రచన- దర్శకత్వం మనీష్ శర్మ
తారాగణం : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్,
ఇమ్రాన్ హాష్మి, రేవతి, సిమ్రాన్, కుముద్ మిశ్రా,
షారూఖ్ ఖాన్ (గెస్ట్) తదితరులు
సంగీతం (పాటలు) : ప్రీతమ్, సంగీతం (నేపథ్యం) : తనుజ్ టికూ, ఛాయాగ్రహణం : అనయ్ గోస్వామి
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్, నిర్మాత : ఆదిత్యా చోప్రా
విడుదల : నవంబర్ 12, 2023
***
యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై
యూనివర్స్ సినిమాల్లో ‘టైగర్3’ ఐదవది. మొదటి నాలుగు ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా
హై’, ‘వార్’, ‘పఠాన్’ మొదలైనవి. ఇవికాక ‘వార్2’, ‘టైగర్ వర్సెస్ పఠాన్’ మరో
రెండు రాబోయే స్పై యూనివర్స్ సినిమాలు. మొదటి నాలుగు సినిమాల వసూళ్ళు 2,426 కోట్ల రూపాయలని చెబుతున్నారు. టైగర్ పేరుతో సినిమాల్లో సల్మాన్ ఖాన్
నటిస్తే, వార్ పేరుతో హృతిక్ రోషన్ ఒకటి నటించాడు. ‘వార్ 2’ లో హృతిక్- ఎన్టీఆర్ లు నటించబోతున్నారు. అలాగే
‘టైగర్ వర్సెస్ పఠాన్’ లో సల్మాన్-
షారుఖ్ లు బద్ధ శత్రువులుగా నటించ బోతున్నారు. టైగర్ సిరీస్ లో సల్మాన్- కత్రినా
కైఫ్ లు గూఢచారులుగా నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుత ‘టైగర్ 3’ లో కూడా ఇద్దరూ అవే పాత్రల్ని కంటిన్యూ చేశారు.
అయితే ఈసారి దర్శకుడు
యాక్షన్ సినిమాలు తీసిన దర్శకుడు కాదు. ఇతను ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘లేడీస్ వర్సెస్ విక్కీ బహల్’, ‘శుధ్ దేశీ రోమాన్స్’ వంటి
చిన్న రోమాంటిక్ సినిమాలు తీసిన దర్శకుడు మనీష్ శర్మ. అయాన్ ముఖర్జీ కూడా ఇలాటి
చిన్న సినిమాలు తీసిన దర్శకుడే. ఇతను ‘బ్రహ్మస్త్ర’ వంటి బిగ్ యాక్షన్ మూవీ తీసి హిట్ చేశాడు. మరి ‘టైగర్3’ తో మనీష్ శర్మ ఈ రేంజిని అందుకోగలిగాడా?ఈ విషయం
పరిశీలిద్దాం...
అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగర్
(సల్మాన్ ఖాన్) ‘రా’ ఏజెంట్. జోయా (కత్రినా కైఫ్) పాకిస్తానీ ఐఎస్సై ఏజెంట్.
ఇద్దరూ గత ‘టైగర్ జిందా హై’ లో
భార్యాభర్తలయ్యారు. ఇప్పుడు ఎదిగిన కొడుకు వున్నాడు. మైథిలీ మీనన్ (రేవతి) ‘రా’ చీఫ్. ఈమె రష్యాలోని పీటర్స్ బర్గ్ లో టైగర్ కి
ఒక ఎసైన్మెంట్ అప్పజెప్తుంది. ఆ ఎసైన్మెంట్ మీద వెళ్ళిన టైగర్ కి అదే ఎసైన్మెంట్
కి వ్యతిరేకంగా పనిచేస్తున్న జోయా దొరికి పోతుంది. ఏమంటే,
మాజీ ఐఎస్సై ఏజెంట్ ఆతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హాష్మి) తమ కొడుకుని బంధించి బ్లాక్
మెయిల్ చేశాడని చెప్తుంది. ఇప్పుడు ఆతీష్ అదే
కొడుకుని అడ్డం పెట్టుకుని జోయా, టైగర్ లు ఇంకో ఆపరేషన్
చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
దీంతో ఇస్తాన్బుల్ లో భద్రపర్చిన పాకిస్తాన్ కి చెందిన సీక్రెట్ న్యూక్లియర్ కోడ్స్ దొంగిలించడానికి వెళ్తారు టైగర్-జోయా. ఆ కోడ్స్ తో ఇండియా మీద పగదీర్చుకోవాలను కుంటున్నాడు ఆతీష్. 1999 కార్గిల్ యుద్ధంలో శాంతి ప్రక్రియకి ఆతీష్ అడ్డుపడడంతో సైన్యం అతడ్ని తొలగించింది. ఇండియాతో శాంతిని వ్యతిరేకించే ఆతీష్ పగబట్టి వున్నాడు. ఇప్పుడా సీక్రెట్ కోడ్స్ తో ఇండియా మీద దాడి చేయాలనుకుంటున్నాడు. టైగర్- జోయా
లు ఆ సీక్రేట్ కోడ్స్ అతడికి అప్పగించి కొడుకుని కాపాడుకున్నతర్వాత, ఈ దొంగతనం టైగర్ మీద వేసి పాక్ ఆర్మీకి పట్టిస్తాడు ఆతీష్. ఇక పాకిస్తాన్
లో బందీ అయిన టైగర్ కి ఉరిశిక్ష నిర్ణయిస్తుంది సైన్యం.
ఇప్పుడేం చేశాడు టైగర్? ఉరిశిక్షని ఎలా తప్పించుకున్నాడు? సైనిక నియంతృత్వాన్ని వ్యతిరేకించే పాక్ ప్రధాని నస్రీన్ ఇరానీ (సిమ్రాన్) పాక్ జనరల్ తో ఎలాటి ప్రమాదంలో పడింది? ఇందులో టైగర్ తీసుకున్న చర్యలేమిటి? పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆతీష్ తలపెట్టిన కుట్ర ఏమైంది? జోయాతో బాటు మరి కొందరు ‘రా’ ఏజెంట్లు పాక్ లో చొరబడి చేసిన ఆపరేషన్ ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.
‘ఖలేజా’ లో మహేష్ బాబు ఎక్కడో రాజస్థాన్ వెళ్ళి అక్కడి జనం సమస్యల గురించి పొరాడి
ఫ్లాప్ చేసుకున్న కథలా వుంది. ఎక్కడో రాజస్థాన్ ప్రజల కష్ట సుఖాలు తెలుగు
ప్రేక్షకుల కేమవసరం? అలాగే ఎక్కడో పాకిస్థాన్ ని కాపాడి
ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే కథ ఇండియన్ ఆడియెన్స్ కేమవసరం? ఇది పాకిస్థాన్ కోసం పాకిస్థానీ పాత్రలతో పాకిస్థాన్లో తీసిన పాకిస్థానీ సినిమాలా
వుంది చివరి వరకూ. నేటివిటీ ప్రాబ్లం. ఇదే దెబ్బకొట్టింది. పాక్ లో సైనిక
నియంతృత్వాన్ని రూపుమాపి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలనే
ఐడియాతో సినిమా తీయాలనే ఆలోచనే అతి తెలివితో కూడుకున్నదిలా కనిపిస్తోంది.
కనుక ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ, భావోద్వేగాలు, ఏదైనా కాస్త దేశభక్తీ కరువయ్యాయి. ఇండియన్ ప్రధానిని కాపాడే కథకుండేంత పౌరుషం పాక్ ప్రధానిని కాపాడే కథతో లేకుండా పోయాయి. ఫస్టాఫ్ వివిధ టైగర్ ఆపరేషన్స్ తో ఆఫ్ఘనిస్తాన్, పీటర్స్ బర్గ్, ఇస్తాన్బుల్, ఆస్ట్రియాల్లో యాక్షన్ సీన్స్ తో కథ సాగుతున్నంత సేపూ బాగానే వుంటుంది.
ఇంటర్వెల్లో టైగర్ పాక్ ఆర్మీకి చిక్కాక ఇక సెకండాఫ్ అంతా పాకిస్థాన్ గురించి పాకిస్థాన్లోనే జరుగుతుంది. ఇండియాకి ప్రమాదకరంగా వున్న సీక్రెట్ కోడ్స్ ని చేజిక్కించుకోవడం గురించి మొత్తం సినిమా అంతా పాక్ లోనే నడిపినా ఇబ్బంది వుండేది కాదు. ‘హేపీ భాగ్ జాయేగీ’ లో హీరోయిన్ ప్రేమించిన వాడికోసం పాకిస్థాన్ పారిపోతే, ఆమెని పట్టుకోవడం కోసం పాకిస్థాన్లో నడిపిన కామెడీ ఇందుకే హిట్టయ్యింది. పాకిస్థాన్లో నడిపినా కథ ఇండియా గురించై వుండాలి.
కానీ ఇండియాకి పొంచి వున్న ముప్పుని నివారించకుండా, అక్కడి సైన్యం నుంచి పాక్ ని కాపాడే కథ చేయడంతో రిజల్టు రివర్స్ అయింది. అసలు సెకండాఫ్ లో సీక్రెట్ కోడ్స్ ప్రస్తావనే వుండదు. టైగర్ ని ఎందుకైతే పాక్ ఆర్మీ పట్టుకున్నారో, ఆ సీక్రెట్ కోడ్స్ కోసం టార్చర్ చెయ్యనే చెయ్యరు. ఉరిశిక్ష వేసి పారేస్తారంతే!
టైగర్ స్పైగా ఈసారి సల్మాన్ వయసు
తాలూకు అలసటతో కనిపిస్తాడు. ఎమోషన్స్ ఒలికించి అలసటని దాయడానికి పాత్రకి ఎక్కడా
ఎమోషన్స్ పుట్టే కథే లేదు. అందుకని ఎంత భారీ యెత్తున హైరేంజి యాక్షన్ సీన్స్, ఛేజింగులు చేసినా ఫ్లాట్ గా వుంటాయి. అతను ఇండియా గురించి పోరాడితే
ఫీలింగు వుంటుంది. కనీసం కొడుకుని అడ్డం పెట్టుకుని అతీష్ బ్లాక్ మెయిల్
చేసినప్పుడు - దేశమా, కొడుకా అన్న డైలెమాలో పడాలి. తను దేశమే
అంటే, భార్య కొడుకు కోసం ఆతీష్ డిమాండ్ ని తీర్చాలన్నప్పుడు
సంఘర్షణ పుట్టి - తగు భావోద్వేగాలతో డ్రామా ఏర్పడేది. ఇలాటి ఘట్టాలే కరువయ్యాయి.
యాక్షన్ హీరోయిన్ గా కత్రినాకైఫ్ చేసే ఫైట్స్, ముఖ్యంగా టవల్ ఫైట్ హైలైట్ గా నిలుస్తాయి. ఇక విలన్ గా ఒకప్పటి హీరో ఇమ్రాన్ హాష్మీ ఒక్కడికే లక్ష్యంతో కూడిన తగిన ఎమోషన్స్ వున్నాయి. తనకు సాధ్యమయ్యెంత విలనీ పోషించాడు. షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో సల్మాన్ ని కాపాడే సుదీర్ఘమైన 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సెకెండాఫ్ కి హైలైట్. చాలా గగుర్పాటు కల్గించేదిగా వుంటుంది. అయితే ఇక్కడ ‘పఠాన్’ లో యాక్షన్ సీన్లో ఇద్దరూ చేసినంత ఫన్ లేదు. ఇక ‘రా’చీఫ్ గా రేవతి, పాక్ ప్రధానిగా సిమ్రాన్ పాత్రల్లో సరిపోయారు.
ప్రీతమ్ సంగీతంలో రెండే పాటలున్నాయి. రెండూ బావున్నాయి. ఏదో చేసి ప్రీతమ్ పాటల్ని సక్సెస్ చేస్తాడు. తనుజ్ టికూ నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది. భార్యా భర్తలుగా సల్మాన్ - కత్రినాలు పరస్పర విరోధాలతో చేసుకునే ఫైటింగ్ కి నేపథ్య సంగీతంలో శోకరసం ప్రవహించడం యాక్షన్ సీనుకి బలం చేకూర్చేదిగా వుంటుంది. అలాగే మిగిలిన యాక్షన్ సీన్స్ కి నేపథ్య సంగీతం వాటి పరిస్థితులకి అద్దం పడుతుంది. ఇక అనయ్ గోస్వామి ఛాయాగ్రహణం హై క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. యాక్షన్ కొరియోగ్రఫీ, ఔట్ డోర్ లొకేషన్స్ ప్రత్యేకంగా వున్నాయి.
కానీ చిన్న సినిమాల దర్శకుడు మనీష్ శర్మ ఈ భారీ స్పై యాక్షన్ ని భుజానెత్తుకుని అన్యాయమే చేశాడు. చిత్రీ కరణతో కాదు, రచనతో. కనీసం కాస్త కామెడీ, ఫన్, ఎంటర్టయిన్మెంట్ లాంటి ఎలిమెంట్సే లేకుండా, రిలీఫ్ లేకుండా, సాంతం యమ సీరియస్ కథ చేశాడు. ఆ కథకి నేటివిటీ లోపమే కాకుండా, కథనంలో థ్రిల్, సస్పెన్స్, మలుపులు వంటి సినిమా కోరుకునే కనీసావసరాలు కూడా తీర్చలేక పోయాడు. సినిమాలో దీపావళి ప్రస్తావన వుంటుంది రెండు మూడు సార్లు విలన్స్ తో. పాకిస్థాన్ కోసం పాకిస్థాన్లో జరిగే ఈ కథ, పాకిస్థానీ పాత్రలకి దీపావళి టపాసులేమో గానీ, స్థానిక భారతీయ బాధిత ప్రేక్షక జీవులకి మాత్రం దీపావళి రోజు దీంతో అంత సీను లేదు.