రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 28, 2017

576 : రివ్యూ!



రచన -  ర్శత్వం: విఐ.ఆనంద్
తారాగణం: అల్లు శిరీష్, సురభి, అవరాల శ్రీనివాస్, శీరత్ పూర్, దాసరి అరుణ్ కుమార్,  జయప్రకాష్, కాశీ విశ్వనాథ్, రోహిణి, ప్రవీణ్, త్య దితరులు
సంగీతం: ణిశర్మ, ఛాయాగ్రణం: శ్యాం కె.నాయుడు, మాటలు: అబ్బూరి వి
బ్యానర్ : ల
క్ష్మీ సింహా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత
‌: క్రి చిగురుపాటి
విడుదల : డిసెంబర్ 28, 2017
***

        అల్లు శిరీష్  నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఈసారి వైవిధ్యమున్న సినిమా చేయాలనే ఉద్దేశంతో రోమాంటిక్ థ్రిల్లర్ కి సిద్ధమయ్యాడు. కొత్త ఆలోచనతో వచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ కి అవకాశమిస్తూ రోమాంటిక్ థ్రిల్లర్స్ కొక కొత్త రూపు నివ్వాలని సంకల్పించాడు. ఇందుకు ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రయత్నించాడు. కమర్షియల్ గా కొత్త ప్రయోగాలూ చేయాల్సిందే. అయితే ప్రస్తుత ప్రయోగం ఏ మేరకు ఔరా అన్పించుకుంది? హౌరా ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్ళిందా? వైరల్ అయిందా? ఓసారి చూద్దాం...

కథ 
      తొలిచూపులోనే జ్యోత్స్న (సురభి) ని ప్రేమిస్తాడు జీవా (అల్లు శిరీష్). ఆమె కూడా ప్రేమిస్తుంది. జీవాకి ఫోకస్ ఎక్కువ. అనుకున్నది  సాధించే వరకూ నిద్రపోడు. ఆమెకి మనుషుల్ని పరిశీలించే ఆసక్తి ఎక్కువ. ఎదుటి ప్లాట్ లో వుంటున్న శీను (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) లు ఘర్షణ పడుతూండడాన్ని ఆమె గమనించి జీవాకి చూపిస్తుంది. శీను బారి నుంచి స్వాతిని కాపాడమని కోరుతుంది. జీవా  శీనుని కలుసుకుంటే,  అతను స్వాతితో తన ప్రేమ కథ చెప్తాడు. అది అచ్చం జ్యోత్స్నతో తన ప్రేమలాగే వుందన్పిస్తుంది జీవాకి. అంతేగాక,  శీనుకి జరిగే సంఘటనలే తర్వాత తనకీ  జరుగుతున్నాయని గ్రహిస్తాడు. ఒక రోజు శీను స్వాతిని  చంపేస్తాడు. ఆందోళనతో జీవా, జ్యోత్స్నాలు మహ్మద్ అస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ని కలుసుకుంటే, అతను ఇది విధి అనీ, దీనికి పారలల్ లైఫ్ థియరీ వుందనీ చెప్పుకొస్తాడు. ఇప్పుడు చూస్తే దీని ప్రకారం శీను స్వాతిని చంపినట్టే తను జ్యోత్స్నని చంపేస్తాడా?  ఇప్పుడేం చేయాలి? ఇది విధియే  అయితే దీన్నెలా ఎదుర్కొని జ్యోత్స్నని కాపాడుకోవలన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      పారలల్ లైవ్స్  - సమాంతర జీవితాల థియరీ మనుషులకే గాక విశ్వానికీ  వుంది. మనుషుల విషయాని కొస్తే వందేళ్ళ తేడాతో అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనెడీలకి ఒకేలా జరిగిన సంఘటనలు నమ్మలేని నిజాలుగా వున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాన్సెప్ట్ తో  2010 లో ‘పారలల్ లైఫ్’ అనే కొరియన్ థ్రిల్లర్ వచ్చింది. ఇందులో ఒక జడ్జి కుటుంబం ఇవ్వాళ హత్యకి గురయినట్టే,  ముప్ఫై ఏళ్ల  క్రితం అప్పటి ఒక జడ్జి కుటుంబం హత్యకి గురయి వుంటుంది. ఇద్దరి హంతకులు ఆ జడ్జీలు శిక్ష విధించిన నేరస్థులే.  అయితే ఇప్పటి జడ్జి కుటుంబంలో కూతురు హత్యకి గురి కాకుండా మిగులుతుంది. పారలల్ లైఫ్ థియరీ ప్రకారం ఈమెని కూడా హంతకుడు  జైల్లోంచి తప్పించుకొచ్చి  చంపేస్తాడా అన్నది కథ. దీనికి లింకన్ – కెనెడీల జీవితాలే స్ఫూర్తి అని సినిమాలో స్పష్టం చేస్తారు. 

          ‘ఒక్క క్షణం’ కథకి  కూడా లింకన్ – కెనెడీల జీవితాలనే  స్పూర్తిగా చూపిస్తారు. ఐతే లింకన్ – కెనెడీల జీవితాలూ, దీని స్ఫూర్తితో కొరియన్ కథా సమాంతర జీవితాలే గానీ అవి ఒకే కాలంలో జరగవు. దీనికి భిన్నంగా ‘ఒక్క క్షణం’ లో రెండు కథలూ ఏకకాలంలో సమాంతరంగా జరుగుతాయి. పైగా ఇది ప్రేమ కథ. దీన్ని ప్రేమ వర్సెస్ విధి అన్నారు. కానీ కథా నిర్వహణలో పారలల్ లైఫ్ కాన్సెప్ట్ ని  విధివిలాసపు కథనంగా చూపడంలో విఫలమై,  రొటీన్ మర్డర్ మిస్టరీగా నడిపారు. ఎంచుకున్న కాన్సెప్ట్ లో ఏ కథని నడపాలో ఆ కథని గుర్తించి దాన్ని నడపలేకపోయారు. హీరో ఫోకస్ వున్న తెలివైన కుర్రాడన్నారు గానీ కథని కూడా ఫోకస్ లో వుంచాలని అనుకోలేదు కథకుడు. ఇంకొకటేమిటంటే, ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ని రోమాంటిక్ డ్రామాగా  చేసేశారు. దీంతో రోమాన్స్ వర్సెస్ విధి అనే థ్రిల్లర్ జానర్ కథకి హుషారు కూడా లేకుండా పోయింది. గతవారం రోమాన్స్ వర్సెస్ విధి కథ ‘హలో’ హుషారైనది. థ్రిల్లర్స్ అంటే అద్భుతరస కథలు. ఇవి ఏడ్పిస్తూ వుండవు. అడ్వెంచర్స్ చేస్తూ వుంటాయి. కథలో విషాదమున్న అద్భుతరస  కథలకి ‘ముత్యాలముగ్గు’  ఎప్పుడూ మార్గదర్శిగా  వుం టుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం.  ఇందులో సంగీతది విషాద కథే. కానీ ఈ విషాద కథకి - ఆమె సమస్య తీర్చడానికి - ఆమె పిల్లలు పాల్పడేది హుషారైన - నవ్వించే – అడ్వెంచరస – అద్భుతరస కథనం!  ఇది అంత హిట్టవడానికి ఇదీ యూనిక్ సెల్లింగ్ పాయింట్- ఇది ‘ఒక్క క్షణం’ లో పూర్తిగా లోపించింది. ఏం  చెబుతున్నారో అర్ధంగాకుండా పోయింది. 

ఎవరెలా చేశారు 
       శిరీష్ తన స్థాయి మేరకు నటించాడు. ఇంకా ఇది తనకి శిక్షణా కాలమే. ఇంకెన్ని సినిమాలు  నటిస్తే శిక్షణ పూర్తవుతుందో తెలీదు. శిక్షణ కోసమన్నట్టు నటించిన ఈ థ్రిల్లర్ లో, మిగతా  భావోద్వేగాల ప్రకటన అతడి ముఖంలో ఎలా వున్నా, భావోద్రేకాలకి లోనైనప్పుడు ముఖంలో ఆ మేరకు టచప్స్ ఇవ్వాల్సింది. ఆ సమయంలో కూడా తేటగా గ్లామరస్ గా వుంటే నటిస్తున్నట్టే లేదు. చుక్క చెమట కూడా పట్టని భావోద్రేకాలు తేలిపోతాయి.  ఇక ప్రేమ సన్నివేశాలూ, కామెడీ ఇవి మామూలే. వీటితో నటుడన్పించుకోవడం సాధ్యపడదు. యాక్షన్ దృశ్యాల్లో, పాటల్లో మాత్రం అభివృద్ధి కనబర్చాడు. ఐతే ఒక కథానాయకుడుగా పాత్రని అడ్వెంచరస్ గా మారకుండా అడ్డుపడింది దారితప్పిన కథనమే. కాన్సెప్ట్ ప్రకారం తను రోమాంటిక్ థ్రిల్లర్ కథా నాయకుడై వుంటే చాలావరకూ తన లోపాలు కవరై వుండేవి. 

          ఇక హీరోయిన్ సురభికి నటించే అవకాశం దక్కిన పాత్రే ఇది – దేనికీ ఈ నటన? రోమాంటిక్ థ్రిల్లర్ కథానాయికగా విధిని ఎదుర్కొనే ధీశాలిగా, హీరోతో పాటు హుషారుగా వుండాల్సిన తను కాస్తా,  హీరోకి భారమై, అతడి హుషారుని దెబ్బ తీసి, రోమాంటిక్ డ్రామాల విషాద నాయికై ఏడుస్తూ కూర్చునే నటన దేనికి పనికొచ్చింది - తను నటించగలనని నిరూపించుకుందేమో గానీ,  ఈ పాత్ర చిత్రణ కథనే దెబ్బ తీసింది. ముగింపులో ఎంతకీ ముగియని సాగతీత ఓల్డ్ విషాద మెలోడ్రామా థ్రిల్లర్ కి అవసరమా? 

          దాసరి అరుణ్ కుమార్ విలన్ గా అవతారమెత్తి మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ పాత్రలో తను ఎక్సెలెంట్. విలన్ గానే స్థిరపడితే బెటర్. హీరో తల్లిదండ్రులుగా కాశీ విశ్వనాథ్ – రోహిణీల పాత్రల తీరు తెన్నులు థ్రిల్లర్ జానర్ మర్యాదకి అడ్డంకి. ఈ పాత్రలు లేకపోయినా వచ్చే నష్టం లేదు. 

        అవసరాల శ్రీనివాస్ ది సంక్షిప్త పాత్ర. ఒకసారి దోషిగా, ఇంకోసారి  నిర్దోషిగా కథనం ద్వారా అన్పిస్తూ ఆసక్తి రేపుతాడు. సీరత్ కపూర్ ది విషాద పాత్ర. జరిగిన ఒక ఘోరానికి తనే బాధ్యురాలని కుమిలిపోతూ జీవితాన్ని దుర్భరం చేసుకునే పాత్రలో బాగా నటించింది గానీ, ఈ పాత్రని అంతలా పొడిగిస్తూ దేన్ని దెబ్బతీస్తున్నాడో తెలుసుకోలేదు  కథకుడు. ఇది ఈ పాత్ర కథ కాదు. ఈ పాత్రకి అసలేం  జరిగిందన్నదీ కథకి అవసరమే  లేదు. కథని గుర్తించకపోతే ఇంతే. కేవలం సీరత్ – అవసరాల పాత్రల వల్ల హీరో హీరోయిన్లకి ఏం జరుగుతుందన్నదే గుర్తించాల్సిన కథ! నడపాల్సిన కథ! అంతే గానీ,  సీరన్ పాత్ర ఎలా చనిపోయిందని ఆ మిస్టరీ అంతా  విప్పుతూ,  సెకండాఫ్ అంతా గడిపే కథ కానేకాదు!!

          పోతే సహాయ పాత్రలుగా ఎక్కడ పడితే అక్కడ కమెడియన్లు కనిపించడం జానర్ మర్యాదని దెబ్బతీసింది. కనీసం అరడజను మంది కమెడియన్లు వచ్చిపోతూంటారు. కథనాన్ని రసాభాస చేస్తూంటారు. ఈ కొత్త కాన్సెప్ట్ లో మూస ఫార్ములా చూస్తున్నట్టు చేస్తారు. 

          పాటల గురించి చెప్పుకోవడం అంతగా అవసరం లేదు. రెండు వారాలు జీవిత కాలం వుండే సినిమాలకి పది కాలాలు నిల్వవుండే పాటలు వుండవు, రావు, అవసరం లేదు కూడా. కాబట్టి చెప్పుకోవాల్సింది కేవలం సన్నివేశాలకి నేపధ్య సంగీతాల గురించే ఇప్పుడు. ఈ విషయంలో మణిశర్మ మరోసారి ప్రతిభ చూపెట్టారు కథ ఎలా మారిపోయినా, ఏం కథ నడుస్తున్నా. శ్యాం కె నాయుడు కెమెరా వర్క్ ఎప్పటిలా పర్ఫెక్ట్. అబ్బూరి రవి మారుతూపోయే కథకి మారిపోయే మాటలే తను మారిపోతూ రాశారు. 

చివరికేమిటి 
        పారలల్ లైఫ్ థియరీ ప్రకారం వుండాల్సిన కథ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే లేవు. పారలల్ లైఫ్ థియరీలో ముగిసిపోయిన ఒకరి జీవితంలాగే ఇంకొకరి జీవితం నడుస్తుంది. కాబట్టి రెండిటి కాలాలు వేర్వేరుగా వుంటాయి. ఒకవేళ ఒకే కాలంలో జరుగుతున్నట్టు చిత్రించాలన్నా, ఇద్దరి జీవితాల్లో ఒకే విలన్ వుండకూడదు. అప్పుడది పారలల్ లైఫ్ థియరీ అవదు. 

          రెండోది, ఒకరి జీవితాన్ని ముగించి ఆ జీవితంలాగే ఇంకొకరి జీవితం నడపడం పారలల్ లైఫ్  కథ కొనసాగడానికి అవకాశాన్నిస్తుంది. అంతేగానీ, ముందు ముగిసిన జీవితం ఎలా ముగిసిందని తవ్వడం చేస్తే పారలల్ లైఫ్ కథ అవదు. మర్డర్ మిస్టరీ కథగా మారిపోతుంది. 

          సీరత్ పాత్ర చనిపోయింది, అవసరాల పాత్ర చంపిందని జైలుకి పోయింది. అంటే పారలల్ లైఫ్ ని చూపిస్తూ ఆ పాత్రల కథ ముగిసింది. కేవలం పారలల్ లైఫ్ ని చూపించడానికే ఆ పాత్రలుండాలి. అసలేం జరిగింది, అవసరాల పాత్రే చంపిందా అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తే – ఇప్పుడు పారలల్ లైఫ్ ట్రాక్ లో వున్న శిరీష్ – సురభి పాత్రల కథ చెప్పడానికి వుండదు. ఇదే జరిగింది. కథని గుర్తించకపోవడం. సీరత్ – అవసరాల పాత్రల బ్యాక్ డ్రాప్ లో శిరీష్ – సురభి పాత్రల పారలల్ లైఫ్ ప్రమాదభరిత  అసలు కథని చెప్పే అవకాశాన్ని కోల్పోవడం. బ్యాక్ డ్రాప్ పాత్రయిన  అయిన సీరత్ పాత్రనే మళ్ళీ లాక్కొచ్చి ప్రధాన కథ చెయ్యడం!  చెప్పాల్సిన కథని గుర్తించలేక - కథని గుర్తించలేక - కథని గుర్తించలేకా  – పూర్తిగా చేతులెత్తేయడం!!

          ఈ మర్డర్ మిస్టరీలో పాతమూస ఆస్పత్రి మెడికల్ మాఫియా – ఘోరఖ్ పూర్ ఆస్పత్రి పిల్లల ఉదంతపు ఉటంకింపు, ఆ తాలూకు కుట్రని ఛేదించి ఆస్పత్రి బాగోతాన్ని బట్టబయలు చేయడం...సీరత్ పాత్ర ఎందుకు చనిపోయిందో ఇలా వెల్లడించడం, ఈమెలాగే ఇక సురభి పాత్రెలా చనిపోతుందో చూడండని- తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం - క్లయిమాక్స్ లో విలన్ ఆమెని  అపహరించడం – ఏమిటీ కథ!

          ఫస్టాఫ్ దాదాపు ఇంటర్వల్ వరకూ  నిజంగా బోరు. హీరోహీరోయిన్ల ప్రేమకథ చాలాపాత మూస. జానర్ మర్యాదలో వుండదు. ప్రొఫెసర్ని కలిశాక  ఇంటర్వెల్లో వచ్చే మలుపు చాలా బలమైన మలుపు. ఇక పారలల్ లైఫ్ లో హీరోకూడా  హీరోయిన్ని చంపే స్తాడా అన్న ప్రశ్నకి,  నిజంగా ప్రేక్షకులు సీట్లలోంచి  లేవలేకపోయారు విశ్రాంతికి.

          ఆ తర్వాత సెకండాఫ్ లో మొదటి ఇరవై నిమిషాలే ఆ ప్రశ్న ప్రకారం కథ నడుస్తుంది. ఎప్పుడైతే సీరత్ పాత్రలాగే సురభి పాత్ర ఆత్మహత్యాయత్నం చేస్తుందో – ఇక ఆ పైన కథే మారిపోతుంది.  పూర్తిగా సురభిపాత్ర మర్డర్ మిస్టరీ అయి  -  ఇక హీరోహీరోయిన్ల పారలల్ లైఫూ, దానితాలూకు మనం ఆసక్తితో ఎదురుచూసే విధితో చెలగాటాలూ వుండవ్! పైగా  మర్డర్ మిస్టరీలో ఎన్నో చిక్కుముళ్ళు, మలుపులూ. టోటల్ గా ఇది సెకండాఫ్ సిండ్రోమ్  పాలబడ్డ మరో స్క్రీన్ ప్లే.  


సికిందర్