రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 10, 2019

838 : సందేహాలు - సమాధానాలు



Q :  స్టోరీ డిస్కషన్స్ లో నేను వేగంగా ఆలోచిస్తాను. వేగంగా ఆలోచించి అందరికంటే ముందుగా వెంటనే సొల్యూషన్ చెప్పేస్తాను. అయితే నా ఇన్పుట్స్ తీసుకోవడం లేదు. కానీ నేనిచ్చిన ఇన్పుట్స్ నే అక్కడున్న ఇతరులు ఎవరైనా అటూ ఇటూ మార్చి తర్వాత చెప్తే, ఇది బావుంది కదా అంటున్నారు. ఇలా చాలా చోట్ల జరిగింది, జరుగుతోంది. ఎందుకిలా జరుగుతోంది? నాలో లోపం ఎక్కడుంది? నేనేం చేయాలి?
 
వినీత్ (మారుపేరు), AD

A :  వెంటనే చెప్పక పోవడమే మార్గం. కథ గానీ, సీను గానీ ఎక్కడైనా ప్రాబ్లం పెడితే వెంటనే అందుకుని సొల్యూషన్ చెప్పేకన్నా సమయం తీసుకోవాలి. ఒకటి రెండు రోజులైనా ఫర్వాలేదు. ఈ లోగా సొల్యూషన్ కోసం బాగా మధనపడుతున్నట్టు కన్పించాలి. ఇలా సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కన్పించి, గ్యాప్ తీసుకుని చెప్తే, రిజెక్ట్ చేయకుండా దాని గురించి ఆలోచనలో పడతారు. మీ ఇన్పుట్స్ ని ఇతరులు మార్చి చెప్పే అవకాశం కూడా వుండదు. కష్టపడకుండా ఈజీగా చెప్పేసేదాన్ని కొందరు  తీసుకోరు. అందుకని వెంటనే సొల్యూషన్ తెలిసినా, దానికోసం కష్టపడుతున్నట్టు కన్పించి, తీరిగ్గా ఇన్పుట్స్ అందిస్తే సరిపోతుంది. ఇదే సమయంలో మీ సొల్యూషన్ ఇంకెలా చెప్తే బావుంటుందో నాల్గు విధాలుగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే, మీ సొల్యూషన్స్ ని  ఇతరులు మార్చి చెప్తే వర్కౌట్ అవుతున్నాయి గనుక. ఇంకోటేమిటంటే, మీరు స్క్రీన్ ప్లే పరిభాష మాట్లాడుతోంటే మానెయ్యండి. వైద్యం చేసే డాక్టర్ వైద్యం చేస్తాడు. వైద్యం ఎలా చేస్తారో చదువుకున్నది పేషంట్ కి చెప్పడు. పేషంట్ పారిపోతాడు.

Q :  నేను కొందరికి కథలు విన్పిస్తూంటాను. అందరూ బాగానే వుందంటారు. నాకు నమ్మకం కలగదు. నేనంత పర్ఫెక్ట్ కాదని నాకు తెలుసు. కచ్ఛితంగా నా కథ బావుందో లేదో తెలుసుకోవాలంటే నేనేం చేయాలి?
గణపతి (మారుపేరు), AD 

 A :  ఈ బ్లాగు చదువుతూంటే మీకీ సందేహం రాకూడదు. మీ కథ బావుందో లేదో తెలుసుకునే కథా కమామీషు అంతా బ్లాగులో పెట్టేసి వుంది. మీ సమస్యని మూడుగా ఆలోచించాలి : అందరూ బావుందంటున్నా మీ కథతో మీకు నమ్మకం కలగడం లేదంటే - 1. కథంటే ఏమిటో, అదెలా వుంటుందో తెలియకపోవడమా? 2. నమ్మకం కలగనిది కథా వస్తువుకి మీరు చేసుకున్న కథనంతోనా? 3. మొత్తం కథా వస్తువే సరికాదన్న అనుమానమా?  

          ముందు పై మూడు ప్రశ్నల్లో ఏది మీకు వర్తిస్తుందో  గుర్తిస్తే సమస్య తీరిపోతుంది. కథంటే ఏమిటో, అదెలా వుంటుందో నిజంగా మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ అపనమ్మకం కథనంతో నైతే, స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి. మీరు స్ట్రక్చర్ పాటించని సొంత క్రియేటివ్ స్కూలైతే, గట్ ఫీలింగ్ తో సాగిపోవాలి. ఇంతకంటే చేసేదేమీ లేదు. మొత్తం కథా వస్తువే సరికాదన్న అనుమానం వుంటే, దాన్ని మార్కెట్ యాస్పెక్ట్ తో బేరీజు వేసుకోవాలి, అంతే. 

          ఇక కథల్ని ఎవరికి వినిపిస్తున్నారన్నది కూడా ముఖ్యమే. సినిమా ప్రొఫెషనల్స్  కాని ఫ్రెండ్స్ కి, బంధువులకి విన్పించకుండా వుంటే మంచిది. సినిమా ప్రొఫెషనల్స్ కూడా ట్రెండ్ లో వున్న వాళ్లయితే మంచిది. ఇక మీరీ టైపు కథలు విన్పించే వాళ్ళలో ఒకరుగా వున్నారేమో కూడా పరిశీలన చేసుకోవాలి : కథలు విన్పించే వాళ్లకి చాలా వరకూ ఎలా వుంటుందంటే, విన్న వాళ్ళు మెచ్చుకోవాలనుంటుంది. మెచ్చుకోకపోతే మళ్ళీ మొహం చూపించరు. వీళ్ళు ఆత్మ సంతృప్తి పొందడం కోసమే కథలు వినిపిస్తారు. తమ కథని ఎంత మంది మెచ్చుకుంటే అంత ఆత్మ సంతృప్తి ఫీలవుతారు. నా కథ పన్నెండు మంది మెచ్చుకున్నారోచ్ అన్నఆత్మ సంతృప్తిలోంచి ఆనందాన్నిజుర్రుకుంటారు. ఇది కనిపెట్టిన వాళ్ళు సినిమా ప్రొఫెషనల్స్ అయినా సరే, మనకెందుకని బ్యాడ్ గా వున్న కథని కూడా బాగా మెచ్చుకుని పంపించెయ్యొచ్చు. కాబట్టి ఇలాటి  ఈ గ్రూపులో మీరుండడం వల్ల అందరూ మీ కథల్ని మెచ్చుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నిజమని అన్పిస్తే, అది ఆత్మసంతృప్తి కాదనీ, ఆత్మవంచననీ తెలుసుకోండి.

Q :  నేనొక రైటర్ని. రైటర్స్ ని ఇప్పుడెవరూ కథలు అడగరని తెలిసినప్పటికీ కథలు రాసుకోవడం నాకో బలహీనతగా మారింది. ఒక కథ మొదలు పెట్టాక యింకో ఐడియా వస్తేదాన్నికూడా మొదలుపెట్టి రెండూ రాసే ప్రయత్నంలో ముందుకు సాగలేకపోతున్నాను. ఏక కాలంలో రెండు రాయలేమంటారా? అసలు ఇప్పుడు కథలు రాసుకోవడం కరెక్టేనా?
సుధాకర్ (మారుపేరు)

A :    ఇప్పుడు రైటర్ కథలు రాసుకోవడం కాదు, సెంటు పూసుకున్నా ఏ సెంటూ అని అడిగే వాళ్ళు లేరు. సెంటు గుబాళింపులు కూడా సొంతానికే. ఇప్పుడు కాదు, గత రెండు దశాబ్దాలుగా రైటర్స్ ని కథలడిగే వాళ్ళు లేరు. దర్శకులే కథలు రాసుకుని సినిమాలు తీసుకుంటున్నారు. కాబట్టి దర్శకుడవ్వా లనుకుంటేనే కథలు రాసుకోవాలి. లేదూ రైటర్ గానే వుండాలనుకుంటే డైలాగ్ రైటర్ గా స్థిరపడేందుకు కృషి చేసుకోవాలి. డైలాగ్ రైటర్ గా మారేక కూడా కథల్ని ఇవ్వడాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే డైలాగ్ రైటర్స్ కథల్ని రాయలేరు. రెండు దశాబ్దాలుగా వున్న పరిస్థితిని తెలుసుకోక కొత్త వాళ్ళు రైటర్స్ అవుదామని కథలు పట్టుకు తిరుగుతూంటారు. వాళ్ళకి రెండే వుంటాయి : దర్శకుల దగ్గర ఘోస్టులుగా వుండడమో, లేదా తమ కథలతో దర్శకులవడమో. ఇక ఏక కాలంలో రెండు కథలు రాయడమనేది బ్రెయిన్ ని కంపార్ట్ మెంటలైజ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. బ్రెయిన్ ని కంపార్ట్ మెంటలైజ్ చేసుకోక మల్టీ టాస్కింగ్ సాధ్యం కాదు. కొత్తగా కథలు రాస్తూంటే, ఒకటి పూర్తి చేసేవరకూ ఇంకో దాని ఆలోచన రానివ్వకూడదు. మల్టీ టాస్కింగ్ అనుభవం మీద వస్తుంది.

Q :  I didn’t see Bharat but read your review. I couldn’t believe hero doesn’t do anything for his emotional goal uniting family. I think director thought the portfolio of hero helps him to beautifully picturize period scenes. And even father doesn’t do anything. I guess director thought if hero goes to Pak then people compare with Bhajarangi… I must see original Korean movie.
―CS,  Dir.

A :  కథ చేయకుండా గాథ చేస్తే వచ్చే సమస్య ఇదే. హీరో ఏమీ చెయ్యడు. తన కోసం వాటంతటవే జరిగిపోవాలి, లేదా ఇంకెవరో చేసిపెట్టాలి. ఇలాటి నిర్వీర్య గాథలతో ఏం చెబు తున్నామన్న స్పృహ కూడా వుండడం లేదు. మీరన్నట్టు హీరో పాక్ కి వెళ్తే భజరంగీ భాయిజాన్ తో పోలిక వస్తుంది. కానీ అలా ఎందుకుంటుంది కథ. 1971 యుద్ధంలో పాల్గొనడం ద్వారా పాక్ లోకి జొరబడి తన వాళ్ళని వెతికే క్రమంలో పట్టుబడితే, తర్వాత యుద్ధ ఖైదీల మార్పిడి ద్వారా వెనక్కే వస్తాడు. ప్రయత్నించి విఫలమయ్యానన్న బాధతో. ప్రయత్నించకుండా బాధ పడేకన్నా ఇది నయం కదా. కొరియన్ ఒరిజినల్ వేరు. దక్షిణ కొరియాలో యుద్ధాల్లేవు. అందుకని ఆ కథ అలా వుంది. మన దగ్గర  యుద్ధాలున్నప్పుడు  వాటిని దాటవేసి ఎలా ప్రవర్తిస్తుంది పాత్ర. మరొకటేమిటంటే, తిరిగి తండ్రిని చూడకుండానే కన్నుమూస్తుంది తల్లి. గాథల హీరో ఇలాగే చేతలు లేకుండా వుంటాడు. కొరియన్ ఒరిజినల్ తో బాటు, హిందీ కూడా మీరు తప్పకుండా చూడగలరు.
సికిందర్