రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, March 19, 2014



ఎన్నికల సినిమాలకి ఎన్నెన్ని కళలో !




ఆటగాళ్ళ మధ్య ఆ ఇద్దరు..
ఈసారి ఎన్నికలు  ఎంత వేడి పుట్టిస్తున్నాయో ఎన్నికల సినిమాలూ అంతే హడావిడి చేస్తున్నాయి...2009 లో లేని సందడి  అంతా  ఈసారి పార్టీలు పెరిగిపోవడంతో- విపక్షాలు అనేకానేక అనైక్య ఎజెండాలతో తమలోతామే సిగపట్లకి సిద్ధపడ్డంతో- ఎన్నికల రణరంగం ఉత్కంఠ భరితంగా తయారై, రాజకీయ సినిమాలకి కావలసినంత మసాలా దినుసులు అందిస్తోంది -ఎక్కడో ఢిల్లీలో వుండే  ‘ఆమ్ ఆద్మీ’  అల్లరి లీడర్ కేజ్రీ వాల్ నుంచీ సైతం పిండుకోగల నవరసాల్నీ కూడా వదలకుండా!

మార్చి పదిహేడు హోలీ రోజున ఉన్నట్టుండీ ఫిలిం నగర్లో కొత్త సినిమా పోస్టర్లు వెలిశాయి. అచ్చం కేజ్రీవాల్ గెటప్ తో వున్న నటుడితో ‘క్రేజీవాలా’ అనే టైటిల్ ని మెరిపిస్తూ  క్రేజ్ సృష్టించాయా పోస్టర్లు. ఇప్పటికే వున్న ఎన్నికల సినిమాలకి తోడు ఇదొకటి తయారయ్యిందన్న మాట! పరీక్షగా చూస్తే ఆ ‘క్రేజీవాలా’ గా నటిస్తున్న నటుడెవరో కాదు-ప్రఖ్యాత కమెడియన్ ఎం. ఎస్. నారాయణ! కేజ్రీవాల్ ట్రేడ్ మార్క్ పార్టీ టోపీ, మఫ్లర్, స్వెట్టర్ లు ధరించి, కళ్ళద్దాలు పెట్టుకుని సాక్షాత్తూ కేజ్రీవాలే దిగివచ్చాడా అన్నంత అచ్చుగుద్దిన పోలికలతో ఎమ్మెస్ అవతరించడం హాట్ టాపిక్కే అయ్యింది!

రెండు పెద్ద సినిమాలతో బాటు ఎన్నికల సందేశాలు మోసుకొస్తున్న మరిన్ని చిన్న సినిమాల్లో నిశ్చయంగా ఎమ్మెస్ సినిమా ప్రత్యేకాకర్షణ అవుతుంది. రెండు పెద్ద సినిమాల రధసారధులు నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబులు.

మున్సిపల్, జడ్పీ, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలన్నీ ఒకే సారి కట్టగట్టుకుని వచ్చేసినట్టు, ఎన్నికల సినిమాలు కూడా పదమూడు వరకూ ఈ రెండు నెలల్లో  సొమ్ములు చేసుకునేందుకు స్పీడుగా దండు కట్టి వచ్చేస్తున్నాయి. ఎంత స్పీడుగానంటే, హోలీ నాడే [మార్చి 10] ప్రారంభమైన ‘క్రేజీవాలా’ నిర్మాణం పూర్తిచేసుకుని అప్పుడే ఏప్రిల్ మూడో వారానికల్లా ప్రేక్షకుల ముందుకు వాలిపోయే రికార్డంత! ఏప్రిల్ దాటితే ఈ సినిమాలకు విలువుండదు. మార్చి చివరివారం నుంచి ఏప్రిల్ ఆఖరు వరకూ నెలరోజుల్లో ఈ సినిమాలన్నీ విడుదలై పోతున్నాయి. ఇన్ని సినిమాలు చూసే వాళ్ళెవరంటారా? ‘ఎడ్యుకేషన్’ కోసం చూడాల్సిందే!



ఈ సారి ఎన్నికల సినిమాలు ఒకటో రెండో తప్పితే ఆయా పార్టీల ప్రచార సాధనాలుగా మాత్రం రావడం లేదు. కాస్త ఓటర్లని జాగృత పర్చే సదాశయంతో వస్తున్నాయి. ఇది కొత్త మార్పు. గతంలో ఒకపార్టీ నాయకుడికి వ్యతిరేకంగా ఇంకో పార్టీ సానుభూతిపరులు వ్యంగ్య బాణాలతో నూన్యత పర్చే సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడలాకాదు. ఇప్పుడు ఎన్నికలకి మిశ్రమ నేపధ్యం ఏర్పడింది. విభజన మీద ఒకరైతే -అభివృద్ధి  మీద మరొకరు, సమైక్యం మీద ఇంకొకరు, విలీనమ్మీద, అవినీతి మీద, రాజన్న రాజ్యం మీద, కాంగ్రెస్ హటావో మీద తలా ఒకరూ...ఇలా బెత్తం పుచ్చుకుని  ఓటర్లకి పాఠాలు చెప్పడానికి రకరకాలుగా బయల్దేరినప్పుడు, సినిమాలూ తక్కువేం తిన్లేదు. ఎన్నికల సినిమా అంటే  పాత మూస నుంచి కొంచెం తేడాగా అవీ ఓటర్ల పట్ల సామాజిక ధర్మం నెరవేర్చడానికి వేం చేస్తున్నాయి.

మొత్తం పదమూడు  ఇలాటి  సినిమాలు ఇంతవరకూ లెక్కలో కొచ్చాయి. లెజెండ్, రౌడీ, ఆటోనగర్ సూర్య, ప్రతిఘటన, ప్రభంజనం, ప్రతినిధి, వైఎస్సార్, జై రాజశేఖరా, జగన్నాయకుడు, రాజ్యాధికారం, గీత, ఆ  ఐదుగురు, క్రేజీవాలా...ఇవన్నీఈ నెలరోజుల్లో విడుదలవుతున్నాయి. ఇవే కాక రేసుగుర్రం, రభస, మనం, జండాపై కపిరాజు, అనామిక, చందమామ కథలు, ఐ, విశ్వరూపం -2, తను మొన్నే వెళ్ళిపోయింది..మొదలైన అగ్ర హీరో హీరోయిన్ల, దర్శకుల సినిమాలెన్నో మార్చి చివరి వారం నుంచీ ఏప్రిల్ చివరి  వారం మధ్య విడుదల కాబోతున్నాయి. వీటితో పై ఎన్నికల సినిమాలు ఢీ కొని నిలబడ గల్గేవి బాలకృష్ణ ‘లెజెండ్’, మోహన్ బాబు ‘రౌడీ’, నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ లాంటి పెద్ద సినిమాలే కన్పిస్తున్నాయి.

ఏ సినిమా కథాకమామిషేమిటో ఈ క్రింద చూద్దాం..

ఓటర్ని కాదు, షూటర్ని!


నందమూరి బాలకృష్ణ...లెజెండ్...మరోసారి సింహా ఫేం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తూ ఎన్నికల మంటల్లో, వేసవి కాష్ఠంలో  హైపర్ ఎమోషనల్ డైలాగుల ఆజ్యం పోయడానికి సిద్ధమైపోయారు. నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావ్ బే-షూటర్ని! కాల్చి పారేస్తా నాకొడకా.....సీటు కాదు కదా  అసెంబ్లీ గేటు కూడా దాట నివ్వను...నాకు ఒక బ్యాడ్ హేబిట్టుంది, లైఫ్ లో కొన్నింటిని చూడకూడదు, వినకూడదు అనుకుంటా, పొరపాటున అవి నా కంటికి కన్పించినా, చెవికి విన్పించినా టెంపర్ లేచుద్ది... రాజకీయం నీ ఫుడ్డులో ఉంది, నువ్వు పడుకునే బెడ్డులో ఉంది,  కానీ అది నా బ్లడ్డులోనే ఉందిరా బ్లడీ ఫూల్!...వంటి తూటాల్లాంటి డైలాగులతో ఎన్నికల్ని  టార్గెట్ చేస్తూ బాక్సాఫీసు బరిలోకి దూకారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతోనే  ఇలాటి సన్నివేశాల్ని, సంభాషణల్నీ రాజకీయ ప్రత్యర్ధుల్ని దృష్టిలో పెట్టుకునే  రూపొందించినట్టు తెలుస్తోంది. ఐతే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో బాలయ్యని నిలబెడతారా లేక పార్టీ ప్రచారానికే ఉపయోగించుకుంటారా అన్నది తేలాల్సి వుంది.

విడుదలకి ముందే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలం దృష్ట్యా బిజినెస్ ఇదివరకు ఏ బాలయ్య సినిమాలకీ జరగని రేంజిలో [45 కోట్లు] జరిగిందనీ, కాదు ఈ సినిమా నిర్మించిన 14 రీల్స్ సంస్థే ‘నేనొక్కడినే’ తో బయ్యర్లకి భారీ నష్టాలు మిగల్చడంతో  వాళ్ళు అడ్వాన్సులు అంతంత మాత్రమే ఇచ్చారనీ చెప్పుకుంటున్నారు. 14 రీల్స్ బ్యానరుపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ భారీ కమర్షియల్ లో బాలయ్యకి హీరోయిన్లుగా రాధికా ఆప్టే, సోనల్ చౌహాన్ లు నటించారు. ప్రత్యేక పాత్రలో విలన్ గా జగపతి బాబు నటించారు.  ప్రప్రథమంగా బాలయ్య సినిమాకి దేవీశ్రీ  ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ సినిమానే ఒక రాజకీయ వ్యూహంతో నిర్మించారని అంటున్నారు. బాలకృష్ణ ఎన్నికల్లో నిలబడే మాటెలా వున్నా, చంద్రబాబు అధికారంలోకి రావడానికీ, అటు కేంద్రంలో చక్రం తిప్పడానికీ ఈ సినిమా ఓ మెట్టులా ఉపయోగపడేలా, పార్టీ కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యం నింపేలా ఉండాలనీ ప్లాన్ చేసినట్టు నిర్మాణ సంస్థ వర్గాలు వివరిస్తున్నాయి. ఇక నోట్లతో బాటు ఎన్ని ఓట్లు ఈ సినిమా కురిపిస్తుందో వేచిచూడాల్సిందే. నోట్ల లెక్క విడుదలవ్వగానే తెలిసిపోయినా, ఓట్ల పంట కోసం మాత్రం మే రెండో వారం దాకా  ఊపిరి బిగబట్టి ఎదురు చూడాల్సిందే.


రౌడీ గారి ఆగమనం!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు- విష్ణు నటించిన ‘రౌడీ’ నిజంగా ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని తీయకపోయినా, దీని హంగుల దృష్ట్యా ఎన్నికల  సినిమా-  పోనీ రాజకీయ సినిమాగానే చూడాల్సి వుంది. ‘లెజెండ్’ లాగా ఈ సినిమా వివరాలు బయటికి రాకున్నా, టీజర్స్ ని చూస్తే  మోహన్ బాబు పవర్ఫుల్ డైలాగుల సినిమా ఇదని తెలుస్తోంది. 18 రోజుల అతితక్కువకాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ షూటింగ్ రాయలసీమ ప్రాంతంలో జరగడాన్ని బట్టి, దీనికి ఫ్యాక్షన్ నేపధ్యమే వుండొచ్చు. చాలాకాలం తర్వాత మోహన్ బాబుతో కలిసి జయసుధ నటించారు. సాయి  కార్తీక్ సంగీత దర్శకుడు. ఏవీ పిక్చర్స్ బ్యానర్ పై పార్థ సారధి, గజేంద్ర, విజయకుమార్ లు నిర్మించారు.

నిర్మాతలు చెప్పిందాన్నిబట్టి మోహన్ బాబు కి ఈ సినిమా ‘పెదరాయుడు’, ‘రాయసీమ రామన్న చౌదరి’ లకంటే శక్తివంతమైన సినిమా అవుతుంది. ఇప్పటికే రెండు భాగాల ఫ్యాక్షన్ సినిమా ‘రక్తచరిత్ర’ తీసివున్న వర్మ ఈ తాజా రాజకీయ థ్రిల్లర్ లో ఏ అంశాన్ని స్పృశించారో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.



మాటకుమాట-దెబ్బకుదెబ్బ!

నాపేరు సూర్య..ఆటోనగర్ సూర్య..నా ప్రపంచంలో మాటకుమాట, దెబ్బకుదెబ్బే సమాధానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్ధం కాలేదు కదూ ?...నాది మోటార్ క్యాస్ట్..మనిషి బరువుని, బాధని మోసుకెళ్ళే క్యాస్ట్... అంటూ రాబోతున్నాడు నాగ చైతన్య ‘ఆటోనగర్ సూర్య’తో. ఇది విజయవాడ రాజకీయాల రభస. మీరు ఓకే అంటే ఒక రాధ, ఒక రంగా, ఒక నెహ్రూలాగా ఎదుగుతారు... అనే డైలాగు కూడా ఈ సినిమాలో వుంది. ఎంతోకాలంగా విడుదల వాయిదాలు పడుతూ వస్తున్న ఈ దేవకట్టా సినిమాలో డైలాగులు లీకు కాకుండా ఎంతకాలం ఆగుతాయి? రాధా  రంగాలతో ముడిపెట్టి దేవినేని నెహ్రూ పేరుని ప్రస్తావించడం వివాదం రేపవచ్చని ఫిలిం నగర్ భోగట్టా. ఇది ఎలాటి ఎన్నికల సందేశాలూ ఇవ్వకపోవచ్చు, కానీ తెలిసిన ఒకప్పటి బెజవాడ హత్యారాజకీయాల్నే చిత్రించడంతో-ఎన్నికల సమయంలో తనదైన పంథాలో వేడి పుట్టించ వచ్చు.

సమంతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సంగీతం అనూప్ రూబెన్స్. నష్టాల్లో వున్న ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె. అచ్చిరెడ్డి, డా. వెంకట్ లు ఈ రాజకీయ థ్రిల్లర్ ని నిర్మించారు.


పై మూడు సినిమాలూ ప్రధానమైతే వీటిలో రెండే –లెజెండ్, రౌడీ-మిగతా అన్ని ఎన్నికల సినిమాలకి సవాలు విసురుతాయి. ఆటలో ఎంతమంది వున్నా బాలయ్య , మోహన్ బాబులే విజేతలుగా నిలుస్తారు. వీళ్ళిద్దరి సినిమాలే ఎన్నికల రణరంగంలో సొమ్ములు చేసుకుంటాయి.

చిన్న సినిమాల పెద్ద సందేశాలు!

ఇక ఎన్నికల చిన్న సినిమాలు పెద్ద సందేశాలే మోసుకొస్తున్నాయి. ఒక్కోటి ఒక్కో అంశాన్ని స్పృశించాయి. వీటిలో ఎక్కువగా ప్రచారం పొందుతున్నది తమ్మారెడ్డి భరద్వాజా దర్శకత్వంలో ఛార్మీ నటించిన ‘ప్రతిఘటన’. ఢిల్లీ నిర్భయ కేసునే ప్రస్తుత రాజకీయాలతో మేళవించి తీశారు. స్త్రీలమీద జరుగుతున్న అత్యాచారాల్ని  నేపధ్యంగా తెసుకుని, రాజకీయ వ్యవస్థని చూపిస్తూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులూ మారతారని చెబుతూ ఈ సినిమా తీశామని భరద్వాజ ప్రకటించారు. ఛార్మీ జర్నలిస్టుగా నటిస్తే, రేష్మా రేప్ బాధితురాలిగా నటించింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, ఎస్. గోపాల రెడ్డి ఛాయా గ్రహణం వహించిన ఈ సినిమాని చరిత చిత్ర పతాకం మీద ఆరేళ్ళ విరామం తర్వాత  దర్శకుడు భరద్వాజా నిర్మించారు.


ఇందులో ఒక విశేషం ఛార్మీ, కీరవాణి, గోపాలరెడ్డి ముగ్గురూ పారితోషికం తీసుకోకుండా పనిచేయడం. కథ అంతగా కదిలించడమే కారణం. ఇంకో విశేషం కాస్త సమకాలీన రాజకీయ రంగులు పులుముతూ చిరంజీవి రాజకీయ జీవితంమీద సన్నివేశాలు చేర్చడం. ఇవింకా గాసిప్సే. నిజమెంతో సినిమా విడుదలైతే గానీ తెలియనంత గోప్యాన్ని పాటిస్తున్నారు యూనిట్ సభ్యులు. 


తమిళ నటుడు అజ్మల్, సందేశ్, శ్రీ ఐరా, నక్షా శెట్టీ లు నటించిన ‘ప్రభంజనం- పేబ్యాక్ టు సొసైటీ’ అనే సామాజికార్ధి కాంశాల్ని చర్చించే సినిమాకి దర్శకుడు-నిర్మాత వి.  భాస్కర్రావు. చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ ఈయన స్థాపించిన సంస్థ. స్వాతంత్ర్యానంతరం దేశం సామాజిక, ఆర్ధిక వ్యవస్థ ఎలా వుంది, వీటిపై రాజకీయ వ్యవస్థ ప్రభావం ఎలావుందీ  అన్నవి ఈ సినిమా విశ్లేషిస్తుందని భాస్కర్రావు చెప్పారు. దీనికి సంగీతం ఆర్.పి. పట్నాయక్. కథ నచ్చి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఐదు పాటలు రాశారు. అజ్మల్ ఇందులో ఓటర్లలో చైతన్యం తెసుకువచ్చే గుడ్ సీఎం గా నటిస్తున్నాడు. ఇంకా గొల్లపూడి, కోట, నాజర్, నాగేంద్ర బాబు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.


గతంలో ‘ఆ నలుగురు’, ‘వినాయకుడు’ అనే సినిమాలు తీసిన ప్రేం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ప్రేమ్ కుమార్ పట్రా ఇన్నాళ్ళకు ‘ఆ ఐదుగురు- అతడే సీఎం ’ అనే ఎన్నికల సినిమా తీస్తున్నారు. సత్యం, మార్గం, లక్ష్యం, నమ్మకం, సమాధానం అనే ఆయుధాల్ని నమ్మి ఓ ఐదుగురు యువకులు సమాజాన్ని మార్చిన విధం ఇందులో చూపిస్తున్నారు. తనిష్, క్రాంతి, క్రాంతి కుమార్, కృష్ణ తేజ, శాశికాంత్ లు అ ఐదుగురు యువకులుగా నటించారు. ఇతర పాత్రల్లో పోసాని, నాగినీడు, బాబూ మోహన్, ఫిష్ వెంకట్ లు నటించారు.  దీనికి సుద్దాల అశోక్ తేజ పాటలు రాయడమేగాక, తొలిసారిగా మాటలు రాశారు. ‘మంత్ర’ ఆనంద్ సంగీతం సమకూర్చారు.


 ఇక -18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుంటే జేవితం పాడయిపోతుందని అందరూ అంటారు, అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడయి పోతుందని ఎవరూ అడగరే...అడగడానికే వస్తున్నా, వస్తున్నా... అనే  నారా రోహిత్ డైలాగులతో విడుదలైన టీజర్ కూడా ఆసక్తి రేపుతోంది


ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు, ఇక పైసల్ని పట్టించుకునేదెవరు? కానీ ఈ హీరో అలాకాదు, కేవలం ఎనభై నాల్గు పైసలకోసం ఎకంగా ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేస్తాడు. యంత్రాంగాన్ని తన కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఇలా ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ సినిమా ద్వారా చూపిస్తున్నామని నిర్మాత జె. సాంబశివరావు తెలియజేస్తున్నారు. ప్రజా శ్రేయస్సుని కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో ఈ సినిమాలో చూపిస్తున్నట్టు దర్శకుడు ప్రశాంత్ మండవ అంటున్నారు. ఇందులో నారా రోహిత్ కి జంటగా శుభ్రా అయ్యప్ప నటిస్తోంది. సంగీతం సాయి కార్తీక్, బ్యానర్ సుధా మూవీస్.

వేద ఆర్ట్స్ బ్యానర్ మీద  కొమ్మి కౌశల్యాదేవి నిర్మిస్తున్న సందేశాత్మక  గీత- దమ్మున్న సినిమా’ చలన చిత్రంలో  హీరో హీరోయిన్లుగా నవకేష్, ఆకాంక్ష నటించారు. వామపక్ష భావజాలంతో సినిమా రంగంలో అడుగుపెట్టిన దర్శకుడు రామారావు ఏలేటి –భగవద్గీత, విప్లవ గీతాల సమ్మేళనంగా ఈ సినిమా తీసినట్టు చెబుతున్నారు.  బడుగు, బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని  ప్రతిబింబించేలా ఉంటుందిట. సమాజంలో దుర్మార్గుల్ని  వేదాల్లోని  అంశాలతో ఎలా నిర్మూలించవచ్చనేది ఇందులో చూపిస్తున్నారు. దీనికి పద్మ నావ్ టి. సంగీతం.


ఇకపోతే ఈ సందడిలో ఆర్. నారాయణ మూర్తి గురించి చెప్పుకోకపోతే బావుండదు. ఇది ఆయన వుండి తీరాల్సిన సందర్భం.  సొంత  'స్నేహాచిత్ర పిక్చర్స్‌' బ్యానర్‌ మీద దర్శకత్వం వహిస్తున్న  'రాజ్యాధికారం' సినిమా ఈ ఎన్నికల సీజన్లో ఇంకో ఎంట్రీ. రాజ్యాధి కారం మీద పెత్తనం చెలాయిస్తే పర్యవ సానాలెలా ఉంటాయో ఈ సినిమా ద్వారా ఆయన చెప్పబోతున్నారు. . ఓటు బ్యాంకు రాజకీయాల్ని కూడా ఎండగట్ట బోతున్నారు. డబ్బుని ఎరగా వేసి అధికారం  కొనుక్కుని నాయకులు రాజ్యా లేలుతున్నారన్నారనీ, మరోపక్క ఎంతో చిత్తశుద్దితో రాజకీయాలు చేసిన అనేకమంది మహానేతలు ప్రజలకోసం సర్వస్వం త్యాగం చేశారనీ - ఈ తేడాని తన సినిమాలో చూపిస్తున్నట్టు నారాయణమూర్తి చెబుతున్నారు. అంతేకాదు, దేశ సంస్కృతికి పట్టుగొమ్మలైన పల్లెసీమల్లో నేతలనబడే వాళ్ళు వైషమ్యాలు రేపుతున్నారనీ, ఎన్నికలతర్వాత తమదారి తాము చూసుకుని ఓటర్లని ఘోరంగా మోసం చేస్తున్నారనీ, అలాంటి నాయకులకి ఓటుతో బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేయడానికి తమ ‘రాజ్యాధికారం’ సినిమా తోడ్పడుతుందని వివరిస్తున్నారు.


ఇక దివంగత నాయకుడు డా. వై.ఎస్. రాజశేఖర  రెడ్డి  జీవితంమీద రెండు సినిమాలు రాబోతున్నాయి- ‘జై రాజశేఖరా-  -- దేవుడుకాని దేవుడు , ‘వై ఎస్సార్’  అనేవిజై రాజశేఖరా - దేవుడు కాని దేవుడులో  వైఎస్సార్ గా  సుమన్ నటిస్తున్నారు. ఎం.సుబ్బారెడ్డి దర్శకుడు. సత్యదేవా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానరు ద్వారా అప్పారావు నిర్మాత. ఈ సినిమాలో వైఎస్సార్ చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ  జరిపిన పాదయాత్ర  ప్రత్యేకా కర్షణగా ఉంటుందిట. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి వల్ల లబ్ధి పొందిన ప్రజలు, వారి అభిప్రాయాలు ఇందులో  కీలకం కానున్నాయట. రాజమండ్రి నుంచి వైఎస్‌ఆర్ పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అద్భుతమైన పాలన అందించి దేవుడు కాని దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచారాయన. 40 రోజులు ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఎన్నికల కంటే ముందే ఈ సినిమాని విడుదల చేస్తామని నిర్మాత అప్పారావు అంటున్నారు. ఒక మహామనిషి కథను తెరకెక్కించే అవకాశం ఇతర పాత్రల్లో జయసుధ, రమ్యకృష్ణ, రోజా, కవిత నటిస్తున్నారు.

రాజా, మమతా రాహుల్, శిరీష ప్రధాన తారాగణంగా విజయాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద  ప్రముఖ అలనాటి దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో వి.ఎ.పద్మనాభరెడ్డి  జగన్నాయకుడుఅనే సినిమాకి శ్రీకారం చుట్టారు. మూడు తరాల కథతో తీస్తున్న ఈ సినిమాలో  తాతగా, గ్రామ పెద్దగా రంగనాధ్ నటిస్తున్నారు. పేదలకోసం పాటుపడే డాక్టర్ గా , ముఖ్యమంత్రిగా ఎదిగే కొడుకు పాత్రలో భానుచందర్ కన్పిస్తారు. ఈయన  కుమారుడిగా నటిస్తున్న హీరో రాజా,  వ్యాపారవేత్తగా పైకొచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా చేరుకున్నాడన్నది అసలు కథగా వుంటుంది.


చివరిగా ...తాజా సంచలనం క్రేజీవాలాగురించి చెప్పుకోవాల్సి వస్తే, యంఎస్‌.నారాయణ ప్రధాన పోషిస్తున్న ఈ సినిమాని సౌండ్‌ ఎన్‌ క్లాప్స్‌ సంస్థాధినేత జివిజయకుమార్‌గౌడ్‌ నిర్మిస్తున్నారు.   మోహన్‌ ప్రసాద్‌ దర్శకత్వం. ఇది పూర్తిగా రాజకీయ సినిమానే అయినా  రాజకీయాలమీద  విమర్శకాదనీ, వ్యంగ్యాస్త్రం గానీ కాదనీ, కేవలం ఉన్నదున్నట్టు రాజకీయాలని  ప్రస్తావించే సినిమా మాత్రమేనీ దర్శకుడు అంటున్నారు



అసలు రాజ్యాంగం అంటే ఏమిటి, దేనిప్రాతిపదికన రాజ్యాంగం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకుంటే పాలన సక్రమంగా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితులు ఎలా వున్నాయి, ఎలాంటి మార్పు రావాలి...అనే అంశాలతో ఎన్నికల ముందు ఓటర్లకి  అవగాహన కల్పించడానికి తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు.  నిజాయితీతో తీస్తున్న ఇందులో రఘుపతిరాఘవరాజారాం అనే పాత్రని పరుచూరి గోపాలకృష్ణగారు పోషిస్తున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో నాగబాబు, షఫి, ఖడ్గం పృథ్విరాజ్‌, గౌతరరాజు, ఉత్తేజ్‌ నటిస్తున్నారు. సంగీతం సునీల్‌ కశ్యప్‌.

నెలరోజుల్లో ఈ పదమూడు సినిమాల్లో  పండగ చేసుకునేవి ఎన్ని, దండగయ్యేవి ఎన్ని అనేవి త్వరలో తేలిపోతుంది. ఒకటి మాత్రం నిశ్చయం- ఓటరు తెలివైన వాడు. ఎవరో  చైతన్యం తీసుకురావాల్సిన అగత్యం లేదు. ఓటేవరికి వేయాలో, ఎందుకు వేయాలో అతడికి బాగా తెలుసు. అతడి అంతరంగాన్ని కనిపెట్టడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. ఇలాటి సినిమాల్ని సరాదాగా చూసేస్తాడు తప్పితే,  వీటినిబట్టి మారడు గాక మారడు. అసలీ సినిమాలు చూడలా వద్దా అనేది కూడా అతడికి మాత్రమే తెలిసిన రహస్యం!


-సికిందర్