రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, నవంబర్ 2023, శనివారం

1379 : రివ్యూ


 రచన -దర్శకత్వం: అజయ్ భూపతి

తారాగణం : పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్ తదితరులు  
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్
బ్యానర్ : ముద్ర  మీడియా వర్క్స్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
విడుదల : నవంబర్ 17, 2023
***

        ‘ఆర్ ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి మూడో సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్పుత్ హీరోయిన్. అజయ్ భూపతి పాయల్ రాజ్పుత్ తో అడల్ట్ మూవీ ఆర్ ఎక్స్ 100 తీసిన తర్వాత శర్వానంద్- సిద్ధార్థ్ లతో తీసిన మహాసముద్రం హిట్ కాలేదు. పాయల్ కూడా ఆర్ ఎక్స్ 100  తర్వాత నటించిన 8 సినిమాలూ హిట్ కాలేదు. తిరిగి ఇప్పుడు ఇద్దరూ ఇంకో అడల్ట్ మూవీ మంగళవారం తో తిరిగి వచ్చారు. మరి ఈసారి ఆర్ ఎక్స్ 100 లాంటి మ్యాజిక్ వర్కౌట్ అయిందా? ఈ విషయం తెలుసుకుందాం...

కథ  

    రాజమండ్రి దగ్గర్లో ఓ గ్రామంలో గ్రామ దేవతకి ఇష్టమైన  మంగళవారం రోజు రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. దీనికి ముందు రోజు మృతులిద్దరికీ అక్రమ సంబంధముందని గోడ మీద ఎవరో రాస్తారు. కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందితా శ్వేత) వీటిని హత్యలుగా అనుమానించి పోస్ట్ మార్టంకి పంపించబోతే జమీందారు (కృష్ణ చైతన్య) అడ్డుపడతాడు. తిరిగి మళ్ళీ మంగళవారం ఇలాగే ఇంకో రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి కూడా అక్రమ సంబంధముందని ముందురోజు ఎవరో గోడ మీద రాస్తారు. దీంతో ఎస్సై మాయ  ఈ నాలుగు మరణాలని హత్యలుగా భావించి చర్యలు తీసుకుంటుంది. ఇవి హత్యలైతే ఎవరు ఎందుకు చేస్తున్నారు? గోడల మీద రాస్తోందెవరు రు? ఈ వ్యవహారంలో జమీందారు, జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), ఫోటోగ్రాఫర్ (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్) ల ప్రమేయం ఏమిటి? కొన్నాళ్ళ ముందు ఊరంతా వెలి వేసిన శైలు (పాయల్ రాజ్పుత్) కథ ఏమిటి? ఆమె ప్రేమించిన మదన్ (అజ్మల్ అమీర్) వ్యవహారమేమిటి? చివరికి ఏం తేల్చింది ఎస్సై మాయ? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    ఏ- సర్టిఫికేట్ పొందిన ఈ అడల్ట్ సినిమా కథ నింఫోమేనియక్(అదుపులో లేని  కామకోరికల) యువతి గురించి. నింఫోమేనియా మీద హాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. దీన్ని తెలుగులో ప్రయత్నించారు. ఈ నింఫోమేనియా బాధితురాలి చుట్టూ వాళ్ళవాళ్ళ అవసరాలతో చాలామంది నేరాలు ఘోరాలకి పాల్పడతారు. చివరి అరగంట కథలో ఇవి పొరలుపొరలుగా బయటపడతాయి. అయితే కథంతా ఈ బాధితురాలి సమస్యకి పరిష్కారం వెతికే మానవత్వం చూపించక, అడుగడుగునా ఆమె పట్ల క్రూరత్వమే ప్రదర్శించి అంతమొందించడం సినిమాకోసం అవసరమై వుండొచ్చు.
       
ప్రధాన పాత్ర పోషించిన పాయల్ ఇంటర్వెల్ వరకూ కనిపించదు. ఫస్టాఫ్ గ్రామంలో మరణాలు
, వివిధ పాత్రలు వాటి పరిచయాలు, స్వభావాలు, వేడుకలు, కొట్లాటలు ఇవే సాగుతూ, ఇంటర్వెల్ షాట్ లో పాయల్ మిస్టీరియస్ గా కనిపించడంతో ముగుస్తుంది. ఇలా ప్రధాన పాత్ర లేని, కథ ప్రారంభం కాని ఫస్టాఫ్ తో బోరు కొట్టకుండా కాస్త ఎంటర్ టైన్ కూడా చేస్తూ నడిపాడు దర్శకుడు.
       
ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ తో సెకండాఫ్ కథ ఒక ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆమె కాలేజీకి వెళ్ళడం
, కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ మదన్ తో ప్రేమాయణం చాలా పేలవంగా సాగుతాయి.  అయితే ఈ ఎపిసోడ్ లోనే పాయల్ మానసిక రుగ్మత తాలూకు చిహ్నాలు కన్పిస్తాయి. అవి పెరిగి పెరిగి లైంగికంగా ఆమె విచ్చల విడితనానికి దారి తీస్తాయి. ఈ మలుపు దగ్గర్నుంచి కథ ఇంకెన్ని మలుపులు తిరిగిందన్నది వెండి తెరపైనే చూడాలి.  
       
చివరి అరగంటలోనే ఐదారు మలుపులు
, వాటి ఫ్లాష్ బ్యాకులు మొత్తం జరిగిన నేరాల చుట్టూ కథని సమప్ చేస్తాయి. దీన్ని లాజికల్ గా పకడ్బందీగా పోషించాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో కనిపించిన వివిధ పాత్రలు ఇక్కడ సర్ప్రైజింగ్ గా రివీలవుతాయి. అయితే చివర్లో ముసుగు వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ని విప్పినప్పుడు ఈ హైడ్రామా తేలిపోతుంది. అసలు ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో పెద్ద సస్పెన్స్ కాదు. ఎందుకంటే ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్నప్పటి కథలో అతను చనిపోయినట్టు చూపించారుగానీ, పాత్రని బట్టి బతికే వుంటాడనీ, తిరిగి వస్తాడనీ వూహించేయ వచ్చు.
       
కాబట్టి ముగింపులో హల్చల్ చేస్తున్న ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో ఇట్టే తెలిసిపోతుంది. అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం ఇంకో ఫినిషింగ్ టచ్ ఇచ్చి వుండొచ్చు. ముసుగు తీసినప్పుడు అతను ఎవరైనా పాపులర్ హీరో అయివుంటే సర్ప్రైజ్ చేసే వాడు. ముగింపు నెక్స్ట్ లెవెల్లో వుండేది. ఈలలు పడేవి. ఇలా కాకుండా ఎవరో తెలియని ఆర్టిస్టుని చూపించారు. ఆ స్థానంలో వుండాల్సింది ఎంతో కొంత గుర్తింపు వున్న హీరో. ఎవరైనా తెలిసిన హీరో అయివుంటే పాయల్ లాంటి హీరోయిన్ కోసం డ్రామా ఎక్సైటింగ్ గా ఎలివేట్ అయ్యేది. అనామకుడితో
, అతడి అనుభవం లేని నటనతో పూర్తిగా విఫలమైంది. దీని తర్వాత రెండు పాత్రలతో వేరే ట్విస్టులు ముగింపుని నిలబెడతాయి.

నటనలు- సాంకేతికాలు

    ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్ననాటి కథ వుంటుంది. ఇంటర్వెల్లో హార్రర్ ఎంట్రీ ఇచ్చాక సెకండాఫ్ లో అరగంట ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనిపిస్తుంది. కాకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే మూసి పెట్టిన ఆమె కథని, వివిధ పాత్రలు వాటి ఫ్లాష్ బ్యాకులు చెప్తూ ఆమెని తెరపైకి తీసుకొస్తూంటారు. దీంతో పాయల్ సెకండాఫ్ అంతా కన్పిస్తుంది. ఈ సెకండాఫ్ అంతా ఆమెది నాన్ స్టాప్ ఏడుపే. ప్రతీ సీనులో ఆమని కొట్టడం,వాడుకోవడం, వెళ్ళగొట్టడం తాలూకు ఏడ్పులే వుంటాయి. ఇలా పాత్ర మానసిక సంఘర్షణతో బలమైనదే. దీన్ని పకడ్బందీగా పోషించింది. ఆర్ ఎక్స్ 1000 కంటే ఈ పాత్ర బలమైనదే. ఇది నటించడానికి ధైర్యం కూడా కావాలి. కాకపోతే కథగా పాత్రకి న్యాయం జరగలేదు. ఆమె పాత్రని మిగతా పాత్రల కథలు కమ్మేయడంతో, ఆఖరికి పటానికి దండేసి వూరంతా కొలిచే పాత్ర వేరే అయింది.
        
ఇక బాగా ఆకట్టుకునే ఇంకో పాత్ర డాక్టర్. ఈ పాత్రలో రవీందర్ విజయ్ చివరి ట్విస్టుల్లో పాయల్ కంటే ఎక్కువ సానుభూతిని కొట్టేస్తాడు. రియల్ హీరో అనిపిస్తాడు. జమీందారుగా చైతన్య కృష్ణకి నటించే అవకాశమున్న పాత్ర దక్కింది. జమీందారు భార్యగా దివ్యా పిళ్ళై ముగింపులో విజృంభిస్తుంది. అన్ని పాత్రల మధ్య కరివేపాకు పాత్ర ఎస్సైగా వేసిన నందితా శ్వేతదే. ఈమె వూళ్ళో పోలీసు గస్తీ పెట్టిస్తే ఒక్క మర్డర్ జరగదు. ఆ పని చేయదు. పాత్రలిచ్చే ట్విస్టులు చూసి తెల్లబోవడం తప్ప.
       
అంధుడి పాత్ర వేసిన ఆర్టిస్టుతో అజయ్ ఘోష్ కామెడీ చేశాడు- డబుల్ మీనింగుల కామెడీ. ఫోటో గ్రాఫర్ గా శ్రవణ్ రెడ్డిది కీలక పాత్రే. ఇంగ్లీష్ లెక్చరర్ గా అజ్మల్ అమీర్ కి పాయల్ తో రోమాన్స్
, ఒక పాట, కొన్ని అడల్ట్ సీన్స్ కుదిరాయి.
       
అజనీష్ లోక్‌నాథ్
సంగీతంలో మూడు పాటలున్నాయి. జాతర పాట చిత్రీకరణ సహా హైలైట్. దాశరథి శివేంద్ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది సీజీ సహా. సాంకేతికంగా సినిమా బలంగా వుంది. దర్శకుడు అజయ్ భూపతి తిరిగి ఆర్ ఎక్స్ 100 రేంజికి చేరుకోకపోయినా యూత్ అప్పీల్ లేని అడల్ట్ మూవీతో ఫర్వాలేదనిపించే కొత్త ప్రయోగం మాత్రం చేశాడు.
—సికిందర్