రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 19, 2023

1380 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : హేమంత్ రావు
తారాగణం : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె అచార్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర తదితరులు  
సంగీతం: చరణ్ రాజ్, ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్!  
విడుదల : నవంబర్ 17, 2023
***

        న్నడ హిట్ సప్త సాగర దాచే ఎల్లో- సైడ్ ఏ తెలుగులో  సప్త సాగరాలు దాటి -సైడ్ ఏ గా సెప్టెంబర్ లో విడుదలైంది. రక్షిత్ శెట్టి నటించిన ఈ రోమాంటిక్ డ్రామా తెలుగులో అభిరుచిగల ప్రేక్షకుల ప్రశంసలందుకుంది గానీ బాక్సాఫీసు దగ్గర పనిచేయ లేదు. ఇప్పుడు దీని రెండో భాగం- సైడ్ బి కూడా నాలుగు దక్షిణ భాషల్లో విడుదలైంది. ఒక ప్రేమకథకి ప్రతీకారాన్ని జోడించి వాస్తవిక/కళాత్మక దృష్టితో నిర్మించిన ఈ రెండో భాగం ఎలా వుంది? మొదటి భాగమంత బలంగా ఇది కూడా వుందా? ఇది పరిశీలిద్దాం...
కథ

    మొదటి భాగంలో జైల్లో వున్న మను (రక్షిత్ శెట్టి) పదేళ్ళ తర్వాత ఇప్పుడు విడుదలవుతాడు. మొదటి భాగంలో ఎన్నో కలలతో తనూ ప్రియా (రుక్మిణీ వసంత్)  ప్రేమించుకున్నారు. కానీ విధి విడదీసింది. ఇప్పుడామె జ్ఞాపకాలు వెంటాడుతూంటే ఆమె అన్వేషణకి పూనుకుంటాడు. మరోవైపు తనని అన్యాయంగా జైలుకి పంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ప్రియాకి పెళ్ళయి పోయిందని తెలుసు. అయితే ఆమె ఎలా జీవిస్తోంది, కలలు తీరాయా, సింగర్ గా పాటలు పాడుతోందా? ఇవి తెలుసుకునే క్ర మంలో సురభి (చైత్ర) అనే కాల్ గర్ల్ పరిచయమవుతుంది. ఆమెతో గడుపుతూ ప్రియాని అన్వేషించి జాడ తెలుసుకుంటాడు. తెలుసుకుంటే, సముద్రపుటొడ్డున విశాలమైన భవంతి లో నివసించాలన్న కలలకి బదులు, క్రిక్కిరిసిన సందులో ఇరుకు ఇంట్లో వుంటుంది కొడుకుతో, భర్తతో. ఇది చూసి చలించిపోయి- ఆమె ఉన్నతి కోసం తను అజ్ఞాతంగా వుంటూ ఏమైనా చేయాలని సంకల్పించుకుంటాడు మనూ.
       
అతడి ఆశయం నెరవేరిందా
? శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకున్నాడా? సురభి ఏమైంది? మనూని చూసి ప్రియా ఎలా రియాక్టయింది? ఈ కథ చివరికి ఏ తీరాలకి చేరింది? ఇవీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలా వుంది కథ

    ఒక సినిమాకి రెండో భాగం తీస్తే, లేదా సీక్వెల్ తీస్తే ఎప్పుడూ రిస్కే. మొదటి భాగమంత క్వాలిటీ వుండదు. టెక్నికల్ గా, కళాత్మకంగా క్వాలిటీ వుండొచ్చు, కానీ కంటెంట్ పరంగా కాదు. రక్తచరిత్ర మొదటి భాగం తర్వాత రెండో భాగం బలంగా వుండదు. బాహుబలి రెండో భాగం కూడా ఇంతే. ఇప్పుడు సప్తసాగరాలు దాటి సైడ్ బి కూడా ఇంతే. సీక్వెల్స్ కంటే భాగాలుగా తీసినప్పుడే ఇలా జరుగుతుంది. హాలీవుడ్ లో భాగాలుగా ఏ కథలు తీసే వారంటే, నవలా కథలు. బాగా పాపులరైన నవలని రెండు మూడు భాగాలుగా సాగదీసి తీసి సొమ్ములు చేసుకోవచ్చనే  ఐడియాతో తీసేవాళ్ళు. అలా నవల చదివిన పాఠకులు రెండో భాగం, మూడో భాగం ఎలా వుంటాయోనని  ఎగబడి చూసేవాళ్ళు. వారపత్రికల్లో సీరియల్స్ కి ఎగబడినట్టు. తర్వాత్తర్వాత మోసం బయట పడింది. నవల్లో ఒక సినిమా తీసేంత విషయమే వుంటే, కల్పితాలు చేసి సాగదీసి సాగదీసి, భాగాలుగా తీస్తున్నారని అర్ధమయ్యాక అలాటి సినిమాలు తీయడం ఆపేశారు.
        
సప్త సాగరాలు దాటి -సైడ్ బి విషయం కూడా ఇలాటిదే. కాకపోతే ఇది తప్పక చూడాలని ఆసక్తి రేపడానికి నవలా భాగం కాదు. మొదటి భాగం లోని కథా బలాన్ని, పాత్రచిత్రణల్ని, భావోద్వేగాల్ని, కొనసాగించడానికి తగ్గ కథ ఇందులో వుండాలి. కథని ఒప్పించడానికి రెండు విషయాలు అడ్డుపడతాయి : పదేళ్ళ తర్వాతా అంతే బలంగా ప్రేమని కలిగి వుండడం, పెళ్ళయిపోయి తన బ్రతుకేదో తను బ్రతుకుతున్న మాజీ ప్రేయసి సంతోషం కోసం ఏదో చేయాలనుకోవడం. పదేళ్ళ తర్వాత ఎవరికివారే యమునా తీరేనే. అందుకని కథ ప్రాక్టికల్ గా అన్పించదు.
       
అజ్ఞాతంగా వుంటూ ఆమెకి సాయపడాలనుకునే సన్నివేశాలు స్టాకింగ్ (రహస్యంగా ఫాలో అవడం) తో ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఆమె కాపురంలో చిచ్చు పెట్టడానికే వచ్చినట్టు అనిపిస్తాడు. నేరుగా ఆమెని కలిసి ఫ్రెండ్స్ గా వుందామని చెప్పేస్తే అయిపోతుంది.  అప్పటికీ ఆమె భర్తతో సమస్యే ఎదురుకావొచ్చు. ఇలా ఇంకొకరి భార్యని సంతోష పెట్టాలన్న బాధ నీకెందుకురా బాబూ అనిపిస్తాడు. చివరికి ఫ్రెండ్సే అవుతారు. అదేదో ముందే అనుకుంటే అయిపోయేది.  ఆమె తనని మర్చి పోయి పెళ్ళి చేసుకుందంటే సంతోషంగా వున్నట్టే కదా
? అసలే అన్యాయమై పోయిన అతన్నుంచి సాయం ఎందుకు తీసుకుంటుంది? ఇలా అనిపిస్తే ఇంకా కథ ఎక్కడుంది?
       
మొదటి భాగం లాగే రెండో భాగం అతి సాగుతుంది. మేకింగ్ పరంగా నాణ్యత కూడా మొదటి భాగంతో సరిపోలుతుంది. కానీ నేపథ్య సంగీతం అక్కడక్కడ మాత్రమే బావుంటుంది. సినిమా భారంగా అన్పించడంతో రెండున్నర గంటల నిడివి కూడా ఓపికని పరీక్షిస్తుంది. కథ ముగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరోయిన్ తో కథ ముగిసిపోయిన చోట
, పాటతో మళ్ళీ సాగదీశాడు దర్శకుడు.
       
అయితే శత్రువుల మీద ప్రతీకార కథని ప్రధానం చేయలేదు. ప్రేమ మీదే దృష్టి పెట్టాడు. మాజీ ప్రేయసికి ఆర్ధికంగా సాయపడాలనుకున్నప్పుడు మాత్రమే
, అందులో భాగంగానే శత్రువులతో సంపర్కంలోకొస్తాడు హీరో.  

నటనలు- సాంకేతికాలు 

    రక్షిత్ శెట్టి మొదటి భాగంలో యంగ్ లుక్ పదేళ్ళ కథాకాలం తర్వాత ఇప్పుడు వయసుకి తగ్గట్టు వొళ్ళు కూడా పెరిగింది. ఐతే అహర్నిశలూ మాజీ ప్రేయసిని తల్చుకుంటూ పదేళ్ళు బాధలో గడిపిన తను ఇంత బలంగా,  ఆరోగ్యంగా వుంటాడా అన్న సందేహం తలెత్తుతుంది. నటనతో మాత్రం సున్నిత భావాల్ని ప్రకటించగల ఈజ్ తో ఆకట్టుకుంటాడు. కొన్ని చోట్ల గుండెల్ని కూడా బరువెక్కిస్తాడు. మస్తిష్కంతో గాకుండా హృదయంతో చూస్తే క్లిష్ట సన్నివేశాల్లో అతడి అభినయానికి పాస్ మార్కులే.
       
పెళ్ళయిన హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్ పాత్ర నిడివి తక్కువే. మొదటి భాగంలోలాగే ఉద్విగ్నంగా కళ్ళతో నటించింది. కళ్ళతో నటించిన ఇంకో నటి కాల్ గర్ల్ పాత్ర పోషించిన చైత్ర. ఈమె క్షోభ
, స్ట్రగుల్ అర్ధవంతంగా వుంటాయి. ఇంకా మిగిలినవి సహాయ పాత్రలు. విలన్ గా నటించిన అచ్యుత్ కుమార్ ఫర్వాలేదు.
       
పూర్తిగా కెమెరా వర్క్
, ప్రొడక్షన్ విలువలూ ఉన్నతంగా వుంటే, సంగీతం మాత్రం అక్కడక్కడా డ్రాప్ అయింది. ఈ రోమాంటిక్ డ్రామా రెండో భాగం ప్రేమకథ కంటే బలంగా, ప్రతీకార కథతో వుంది. శత్రువులతో రక్షిత్ శెట్టి నడిపే రివెంజీ డ్రామా సృజనాత్మకంగా, కమర్షియల్ సి నిమాలకి భిన్నంగా ఆకట్టుకునే తీరులో వుంది.

—సికిందర్