రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 21, 2014

రివ్యూ..


ఈ 'జర్నీ' దారితప్పింది!

విక్రం ప్రభు, సురభి, హరిరాజన్, వంశీకృష్ణ, గణేష్ వెంకట్రామన్ తదితరులు
సంగీతం : సి. సత్య        ఛాయాగ్రహణం : శక్తి    యాక్షన్:  రాజశేఖర్   కూర్పు : శ్రీకర్ ప్రసాద్ 
బ్యానర్ :  లక్ష్మి గణపతి ఫిలిమ్స్     నిర్మాత : సుబ్రహ్మణ్యం.బి 
రచన- దర్శకత్వం : శరవణన్. ఎం 
 విడుదల :  21 మార్చి, 2014 
***
2011లో రొటీన్ కమర్షియల్స్ నుంచి కాస్త ఆటవిడుపుగా  ‘జర్నీ’ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రతిష్టాత్మకంగా పరిచయమైన దర్శకుడు ఎం. శరవణన్- తిరిగి ఇప్పుడు ‘సిటిజన్’ అనే సోషియో థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిద్దామని విచ్చేశాడు. ఈ సినిమా తమిళంలో ‘ఇవన్ వేరమాతిరి’ [అతను ను డిఫరెంట్] గా గత డిసెంబర్ లో విడుదలయ్యింది. దివంగత మహానటుడు శివాజీ గణేశన్ మనవడైన విక్రం ప్రభుని  హీరోగా, కొత్తనటి సురభిని  హీరోయిన్ గానూ తీసుకుని శరవణన్ ఈ సినిమాని కొత్తఆలోచన- కొత్త స్క్రీన్ ప్లే- కొత్త ప్రయత్నం- ప్రతీదీ కొత్తే- నంటూ ప్రచారం చేసుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకోబోయాడు.  

‘జర్నీ’తో మొదలైన అతడి వెండితెర ప్రస్థానం అంతే  సాంఘీక  ప్రయోజనంతో, క్రాసోవర్ సినిమాల వైపే ఇకపైన కూడా కొనసాగుతుందని ఊహించి ఉన్నవారికి, ఈ తాజా నజరానా ఏమిచ్చిందని విషయంలోకి తొంగి చూస్తే- సంభ్రమాశ్చర్యాలు కలక్క మానదు- దటీజ్ శరవణన్ అన్నమాట!

న్యాయవిద్యలో అన్యాయపాలన
2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై అంబేద్కర్ న్యాయ కళాశాల హింసాత్మక ఉదంతాన్నిఐడియా గా తీసుకుని, యువతరం తమ చుట్టూ జరిగే అన్యాయాలకి స్పందించి ప్రతిఘటించాలంటూ అంతర్లీన సందేశాన్నిస్తూ మొదలౌతుందీ సోషియో థ్రిల్లర్.

ఆ న్యాయ కళాశాలలో మంత్రి కోటాకింద కేటాయించాల్సిన అభ్యర్ధుల జాబితాని న్యాయ శాఖా మంత్రి ఆదిశేషయ్య (హరి రాజన్ ) పంపిస్తే, ఆ అభ్యర్ధులందరూ క్రిమినల్ కేసులున్న వాళ్ళని తిరస్కరిస్తాడు ప్రిన్సిపాల్. దీంతో  ఆదిశేషయ్య కొందరు విద్యార్థుల్ని ఎగదోసి కళాశాలలో విధ్వంసం సృష్టిస్తాడు. ముగ్గురు విద్యార్థులు చనిపోతారు. పోలీసులతో బాటు ప్రజలూ  ఇదంతా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఈ ఘోరాన్ని సహించలేకపోతాడు గుణశేఖర్ (విక్రం ప్రభు). బాధ్యుడికి శిక్ష పడాల్సిందేనని ఉద్యుక్తు డవుతాడు. ఇతను విజ్ కాం (విజువల్  కమ్యూనికేషన్స్ ) చదివిన నిరుద్యోగి. పక్కా ప్లాను వేసి ఆదిశేషయ్య తమ్ముడు ఈశ్వర్ (వంశీ కృష్ణ )ని కిడ్నాప్ చేసి ఓ నిర్మాణంలో వున్న భవనం టాయిలెట్లో బంధిస్తాడు.
ఈశ్వర్ ఆరు హత్యలు చేసి జైలుశిక్ష పడ్డ హంతకుడు. ఇటీవలే పదిహేను రోజులు పెరోల్ మీద విడుదలై వచ్చాడు. ఇతడ్ని కనపడకుండా చేస్తే, తిరిగి జైలు కెళ్ళకుండా ఆదిషేశయ్యే మాయం చేశాడన్న ఆరోపణ లెదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేస్తాడనీ, అదే అతడికి తగిన శిక్షవుతుందనీ గుణశేఖర్ అంచనా.
పెరోల్ గడువుతీరి తమ్ముడు కన్పించకపోవడంతో ఆదిశేషయ్య వేట మొదలెడతాడు. మరో వైపు ఈశ్వర్ ఉప్పందించడంతో ప్రతిపక్ష నాయకుడు గోలెడతాడు. తమ్ముడు దొరక్క ఆదిశేషయ్య రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో తన ఆపరేషన్ పూర్తయి ఈశ్వర్ ని విడుదల చేసేస్తాడు గుణశేఖర్.
బయటపడ్డ ఈశ్వర్ తనని బంధించిన ‘గుర్తు తెలియని’ యువకుడ్ని పట్టుకునేందుకు తన వేట మొదలెడతాడు. ఇలా వుండగా, గుణశేఖర్ కి ఒకమ్మాయి మాలిని (సురభి) పరిచయమై ప్రేమలో కూడా పడుతుంది. గుణశేఖరే ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేక పోతాడు. ఇంతలో ఆమె కన్పించకుండా పోతుంది....

ఇలా సాగే ఈ కథలో సాధారణ యువకుడి పాత్రలో హీరో విక్రం ప్రభు చాలా క్యాజువల్ గా కన్పిస్తాడు. అతడి రూపురేఖలు సాధారణ గల్లీ కుర్రాళ్ళని పోలి వుండడం కలిసివచ్చింది. ఎంత క్యాజువల్ గా కన్పిస్తాడో, యాక్షన్ సీన్లలో అంత విజృంభిస్తాడు. కొత్తనటి సురభి సైతం సాధారణ మధ్యతరగతి అమ్మాయి కి సరిపోయే హంగులతో వుంది. విలన్ గా వంశీ కృష్ణ  చాలా వయోలెంట్ గా కన్పిస్తాడు. ఆదిషేశయ్యగా హరిరాజన్, పోలీసు ఉన్నతాధికారిగా గణేష్ వెంకట్రామన్ కూడా ఫర్వాలేదు.

సంగీతానికీ, పాటలకీ పెద్దగా ప్రాధాన్యం లేదు అలాగే, యాక్షన్ డైరెక్ట్ రాజశేఖర్ సమకూర్చిన ఛేజింగ్స్, ఫైట్స్ అతి  హింసాత్మకంగా వున్నాయి. వీటికే భారీగా ఖర్చు పెట్టివుంటారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్ గానే వుంది, అయితే అసలు విషయమే సరుకులేనిదిగా వుంది.

దర్శకుడు శరవణన్ ఏదో ఎత్తుకుని ఇంకేదో ఎత్తేశాడు. ఈ సినిమాతో అతను వాస్తవిక సినిమా, ప్రయోగాత్మక సినిమా అనే కమిట్ మెంట్ల నుంచి పలాయనం చిత్తగిస్తూ –బిగ్ స్టార్స్ దృష్టిలో పడాలన్న తపన పెంచుకుని- ఒక పాత మూస యాక్షన్ ఫార్ములా చుట్టేసి హమ్మయ్యా అనుకున్నాడు! ఇక ఎవరో సూపర్ స్టార్ నుంచి కాల్ రావడమే తరువాయి...

స్క్రీన్ ప్లే సంగతులు..
నిజానికి శరవణన్ కి వాస్తవిక సినిమా మీద అవగాహన లేనట్టే, యాక్షన్ సినిమా కూడా తీయడం రాదు. మొదటి సినిమా ‘జర్నీ ‘ తీసినప్పుడు అది పేపర్లో చదివిన  ఘోర రోడ్డు ప్రమాద వార్త అని తనే చెప్పుకున్నాడు. అలా హైవే ప్రమాదాల గురించి సందేశాన్ని అందించడమే తన ధ్యేయమని చెప్పాడు. మూడు జంటల ప్రేమాయణాన్ని అకస్మాత్తుగా చివర్న రోడ్డు ప్రమాదం పాల్జేసి –అక్కడ్నించీ రోడ్డు ప్రమాదాల మీద డాక్యుమెంటరీలా ఎత్తుకున్నాడు. సినిమా బాణీ మారిపోయింది, వరస మారిపోయింది. ఒక సినిమా స్క్రీన్ ప్లేకి చివర్లో న్యూస్ ఐటెం జోడించిన అక్రమంగా కళ తెలిసిన సినిమా జీవులు ఆక్రోశించేలా చేశాడు. 

రోడ్డు ప్రమాదాలు అనేది  నాన్ ఫిల్మిక్ థీం. అందుకే  దాన్ని సినిమా కథగా మల్చడంలో విఫలమయ్యాడు. మరి ఈ సినిమా ఎందుకు గుర్తుండి పోతుందంటే – ఇందులో అనితరసాధ్యంగా –మూస ఫార్ములా జోలికి పోకుండా- క్రాసోవర్ సినిమాని తలపిస్తూ -అత్యంత సహజ ధోరణిలో మూడు ప్రేమ కథల్ని సృష్టించ గల్గాడు గనుక!


ప్రస్తుత సినిమాలోనూ 2008 నాటి సంఘటనంటూ వాస్తవిక ధోరణిలో మొదలెట్టి, దానికి మూసఫార్ములా కథనం జోడించేసి- కొత్తఆలోచన- కొత్త స్క్రీన్ ప్లే- కొత్త ప్రయత్నం- ప్రతీదీ కొత్తే- నంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ చెప్పిన నాల్గు ‘కొత్తల్లో’ ఏదీ సినిమాలో జాడలేదు. నిజానికి 2008 నాటి ఆ నిజ సంఘటన కులాల పోరుకు సంబంధించింది. హిందీలో ప్రకాష్ ఝా కూడా ఇలాగే రిజర్వేషన్ సమస్య (1990 నాటి మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం) మీద కాలేజీ సినిమా (ఆరక్షణ్ -2011)అంటూ అగ్రవర్ణ పాత్రలో అమితాబ్ బచ్చన్ నీ, దళిత విద్యార్థి పాత్రలో సైఫలీ ఖాన్ నీ చూపించి- తీరాచూస్తే, ఆ సమస్య ఎలా చెప్పాలో తెలియనట్టు, కథ మధ్యలోనే వదిలేసి- ప్రైవేటు కాలేజీల అక్రమాలంటూ వేరే కథ ఎత్తుకుని సాగిపోయాడు!

శరవణన్ కూడా కులాల పోరు గురించి చెప్పలేకపోయినా, కనీసం ఆ ఎత్తుకున్న న్యాయ కళాశాలల్లో రాజకీయ జోక్యం పాయింటు నైనా ఆలోచనాత్మకంగా చర్చించి వుంటే ఒక మంచి సినిమా అయ్యేది.

పాయింటుకి వేరే తెలిసిన రొటీన్ యాక్షన్ ఫార్ములానే జోడించడంతో తను ‘జర్నీ’తో పొందిన మన్నన కూడా కోల్పోయాడు. సరే, ఈ మూస ఫార్ములా కూడా సవ్యంగా ఉందా అంటే ఇందులోనూ  హస్యాస్పదమైన గిమ్మిక్కులెన్నో!

కొత్త స్క్రీన్ ప్లే అన్నప్పుడు – హీరో లక్ష్యం ఇంటర్వెల్లోనే పూర్తవడం కొత్త స్క్రీన్ ప్లేనా?కొత్త స్క్రీన్ ప్లే అన్నప్పుడు – హీరో లక్ష్యం ఇంటర్వెల్లోనే పూర్తవడం కొత్త స్క్రీన్ ప్లేనా? అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో అదైనా తెల్సా? అసలంటూ రూల్స్ తెలిసి ఉంటేనే కదా ఆ రూల్స్ ని ఎలా బ్రేక్ చేసి  కొత్త ప్రయోగం చేయాలో తెలిసేది?


ఈ కథని మూడంకాల స్క్రీన్ ప్లే లో అమర్చి చూస్తే  ఇలా వుంటుంది : మొదటి పదిహేను నిమిషాల్లోనే కాలేజీ హింస, హీరో రియాక్షన్, కిడ్నాప్ జరిగిపోయి మొదటి అంకం ముగిసిపోతుంది, రెండో అంకంలో కిడ్నాపైన తమ్ముడి కోసం మంత్రి వేట, హీరోతో హీరోయిన్ ప్రేమాయణం,  మంత్రి  రాజీనామా, హీరో ఆశయం నెరవేరడం జరిగి ఇంటర్వెల్  వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఇదే రెండో అంకం రెండో భాగంలో హీరో మీద పగ దీర్చుకోవడం కోసం విలన్ (మంత్రి తమ్ముడు) వేట, హీరోయిన్ కిడ్నాప్, హీరోయిన్ కోసం హీరో వెతుకులాట జరిగి, ఆమె ఎక్కడుందో కనుక్కోవడంతో రెండో అంకం ముగుస్తుంది. ఇక మూడో అంకం ప్రారంభమై హీరో విలన్లమధ్య ఫైట్, విలన్ ని చంపి హీరోయిన్ని హీరో పొందడంతో కథ ముగుస్తుంది.

సమస్యెక్కడ వచ్చిందంటే, ఇంటర్వెల్లో హీరో ఆశయం నెరవేరిపోవడంతో అక్కడే కథ ముగిసిపోయింది. సెకండాఫ్ లో హీరోకి అశయంలేదు, లక్ష్యంలేదు. అందుకే అతను కథలో బేకారుగా, పనిలేక ప్యాసివ్ గా వుంటున్నట్టు ఫీలింగ్ ఏర్పడి బోరుకోట్టడం ప్రారంభిస్తుంది. ఆశయమంతా సినిమా బాక్సాఫీసు విజయానికే ఆత్మహత్యా సదృశంగా, అసహజంగా విలన్ కే ఏర్పడ్డంతో- హీరోయిజం పూర్తిగా పక్కకు తప్పుకుంది. రెండోది, ఫస్టాఫ్ లో ఎలాటి కథైతే నడిచిందో, అదే సెకండాఫ్ లో రిపీటవుతుంది. కాకపోతే పాత్రలు తారుమారయ్యాయి. ఫస్టాఫ్ లో విలన్ ని హీరో కిడ్నాప్ చేసి మంత్రిని పరుగులు పెట్టిస్తే, సెకండాఫ్ లో విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేసి హీరోని పరుగులు పెట్టిస్తాడు...నఅలాగే దీన్ని (హీరోయిన్ని) నన్ను అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఎలా దెబ్బ కొట్టాడో, అలాగే దీన్ని అడ్డం పెట్టుకుని వాణ్ణి దెబ్బ కొట్టాలి-అంటాడు విలన్. ఇది చాలా హాస్యాస్పదమైన కథా పథకం. ఫస్టాఫ్ కథనాన్నే సెకండాఫ్ లోనూ  చూపిస్తానంటే అదెలాటి కొత్తదనమున్న స్క్రీన్ ప్లేనో దర్శకుడికే తెలియాలి.

మూడోది, విలన్లకి (తండ్రీ కొడుకులకి) తమ ప్రత్యర్ధి ఎవరో చివరి వరకూ తెలీదు. క్లైమాక్స్ దాకా హీరో ముఖాముఖీ కానేకాడు. సాధారణ సూత్రాల ప్రకారం ముఖాముఖీ ఎప్పుడవుతారో అప్పట్నించే సినిమాలో అసలు కథ ప్రారంభ మైనట్టు లెక్క. ఈ సినిమాలో క్లైమాక్స్ లో నే ముఖాముఖీ అయ్యారు గనుక, ఇక్కడే అసలు కథ ప్రారంభ మయ్యిందనుకోవాలి. ఇలా మూడో అంకంలో కథ ప్రారంభం అయ్యిందంటే అంతవరకూ రెండో అంకం లేకుండా మొదటి అంకమే చాంతాడంత సాగిందన్నమాట. అప్పుడిది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది.  స్పీల్ బెర్గ్ మాటల్నే ఇక్కడా  ఉటంకించుకుంటే -

ఇదీ విషయం. ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్లో ముగిసి పోయిన కథని మళ్ళీ ఎత్తుకోవడమంటే, అది సినిమాలకి పనికిరాని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కిందకొస్తుంది. ఎపిసోడ్లుగా సాగే టీవీ సీరియళ్ళకి పనికిరావొచ్చు. 2003లో నందమూరి హరికృష్ణ నటించిన ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ ఇలాగే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడి విడివిడి ఎపిసోడ్లుగా సాగి ఫ్లాపయ్యింది.

ఇక ఉన్న స్క్రీన్ ప్లే లోనే కథనం కూడా ఎలా వుందో ఒక్క శాంపిల్ చూస్తే  చాలు. విలన్ని బంధించి ఉంచిన టాయిలెట్ బయటే హీరో, హీరోయిన్ బ్యాంక్ ఎక్కౌంట్ నంబర్ అడిగి తెలుసుకుంటూ- లోపల విలన్ కి వినపడేలా గట్టిగా ఆ నంబర్ రిపీట్ చేస్తాడు. దర్శకుడు ఇలా ఎందుకు చేశాడంటే, తర్వాత ఆ  నంబర్ పట్టుకుని విలన్ హీరోయిన్ని పట్టుకునేందుకట!

అంత ప్రమాదకరమైన ఖైదీ అయిన విలన్ పెరోల్ మీద వచ్చి ఇంకో హత్య కూడా చేస్తాడు. అసలతడికి పెరోల్ దొరికే అవకాశం ఏకోశానా లేదు. మరీ తప్పదనుకుంటే కస్టడీ పెరోల్ లభించాలి. అంటే ఎస్కార్టుగా పోలీసులుంటారు. అదీ చాలా ఎమర్జెన్సీ విషయానికి  ఆరుగంటల పాటు మాత్రమే అమలయ్యే పెరోల్ గా లభిస్తుంది. అసలీ తమ్ముడు కన్పించకపోతే మంత్రి ఆయన అన్న ఎలా బాధ్యుడవుతాడో అంతుపట్టదు. తక్షణం  ఎందుకు రాజీనామా చేయాలో కూడా ఓ పట్టాన అర్ధంగాదు!

బందీగా ఉంచుకున్న విలన్ని పనిపూర్తయ్యాక హీరో ఇంటర్వెల్లో పోలీసులకి దొరికేలా చేయకుండా, ఊరిమీదికి వదిలేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం- 'అతను డిఫరెంట్' అనడానికి నిదర్శనమేమో? 


-సికిందర్