రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 9, 2014

రివ్యూ ..

ప్రయోగంతో పాట్లు!

**నవదీప్, కలర్స్ స్వాతి, సంతోష్, రాం-లక్ష్మణ్, హర్షవర్ధన్ తదితరులు

సంగీతం : మహేష్ శంకర్,  ఛాయా గ్రహణం :  సాహిర్ రజా
మాటలు : ప్రసాద్ వర్మ
బ్యానర్ : గురు ఫిలిమ్స్        నిర్మాత : సునీత తాటి
రచన- దర్శకత్వం : రాజ్ పిప్పళ్ళ
విడుదల :  7 మార్చి, 2014   సెన్సార్ : U/A

***

2009 లో ‘బోణీ’ అనే థ్రిల్లర్ తో పరిచయమైన దర్శకుడు రాజ్ పిప్పళ్ళ మళ్ళీ ఐదేళ్లకి గానీ రెండో సినిమా తో ముందుకు రాలేదు. ‘బంగారు కోడి పెట్ట’ అనే టైటిల్ కి పోస్టర్లో ‘కోడిపుంజు’ బాకావూదడం కూడా ఒక కొత్త ప్రయోగమేనేమో ఈ సినిమాకిలాగే. తనమీద అంతర్జాతీయ సినిమాల ప్రభావం ఎక్కువ వున్నట్టు కన్పించే ఈ దర్శకుడు, తెలుగు సినిమాని ఎన్నారై  ప్రేక్షకులే గాకుండా విదేశీయులూ మెచ్చే  విధంగా తీయాలన్నదే తన భవిష్యత్  లక్ష్యమనీ,  తెలుగు సినిమాకి అంత స్కోపు ఉందనీ  ‘బోణీ’ విడుదల సందర్భంగా వెల్లడించినట్టు గుర్తు. విదేశీయుల సంగతి తర్వాత- ముందు   ‘బోణీ’ తో తెలుగుప్రేక్షకుల్నే ఆకట్టుకోలేక పోయాక, కనీసం ఇప్పుడు ‘బంగారు కోడిపెట్ట’ తోనైనా తెలుగు మార్కెట్ కి అనుకూలంగా తను మారి వుండాల్సింది. తన అభిమాన ‘స్టోరీ’ గ్రంథ రచయిత రాబర్ట్ మెక్ కీ అదే గ్రంథంలో పేర్కొన్నట్టు- కొత్త దర్శకులు ముందు కమర్షియల్ సినిమాలతో చేయితిప్పుకుంటే, ఆ తర్వాత ప్రయోగాల జోలికెళ్ళొచ్చు- అన్న హెచ్చరికని ఖాతరుచేసి వున్నా మళ్ళీ ఈ కోడిపెట్ట ప్రయోగం జరిగేది కాదేమో!


‘స్వామి రారా’ విజయోత్సాహంతో వున్న హీరోయిన్ కలర్స్ స్వాతి కి  అలాటిదే థ్రిల్లర్ గా ‘బంగారు కోడి పెట్ట’ ఆఫర్  ఆకర్షించి వుండొచ్చు. అలాగే కలర్స్ స్వాతితో నటిస్తే ట్రాక్ రికార్డు బాగుపడుతుందని కొందరు యువహీరోల సాక్షిగా ధృవీకరించుకుని ఈ సినిమాకి నవదీప్ ఉద్యుక్తు డైవుండొచ్చు. ఇద్దరికీ అసలీ సినిమా కథతో ప్రయోగాలెందుకని ఇప్పుడన్పిస్తూ వుండొచ్చు.

దర్శకుడిది విచిత్రవాదం. మూడు కథలతో తీసిన ఈ సినిమాలో ఏ ఒక్క దాన్తోనైనా ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతారా అని! అందుకే ఈ ప్రయోగమట! ఇదెలా వుందో ఇప్పుడు చూద్దాం..

ఓ సంక్రాంతి రోజు పొద్దున్నే  హైదరాబాద్ – బెంగళూరు హైవే మీద పాత కారులో నాలుగు ఎనర్జీ డ్రింక్స్ అట్ట పెట్టెలతో పరారవుతున్న వంశీ (నవదీప్) అనుకోకుండా దొరబాబు (ఫైట్ మాస్టర్ రామ్) తో ఘర్షణ పడి కాల్చేస్తాడు. శవాన్ని మాయం చేయడానికి కారు దిగినప్పుడు ఆ కారు మాయ మవుతుంది. దాని కోసం పరిగెడుతోంటే ఇంకో కారు వచ్చి గుద్దేస్తుంది...కళ్ళు బైర్లు కమ్ముతున్న వంశీకి  గతమంతా మెదులుతుంది.


ఆ గతంలో- హైదరాబాద్ లో వంశీ పనిచేస్తున్న ఎనర్జీ డ్రింక్స్ కంపెనీలోనే భానుమతి పినిశెట్టి (స్వాతి) కూడా సేల్స్ ప్రమోటర్ గా పనిచేస్తుంటుంది. వంశీకి చిల్లర దొంగగా పోలీస్ రికార్డు వుంటుంది. భానుమతి కూడా నకిలీ సర్టిఫికేట్లతో ఈ ఉద్యోగంలో చేరి వుంది. నిజానికీమ నైన్త్ కూడా పాసవలేదు. ఇదో రోజు పసిగట్టిన మేనేజర్ మూర్తి (హర్షవర్ధన్ ) ఆమెని డిస్మిస్ చేసేస్తాడు. అలా ఉద్యోగం పోగొట్టుకున్న భానుమతి ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుంది. డబ్బు సంపాయించుకోవడానికి ఆమెకో మార్గం తడుతుంది. కంపెనీ నిర్వహించిన ఓ లక్కీ విన్నర్ పోటీల్లో గెలుపొందిన వారికోసం కంపెనీ బెంగళూరు నుంచి డ్రింకు పెట్టెల్లో ఆ బంగారాన్ని  స్మగుల్ చేసి తీసుకొస్తున్నటు ఆమెకి తెలుస్తుంది. వంశీ సహాయంతో ఆ ట్రక్కుని హైజాక్ చేసి, బంగారం కాజేసేందుకు ప్లానేస్తుంది.

మరో వైపు ఓ పిజ్జా డెలివరీ బాయ్ వేణు ( సంతోష్) అనే కుర్రాడు సినిమా హీరో అవ్వాలన్న పిచ్చితో సినిమా కంపెనీల చుట్టూ తిరుగుతుంటాడు. ఊళ్ళోంచి  తల్లి చేసే కాల్స్ కి కూడా స్పందించకుండా ఆడిషన్స్ ఇస్తూ విఫలయాత్నాలు చేస్తూంటాడు.

ఇంకో వైపు భీమవరంలో రైతు సోదరులు దొరబాబు - ఎర్రబాబు (ఫైట్ మాస్టర్ లక్ష్మణ్) లు వాటాలు పంచుకుని విడిపోతే, సరైన వాటా దక్కని దొరబాబు అప్పుల్లో ఉంటాడు. పేకాడి మరింత అప్పుల్లో పడతాడు. అప్పులోడి బాధ పడలేక సంక్రాంతి కోడిపందాలప్పుడు తమ్ముడి కోడిని కాజేసి అప్పు తీర్చేందుకు బయల్దేరతాడు. ఆ కోడితో క్లోజ్ గా వుండే తమ్ముడి కూతురు (సంచలన ) కూడా వెంట హైదరాబాద్  వచ్చేస్తుంది. ఇదే అదును అనుకున్న అప్పులోడి గ్యాంగ్ కోడితో బాటూ దొరబాబునీ, ఆ అమ్మయినీ కిడ్నాప్ చేసి,  ఎర్రబాబుకి రెండు కోట్లు డిమాండ్ పెడతారు.

ఇదీ విషయం. ఈ మూడు కథలూ ఇక ఎప్పుడు ఎక్కడ ఎలా లింక్ అయ్యిందీ, అప్పుడేమేం జరిగాయన్నదీ  మొత్తం క్లైమాక్స్ లో వెల్లడవుతుందన్న మాట!

ఎలాటి హీరోయిజాలూ, హీరోయినిజాలూ లేని,  ఎలాటి ఫన్నూ స్పార్కూ కూడా కన్పించని  పేలవమైన పాత్రచిత్రణల్లో వె ల వెల బోయారు నవదీప్, స్వాతీలు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు సైతం డిటో. వాళ్ళ ఇమేజికి తగ్గట్టుగా వేడి పుట్టించడం మానేసి  మరీ సాత్విక పాత్రల్లో నీరసించి పోయారు. పిజ్జా బాయ్ గా నటించిన సంతోష్ ది ఓవరాక్షన్. ఇవన్నీ ఫ్లాట్ క్యారక్టర్లు కాగా, మేనేజర్ గా  నటించిన హర్షవర్ధన్ ది  రంగు మార్చే ఊసరవెల్లి పాత్రకావడం వల్ల నేమో కాస్త ఆసక్తికరంగా కన్పిస్తాడు.

సంగీతపరంగా, ఇంకా సాంకేతికంగానూ  కళాత్మకంగానూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ సినిమా లేదు. తక్కువ బడ్జెట్లే అయినా, అట్టర్ ఫ్లాపులే అయినా, దృశ్య సౌరభాలతో, సంగీత బాణీలతో సాంకేతికంగా ‘నా రాకుమారుడు’, ‘లవ్యూ బంగారం’ లాంటి  యూత్ సినిమాల్ని ఓ పక్క తీస్తూంటే, ఇంకా పాత చింతకాయ ఛాయాగ్రహణాలతో, పాటలతో, నేపధ్య సంగీతాలతో లక్ష్యిత ప్రేక్షకుల పట్టింపే లేని ఆత్మాశ్రయ ధోరణిలో పడిపోయి కొందరు కొత్త దర్శకులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఫ్లాపే అయినా కనీసం మంచి సాంకేతిక విలువలతో ‘బోణీ’ తీసిన ఈ దర్శకుడు  ఈసారెందుకో అలసత్వం ప్రదర్శించాడు. ఐదేళ్ళ కాలగమనం మహాత్మ్యం కావొచ్చు!

స్క్రీన్ ప్లే సంగతులు
‘బోణీ’ లో లోపించిన కథన చాతుర్యమే, పాత్ర చిత్రణల వైఫల్యమే  తు.చ. తప్పకుండా ఈసారికూడా  కొనసాగాయి. తనే చెప్పుకున్నట్టు ఒక పూర్తి స్థాయి కథ తో సక్సెస్ ని నమ్ముకోలేకా  అన్నట్టు- మూడు బుల్లి కథల తో కలిపి ఈ సినిమా తీస్తున్నప్పుడు –ఈ బహుళ కథా సంవిధానం డిమాండ్ చేసే విలువల్నైనా పరిశీలించి వుండాల్సింది. రెండోది, ప్రయోగాత్మక సినిమాకి తెలుగులో ప్రేక్షకాదరణ ఆర్టు సినిమాలకి లాగే బహు తక్కువన్నదీ తెలుసుకుని ఉండాల్సింది.

ఇందులో ఏకథకా కథ చూసినప్పుడు ప్రతీ కథా మూడంకాల నిర్మాణంలో ఉండాల్సిందే. ఈ  సినిమాలో అలాగే వున్నాయి. అయితే వాటిలో బలం, వేగం లోపించాయి. కథలు మూడున్నా ప్రధాన కథ ఒకటుంటుంది. ఇందులో ప్రధాన కథ నవదీప్-స్వాతీలది. ప్రధాన కథలోని ప్రధాన పాత్ర (స్వాతి) తో అంతిమంగా మిగతా రెండు కథల్లోని ప్రధాన పాత్రలు (ఫైట్ మాస్టర్ రామ్- సంతోష్)లు కీలక ఘట్టంలో సంఘర్షించాలి. కానీ జరిగిందేమిటంటే ఇవి రెండూ ప్రధాన కథలోని సహాయ పాత్ర (నవదీప్) తో సంఘర్షిస్తాయి.

ఏ కథకి కూడా రెండు ప్రధాన పాత్రలుండవు. కానీ ఈ సినిమాలో నవదీప్- స్వాతి లవి రెండూ ప్రధాన పాత్రలే అన్నట్టుగా నడిపారు. సమస్య స్వాతిది, డబ్బు ఆమె కవసరం. ఫస్టాఫ్ యాభయ్యోవ నిమిషంలో హైజాక్ ప్లాను ఆమె నవదీప్ కి ప్రస్తావించి అతడి సహాయం కోరుతుంది. అలా కథని ప్రారంభిస్తూ రెండో అంకం లోకి తనే తీసికె ళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర తనే ఓ మలుపుకి కారణం అవుతుంది. ఇలా కథ ఆమె పరంగా నడుస్తున్నప్పుడు- నవదీప్ ప్రధాన పాత్ర కాలేడు. క్లైమాక్స్ లో కొచ్చేసరికి ఇతనితోనే మిగతా రెండు కథల నాయకులూ కథని  మలుపు తిప్పుతారు.
ఈ సినిమా చాలా బోరు కొడుతుందంటే కారణం ఇదే. ప్రధాన కథలో ప్రధాన పాత్రకి ఏకసూత్రత లోపించడంతో, ఆడియెన్స్ అనుభూతించే కథనం దెబ్బతినిపోయింది.

రెండోది ఇంటర్వెల్లో స్వాతి ఓ మలుపుకి కారణమైనట్టు చూపించి, తీరా సెకండాఫ్ ప్రారంభిస్తూ అది ఉత్తుత్తి సంఘటనే అని తేల్చేశారు. ఇలాకూడా కథ వెన్నెముకని విరిచేశారు. ఒకసారి ఏ క్రింది  చిత్రంలో చూస్తే,  మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) అనేది ప్రధాన పాత్ర ఆశయ సాధనకి ఎంత కీలక ఘట్టంగా (అనుకూలంగా లేదా ప్రతికూలం గా ) ఉండాలో స్పష్టమౌతుంది.


ఇక పేరుకి ప్రధాన కథలో మూడం కాలైతే వున్నాయే గానీ, ప్రధానంగా స్క్రీన్ ప్లే కి  ఆయువుపట్టు వంటిదైన రెండో అంకం బిజినెస్ నిర్వహణ కూడా మొదటి అంకం బిజినెస్ నిర్వహణా లక్షణాలతో నింపేశారు! అంటే క్లైమాక్స్ వరకూ మొదటి అంకమే నడుస్తున్నట్టు పేలవంగా ఉంటుందన్నమాట. మనభాషలో చెప్పుకోవాలంటే ఇది మిదిల్ మటాష్ స్క్రీన్ ప్లే!
ఇలాటిది చూసి చూసి విరక్తి పుట్టే స్టీవెన్ స్పెల్ బెర్గ్ పక్క చిత్రంలో లా కామెంట్ చేశాడు. ..





contd..