్పటికీ ఇప్పటికీ భావోద్వేగాలు ఒకటే
కావొచ్చు. భావోద్వేగాలెప్పుడూ ఒకటే- బాహ్య పరిస్థితులే మారతాయి. కాలీన స్పృహ లేని బాహ్య
పరిస్థితుల కల్పన భావోద్వేగాల నుంచి వేర్పడిపోతుంది. ఏ కాలానికి అప్పటి పరిస్థితుల
కల్పనే జరగాలి. ఎంత ఊహా కల్పనైనా వాస్తవాల పునాదుల మీద జవాబుదారీ గా నిలబడాల్సిందే
తప్ప, పలాయన వాదం పనికి రాదు. ఇదంతా నేటి సీదా సాదా కమర్షియల్ సినిమాల గురించే- భారీ
కళాఖండాల గురించి కాదు. చెప్పుకోవాలంటే బాధపడాల్సివస్తున్న నేటి యువ సినిమా రచయితలు, తామే అనుభవించని జాయింట్ ఫ్యామిలీల ముచ్చట్లు
అంతగా తీర్చుకోవాలని వుంటే – ‘1979 – ఓ ఉమ్మడి కుటుంబం కథ’ అని కథని ఆ కాలంలో
స్థాపించుకుని రాసుకోవచ్చు. ఇప్పుడు ముంబాయిలో మఫియాలే లేకపోయాక,
‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి’
అని మాఫియాల కాలంలోనే కథని
స్థాపించి తీశారు. అదే ఇప్పుడింకా మఫియాలున్నట్టుతీస్తే, ముందు రాం గోపాల్ వర్మకే జీవితం మీద విరక్తి పుట్టి ఎటో వెళ్ళిపోయే అవకాశముంది.
అదే వరస
న్యూక్లియర్
కుటుంబాల నుంచి దూరమవుతున్న నేటి యువతకి ఎప్పటివో తాము పుట్టి వుండనప్పటి ఉమ్మడి కుటుంబాల్లోని ఆత్మీయతానురాగాలూ, ఆ సంబంధాలూ, బంధుత్వాలూ తెలీవు. వాళ్ళు ఫీల్ కారు. మరి ఆ వాతావరణపు కథలు ఎవరి కోసం? అప్పటి ఉమ్మడి కుటుంబాల్లోని
తండ్రులు ఇప్పుడు ముత్తాతలై వుంటారు, వాళ్ళ కోసమా? ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల
తండ్రులు ఇప్పుడు తాతలై వుంటారు, వీళ్ళ కోసమా? బాక్సాఫీసు అప్పీల్ ఏది? కమర్షియాలిటీ
ఏది? తాత ముత్తాతల కథలు చిన్నప్పుడు పడుకునేప్పుడు చిన్న పిల్లలకి చెప్పుకుంటే
వాళ్లకి బావుంటాయి. అదే మీసాలొచ్చాక,
చున్నీలేసుకున్నాక కూడా సినిమాలుగా తీసి వెంటాడితే యాక్సిడెంట్లు అవుతాయి
బాక్సాఫీసుకి.
కుటుంబ కథ అనగానే పైన చెప్పుకున్నట్టు 1980 దగ్గర ఆగిపోయిన ఉమ్మడి కుటుంబ కథలే అన్న వ్యామోహం- ఎటాచ్ మెంట్ పెంచుకున్నారు. ఆనాడు నాల్గు దశాబ్దాల మన్నికతో ఆ ఉమ్మడి కుటుంబ కథలు తెలియకుండానే కుటుంబ కథలకి ఒక నమూనాగా మనసుల్లో ముద్రేసుకున్నాయి ఇప్పటికీ. ఆ సినిమా కథలే తప్ప, పాత్రలే తప్ప , అవి ఏ నేపధ్య పరిస్థితుల్లోంచి వచ్చాయీ, ఆ పరిస్థితులు ఇప్పుడూ వున్నాయా అన్న ఆలోచనే అక్కర్లేకుండా పోయింది. కాస్త పాపం పుణ్యం ప్రపంచమార్గం తెలీని పసి బాలల స్థితినుంచి, చుట్టూ మారిపోయిన ప్రపంచ, కుటుంబ, ఆర్ధిక సంబంధాల మదింపు చేసుకునే అలవాటు పెంచుకుంటే తప్పకుండా యూత్ అప్పీల్ అవసరమున్న బాక్సాఫీస్ దాహార్తిని తీర్చగల్గుతారు.
అయినా సరే మేం రాసుకున్నట్టే ప్రొసీడవుతామనేసరికి, ఆ మూడు స్క్రిప్టుల కథా ముగిసిపోయింది. ఇప్పుడు ‘శతమానం భవతి’ తర్వాత వాటి భావిష్యత్తేమిటో చూడాలి. ఇలాగే ఇంకో ప్యూర్ ఉమ్మడి కుటుంబ కథ- మళ్ళీ కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబాల్లో కి వచ్చెయ్యాలని (!!)డిమాండ్ చేసే కథ కూడా ఈ వ్యాసకర్తని రాచి రంపాన పెట్టి మాయమైపోయింది.
అయిపోలేదు- ‘శతమానం భవతి’ విడుదలైన మర్నాడే, ఇలాటిదే ఇంకో పూర్తి స్థాయి స్క్రిప్టు కింకర్తవ్యం కోసం ఈ వ్యాసకర్త దగ్గరికి వచ్చి ఎదురుగా టేబుల్ మీద ఆశీనురాలై వుంది. బట్ - ‘శతమానం భవతి’ మొదటి సీన్లలోంచే తొంగి చూస్తున్న సీక్రెట్ తో ఇప్పటికైనా ఒక నూతన శకపు క్రియేటివ్ –ఇన్నోవేటివ్ – బాక్సాఫీసు ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాకపోతే కాలం క్షమిస్తుందేమో చూడాలి.
ఏమిటా రహస్యం?
‘శతమానం భవతి’ విడుదల కాక మునుపు ఆదివారం
ఎప్పట్లాగే వ్యసనాన్ని చంపుకోలేక, మూడు
రూపాయలు పెట్టి ఆంగ్ల ఆథ్యాత్మిక పత్రిక ‘స్పీకింగ్ ట్రీ’ కొనుక్కుని చదివాడీ
వ్యాసకర్త. అందులో బ్యానర్ ఐటెం గా ములాయం సింగ్ యాదవ్- అఖిలేష్ యాదవ్ తండ్రీ
కొడుకుల సిగపట్ల గురించి వుంది. దీని మీద ఓషో రజనీష్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే
పూర్తి వ్యాసం వుంది. ఓషో రజనీష్
జీవితాల్లోనే కాదు, సమాజంలో, రాజకీయంలో, ప్రపంచంలో తలెత్తే సమస్యలకి
కారణాలూ, వాటి పరిష్కారాలూ అపూర్వంగా చెప్పేసి 59 ఏళ్లకే మరణించాడు.
ఈ వ్యాసంలో పాత తరానికీ యువతరానికీ జనరేషన్ గ్యాప్ ( తరాల అంతరం) సమస్య ఎప్పట్నించీ మొదలై ఎందుకేర్పడిందో, పరిష్కార మేమిటో వివరించాడు. జనరేషన్ గ్యాప్ తో సమస్యలు కేవలం తండ్రీ కొడుకుల మధ్యే కాదు, అన్నదమ్ముల మధ్య కూడా ఏర్పడతాయి. అన్నకీ, చివరి తమ్ముడికీ పదేళ్ళకి పైన గ్యాప్ వుందంటే, జనరేషన్ గ్యాప్ తో తమ్ముడు అన్నని అవుట్ డేటెడ్ గా లెక్కేసి దూరంగా వుండే అవకాశాలున్నాయి. అలాగే రక్త సంబంధీకుల మధ్యే కాదు, బయట ఇతర అన్ని సంబంధాలలోనూ ఈ సమస్య తలెత్తుతుంది. బాస్ కీ ఉద్యోగికీ మధ్య, గురువుకీ శిష్యుడికీ మధ్య.....ఇలా తరాల అంతరాలతో తంపులుంటాయి. ఈ సమస్య ఎప్పట్నించీ ఎందుకని మొదలయ్యిందో, అంతకి ముందు ఎందుకు లేదో, దీనికి సముచిత పరిష్కారమేమిటో ఈ లింక్ ని క్లిక్ చేసి http://www.speakingtree.in/article/leadership-tussle రజనీష్ మాటల్లోనే తెలుసుకుంటే ఒక కొత్త విజన్ ఏర్పడుతుంది.
ఇలా కుటుంబ కథలకి ఒక కొత్త కోణం దొరికిందని నోట్ చేసుకుని, ఆ పై శనివారం ‘శతమానం భవతి’ కెళ్తే, మొదటి మూడు నాల్గు సీన్లలోనే ఆ కోణం ఇక్కడ కనెక్ట్ అయిపోయి- ‘శతమానం భవతి’ లాంటి స్టక్ అయిపోయిన కథల్ని నవీకరించి ముందుకి నడిపించగల రహస్యం తెలిసిపోయింది!
ఏమిటా రహస్యం? ప్రకాష్ రాజ్ పాత్ర, జయసుధ పాత్రల ఆక్రోశం ఏమిటంటే, పదేళ్లుగా విదేశాల్లో వుంటున్న కొడుకులు తమని పట్టించుకోవడం లేదని. పట్టించుకోరు, ఐతే ఏంటి? రేపా కొడుకుల పిల్లలు (మనవళ్ళు)కూడా ఆ కొడుకుల్ని(వాళ్ళ తండ్రుల్నీ) పట్టించుకోరు, అప్పుడేంటి? ఇంకాపైన ఆ మనవళ్ళ కొడుకులు కూడా ఆ మనవళ్ళని పట్టించుకోరు, అప్పుడు కూడా ఏంటి? ఇలా వంశంలో తమ తర్వాత తరాలు ఎలాపోయినా ఫరవా లేదు, తామొక్కరే ఇప్పుడు కొడుకుల కోసం ఆక్రోశించి, వాళ్ళని రప్పించుకుని, సాధించి సుఖపడితే చాలా? ప్రకాష్ రాజ్, జయసుధల పాత్రలు ఇలా తమ సుఖం మాత్రమే చూసుకుంటూ, స్వార్ధంతో, అజ్ఞానంతో అరిచి గీ పెడితే పెద్దరికానికి ఓకేనా?
ప్రకాష్ రాజ్ పాత్ర ఇప్పుడు ఇరవయ్యేళ్ళ మనవరాలి (హీరోయిన్) కి తాత అంటే, 1990 లలో ఇరవై ఏళ్ల కూతురికి తండ్రి అయి వుండాలి. అంటే 1970 లలో తన పెళ్ళయి వుండాలి. అంటే అదే పల్లెటూళ్లో ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం చూసింతర్వాత, తన కొడుకుల న్యూక్లియర్ కుటుంబాలూ చూసింతర్వాత, ముందు తరాల్లో ఈ న్యూక్లియర్ కుటుంబాలైనా ఏమౌతయోనన్న ఆందోళన వుండాలి- అది అప్పుడు ఆ వయసుకి, ఆ అనుభవానికి, పాత్రోచిత న్యాయం అవుతుంది. కుటుంబ పెద్ద పాత్రే ఇలా ఆలోచించకపోతే అదెలాంటి పాత్ర చిత్రణ అవుతుంది? ఇది చూసిన ప్రేక్షకులకి ఏం ప్రయోజనం దక్కుతుంది?
సరే నా కొడుకువల్ల నాకీ పరిస్థితి వచ్చింది, రేపు వాడి కొడుకువల్ల వాడికి కూడా నాలాంటి పరిస్థితి రాకూడదని ఆ కొడుకు శ్రేయస్సు ఆలోచించే తండ్రి మనసు గొప్పదా, ఆ మేరకు చర్యలు తీసుకుని పాటుపడితే మంచిదా – లేక ఇలా తనవరకే ఏడుస్తూ కూర్చుని, రేపా కొడుకుల న్యూక్లియర్ కుటుంబాలు కూడా ముక్కలై, మున్ముందు వంశస్థులు వాయిదాల పద్ధతిలో కోన్ కిస్కా లై తిరుగుతూంటే మంచిదా? ఫలానా కుటుంబరావుగారి వంశమేదీ? ఎక్కడ? – అని ఎవరు ఆరాతీయాలి?
ఉమ్మడి కుటుంబాలు పోయాక - 'సబ్ కే సాథ్ సబ్ కా వికాస్’ మంత్రం ఇక్కడ అస్సలు పని చెయ్యదు. ‘ఉస్కే సాథ్ (మనవళ్ళతో) ఉస్కా (కొడుకుల) వికాస్’ కోసం మాత్రమే తను కృషి చేయాల్సి వుంటుంది.
ఇలాటి కథల్లో హీరో హీరోయిన్లు కూడా తమ తాతతో పదేళ్ళు పోయినా కలవని తల్లిదండ్రుల్ని ఉత్త పుణ్యానికి తీసి కెళ్ళి కలిపేస్తూంటారు కామెడీలు చేసి. వాళ్ళు పరిహారం చెల్లించుకోనక్కర్లేదా? ఈ దిశగా హీరో హీరోయిన్ల పాత్ర చిత్రణలున్నప్పుడే కదా కుటుంబ సినిమాలు కూడా యూత్ అప్పీల్ తో బాక్సాఫీసు కడుపు నింపేది.
***
ఉమ్మడి కుటుంబాల నాటి పాటల సాహిత్యం ఇప్పుడు లేదు, పాటల బాణీలూ ఇప్పుడు లేవు, ఆ డాన్సులూ ఇప్పుడు లేవు, సంభాషణల్లో ఆ పదాలూ ఇప్పుడు లేవు, పాత్రల తీరు తెన్నులూ అప్పట్లా లేవు, ఫైట్లూ అప్పట్లా లేవు... అన్నీ మారిపోతూ వచ్చాయి...ఇంకా మారిపోతూ వుంటాయి. రచయిత రాసుకునే అక్షరాలెందుకు మారవు!! మారిస్తే ట్రెండీ కర్రీస్ లేడీస్ వచ్చి కొడతారా?
ఉమ్మడి కుటుంబాల నాటి పాటల సాహిత్యం ఇప్పుడు లేదు, పాటల బాణీలూ ఇప్పుడు లేవు, ఆ డాన్సులూ ఇప్పుడు లేవు, సంభాషణల్లో ఆ పదాలూ ఇప్పుడు లేవు, పాత్రల తీరు తెన్నులూ అప్పట్లా లేవు, ఫైట్లూ అప్పట్లా లేవు... అన్నీ మారిపోతూ వచ్చాయి...ఇంకా మారిపోతూ వుంటాయి. రచయిత రాసుకునే అక్షరాలెందుకు మారవు!! మారిస్తే ట్రెండీ కర్రీస్ లేడీస్ వచ్చి కొడతారా?
-సికిందర్