రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

1212 : రివ్యూ!


నేను మీకు బాగా కావాల్సిన వాడిని రివ్యూ!

కథ - దర్శకత్వం : శ్రీధర్ గాదె

తారాగణం : కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్, ఎస్వీ కృష్ణా రెడ్డి, సిద్ధార్థ్ మీనన్ తదితరులు

స్క్రీన్ ప్లే - మాటలు : కిరణ్ అబ్బవరం, సంగీతం :  మణిశర్మ, ఛాయాగ్రహణం : రాజ్ నల్లి
బ్యానర్ : కోడి దివ్య ఎంటర్టయిన్మెంట్స్
నిర్మాత : కోడి దివ్య దీప్తి
విడుదల : సెప్టెంబత్ 16, 2022
***

        కొత్తగా వస్తూ ఇంకా అభిమానులంటూ ఎవరినీ ఏర్పర్చుకోలేక పోతున్న హీరో కిరణ్ అబ్బవరం, మూడేళ్ళలో నటించేసిన నాలుగు సినిమాల్లో రెండు  ఇదివరకే అట్టర్ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఇది ఐదో సినిమా. ప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాత. శ్రీధర్ గాదె కొత్త దర్శకుడు. స్క్రీన్ ప్లే - మాటలు కిరణ్ అబ్బవరమే రాశాడు. మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా వుంటుందని, పూర్తి కుటుంబ కథగా తెరకెక్కిన దీన్లో అంతర్లీనంగా ఒక ముఖ్యమైన అంశాన్నిచర్చించామనీ, ఇందులో తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారనీ, మొదటిసారిగా ఇందులో తను రెండు షేడ్స్  వున్న పాత్ర నటించాననీ, ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాననీ చెప్పుకొచ్చాడు. సినిమాలో ఇవన్నీ వున్నాయా? చూద్దాం...

కథ

వివేక్ (కిరణ్ అబ్బ‌వ‌రం) క్యాబ్ డ్రైవర్ గా వుంటాడు. రోజూ తాగి వచ్చే సాఫ్ట్ వేర్ తేజు (సంజనా ఆనంద్) ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూంటాడు. ఒక రోజు ఎందుకిలా తాగుతున్నావని అడిగి, ఆమె గతం తెలుసుకుంటాడు. వైజాగ్ లో ఆమెది ధనిక కుటుంబం. తల్లిదండ్రులు, బాబాయ్ కుటుంబం ఒకే భవనంలో సంతోషంగా వుంటారు. తండ్రి (దేవీ ప్రసాద్) ఆమెకి సంబంధం చూస్తాడు. కానీ ఆమె సిద్ధార్థ్ (సిద్ధార్థ్  మీనన్) ని ప్రేమిస్తూంటుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి బాధ పెట్టలేక పెళ్ళి రోజు సిద్ధార్థ్ కోసం వెళ్ళిపోతుంది. అతను మోసగాడని తెలుస్తుంది. ఇక ఇంటికి వెళ్ళే మొహంలేక, ఒంటరిగా వుంటూ తాగుడు మరిగిందన్న మాట.  

ఈమె ప్రేమ కథ తెలుసుకున్న వివేక్, తన ప్రేమ కథ చెప్తాడు. అతను దుర్గ (సోనూ ఠాకూర్) అనే లాయర్ని ప్రేమించాడు. ఆమె వేరొకర్ని పెళ్ళి చేసుకుని వెళ్ళి పోవడంతో దెబ్బ తిని, క్యాబ్ డ్రైవర్ గా బ్రతుకుతున్నాడు. ఇలా పరస్పరం తమ ప్రేమ కథలు చెప్పుకున్న వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. 

ఎలావుంది కథ

చాలా పాత కాలపు సినిమా కథ. బహుశా 1980 లలో వచ్చిన సినిమా కథ. దీన్ని కొన్ని కోట్లు త్యాగం చేసి ఈ కాలం ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకున్నారు. కోడి రామకృష్ణకి  ఇలా నివాళులర్పించా లనుకున్నారు. దీని కోసం ప్రేక్షకుల్ని ఎంతైనా టార్చర్ చేయడానికి ఖర్చుకి వెనుకాడకుండా తీవ్ర కృషి చేశారు. కొత్త దర్శకుడు, యంగ్ హీరో ఇద్దరూ పాత చింతకాయలోనే తమ విజయ రహస్యముందని నమ్మి తీశారు.

.ఇది ఈ కాలంలో మన అందరి ఇంట్లో జరిగే కథే అంటే నమ్మాలి, ఫీలవ్వాలి. ఇందులో అంతర్లీనంగా చర్చించిన  ముఖ్యమైన అంశం ఏమిటో క్విజ్ పోటీలు వేసుకుని చెప్పాలి. ఇందులో తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి కనెక్ట్ అవడానికి అనుబంధాలే మున్నాయో వెతుక్కోవాలి. దొరక్కపోతే మళ్ళీ సినిమా చూడాలి. ఇందులో అబ్బవరం వున్న  రెండు షేడ్స్ లో ఒకటి ప్రేక్షకుల్ని ఫూల్స్ చేసినా ఆనందించాలి. కిరణ్ అబ్బవరం సెకండాఫ్ లో చెప్పే తన ప్రేమ కథంతా నిజం కాదనీ, స్వాతి పత్రికలో వచ్చిన కథ చెప్పి హీరోయిన్నీ ప్రేక్షకుల్నీ ఫూల్స్ చేశాడనీ తెలుసుకుని-  అతడి స్క్రీన్ ప్లే టాలెంట్ ని మెచ్చుకోవాలి. అతను రాసిన హద్దులు మీరిన డబుల్ మీనింగ్ డైలాగుల్ని ఈ కుటుంబ కథా చిత్రంలో ఆనందించాలి. ఈ సినిమా ద్వారా తను అందరికీ మరింత దగ్గరవుతాడన్న అతడి ప్రగాఢ విశ్వాసాన్ని కూడా గౌరవించాలి. అతను 1.5 రేటింగ్ ని సగౌరవంగా స్వీకరిస్తాడనేది నిర్వివాదాంశం.

నటనలు- సాంకేతికాలు

కిరణ్ అబ్బవరం మాస్ కమర్షియల్ స్టార్ అవ్వాలనే కోరికతో ఈ సినిమా నటించాడు. ఆవారా మాస్, తాగుబోతు మాస్, ఐటెమ్ సాంగ్ మాస్, ఇక ఫైట్స్ అయితే చెప్పనవసరం లేదు. తన హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు స్లోమో షాట్స్. ఇవన్నీ ఔట్ డేటెడ్ అయిపోయాయన్న విషయం పట్టించుకోలేదు. ఇక తన ప్రేమ కథలో రవితేజ మార్కు ఇమిటేషన్. ఇది హద్దులు మీరి వెకిలి తనంగా మారింది. ఇంతా చేస్తే తన ప్రేమ కథ నిజం కాదు, కల్పిత పాత్రలతో హీరోయిన్ కి కట్టుకథ చెప్పాడు. కనీసం టైటిల్ కోసమైనా హృదయాల్ని హత్తుకునే ఒక్క సీనూ నటించ లేదు. అబ్బవరం సినిమాలన్ని ట్లో ఇది అబ్బా అని గుచ్చుకునే నటన, సినిమా.

ఇక హీరోయిన్ సంజనా ఆనంద్ సాంతం శాడ్ గా వుండే పాత్ర, నటన. రోమాన్స్ లేదు, యూత్ అప్పీల్ లేదు. ఫస్టాఫ్ సగం వరకూ తాగిన మత్తులోనే వుంటుంది. ఇక అబ్బవరం కట్టుకథలో హీరోయిన్ సోనూ ఠాకూర్ లాయర్ పాత్ర ఎక్స్ ఫోజ్ చేస్తూ, రోమాంటిక్ గా వుంటుంది. అబ్బవరం కోసం ఓ మాస్ పాట వేసుకుంటుంది. ఇక కుటుంబ సినిమా అని ప్రచారం చేసిన ఈ సినిమాలో కుటుంబ పరివారం సీన్లు అంతంత మాత్రమే. ఒక్కరికీ సరైన పాత్రల్లేవు, రిజిస్టర్ కారు. 

ఇక మణిశర్మ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం మొక్కుబడిగా అందించినట్టు వున్నాయి. పాట అయిపోయాక కనీసం ఆ పాట ట్యూన్ కూడా గుర్తుకు రాదు. సరైన సాహిత్యం రాయించుకోవడానికీ, పాడించుకోవడానికీ సినిమాలో  విషయం ఇన్స్ ఫైర్ చేయాలిగా? సాంకేతిక విలువలూ డిటో.

చివరికేమిటి

కొత్త దర్శకుడు తీసుకు వచ్చిన అరిగిపోయిన విషయం నిర్మాతకి నచ్చితే ఎవరేం చేస్తారు. అసలే అరిగిపోయిన విషయమైతే, అబ్బవరం స్క్రీన్ ప్లే, డైలాగులు రాయడం ఒకటీ. స్క్రీన్ ప్లే రాస్తూ చివరి పదిహేను నిమిషాల వరకూ సినిమాలో కథే లేకుండా చేశాడు. కథలోకి వచ్చేటప్పటికి చివరి పదిహేను నిమిషాలే మిగిలాయి. అంతవరకూ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్, కట్టుకథతో తన ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాకులు కూడా కథే అనుకున్నట్టుంది. కథంటే ఏమిటో తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే రాసేస్తే ఇలాగే వుంటుంది.

ఫస్టాఫ్ రాత్రి పూట ఐటెమ్ సాంగ్ తో ప్రారంభమయ్యే సినిమా, తాగి వున్న హీరోయిన్ని క్యాబ్ లో పికప్ చేసుకున్నాక, అరగంట సేపూ తాగి వున్న ఆమెతో సీన్లే వస్తూంటాయి. అరగంట గడిచాక, ఆమె తన ప్రేమ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ వరకూ చెప్తుంది. ఇంతసేపూ హీరో అబ్బవరం కనపడడు. ఆమె ఫ్లాష్ బ్యాక్ ముగించడంతో ఇంటర్వెల్. ఇలా ఇంటర్వెల్ కి కూడా కథ ప్రారంభం కాదు, ఏం కథ చెప్పాలనుకుంటున్నాడో అర్ధం గాదు.

ఇక సెకండాఫ్ ముప్పావు గంట తన ప్రేమ కథ చెప్తాడు. ఇది స్వాతి పత్రికలో కథ చెప్పాడని తర్వాత తెలుస్తుంది. ఇలా ఇద్దరి ఫ్లాష్ బ్యాక్స్ పూర్తయి కథ లోకొస్తే పావుగంట మిగిలి వుంటుంది. ఆంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. ఇలా ఇప్పుడు  ప్రారంభమయిన కథలో మాంటేజెస్ వేస్తూ ఈ పావుగంటలో కొన్ని సస్పెన్సులు విప్పుతాడు. ఇలా తేలేదేమిటంటే ఎండ్ సస్పెన్స్ కథనం చేశాడని. ఎండ్ సస్పెన్స్ కథనం దృశ్య మాధ్యమం అయిన సినిమాని నిలబెట్టదు. ఇదింకో ఘోరమైన తప్పు. 

ఇద్దరూ ఒకటవడమే ముగింపని తెలిసిపోయే విషయమే. ఇద్దరూ హగ్ చేసుకుంటే ఎండ్ పడుతుందని కూడా వూహిస్తాం. కానీ హగ్ చేసుకోగానే మాస్ డ్యూయెట్ మొదలవుతుంది. ఇంకేం కథ మిగిలి వుందాని జుట్టు పీక్కోవడం మొదలెడితే, పాట అయిపోగానే ఎండ్ పడుతుంది! పిచ్చి చూపులు  చూడడం ప్రేక్షకుల వంతవుతుంది!

—సికిందర్