రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 19, 2022

1213 : రివ్యూ!

రచన - దర్శకత్వం : సుధీర్ వర్మ
తారాగణం : నివేదా థామస్, రెజీనా కసాండ్రా, భానుచందర్, పృథ్వీ, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
కథ : మిడ్‌నైట్ రన్నర్స్ ఆధారంగా, స్క్రీన్ ప్లే -మాటలు : అక్షయ్ పి,  సంగీతం : మైకీ మెక్‌క్లియరీ, ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
నిర్మాతలు : డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్
విడుదల సెప్టెంబర్ 16,  2022
***

        వారం కాస్త భిన్నంగా ఇద్దరు పాపులర్ హీరోయిన్ల సినిమా విడుదలైంది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా జతకట్టి యాక్షన్ కామెడీతో అలరించేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చారు. అయితే బాక్సాఫీసు బద్దలు కొట్టారా, లేక ప్రేక్షకుల తలబద్దలు కొట్టారా అన్నది పాయింటు. ఈ పాయింటుకి బలి కాకుండా దీని దర్శకుడు సుధీర్ వర్మ సగంలోనే వదిలేసి సేఫ్ అయిపోయాడు. అనామకంగా ఇంకెవరో పూర్తి చేశారు. అంటే సినిమా జాతకం ఇక్కడే తెలిసి పోతోంది. అయినా బోలెడు డబ్బులుపోసి హక్కులు కొన్న కొరియన్ మూవీ కాబట్టి, రీమేకు ఎలా రూపొందిందన్న ఆసక్తి ఒకటి వుంటుంది. ఓసారి లుక్కేద్దాం...

కథ

శాలిని (నివేదా థామస్), దామినీ (రెజీనా కసాండ్రా) పోలీస్ అకాడెమీలో ట్రైనింగ్ కి చేరతారు. అపరిచితులైన ఇద్దరూ కీచులాడుకుంటూ వుంటారు. అకాడెమీ డైరెక్టర్ (భానుచందర్) వాళ్ళ క్రమశిక్షణా రాహిత్యానికి శిక్షిస్తూ వుంటాడు. ఎలాగో ఇద్దరూ కీచులాటలు మాని ఫ్రెండ్స్ అవుతారు. నైట్ పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. తిరిగి వస్తున్నప్పుడు ఓ గ్యాంగ్ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో వెంబడిస్తారు. గ్యాంగ్ దొరక్కపోవడంతో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. పోలీసులు స్పందించరు. దీంతో తామే రంగంలోకి దిగుతారు కిడ్నాపైన అమ్మాయిని కాపాడేందుకు...

ఎవరా అమ్మాయి? ఎందుకు కిడ్నాప్ చేశారు? గ్యాంగ్ లీడర్ (కబీర్ దుహన్ సింగ్) నడుపుతున్న ఒక స్కామ్ తో కిడ్నాప్ కేం సంబంధం? దీన్నెలా ఛేదించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

కొరియన్ యాక్షన్ కామెడీ మిడ్ నైట్ రన్నర్స్ హక్కులు కొని రీమేక్ చేశారు. కొరియన్ మూవీ ఇద్దరు హీరోలతో వుంటే, తెలుగులో హీరోయిన్ల కథగా మార్చారు. ఈ కథకి హీరోయిన్లు సారధ్యం వహించడమే సబబు. ఎందుకంటే ఈ కథ స్త్రీ అండ అక్రమ రవాణాకి సంబంధించింది గనుక. స్త్రీ సమస్యకి స్త్రీల పోరాటంగా ఇద్దరు హీరోయిన్లతో యాక్షన్ కామెడీ మంచి ఐడియానే. తెలుగులో దీనికి తగిన నేటివిటీని జోడించి సమస్య తీవ్రత పట్ల అప్రమత్తం చేసి వుంటే దీనికో కథా ప్రయోజనమంటూ చేకూరేది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా సహాయక పునరుత్పత్తి సాంకేతికతా (నియంత్రణ) చట్టం 2021 అమల్లోకి తెచ్చింది. దీంతో బాటు అద్దె గర్భం (నియంత్రణ) చట్టం 2021 కూడా తెచ్చింది. దీని విభాగం హైదరాబాద్ లో కూడా వుంది.  సరోగసీ (అద్దె గర్భం) క్లినిక్‌ల నియంత్రణ, పర్యవేక్షణతో బాటు, దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ విభాగం లక్ష్యం.  దేశవ్యాప్తంగా సమస్య తీవ్ర స్థాయిలో వుంది. దీనిమీద ఒక హిందీ సినిమా కూడా గత సంవత్సరం విడుదలైంది.

హిందీ మూవీ మిమీ ని ‘మాలా ఆయ్ వాచ్చీ (నేను తల్లినవుతా) అనే మరాఠీకి  రీమేక్ గా తీశారు. ఇందులో సరోగసీ (అద్దె గర్భం) కథ మాతృత్వపు భావోద్వేగం చుట్టూ వుంటుంది. ఇది నిజంగా జరిగిన కేసు ఆధారంగా తీశారు. గుజరాత్ఉత్తరప్రదేశ్రాజస్థాన్‌లలో సామూహిక  సరోగేట్‌ కేంద్రాలది పెద్ద అక్రమ వ్యాపారం. ఈ సరోగసీ కేంద్రాల్లో విదేశీయులు తమ బిడ్డని కనడానికి తగిన యువతికి డబ్బు చెల్లించి అద్దె గర్భం తీసుకోవడం, పుట్టిన బిడ్డని తీసుకుని వెళ్ళిపోవడం ఒక దందాగా సాగుతోంది. డబ్బు కోసం పెళ్ళి కాని యువతులు కూడా పాల్పడుతున్న ఈ సీరియస్ సమస్యని సినిమాలో హాస్యాన్ని జోడించి చెప్పి సక్సెస్ అయ్యారు.

కానీ శాకినీ ఢాకినీ కథలోనే చెప్పిన అండాల కోసం అమ్మాయిల్ని అపహరించే పాయింటుని  అస్సలు పట్టించుకోకుండా, కేవలం ఒక రొటీన్ కిడ్నాప్ కథగా మార్చేసి చేతులు దులుపుకున్నారు. పాత్రల్ని హీరోయిన్ పాత్రలుగా మార్చినప్పుడు, అమ్మాయిలుగా వాళ్ళు ఆడవాళ్ళకి ఎదురవుతున్న కొత్త ప్రమాదాన్ని ఫీలవ్వని అర్ధం లేని పాత్రలుగా చూపించారు. హీరోయిన్ పాత్రలుగా మార్చినప్పుడు కథకి ఇంకో బలం -అసలు బలం కూడా చేకూరే అవకాశం వుంది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరు కిడ్నాప్ కి గురై వుంటే, అండాల స్మగ్లింగ్ కథ భావోద్వేగాలతో ఇంకో లెవెల్లో వుండేది.

కొరియన్ మూవీలో పాయింటు వుంది, ఆ పాయింటు మనకెలా అన్వయమవుతుందో ఆలోచించకుండా రీమేక్ కోసం రీమేక్ అన్నట్టు చుట్టేశారు.  అయినా ఏం ఫర్వాలేదు, వుందిగా మార్చి పైన సెప్టెంబర్ అన్నట్టు థియేటర్స్ లో జీరో అయినా, ఓటీటీలో పెద్ద మొత్తంలో చెక్కు జేబులో వేసుకోవచ్చు. ఓటీటీలు వున్నంత కాలం ఎంత అడ్డగోలుగానైనా  సినిమాలు తీసుకోవచ్చు.

నటనలు- సాంకేతికాలు

పోలీసు పాత్రల్లో నటీమణులిద్దరూ ఫైట్స్ చేయడానికి బాగా ట్రైనింగు పొందారు. ఫైట్స్ బాగా చేశారు. అయితే ఇది యాక్షన్ కామెడీ. కామెడీ మాత్రం చేయలేకపోయారు. కొరియన్ మూవీలో నామమాత్రపు కథని నిలబెట్టింది ఇద్దరు హీరోలు చేసే కామెడీనే. కడుపుబ్బ నవ్వించి నవ్వించి చంపారని ఫారిన్ రివ్యూలు చూస్తే తెలుస్తుంది. సినిమా సబ్ టైటిల్స్ తో యూట్యూబ్ లో ఫ్రీగా వుంది. 20 లలో వున్న యంగ్ హీరోలతో ఇది బడ్డీ/బ్రోమాన్స్ జానర్ మూవీ. ఈ జానర్ మర్యాదల్ని తెలుసుకోకుండా నివేదా, రెజీనాలని మూస హీరోయిన్లుగా సరిపెట్టేశారు. వీళ్ళిద్దరూ కథలో సమస్యని ఫీల్ కాకపోవడంతో భావోద్వేగాలు కూడా కుదరక గ్లామర్ ప్రదర్శన మీద ఆధారపడి నటించేశారు.

 లాజిక్, కామన్ సెన్స్ అన్నవి కూడా లేకుండా ఎలాపడితే అలా సినిమా చుట్టేశారు.  నివేదా, రెజీనా ఓ అమ్మాయి కిడ్నాప్ గురించి అర్ధరాత్రి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు పట్టించుకోకపోవడాన్ని కొరియన్ మూవీలో అర్ధాన్ని తెలుసుకోకుండా యధాతధంగా దింపేశారు. కొరియన్ మూవీలో కిడ్నాప్ జరిగేది చైనీయులు ఎక్కువుండే పేటలో. ఆ పేటలో అడుగు పెట్టాలంటే పోలీసుల ధైర్యం చాలదు. ఇదీ కొరియన్ మూవీలో కేసు తిరస్కరించడానికి కారణం. దీని మీద చైనాలో పెద్ద యెత్తున నిరసనలు చెలరేగి మూవీ బ్యాన్ చేసే దాకా పోయింది. దక్షిణ కొరియాలో చైనీయుల్ని అలా చూపించినందుకు. విలన్ కూడా చైనీస్ పాత్రే.

హైదరాబాద్ లో పోలీసులు కంప్లెయింట్ తీసుకోక పోవడానికి తగిన కారణం చూపకుండా, కొరియన్ మూవీ సీన్ని అర్ధం జేసుకోకుండా దింపేశారు. ఇంకోటేమిటంటే పోలీస్ అకాడెమీ డైరెక్టర్ కూడా విన్పించుకోడు!

ఇక సాంకేతికాలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాణ  విలువలు దేని మీదా తగిన శ్రద్ధ పెట్టలేదు. కరోనా కాలంలో అంతరాయాల మధ్య పూర్తి చేయాల్సి వచ్చినందుకు కావొచ్చు మేకింగ్ క్వాలిటీ కూడా బలైంది.

—సికిందర్