రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, June 8, 2019

837 : రివ్యూ

   దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్
తారాగణం : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, టబు, నోరా ఫతేహీ, జాకీ ష్రాఫ్, సోనాలీ కులకర్ణి, సునీల్ గ్రోవర్, కుముద్ మిశ్రా, ఆయేషా రజా మిశ్రా తదితరులు
రచన : అలీ అబ్బాస్ జాఫర్, వరుణ్ శర్మ, మాటలు : వరుణ్ శర్మ, సంగీతం : విశాల్ -శేఖర్, ఛాయాగ్రహణం :  మార్సిన్ లస్క వీక్
బ్యానర్స్ : రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, టీ సిరీస్
నిర్మాతలు : అతుల్ అగ్నిహోత్రి, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్
విడుదల : జూన్ 5, 2019

          మాస్ యాక్షన్ స్టార్ సల్మాన్ ఖాన్ మెలోడ్రామా ‘భారత్’  గా ప్రేక్షకుల ముందుకు వస్తే ఫ్యాన్స్ కి చాలా  ఇబ్బందే. సల్మాన్ నుంచి ఏమాశిస్తారో అవి లేకపోతే తీవ్ర నిరాశే. భజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందాహై లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లతో కొత్త తరం ప్రేక్షకుల్ని కూడా తన మాస్ బేస్ లో కలుపుకున్న సల్మాన్,  ఉన్నట్టుండి సూరజ్ బర్జాత్యా మార్కు కుటుంబ హీరోగా మారిపోవడం, మాస్ బేస్ కి దూరం జరగడం  షాక్ కొట్టే సంగతే. వయసు మీదబడుతోంటే ఖాన్ స్టార్లు ట్యూబ్ లైట్ అని ఒకరు, జీరో అని ఇంకొకరు బాలల పాత్రలేస్తున్నారు. మాస్ హీరో లుగా వుండక క్లాస్ కి పోయి ఖల్లాస్ అవుతున్నారు.     

        సల్మాన్ తో సుల్తాన్, టైగర్ జిందా హై వంటి రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, ఈసారి బరువైన ఫ్యామిలీ మెలో డ్రామాతో పీరియడ్ మూవీ తీశాడు. కొరియన్ పీరియడ్ డ్రామా ‘ఓడ్ టు మై ఫాదర్’ కి అధికారిక రిమేక్ చేసి, సల్మాన్ లోని నటుణ్ణి పరీక్షించదల్చాడు. మరి ఏడు పదుల వయసు పాత్రతో సల్మాన్ ‘భారత్’ ని వయోభారంతో కుంగదీశాడా, లేక వయసు ఓ సంఖ్య మాత్రమేనని పరుగులు తీయించాడా చూద్దాం...

కథ
      1947 దేశ విభజనప్పుడు జరిగిన మతకల్లోల్లాల్లో లాహోర్ నుంచి ఢిల్లీ పారిపోవాల్సివస్తుంది ఇంకా పదేళ్ళు నిండని భారత్ కి. తల్లితో, ఇద్దరు తోబుట్టువులతో క్రిక్కిరిసిన రైలెక్కేశాక, ఒక చెల్లెలు తప్పిపోతుంది. ఆమెని వెతకడం కోసం తండ్రి గౌతమ్ (జాకీ ష్రాఫ్) ఆగిపోతాడు. ఆగిపోతూ తల్లికీ, తోబుట్టువులకీ ఇక నువ్వే దిక్కనీ, బాగా చూసుకోవాలనీ చెప్పి, ఢిల్లీ లో మేనత్త దగ్గరికి వెళ్లి పొమ్మంటాడు. తను వాళ్ళు నడుపుతున్న రేషన్ షాపు దగ్గరికే వచ్చి కలుస్తానంటాడు. 

          ఢిల్లీ లో మేనత్త ఇంట్లో ఆశ్రయం పొందాక కుటుంబాన్ని పోషించేందుకు రకరకాల పనులు చేస్తాడు భారత్. విలాయతీ ఖాన్ అనే వాడు ఫ్రెండ్ అవుతాడు. అలా పెరిగి పెద్దయిన భారత్ (సల్మాన్ ఖాన్),  ఆ తర్వాత ఫ్రెండ్ విలాయతీ ( సునీల్ గ్రోవర్) తో కలిసి సర్కస్ కంపెనీలో చేరి డబ్బులు సంపాదిస్తాడు. గల్ఫ్ లో ఆయిల్ పడిందని కార్మికుడిగా అక్కడి కెళ్తాడు. అక్కడ తన పై అధికారిణి కుముద్ (కత్రినా కైఫ్) అభిమానాన్ని చూరగొంటాడు. ఆమె పెళ్లి చేసుకుందామంటుంది. తన కథ చెప్పుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే తన ధ్యేయమని ఆమెని తిరస్కరిస్తాడు. అక్కడ మైనింగ్ ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు. వీసా గడువు ముగిసిపోవడంతో ఇండియా తిరిగి వచ్చేస్తాడు. చెల్లెలి పెళ్లి చేస్తాడు. తమ్ముణ్ణి యూనివర్సిటీలో చదివిస్తాడు.

          మేనత్త చనిపోతుంది. డబ్బు అవసరముండి రేషన్ షాపు అమ్మేస్తానంటాడు మేనమామ. తండ్రి ఇక్కడికే వచ్చి కలుస్తానన్నాడు గనుక షాపు అమ్మడానికి ఒప్పుకోడు భారత్. కొత్త పని వెతుక్కుంటూ విలాయత్ తో కలిసి, నేవీ షిప్ మీద సెయిలర్ గా వెళ్తాడు. ఆ నౌక మీద ఆఫ్రికన్ సముద్రపు దొంగలు దాడి చేస్తే, వాళ్ళని అమితాబ్ బచ్చన్ పాటలతో ఎదుర్కొంటాడు. 

          మేనమామ చనిపోతాడు. ఇక షాపు తనే నడుపుకుంటూ సెటిలవుతాడు భారత్. ఇంతలో ఆర్ధిక సంస్కరణల ఫలితంగా ప్రైవేట్ టీవీ ఛానెల్స్ రావడంతో కుముద్ వెళ్లి జీ టీవీలో ప్రొడ్యూసర్ గా చేరుతుంది. భారత్ సమస్యకి ఆమె పరిష్కారం ఆలోచించి, దేశ విభజన సమయంలో ఆచూకీ లేకుండా పోయిన వాళ్ళని వెతకడానికి మేరే అప్నే అనే లైవ్ ప్రోగ్రాం ప్రారంభిస్తుంది. రెండు దేశాల్లో ఎందరో స్పందిస్తారు. కొందరు తమ బంధువుల్నికనుక్కోగలుగుతారు. మరి భారత్ కి తన తండ్రి, చెల్లెలు దొరికారా? వాళ్ళ కోసం తన నిరీక్షణ ఫలించిందా?  లేక ఆ నిరీక్షణతోనే ఏడు పదుల  వృద్ధుడై పోయాడా? ఏం జరిగింది?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
       చరిత్రలు, జీవిత చరిత్రలు, దేశ విభజన లాంటి సీరియస్ సినిమాల ట్రెండ్ కి ఇక ముగింపు పలకాల్సిందే, ఇంకెన్ని సార్లు రిపీట్ చేస్తూ వీటినే చూపిస్తారు. దేశభక్తి సీజన్ ప్రస్తుతానికి ముగిసిన దృష్ట్యా, ఈ సీరియస్ మూడ్ లోంచి బయటకొచ్చి ఎంటర్ టైనర్స్ కేసి దృష్టి సారించి ప్రేక్షకుల్ని వినోద పర్చాల్సిందే. ఈ రెండేళ్లలో దేశ విభజన మీద హిందీలో బేగంజాన్, మంటో, వైస్రాయ్స్ హౌస్, కళంక్, ఇప్పుడు భారత్... ఐదు సినిమాలు వచ్చాయి. గత ఏప్రెల్ లోనే విడుదలైన ‘కళంక్’ లో లాంటి దేశ విభజన దృశ్యాల్నే, నెల తిరక్కుండానే మళ్ళీ ‘భారత్’ లో చూడాల్సి వస్తోంది. 

          ఐతే భారత్  ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ మూవీకి అధికారిక రీమేక్. ఈ రీమేక్ చేయడం ఎలా వుందంటే, ‘అంగమలై డైరీస్’ మలయాళ  నేటివ్ కథని ‘ఫలక్ నుమా దాస్’ కింద మార్చి దోసె వేసినట్టుంది. ఫలక్ నుమా పరోటా వేయకుండా దోసె వేసి ఎంత పరాధీనంగా  చూపించారో, కొరియా వాడి కథని హిందీలో అంత పరాయీకరణ చేసి చూపించారు. ‘ఓడ్ టు మై ఫాదర్’ 1950 లో కొరియా దేశ విభజన - యుద్ధ నేపథ్యంలో జరిగే కథ. అప్పట్నించీ అరవై ఏళ్ల కాలక్రమంలో ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకి వలస వచ్చిన హీరో, దేశంలో కొన్ని కీలక పరిణామాల మధ్య ఎలా జీవన సమరం చేశాడన్న వాస్తవికతా స్పర్శ వున్న కథ.  దీన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నప్పుడు ఏ కీలక పరిణామాలతో కూడిన దేశ చరిత్రనీ మిళితం చేయకుండా, కేవలం కల్పిత కథనం చేసి సరిపుచ్చారు. 

          కొరియన్ ఒరిజినల్ లో హీరో మళ్ళీ ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని చూడలేదు గానీ, వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తాడు. కానీ ‘భారత్’  హీరో పాకిస్థాన్ తో 1965 లో, 1971లో రెండు సార్లు యుద్ధాన్ని చూసే వుండాలి. అప్పుడు 1947 లో పాకిస్థాన్ లో తప్పిపోయిన తన తండ్రీ చెల్లెలు గుర్తుకొచ్చి డిస్టర్బ్ అయిపోవాలి. వాళ్ళ కోసం ఏదో ఒకటి  చేయాలి. ఇలా జరగదు. 1964 లో సర్కస్ కళాకారుడుగా ఎంజాయ చేస్తూంటాడు. ’70 లలో గల్ఫ్ వెళ్ళిపోతాడు. 1947 లో తను ఎదుర్కొన్న దేశ విభజన లాంటి దృశ్యాలే, 1971 యుద్దంలో తూర్పు పాకిస్తాన్ (యుద్ధంతో బంగ్లా దేశ్ అయింది) నుంచి వలసవచ్చిన లక్షలాది మంది శరణార్ధులతో కన్పిస్తూంటే దీని ప్రస్తావనే వుండదు. ఇలా కాలక్రమంలో 1965,71 రెండు యుద్ధాల వూసే లేకుండా కథని, పాత్రని చూపడంతో ఈ దేశ విభజన - ఆత్మీయుల కలయిక కథ అంత నమ్మశక్యంగా లేదు. ఇంకా 1975 - 77 మధ్య ఎమర్జెన్సీ కాలపు గడ్డు పరిస్థితి కూడా లేదు. ఇక 1962 చైనా యుద్ధంతో ఈ పాత్రకి సంబంధం లేదనుకున్నా, పాత్రకి సంబంధం వుండే 1999 కార్గిల్ వార్ కూడా జరిగింది. ఇది కూడా పత్తా లేదు. భారత్ కథ 1947 – 2010 మధ్య జరిగినట్టు చూపించారు. ఈ 63 ఏళ్ల కాలంలో కథని, పాత్రని ప్రభావితం చేసిన చారిత్రక ఘటన ఏమిటయ్యా అంటే, 1991  ఆర్ధిక సంస్కరణలు, దాంతో టీవీ ఛానెల్ ప్రోగ్రాం! 

       కొరియన్ వొరిజినల్ ముగింపు కూడా చారిత్రక సన్నివేశమే. 1950 కొరియా దేశ విభజనప్పుడు తప్పిపోయిన, లేదా విడిపోయిన కోటి కుటుంబాలని కలపడం కోసం 1983 లో దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్వహించిన బృహత్తర టీవీ కార్యక్రమం వాస్తవం, చారిత్రకం. మనదేశంలో ఇలా బంధువుల్ని కలిపే చారిత్రక  సంఘటన లేనే లేదు. కొరియన్ ఒరిజినల్లో వున్న దాన్నే  యధాతధంగా పెట్టేసి మనల్ని నమ్మ మన్నారు. దీనికి చారిత్రక టచ్ ఇద్దామనుకుని, ఇంకో పని చేశారు. 1991 లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలతో దేశంలో టీవీ చానెల్స్ వెల్లివిరిశాయని, వాటిలో ఒకటైన జీటీవీ ‘మేరే అప్నే’ పేరుతో ఈ ప్రోగ్రాం నిర్వహించిందనీ కల్పన చేశారు. ఆర్ధిక సంస్కరణలు ఒక్కటే వాస్తవం.

          కోట్లు పెట్టి కొరియన్ మూవీ రిమేక్ హక్కులు పొంది - దాంతో ఇలాటి కృత్రిమ కథ చేసేకన్నా, కొరియన్ వొరిజినల్లోంచి ‘దేశ విభజన, తండ్రీ కూతుళ్ళ అదృశ్యం’ అనే బేసిక్ లైను మాత్రమే స్పూర్తిగా తీసుకుని, ఆ 63 ఏళ్ల కథని మన దేశకాలమాన పరిస్థితులతో జోడించి చెప్పివుంటే ఇదొక బలమైన భావోద్వేగపు గాథ అయ్యేది. చరిత్ర రీలు నడుస్తూంటే దాంతో సమరం చేసే పాత్ర సజీవ యానం అయ్యేది. తన కుంటుంబాన్ని విడదీసిన విభజన మీద కసితో యుద్ధంలో కూడా పాల్గొని, పాకిస్థాన్లోకి జొరబడి, తండ్రినీ చెల్లెల్నీ వెతుక్కుంటే, అప్పుడిది కార్యాచరణలో వున్న కథయ్యేది. ఇంతకీ ఈ కథ కథేనా? కాదు, గాథ! కమర్షియాలిటీని పూర్తిగా త్యాగం చేస్తూ కమర్షియల్ స్టార్ సల్మాన్ పెట్టిన బాధ! మొదటిరోజు రికార్డు కలెక్షన్లు వచ్చాయి, అది వేరు. 

 ఎవరెలా చేశారు 
      సినిమా ప్రారంభమే 70 ఏళ్ల వృద్ధుడిగా కన్పిస్తాడు సల్మాన్. భారంగా జీవితాన్ని మోస్తున్నట్టు వుంటాడు. వృద్ధాప్యం తాలూకు ఎక్స్ ప్రెషన్స్ మొహంలో బాగా పలుకుతాయి. అయితే శారీరకంగా ఆ వృద్ధాప్యం కన్పించదు. ఇదొక్కటే లోపం. శారీరకంగా మనకి తెలిసిన హీ మాన్ సల్మాన్ లాగే వుంటాడు. ‘భారతీయుడు’ లో కమల్ హాసన్ వృద్ధ పాత్రలో వృద్ధాప్యాన్ని నమ్మించినట్టు నమ్మించలేకపోయాడు సల్మాన్. గొంతులో కూడా మార్పు వుండదు. ఇక యువ పాత్రలో హీరోయిజం వుండదు. కుటుంబ భారాన్ని మోస్తున్న ఓ సగటు యువకుడి పాత్ర ఇది. ఈ పాత్రలో కూడా ఫన్ వుండదు. పక్క పాత్ర స్నేహితుడిగా నటించిన సునీల్ గ్రోవర్ వల్లే కాస్త ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. యువ - వృద్ధాప్య రెండు పాత్రల్లోనూ సల్మాన్ ది స్లో నటన. ఇక పెళ్ళికి దూరంగా వుండే పాత్ర కాబట్టి కత్రినాతో రోమాన్స్ కూడా వుండదు. వృద్ధాప్యంలో ఇద్దరిదీ భారమైన జీవితమే. ‘నా జుట్టులో, గడ్డంలో ఎన్ని తెల్ల వెంట్రుక లున్నాయో, అంతకంటే రంగులమయంగా నా జీవితం వుండేది’ అన్న సల్మాన్ డైలాగు ప్రకారం అంత కలర్ఫుల్ గా వుండదు యంగ్ సల్మాన్ పాత్ర.

          కత్రినా కైఫ్ పాత్ర కమర్షియల్ పాత్రలా కాక, ఆర్ట్ మూవీ పాత్రలానూ కాక, రెండూ అన్నట్టు వుంటుంది. గెటప్ కూడా రెండిటిలాగే వుంటుంది. చీర కట్టుకుని, చింపిరి జుట్టులా అన్పించే హేర్ స్టయిల్ తో గమ్మత్తుగా వుంటుంది. వృద్ధాప్యంలో కాస్త నెరిసిన జుట్టు. ఎలాటి కృత్రిమత్వం లేని సహజ నటన. సూటిగా మాట్లాడేసే తత్వం. స్టేజి మీద అందరి ముందూ ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని సల్మాన్ తో చెప్పేస్తుంది. సల్మాన్ తన ఇంటి  బాధ్యతల వల్ల తిరస్కరించాక, ‘నువ్వు పూర్తి చెయ్యలేని స్వప్నాల్ని ఎప్పుడూ ఎవ్వరికీ నువ్వు చూపించకు’ అని కఠినంగా అనేస్తుంది (‘మహర్షి’ లో మహేష్ బాబుతో పూజా హెగ్డే కూడా ఈ మాట అనాల్సింది. కానీ తెలుగు హీరోయిన్ కొన్ని మాటలు అనకూడదు). 

       హస్యంకోసం సునీల్ గ్రోవర్ వున్నాడు. తండ్రి పాత్రలో జాకీ ష్రాఫ్ లాహోర్ రైల్వే స్టేషన్ సీను వరకే పరిమితమయ్యే పాత్ర. ఇక తప్పిపోయిన చెల్లెలుగా దర్శన మిచ్చే టబూది కన్నీళ్లు తెప్పించే రెండు సీన్ల పాత్ర.
          పాటలు వస్తూంటాయి గానీ, అవి అంత గొప్పవేం కావు. టెక్నికల్ గా పీరియడ్ లుక్ బావుంది గల్ఫ్ లొకేషన్స్ సహా. 


చివరికేమిటి 
       రెగ్యులర్ సల్మాన్ మూవీలా ఎంటర్ టైనర్ దృష్టితో చూడకూడదు. ఫ్యామిలీ డ్రామా కోసం కూడా చూడకూడదు. సల్మాన్ తో ఈ కథ ఫ్యామిలీ గురించే అయినా, ఫ్యామిలీని చూపించడం పెద్దగా ఏమీ వుండదు. ఫ్యామిలీని పోషించడానికి, ఫ్యామిలీకి ఎవేగా, తను ఏమేం ఉద్యోగాలు చేశాడో ఆ పోర్ట్ ఫోలియో తెలుసుకోవడం కోసమే చూడాలి. తెలుసుకుని ఆ పోర్ట్ ఫోలియో ప్రకారం ఇంకా ఉద్యోగాలేమైనా వుంటే సల్మాన్ కిచ్చి సహకరించాలి. 

          ఓడ మీద ఆఫ్రికన్ సముద్రపు దొంగలు దాడి చేసినప్పుడు అమితాబ్ అభిమానులైన ఆ దొంగలు,  ‘మేరే పాస్ పైసా హై, బంగ్లా హై, గాడీ హై, నౌకర్ హై, బ్యాంక్ బ్యాలెన్స్ హై...’ అన్నప్పుడు సల్మాన్,  ‘మేరే పాస్ పోర్ట్ ఫోలియో హై’ అంటాడేమో నని ఎదురు చూస్తాం. సల్మాన్ ఉద్యోగ సద్యోగ పర్వంలో కాస్త కామెడీ ఏమైనా వుంటే పక్క పాత్రల వల్లే, లేకపోతే ఫ్రెండ్ సునీల్ గ్రోవర్ వల్లే.  

          ఇక యాక్షన్ విషయానికొస్తే, విలన్స్ లేకపోతే యాక్షన్  ఏముంటుంది. అందుకని ఒక సీన్లో సముద్రపు దొంగలతో యాక్షన్ సీను, చమురుబావి ప్రమాదంలో ఇంకో యాక్షన్ సీను చూపిస్తూ యాక్షన్ హడావిడీ చేశారు. ఇవి ప్రధాన కథతో సంబంధం లేనివి. ప్రధాన కథ తాలూకు యాక్షన్ సీన్స్ రావాలంటే సల్మాన్ ‘తండ్రీ - చెల్లెలు - మిస్సింగ్’ అనే ప్రధాన కథలోకి రావాలి. ఇది వదిలేసి ఎంతసేపూ అప్పుడెప్పుడో తండ్రి చెప్పాడని ఏళ్ళకి ఏళ్ళు కుటుంబం కోసం ఉద్యోగాలు చేసే ఉప కథలతోనే సరిపోయింది. మధ్యమధ్యలో తండ్రినీ చెల్లెల్నీ ఫ్లాష్ కట్స్ తో గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనైనా మళ్ళీ మామూలే. 

     ఇక రోమాన్స్ విషయాని కొస్తే, ఇది డ్రీం సాంగ్స్ లోనే వుంటుంది. వాస్తవంలో వుండదు. ముందు ఒకటి రెండు రోమాంటిక్ చేష్టలతో కత్రినాని ఆకట్టుకున్నా, తీరా ఆమె పెళ్ళనేసరికి కుటుంబ బాధ్యతలంటూ తప్పుకుంటాడు. తండ్రి లేని కుటుంబాన్ని పోషించుకునే హీరోల సినిమాలు బోలెడు వచ్చాయి. పాత కాలపు సినిమాలు. భారత్ కథా కాలంకూడా పాతదే కాబట్టి దీన్నిలా సరిపెట్టుకోవాలనేమో. అయితే ‘కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి’ అంటూ సినిమా సాంతం రికార్డు వెయ్యడం సల్మాన్ పాత్రని సిల్లీగా మార్చేసింది.

          పెళ్లి చేసుకోరా అంటే కుటుంబాన్ని చూసుకోవాలంటాడు. ప్రేమించిందాన్ని తనలాగే  సింగిల్ గా వుంచేస్తాడు. సరే, పెళ్లి లేకపోతే కలిసి వుందామని, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనీ తనే అంటుంది. ఆ కాలంలో ఈ మాట, ఈ కాన్సెప్ట్ ఎక్కడివో కూడా  అర్ధంగాదు. అలా సల్మాన్ పాత్రకి డెబ్బై ఏళ్ళు వచ్చేవరకూ కలిసే వుంటారు. అంటే సల్మాన్ మనస్తత్వానికి అమలిన శృంగారమా, లేక కత్రినా కైఫియత్తులకి మలినమైన సంబంధమా? స్పష్టత లేదు. ముగింపులో ముసలితనంలో పెళ్లి చేసుకుంటారు. కొరియన్ ఒరిజినల్లో ముందుగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనిపారేస్తాడు. కుటుంబ పోషణకి ఏమీ అడ్డురావు. 

          ఎమోషనల్ గా ఆకట్టుకోవాలని తీసే ‘గాథలతో’ కూడిన సినిమాల్లో లాజిక్ వుండదు. మస్తిష్కం మూటగట్టి పక్కన బెట్టి, హృదయాల్ని పొదివి పట్టుకుని వీటిని చూడాలి. కన్నీళ్లు కార్చెయ్యాలి.  లేకపోతే  పాకిస్థాన్ లో వుండిపోయిన సల్మాన్ తండ్రి జాకీష్రాఫ్ పాత్ర, ఢిల్లీలో తన చెల్లెలు (సల్మాన్ మేనత్త) వుంటోందని తెలిసీ, ఆ అడ్రసుకి ఒక్క ఉత్తరం ముక్కా రాయకపోవడమేమిటి? అక్కడికి వచ్చే ప్రయత్నం చేయకపోవడమేమిటి?  దేశ విభజనతో ఆ టైముకి వచ్చిన వాళ్ళని లోపలేసుకుని, ఇంకా వస్తున్న వాళ్ళని పోండ్రా అని వెళ్ళగొట్టేసి సరిహద్దు మూసేశారా? 

          పైగా ఆ సమయంలోజాకీ ష్రాఫ్ ని భద్రతా దళాల యూనిఫాంలో చూపిస్తారు. అతడికెంత సేపు ఇండియా రావడానికి. పసి కొడుకు మీద కుటుంబ భారం వేయకుండా, ఉద్యోగంలో వున్న తను జీతం పంపవచ్చుగా? సల్మాన్ అయినా లాహోర్ లో తండ్రికి ఒక్క ఉత్తరమైనా రాసే ప్రయత్నం చెయ్యడు. రెండు దేశాలమధ్య కమ్యూనికేషన్స్ కూడా లేవా? అంత నిర్దయగా ప్రవర్తించాయా ప్రభుత్వాలు విభజన బాధితులతో? షాపు దగ్గరికి తండ్రి వస్తాడని 70 ఏళ్ళూ ఎదురు చూసే సల్మాన్ పాత్ర లాంటిది పాసివ్ గా గాథల్లోనే వుంటుంది, సహేతుకమైన కథల్లో కాదు. 

          సల్మాన్ తల్లి (సోనాలీ కులకర్ణి) కొడుకు పెట్టే తిండి కోసం పడి వుంటోందా? భర్త కోసం, రెండో కూతురి కోసం ఎంత తల్లడిల్లుతోందో కొడుకు ఆలోచించక్కర్లేదా? వాళ్ళని తెచ్చి కలపడం ప్రథమ కర్తవ్యంగా ఫీలవకపోతే ఇదేం కొడుకు గాథ, ఫ్యామిలీ డ్రామా? 

         విడిపోయిన కుటుంబం తిరిగి కలుసుకోవడం కాన్సెప్ట్ గోల్. కలపడానికి హీరో ప్రయత్నించడం స్టోరీ గోల్. కానీ సల్మాన్ స్టోరీ గోల్ ని వదిలేసి, స్టోరీ గోల్ తో సంబంధంలేని ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ వుండిపోతే, చివరికి కత్రినా కైఫ్ టీవీ లైవ్ ప్రోగ్రాంతో తనే కాన్సెప్ట్ గోల్ ని పూర్తి చేయాల్సి వస్తుంది. మొదట్లో దేశవిభజనతో కుటుంబం విడిపోవడమ నే ఒక సీను పెట్టుకుని, చివర్లో కలవడమనే రెండో సీను పెట్టుకుని,  ఈ రెండు ముక్కల మధ్యా వీటితో కలవని కథనం నడిపేశారు. కథగా ఏమీ జరగని ఈ కథనం రానురాను కృశించిపోతూ సహన పరీక్ష పెట్టేస్తుంది.

          హిందీలోనూ తెలుగులోనూ ఫార్ములా కమర్షియల్స్ కి కాలం చెల్లిందని, ఇంకేదో  డిఫరెంట్ ఫీల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది కాస్తా కమర్షియల్ సినిమాల్లోంచి కథల్ని వెళ్ళ గొట్టేసి, చప్పిడి  గాథలకి ద్వారాలు తెరుస్తోంది.

సికిందర్