రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 14, 2014


రివ్యూ :హాలీవుడ్
డిఫరెంట్ జాకీ !

తారాగణం: జాకీచాన్,లూయేజింగ్ టియాన్, వీనా, రంగువాంగ్ యూ తదితరులు 

సంగీతం :  లావ్ జెయ్   ఛాయాగ్రహణం : యూ డింగ్    ఎడిటింగ్ ; ఇస్మాయేల్  గోమెజ్,   కళ :  ఫెంగ్ లిగాంగ్   యాక్షన్ : జాకీ చాన్, జున్ హీ తదితరులు 
రచన, దర్శకత్వం:డింగ్ షెంగ్.
*
***
యాక్షన్ చిత్రాల హీరోలుగా ముద్రపడి మాస్ హీరోలుగా చెలామణి అయ్యేవారు వయసుమీరిన తర్వాత అలాంటి పాత్రలు వేయలేక, కొత్త తరంతో పోటీపడలేక నిష్క్రమిస్తుంటారు. తెలివైనవారు క్రమంగా అన్ని రకాల పాత్రలలోకి ఒదిగిపోతూ మరికొంతకాలం వెండితెర మీద కనిపిస్తారు. నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించి తాము నటులుగా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకుని తర్వాత చింతించేవాళ్ళున్నారు. దానికోసం హీరోనుండి సైడ్ హీరో, విలన్‌గా వెళ్ళి గుర్తింపు పొందినవారు కూడా వున్నారు. వయసును దృష్టిలో వుంచుకుని మారుతున్న శరీర తత్త్వానికి అనువుగా తన ధోరణిని మార్చుకుని కళాత్మకమైన, వైవిధ్యమైన చిత్రాలలో నటించడానికి మొగ్గు చూపుతున్న హీరోలలో జాకీచాన్ ఒకరు. గతంలో ‘‘షింజుకి ఇన్సిడెంట్’’ లాంటి కళాత్మక చిత్రంలో నటించి అభిమానులను ఆశ్చర్యపరిచిన జాకీచాన్ నటించిన మరో వైవిధ్యభరిత చిత్రమే ‘‘పోలీస్ స్టోరీ 2013’’.

పోలీస్ స్టోరీ సీరిస్‌తో జాకీచాన్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, పెద్దలను ఆకర్షించగలిగాడు. ఒక సినిమాను మించి ఇంకో సినిమాలో ప్రవేశపెట్టిన వినూత్నమైన ఫైట్లు, ఛేజింగులు, యాక్షన్ సన్నివేశాలతో మంచి కాలక్షేప చిత్రాలుగా వీటిని తీర్చిదిద్దారు. అందుకే పోలీస్ స్టోరీ సినిమాలంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు వచ్చిన ‘‘పోలీస్ స్టోరీ 2013’’ మాత్రం పిల్లలను బోలెడు నిరాశకు గురిచేస్తుంది. ఇందులో జాకీచాన్ మార్క్ ఫైటింగులు, హాస్యం లేదు. పోలీస్ స్టోరీ సీరిస్‌లో జాకీచాన్ హాంగ్‌కాంగ్ పోలీసాఫీసర్‌గా నటించగా, ఇందులో చైనీస్ డిటెక్టివ్‌గా కనిపిస్తారు.

అర్థరాత్రి రద్దీగావున్న వీధిలో వెలుగులీనుతున్న వూ బార్‌ను చూపిస్తూ ‘‘పోలీస్ స్టోరీ 2013’’ మొదలవుతుంది. డిటెక్టివ్ జోంగ్‌వాన్ తన మీద కోపంతో తనను వదిలివెళ్ళిన కూతురు మియోను వెతుకుతూ వూ బార్‌కు వస్తాడు. వూ బార్ అండ్ నైట్ క్లబ్‌కు యజమానియైన వూ జియాంగ్ గర్ల్‌ఫ్రెండ్‌గా మియో కనిపిస్తుంది. తండ్రి వెంట రావడానికి నిరాకరించిన కూతురికి జరిగినది చెబుతాడు. విధి నిర్వహణలో వున్నప్పుడు భార్య ఆస్పత్రిలో వుందని తెలియగా, దుండగులను పట్టుకున్న తర్వాతే ఆస్పత్రికి రాగా భార్య మరణించిందని తెలుస్తుంది. ఆమె మరణానికి తండ్రి నిర్లక్ష్యమే కారణమని భావించిన కూతురు మియో తండ్రికి దూరంగా వెళ్ళిపోతుంది. నైట్ క్లబ్‌లో ప్రవేశించిన జోంగ్‌వాన్ చర్యలను గమనించిన సిబ్బంది అతడ్ని బంధిస్తారు.


కుర్చీలో ఇనుపవైర్లతో కట్టివేయడానికి జోంగ్‌వాన్‌కు వూ జియాంగ్ తనను ఎందుకు బంధించాడో అర్థంకాదు. తనతోపాటు తన కూతురు, బార్‌కి వచ్చిన కస్టమర్లంతా బంధింపబడి వున్నారని గ్రహిస్తాడు. వూజియాంగ్ పోలీస్ కమీషనర్‌కు ఫోన్‌చేసి బందీలకు బదులుగా అధిక మొత్తంలో డబ్బును, చిరకాల ఖైదీగా వున్న వీ జియాఫూను అప్పగించమని డిమాండ్ చేస్తాడు. డిటెక్టివ్ జోంగ్‌వాన్ కట్లు విప్పుకుని తప్పించుకుంటాడు. నైట్‌క్లబ్‌లో వెతుకుతూ వూ జియాంగ్ రహస్య గదిని కనుక్కుంటాడు. అక్కడ యవ్వనంలో వున్న వూ ఒక టీనేజ్ గర్ల్‌తో వున్న ఫొటో కనిపిస్తుంది. అక్కడ దొరికిన ఆధారాలనుబట్టి అతనో కిక్‌బాక్సర్ అని గుర్తిస్తాడు. కిడ్నాప్ ప్లాన్ విఫలమయితే క్లబ్ పేలిపోయేలా బాంబులు అమర్చాడని గ్రహిస్తారు. జోంగ్‌వాన్ తప్పించుకున్నాడని గుర్తించిన వూ, మియోను కాల్చేస్తానని బెదిరించి జోంగ్‌వాన్‌ను బయటకు రప్పించి మళ్ళీ బంధిస్తాడు. వూ అనుచరుడితో ద్వంద్వ యుద్ధంచేసి జోంగ్‌వాన్ గెలిస్తే ముగ్గురు బందీలను విడిచిపెడతాననీ, ఒకవేళ ఓడిపోతే ఖైదీగా వున్న వీ జియాఫూను తీసుకొచ్చి అప్పగించాలని షరతు పెడతాడు. తన సర్వశక్తులను ఒడ్డి గాయాలతో ఆ పోరాటాన్ని జోంగ్‌వాన్ గెలుస్తాడు.

ఇచ్చిన మాట ప్రకారం జోంగ్‌వాన్ జైలుకు వచ్చి చిరకాల ఖైదీయైన వీ జియోఫూకు నచ్చజెప్పి నైట్ క్లబ్‌కు తీసుకువస్తాడు. అప్పుడు వూ జియాంగ్ కిడ్నాప్ వెనుకవున్న అసలు రహస్యాన్ని బయటపెడతాడు. తన సోదరి మరణానికి కారకులైన జోంగ్, వీ, ఇతర ముగ్గురు బందీల మీద ప్రతీకారం తీర్చుకోవడానికని చెబుతాడు. అసలు కథ ఏమిటంటే- పేదవాడైన వీ తన తల్లి మందులను కొనడానికి డబ్బులేక దొంగిలించడానికి మందుల దుకాణంలోకి వస్తాడు. ఆ సమయంలో వూ సోదరి అబార్షన్ మందులకోసం వస్తుంది. తన బాయ్‌ఫ్రెండ్ తిరస్కరించడంతో అబార్షన్‌కోసం ప్రయత్నిస్తున్నాననీ, డబ్బు లు తక్కువైనా సర్దుకొమ్మని అభ్యర్థిస్తుంది. దుకాణంలో వున్న వాళ్ళంతా ఆమెను అవహేళన చేస్తారు. వీ మందులు దొంగిలిస్తూ పట్టుబడతాడు. ఎవరికీ దొరకకుండా వుండాలని వూ సోదరిని కత్తి చూపించి ఆమెను అడ్డుపెట్టుకుంటాడు. అక్కడి అరుపులు విని దారినపోతున్న డిటెక్టివ్ జోంగ్‌వాన్ అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే జీవితం మీద విరక్తితో వున్న వూ సోదరి వీ చేతిలోని కత్తితో గొంతు కోసుకుంటుంది. జోంగ్ తెలివిగా వీ ని బంధించి, వూ సోదరిని ఆస్పత్రికి తరలించినా రక్తస్రావంతో ఆమె చచ్చిపోతుంది. తన సోదరి మీద అమిత ప్రేమానురాగాలు కలిగివున్న వూ, ఆమె హత్యకు కారకులైన వాళ్ళను చంపాలనే ప్రయత్నంలో వుంటాడు. అక్కడ స్థావరంలో వున్న వూ సోదరి బాయ్‌ఫ్రెండ్‌ను జోంగ్‌వాన్ గుర్తుపడతాడు. తమ ప్రేమను తెలుసుకుని వుంటే వూ తనను చంపేసి వుండేవాడనీ, అందుకేతనను మరిచిపొమ్మని వూ సోదరికి చెప్పానని చెబుతాడు. అంటే పరోక్షంగా ఆమె చావుకు తనే బాధ్యుడినని వూ గుర్తిస్తాడు. ఈ సంఘటనతో ముడిపడి వున్న ఒక్కొక్క వ్యక్తి తమ కోణంలోంచి ఆరోజు జరిగిన సంఘటనను వివరించడంతో, అసలు నిజం బయటపడటం ‘‘రోషమాన్’’ చిత్రం స్టయిల్‌ను గుర్తుకు తెస్తుంది.


పోలీసులు నైట్ క్లబ్‌ను చుట్టుముట్టారని వూ గ్రహిస్తాడు. నైట్ క్లబ్‌కు అమర్చిన బాంబులను తొలగించి, తమ అనుచరులు రహస్యంగా పారిపోయేందుకు అనుమతిస్తాడు. మియోను అడ్డుపెట్టుకుని వూ పారిపోతాడు. జోంగ్ వెంటాడుతుండగా ఆ ముగ్గురు రైల్వే సొరంగంలోకి జొరబడతారు. ఆమెను అడ్డుబెట్టుకుని వూ, తను పారేసిన పిస్తోల్‌తో కాల్చుకొమ్మని లేదా అతని కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. బాగా ఆలోచించి జోంగ్‌వాన్ తన కూతురి భవిష్యత్తుకోసం పిస్తోల్ కణతకు గురిపెట్టి కాల్చుకుంటాడు. కాని అది పేలదు. అది ఖాళీ పిస్తోల్ అనీ, అతడ్ని పరీక్షించడంకోసం వూ అలా చేశాడని గుర్తిస్తారు. అన్నమాట ప్రకారం మియోను వదిలేసిన వూ, తనను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న జోంగ్‌వాన్ చర్యలను అడ్డుకుని, వస్తున్న రైలు కిందపడి చనిపోతాడు.

డైహార్డ్’’ ఇతివృత్తంతో పోలి వున్న ఈ సినిమా దానిలాగే ఒకే లొకేషన్‌లో నడుస్తుంది. డిటెక్టివ్ జోంగ్‌వాన్‌గా నటించిన జాకీచాన్ చేసిన ఫైట్లు, యాక్షన్ సీన్లన్నీ ఫ్లాష్‌బ్యాక్‌గా వస్తుంటాయి. ఇవి ప్రధాన ఇతివృత్తంతో సంబంధం లేకపోయినా, నాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. విలన్ వూ జియాంగ్ కిక్ బాక్సర్‌గా చేసిన పోరాటాలు కూడా ఫ్లాష్‌బ్యాక్‌గానే వస్తాయి. పాత ఫ్యాక్టరీని నైట్‌క్లబ్‌గా మార్చడంవల్ల అది పెద్దదిగా తయారై ముఠా స్థావరంగా తయారయింది. సినిమా మొత్తం సీరియస్‌గా కనిపించే జాకీచాన్ మంచి తండ్రిగా, నిజాయితీ పోలీసాఫీసర్‌గా మంచి నటనను కనబరిచారు. 59 ఏళ్ళ వయసులో కూడా ఫైట్లను చాకచక్యంగా చేయడం విశేషం. 

గతంలో జాకీచాన్‌తో ‘‘లిటిల్ బిగ్ సోల్జర్’’ తీసిన దర్శకుడు డింగ్ షెంగ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడిగా వ్యవహరించారు. కళాత్మకంగా తీసిన ఈ చిత్రం మొదట బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ, తర్వాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ పాల్గొని విమర్శకుల ప్రశంసలను అందుకుంది. చైనాలో 86 మిలియన్ డాలర్లను వసూలుచేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా మాత్రం నిరాశపరిచింది!



- కె.పి. అశోక్ కుమార్