రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, జనవరి 2014, మంగళవారం



ఇంటర్వ్యూ:

కళా దర్శకత్వం

తెలుగులో ట్రెండ్ ని మార్చింది నేనే!

కె. అశోక్ కుమార్ 

సినిమా కళాదర్శకత్వం పుట్టిల్లు కూడా నాటకరంగమే. తొలి ఆర్ట్ డైరెక్టర్ శిల్పి. 1910 లో ‘పుండలీక్’ అనే నాటకాన్ని నాటకం నడుస్తూండగా యథాతధంగా చిత్రీకరించాడు ఆర్.జి. టోర్నీ అనే ఔత్సాహికుడు. అదే మనదేశంలో మొట్టమొదటి చలనచిత్ర మయ్యింది. తర్వాత 1913 లో స్వయంగా కథ రాసుకుని ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మించాడు దాదా సాహెబ్ ఫాల్కే. అప్పట్లో రంగ స్థల నాటకాలుగా పౌరాణికాలే వుండడం చేత తెలుగులో కూడా అవే సినిమాలుగా 1937 వరకూ రాజ్యమేలాయి. సినిమా కళాదర్శకత్వం అందుకే ఆ పౌరాణిక సెట్టింగులతో  వర్ధిల్లింది. 1938లో ‘మాలపిల్ల’ వచ్చిందగ్గర్నుంచీ కళాదర్శకత్వం పంథా మార్చుకుంది. నిత్యజీవితంలో జనం నివసించే ఇళ్ళు, వీధులూ కళా దర్శకత్వపు పరిధిలో కొచ్చాయి. ఆతర్వాత కలర్ సినిమాల్లో వెలుగు జిలుగుల భవంతులూ, ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ దాసోహులైన ప్రేక్షకులకోసం ఫాంటసీ  ప్రపంచాలూ కళా దర్శకత్వపు చేతికి చిక్కాయి.


అయితే సినిమా కళాదర్శకత్వం సినిమా స్టూడియోలోనే మొదలైందంటారు  ప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ కె. అశోక్ కుమార్ (నాటక రంగాన్ని తమ  పూర్వశ్రమంగా అంగీకరించాలంటే మనసొప్పదు చాలామంది సినిమావాళ్ళకి). ఆ రోజుల్లో కెమెరా సహా ఎక్విప్ మెంట్ అంతా  బయటికి మోయలేనంత మోత బరువు కాబట్టి, స్టూడియోల్లోనే సెట్స్ వేసి చిత్రీకరించే వాళ్ళనీ, అలా ఆ సెట్స్ కోసం కళాదర్శకత్వం  స్టూడియోల్లోనే పుట్టిందనీ అంటారాయన.


మహేష్ బాబు హిట్ ‘ఒక్కడు’లో చార్మినార్- ఓల్డ్ సిటీ సెట్ గుర్తుందా? అది అశోక్ కుమార్ అపూర్వ సృష్టే. ‘పౌర్ణమి’లో ఆలయం, ‘అరుంధతి’లో రాజకోట నిర్మాత కూడా ఆయనే. ‘వరుడు’ లో అట్టహాసంగా కట్టిన కళ్యాణ మండపం చూ  శారా? దీని సృష్టికర్త కూడా ఈయనే. అయితే చార్మినార్- ఓల్డ్ సిటీ నాటికి 70 శా తం  కళాదర్శకత్వం, 30 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ)గా వుంటే, కళ్యాణ మండపం నాటికి వాటి శాతాలు తారుమారయ్యా యంటారు అశోక్ కుమార్. అంటే  సీజీ వచ్చేసి కళా దర్శకత్వాన్ని మింగేస్తోందా? అదేమోగానీ సీజీ వల్ల  వీడియో పైరసీ మాత్రం తగ్గుతుందని కొత్త వ్యాపారసూత్రం. ఎందుకంటే అలాంటి  అద్భుతాల్ని వెండితెర మీద చూడ్డానికి ప్రేక్షకులు తప్పనిసరిగా ధియేటర్లకే వస్తారు కాబట్టి.

ఐతే ఒక కట్టడం పూర్తిగా కళా దర్శకుడి పనితనంగానే సినిమా విమర్శకులు సైతం పొరబడుతున్నారు కదా అంటే, సామాన్య ప్రేక్షకుల సీజీ పరిజ్ఞానం ఇప్పుడు కాదు, ఏనాడో పెరిగిందని సమాధానమిచ్చారాయన. అయితే ఈ సీజీ కూడా సాగిపోయే దశే అనీ, పదేళ్ళ క్రితం ఓసారి ఇలాగే వచ్చి వెళ్లి పోయిందనీ చెప్పుకొచ్చారు. పదేళ్ళ క్రితం ‘అంజి’, ‘సహస వీరుడు –సాగర కన్య’ వంటి ఫెయిల్యూర్ సేజీ లకి తనే ఆర్ట్ డైరెక్టర్ మరి!

హాలీవుడ్ కథలు, దృశ్యాలు మన సినిమాల్లోకి దిగుమతి అయినట్టు కళాదర్శకత్వం కోసం హాలీవుడ్ వైపు తను చూడ్డం లేదని స్పష్టం చేశారాయన. వాళ్ళ శైలి మనకు సరిపడదన్నారు. మరెక్కడ్నుంచీ ఇన్స్ పైరవుతా రంటే,  లైబ్రరీ చూపించారు. కలర్ స్కీమ్స్, డిజైన్స్, ఆర్కిటెక్చర్, కామిక్స్ మొదలైన విభాగాలకి చెందిన వందలాది పుస్తకాలు అక్కడ పేర్చివున్నాయి. ఆ పుస్తకాల్లో ఏ అంశం ఎక్కడుందో తన మస్తిష్కంలో ముద్రించుకు పోయిందన్నారు.

1986 లో మద్రాస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో విజువల్ కమ్యునికేషన్స్ లో పట్టభద్రుడైన ఈయన స్వరాష్ట్రం కేరళ. ప్రఖ్యాత  దర్శకుడు భరతన్ ఈయన పిన తండ్రే. 1989 లో ‘ప్రతాప్ పోతన్  ‘డైసీ’ కి కళా దర్శకత్వమిచ్చి ప్రోత్సహిస్తే, కమలహాసన్ తను నటిస్తున్న ‘ఇంద్రుడు-చంద్రుడు’ లో రెండు పాటలకి సిఫార్సు చేశారు. అది మొదలు డి. రామానాయుడు క్యాంపులో సినిమాలు చేస్తూ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. తెలుగులోనే అగ్ర దర్శకుల, అగ్ర హీరోల సినిమాలు 120 వరకూ పని చేశారు.

‘తెలుగులో కళా దర్శకత్వపు ట్రెండ్ ని మార్చింది నేనే ‘ అంటూ సగర్వంగా చప్పారు. ఏమిటా ట్రెండ్? అంటే ..కొత్త కలర్ స్కీమ్స్, హాఫ్ ఫ్లోర్ సెట్స్ వగైరా. కళా దర్శకత్వానికి కాణాచి అయిన తోట తరణి స్టైల్ కి ముగ్ధుడై, విరివిగా కలర్స్ వాడింది తానేనని చెప్పారు. తెలుగు సినిమాల్లో ఈ ట్రెండ్ ఇప్పటికీ ఇలాగే కొనసాగుతోందని చెప్పారు.
సరే, మంచి కళా దర్శకుడి లక్షణాలేమిటి? ఇంజనీరింగ్, టెక్నికల్, ఆర్కిటెక్చర్ స్కిల్స్ తో బాటు, ఒక మైన్యూట్ ఐడియా తడితే,  దాన్ని బ్రహ్మాండంగా విస్తరించే నైపుణ్యం కలిగివుండడం మంచి కళా దర్శకుడి లక్షణ మన్నారుఅశోక్ కుమార్.

అశోక్ కుమార్ నాయర్ కరలత్ ది అద్భుత కళా ప్రపంచం. సంస్కృతుల్ని ఔపోశన పట్టిన దివ్యానుభూతుల లోకం ఆయనది. కాకపోతే  ఒక్కటే లోటు. తెలుగు గ్రామీణ వాతావరణాన్ని తెలుసుకునే అవకాశం లభించలేదు. అలాటి సినిమాలకి పనిచేస్తే ఆ లోటు కూడా తీర వచ్చేమో. ఆయన దృష్టిలో కథని, పాత్రల్నీ తెలుసుకోకపోతే కళాదర్శకత్వం లేదు. అలాగే దర్శకుడికి కుడి పక్క కెమెరా మాన్, ఎడం పక్క కళా దర్శకుడూ లేకపోతే మంచి సినిమాకూడా లేదు.

ఇప్పుడాయన తనపక్కన తనే నిలబడుతున్నారు. దర్శకుడుగా మారుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పెద్ద సినిమాలకు కళా దర్శకత్వాన్ని వదులుకున్నారు కూడా. ఇది అభిమానులకి బాధాకరమే కావొచ్చు. దర్శకుడుగా నిరూపించుకుని ఆ బాధని మరిపించాల్సిన బాధ్యతంతా  ఆయన పైనే వుంది!

-సికిందర్
 (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)