రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, June 23, 2017

రివ్యూ!

రచన - దర్శత్వం: రీష్  శంకర్
తారాగణం :  అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు మేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి. మురళీ శర్మ, సుబ్బరాజు, చంద్ర మోహన్, వెన్నెల కిషోర్, సనా దితరులు
స్క్రీన్ ప్లే: మేశ్ రెడ్డి, దీపక్ రాజ్;  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : ఐనాక బోస్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా  క్రియేషన్స్
నిర్మాతలు: దిల్రాజు - శిరీష్
విడుదల : జూన్ 23, 2017
***
          ‘దువ్వాడ జగన్నాథం’ తో అల్లు అర్జున్- హరీష్ శంకర్ లు కొత్త కాంబినేషన్ గా ఏర్పడి అభిమానులకి ‘ఫాంటాస్టిక్ - ఎక్స్ ట్రార్డినరీ- మైండ్ బ్లోయింగ్’ గా కన్పించారు. బ్రాహ్మణ వెరైటీ పాత్రతో ఒక అద్భుతాన్ని ఇస్తున్నట్టు ఫ్యాన్స్  ఆనందించారు. దిల్ రాజు నిర్మాణంలో 25 వ చలన చిత్రంగా ఆయనా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఇవన్నీ కలిసి ఏం బొమ్మ చూపించాయి? తేడాగల బొమ్మేనా, తేడా కొట్టిన బొమ్మా? ఈ కింద చూద్దాం...

కథ 
     దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) బ్రాహ్మణ వంట వాడిగా వుంటూ, మరోవైపు డిజే పేరుతో అన్యాయాలు  చేసే వాళ్ళని చంపుతూంటాడు. ధర్మాన్ని నిలబెడితేనే ధర్మం మనల్ని కాపాడుతుందని నమ్ముతాడు. చిన్నప్పుడే పిస్తోలు పట్టి చంపడం చేసి ఒక పోలీసు అధికారి ( మురళీ శర్మ ) ని కాపాడతాడు. చెడుని నిర్మూలించడానికి మనం చేతులు  కలుపుదామని ఆ పోలీసు అధికారి పదేళ్ళు లేని డిజే ని చేరదీస్తాడు. అప్పట్నుంచీ ఇద్దరూ దుష్టుల్ని చంపుతూంటారు. డిజే తండ్రి (తనికెళ్ళ భరణి) ఇతడి ఆవేశాన్ని గమనించి ఒక రుద్రాక్ష మాల మెళ్ళో వేసి, హింసకి పాల్పడనని  ఒట్టేయించుకుంటాడు. చంపుతున్నప్పుడు డిజే ఆ మాల తీసేసి చంపుతూంటాడు.

          మిత్రుడు విఘ్నేశ్వర శాస్త్రి (వెన్నెల కిషోర్) పెళ్ళిలో వంట కెళ్ళి నప్పుడు అక్కడ పూజా ( పూజా హెగ్డే) ని చూసి ప్రేమలో పడతాడు డిజే. వంట వాణ్ణి చేసుకోనని పూజా వెళ్ళిపోతుంది. ఇలా వుండగా డిజే మావయ్య (చంద్రమోహన్ ) ఆత్మహత్య చేసుకుంటాడు. అగ్రి డైమండ్ అనే సంస్థ చేసిన మోసానికి ఇంకా చాలా మంది బలై పోతారు. దీంతో డిజే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు.

          అగ్రి డైమండ్ కుట్రదారు రొయ్యల నాయుడు (రావు రమేష్). ఇతను ఈ కేసు లోంచి బయట పడడానికి హోం  మంత్రి పుష్పం ( పోసాని) ని కలుపుకుంటాడు. పుష్పం తనకి ప్రమాదం తల పెట్టకుండా అతడి కూతుర్ని తన కివ్వాలని షరతు పెడతాడు. పుష్పం కూతురే డిజే ప్రేమించిన పూజా.
          ఇదీ విషయం. ఇప్పుడు ఈ కుట్రదారుల్ని డిజే  ఎలా నిర్మూలించాడనేది మిగతా కథ. 

 
ఎలా వుంది కథ : 
      ఇది టెంప్లెట్ కథ. దిల్ రాజు స్టార్స్ తో తీస్తున్నప్పుడు అనివార్యంగా ఆయనకి టెంప్లెట్ కథలు తప్పవు.  స్టార్స్ తో ఆయన ఇలాగే  సినిమాలు తీస్తూ వుండక తప్పదు. ఒకప్పుడు సీనియర్ స్టార్లు వున్నప్పుడు వాళ్ళ రోటీన్లు చూసి ఇమేజి చట్రంలోఇరుక్కున్నారని కామెంట్స్ వెలువడేవి. ఇప్పుడు స్టార్లు టెంప్లెట్ చట్రంలో ఇరుక్కుని అందులోంచి బయట పడలేక పోతున్నారు. అర్జున్ – హరీష్ ల కొత్త కాంబినేషన్ ఈ చట్రంలోనే ఇరుక్కుని దాని ఫలితం అనుభవించదానికి సిద్ధపడింది.  ఈ సంవత్సరం ఇప్పటి వరకూ పెద్ద సినిమాలు ఎనిమిది విడుదలైతే – డిజే  తో కలుపుకుని ఆరూ టెంప్లెట్ సినిమాలే. వీటిలో విన్నర్, కాటమ రాయుడు, రాధ, రోగ్, మిస్టర్ ఐదూ అట్టర్ ఫ్లాపయ్యాయి. డిజే దీన్నుంచి తప్పించుకుంటుందా? కొత్త వాళ్ళు  తీస్తే  అవే ప్రేమలు, దెయ్యం కామెడీలు, టాప్ స్టార్లు- డైరెక్టర్ లు నిర్మాణ సంస్థలూ తీస్తే అవే టెంప్లెట్ సినిమాలు ఎంతకాలం? టెంప్లెట్ లు ఫ్లాపవుతున్నాయని తెలిసే తీస్తున్నారా, తెలియక తీస్తున్నారా? 

ఎవరెలా చేశారు 
       అల్లు అర్జున్ వెరైటీగా వేసిన బ్రాహ్మణ పాత్ర, అదే రొటీన్ యాక్షన్ పాత్రలా కాకుండా, యాక్షన్ తో టచింగ్ క్యారెక్టర్ గా తీర్చి దిద్దమని దర్శకుణ్ణి అడగవచ్చు. కానీ టెంప్లెట్ చట్రంలో కుదరలేదేమో. టెంప్లెట్ చట్రాల్లో పాత్రలు పేరుకే వెరైటీ గానీ, పాత్ర చిత్రణల  దగ్గర కాదు.  ‘జంటిల్ మేన్’ లో అర్జున్, ‘అపరిచితుడు’ లో విక్రమ్, ‘విశ్వరూపం’ లో కమల్ హాసన్ లు పోషించిన బ్రాహ్మణ పాత్రలు ఎందుకు గుర్తుండి పోతాయో ఆలోచించాలి. 

          నటన విషయానికొస్తే, ‘అదుర్స్’ లో ముద్దుముద్దుగా, రిథమిక్ గా డైలాగులు పలకడంలో ఈజ్ చూపించడం వల్ల ఎన్టీఆర్ బ్రాహ్మణ పాత్ర ఫన్నీగా వుంటే, అర్జున్ కొచ్చేసరికి, అంత ఈజ్ లేకపోయినా బ్యాడ్ గా మాత్రం లేదు. ఇక కామెడీ, ఫైట్లు, డాన్సుల్లో సిద్దహస్తుడే. కథకి ఎత్తుకున్న పాయింటుని టెంప్లెట్ పాలుచేయకుండా వుండుంటే,  పాత్ర చిత్రణ వేరేగా వుండేది. 

          హీరోయిన్ పూజా హెగ్డే రోటీన్ గ్లామర్ తారే. రావు రమేష్  ఏదో వొక వేషం మార్చి విలన్ వేషాలేస్తారు. ఈసారి తన తండ్రి రావు గోపాల రావులా నిక్కరు వేసుకుని విలనిజం చేశారు. క్లయిమాక్స్ లో ఈ విలనిజం బావుంది. చనిపోయిన తల్లితో మాట్లాడే కొడుకుగా కామిక్ క్యారక్టర్ గా సుబ్బరాజు క్లయిమాక్స్ ని నిలబెట్టాడు. మురళీ శర్మా ఇంకా ఇతర నటులూ పాత్రలకి తగ్గట్టే నటించారు. ‘అమీతుమీ’ హేంగోవర్ లోవున్న ప్రేక్షకులకి  వెన్నెల కిషోర్ ని చూడగానే హుషారు!
          పాటలు ఓ రెండు బావున్నాయి. ఇక మిగతా సాంకేతికాలు బ్యానర్ కి తగ్గట్టే వున్నాయి. 

చివరికేమిటి   
      హింసే పరిష్కారమనుకునే విజిలాంటీ హీరో పాత్ర, సహకరించే పోలీసుపాత్రల మీద ఆధారపడి ఈ సినిమాకి పూనుకున్నారు. కానీ దీనికి కట్టుబడి వుండలేకపోయారు. ముందుగా ఫస్టాఫ్ లో వంటవాడైన హీరోతో ఒక్క గుర్తుండి పోయే మేజర్ సీనుకూడా లేకపోవడం డెప్త్ పరంగా పెద్ద లోపం. ‘క్రిష్ణవేణి’ లో వంటవాడుగా రాజబాబు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. డిజే లో వంటలతో హీరో చేసే కామెడీ ఏమీలేదు. ఫోటో- ఆప్ కోసం అన్నట్టు గరిటె తిప్పుతూ ఇతర విషయాలు మాట్లాడడం తప్పితే. 

          యాక్షన్ విషయానికి వస్తే, మావయ్య చనిపోవడంతో కుట్ర దార్ల మీద పగదీర్చుకోవాలని హీరో నిర్ణయం తీసుకోవడం కథకి మొదటి మలుపు. ఇది గంట సేపటి కొస్తుంది (సినిమా నిడివి మొత్తం రెండు గంటలా 40 నిమిషాలు). ఐతే దీనికి ముందు హీరో అన్యాయాలు చేసే వాళ్ళని చంపుతూ వుండడంతో, ఈ మొదటి మలుపు దగ్గర తీసుకున్న నిర్ణయం బలంగా అన్పించదు. ఎందుకంటే మొదటి మలుపు నుంచి హీరో కొత్తగా ఏదోచేయాలి. కానీ ముందు నుంచీ ఏదైతే చంపడాలు చేస్తున్నాడో, మావయ్య చనిపోయిన కీలక ఘట్టం దగ్గర్నుంచీ మళ్ళీ అదే చేస్తున్నాడు. దీంతో కథనంలో మొనాటనీ ఒకటి, డైనమిక్స్ లేకపోవడం వొకటీ, పాత్ర ఎదుగుదల లేకపోవడం ఒకటీ జరిగి చప్పగా సాగుతూంటుంది కథ. 

          హీరోని చిన్నప్పుడే కిల్లర్ గా చూపించాక, దాన్నే పెద్దయ్యేవరకూ కంటిన్యూ చేస్తూ అదే కొనసాగించడం వల్ల వచ్చిన సమస్య ఇది. తనని కాపాడి నంత మాత్రాన,  పోలీసు అధికారి ఆ చిన్నపిల్లాణ్ణి పెట్టుకుని, తెర వెనుక తను వుంటూ,  చంపడాలు చేయించడమే కన్విన్సింగ్ గా లేదు. చిన్న పిల్లాడితో ఒప్పందాలేమిటి చెడ గొట్టడానికి కాకపొతే. ఆ తండ్రి అడ్డుపడి దూరం పెట్టి వుండాల్సింది. పెద్దయ్యాక హీరో వంట వాడిగానే వుండేవాడు. మావయ్య  చనిపోయాక పగ రగిలినప్పుడు- అసంఖ్యాక  ప్రజల్ని బాధితులుగా చూసినప్పుడు- చిన్న తనం గుర్తుకు వస్తే, అప్పుడు నిర్ణయం తీసుకుని వెతుక్కుంటూ వెళ్లి ఆ పోలీసు అధికారికి సై  అనివుంటే అది రియల్ డ్రామాగా వుండేది. మొదటి మలుపు బలంగా వుండేది. పాత్ర ఎదుగుదల, ఎవేర్ నెస్ కన్పించేవి.

          కథనానికీ పాత్రకీ ఏ నియమాలూ అవసరంలేదన్నట్టు ఏదో స్క్రీన్ ప్లే రాసేశారు. ఇకపోతే, ఏది ప్రధాన కథ అనే దానికి కూడా స్పష్టత తెచ్చుకోలేదు.  ముప్పావు భాగం కథ హీరోకి హీరోయిన్ తో రోమాన్సులూ పాటలే. మావయ్య చావుతో అంత నిర్ణయం తీసుకున్న హీరో అది వదిలేసి (కథ వదిలేసి) హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తూంటాడు.  ఇక్కడ చాలా విచారకర విషయమేమిటంటే, హీరోయిన్ తో విలన్ కుట్ర చేస్తున్నాడని కూడా హీరోకి సెకండాఫ్ లో ఎవరో చెప్పే వరకూ తెలీదు. ఫస్టాఫ్ లో హీరోయిన్ ని తన కొడుక్కు చేసుకోవాలని డిసైడ్ ఐపోయి హీరోమీద దాడులు జరిపిస్తూంటాడు విలన్. కానీ హీరో తెలుసుకోడు. ఇలా పాసివ్  పాత్రగా కూడా తయారయ్యింది.

          కథలో వున్న మెలికని తెలుసుకుని ఆ ప్రకారం నడపకపోవడంతో ప్రధాన కథకంటే ఉప కథే ఎక్కువై మింగేసింది. విలన్ అగ్రి డైమండ్ కుట్ర వొకటే చేయలేదు, అందులోంచి బయట పడేందుకు మంత్రి కూతురైన హీరోయిన్ ని కోడల్ని చేసుకోవాలని కూడా కుట్ర చేస్తున్నాడు. అంటే కథా ఉపకథా కలిసి పోవాలన్న మాట. వ్యక్తిగతంగానూ విలన్ హీరోని దెబ్బ తీస్తున్నప్పుడు, ఇది హీరో తెలుసుకోక హీరోయిన్ తో ఎంజాయ్ చేయడం వల్ల, ఈ ఉపకథ ఉప కథ లాగే వుంటూ- అసలు రివెంజి కథ కన్పించకుండా పోయింది. ఎప్పుడో సెకండాఫ్ లో దుండగులు హీరో చెల్లెల్ని తగుల బెట్టబోయినప్పుడు, హీరో ఫ్రెండ్ ని వురి తీసినప్పుడు- ఇంకా జనాలకి బెదిరింపు కాల్స్ చేసినప్పుడు గానీ- హీరోకి  హీరోయిన్ తో చేస్తున్న మజా అంతా  ఎగిరిపోయి దారికి రాడు! ఎంతకీ కథలోకి రాని హీరో గార్ని ఇలా  కథలోకి లాగినట్టయ్యింది విలన్!  మావయ్య చావుకి హీరో బాధ్యుడు కాదు, కానీ తను చేయాల్సింది  వదిలేసి,  హీరోయిన్ తో మజా  చేసుకోవడం వల్లే చెల్లికీ ఫ్రెండ్ కీ ప్రాణాల మీది కొచ్చినట్టు కథనమూ,  పాత్రచిత్రణా తయారయ్యాయి. 

          ఇప్పుడు మళ్ళీ భీకర ప్రతిజ్ఞలు చేస్తాడు. ఇదెప్పుడో ఫస్టాఫ్ లోనే చేశాడు. సెకండాఫ్ మరీ దిగదుడుపుగా తయారయ్యింది. విషయంలేదు. విషయమంతా క్లయిమాక్స్ లో టెంప్లెట్ ప్రకారం ఫోక్ సాంగ్ తర్వాత విలన్ తో అమీ తుమీ తేల్చుకోవడమేనని తెలుసు. ఎందుకోసం ప్రేక్షకులు కూర్చోవాలో అర్ధంగాని సెకండాఫ్ ఇది. క్లయిమాక్స్ లో విలన్ కొడుకుగా సుబ్బరాజు మదర్ ప్రేమ క్యారక్టరైజేషన్ వల్ల ఫన్నీగా మారింది. ఈ మొత్తం బిగ్ కమర్షియల్ లో అనూహ్యంగా ఏదైనా వుందంటే అది ఈ క్లయిమాక్స్ ఒక్కటే.

          హరీష్ శంకర్ కీ ఇలా టెంప్లెట్ సినిమాలు తప్పేలా లేవు. దీని వల్ల అతడి దర్శకత్వ  ప్రతిభ ఏమిటో బయట పడ్డం లేదు. దృశ్యాల చిత్రీకరణలో వైవిధ్యం లేదు. ఐదు టెంప్లెట్ సినిమాల పరాజయాల తర్వాత డిజే పరిస్థితేమితో ప్రేక్షకులే నిర్ణయించాలి.

-సికిందర్
http://www.cinemabazaar.in