డార్క్ మూవీస్ వ్యాసాల్లో భాగంగా నియో నోయర్ మూవీస్ అయిన ‘టాక్సీ డ్రై వర్’, ‘చైనా టౌన్’
స్క్రీన్ ప్లే సంగతులు
పరిశీలిద్దామనుకున్నాం మొదట. అయితే
ఈ పాత క్లాసిక్స్ కంటే, మరింత కాలీన స్పృహతో
ట్రెండీగా వుండే మూవీస్ ని విశ్లేషిస్తే ఉపయోగకరంగా వుండ వచ్చని భావించడం
వల్ల, ప్రస్తుతానికి పై రెండు నియో నోయర్స్ ని పక్కన పెట్టాం. మరింత ఆధునికంగా
వుంటూ, ఇప్పుడు మనమున్న డిజిటల్ యుగంతో పోటీపడే సబ్జెక్టులు, సాంకేతికాలూ వుండే నియో నోయర్స్ ని
తీసుకోవడం వల్ల ఇప్పుడు వీటిని ఎలా
రాయాలో, ఎలా తీయాలో సులభంగా అర్ధం జేసుకోవడానికి వీలవుతుంది. ఫిలిం నోయర్ అయినా,
నియో నోయర్ అయినా హాలీవుడ్ లో అవి బిగ్
స్టార్స్, బిగ్ డైరెక్టర్స్ కూడా పట్టించుకుంటున్న జానర్ అని గతంలో చెప్పుకున్నాం. కనుక వాటి కథలు,
బడ్జెట్లు కూడా ఆ స్థాయిలోనే వుంటాయి. కాబట్టి ‘బ్లేడ్ రన్నర్’, ‘షటర్ ఐలాండ్’ వంటి స్టార్ మూవీస్ కాకుండా, తెలుగు
వాతావరణ పరిస్థితులకి తగ్గట్టు లో- బడ్జెట్స్ తీయడానికి హాలీవుడ్ లోనే తీసిన లో-
బడ్జెట్స్ ని పరిశీలనకి తీసుకోవడం ఉత్తమం.
ఈ రీత్యా మొట్ట మొదట గుర్తుకొచ్చేవి రెండు మూవీస్ – 1984 లో కోయెన్ బ్రదర్స్ తీసిన ‘బ్లడ్ సింపుల్’, 2005 లో రియాన్ జాన్సన్ తీసిన ‘బ్రిక్’. మొదటిది అడల్ట్ సబ్జెక్టు అయితే, రెండోది యూత్ సబ్జెక్టు. తెలుగులో కావాల్సింది కూడా ఇవే. పిచ్చి పిచ్చి ప్రేమలు, పిశాచాలూ తీసేకన్నా వీటిని తీయడంవల్ల కొంత మార్పు కనపడి, ఇప్పుడు పెరిగిన –ప్రస్తుతానికి తెలంగాణాలో- టికెట్ల ధరలకి ప్రేక్షకులు మొహం చాటేయకుండా వుంటారు.
ముందుగా
‘బ్లడ్ సింపుల్’ నేపధ్యం, కథ, ఆ తర్వాత స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. ఈ లో- బడ్జెట్
ని తీసుకోవడానికి ఇంకో కారణ మేమిటంటే కోయెన్ బ్రదర్స్ కిది మొదటి సినిమా, నిర్మాతల్లేరు,
పెట్టుబడి కోసం కొత్త ప్లాన్ వేశారు, జానర్ కి కట్టుబడి రైటింగ్, టేకింగ్ ల మీద
కసరత్తు చేశారు, ఇంకా జానర్ ని స్టడీ చేశారు...ఇవన్నీ తెలుగులో చిన్న సినిమాలు
తీసే కొత్తదర్శకులకి మార్గ దర్శకాలవ్వొచ్చు. ఈ కారణం చేత కూడా దీన్ని తీసుకున్నాం.
అసలు 1930 లలో మనమింకా భక్త ప్రహ్లాదలు, సతీ సావిత్రులు తీస్తున్న కాలంలో హాలీవుడ్ ఎత్తుకున్న ఫిలిం నోయర్ సినిమాలకి స్ఫూర్తీ, ఆధారం ముగ్గురు రచయితల డిటెక్టివ్ నవలలే. నోయర్ మూవీస్ అంటే డిటెక్టివ్ మూవీసే వాస్తవానికి. ఆ ముగ్గురు రచయితలు- జేమ్స్ ఎమ్. కెయిన్ (1892-1977), డషెల్ హేమెట్ (1894-1961), రేమండ్ చాండ్లర్ (1888-1959) లు రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలు నోయర్ జానర్ కి ప్రామాణికమయ్యాయి.
కాబట్టి కోయెన్ బ్రదర్స్ వీటిని చదవడం మొదలెట్టి, డషెల్ హేమెట్ రాసిన నవల్లోంచి స్ఫూర్తి పొంది టైటిల్ అనుకున్నారు. ఆ నవల ‘రెడ్ హార్వెస్ట్’. ఇందులో బ్లడ్ సింపుల్ అన్న పదాన్ని వాడేడు హేమెట్. దీనర్ధం ఉద్రిక్త పరిస్థితుల్ని ఎదుర్కొనే నేరస్థుడి మానసిక స్థితి. ఇదంతా భయంతో కూడుకుని వుంటుంది. కోయెన్ బ్రదర్స్ కథలో హీరోది కూడా ఈ మానసిక స్థితే. అందుకే దాన్ని టైటిల్ గా పెట్టారు. జోయెల్ కోయెన్, ఎథాన్ కోయెన్ సోదరులిద్దరూ కలిసి స్క్రిప్టు రాశారు డార్క్ మూవీస్ శైలిని దృష్టిలో పెట్టుకుని. కానీ ఈ స్క్రిప్టు నిర్మాత లెవరికీ నచ్చలేదు. తెలుగులో, తమిళంలో ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటంటే, షార్ట్ ఫిలిమ్స్ తీసి నిర్మాతలకి చూపించడం, ఆ నిర్మాత దాన్నిబట్టి టాలెంట్ అంచనా కట్టి అవకాశాలివ్వడం, లేదా ఇవ్వకపోవడం.
అప్పట్లో
కోయెన్ బ్రదర్స్ ఇలా చేయలేదు. సాక్షాత్తూ తీయాలనుకుంటున్న సినిమా స్క్రిప్టులోనే వున్న హత్యా దృశ్యాన్ని ఫేక్
టీజర్ గా షూట్ చేశారు. కేవలం ఐదు నిమిషాల నిడివి. దీన్ని మూడ్రోజులు షూట్ చేసి, ఒక ప్రొజెక్టర్ అద్దెకి తీసుకుని
ప్రజల ఇళ్ళకి, ఆఫీసులకీ వెళ్లి ప్రదర్శించడం మొదలెట్టారు. వేరే షార్ట్ ఫిల్ములో,
డాక్యుమెంటరీలో చూపించికన్విన్స్ చేసే యకుండా- తీయాలనుకుంటున్న స్క్రిప్టులో
దృశ్యమే ఎలా తీస్తామో తీసి శాంపిల్ చూపించేసరికి- టకటకా డబ్బులొచ్చి పడ్డాయి.
బడ్జెట్ పదిహేను లక్షల డాలర్లు అయితే, ఏడున్నర లక్షల డాలర్లే వచ్చాయి. మిగిలిన
మొత్తం చేతి నుంచి పెట్టుకున్నారు. ఆస్టిన్, హుటో, టెక్సాస్ మూడు నగారాల్లో, ఎనిమిది వారాల్లో షూటింగు పూర్తిచేశారు. మొత్తం
కలిపి ఏడు పాత్రలే. పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాదంతా పట్టింది చేతి నుంచి
పెట్టాల్సి వచ్చేసరికి. అప్పుడు
అన్నదమ్ముల వయస్సు 27, 24.
1984లో
విడుదలై 39 లక్షల డాలర్లు వసూలు చేసింది. పెట్టుబడి 15 లక్షల డాలర్లు. తెలుగులో
చిన్న సినిమాలకి పెట్టిందే రాదుగా? దీంతో కోయెన్ బ్రదర్స్ ప్రఖ్యాత దర్శకులైపోయారు. భారీ బాక్సాఫీసు
విజయం సాధించకపోయినా విమర్శకుల మెప్పుపొంది వార్తల కెక్కారు. అమెరికన్ ఫిలిం
ఇనిస్టిట్యూట్ వంద ఉత్తమ థ్రిల్లర్స్ జాబితాలో ‘బ్లడ్ సింపుల్’ కి స్థానం
దక్కింది. ఆతర్వాత నుంచి క్రైం వేవ్, ఫార్గో, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్, అన్
బ్రోకెన్ మొదలైన 27 సినిమాలూ తీశారు. కోయెన్ బ్రదర్స్ ఒక బ్రాండ్ నేమ్ గా మారింది.
‘బ్లడ్ సింపుల్’ మీద ఎందరో మేధావులు పరిశోధనాత్మక వ్యాసాలూ రాశారు. కోయెన్
బ్రదర్స్సినిమాల్లో నటించిన ఇద్దరికి ఉత్తమ నటనకి ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
ప్రేమలూ
పిశాచాలూ తీస్తే ఏమీ రాదు. పైగా థియేటర్లలో పార్కింగ్ వాళ్ళ, కేంటీన్ వాళ్ళ పొట్ట
కొట్టడమే. వాళ్ళెలా తిట్టుకుంటూ వుంటారో వింటే తెలుస్తుంది. చిన్న సినిమాలు ఫీల్డు
నిండా అందరికీ పనులిస్తున్నాయని సంబరపడితే కాదు, అవతల ప్రదర్శనా రంగంలో అందరి
పొట్టలూ కొడుతున్నాయి. మల్టీప్లెక్సుల్లో వేరే సినిమాలు కవర్ చేయొచ్చు. సింగిల్
స్క్రీన్ థియేటర్లలో ఆ ఒక్క అరిగిపోయిన ప్రేమే, ఆ ఒక్క అరిచే పిశాచమే
ప్రేక్షకుల్ని రాబట్టాలి. దారితప్పి ఇద్దరో ముగ్గురో ప్రేక్షకులు వస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణంలో ఎడింట్లో నాల్గు థియేటర్లు మూత బడ్డాయి. రెండు
ప్రధాన థియేటర్లని కూల్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, షాపింగ్ మాల్
నిర్మిస్తున్నారు. నూట పది పారా బాయిల్డ్
రైస్ మిల్లులతో పట్టణం కళకళ లాడుతున్నా,
సినిమా బిజినెస్ నిల్. పిశాచాలు ప్రేమలూ వూరూరా ఇదే పరిస్థితి
తెచ్చిపెడతాయి.
-సికిందర్