రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, March 4, 2015

ఆనాటి సినిమా ..


విఠలుడి సమాజ దర్పణం!


జానపద సినిమాలు జాతికి నష్టమా?

ఒక సారి యాదృచ్ఛికంగా దొరికిన ఈ లాట్వేనియన్ జానపద కథ చూడండి..


అనగనగా ఓ అడవి. ఆ అడవిలో జంతువులూ పక్షులూ అన్నీ కలిసి కాలువ తవ్వాలని నిర్ణయించాయి. అప్పుడొక ఉడుత కాలువ ఏ మార్గంలో వెళ్ళాలో చూపుతానని దాని జాతి లక్షణం కొద్దీ గుండ్రంగా పరుగెత్త సాగింది. ఇది చూసి ఉస్సూరన్న ఎలుగుబంటి తానే కష్టపడి కాలువ తిన్నగా తవ్వేసింది. జంతుజాలం, పక్షిజాలం అంతా కలిసి ఆ ఎలుగుబంటిని ఘనంగా సన్మానించాయి. ఒక బొంత కాకి మాత్రం మూతి ముడుచుకుంది. తనకి ఆకాశం నుంచి రాలిపడే ఒక్క నీటి చుక్కయినా చాలునని, ఈ నేల మీద పారే పాడు నీళ్ళు ముట్టనంటే ముట్టనని భీష్మించుకుంది. దాని తీరుకి మిగతా జీవులన్నీ నొచ్చుకున్నాయి. దీని సంగతేంటో చూద్దామని కాలువ దగ్గరికి రానీయకుండా కట్టడి చేశాయి. వాన పడ్డప్పుడే,  ఆ వాన చినుకుల తోనే దాహం తీర్చుకోవాలని ఆంక్ష విధించాయి.

      వాన ఎంతకీ పడక, చుక్క చినుకూ రాలక, దాహంతో నాలిక పిడచ కట్టుకుపోయి ఏడుస్తూ, ఎప్పుడు కురుస్తుంది వాన? వానెప్పుడు కురుస్తుంది బాబులూ? అని దీనంగా అడుక్కుంటూ తిరగ సాగింది బొంత కాకి.


    
ఇప్పుడు పాత సినిమా పత్రికలో మన విమర్శకుల వ్యధ చూద్దాం.. 


  
1940 నుంచి జానపద సినిమాలకి ఊపు తీసుకొచ్చారు తెలుగు నిర్మాతలు, దర్శకులు. అప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో కాస్త ముతకగానే సినిమాలు తీస్తూంటే, ఆ సీనులోకి ఠీవీగా బి. విఠాలాచార్య (1920-1999) అనే ఆయన ఎంటరై, జానపద సినిమాల్ని మార్గంలో పెట్టి, ఆబాల గోపాలన్నీ  అలరించడం మొదలెట్టాడు. నిర్మాతలు, ప్రేక్షకులు ఆకాశాని కెత్తేశారాయన్ని. ఇది విమర్శకులకి నచ్చలేదు. జానపద సినిమాలనేవి నేలబారు సినిమాలని, ఇవి వచ్చేసి అప్పుడప్పుడే పౌరాణికాల వ్యామోహం వదిలించుకుని, సామాజిక ప్రయోజనంతోమాలపిల్ల’, ‘రైతుబిడ్డ’, ‘వరవిక్రయంలాంటి వాస్తవిక కథా చిత్రాలకి ప్రేక్షకులు అలవాటవుతున్న సమయంలో, వాళ్ళ జిజ్ఞాసకీ, ఉత్తమాభిరుచికీ గండి కొట్టేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రేక్షకుల వెనుక బాటుతనాన్ని ఆసరాగా చేసుకుని, అశ్లీలాన్నీ అసభ్యాన్నీ జొప్పించి సొమ్ములు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇలా అస్పృశ్యతా భావంతో జానపద సినిమాలని ఖండిస్తూ, మళ్ళీ నాటి వాస్తవిక కథా చిత్రాల రా కోసం భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ వుండి పోయారు



        ఇలా వన్య ప్రాణుల కథ, మనుష్యుల  కథా ఒక్కటే. కాకపోతే ఇక్కడ ఫినిషింగ్ టచ్/మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే, విఠాలాచార్య తనని లోకం ముక్తకంఠంతో ‘జానపద బ్రహ్మ’ గానూ, అటు తమిళంలో ‘మాయాజాల మన్నన్’ గానూ  కీర్తించే కాలం వచ్చే దాకా, సదరు విమర్శకులు ఖండించిన ఆ ‘చెత్త’  జానపద సినిమాల శకలాల్నే పట్టువదలని విక్రమార్కుడిలా బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కడు భీకర కదన రంగం!


       అటు హిందీ లోనూ ఇంతే!

     ‘స్థానిక  నమ్మకాల మీద విదేశీ విష సంస్కృతి పడగ నీడలా పర్చుకుంటున్న వేళ, పౌరాణిక సినిమాలొచ్చి పేద ప్రజల్లో సైతం తమకూ దేవుళ్ళనే వాళ్లున్నారన్న ఆత్మ స్థైర్యాన్నీ, తద్వారా జాతీయతా భావాన్నీ పెంపొందించుకునేందుకు తోడ్పడ్డాయి. చారిత్రికాలొచ్చేసి, గత వైభవాన్ని కళ్ళకి కట్టి సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడ్డాయి. కానీ ఈ నేపధ్యంలో జానపద సినిమాల రాక మాత్రం అప్పటివరకూ వున్న పాపులర్ టేస్టుకి  విఘాతం కల్గించి, ప్రేక్షకుల్ని ఎంత మత్తులోకి లాక్కెళ్ళాయంటే, అత్యంత భారీ వ్యయ ప్రయాసలకోర్చి, తమిళంలో నిర్మించిన జానపదం ‘చంద్రలేఖ’, ఇదే టైటిల్ తో దాని హిందుస్తానీ రీమేకూ దేశవ్యాప్తంగా విజయ ఢంకా మోగించేసే దాకా!’ అని కె. ఎ. అబ్బాస్ కూడా రాశాడు.


     కానీ విఠలాచార్య మనసుని ఎవరూ తెలుసుకోలేదు. ఏదో వానాకాలం చదువు మూడో తరగతి వరకు చదువుకుని, తను నడిపిన టూరింగ్ టాకీసులో సినిమాలు చూస్తూ దర్శకుడ యిన వాడికి, ఏం సామజిక స్పృహలే బొంద అనుకోవచ్చు. అంతకి ముందు హోటల్ నడుపుకుంటున్న వాడు క్విట్ ఇండియా ఉద్యమంలోకి దూకి జైలు కెళ్ళాడు మరి. కన్నడలో తీసిన మొదటి రెండు సాంఘికాలు ‘రాజ్యలక్ష్మి,’ ‘కన్యాదాన’ అభ్యుదయ వాదంతో విరుచుకు పడ్డ సినిమాలే. మొత్తం తన నలభై రెండేళ్ళ క్రియాశీలక సినిమా జీవితంలో ఒక్క జానపదాలే కాదు, సాంఘికాలు, పౌరాణికాలు, హార్రర్ సినిమాలూ ..ఇలా వేటికవి తీసిన బహుముఖ ప్రజ్ఞాశాలియతను. జానపద సినిమాల గురించి ఎవరికెలాటి చిత్త భ్రాంతులున్నా, ఆ సినిమాలు థియేటర్లకిప్రేక్షకుల సంఖ్యని పెంచాయన్నది కాదనలేని వాస్తవం. కానీ ఏ నీతీ లేకుండా జానపద సినిమా కథ వుండదు. ప్రపంచ వ్యాప్తంగా జానపద కథల్లో వుండే నీతి ఎంత సార్వకాలిక, ఎంత సార్వజనీన నీతి అయివుంటుందంటే, ఆ కథల ఆధారంగా ‘ఫాటల్ ఎట్రాక్షన్’, ‘ప్రెట్టీ వుమన్’, ‘స్లీపింగ్ బ్యూటీ’ వంటి ప్రసిద్ధ చలన చిత్రాలెన్నో రూపొందాయని అంటాడు సినిమా కథల మీద ఇరవయ్యేళ్ళూ  పరిశోధన చేసి,  ‘స్టీలింగ్ ఫైర్  ఫ్రమ్ ది  డి గాడ్స్’  అనే పాపులర్ స్క్రీన్ ప్లే పుస్తకం రాసిన జేమ్స్ బానెట్.
   

    ఐతే తెలుగులో వచ్చిన జానపద సినిమాల్లోని కథలన్నీ ఒరిజినల్ జానపద కథలు కాకపోవచ్చు. సినిమాల కోసం సొంతంగా వండి వార్చుకున్నవే కావచ్చు. ఆ వంటకంలో విఠాలాచార్య  ఎంత సిద్ధహస్తుడో ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందుకు ఉదాహరణగా ఒక్క ‘బందిపోటు’ సినిమా చాలు. ఇందులో విమర్శకులు శోకించే మాయలు మంత్రాలు, అభూతకల్పనలు, అసభ్య ప్రదర్శనలూ ఏవీ కన్పించవు. శుభ్రంగా సామజిక ప్రయోజనంతో పాటు, వ్యక్తిత్వ వికాస కోర్సూ చూసుకోవచ్చు ఇందులో.

    ‘బందిపోటు’ అనగానే వెంటనే మెదిలేవి ‘వగల రాణివి నీవే’, ‘ఊహలు గుస గుస లాడే’  పాటలు. ఆ తర్వాతే మిగతా కథాకమామిషూ... 1963 లో దీనికి దర్శకత్వం వహిస్తూ నిర్మించి, ప్రేక్షకుల విందుకు సిద్ధం చేశాడు విఠాలాచార్య. ఎన్టీఆర్, కృష్ణ కుమారి, గుమ్మడి, రాజనాల, ప్రథానపాత్రథారులుగా ఈ సినిమాని ఎంత రక్తి కట్టించారంటే, అదొక మర్చిపోలేని కమర్షియల్ క్లాసిక్ అయేంతగా!

    సర్కస్!

    అధికారం సర్కస్ లాంటిదే.

    బ్యాలెన్సింగ్ చేసుకుంటే చప్పట్లు, లేదంటే ఇక్కట్లు.

     సర్కస్ విన్యాసాలు టైమింగ్, బ్యాలెన్సింగ్ అనే రెండు నైపుణ్యాల మీద ఆధారపడతాయి. ఏ కాస్తా అటు ఇటైనా మొత్తం సర్కస్ అభాసు. విఠాలాచార్య తను సర్కస్ కంపెనీలో కూడా పని చేసిన అనుభావన్నంతా రంగరించి ఈ  ‘బందిపోటు’ లో బ్యాలెన్సింగ్ యాక్ట్ చూలాగ్గా చేసేశాడు!



       అనగనగా గాంధార రాజ్యంలో సత్యసేన భూపతి అనే అశక్తుడైన మహారాజు. మందారమాల అనే మహా అహంకారియైన కూతురు. శూరసింహుడనే దుష్ట సేనాపతి. ఇతను రాజుగారి బావమరిది కూడా. రాజ్యం మీదా రాజకన్య మీదా కన్నేసి రాజు గార్ని బద్నాం చేస్తూంటాడు. పంట లెత్తుకుపోవడం,  బల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు.
      అసహాయ శూరుడనే వాడు ఇతడి లేటెస్ట్ బాధితుడు. ఇతను ముసుగు దొంగలా ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. ఈ అవకాశంతో  శూర సింహుడు  తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు అసహాయ శూరుడ్ని అటకాయిస్తే, ఇతను తన చిన్నాన్నే అని తెలిసిపోతుంది. అటు రాజుకి కూడా ఈ రహస్యం తెలిసిపోయి, ఆ అసహాయ శూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశ పెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మ నాయకుణ్ణి ఆదేశిస్తాడు. ఈలోపు నిజాలు బయట పడకూడదని శూర సింహుడు అసహాయ శూరుడ్ని చంపించేస్తాడు. ఈ అఘాయిత్యానికి గుండె పగిలి చస్తాడు ధర్మనాయకుడు. కుటుంబంలో ఒకేసారి ఇలా ఈ ఉత్పాతాలకి నరసింహ ఖిన్నుడై, తేరుకుని శూర సింహుడి మీద పగబడ్తాడు.

      ఓ అరగంట లోపే సెటప్ చేసిన ఈ కథా ప్రారంభం చాలా పకడ్బందీ స్క్రిప్టింగ్ ప్రణాళిక అనొచ్చు. సెటప్ డైనమిక్స్ కి ఈ భాగం వరకూ కత్తిరించి రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు ఆసక్తి వున్న సినిమా రచయితలెవరైనా. చాలా అందమైన దృశ్య మాలిక ఇది. జానపద సినిమాలు ఉత్త నేలబారువి అనేవాళ్ళకి చెంప పెట్టు సృజనాత్మకత ఇది. ఇక్కడి దాకా కథని, పాత్రల్ని పరిచయం చేసిన తీరూ, మల్చిన తీరూ, సమస్యని స్థాపించి కథానాయకుడ్ని కార్యోన్ముఖుడ్ని చేసిన పద్ధతీ...అదీ కేవలం ఓ అరగంటలో...ఓ క్రియేటివ్ ఛాలెంజియే అనాలి మూడో తరగతి డ్రాపౌట్ నుంచి!

     పగ బట్టిన నరసింహ బందిపోటు వేషంలో మరో కార్యం కూడా సాధిస్తాడు. తను ప్రేమించిన రాకుమారి అహంకారాన్నణచడం. కథానాయకుడి మెయిన్ యాక్షన్ లైన్ తో ఈ పర్సనల్ లైన్ డబుల్ ట్రాక్ లైన్ గా కుదిరి, ఈ సినిమాకి జవజీవాలు చేకూర్చి పెట్టాయి. తన పోరాటంలో చివరికి ఉరి కంబమెక్కుతాడు. అటువైపు దుష్ట నాయకుడు శూర సింహుడు, రాజుని బంధించి తన పట్టాభిషేక సంబరాల్ని ఘనంగా జరుపుకుంటూంటాడు. 

      అప్పుడు తప్పించు కొచ్చిన బందిపోటు నరసింహ, ఆ పట్టాభిషేక ఉత్సవాల్లో భారీ యెత్తున సర్కస్ విన్యాసాలతో కనువిందు చేస్తాడు. గానా బజానాతో మైమరపిస్తాడు. అధికారమంటే బుర్రలో  మంచీ చెడు అనే ద్వంద్వాల బ్యాలెన్సింగ్ యాక్టే ననీ, అంతే తప్ప ఒక వైపు మొగ్గి, అందిన కాడికి కబళించడం కాదనే అర్ధంలో రక్తి కట్టిస్తాయీ విన్యాసాలు. అక్రమార్కుడికి ఇదంతా ప్రదర్శించడం అయ్యాక, కత్తి తీసుకుని ఆ కంటకుడి మెడ కస్సక్ మన్పిస్తాడు నరసింహ!



      మనస్సు అనే పెండ్యులం ఆగిందంటే అది నిశ్చల స్థితే. అంటే శాంతి, మనశ్శాంతి. అలా దుష్ట సేనాపతిని న్యూట్రల్ చేశాక,  తిరిగి రాజ్యం శాంతితో కళకళ! ఇదీ  విఠలుడి సామాజిక సారస్వత దర్పణం!

    ఇందులో ‘బందిపోటు’ టైటిల్ పాత్ర నందమూరి తారక రామారావు, రాకుమార్తెగా కృష్ణ కుమారి,  శూర సింహుడిగా  రాజనాల, నటిస్తే; రాజు, చిన్నాన్న, అన్న పాత్రల్లో  గుమ్మడి, మిక్కిలినేని, నాగయ్య కన్పిస్తారు. రాజనాలకి ఉపాయల్లాంటి అపాయాలు చెప్పే రమణారెడ్డి, ఎన్టీఆర్ పక్కవాద్యం రేలంగి కావలసినంత హాస్యం డోసు అందిస్తారు. ఒకేచోట ఇంతమంది హేమా హేమీలతో మల్టీ స్టారర్ చూస్తున్నంత ఫుల్ మీల్స్.  ఒకే చోట వీళ్ళందరి అభినయ కౌశలాల్ని గాంచగలగడం మన అదృష్టమే అవుతుంది. ఇక రిచ్ కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్ గురించైతే చెప్పక్కర్లేదు. నిర్మాత తనే కాబట్టి ఏదో చీప్ గా చుట్టేద్దామని అనుకోలేదు  విఠాలాచార్య. ఘంటసాల సంగీతంలో పైన  చెప్పుకున్న రెండు ఎవర్ గ్రీన్ హిట్ పాటలు కూడా ఈ సినిమాకి  క్లాసిక్ హోదాని సంతరించి పెట్టిన అంశాల్లో చేరాయి. సమాజానికి అద్దం పట్టే ఈ జానపద సినిమా జాతికి నష్టమంటే అవమానమే

      
     కాశీమజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు పుస్తకాల్లో నిక్షిప్తమై వున్నట్టే, ఇలాంటి జానపద సినిమాల్ని చలన చిత్ర భాండాగారాల్లో వదిలేసి పోయాడు జానపద బ్రహ్మ భావిష్యత్తరాల ఆనంద వినోద వికాసాల కోసం...టేకిటప్!

సికిందర్
(2009 అక్టోబర్, ‘సాక్షి’ కోసం)




.