రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జూన్ 2017, శనివారం

రివ్యూ!




దర్శకత్వం : కబీర్ ఖాన్
తారాగణం : సల్మాన్ ఖాన్, సొహైల్ ఖాన్, ఝూ ఝూ, మతిన్ రే టంగూ, ఇషా తల్వార్, ఓం పురి, యశ్పాల్ శర్మ, జీషాన్ ఆయూబ్ తదితరులు
కథ : ‘లిటిల్ బాయ్’ ఆధారం, స్క్రీన్ ప్లే : కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్; మాటలు : మనూ రిషీ చద్దా, సంగీతం : ప్రీతమ్, జూలియస్ పకియమ్; ఛాయాగ్రహణం : అసీమ్  మిశ్రా
బ్యానర్ :  సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్
విడుదల : జూన్ 23, 2017

***
        భజరంగీలు సల్మాన్- కబీర్ ఖాన్లు బిగ్ యాక్షన్ వదిలేసి క్యూట్ సెంటిమెంటుతో ‘ట్యూబ్ లైట్’ ని వెలిగించి, వెలుగులు నింపుకుందామనుకున్నారు ఈద్ కి. 1962 లో ట్యూబ్ లైట్ ఒక విలాస వస్తువు. ఇళ్లలోనే వుండేది కాదేమో, స్కూళ్ళల్లో వుండేందుకు వీల్లేదు. గ్రామాల్లో కరెంటే లేదు. అలాంటిది పట్టపగలు స్కూల్లో ట్యూబ్ లైటు వెలిగించబోయారంటే, ఎలాటి హాలీవుడ్ కథని ఎలా తయారుచేశారో అర్ధంజేసుకోవచ్చు. ఎవరికైనా  మంద బుద్ధి వుంటే ట్యూబ్ లైట్ అంటారు. ఇలా అనడం 1960 ల నుంచే మొదలైందా అనేది కూడా ఒక సందేహం. 

          ట్యూబ్ లైట్’  ఎన్నిసార్లు టపటప కొట్టుకున్నా వెలగకపోవడానికి కారణ మేమిటి? సమస్య స్టార్టర్ దా, ఫిలమెంటుదా, చోక్ దా? అసలు 1962 లో లెడ్ బల్బే వెలిగించివుంటే పోయేదా? తెలుగు హీరోలు సంక్రాంతికి వచ్చినట్టు, ప్రతీ రంజాన్ కీ వచ్చే ‘ఈద్’ హీరో సల్మాన్ ఖాన్ సంగతులేమిటో కథలోకి వెళ్లి చూద్దాం...

కథ 
     పర్వతాల మధ్య కుగ్రామం జగత్ పూర్. అక్కడ తల్లిదండ్రులు లేని అన్నదమ్ములు లక్ష్మణ్ (సల్మాన్), సోహైల్ (భరత్) లు. అనాధాశ్రయం నిర్వాహకుడు బన్నే చాచా (ఓంపురి) చేరదీసి పెంచుతాడు. కానీ లక్షణ్ కి వయస్సొచ్చినా మనసికంగా బాలుడిగానే వుండిపోయాడు. ఏ విషయాలూ అర్ధం కావు. చిన్న పిల్లాడి ప్రవర్తన. దీంతో స్కూల్లోనే తోటి పిల్లలు ట్యూబ్ లైట్ అని పేరు పెట్టేశారు. అదే స్థిరపడింది. 

          అప్పుడు చైనాతో యుద్ధం  వస్తుంది. సైన్యంలో చేరడానికి పిలుపు వస్తుంది. తమ్ముడు భరత్ సెలెక్ట్ అవుతాడు. తను సెలెక్ట్ కానందుకు హర్ట్ అవుతాడు లక్ష్మణ్. తనని వదిలి భరత్ యుద్ధరంగానికి వెళ్లిపోతూంటే కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనని ఆటలు పట్టించే వాళ్ళనుంచి కాపాడే భరత్ ఇక తనతో లేనందుకు కుంగిపోతాడు. 

          ఊళ్ళోకి ఒక మెజీషియన్ (షారుఖ్ ఖాన్) వస్తాడు. అతను లక్ష్మణ్ చేత ఒక ఐటెం ప్రదర్శిస్తాడు. తదేక ధ్యానం,  ఆత్మ విశ్వాసం వుంటే కొండలైనా కదిలి దగ్గరికి వస్తాయని - కంటి చూపుతో (టెలికినెసిస్?)  సీసాని కదిలింపజేసి నిరూపిస్తాడు. దీంతో లక్ష్మణ్ ఆత్మబలంతో తమ్ముడు భరత్ ని రప్పించుకోగలనని నమ్ముతాడు. 

          ఒక చైనీస్ మూలాలున్న లీ (ఝూ ఝూ), ఆమె కొడుకు గువా (
మతిన్ రే టంగు) కోలకత నుంచి వచ్చి వూళ్ళో స్థిరపడతారు. చైనాతో జరుగుతున్న యుద్ధ్హాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ద్వేషిస్తాడు లక్ష్మణ్. కానీ శత్రువుతో నైనా స్నేహం చేయాలనీ గాంధీజీ సూక్తి చెప్తాడు బన్నే చాచా. దీంతో ఆ తల్లీ కొడుకులతో స్నేహం మొదలెడతాడు లక్ష్మణ్....ఇలా కథ సాగుతూనే వుంటుంది...సాగుతూనే వుంటుంది... ఎందుకంటే ఇది కథ కాదు, గాధ కాబట్టి.

ఎలావుంది కథ 
       2015 లో వచ్చిన ‘లిటిల్ బాయ్’ ని అధికారికంగానే రీమేక్ చేసిన కథ ఇది. మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో గోమేజ్ దీన్ని రెండో ప్రపంచయుద్ధ నేపధ్యపు కథగా తీశాడు.  ఇది తండ్రీ కొడుకుల మధ్య కథ. యుద్దానికెళ్ళి పోయిన తండ్రిని ఎలాగైనా ఆ యుద్ధాన్ని ఆపించి వెనక్కి రప్పించుకోవాలన్న ఎనిమిదేళ్ళ కుర్రాడి తపన ఇది. ఆత్మవిశ్వాసముంటే కొండలైనా కదిలివస్తాయన్న బైబిల్ సూక్తి కుర్రాడి  తపనకి ఆధారం. బైబిల్ సూక్తితో సాక్షాత్తూ కొండలే కదిలి వచ్చినట్టు చూపించడంతో కన్విన్స్ కాలేదు ప్రేక్షకులు. ఆత్మవిశ్వాసం వల్ల వ్యక్తిత్వ వికాసమో, మానసిక ప్రశాంతతో పిల్లలకి నేర్పేలా వుండాలిగానీ, కొండల్ని కదిలించే- యుద్దాల్ని ఆపించే మ్యాజిక్కులు కాదని ఈ సినిమాని తిప్పికొట్టారు. ఒక సీన్లో కుర్రాడు చేతులు జాపి, నోటితో భీకర శబ్దాలు చేస్తే నిజంగా భూకంపమే వస్తుంది!!  ఆవెంటనే కొండల్ని కూడా కదిలించాడని పేపర్లో వార్తలొస్తాయి!!

          దీన్ని సల్మాన్ తో రీమేక్ చేశారు. బాల పాత్రని బలిష్ట సల్మాన్ వేశాడు.  కథని 1962 లో చైనాతో యుద్ధం దగ్గర  స్థాపించారు. కానీ పుట్టడం మాత్రం స్వాతంత్ర్య పూర్వమే పుడతాడు.. దేశవిభజన, గాంధీజీ మరణం ఇవన్నీ చూసిన పాత్ర, 1962 నాటికీ ఎదిగి, చైనాతో యుద్ధాని కెళ్ళిన తమ్ముణ్ణి వెనక్కి రప్పించుకునే కథగా మారింది. ఆత్మవిశ్వాసంతో యుద్ధాన్నిఆపే పాయింటు లేదు. కాకపోతే నిడివి కోసమన్నట్టు  చైనీస్ తల్లీ కొడుకుల  ట్రాకు కల్పించి పెట్టారు.  ఈ కథలో హీరోయిన్ లేదు, ప్రేమలు లేవు, డ్యూయెట్లు లేవు, విలన్ కూడా లేడు.

ఎవరెలా చేశారు 
        టైటిల్ రోల్ వేసిన సల్మాన్ వొరిజినల్ లోని ఎనిమిదేళ్ళ లిటిల్ బాయ్ పాత్ర నటించాడు. ఒక బాల పాత్రని యుక్త వయసులోనో, నడి వయసులోనో వున్న నటుడు నటించడానికి సాహసం చేయడం  ఇదే ప్రథమం కావొచ్చు. ఇదెంత పొరపాటు నిర్ణయమో తెలుస్తోంది. ఎంత సేపూ  సల్మాన్ మానసికంగా ఎనిమిదేళ్ళ వయసు దగ్గరే ఆగిపోయిన పాత్రగా నటించాల్సి వచ్చి, ఒరిజినల్లోని బాల నటుడు జాకబ్ సల్వటిని వూహించుకుని వాడితో పోటీ పడ్డంతోనే సరిపోయినట్టు అన్పిస్తాడు. ఇక్కడే ఆత్మవిశ్వాసమంతా అవసర పడేసరికి, తమ్ముణ్ణి రప్పించడానికి ఏమీ మిగలక, చైనీస్ తల్లీ కొడుకులతో కాలక్షేపం చేస్తు నట్టు కన్పిస్తాడు. ఇదొక ట్యూబ్ లైటు. 

          చుట్టూ పాత్రలు సల్మాన్,  అంటే లక్ష్మణ్ పట్ల సానుభూతి చూపిస్తూంటాయి. ఈ సానుభూతి ప్రేక్షకులకి కలగదు. ఇక పాత్ర ప్రయాణానికి బ్రేకులు చాలా వున్నాయి- పెద్ద బ్రేకు చైనీస్ తల్లీ కొడుకులైతే, ఇంకోబ్రేకు బన్నే చాచా తీసుకునే పాత క్లాసులు. సల్మాన్ బాల పాత్రకి ఇంకో పోటీ ఏమిటంటే,  చైనీస్ బాలుడిగా నటించిన మతిన్ రే టంగూ. వంద కోట్లు పెట్టి తీశామంటున్న సినిమాలో పాత్రల పొందిక మాత్రం ఆత్మహత్యా సదృశంగా వుంది. ఒకవైపు సల్మాన్ ఇమేజికి వ్యతిరేకంగా ఇంత రిస్కు తీసుకుని, ప్రయోగాత్మకంగా బాల పాత్ర నటింపజేస్తూనే - ఈ వైవిధ్యాన్ని హైలైట్ గా నిలిపే ప్రయత్నం చేస్తూనే - ఇంకో వైపు దీన్ని దెబ్బతీసుకునే సృష్టి చేసి,  పోటీకి ఇంకో బాలనటుణ్ణి దింపవచ్చా? 

          దీంతో ఏమయ్యింది- సల్మాన్ కృత్రిమ బాల వేషాలకంటే, ప్రకృతి సిద్ధంగా రెడీగా తాజాగా వున్న వొరిజినల్ బాలుడే ప్రేక్షకుల్ని ఆకర్షించేట్టు తయారయ్యాడు. సల్మాన్ వీడితో నటించి తేలిపోయాడు. ఒకవైపు ఒరిజినల్ మూవీలోని బాల నటుడికి తీసిపోకుండా నటించే విషమ పరిస్థితి వుండగా, ఇంకోవైపు ఎదురుగానే వున్న టంగూ గాడితో కాంపిటేషన్ ప్రాణాల మీదికొచ్చింది సల్మాన్ కి.  జోడు మద్దెలతో వాచిపోయింది. ఇది మరో ట్యూబు లైటు. 

         టంగూ గాడు బెటర్ ఆప్షన్ సల్మాన్ పాత్రకి. ఇలా ఒక కథని ఎవర్ని పెడితే ఎవరికి దెబ్బ పడుతుందో చూసుకోకుండా ఎలా రాశారో  ‘వందకోట్ల’ సినిమాకి అనేది ప్రశ్న. ఇలా ఒక ట్యూబ్ లైటు కాదు, చాలా ట్యూబ్ లైట్లు వున్నాయి. 

          ఒరిజినల్ లిటిల్ బాయ్ వాడి అమాయకత్వంతో రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపి తండ్రిని రప్పించుకోవాలనుకుంటాడు. ఇందులో వాడి విశాల హృదయం కన్పిస్తుంది. కానీ సల్మాన్ పాత్ర యుద్ధం ఎటైనా పోనీ, యుద్ధం చేయకుండా తమ్ముడు వెనక్కి రావాలని సంకుచితంగా ఆలోచిస్తుంది. చైనీస్ తల్లీ కొడుకులతో మాత్రం దేశభక్తి గురించి మాట్లాడుతుంది. ఈ దేశభక్తి షరతులతో వుంటుంది. నువ్వు భారత మాతాకీ జై అనకపోతే భారతీయుడివే కావు, చైనీయుడివే -  అని టంగూతో  అని థర్డ్ క్లాస్ దేశభక్తిని ప్రదర్శిస్తాడు. ఇది ఇప్పుడు కనిపిస్తున్న పరిణామంలాగే వుంటుంది తప్ప- 1962 ఇలాంటి దబాయింపు దేశభక్తి  లేదు. ఇదొక ట్యూబ్ లైటు. 

          ‘లిటిల్ బాయ్’ అని టైటిల్ పెట్టడంలో ఒక అర్ధముంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా మీద వేసిన అణుబాంబు సంకేత  నామం లిటిల్ బాయ్. ఇది స్ఫురించేలా ఈ వార్ డ్రామాకి ఈ టైటిల్ పెట్టారు. టైటిల్ తో లిటిల్ బాయ్ ఆ బాలపాత్ర కూడా కావొచ్చు. ఆ పాత్రని ‘పెప్పర్’ అని ఇంకో పేరుతో పిలుస్తూ ఆట పట్టిస్తూంటారు. ఎందుకంటే వాడు ఎనిమిదేళ్ళ వయస్సుకి తగ్గ ఎత్తు పెరగలేదు. 

          ఆ బాల పాత్ర శారీరకంగా పెరక్క పోతే, సల్మాన్ పాత్రని మానసికంగా ఎదగకుండా నిర్బంధానికి గురి చేశారు.  పైగా ‘ట్యూబ్ లైట్’ టైటిల్ కి జస్టిఫికేషన్ లేదు. ఆ కాలంలో ట్యూబ్ లైట్ల లభ్యత గురించి రివ్యూ ప్రారంభంలోనే చెప్పుకున్నాం. అదలా వుండగా, సల్మాన్ బాలావస్థ  పాత్ర ట్యూబ్ లైట్ ఎలా అవుతుంది? మానసికంగా ఎదుగుల ఆగిపోయిన వాణ్ణి ట్యూబ్ లైట్ అనరు కదా? మానసిక ఎదుగుల వుండి  బుర్ర పనిచెయ్యక పోతే ట్యూబ్ లైట్ అంటారేమో!  ఇలా టైటిల్ని కూడా  సరీగ్గా ఆలోచించ లేకపోయారు. ఇది మరో  ట్యూబ్ లైటు. 

          సల్మాన్ సోదరుడు సొహైల్ సైనికుడుగా నటించాడు. ఒక యుద్ధ సన్నివేశం తర్వాత సైన్యంలో చేరినందుకు బాధ పడుతున్నట్టు వుంటాడు. చైనీస్ నటి ఝూ ఝూ సింపుల్ గా నటించుకుపోయింది. ఇక బన్నే చాచాగా ఒంపురి నటించిన చివరి మూవీ ఇది. పాత్ర గాంధీజీ సూక్తుల్ని వల్లిస్తూంటుంది. అయితే,  ఒకవైపు ద్వేషం నింపుకుని ఇంకోవైపు ఆత్మ విశ్వాసంతో వుండలేవనే డైలాగు  ఒరిజినల్ లోదే. ఇక శత్రువుతోనైనా స్నేహం చేయాల్సిందే నని గాంధీజీ సూక్తి చెప్పినప్పుడు- దీన్ని గాంధీజీ ఎలా నిజం చేశారో వివరిస్తాడు : శత్రువులైన బ్రిటిష్ వాళ్లతో సంఘర్షించకుండా గాంధీజీ స్నేహపూర్వకంగా మెలగడం వల్లే వాళ్ళు స్వాతంత్ర్యం  ఇచ్చేసి వెళ్లిపోయారని. 

          ఇదివేరు. దేశం శత్రువు చేతిలో వున్నప్పుడు శత్రువుతో స్నేహంగా వుంటూ పని జరుపుకోవాలనుకోవడం విజ్ఞతే. కానీ, పొరుగు దేశం యుద్ధానికి దిగినప్పుడు స్నేహం చేయాలనడం అవివేకం. గాంధీజీ  ఈ నేపధ్యంలో చెప్పి వుండరు. ఇప్పుడు కాశ్మీర్ లో సంభవిస్తున్న పరిణామాలకి ఈ డైలాగుతో తెలివిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు కన్పిస్తుంది. కాశ్మీర్ లో పాక్ మూకలు కరాళనృత్యం చేస్తూంటే- పాకిస్తాన్తో చర్చలు ప్రారంభించాలని దేశీయ శక్తులే చేస్తున్న ప్రచారానికి ఈ డైలాగుతో  మద్దతు ఇస్తున్నట్టుంది. చైనా మనతో యుద్ధానికి దిగితే మనం స్నేహం ఎలా చేస్తామని సల్మాన్ నిలదీసినా, చేయాల్సిందే నని దబాయిస్తాడు ఓంపురి! దీనికి మాయ చేస్తూ గాంధీజీ సూక్తి అన్వయింపు! ఇది మళ్ళీ మరొక ట్యూబ్ లైటు...

          సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో సల్మాన్ ఇలాగే  పాక్ తో చర్చలు జరపాలని కామెంట్ చేసి ఇరుక్కున్నాడు. సినిమా నిర్మాణంలో వుండగానే, దివంగత ఓంపురి కూడా ఈ భావజాలాన్నే ప్రదర్శించి విమర్శల పాలయ్యారు. సినిమాలో మాత్రం ఇంకో రూపంలో వున్న వీళ్ళిద్దరి సన్నివేశం సెన్సార్ కత్తెరని తప్పించుకున్నట్టుంది. చైనీస్ తల్లీ కొడుకుల పాత్రల్ని ఈ భావజాల వ్యాప్తికే అడ్డు పెట్టుకున్నారన్నట్టుంది. సినిమా పాకిస్తాన్ లో ఆడాలిగా!  చైనాలో కూడా ఆడించుకో వచ్చు, అమీర్ ఖాన్ వేసిన బాటలో.

          లొకేషన్స్ అద్భుతంగా  వున్నాయి. దీనికి తగ్గట్టు మరోసారి ‘భజరంగీ  భాయిజాన్’ ఫేం అసీం మిశ్రా ఛాయాగ్రహణం క్లాస్ గా వుంది. ప్రీతమ్ పాటల విషయానికొస్తే మాత్రం- హిందీ పాటలకి ఇంకా పంజాబీ బాణీల జ్వరం ఇప్పట్లో వదిలేలా లేదు. హిందీ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్  సంగీతాన్ని వదిలేసి అందరికీ పట్టని  ఈ ప్రాంతీయ సంగీతాన్ని రుద్దుతున్నారు. 

చివరికేమిటి 
      ఇది కథకాదు, గాథ. ఒరిజినల్లో పిల్లాడి సినిమాకి గాథ అయినా సరిపోయింది- చిల్ద్రెన్ ఫిలిమ్స్ ఎక్కువగా  గాథలుగానే వుంటాయి. కానీ ఆ పిల్లాడిగా సల్మాన్ అనే సూపర్ స్టార్ నటిస్తున్నప్పుడు  గాథ సపోర్టు చేయడం కష్టం. అది కమర్షియల్ కథగా మారాల్సిందే. మారలేదు కాబట్టి ఇదొక ట్యూబ్ లైటు. ఫస్టాఫ్ – దీనికి మించి సెకండాఫ్ చాలా బోరుగా, బక్వాస్ గా తయారయ్యాయి. ఈ రీమేక్ తో అన్నిటా తప్పటడుగులే వేశారు. కబీర్ ఖాన్ రచనా బలం కూడా సన్నగిల్లిపోయింది. దర్శకత్వానికి ఈ రచన దన్ను కాలేకపోయింది. వెలగని ఎన్నో ట్యూబ్ లైట్లని వెలిగించేందుకు విఫలయత్నం చేసి అంధకారంలో వుండిపోయారు. ప్రారంభ దృశ్యాల్లో స్కూల్లో వెలగని ట్యూబ్ లైటు వెలిగించే ప్రయత్నం చేసినప్పుడే సినిమా సౌరభం తెలిసిపోయింది. ఇలాటి ఆత్మవిశ్వాసంతో ఇంత  సినిమా తీశాక కొండల్ని కదిలించగలరని పిల్లలకేం చెప్తారు...

-సికిందర్

         


         


.