స్క్రీన్ ప్లే ప్రయాణంలో మజిలీలు అక్కర్లేదా?
ఆరోజుల్లో కే ఏ అబ్బాస్ స్క్రిప్టు రాసుకొస్తే షోమాన్ రాజ్ కపూర్ శుభ్రంగా తలంటు
పోసుకునిగానీ ఆ స్క్రిప్టుని ముట్టుకునే వాడు కాదట. దాన్నో పవిత్రగ్రంధంలా కళ్ళకద్దుకుని, నెత్తిన పెట్టుకుని
పూజ గదిలోకి వెళ్ళే వాడట. ఆ స్క్రిప్టుకి పూజాదికాలు
అవీ పూర్తిచేసి తెచ్చుకుని, అప్పుడు మాత్రమే దాని ముందు భక్తి భావంతో మోకరిల్లి, ఏకబిగిన ఉచ్చ స్వరంతో చదివేసేవాడట!
అలాటి పవిత్ర గ్రంధం
ఇప్పుడు స్క్రిప్టు కాదు. ఓ నిర్మాత తయారైన స్క్రిప్టు పట్టుకుని బోల్డు భక్తి
శ్రద్ధలతో వెళ్లి తిరుపతి వెంకన్నని దర్శించుకున్నాడు. తిరిగొచ్చి కలం పట్టుకుని
తన టాలెంటు ప్రదర్శనతో దాన్ని చెండాడేడు. అది దేవుడి కాపీ అన్న స్పృహే లేకుండా
పోయింది. దాన్ని నానా కంగాళీ చేసి ఫెయిర్ చేయడానికి ఇచ్చాడు. దేవుడి దగ్గర
మొక్కించిన కాపీని చెత్తబుట్ట దాఖలు చేశాడు. మనకెందుకులే అని ఈ రచయిత దాన్ని ఫెయిర్
చేసిచ్చాడు. ఆ దెయ్యం కాపీతో సినిమా తీశాడు నిర్మాత. సహజంగానే ఆ దేవుడి దయవల్ల దానికి
దరిద్రం చుట్టుకుంది!
ఈ తరహా ధోరణికి కారణం
స్క్రిప్టు కంటే కెమెరా ఉన్నతమైనదని భావించడమే. ప్రాక్టికల్ గా తెర మీద కదిలే బొమ్మల్ని
సృష్టించే కెమెరాని మించిన సృజనాత్మక ఉపకరణం ఏదీ లేదనుకోవడమే. కెమెరాకి వుండే అన్ని
భౌతిక సూత్రాల్లాంటివే స్క్రిప్టుకీ ఉంటాయని
అంగీకరించక పోవడంవల్లే స్క్రిప్టంటే చిన్నచూపు - దాంతో చిల్లరమల్లర ఫలితాలూ.
స్క్రిప్టులో అంతర్భాగమైన స్క్రీన్ ప్లే అనే క్రియేటివ్ టూల్ కి
కెమెరాకి ఉన్నట్టే పాటించాల్సిన రూల్సూ వున్నాయి. ఈ రూల్సు లోతుల్లోకి వెళ్తే అదొక అనంతమైన
శాస్త్ర మౌతుంది. ఇది గుర్తించకుండా సినిమా అంటే కేవలం కెమెరా
రూల్సేనని నమ్మడం వల్ల ఏమీ ప్రయోజనం వుండదు.
సినిమా ఆఫీసు తీస్తున్నప్పుడు అన్ని వాస్తు సూత్రాలూ పట్టించుకుని, తీరా స్క్రిప్టు
కి కూడా వుండే అలాటి ‘వాస్తు’ విలువల్నే తెలుసుకోకపోతే
– అలాటి సినిమాతీసి కాశీకి ప్రయాణం కట్టడమే.
స్క్రీన్ ప్లే కీ ‘వాస్తు’
వుంటుంది. ‘వాస్తు’ దోషాలుంటాయి. సరిదిద్దుకుంటే సత్ఫలితాలుంటాయి. ప్రజాస్వామ్యమనే
మహాసౌధానికి మూల స్తంభాలు నాల్గున్నట్టే, స్క్రీన్ ప్లే కీ ఐదు మూల స్తంభాలుంటాయి.
అవి ప్లాట్ పాయింట్స్ -1, 2 లు, మిడ్ పాయింట్, పించ్ పాయింట్స్ -1, 2 లు. ప్రజాస్వామ్య
మూల స్తంభాలలో ఏ ఒక్కటి చాప చుట్టేసినా ప్రమాదమన్నట్టుగానే, స్క్రీన్ ప్లే సౌధం లో
ఈ ఐదింటిలో ఏ ఒక్క మూల స్తంభం లోపించినా, లేదా బలహీన పడ్డా అది కుప్ప కూలడమే అవుతుంది.
ఐదు స్తంభాల స్క్రీన్ ప్లే అనే సౌధంలో విడుదు
ల్లాంటి మూడు అంకాలుంటాయి. వీటిలో ఏ ఒక్కటి
వెళ్లి మరోదాన్ని (విడిదిని) దురాక్రమించినా మొత్తం ఆ ‘వాస్తు’ చెడిపోతుంది.
వేలసంవత్సరాలుగా వున్న
ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించే నవీన వాదులూ వున్నారు. వీరిని ఫస్టాఫ్- సెకండాఫ్ వాదులందాం.
వీరు స్క్రీన్ ప్లే కి ఒక నిర్మాణం చెప్పేసి అందులోనే కథ చెప్పలనడం అన్యాయమంటారు. ..
To be concluded..