రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మార్చి 2015, సోమవారం

స్ట్రక్చర్ -4


సినాప్సిస్ తో మొదటే స్పష్టత!
తెలుగు సినిమా స్క్రీన్ ప్లే




డియాని విస్తరిస్తే సినాప్సిస్. దీన్నే అవుట్ లైన్ అనొచ్చు. నిజానికి ఈ సినాప్సిస్   హీరోకో, నిర్మాతకో పరిశీలనార్ధం పంపుకోవడం కోసం కాదు. అది హలీవుడ్ పద్ధతి. అక్కడ నిర్మాతలు, స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు మొదటే సినాప్సిస్ అడుగుతారు. వీళ్ళకంటే ముందు లిటరరీ ఏజెంట్ అడుగుతాడు. ఇతను నిర్మాతలకీ లేదా స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకీ,  రచయిత/దర్శకుడు తరపున మధ్యవర్తిగా ఉంటాడు. రచయిత/దర్శకుడు అందించిన సినాప్సిస్ ని ఆయా నిర్మాతలకి లేదా స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చూపిస్తాడు. అది ఆసక్తి కలిగిస్తే అప్పుడు వాళ్ళు స్క్రీన్ ప్లే అడగొచ్చు.  

       సినాప్సిస్ అంటే కథా సంగ్రహం లేదా క్లుప్తంగా కథ.  దీని రచనకి హాలీవుడ్ లో కొన్ని మార్గదర్శకాలున్నాయి. సినాప్సిస్ ఏ -4 సైజు పేజీల్లో వుండాలి. ఒక పేజీకి మించి వుంటే డబుల్ స్పేస్ లో, ఒక పేజీ మాత్రమే  వుంటే సింగిల్ స్పేస్ లో టైపు చేయాల్సి వుంటుంది. లెఫ్ట్ ఎలైన్ మెంట్  వుండాలి. వర్డ్ డీ ఫాల్ట్ మార్జిన్స్ ని మార్చకూడదు. పేరాలో మొదటి లైను అర ఇంచు ఇండెంట్ వుండాలి. ఫాంట్  టైమ్స్ న్యూ రోమన్ 12 పాయింట్ ఉండాలి. పాత్రల పేర్లు మొదటిసారి  ప్రస్తావించినప్పుడు వాటిని కేపిటల్ లెటర్స్ లో ఉంచాలి. పేజీ నంబర్లు హెడర్ కుడివైపు వేయాలి. సినాప్సిస్ అని టైటిల్ కింద డబుల్ స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. దీనికింద నాల్గు స్పేస్ లిచ్చి సినాప్సిస్ ని టైప్ చేయాలి. ఇలా ఇంకా చాలా నిర్దుష్ట  సాంకేతికాంశాలతో ముడిపడి వుంటుంది వ్యవహారం. స్క్రీన్ ప్లే స్క్రిప్టుకి కూడా ఇలాటి మార్గదర్శకాలు అనేకం వుంటాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆ స్క్రీన్ ప్లేని, లేదా సినాప్సిస్ నీ అవెంత బాగున్నా మొదటే తిప్పికొట్టేస్తారు. వాటి కర్తని హీనంగా చూస్తారు.

         ఈ మార్గ దర్శకాలకి లోబడి సినాప్సిస్ పాఠాన్ని ఆకట్టుకునేలా రాయగల్గాలి. ఇది సొంత నైపుణ్యం మీద ఆధారపడుతుంది. దీనికి మార్గదర్శకాలు లేకున్నా, వివిధ స్క్రీన్ ప్లే కోర్సుల సంస్థలు సినాప్సిస్ రాయడంలో కూడా శిక్షణ నిస్తాయి. 12 అంశాలు ఆ కథా సంగ్రహంలో ప్రతిబింబించాలి. ప్రధాన పాత్ర పరిచయంతో బాటు దాని రోజువారీ జీవితం, ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, ఆ సమస్యతో సంఘర్షణ, పరిష్కారం కోసం వెతుకులాట, ఓ మినీ పరిష్కర మార్గం తో కొత్త ప్రయత్నం – ఓటమి, ఓటమిలోంచి కొత్త మార్గం, ఇక వెనక్కి రాలేని సంక్లిష్ట పరిస్థితి, నిరాశా నిస్పృహలు, మళ్ళీ కొత్త పరిష్కార మార్గం, దాంతో ముగింపు దిశగా అంతిమ పోరాటం, ముగింపూ.

       అన్ని పాత్రల్నీ ప్రస్తావించ కూడదు, మలుపుల గురించీ ఎక్కువ వివరాలు ఇవ్వకూడదు. అనవసర వర్ణనలు, వివరణలు ఉండరాదు. మొదటి పేరాలోనే మొదటి మలుపు వుండాలి. ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్యలో  తికమక వుండకూడదు,  ప్రధాన పాత్ర పఠిత కి కనెక్ట్ అవగల్గాలి. సినాప్సిస్ లో ఫీలింగ్, ఎమోషన్ వ్యక్తమవాలి...ఇలా ఎన్నో!

ఇక్కడి అవసరం వేరు!
        అక్కడ వ్రాతపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ రూల్సు. ఇక్కడ మౌఖికంగా నిర్మాతకి లేదా దర్శకుడికి కథ చెప్పాలి కాబట్టి వాళ్ళ కోసం సినాప్సిస్ రాసి పెట్టుకో నవసరం లేదు. సొంత అవసరాల కోసమే రాసుకోవాలి.  అనుభవజ్ఞులైన దర్శకులకి, రచయితలకి దీని అవసరముండక పోవచ్చు.  అనుభవజ్ఞులు నేరుగా వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్ళిపోగలరు. ఔత్సాహికులకి, దర్శకత్వ శాఖలో అంతగా అనుభవం లేని,  లేదా అసలు సినిమా రచయితగా / దర్శకుడుగా ఏ అనుభవమూ లేకుండా సినిమా రచయిత/ దర్శకుడు  కాగోరే అభ్యర్దులకి, సినాప్సిస్ అనే టూల్ ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు గొప్ప దర్శకుల సినిమాలు చూస్తే, ఇలా నేరుగా వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్ళకుండా ముందుగా  సినాప్సిస్ రాసుకుని వుంటే, సినిమా ఇంత అభాసు అయ్యేది కాదేమో అన్పించే సందర్భాలు కూడా అనేకం. ఎందుకంటే, అనుభవమున్నంత మాత్రాన నేరుగా వన్ లైన్ ఆర్డర్ వేయగల సమర్ధులు  కావాలని లేదు. చాలా తరచుగా వీళ్ళ సినిమాలు ఫస్టాఫ్ కథ ఒకటీ, దారితప్పి సెకండాఫ్ లో నడిపించిన  కథ మరొకటిగా సౌష్టవం, సమగ్రత లనేవి లేకుండా తేలడం చూస్తూంటాం. ఇలాటి మొత్తం అనుకున్న కథకి మొదటే సినాప్సిస్ రాసుకుని చదువుకుంటే, మెదడుకి చాలా బ్రేకులు పడుతూంటాయి. అంటే ఆ కథ అతుకుల బొంతలా ఉందని మొదటే అర్ధమౌతుందన్న మాట. ఈ సంగతి నేరుగా వన్ లైన్ ఆర్డర్ కి వెళ్తే అందరికీ అర్ధమవాలని లేదు.

         వన్ లైన్ ఆర్డర్ అంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో  నెంబర్లు వేసుకుంటూ ఒకటి రెండు లైన్లలో రాసుకోవడం. సినాప్సిస్ లేకుండా ఒక ఐడియాని మెదడులోనే కథగా ఊహించుకుని (విస్తరించుకుని), వన్ లైన్ ఆర్డర్ వేయగలిగే సామర్ధ్యం ఒక్క దర్శకుడుకి ఉంటే  సరిపోదు. అతను రాయించుకునే రచయితలకీ వుండాలి. ఒక సీనియర్ దర్శకుడు ఓపిగ్గా పెద్ద నోటు పుస్తకంలోనే నెలల తరబడి రాసుకున్న కథని చదువుకోండని రచయితల కిస్తారు. ఇదెంతో హాయైన పని. ఇంకో దర్శకుడు రచయితలు కథ చెప్పడానికొస్తే వినరు, సినాప్సిస్ రాసిమ్మంటారు. హిందీలో స్వర్గీయులు రాజ్ కపూర్- కె. ఎ. అబ్బాస్ ల వ్యవహార శైలి ఇంకా భిన్నంగా వుండేది. అబ్బాస్ మొత్తం కథని ఒక నవలగా 200 పేజీలు రాసుకొచ్చేవారు. రాజ్ కపూర్ దాన్ని పవిత్ర గ్రంధంలా తలమీద పెట్టుకు వెళ్లి, పూజ చేసి, దాంతో వచ్చి గట్టి ఉఛ్ఛారణతో ఏకధాటిగా మొత్తమంతా చదివేసే వారు. అప్పుడే  దాని మీద చర్చ ప్రారంభించే వారు.

      పై మూడు ఉదాహరణల్లో ఒక సామాన్యాంశం వుంది. ఇవన్నీ ముందుజాగ్రత్తగా కథకి అత్యంత ప్రధానమైన నిర్మాణ సౌష్టవాన్నీ, సమగ్రతనీ డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా రాస్తేనే స్పష్టత రావడమే గాక సమగ్ర రూపాన్ని సంతరించుకుంటుంది. ఒక ఐడియాని ఊహల్లోనే మొత్తం కథగా విస్తరించుకుని, ఆ పైన వన్ లైన్ ఆర్డర్ వేసుకు పోతే అది ముక్కలు ముక్కలు గా వచ్చే అవకాశముంది. ఊహల్లో చాలా వాటికి  స్పష్టత వుండదు. పైగా ఊహలు అతిశయోక్తులతో కూడుకుని వుంటాయి. ఆలోచననలతో బోధపడని కొన్ని విషయాలు, ఆచరణ సాధ్యం కాని  అతిశయోక్తులు రాసుకుంటూ పోతే తెలిసిపోతాయి. మెదడు పని చేసే విధానమే అలా వుంటుంది. దాని భావాలకి/ఆలోచనలకి భౌతిక రూపం ఏర్పడుతూ వుంటే, దాన్ని పట్టుకుని అది లంకె లేసుకుంటూ ముందు కెళ్ళి పోతుంది. చెక్కుతున్న శిల్పంలో ఎక్కడెక్కడ సౌష్టవం తాలూకు ఎగుడు దిగుళ్ళున్నా అన్నీ కవర్ అయిపోతాయి.

ఏమనాలి?
       ఒక అసోషియేటో, కో –డైరెక్టరో దర్శకుడు అవాలని కథ తయారు చేసుకున్నారను కుందాం. అది వన్ లైన్ ఆర్డర్ లోనే  వుంటుంది. అదేమిటో ఐదు నిమిషాల్లో చెప్పమంటే చెప్పలేని వాళ్ళే ఎక్కువ మంది వుంటున్నారు. గంట చెప్తాం, గంటన్నర చెప్తాం అంటారు. ఇలాటి ఇద్దరు ముగ్గురు గత పదేళ్లుగా ఒకటి రిజెక్ట్ అయితే ఇంకోటి తయారు చేసుకుని పదేపదే నిర్మాతల దగ్గర విఫలమౌతోంటే, అసలు సంగతేమిటా అని ఈ వ్యాసకర్త ఒకసారి స్వయంగా వెళ్లి చూస్తే, వాళ్ళు నిర్మాతలకి కథ విన్పించడం  లేదు. షాట్లు చెప్పి తలపోటు తెప్పిస్తున్నారు. చాలా షాకింగ్ సీన్!

     పరిస్థితి అర్ధమైపోయి, వాళ్ళని ఆపి ఐదు నిమిషాల్లో కథేమిటో చెప్పేస్తే, ‘ఇలా వీళ్ళెందుకు చెప్పరు?’ అని నిర్మాతల ఆవేదన. ఎందుకు చెప్పరంటే,  వాళ్ళకి అప్పుడే ప్రాజెక్టు ఓకే అయిపోయిందని అనుకుంటున్నారు, అందుకే రేపటి షూటింగుకి ఇప్పుడే షాట్స్ డిస్కషన్స్  చేస్తున్నారు మరి !
      అగ్ర దర్శకుల దగ్గర, అగ్ర హీరోల సినిమాలకి కో-డైరెక్టర్ గా అనుభవం సంపాదించిన ఒకరు దీటైన నేరేషన్ పవర్ తో, అవసరమైన చోట్ల ఫలానా ఫలానా కెమెరాలు, లైటింగ్ ఎఫెక్ట్స్ తో షాట్స్ ని బిల్డప్ చేస్తూ కళ్ళముందు సినిమా చూపించేస్తూ కథ చెప్పేస్తారు. ఇది పతాకస్థాయి విజువల్ నేరేషన్. ఇంత కాకపోయినా కనీసం నాటకీయంగా విజువల్ నేరేషన్ ఇవ్వగలిగితే చాలు. కానీ విచారకరంగా ఇది కూడా జరగడం లేదు.

     మహాకవి, సినిమా రచయిత స్వర్గీయ ఆరుద్ర దర్శకుడేం కాదు. కానీ ఆయన కృష్ణ నటించిన సూపర్ హిట్  కౌబాయ్ అడ్వెంచర్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్క్రిప్ట్ రాసిచ్చిన తర్వాత, దానికి ముగ్ధులైన నిర్మాతలు ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు. ఆయన తిరస్కరించారు, అది వేరే విషయం. రాయగల, రాసుకోగల సామర్ధ్యానికి ఇంతటి  మన్నన వుంటుందన్న మాట.

       షాట్స్ తో కథ చెప్పడం, లైన్ ఆర్డర్ తో కథ చెప్పడం ఇవన్నీ కథ మీద పట్టు లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. లైన్ ఆర్డర్ తో మాత్రమే  కథ చెప్పగలరు కాబట్టే గంట, గంటన్నర చెప్తా మంటారు. ఒక సినిమా చూసొచ్చి మనం కథెలా చెప్తాం? షాట్సో, వన్ లైన్ ఆర్డరో చెప్పం కదా? సినిమా రివ్యూలు చదువుతూంటాం. వాటిలో టూకీగా కథనెలా పరిచయం చేస్తారు? ఆ మాత్రంగానైనా  చూసిన ఒక సినిమా కథ చెప్పమంటే కూడా చెప్పలేని వాళ్ళు దర్శకత్వాల మీద మోజు పెంచుకుంటున్నారు. మరొక బలహీనత ఏమిటంటే, తమ సొంత కథని తప్ప, ఇతరుల కథల్ని విని అర్ధం చేసుకోలేకపోవడం. కానీ ఇతర సినిమాలు చూస్తే వాటిలోని ఆ ఇతరుల కథల్నే తిరిగి చెప్పలేకపోయినా, చక్కగా అర్ధం చేసుకోగల్గడం. అంటే ఇతరుల కథలు తెర మీద విజువల్ గా చూసినప్పుడు మాత్రమే  అర్ధమౌతున్నాయన్న మాట.  మళ్ళీ అదే తమ సొంత కథల్ని విజువల్ గా చెప్పలేక పోతారు. ఇలా అనుకుంటే పూర్వకాలంలో ఆ దర్శకులు ఇతరుల కథల్నీ, నవలల్నీ ‘ఓన్’ చేసుకుని ఎలా అన్నేసి విజయవంతమైన సినిమాలు తీయగలిగారో! కనుక ఇంత గందరగోళ వాతావరణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో టాలీవుడ్ లో కథలు తయారు తున్నాయి. పద్ధతి ఇది కాదని చెప్పినా విన్పించుకోని వాళ్ళు అలాగే ముందు కెళ్ళి,  ఆ ఒక్క సినిమాతో  దర్శకులన్పించుకుని, నిర్మాతల్ని ముంచేసి, మళ్ళీ సినిమా అవకాశం రాక అక్కడితో ఆగిపోతున్నారు.

     మరి కొందరికి స్క్రీన్ ప్లే పుస్తకాల వ్యసనం వుంటోంది.  డబ్బు వృధా చేస్తూ పుస్తకాల మీద పుస్తకాలు  కొంటూంటారు. వాటిని చదివి ఏదీ అర్ధం చేసుకోరు. ముందు  బేసిక్స్ చదువుకుని, కథ తయారు చేసుకోవడం తెలుసుకుంటే, ఆ తర్వాత వివిధ కోణాల్లో క్రియేటివ్ ప్రక్రియల కోసం సవాలక్ష హయ్యర్ స్టడీస్ కి వెళ్ళవచ్చు. బేసిక్సే అర్ధం గానప్పుడు జేమ్స్ బానెట్ ని చదివి ఏం లాభం. ఈ చదవడాలతోనే కాలం గడిపేస్తూ అసలు పని ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇంత చదువుతున్నారు కదాని ఓ వంద పేజీల సింపుల్ లవ్ స్టోరీ గల ఇంగ్లీష్ నవల ఇచ్చి వన్ లైన్ ఆర్డర్ వేసుకు రమ్మంటే- ఆ నవలతో పాటూ ఇంకెప్పుడూ కన్పించకుండా అంతర్ధానమైపోతే ఏమనాలి?

ఇంత  చేస్తుంది సినాప్సిస్!
       వన్ లైన్ ఆర్డర్ తోనే  ఒకటి కాదు, నాలుగు గంటలు కథ చెప్పినా, దానికీ ఓ పద్ధతుంటుంది. మొదట్లో చెప్పుకున్న హాలీవుడ్ సినాప్సిస్ రచనలో మొట్టమొదట ప్రధాన పాత్రని  పరిచయం చేసి, దాని రోజువారీ జీవితం గురించి చెప్పాలని ఎందుకన్నారు? కథ అలా ప్రారంభిస్తేనే ఒక ఫ్లో ఉంటుందనే కదా? అలా కాకుండా హీరో పాత్ర ఎవరో ఏమిటో, ఏం చేస్తూంటాడో, ఇతర ముఖ్య పాత్రలతో సంబంధా లేమిటో చెప్పకుండా, మొత్తం కథ ని బ్యాక్ డ్రాప్ లో పెట్టి  చెప్పడం ప్రారంభించకుండా, నేరుగా వన్ లైన్ ఆర్డర్ చెప్పేస్తూంటే ఏమర్ధమౌతుంది? ఆ మాటకొస్తే, ఈ బ్యాక్ డ్రాప్ కంటే ముందు మూడు ముక్కల్లో కథ పాయింటేమిటో చెప్పి అప్పుడు కథలోకి వెళ్తే శ్రోతకి ఎంత సౌకర్యంగా వుంటుంది? ఆ పాయింటు ప్రకారం కథ వెళ్తోందా లేదా  అని అతను ఆద్యంతం ఇన్వాల్వ్ మెంట్ తో  వినే అవకాశముంటుంది. 

    ఈ నేరేషన్ లోపలన్నిటికీ, ఆ పైన సినిమా  తీస్తే అది అట్టర్ ఫ్లాపవడానికీ మూలకారణం తమ కథేమిటో తమకి తెలియకపోవడం వల్లే. రాసుకున్న వందల పేజీల స్క్రిప్టుని ఐదు నిమిషాల్లో టూకీగా బలంగా చెప్పలేక పోవడం వల్లే. అంటే ఓ నాలుగు పేజీల సినాప్సిస్ తో మొట్ట మొదట కసరత్తు చేయకపోవడం వల్లే. వేసుకున్న వన్ లైన్ ఆర్డర్ లో ఏది బిగినింగ్, ఏది మిడిల్, ఎక్కడ్నించీ ఎండ్ చెప్పలేకపోతున్నారంటే, ఓ వెయ్యి పదాల సినాప్సిస్ తో కసరత్తు చేయకపోవడం వల్లే. మొత్తం కథకి స్ట్రక్చర్ లేదంటే, సినాప్సిస్ తయారీకి ఓ రెండు గంటలు శ్రమ చేయక పోవడం వల్లే.

      స్ట్రక్చర్ !

      ఎటుతిరిగీ ఇక్కడికే వస్తాం. ఐడియాలో స్ట్రక్చర్, లాగ్ లైన్ లో స్ట్రక్చర్, సినాప్సిస్ లో స్ట్రక్చర్!

      సినాప్సిస్ లో స్ట్రక్చర్ అంటే వన్ లైన్ ఆర్డర్ నుంచి మొదలెట్టి అంతిమంగా డైలాగ్  వెర్షన్ దాకా అవి చెదిరిపోకుండా లంగరేసి వుంచడం. సినిమా కథ  తయారు చేసుకోవడానికి సినాప్సిస్ ని మించిన బ్లూ ప్రింట్ లేదు. రూట్ మ్యాప్ లేదు. ఒక సర్టిఫికేట్ లేదు.

       ఇటీవల ఒక కథకి ఒక దర్శకుడితో కలిసి వేసిన లైన్ ఆర్డర్ గ్రూప్ డిస్కషన్స్ లో సవ్యంగా రాలేదన్పించి, అదే వన్ లైన్ ఆర్డర్ ని పెట్టుకుని సినాప్సిస్ రాసుకుంటూ పోతూంటే అన్ని లోపాలూ తొలగిపోయి, కొత్త డైనమిక్స్ తో, కొన్నిసీన్లు కూడా మారిపోయి, ఒక ఎడతెగని ఫ్లోతో సమగ్ర కథ తయారయ్యింది. అంతే కాదు,  ఆ వన్ లైన్ ఆర్డర్ ప్రారంభంలో హీరో గోల్ కి సంబంధించి పీడిస్తున్న అదేమిటో అర్ధంగాని అంతుచిక్కని అస్పష్టత కూడా (ఇది దర్శకుడూ ఆ యన గ్రూపూ అప్పటికింకా  పసిగట్టలేదు),  సినాప్సిస్ రాస్తూంటే, చిట్ట చివర పక్క పాత్ర ఒకటి అనే విధంగా యాదృచ్చికంగా రాసేసిన ఒక డైలాగుతో తీరిపోయింది! దాంతో ఆ డైలాగు పట్టుకుని మొదటి కొచ్చి,  హీరో  గోల్ తాలూకు ఆ ప్రకటనని ఆ మేరకు సవరిస్తే, అప్పుడు ఆ ప్రకటనకీ అతను చేసుకుపోతున్న పన్లకీ ఒక అర్ధం పర్ధం వున్న లింకు ఏర్పడింది. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఒక ఫ్లోలో రాసుకుంటూ పోతేనే ఏదైనా క్లారిటీ వస్తుంది.  ఫలితంగా ఈ ముప్పై మూడు పేజీల సినాప్సిస్ నే దర్శకుడు ఫైనల్ కథగా డిక్లేర్ చేస్తే, దీని ఆధారంగా ఈసారి  అర్ధవంతమైన వన్ లైన్ ఆర్డర్ వేయడం మొదలు!

      ఇంత చేస్తుందన్నమాట  సినాప్సిస్!

      ఇంకో చోట సినాప్సిస్ ఇంకో రూపంలో వుంది. ఆ దర్శకుడితో కొంతకాలం అగ్ర హీరోకి కథ కోసం కసరత్తులు జరిగి (ఇక్కడ ఈయన గ్రూపు లేదు) చివరికి ఇప్పట్లో ఆ అగ్ర హీరో అందుబాటులో లేకపోవడంతో, ఓ థ్రిల్లర్ ఐడియా మీద వర్క్ ప్రారంభించాం. దానికి ఒక లైను మీద అంగీకారాని కొచ్చి రికార్డింగ్ చేసుకున్నాక, సింగిల్ హేండెడ్ గా ఆర్డర్ వేసేయమన్నారు. ఆ సబ్జెక్ట్ మీద కొంత రీసెర్చి చేసి, ఆ రికార్డింగ్ ఆధారంగా ఆర్డర్ వేస్తూంటే వారం రోజుల్లో అంతకంటే బెటర్ గా, అనూహ్యంగా తయారయ్యింది మొత్తం కథ. క్లైమాక్స్ కూడా మారిపోయింది. ఈ నేరేషన్ ని విని థ్రిల్లయిన ఆయన నిర్మాతల వేటలో పడ్డారు. ఇక్కడ సినాప్సిస్ ఆ రికార్డింగే. ఒకోసారి          సినాప్సిస్ కంటే వన్ లైన్ ఆర్డర్ బెటర్ గా రావచ్చని చెప్పేందుకే ఇది..ఐతే వన్ లైన్ ఆర్డర్ ని బేస్ చేసుకోవడానికి సినాప్సిస్ అంటూ ఒకటి వుండి తీరాలి.

      నిజానికి ఇలాటి విషయలు వెల్లడించ కూడదు. ప్రాక్టికల్ గా ఏం జరగవచ్చో చెప్పడానికి మాత్రమే మచ్చుకి పై రెండు ఉదంతాల్ని ప్రస్తావించక తప్పలేదు.  

      ఇంతకీ సినాప్సిస్ ఎలా వుంటుంది?  దీన్నెలా రాయాలి?

ఇదిగో ప్రయోజనం!
        ఓసారి ఈ కింద రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినాప్సిస్ ని చూద్దాం :

      ఓ కాలేజీ ఎదుట అనుచరులతో ఎదురుచూస్తున్న గణేష్, జేడీ  సైగతో ఓ విద్యార్థిని హత మారుస్తాడు.

    జేడీ ఒక విద్యార్థి నాయకుడు. కాలేజీ లో ఎదురు లేని వాడు. ఆ కాలేజీ స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్. గణేష్ ద్వారా జేడీ కి ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యం చె లాయిస్తున్న భవానీ అనే పెద్ద గూండాతో పరిచయం ఉంటుంది. ఇలా విద్యార్థులతో ఏర్పడిన  ఈ సంబంధంతోనే, మాచిరాజు అనే రాజకీయనాయకుడి నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకుంటూ, మాచిరాజుకి వెన్నుదన్నుగా ఉంటాడు భవానీ.

     ఈ కాలేజీలోనే స్టూడెంట్ గా చేరతాడు శివ. అక్కడ మల్లి అనే విద్యార్ధి తో, ఆశా అనే ఇంకో విద్యార్థినితో స్నేహం పెంచుకుంటాడు.  అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, లెక్చరర్లని అవమానపరచడం వంటి పన్లతో అల్లరి చేస్తున్న జేడీకి శివ తారసపడతాడు. మొదటిసారి స్నేహితులు చెప్పారని జేడీ ని క్షమించినా, మళ్ళీ ఈసారి ఆశా తో మిస్ బిహేవ్ చేయడంతో, రెచ్చిపోయిన శివ సైకిలు చైను లాగి, జేడీ నీ అతడి గ్యాంగునీ చితగ్గొట్టేస్తాడు. అన్నాళ్ళూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జేడీ, ఈ శివ తెగింపు చూసి నిశ్చేష్టుడౌతాడు.

      ఈ అనూహ్య సంఘటన మరో రెండు పర్యవసానాలకి దారి తీస్తుంది. మొదటిది జేడీ గణేశ్ ని రంగంలోకి దింపడం, రెండోది స్నేహితులు శివని ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహించడం. కానీ శివ తనకంటే అర్హత వున్న జగన్ ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. శివ చేస్తున్న ఈ ప్రయత్నాల్ని ఆపమని కోరతాడు గణేష్.  మా కాలేజీ వ్యవహారాల్లో వీధి రౌడీల జోక్యం అనవససరమని అంటాడు శివ.

     గణేశ్ బెదిరించే ప్రయత్నం చేస్తాడు. శివ అతడికీ దేహశుద్ధి చేస్తాడు. దీంతో వ్యవహారం ముదిరి భవానీ దాకా వెళుతుంది. భవానీ మొదట ఆగ్రహించినా, తర్వాత జేడీ కంటే శివయే తనకి బాగా పనికొస్తాడని గ్రహిస్తాడు. అలా పథకం ప్రకారం భవానీ జగన్ ని హతమారుస్తాడు. ఇక తప్పక శివ ఎన్నికల్లో నిలబడతాడు.

     కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి ని భవానీ మోసం చేయడంతో అతను శివ పంచన చేరతాడు. మరో పక్క తనని ప్రేమిస్తున్న ఆశా నే శివ పెళ్లి చేసుకుంటాడు. ఇక భవానీ శివ మీద దాడులు ప్రారంభిస్తాడు. శివ వాటిని తిప్పికొట్టడంతో బాటు భవానీ గ్యాంగుని తన వైపు తిప్పుకుంటాడు. దీంతో మాచిరాజు కూడా భవానీ కి దూరమౌతాడు.

      దెబ్బతిన్న భవానీ శివ ఇంటి మీద దాడి చేస్తాడు. దీంతో అంతిమ పోరాటం మొదలై భవానీని వధించి, నగరానికి  దుష్టుడి పీడా వదిలిస్తాడు శివ. ఈ పోరాటంలో తన అన్న కుమార్తెని పోగొట్టుకుంటాడు.

      ఇదీ విషయం!

      ఇలా సినాప్సిస్ రాసుకుంటే, ఇందులో స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు వుంటాయి. పై పాఠం మొదటి మూడు పేరాలూ బిగినింగ్ ని సూచిస్తే, నాల్గు నుంచీ ఏడవ పేరా వరకూ మిడిల్ నీ, చివరి పేరా ఎండ్ నీ సూచిస్తాయి. మొదటి మూడు పేరాల్లో బిగినింగ్ తాలూకు సమస్య ఏర్పాటయింది. తర్వాతి మూడు పేరాల్లో మిడిల్ తాలూకు సంఘర్షణ ప్రారంభమయ్యింది, చివరి పేరాలో ఎండ్ తాలూకు పరిష్కారం చెప్పడం జరిగింది.

       వేటికవి ఈ మూడు విభాగాల్లో కథ కుదిరే వరకూ కసరత్తు చేయాల్సిందే. ఎవరి కథని బట్టి వాళ్ళు ఏఏ అంశాల్ని, సంఘటనల్నీ కూర్చితే ఆయా  మలుపులకి దారి తీస్తాయో వాటిని కనిపెట్టాల్సిందే. పై సినాప్సిస్ మొదటి మూడు పేరాల్లో బిగినింగ్ విభాగం సూత్ర ప్రకారం ఎలా ఏర్పాటయ్యిందంటే-
1. ప్రథాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథా నేపధ్యాన్ని సృష్టించడం
2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే  శక్తుల్ని చూపడం
3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన
4. సమస్య ఏర్పాటు.

      యాక్షన్, కామెడీ, ట్రాజెడీ, ఫ్యామిలీ, రోమాన్స్, థ్రిల్లర్, హార్రర్, జానపదం, పౌరాణికం- ఏ తరహా సినిమా కథకైనా బిగినింగ్ విభాగపు పరిధిని గుర్తించి చూస్తే,  పై నాలుగు అంశాలు ఆధారంగానే కథనం వుంటుంది.

      అలాగే  ‘శివ’ సినాప్సిస్ లోనూ  వుంది-

1. ప్రధాన పాత్ర శివతో పాటు, హీరోయిన్ ఆశానీ, ఇతర ఫ్రెండ్స్ పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ తో పాటు అతడి తాలూకు జేడీ,గణేష్, మాచిరాజు పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ పడగ నీడలో కాలేజీ వాతావరణం వున్నట్టు కథా నేపధ్యాన్ని సృష్టించడం...
2. ప్రధాన పాత్ర శివకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే శక్తులుగా  జేడీ, గణేష్ లని చూపడం
3.  జేడీ చేష్టలతో శివకి సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన
4.  సైకిల్ చైన్ లాగి జేడీ మీద తిరగబడ్డంతో శివకి భవానీతో సమస్య ఏర్పాటు అవడం
ఈవిధంగా బిగినింగ్  విభాగం స్పష్టమౌతోంది సినాప్సిస్ లో.

      ఇక మిడిల్ కొస్తే-

      మిడిల్ అనేది ప్రధాన పాత్రకి సమస్యతో పోరాటాన్ని ఎస్టాబ్లిష్  చేస్తుంది. ఈ సమస్య ఒక పరిస్థితి కావొచ్చు, లేదా భౌతికంగా ప్రత్యర్ధి పాత్ర కావొచ్చు.  ప్రధాన పాత్ర- వ్యతిరేక శక్తి పరస్పరం  పై చేయి సాధించడానికి యాక్షన్ –రియాక్షన్ గా సంఘర్షించుకుంటాయి. . ప్రధాన పాత్రకి ఒకోసారి పై చేయీ అంతలోనే ఓటమీ జరుగుతూ వచ్చి, ఒకానొక దశలో తీవ్ర నష్టానికి గురవుతుంది. ఈ నష్టంలోంచి ఫైనల్ గా ఓ పరిష్కార మార్గం తడుతుంది. ఇక్కడితో మిడిల్ ముగుస్తుంది.

       ‘శివ’ సినాప్సిస్ లో ఇదంతా చూడొచ్చు :

       శివ జేడీ ని కొట్టడంతో ఏర్పడిన పరిణామాలు అతణ్ణి భావానీతో పోరాటానికి సిద్ధం చేశాయి. భావానీయే సమస్య. దెబ్బలు తిన్న జేడీ గణేష్ ని రంగం లోకి దింపడం, గణేష్ ఎన్నికల్లో నిలబడొద్దని శివని బెదిరించడం, శివ అతణ్ణీ కొట్టడం, దీంతో భవానీ రంగంలోకి రావడం, తన ప్రయోజనం కోసం జగన్ ని చంపి శివాని ఎన్నికల్లో నిలబడక తప్పని పరిస్థితి కల్పించడం, గెలిచిన శివతో ప్రయోజనం నెరవేరక పోగా, తన అనుంగుడు కృష్ణా రెడ్డి శివ పంచన చేరడం, వ్యతిరేక మాఫియా గా ఎదిగిన శివ ఆశా  ని పెళ్లి చేసుకోవడం, శివ మీద భవానీ దాడులు మొదలెట్టడం, శివ ప్రతిదాడులు చేయడం, భవానీ గ్యాంగునే తన వైపు తిప్పుకోవడం, దీంతో మాచిరాజు కూడా భవానీకి దూరమై భవానీ ఇరుకున పడ్డమూ జరిగాయి..

      ఇలా మిడిల్ కి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఏర్పాటయ్యింది సినాప్సిస్ లో.

     ఎండ్ కొస్తే-

     మిడిల్ ముగింపులో ప్రధాన పాత్రకి ఫైనల్ గా అందే పరిష్కార మార్గం తో ఎండ్ విభాగం ప్రారంభమౌతుంది. ఇక వ్యతిరేక శక్తి పూర్తిగా ఆత్మ రక్షణలో పడుతుంది. అది కూడా ఫైనల్ గా తీవ్ర చర్యకి పాల్పడుతుంది. దీన్ని ఓర్చుకుంటూ ప్రధాన పాత్ర ఆ వ్యతిరేక శక్తిని శాశ్వతంగా అణిచి వేసి కథ ముగిస్తుంది.

    ‘శివ’ సినాప్సిస్ లో –

     చివరి పేరా ఇదే ప్రతిపాదిస్తుంది. మిడిల్ విభాగం ముగింపులో  భవానీ గ్యాంగ్ ని శివ తన వైపు తిప్పుకుని ఫైనల్ షో డౌన్ కి సిద్ధమైన నేపధ్యంలో, ఆత్మ రక్షణలో పడ్డ భవానీ శివ ఇంటి మీద దాడి చేయడం, శివ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి చంపడం, ఇదంతా  ఓర్చుకుని శివ భవానీ ని సంహరించి కథ ముగించడమూ జరిగాయి.

      ఇలా సినాప్సిస్ లో సమస్య- సంఘర్షణ- పరిష్కారం ఈ మూడూ ప్రస్ఫుటమైనప్పుడు కథకి సమగ్రత వస్తుంది. ఈ బ్లూప్రింట్ ని, రూట్ మ్యాప్ ని, సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకుని నేరేషన్ లో, వన్ లైన్ ఆర్డర్ లో ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. సమస్య ఏర్పడ్డానికి సృష్టించిన సీనేమిటి? పరిష్కార మార్గానికి సీనేమిటి? ముగింపు సీనేమిటి? ఈ మూడు సీన్లూ ఎప్పటకీ మారవు. నేరేషన్ లో, వన్ లైన్ ఆర్డర్ లో, స్క్రీన్ ప్లేలో, డైలాగ్ వెర్షన్ లో అవే ఉండిపోతాయి. ఉండి తీరతాయి. ఎందుకంటే అవే కథకి పట్టుగొమ్మలు, పిల్లర్స్. ఈ మూడు సీన్ల అవగాహన లేకపోతే, ఏం చేసీ కథకి ఓ అర్ధం పర్ధం రాదు.

      ఫైనల్ గా సినాప్సిస్ అంటే ఈ మూడు సీన్లని హైలైట్ చేస్తూ రూపొందించిన ఒక అడ్వర్టైజ్ మెంట్. ‘సరుకు’ అమ్మడానికి ఈ అడ్వర్టైజ్ మెంట్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నమాట!

     ఇలా స్పష్టాతి స్పష్టమైన సినాప్సిస్ చేతికొచ్చాక, దీన్నాధారంగా తర్వాతి టూల్ వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్దాం!

 సికిందర్