రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, March 5, 2025


 

 

సక్సెస్ కి క్వాంటమ్ మెకానిక్స్ దారి చూపుతోంది...

Tuesday, March 4, 2025

1369 : స్క్రీన్ ప్లే సంగతులు


 

 దర్శకత్వం : త్రినాథ రావు నక్కిన
తారాగణం : సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, న్షూ, మురళీ శర్మ, అజయ్, శ్రీనివాస రెడ్డి, హైపర్ ఆది తదితరులు
కథ, మాటలు :  ప్రసన్న కుమార్ బెజవాడ, స్క్రీన్ ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ, సాయి కృష్ణ
సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం : నిజార్ షఫీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్,  జీ స్టూడియోస్
నిర్మాతలు : రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్
విడుదల : ఫిబ్రవరి 26, 2025

***
             ర్శకుడు నక్కిన త్రినాథ రావు నుంచి 'మజాకా' అనే మరో కామెడీ ఫిబ్రవరి 26 న పోటీ లేని సోలో రన్ ని ఎంజాయ్ చేస్తూ రిలీజైంది. కానీ ఆ సోలో రన్ ని క్యాష్ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కారణం కంటెంట్. బాక్సాఫీసుకి వెళ్ళే ముందు రైటింగ్ టేబుల్ మీద దీనికి పని మిగిలే వుంది. కానీ సరాసరి బాక్సాఫీసు ముందే రైటింగ్ టేబులేసుకుని గబగబా రాసిచ్చేసినట్టుంది. దీంతో కంటెంట్ కి క్వాలిటీ అనేది లేకుండా పోయింది.  ఒక వైపు ప్రేక్షకులు ఇతర భాషల్లో క్వాలిటీ  కంటెంట్ కి అలవాటు పడుతూంటే ఇంకా ఇలాటి సినిమాలు తీసే కాలంలోనే వున్నారు. ఈ కంటెంట్ క్వాలిటీ చెక్ చేయాలంటే దీని స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళాల్సిందే.

కథ

కృష్ణ (సందీప్ కిషన్), వెంకట రమణ (రావు రమేష్) లు తండ్రీ కొడుకులు. వెంకట రమణ భార్య చనిపోయింది. ఇప్పుడు కొడుకు పెళ్ళి చేద్దామంటే ఇద్దరు మగాళ్ళ మధ్య మా అమ్మాయిని పంపమని చెప్పేస్తున్నారు. అయితే తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఇంట్లో ఇంకో ఆడది వుంటుందని తెలుసుకుంటాడు వెంకటరమణ. తెలుసుకున్నదే తడవు యశోద (అన్షూ) అనే ఏజ్ బార్ అమ్మాయి ని చూసి వెంటపడతాడు. ఇటు కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ) అనే అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. ఇద్దరికీ ఈ ప్రేమ వ్యహారాలు అంత సులువుగా వుండవు చివరికెలాగో ఒప్పించుకుంటారు. ఇదీ బ్యాక్ గ్రౌండ్.
       
ఇప్పుడు తామిద్దరూ దొంగ చాటుగా వ్యవహారాలు నడుపుతున్నట్టు తండ్రీ కొడుకులకి ఎప్పుడు తెలిసిపోయింది
? తెలిసిపోయి ఏం చేశారు? అటు యశోదా మీరా ల మధ్య వున్న బంధుత్వమేంటి? ఆ బంధుత్వంలో వాళ్ళిద్దరి మధ్య ఇంకే సమస్య పెళ్ళికి అడ్డుగా వుంది? దీన్నెలా పరిష్కరించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ....ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

రోమాంటిక్ కామెడీ కథ. తండ్రీ కొడుకులు ఒకే కుటుంబంలోని ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం. ఇందులో ట్విస్ట్ అనుకుని కల్పించిన కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే, ఆ ఇద్దరమ్మాయిలకి ఒకరంటే ఒకరికి పడదు. అందుకని తండ్రీ కొడుకుల్ని పెళ్ళి చేసుకుని ఒకే ఇంట్లో ఎలా వుంటారు? ఇదీ సమస్య. దీన్నెలా పరిష్కరించుకున్నారు తండ్రీ కొడుకులనేది కథ. ఈ కథకి చేసిన కథనంగానీ, పాత్ర చిత్రణలు గానీ పైపైన రాసేసి పైపైన తీసేయడంతో నవ్వుల పాలయింది కామెడీ. ఇదంతా పూర్తి ఔట్ డేటెడ్ సినిమా తీయడానికి దారి తీసింది. ఫస్టాఫ్ ప్రేమలు, ఏవో కామెడీలు చేసి నెట్టుకొచ్చినా, తీరా సెకండాఫ్ లోకొచ్చేసరికి కథకి సరైన దారీ  తెన్నూలేక, నాటు- మోటు కామెడీలతో వూపిరాడక విలవిల్లాడింది. వూపిరి కోసం కథ చేస్తున్న ఆర్తనాదాలే సెకండాఫ్.

స్క్రీన్ ప్లే సంగతులు

ఓపెనింగ్ లో బీచిలో తాగి పడిపోయిన తండ్రీ కొడుకుల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అడుగుతాడు ఇన్స్ పెక్టర్. వాళ్ళిద్దరికీ ఎఫైర్స్ వున్నాయని తెలుసుకుని, తను నవల రాస్తున్నానని- దాచకుండా ఎఫైర్స్ చెప్పమని దబాయిస్తాడు. ఈ ఓపెనింగే తేలిపోయింది. ఇలా ఇప్పటికిప్పుడు ఇన్స్ పెక్టర్ నవల రాస్తున్నాని చెప్తే కన్విన్స్ అవడానికి రెడీగా వుండరు ప్రేక్షకులు. లీడ్ ఇవ్వాలి. అంటే ఇలా పైపైన రాసేసి పైపైన తీసేయకుండా, లోతు పాతుల్లోకి వెళ్ళాలి. అతడికి నవలలు రాసే పిచ్చి వుంటే ముందు పాత్ర పరిచయంతో ఎస్టాబ్లిష్ చేయాలి. అతను కేసుల కోసం గాక, నవల కేదైనా ఐడియా దొరుకుతుందేమోనన్న దృష్టితో నేరస్థుల్ని టార్చర్ చేస్తున్నట్టుంటే ఆసక్తి కల్గించే లీడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా ఐడియా కోసం తిరుగుతూ బీచికొస్తే, తాగిపడిపోయిన తండ్రీ కొడుకుల్ని చూసి ఇన్స్ ఫైర్ అయినట్టు చూపిస్తే పాత్రకి, ఓపెనింగ్ కి అందం చందం వుంటుంది.
       
ఇక తండ్రీ కొడుకులు ఇన్స్ పెక్టర్ కి చెప్పే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. పైన కథలో చెప్పినట్టు వెంకటరమణ కొడుక్కి సంబంధాలు చూస్తూంటే ఆడవాళ్ళు లేని ఇంట్లో పిల్లనివ్వమని వెనక్కి పంపించేస్తూంటారు. అటు కొడుకు కృష్ణ మీరాని ప్రేమిస్తూంటాడు. ఇక కొడుకు పెళ్ళి అవాలంటే తాను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని వెంకటరమణ యశోదతో ప్రేమలో పడతాడు. ఈ తండ్రీ కొడుకులకి ఆ హీరోయిన్లిద్దరూ లొంగరు. తర్వాత మెత్తబడతారు. తండ్రీ కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరు నడుపుతున్న వ్యవహారాలు బైటపడి పరస్పరం దొరికిపోతారు. అయితే మీరా యశోదా ఒకే ఇంట్లో వుంటున్న బంధువులని తెలుసుకుని షాకవుతారు. ఇదీ ఫస్టాఫ్ విషయం- కథ కాదు
, కథ ఇంకా మొదలవలేదు. ఎందుకంటే హీరోయిన్ల మధ్య బంధుత్వం హీరో లిద్దరితో వావివరసలకి అడ్డు కాలేదు. కేవలం హీరోయిన్ల బంధుత్వం రివీల్ చేయడానికే ఈ ఇంటర్వెల్. ఈ బంధుత్వమే ట్విస్టు అనుకున్నారు. వావివరసలకి బంధుత్వం అడ్డు కానప్పుడు ట్విస్టు ఎలా అవుతుంది? అదొక మలుపు (టర్నింగ్) మాత్రమే అవుతుంది.  తూర్పు- పడమర లో వావివరసలే అడ్డు- కాబట్టి అది మతిపోగొట్టే ట్విస్టు అయింది.

2. ఇంటర్వెల్ ప్రాబ్లం

అంటే ఇంటర్వెల్లో కూడా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింటు- 1కి రాలేదు. అంటే ఫస్టాఫ్ లో ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం కాలేదు. అంటే కథేమిటో ఇప్పుడు కూడా మనకి తెలియలేదు. కథేమిటో ఇప్పుడు సెకండాఫ్ ఓపెనింగ్ లో తెలుస్తుంది. బంధువులైన యశోదా మీరాలకి మధ్య బద్ధ వైరముందని. కాబట్టి ఈ తండ్రీ కొడుకులని  చేసుకుని ఒకే ఇంట్లో వుండలేరని. ఇదీ వాళ్ళిద్దరితో వీళ్ళిద్దరికీ ఏర్పడ్డ కాన్ఫ్లిక్ట్. అంటే ప్లాట్ పాయింట్ -1 ఇప్పుడు ఏర్పడిందన్న మాట. ఎక్కడో  ఫస్టాఫ్ లో 45 నిమిషాలకైనా రావాల్సిన ఫ్లాట్ పాయింట్-1, స్థానభ్రంశం చెంది మిడిల్ ప్రాంగణమైన సెకండాఫ్ ప్రారంభంలో వచ్చిపడింది. అంటే బిగినింగ్ వచ్చేసి మిడిల్ ని కబ్జా చేసిందన్న మాట. అంటే బిగినింగ్ విభాగమనే ఉపోద్ఘాతమే ఇంత బారుగా సాగిందన్న మాట. అంటే సుమారు ఈ గంటా 25 నిమిషాల సేపూ అసలీ సినిమా కథేమిటో తేలక తల్లడిల్లుతామన్న మాట!
       
స్ట్రక్చర్ రీత్యా కంటెంట్ ని విప్పిచూస్తే ఈ అనారోగ్యాలు కన్పిస్తాయి. ఇవి అనారోగ్యాలే కాదనుకుంటే నిరభ్యంతరంగా ఇలాగే చేసుకోవచ్చు. కథలో మిగతా సీన్లలో ఏదైనా సీనుని మధ్యలో ఆపేసి తర్వాత కలపొచ్చు. సీనస్ ఇంటరప్టస్ (దృశ్య భంగం అనొచ్చేమో) అంటారు దీన్ని. ఈ టెక్నిక్ ని ఇంటర్వెల్ సీనుకి కూడా వాడొచ్చు. అయితే ఇంటర్వెల్లో హీరోయిన్ల బంధుత్వం రివీల్ చేసినప్పుడు
, అది తండ్రీ కొడుకులతో పెళ్ళిళ్ళకి అడ్డొచ్చే బంధుత్వం కాదని తెలిసి పోతున్నప్పుడు, ఈ ఇంటర్వెల్ సీనుని మధ్యలో ఆపి  సెకండాఫ్ ఓపెనింగ్ లో పూర్తి చేయడం కుదరదు. ఎందుకంటే ఇంటర్వెల్లో బంధుత్వాన్ని రివీల్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడలేదు. అది కేవలం ఒక మలుపు (టర్నింగ్) మాత్రమే. దీన్నేదో ట్విస్టు అనుకుని, ఇంటర్వెల్ కి బావుందనుకున్నట్టుంది.
        
అజిత్ నటించిన ‘పట్టుదల’ లో త్రిషని కిడ్నాప్ చేసిన ముఠా, నిజానికి ఈ కిడ్నాప్ త్రిష పన్నిన పథకమేనని చెప్పినప్పుడు అది ఇంటర్వెల్ కి పూర్తి స్థాయి టర్నింగ్. సీనస్ ఇంటరప్టస్ జరగలేదు. కానీ సెకండాఫ్ మొదలు పెట్టగానే ఇంటర్వెల్లో చెప్పింది ఉత్తిదే అన్నప్పుడు  ఇంటర్వెల్లో ప్రేక్షకుల్ని చీట్ చేసినట్టయ్యింది. అంటే ఫేక్ ఇంటర్వెల్ అయింది.
        
మత్తు వదలరా లో కూడా ఇలాటిదే ఫేక్ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్లో ఏదో ఘోరం జరిపోతోందన్నట్టు సీనుని ఆపి
, సెకండాఫ్ లో ఓపెన్ చేసినప్పుడు - ఆ ఇంటర్వెల్ ఉత్తిదే నని చెప్పడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే. దీని బదులు ఆ తలుపు కొట్టిన వ్యక్తిగా బ్రహ్మాజీనే చూపించి ఇంటర్వెల్ వేసి వుంటే, సస్పెన్స్ క్రియేట్ అయ్యేది- చచ్చిపోయిన బ్రహ్మాజీ పాత్ర ఎలా బ్రతికి వచ్చిందన్న ప్రశ్నతో. 
       
ఇంటర్వెల్ సీనుకి సీనస్ ఇంటరప్టస్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందంటే -ఇంటర్వెల్లో మధ్యలో ఆపిన సీను వల్ల సస్పెన్స్ పుట్టినప్పుడు. అంటే ఇంటర్వెల్లో ఎవరో బయటి నుంచి దబదబ తలుపు బాదుతున్నారనుకుందాం. అంత వరకూ నడిచిన కథ ప్రకారం  హీరో కోసం పోలీసులు వెతుకుతున్నారనుకుందాం. అప్పుడు తలుపు బాదుతోంటే పోలీసులేనన్న భావం వస్తుంది
, ఇప్పుడు హీరో ఏం చేస్తాడన్న సస్పెన్స్ పుడుతుంది. ఈ ఇంటర్వెల్ తర్వాత  సెకెండాఫ్ ఓపినింగ్ లో హీరో తలుపు తెరిస్తే- ఎదురుగా పోలీసులు గాక ఇంటి ఓనర్ నిలబడి వుంటే - అప్పుడు సీనస్ ఇంటరప్టస్ అవుతుంది.

3. కాన్ఫ్లిక్ట్ నిర్వహణ ఇంతేనా?

కాబట్టి మజాకా సెకండాఫ్ ప్రారంభంలో చూపించిన కాన్ఫ్లిక్ట్ ని వెనక్కెళ్ళి ఇంటర్వెల్లోనే చూపించాలి. అప్పుడు స్ట్రక్చర్లో దోషం తొలగిపోతుంది. ఏమిటా కాన్ఫ్లిక్ట్? బంధువులైన హీరోయిన్లకి ఒకరంటే ఒకరికి పడదని, కాబట్టి తండ్రీ కొడుకులు వాళ్ళిద్దర్నీ కలిపి పెళ్ళిళ్ళు చేసుకుంటే అభ్యంతరం లేదనీ, మీరా తండ్రి (మురళీ శర్మ) అంటాడు. ఇదేమీ కొత్త పాయింటు కాదు- ఒకరంటే ఒకరికి పడని రెండు కుటుంబాల్ని కలిపి పెళ్ళి చేసుకునే కథలు వచ్చినవే. కాకపోతే ఇక్కడ పడకపోవడాన్ని హీరోయిన్లతో పెట్టారు. బావుంది, పాతలోంచి ఇన్నోవేట్ చేసిన ఐడియా.
       
ఇదే ఇన్నోవేషన్ని కాన్ఫ్లిక్ట్ తో కూడా చూపించాల్సింది... కానీ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ మళ్ళీ పాత మూసలోకే తిరగబెట్టింది. హీరోయిన్లిద్దర్నీ కలపడమెలా అని చూసి చూసి వున్న రొటీనే హీరోలిద్దరి గోల్ అయింది. కానీ దీన్ని రివర్స్ చేసి
, అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న హీరోయిన్లిద్దరి మధ్యా మరింత విద్వేష జ్వాలలు రగిలిస్తే ఎలా వుంటుందని  వ్యూహాత్మకంగా  గోల్ ని ఆలోచించలేదు.
       
అసలే విరోధంతో వున్న హీరోయిన్లని ఇంకా విడదీసే
, వాళ్ళు తట్టుకోలేక ఇక చాలనుకుని వాళ్ళే కలిసిపోయే పాఠంగా వుంటే ఇందులో చాలా డైనమిక్స్ వర్కౌట్ అవుతాయి. అంటే వేల్యూ యాడెడ్ స్క్రిప్టుగా అప్ గ్రేడ్ అవుతుంది.  ఇంకా విడదీసే ప్రయత్నాలతో కథనం యాక్షన్ లో వుంటుంది, కొత్త సిట్యుయేషన్స్ క్రియేటవుతాయి, హీరోలు పైకి హెల్ప్ గా, వెనుక విలన్లుగా డబుల్ గేమ్ ప్లే చేస్తారు, కథనం కొత్తగా మారితే కామెడీ కూడా కొత్తగా మారుతుంది, ఇంకా కొత్త మలుపులు కూడా ఎదురై థ్రిల్స్ పెరుగుతాయి.
       
ఇలా కాకుండా వాళ్ళని కలపాలన్న చాదస్తపు కథనంతో నేలబారుగా తయారయింది స్క్రిప్టు. ఇలా కలిపే ప్రయత్నాలు సిల్లీగా ఓ అయిదు సార్లు చేసి విఫలమవుతారు. వీటిలో పెళ్ళి దగ్గర ఒకటి
, చావుదగ్గర ఒకటి చేసే ప్రయత్నాలు లౌడ్ కామెడీ. ఇంత కంటే  క్రియేటివిటీ చేతగాలేదు. ఇక కలపలేమని తెలుసుకుని మీరా తండ్రినే అడుగుతారు. వెళ్ళి సపరేట్ గా పెళ్ళిళ్ళు చేసుకుని సపరేట్ గా కాపురాలు పెట్టమంటాడతను. ఈ ఆలోచన మనకి ముందెప్పుడో వస్తుంది. కథలో పాత్రలకి లేటుగా వస్తాయి. లేదా తండ్రీ కొడుకుల్లో ఒకరు పెళ్ళి చేసుకుని ఇంకొకరు త్యాగం చేయమంటాడు. ఇలా చెప్పి కూతురు మీరాకి  వేరే సంబంధం చూస్తాడు. వెంకటరమణ యశోదని లేపుకు పోయే ప్లానేస్తాడు. యశోదా కృష్ణని కొడుకులా చూడడంతో కరిగిపోయి, తాను పెళ్ళి మానుకుని తండ్రి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇలా కథ ఎలా పడితే అలా మలుపులు పెరుగుతూ చివరి అరగంట తెచ్చి పెట్టుకున్న త్యాగాలతో సీరియస్ అయిపోతుంది సెకండాఫ్.

4. ట్విస్టులంటూ టర్నింగులు

ఈ సెకండాఫ్ తో మెప్పించాలన్న ప్రయత్నంతో, స్పెషల్ ఎట్రాక్షన్  అనుకుంటూ కథకి చాలా ట్విస్టు లిచ్చామనుకున్నారు. అవి ట్విస్టులు కాదు సాధారణ టర్నింగులు. ట్విస్టులు  వేరు, టర్నింగు వేరు. ట్విస్టులో పజిల్ ఇమిడి వుంటుంది. అంటే చిక్కుముడితో వుంటుంది. ఈ చిక్కుముడిని విప్పడమే కథగా వుంటుంది. టర్నింగు కథని ముందుకు నడిపించే సాధారణ ప్రక్రియ. ట్విస్టు  ఎలా వుంటుందో ఉదాహరణకి-
        
1973 లో హాలీవుడ్ నుంచి  40 క్యారట్స్అనే సినిమా వచ్చింది. ఇది బేతాళ కథలా వుంటుంది. దీన్ని తమిళంలో కె బాలచందర్ కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ, మేజర్ సౌందరరాజన్, రజనీ కాంత్ లతో 1975 లో అపూర్వ రాగంగళ్గా తీశారు. దీన్నే దాసరి నారాయణరావు 1976 లో నరసింహ రాజు, శ్రీవిద్య, మాధవి, సత్యనారాయణ, మోహన్ బాబులతో తూర్పు -పడమరగా తీశారు.
          
కథలో  నరసింహ రాజు-శ్రీవిద్య ప్రేమించుకుంటారు, మరో వైపు మాధవి - సత్యనారాయణ ప్రేమించుకుంటారు. ఇలా వుండగా, మాధవి శ్రీవిద్య కూతురని, నరసింహరాజు సత్యనారాయణ కొడుకని కథ మధ్యలో రివీలై ట్విస్టు పడుతుంది.
          
ఇప్పుడేం చేయాలి? ఈ ట్విస్టులో పజిల్ నెలా విప్పాలి? తండ్రీ కొడుకులు తల్లీ కూతుళ్ళని ప్రేమించారు. తండ్రి కూతుర్ని ప్రేమించాడు, కొడుకు ఆమె తల్లిని ప్రేమించాడు.
          
ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? అని పాట. బేతాళ కథల్లో 24 వ కథ ఇదే. కొడుకు రాణిని ప్రేమిస్తాడు, తండ్రి రాకుమారిని ప్రేమిస్తాడు.
          
ఈ వావివరసల చిక్కు ముడిని విప్పడానికి తమిళంలో రజనీ కాంత్ పాత్రని ప్రవేశపెడతారు, తెలుగులో మోహన్ బాబు పాత్రని ప్రవేశపెడతారు.
          
అంటే ఇక్కడ కథ మధ్యలోపడ్డ ట్విస్టు విప్పడానికి తాళంచెవి పాత్రని వాడారు. ట్విస్టులో మలుపు వుండదు, పజిల్ వుంటుంది. ఈ పజిల్ ని విప్పే తాళం చెవిని కనుగొన గల్గితేనే కథ ముందుకెళ్తుంది.
          
కథ మధ్యలో ట్విస్టు వేస్తే దాన్ని విప్పే తాళం చెవి పాత్రని కనుగొని చివర్లో వాడతారు. అంతవరకు ఈ చిక్కుముడి ఎలా వీడుతుందన్న సస్పన్స్ తో కథ నడుపుతారు. కాబట్టి మజాకా లో ట్విస్టులంటూ  ప్రేక్షకుల్ని మభ్య పెట్టనవసరం లేదు. అవి సాధారణంగా కథలో వచ్చే మలుపులే. వాటిలో పజిల్ వుండదు.

5. చివరికేమిటి

ఫస్టాఫ్ లో రహస్య ప్రేమాయణాలు నడుపుతున్న తండ్రీ కొడుకులు ఒకరి కొకరు దొరికిపోయినప్పుడు- ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేసి కథ ప్రారంభించి వుంటే మొత్తం స్క్రిప్టు ఆర్డర్ లో వుండేది. తండ్రికి పెళ్ళయితేనే కొడుక్కి పెళ్ళవుతుంది కాబట్టి, ముందు తండ్రి తను పెళ్ళి చేసుకోవడానికి సహకరించమంటే, అలాగే కొడుకు రచనా సహకారం అందించి ఈ కథని దారిలో పెడితే- అప్పుడు ముందు హీరోయిన్ల బంధుత్వంతో ఒక షాకు, తర్వాత ఇంటర్వెల్లో హీరోయిన్ల మధ్య వైరంతో ఇంకో షాకు ఇస్తే - ఈ కాన్ఫ్లిక్ట్ ని సెకండాఫ్ లో రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోతే సరిపోయేది.
       
పోతే
, పైపైన రాసేసి పైపైన తీసేశారనడానికి ఇంకో ఉదాహరణ- యశోద పాత్ర. ఈమె 30 దాటినా పెళ్ళి చేసుకోకుండా ఎందుకుందంటే- టీనేజిలో ప్రేమించిన వాడు మళ్ళీ వస్తానని మాటిచ్చి వెళ్ళాడుట. కానీ ఎంతకీ రాలేదట! మాటిచ్చాడు కాబట్టి తను అభిసారికలా ఎదురుచూస్తూ ఇలా భ్రహ్మచారిణిగా మిగిలిపోయిందట!
       
ఈమె అమోఘ మెచ్యూరిటీకి తోటి బంధువైన మీరాతో మోరల్ పోలీసింగ్ ఒకటి! నీతులు చెబుతూ మీరాని తన చెప్పుచేతల్లో వుంచుకుని స్వేచ్ఛ లేకుండా చేసే పెత్తనం. కానీ తను వెంకటరమణతో లేచిపోవా లనుకోవడానికి నీతులేం అడ్డురాలేదు. రైటింగ్ టేబులంటే ఈమెకి వొళ్ళు మంటలా వున్నట్టుంది...ముందు కానీయ్
, తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చూసుకుందాం అన్నట్టుంది.
—సికిందర్


Wednesday, February 26, 2025

1368 : సందేహాలు - సమాధానాలు

 

Q : మీ బ్లాగు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. స్క్రీన్ ప్లేకి సంబంధించి కొత్త సమాచారం అందిస్తూ నాలాంటి వారికి తోడ్పడుతున్నందుకు కృతజ్ఞతలు. అయితే ఇది వరకు  సందేహాలు - సమాధానాలు శీర్షిక రెగ్యులర్ గా వచ్చేది. ఈ మధ్య రావడం లేదు. ఈ శీర్షిక నా వరకు చాలా ముఖ్యమైనది. ఇది ఇక ముందు వస్తుందా రాదా తెలుపగలరు.
ఎంపీఆర్, అసోసియేట్

A : 2020, 21 రెండేళ్ళు కోవిడ్ లాక్ డౌన్ తో సినిమా రంగం చిన్నాభిన్నమైంది. ఆ పరిస్థితుల్లో పాఠకులు చెల్లాచెదురయ్యారు. సందేహాలు అడిగేవాళ్లే లేరు సమాధానాలివ్వడానికి. అప్పుడాగిపోయిన శీర్షిక ఇప్పటికీ పుంజుకోలేదు. నెలకి ఒకటీ అరా ప్రశ్నలు వస్తే వాట్సాప్ లోనే వ్యక్తిగతంగా సమాధానమిస్తున్నాం. ఎక్కువ ప్రశ్నలొస్తే వారం వారం కాకపోయినా నెలలో రెండు సార్లు ఇవ్వొచ్చు. గత వారం మూడు ప్రశ్నలొచ్చాయి. వీటికి బ్లాగు ముఖంగానే సమాధానమిస్తున్నాం. మీరు ప్రశ్నలు పంపుతూ వుండండి-శీర్షికని రెగ్యులర్ గా నిర్వహిద్ధాం. ఒక సమస్యేమిటంటే, చాలా మందికి ప్రశ్నలు అడగడం రావడం లేదు. అందుకని ప్రశ్నలు పంపలేకపోతున్నారు. బ్లాగులో ఆర్టికల్స్ మొక్కుబడిగా చదివి వదిలేస్తే విషయం మీద పట్టు సాధించలేరు. అలా ప్రశ్నలడగడం రాదు. తాముంటున్న రంగంలో తమ మీద స్కిల్స్ పరంగా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తేనే ఎదగ గలుగుతారు. ఇన్వెస్ట్ చేయడమంటే డబ్బులు పెట్టుబడి పెట్టి నేర్చుకోవడమని కాదు. అలా కూడా చేయొచ్చు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ లో కోర్సు తీసుకుని. ఇన్వెస్ట్ చేయడమంటే జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి నేర్చుకోవడం. దీనికి ఈ ఉచిత బ్లాగు ఎల్లప్పుడూ తోడుంటుంది.

Q : మీ తండేల్ స్క్రీన్ ప్లే సంగతులు చదివాను. You are right. Conflict సరిగా లేదు. నేనైతే director కు ఈ  విధంగా చెప్పే వాడిని- హీరో ఒక చిన్న ఫైట్ తో కాకుండా, సినిమా పరిచయంలోనే అతను తండేల్, అంటే నాయకుడు. హీరోయిన్ కోరిక మేరకు  వేటకు వెళ్లనని, ఇదే చివరి సారని, వచ్చిన డబ్బుతో కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ చేస్తానని, దానితో మిగతా వాళ్లకు కూడా మేలు జరుగుతుందని చెప్పేవాడు (స్టోర్ చేసి రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్మడం ద్వారా).

ఇక హీరో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ గుజరాత్ లో నేల మీద కూర్చుని ధర్నా చేయడం, మంత్రి ఇంటి ముందు పెళ్లి చీర కట్టుకునే  చీప్ సీన్ ల కన్నా కూడా, ఢిల్లీ వెళ్లి కోర్టు ద్వారా లీగల్ పోరాటం, ఉద్యమం ద్వారా (social media and on the street etc) ప్రజల్లో ఒక మూవ్ మెంట్ తీసుకు రావడం  లాంటివి చేయాలి (రోజా సినిమాతో పోలిక వచ్చినా సరే).

ఇక పొతే director కు హీరో oriented  సినిమా చేయాలా, హీరోయిన్ oriented చేయాలా స్పష్టత లేదు. కామెడీ ఏమిటంటే, సుష్మా స్వరాజ్ కూతురు మంత్రి కాదు.  సాయి పల్లవి కొత్త ఫారిన్ మినిస్టర్ ను కలవాలి. నిజానికి ఆమె ఎవరినీ కలవ కూడదు. ఉద్యమం చేస్తే వాళ్లే సాయిపల్లవి దగ్గరికి రావాలి.
—సీఎస్సార్, దర్శకుడు

A : అసలు తండేల్ కాన్సెప్ట్ ఏమిటి? బలమైన ప్రేమ కథ చెప్పడమా, లేక పాక్ లో బందీల్ని విడిపించడమా? దేనికి మార్కెట్ వుంటుంది? ప్రేమకా, ఉద్యమనికా? దీని మీద స్క్రీన్ ప్లే సంగతుల్లో స్పష్టత నిచ్చాం. అయినా మీరు హీరోయిన్ ఉద్యమం చేసి హీరోని విడిపించాలంటున్నారు. హీరోయిన్ కోరిక మేరకు  వేటకు వెళ్లనని, ఇదే చివరి సారని, వచ్చిన డబ్బుతో కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ చేస్తానని, దానితో మిగతా వాళ్ళకి కూడా మేలు జరుగుతుందని చెప్పాలంటున్నారు. ఇలాటి మాటలతో కథ ముడిపడదు. అందుకని అతడెన్ని మాటలు చెప్పినా, అతడి చేతికి దారం కట్టి ఆమె ప్రేమో వేటో తేల్చుకో పొమ్మనాలని అన్నాం. ఒకే సినిమాలో రెండు కథలు చెప్పబోతే ఈ సినిమాలో జరిగినట్టే వుంటుంది. హీరోయిన్ కట్టిన దారం కోసం ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి పాక్ అధికారుల గుండెల్ని కదిలించేలా హీరో గనుక చేస్తే విడుదల దానికదే జరిగి పోతుంది. విడుదల కోసం అంత రభస రచ్చ పూర్తిగా అప్రస్తుతం. ప్రేమ కథలో ప్రేమతో గెలవాలి.

సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా వున్నప్పుడు విదేశాల్లో ఇరుక్కున్న ఎందర్నో ఒక ట్వీట్ చేసినా, ఫోన్ కాల్ చేసినా తక్షణ చర్యలు  తీసుకుని విడుదల చేయించేవారు. అందుకని ఆవిడ స్థానంలో కూతురు, ఎంపీ అయిన బాసురీ స్వరాజ్ ని మంత్రిగా చూపించి వుంటారు.

Q : మీమీద నా కంప్లెయింట్ ఏంటంటే మీరు బ్లాగుని పట్టించుకోవడం మానేశారు. రెగ్యులర్ గా రివ్యూలు లేవు, ఇతర ఆర్టికల్స్ లేవు. ఇక ఇంతేనా? ఏదైనా మార్పు వస్తుందా?
—ఏవీఎం,  టెక్సాస్

A : వస్తుంది. ఈ మధ్య నెలకి ఇద్దరికీ సినాప్సిస్ లు సెటప్ చేయడంతో సరిపోతోంది. ఒక్కో సినాప్సిస్ కి 15 రోజులైనా పడుతోంది. కథ ఒక్క రోజులో వచ్చేసినా డీటెయిల్డ్ సినాప్సిస్ కి టైము ఎక్కువ పడుతోంది. అందుకని బ్లాగులో కంటెంట్ మిస్సవుతోంది. ఈ వారం నుంచి ఇలా జరక్కుండా చూద్దాం. మీ యూఎస్ నుంచి గత రెండు రోజులుగా వ్యూస్ తాకిడి విపరీతం గా వేలల్లో పెరిగింది. ఓ వారం రోజులుగా  ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, వియత్నాం, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంగ్ కాంగ్, ఐర్లాండ్, బాంగ్లాదేశ్, బెల్జియం ...ఇలా చాలా దేశాల నుంచి విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో ఎన్నారై లున్నారు. మిగతా దేశాల నుంచి వస్తున్న వ్యూస్ స్పామ్ అనుకోవాలా? ఈ వ్యూస్ ని చూస్తే బాగా రాయాలి, చాలా రాయాలి, రెగ్యులర్ గా రాయాలని ఆవేశం వచ్చేస్తోంది... కానీ ఏం చేస్తాం, పరిస్థితులిలా వున్నాయి.
—సికిందర్


Sunday, February 23, 2025

1367 : స్క్రీన్ ప్లే సంగతులు!

 



రచన - దర్శకత్వం : మగిళ్ తిరుమేని
తారాగణం :  అజిత్, త్రిష, అర్జున్, రెజీనా కాసాండ్రా, ఆరవ్ తదితరులు
సంగీతం :  అనిరుధ్ రవిచంద్రన్, ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్,
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్ అల్లీరాజా
విడుదల : ఫిబ్రవరి 6, 2025
***

        త పదేళ్ళుగా అజిత్ కుమార్ ఒకే మూసలో ఫార్ములా యాక్షన్ సినిమాలు తప్ప వేరే కొత్తదనం జోలికిపోవడం లేదు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి ఇతర తమిళ స్టార్లు విభిన్న ప్రయోగాలు చేస్తూంటే, తను మాత్రం అవే కృత్రిమ యాక్షన్ ఫార్ములాలతో అక్కడే వుండిపోయాడు. ఈ లిస్టులో  విదాముయర్చి ని కొత్తగా చేర్చాడు. ఆరు సినిమాలు తీసిన మగిళ్ తిరుమేని దీనికి దర్శకుడు. ఇతడికంటే ముందు దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ఫైనల్ చేసిన అజిత్, ఎంత టైమిచ్చినా అతను సరైన స్క్రిప్టు సిద్ధం చేయడం లేదని మురుగ దాస్, అట్లీ లాంటి ఎందరో దర్శకుల్ని పరిశీలించాడు. చివరికి  మగిళ్ తిరుమేనికి అవకాశమిచ్చాడు. ఇంతా చేసి రొటీన్ యాక్షన్ సినిమాలతో తనకున్న మోజుని ఈ సినిమాతో అట్టడుగు స్థాయికి చేర్చాడు. ఒకే మూసలో ఫార్ములా యాక్షన్ సినిమాలు నటిస్తున్న తనకి, ఇంతకంటే లో- ర్యాంకు లేదని గ్రహిస్తే ఇక వీటికో నమస్కారం పెట్టి కొత్తదనం వైపు ఏమైనా చూస్తాడేమో నని ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి పట్టుదల ఇంత అట్టడుగు స్థాయికి ఎలా చేరిందని, ఎందుకు చేరిందని ఎవరికైనా సందేహాలు వస్తాయి. వీటికి సమాధానం కోసం ప్రయత్నిద్దాం...

కథేమిటి
    అర్జున్ (అజిత్)  జార్జియాలోని టిబిలిసిలో అమెరికన్ కంపెనీలో పని చేస్తూంటాడు. ఇక్కడే  కాయల్ (త్రిష- కాయల్ అంటే అందమైన కళ్ళు గలది అట) తో  ప్రేమలో పడతాడు. ఇంతలో అతడికి అజర్ బైజాన్ లోని బాకు అనే నగరానికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఓ మూడేళ్ళ తర్వాత ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయి పిల్లలు పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అతడికి దూరం కావడం ప్రారంభిస్తుంది. తొమ్మిది సంవత్సరాల తర్వాత తనకి ప్రకాష్ అనే అజ్ఞాత వ్యక్తితో ప్రేమ వ్యవహారం వుందని  చెబుతుంది. ఆమె నిజాయితీకి మెచ్చుకుని సమస్య  పరిష్కరించుకుందామని అతనంటే,  విడాకులు  కావాలని అంటుంది. అప్పటిదాకా టిబిలిసిలోని తన పేరెంట్స్ దగ్గర వుంటానని అంటుంది.

కారులో ఆమెని తీసుకుని టిబిలిసి బయల్దేరతాడు. దారిలో ఒక కారులో తాగుబోతులు రాష్ డ్రైవ్ చేసి - వాళ్ళే గొడవకి దిగుతారు. అర్జున్ మౌనంగా వాళ్ళ మాటల్ని భరించి తనే సారీ చెప్తాడు. ఆ తాగుబోతుల లీడర్ కిషోర్ (ఆరవ్) అర్జున్  పెట్రోలు కోసం బంకులో ఆగినప్పుడు అక్కడికొచ్చేస్తాడు. కాయల్ షాపింగ్ చేసుకోవడానికి  వెళ్తుంది. కిషోర్ అర్జున్ ని రెచ్చగొట్టడం మొదలెడతాడు. అటు షాపులో కాయల్ కి దీపిక (రెజీనా కాసాండ్రా), రక్షిత్ (అర్జున్) లు పరిచయమవుతారు. వాళ్ళు ఒక పార్సిల్ ని డెలివరీ ఇవ్వడానికి ట్రక్కులో వెళ్తున్నట్టు చెప్తారు. తర్వాత కాయల్ ని తీసుకుని బయల్దేరిన అర్జున్ కారు హైవేమీద పోతూ విధ్యుత్ లోపంతో ఆగిపోతుంది. రిపేరు చేయడానికి విఫల యత్నం చేస్తాడు. మెకానిక్ కి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ వుండవు.
       
ఇంతలో ట్రక్కు వస్తూ కనిపిస్తుంది. దాన్ని ఆపి డ్రైవ్ చేస్తున్న రక్షిత్ కి ప్రాబ్లం చెప్తాడు. రక్షిత్ వల్ల కూడా రిపేరు కాదు. ఇలాకాదని
, కొంత దూరంలో కాఫీ షాప్ వుందని, అక్కడ్నించి లాండ్ లైన్లో మెకానిక్ కి కాల్ చేయవచ్చని దీపిక చెప్తుంది. కాయల్ వాళ్ళతో బయల్దేరుతుంది. చాలా సేపటిదాకా కాయల్  మెకానిక్ తో తిరిగి రాదు. ఇంతలో కారు స్టార్ట్ అవుతుంది. అర్జున్ కారులో కాఫీ షాప్ కి బయల్దేరతాడు. అక్కడికి లేడీస్ ఎవరూ రాలేదని కాఫీ షాప్ ఓనర్ చెప్తాడు. మరి కాయల్ ఎటు వెళ్ళినట్టు?
       
అర్జున్ కి ఆందోళన పెరుగుతుంది. కాయల్ కిడ్నాప్ అయినట్టు అర్ధమైపోతుంది. ఎందుకు కిడ్నాప్ చేశారు
? అసలు దీపికా రక్షిత్ లెవరు? కాయల్ ని ఎక్కడికి తీసికెళ్ళారు? ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలో అర్ధంగాదు అర్జున్ కి...

ఎలావుంది కథ
     1997 లో విడుదలైన కర్ట్ రస్సెల్ నటించిన ది బ్రేక్ డౌన్ ని కాపీచేసి ఈ కథ తీస్తూంటే పారమౌంట్ పిక్చర్స్ కి తెలిసిపోయి నోటీసు పంపారు. 11 కోట్లకి సెటిల్ చేసుకుని కాపీ మచ్చ తుడిపేసుకుని అధికారిక రీమేకుగా చట్టబద్ధత పొందారు. ఈ పని ముందే చేసి వుండాల్సింది. అయితే ముందు కాపీ చేయాల్సి వచ్చినా ఎప్పుడో 28 ఏళ్ళనాటి కాలం  చెల్లిన, అరిగిపోయిన హాలీవుడ్ కథనే ఎందుకు సెలెక్టు చేసుకున్నాడో దర్శకుడు తెలీదు. ఈ కాలం చెల్లిన, అరిగిపోయిన  కథ అజిత్ లాంటి పెద్ద స్టార్ కి కురచనై పోయిన కథ కూడా. మూడోది- ఇది ఒక రోజులో అంటే 24 గంటల్లో ముగిసిపోయే రోడ్ ట్రిప్ థ్రిల్లర్ కథ. చిన్న హీరోతో తీయాల్సిన ఒక రోజు జరిగే కథతో పెద్ద స్టార్ ని పెట్టి తీయడం ఏం మార్కెట్ యాస్పెక్టో తెలీదు. ఇవన్నీ కలిసి పట్టుదల ని పట్టులేని ప్రయత్నంగా తయారు చేశాయి. బడ్జెట్లో సగం కూడా వసూలు చేయలేకపోయిన ఇలా తీసిన ఈ సినిమా ఇతర స్టార్లకి హెచ్చరికలా వుంటుంది.  ఇతర స్టార్లని హెచ్చరించడం కోసమే ఈ సినిమా తీసినట్టుంది- 11 కోట్లు దీని కథకి సమర్పించుకుని!

స్క్రీన్ ప్లే సంగతులు

    ఒరిజినల్ కథలో కర్ట్ రస్సెల్- కేథ్లీన్ క్విన్లాన్ లు బోస్టన్ నుంచి బయల్దేరి శాండీగో కారులో పోతూంటారు. వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇంకేమీ చెప్పరు. ఇద్దరూ అన్యోన్యంగా వుంటారు. అలా పోతున్నాక దారిలో కారు పాడయి, తర్వాత మెకానిక్ కోసం ట్రక్కులో వెళ్ళి మాయమైపోతుంది కేథ్లీన్.
        
పట్టుదల లో ముందు కథ కొంత జోడించాడు దర్శకుడు. భార్యా భర్తలుగా అర్జున్- కాయల్ ల సంబంధాలు క్షీణించి వుంటాయి. దీని ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ పరిచయం ప్రేమా పెళ్ళీ వగైరా వస్తాయి. పెళ్ళి తర్వాత అబార్షన్, వేరొకరితో తనకి ఎఫైర్ వుందని ఆమె చెప్పడం, విడాకులు కోరడం, విడాకులయ్యేదాకా పేరెంట్స్ దగ్గర వుంటాననడం, అర్జున్ ఆమెని తీసుకుని బయల్దేరడమూ ఈ జోడించిన కథలో వుంటాయి.
       
ఇలా ఇండియనైజ్ చేయడం అవసరమే. అయితే ఈ ఇండియనైజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ తో
, కాయల్ తో ఇంటర్వెల్లో ఇచ్చిన మలుపుని అర్జున్ కి వ్యతిరేకంగా ఆమెని  నిలబెట్టి కథకి కొత్తదనాన్ని నింపొచ్చు.  ఇలా చేయలేదు.

2. ఏమిటి ఇంటర్వెల్ మలుపు?

    ఫస్టాఫ్ లో కాయల్ మీద ముందే పన్నిన కుట్ర ప్రకారం రక్షిత్, దీపికా, మైకేల్ ముఠా ఆమెని కిడ్నాప్ చేసి అర్జున్ దగ్గర డబ్బులాగడం గురించే ఈ కథ. 45వ నిమిషంలో కాయల్ మాయమవడంతో ప్లాట్ పాయింట్ 1 వచ్చి మిడిల్ 1 లో పడుతుంది కథ. కాన్ఫ్లిక్ట్ తో కూడిన ఈ సెగ్మెంట్ లో - మిడిల్ 1 కథ ఇంటర్వెల్ వరకూ కాయల్ ని అర్జున్  వెతుక్కోవడం గురించే వుంటుంది. ఇంటర్వెల్ లో కిడ్నాప్ గ్యాంగ్ దొరికిపోతారు- కాయల్ దొరకదు. ఈ ఇంటర్వెల్లో ఒరిజినల్లో లాగే బలమైన మలుపు వస్తుంది. దీన్ని దీపిక  రివీల్ చేస్తుంది- కాయల్ ని తాము కిడ్నాప్  చేయలేదని, ఇదంతా తమని కిరాయికి మాట్లాడుకుని కాయల్ ఆడుతున్న డ్రామేననీ-చెప్పి షాకిస్తుంది దీపిక!
        
అయితే ఈ మలుపుని ఇలాగే మనుగడలో వుంచి సెకెండాఫ్ నడపాల్సింది. ఇలా చేయలేదు. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభించాక తాను చెప్పింది జోక్ అని కొట్టి పారేస్తుంది దీపిక. దీంతో ఇంటర్వెల్లో ఇది కాయల్  డ్రామా అంటూ  బ్రహ్మాండంగా చూపించిన సెటప్ ని - జోకుగా  చెప్పి పేఆఫ్ చేయడం -1997 నాటి కాలంలో ఒరిజినల్ కి చెల్లిందేమో గానీ ఇప్పుడు కాదు.
       
ఇలా చేశాక ఇక మిడిల్ 2 లో కథేముంటుంది- అదే కాయల్ ని వెతుక్కోవడం
, అర్జున్ ఎనిమిది కోట్లు డబ్బు తెచ్చినా  రక్షిత్ గ్యాంగ్ కాయల్ ని  అప్పగించకపోవడం, అర్జున్ ఒక్కొక్కరి అంతూ చూస్తూ పోయి చివరికి కాయల్ ని కనుక్కోవడం ఇదే కథ!
       
ఇలా డెప్త్ లేకుండా ఫ్లాట్ గా సాగే ఫక్తు కిడ్నాప్ తతంగంతో ఈ సెకెండాఫ్ ఫస్టాఫ్ కంటే బలహీనంగా తయారయ్యింది. పైగా రక్షిత్- దీపికలు మానసిక రోగులని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ వేసి కథకి ఇంకింత నష్టం చేశారు. విలన్ పాత్రలకి ఇలాటి శాడ్ గా వుండే ఫ్లాష్ బ్యాకులేస్తే ఎవరికి సానుభూతి కలుగుతుంది
? సెకండాఫ్ ని నిలబట్టే ఒక్క కీలకాంశం, కొత్త మలుపూ ఏదీ లేదు.
       
1997 లో సెల్ ఫోన్లు లేవు. కాబట్టి ఫోన్ చేసుకోవడానికి లాండ్ లైనే గతి. ఇప్పుడు  సెల్ ఫోన్లు వున్నాయి -కానీ సిగ్నల్స్ లేవన్నారు. అందుకని లాండ్ లైను కోసం వెళ్ళింది కాయల్ బాగానే వుంది- కానీ సెల్ ఫోన్ చేతిలో వున్న అర్జున్ రక్షిత్
, దీపికలని, వాళ్ళ ట్రక్కునీ, దాని నెంబర్ ప్లేటునీ వీడియోతీసి కాయల్ నిచ్చి పంపి వుంటే ఇంత రభస జరిగేది కాదుగా?ఇంకోటేమిటంటే ఫస్టాఫ్ లో అర్జున్ ని పూర్తిగా పాసివ్ గా వుంచారు. ముఠా చేతిలో దెబ్బలు తింటాడే తప్ప ఎదురు తిరగడు. దీంతో అజిత్ లాంటి యాక్షన్ స్టార్ తో యాక్షన్ సీన్లే లేవు ఫస్టాఫ్ లో.

ఇంటర్వెల్ లో ఇది అర్జున్ మీద కాయల్ పన్నిన కుట్ర అన్నప్పుడు, ఆమె కుట్రగానే సెకండాఫ్ నడిపి వుంటే అర్జున్ ఎమోషన్స్, స్ట్రగుల్ ఎంత బలంగా వుండేవి? విడాకుల ప్రపోజల్ పెట్టిన కాయల్ ఇలా డబ్బు లాగుతోందా, ఎవరితోనో ఎఫైర్ వుందని అంది- ఆ ఎఫైర్ రక్షిత్, కిషోర్ వీళ్ళలో ఎవరితో....ఇలాటి అనుమానాలతో, సంఘర్షణతో, ఆమెని పట్టుకుని గట్టి బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో అర్జున్ నడుచుకుని వుంటే- పతాక సన్నివేశాల్లో చివరికి ఆమె అమాయకురాలనీ, ఇదంతా ఆమెని వాడుకుని గ్యాంగ్ పాల్పడ్డ కుట్ర అనీ అప్పుడు తెలుసుకుంటే - ఎంతో కొంత బెటరయ్యేది ఈ రీమేక్!

1987 లో విడుదలైన ఫ్రెంచి మూవీ
ది వానిషింగ్ ఇలాటిదే హీరోయిన్ ప్రయాణం మధ్యలో అదృశ్యమయ్యే కథ. అయితే ప్లాట్ పాయింట్ వన్ లో అదృశ్యమయ్యాక అదే రోజు జరిగి ముగిసే కథగా ఇది వుండదు. అదృశ్యమయ్యాక మూడేళ్ళు  గడిచిపోతాయి. హీరో ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో వుంటాడు. అప్పుడు ఒక సైకో పిక్చర్ లోకి రావడంతో హీరోయిన్ మిస్సయిన మిస్టరీ తెలుసుకుంటూ సాగుతాడు హీరో...

పట్టుదల ని కూడా ఏకబిగిన 24 గంటలు సాగే కథగా - రియల్ టైమ్ ప్లాట్ గా గాకుండా, టైమ్ లాప్స్ తో రెగ్యులర్ సినిమాగా కథ కాలాన్ని పెంచి వుంటే- అజిత్ లాంటి పెద్ద స్టార్ కి సూటయ్యేది. 
—సికిందర్


Saturday, February 22, 2025

 Up Coming Articles :
1. Screenplay Sangathulu of ‘Pattudala’ - Saturday
2. Q&A (Question and Answer Session) -  Sunday
3. Gaining Success Through Quantum Mechanics- Monday

 

Saturday, February 15, 2025

1366 : స్క్రీన్ ప్లే సంగతులు


 

రచన- దర్శకత్వం : చందూ మొండేటి
తారాగణం : నాగచైతన్య, సాయి పల్లవి, ప్రకాష్ బెలవాడి, కరుణాకరన్, మహేష్ అచంట
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : షామ్ దత్ సయీనుద్దీన్
బ్యానర్ :  గీతా ఆర్ట్స్
నిర్మాత :  బన్నీ వాసు
విడుదల : ఫిబ్రవరి 7, 2025   
***
        ఫిబ్రవరి 7 శుక్రవారం విడుదలైన తండేల్ తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 20.5 కోట్లు రాబట్టి  హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజు శనివారం 16 కోట్లు, మూడో రోజు ఆదివారం 14 కోట్లుగా డ్రాప్ అవుతూ వచ్చి, సోమవారం నుంచి వసూళ్ళ పతనం పెరుగుతూ  పోయింది. సోమవారం (నాల్గవ రోజు) 6.15 కోట్లు, మంగళవారం (ఐదవ రోజు) 5.5 కోట్లు, బుధవారం (ఆరవ రోజు) 3.6 కోట్లు, నిన్న గురువారం (ఏడవ రోజు) 3 కోట్లకి పడిపోయి ప్రశ్నార్ధకంగా నిల్చింది. హిందీ రాష్ట్రాల్లో కేవలం 40 లక్షలు వసూలు చేసింది. ఈ ఏడు రోజుల్లో (అంటే తొలి వారం) మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ 65.65 కోట్లు. బడ్జెట్ 75 కోట్లు. 100 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని ఆశిస్తున్నారు. కాకపోయినా నష్టం లేదు, ఓటీటీ హక్కులు 45 కోట్లు రానే వస్తాయి. ఇలా ఓటీటీ సపోర్టుతో లాభాల్లో పడితే సేఫ్ ప్రాజెక్టు అన్నట్టేనా? వుందిగా ఓటీటీ అని క్వాలిటీ మీద దృష్టి పెట్టకుండా సినిమాలు తీసేసి హిట్ అని చెప్పుకోవచ్చా?

    యితే ప్రతీరోజూ కలెక్షన్లు డ్రాప్ అవడానికి కారణాలు కొన్ని చెప్తున్నారు. మొదటి రోజే పైరసీ కాపీ వచ్చేసిందని  ఒక కారణం. అన్ని  సినిమాలూ మొదటి రోజే పైరసీలు వచ్చేస్తాయి. వాటి లింకులు మర్నాడు పెడతారు. అసలు పైరసీతో సంబంధం లేకుండా పెద్ద సినిమాలు హిట్టవుతూనే వున్నాయి. సంక్రాంతికి బాలకృష్ణ డాకూ మహరాజ్’,  వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం పైరసీలు వచ్చేసినా హిట్టయ్యాయి. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాపయ్యింది. ఎందుకు ఫ్లాపయ్యింది- కంటెంట్ ప్రాబ్లం. ఇక తండేల్ డ్రాపవుతూ వుండడానికి మార్చి ఫస్ట్ నుంచి పరీక్షల సీజన్ అనీ, మరొకటనీ ఇతర కారణాలు చెప్తున్నారు. కానీ కంటెంట్ తో వున్న పెద్ద బ్లాక్ హోల్ గురించి మాట్లాడ్డం లేదు. ఏమిటా బ్లాక్ హోల్? కమర్షియల్  సినిమాలకి కాస్త కథలు చూసుకుని తీయాలనీ, గాథలు తీసి గల్లంతు అవకూడదనీ గత కొన్నేళ్ళుగా బ్లాగులో హెచ్చరించుకుంటూనే వున్నాం. అయినా తండేల్ ని గాథగా చేసి తీయనే తీశారు! ఫలితమే పైన కనిపిస్తున్న అంకెలు!

        తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలే శాపాలనుకుంటే, కథలు గాక గాథలు చూపిస్తూ ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు.  గాథ అంటే ఏమిటో మరోసారి గుర్తు చేసుకుందామా? గాథఅనేది కథ కిందికి రాదు. కథకీ గాథకీ తేడా వుంది. గాథ లో వుండే కంటెంట్ ఒక సాదా స్టేట్ మెంట్ మాత్రంగానే వుంటుంది. అంటే పాత్ర- నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసిందీ బాబో- అంటూ విధికి తలవంచిన పరాజిత లక్షణాలతో వాపోతుంది. విధి అంటే ఏమిటి? తన ప్రారబ్ద కర్మే!

         ఇలాకాక కథఅనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. అంటే పాత్ర- నేననుకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నానూ- అని విజేత అయి ప్రకటిస్తుంది. ఈ  సినిమాలో నాగచైతన్య పాత్రగానీ, సాయి పల్లవి పాత్రగానీ  మొదటి సిద్ధాంతానికే న్యాయం చేయడానికి కృషి చేశాయి. అంటే గాథని సృష్టించడానికి జత కట్టాయి. ఇది వివరంగా తెలుసుకోవడానికి స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళాలి. ముందుగా కంటెంట్ ఏమిటో చూద్దాం...

సీమాంతర కాన్సెప్ట్ ఇది 

    శ్రీకాకుళం తీరంలో మత్స్యకారుల్లో ఒకడైన రాజు (నాగ చైతన్య) చేపల వేటకి వెళ్తూంటాడు. తన బృందం తో కలిసి  ప్రతి సంవత్సరం  గుజరాత్‌ దాకా సముద్రంలో ప్రయాణించి అక్కడ ఒక కాంట్రాక్టర్‌ కి తాము పట్టిన చేపలు అమ్మి వస్తూంటాడు. ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు, తల్లులు, ఇతర బంధువులు వీళ్ళు తిరిగి వచ్చేదాకా ఎదురు చూపులతో గడుపుతూంటారు. రాజు కూడా తాను ప్రేమిస్తున్న సత్య (సాయి పల్లవి) ని  వదిలి వెళ్తూంటాడు. తొమ్మిది నెలలు సముద్రం మీద, 3 నెలలు ఇంటి దగ్గర వుండే రాజు ఈ సమయంలోనే సత్యతో  ప్రత్యక్ష ప్రేమలో వుంటాడు. మిగిలిన కాలం ఫోన్ల మీద మాట్లాడుకోవడమే. అందుకని సత్యకి అతను చేస్తున్న ఈ వృత్తి నచ్చదు. ఈ నేపథ్యంలో ఒక రౌడీ ముఠాని ఎదుర్కొన్న రాజుని తమ తండేల్ (నాయకుడు) గా ఎన్నుకుంటారు మత్స్యకారులు. ఇక తండేల్ గా రాజు తిరిగి గుజరాత్ కి ప్రయాణం కట్టడంతో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సత్య. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బృందంతో వెళ్ళిపోయిన అతను- తుఫాను చెలరేగడంతో సముద్రంలో ఒక పాకిస్తానీని కాపాడుతూ పాక్ సముద్రజలాల్లోకి ప్రవేశిస్తాడు. దీంతో బోటులో వున్న 21 మంది బృందం సహా పాక్ దళాలకి పట్టుబడతాడు. జైల్లో బందీ అయి పోతాడు.
       
ఈ వార్త సత్యకీ
, మిగతా అందరికీ షాకులా తగులుతుంది. ఇప్పుడు పాక్ జైల్లో బృందంతో ఖైదు అయిన రాజు ఎదుర్కొన్న అనుభవాలేమిటి? అతను బృందంతో అక్కడ్నుంచి ఎలా బయటపడ్డాడు? రాజు మీద కోపంతో వున్న సత్య ఏం చేసింది? వీళ్ళిద్దరి ప్రేమ ఏ తీరానికి చేరింది చివరికి? ఇదీ మిగతా కంటెంట్. కంటెంట్ అనడమెందుకంటే, ఇది కథో గాథో తేలేదాకా కంటెంట్ అనే అనుకుందాం.

2. ఎలావుంది కంటెంట్

    శ్రీకాకుళంలో జరిగిన సంఘటనని  ఆధారంగా తీసుకుని ఈ కంటెంట్ ని రూపొందించారు. ఆ నిజ సంఘటన పాక్ జైల్లో బందీలైన శ్రీకాకుళం మత్స్యకారుల గురించే. మిగతా ప్రేమకి సంబంధించిన కంటెంట్ ని కల్పన చేసి జోడించారు. 2018 లో కరాచీ జైల్లో ఏడాదికి పైగా నిర్బంధంలో గడిపిన తర్వాత,  పాకిస్తాన్ విదేశాంగ శాఖ వీళ్ళని తిరిగి భారత్ కి పంపేసింది. ఐతే జైల్లో పెట్టిన హింస, తిండికి మాడ్చిన తీరు మాత్రం హేయమైనవి. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈ జాలర్లని  పాకిస్తాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నవంబర్ 2018 లో గుజరాత్ తీరంలో అదుపులోకి తీసుకుంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణపై అదుపులోకి తీసుకున్నారు. కోస్తాంద్ర నుంచి మత్స్యకారులు అంత దూరం గుజరాత్ వెళ్ళడానికి కారణం అక్కడ జెల్లీ ఫిష్ అనే చేపలు భారీగా పడతాయి. వాటిని  అక్కడే కాంట్రాక్టర్లకి అమ్మి తిరిగి వస్తారు.
        
అయితే ఈ జాలర్ల నిజ జీవితపు అనుభవానికి ఓ జంటతో కలిపి కల్పిత ప్రేమని జోడించినప్పుడు, ఈ మొత్తం కంటెంట్ అసలు కథే అవుతోందా లేక గాథ అవుతోందా చూసుకోలేదు. కమర్షియల్ సినిమాతో కథకీ, గాథకీ తేడా తెలియకపోతే ప్రమాదకర జోన్లోకి అడుగుపెడుతున్నట్టే. కమర్షియల్ సినిమాకి కథే కావాలి. ఆర్ట్ సినిమాకి గాథ చెప్పుకోవచ్చు. కథ అన్నప్పుడు అందులో యాక్టివ్ క్యారక్టర్లుంటే, గాథలో పాసివ్ క్యారక్టర్లుంటాయి. కథకి  కాన్ఫ్లిక్ట్ వుంటే, గాథకి కాన్ఫ్లిక్ట్ వుండదు. కథలో పాత్రకి గోల్ వుంటే, గాథలో పాత్రకి గోల్ వుండదు. కథని పాత్ర నడిపిస్తే, గాథలో గాథ పాత్రని నడిపిస్తుంది. కథలో పరిష్కారాన్ని పాత్ర సాధిస్తే, గాథలో పాత్ర కోసం పరిష్కారాన్ని ఇతర పాత్రలు సాధించి పెట్టి ఒడ్డున పడేస్తాయి. ఇలా కథలో పక్కా యాక్టివ్ పాత్ర వుంటే, గాథలో పూర్తి పాసివ్ పాత్ర వుంటుంది. ఇలాటి గాథల ద్వారా కమర్షియల్ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నట్టు? మీకు సమస్యలొస్తే కుమిలిపోతూ పాసివ్ గా కూర్చోండి, ఎవరో ఒకరు దేవుడులా వచ్చి ఆదుకుంటారనేనా? చేతకాని పాసివ్ క్యారక్టర్ తో  చాలా బ్యాడ్ మెసేజి ఇది.
        
పాక్ లో చూపించిన మత్స్యకారుల అనుభవాల్ని డాక్యుమెంటరీలా తీశారు. దీంతో ఫీలింగ్ లేకుండా పోయింది. డాక్యుమెంటరీ అన్నాక చూపించడాని కేముంటుంది సమాచారం తప్ప. కంటెంట్ డాక్యుమెంటరీలా వున్న విషయం నాగచైతన్య కనిపెట్టి, సరి చేసుకుంటే నటిస్తానని చెప్పేశాడు. ఏం సరిచేశారో తెలీదుగానీ ఒకటి కాదు రెండు గాథలు తీసినట్టు తయారైంది మొత్తం కంటెంట్. స్ట్రక్చర్ స్కూలుని అవతల పడేసి క్రియేటివ్ స్కూలునే అనుసరిస్తే ఇంతే జరుగుతుంది. క్రియేటివ్ స్కూల్లో స్ట్రక్చర్ తో పని వుండదు, స్ట్రక్చర్ స్కూల్లో క్రియేటివిటీతో కూడా పని వుంటుంది.
        
ఈ కంటెంట్ లో క్రియేటివ్ స్కూలుతో జరిగిందేమిటంటే, ఫస్టాఫ్ లో కాన్ఫ్లిక్ట్ అంటూ లేని ప్రేమతో కూడిన గాథ నుంచి సెకండాఫ్ తెగిపోయి, పాక్ లో జాలర్ల స్ట్రగుల్ తో కూడిన గాథకింద పడి నలిగిపోయింది. ఇలా మొత్తం కలిపి చూస్తే సినిమాలో వున్నది  గాథే అయినా, అదీ ఒక పాయింటుతో గాక,  ఫస్టాఫ్ ప్రేమ పాయింటు, సెకండాఫ్ జాలర్ల స్ట్రగుల్ అనే పాయింటు అంటూ రెండు ముక్కలుగా తెగిపోయి-  సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడిందన్న మాట!

3. ప్రేమలో ఏమిటి కాన్ఫ్లిక్ట్?

    కథ అనుకుని తయారు చేసిన ఈ కంటెంట్ లో, ప్రేమలో కాన్ఫ్లిక్ట్ పూర్తిగా లేదని కాదు, కాన్ఫ్లిక్ట్ సరీగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకని కాన్ఫ్లిక్ట్ వున్నా లేనట్టే వుంది. స్క్రీన్ ప్లేలో కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ప్రాముఖ్యమేమిటంటే, అది కథనానికి డ్రైవింగ్ ఫోర్స్ గా పనిచేస్తుంది. టెన్షన్ ని సృష్టిస్తుంది. కాన్సెప్ట్ ని ముందుకి నడిపిస్తుంది. పాత్రల్ని డెవలప్ చేస్తుంది. పాత్రలు అధిగమించాల్సిన సవాళ్ళని ఎత్తి చూపుతూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది.  కాన్ఫ్లిక్ట్ లేని కంటెంట్ లో డైనమిజం (చైతన్యం) కూడా వుండదు, స్తబ్దుగా వుండిపోతుంది. ఇవన్నీ ఈ స్క్రీన్ ప్లేలో కొట్టొచ్చినట్టుండే లోపాలు.
       
అందుకని ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా వుందో చూద్దాం. సినిమా ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఓ కాన్ఫ్లిక్ట్ సృష్టించిన ఘట్టంతోనే ప్రారంభమవుతుంది. అంటే రవిబాబు తీసిన  
అదుగో లోలాగా,  లేదా టీనేజి నోయర్ బ్రిక్ లోలాగా అన్నమాట. ఇలా ప్లాట్ పాయింట్ 1 ఘట్టంతో రైల్వే స్టేషన్లో  ప్రారంభమవుతుంది సినిమా. ఓపెనింగ్ షాట్ లో రైలు వెళ్ళిపోయాక చూస్తే అక్కడ బెంచీ మీద కూర్చుని తీవ్రంగా దుఖిస్తున్న సత్య కనిపిస్తుంది (ఈ ఓపెనింగ్ షాట్ గా వేసిన దృశ్యంలో రైలు లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది- కానీ ఈ ప్లాట్ పాయింట్ 1 ఘట్టం ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని తిరిగి ఇదే స్పాట్ కొచ్చినపుడు- రైలు రైట్ కి వెళ్తూ కనిపిస్తుంది!). 
       
ఈ ఘట్టం ఫ్లాష్ బ్యాక్ ఏమిటి
? స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగంగా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. రాజు, సత్య ఇతర పాత్రల పరిచయమూ, రాజూ సత్యల ప్రేమాయణమూ  మొదలైన బిగినింగ్ బిజినెస్ మొదటి రెండు టూల్స్ తో నేపథ్యం ఏర్పాటవుతుంది. ప్రేమించుకుంటున్నారు, కానీ రాజు వేటకి సముద్రం మీదికెళ్ళి నెలలకి నెలలు కనపడకుండా పోతూంటే సత్యకి తీవ్ర అసంతృప్తి. ఒక రోజు వేటకెళ్ళిన జాలరి ఒకతను శవమై తిరిగి రావడంతో సత్యకి భయం పట్టుకుంటుంది- రాజుకి కూడా ఇలా జరిగితే? (బిగినింగ్ బిజినెస్ లో మూడవ టూల్- సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అన్నమాట).
       
తర్వాత తండ్రిని అడుగుతుంది- నువ్వెందుకు వేట కెళ్ళవని. ఒకసారి అతను కొన్ని నెలలు వేట కెళ్ళి వచ్చేసరికి భార్య గుండెపోటుతో చనిపోయిందని తెలుస్తుంది. దీంతో చివరి చూపులు కూడా దక్కని భార్య సమాధి దగ్గరకెళ్ళి ఏడ్చాడు. కూతుర్నీ ఇలాగే దూరం చేసుకోకూడదని ఆమెని చూసుకునేందుకు వేట మానేశాడు. మరి ఈ పని మానెయ్యమని రాజుకి ఎందుకు చెప్పలేదని అడిగితే
, రాజు విషయం నీకే వదిలేస్తున్నానని అంటాడు.
        
సత్య ఇప్పుడు వేట మానెయ్యమని రాజుకి చెప్పేస్తుంది. జాలరి మరణం ఆమెని భయపెడ్తోంది. రాజు కొట్టి పారేస్తాడు. చావొచ్చేదుంటే ఎక్కడున్నావస్తుందంటాడు. పైగా తాను నేల మీద కన్నా సముద్రం మీద స్ట్రాంగ్ అంటాడు. ఆమె అస్సలు వినిపించుకోదు.  ఒట్టేయించుకుంటుంది. ఇంతలో ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది- రేపుదయం స్టేషన్ కొచ్చేయమని.
       
ఉదయం చూస్తే రాజు వుండకపోయేసరికి స్టేషన్ కి పరిగెడుతుంది. రైలు వచ్చి వుంటుంది. రాజు సహా బృందం ప్లాట్ ఫామ్ మీద వుంటారు. రాజుని పట్టుకుని నిలదీస్తుంది. ఆమె భయపడుతున్నట్టు జరగదని అదే సమాధానం చెప్తాడు. ఈసారి రాగానే పెళ్ళి చేసేసుకుందామంటాడు. ఇంకేదో అంటాడు. ఏదీ విన్పించుకోదు. తండేల్ గా ఇప్పుడు తన మీద వాళ్ళందరి కుటుంబాల బాధ్యత వుందంటాడు. నేనా- తండేలా చెప్పమంటుంది. చెప్పలేక పోతాడు. రైలు బయల్దేరుతూంటే ఏడ్వ వద్దని
, నవ్వమనీ బ్రతిలాడుకుని రైలెక్కేస్తాడు. ఆమె ఏడుస్తూనే వుంటుంది. రైలు వెళ్ళిపోతుంది. ఇదీ బిగినింగ్ బిజినెస్ నాల్గవ టూల్ గా సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) సృష్టించిన ప్లాట్ పాయింట్ 1 ఘట్టం.
       
చూస్తే క్యారక్టర్ పరంగా రాజు బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించే పాసివ్ క్యారక్టర్ లా వున్నాడు. నమ్మదగ్గ ప్రేమికుడిలా లేడు. ఎక్కడా అతను ఆమె పక్షాన నిలబడ్డం లేదు. ఆమె కంటే వేట
, వేటగాళ్ళ బృందమే ముఖ్యమనే మైండ్ సెట్ తో వున్నాడు. ఆమె ముందే ఫ్రెండ్ నుంచి స్టేషన్ కి రమ్మని కాల్ వస్తే, రానని చెప్పలేదు. అప్పటికి వెళ్ళనని ఒట్టేశాడు. అయినా రానని చెప్పకుండా, ఆమెకి తెలియకుండా జంపయ్యాడు. దొంగబుద్ధితో ఇతనేం ప్రేమికుడన్నది ప్రశ్న!
        
స్టేషన్ లో -ఈసారి రాగానే పెళ్ళి చేసుకుందామని అంటాడు. ఏదో తప్పించుకోవడానికి అన్నట్టు అనేస్తాడు. ఇక్కడా ఆమెకి నమ్మకం కల్గించడు. ఏడుస్తున్న ఆమెని నవ్వమని బ్రతిలాడుకుంటాడు. తను ఏం ప్రూవ్ చేసుకున్నాడని ఆమె నవ్వుతుంది. తండేల్ గా సొంత మనిషితో పెద్ద మనిషి తరహా కనిపించదు. అందుకని ఏడుస్తున్న ఆమెని అలాగే వదిలేసి రైలెక్కేసి వెళ్ళి పోయాడు!

సినిమా కథకి లాజిక్ అవసరం లేదేమో, కానీ క్యారక్టరైజేషన్ కి లాజిక్కే కావాలి. ఎందుకంటే నిత్యజీవితంలో మనందరికీ మానవ సంబంధాలు అనుభవమవుతాయి- దాంతో మనుషుల తత్వాలు తెలిసిపోతాయి. సినిమా పాత్రల మధ్య దీన్నే చదువుతారు ప్రేక్షకులు. ఏ పాత్ర అసహజమో, ఏ పాత్ర సహజమో తెలిసిపోతుంది. అసహజ పాత్రని వాళ్ళ అంతరంగం అంగీకరించదు. నాగచైతన్య రాజు పాత్ర అసహజమని ఇట్టే తెలుసుకున్నాక ఫాలో అవడానికి ఇబ్బంది పడతారు. ముందు పాత్ర హిట్టవ్వాలి. అప్పుడు సినిమా దానికదే హిట్టవుతుంది. 
       
ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) ముగిసి
, మిడిల్ (సెకండ్ యాక్ట్) ప్రారంభమయ్యే మలుపు. అంటే పాత్రకి ఆ కాన్ఫ్లిక్ట్ లొంచీ గోల్ ని సృష్టించే టర్నింగ్ పాయింటు. అంటే కథా ప్రారంభం. ఇంతదాకా బిగినింగ్ లో చూపించిందంతా కథ కాదు. మిడిల్లో ప్రారంభమయ్యే కథకి ఉపోద్ఘాతం మాత్రమే. మరి మిడిల్లో కథ ప్రారంభవమవడానికి ఇక్కడ రాజుకి గోల్ ఏది? సత్యతో తలెత్తిన కాన్ఫ్లిక్ట్ కి తనదంటూ గోల్ ఏర్పాటు చేసుకోకుండా జంపయ్యాడు. మరి సెకండాఫ్ మిడిల్ ఎలా నడవాలి కథ. కాబట్టి ఈ కంటెంట్ కథ కాదు. పాసివ్ పాత్రల గోల్ లేని గాథ అని ప్రూవ్ అవుతోంది!

4. సత్య సంగతీ డిటో
    ఇక సత్య కూడా రాజు కేం తీసిపోలేదు. రాజు ఏడాదిలో 9 నెలలు వేట కెళ్ళి తనకి దూరంగా వున్నా ఆమెకి అభ్యంతరం లేదు. వేట కెళ్ళిన ఒక జాలరి చనిపోతే మాత్రం ఆమెకి భయం పట్టుంకుంది రాజు గురించి. ఇదిలా వుంటే, వేట కెందుకు వెళ్ళడం లేదని  తండ్రిని అడిగినప్పుడు, అతను నెలల తరబడి వేట కెళ్తే ఇంటిదగ్గర భార్య చనిపోయిన విషయం కూడా తెలియలేదనీ, అందుకని సత్యని కూడా దూరం చేసుకోకూడదని వేట మానేసినట్టు చెప్పాడు. మరి రాజు చేత వేట ఎందుకు మాన్పించలేదంటే, రాజు విషయంలో నువ్వే నిర్ణయం తీసుకోవాలని చెప్పేశాడు.
        
ఇతడి వాదం కూడా విచిత్రంగా వుంది. కూతురికోసం తను వేట మానేసినప్పుడు, అదే కూతుర్ని వేటకెళ్ళే రాజుకెలా కట్టబెడతాడు? నీ నిర్ణయమని ఎలా అంటాడు? సత్య కి ఏ పరిస్థితుల్లో తన తల్లి చనిపోయిందో దాని గురించి బాధ భయం లేవు. ఇదే పరిస్థితి రేపు రాజుతో తనకూ ఎదురవ్వచ్చన్న స్పృహ కూడా లేదు. తల్లి మరణం, తన కోసం తండ్రి చేసిన త్యాగం ఇవేవీ ఆమెని రాజుని ప్రేమించడానికి అడ్డుకాలేదు- ఒక జాలరి చనిపోతే మాత్రం భయం పట్టుకుంది!
        
ఇలా పరస్పర విరుద్ధ పాయింట్లు సత్య పాత్రకి కల్పించడంతో పాత్ర కన్ఫ్యూజన్ లో   పడి, ఆ రకంగా పాత్ర చిత్రణని కథకుడి నుంచి అంగీకరించింది...ఈ మరణాలు, త్యాగాలూ లేకుండా సింపుల్ గా ప్రేమలో సమస్యలు తెచ్చి పెట్టే పాయింటు ఒకటి అంత స్పష్టంగా వుండగా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేసుకున్నట్టు కథకుడు?
        
వేట కెళ్ళి తొమ్మిది  నెలలు కనిపించకుండా పోయే రిలవెంట్ సమస్యకన్నా వేరే కారణం ఏం కావాలి సత్యకి గొడవ పడడానికి? తొమ్మిది నెలలు దూరంగా వుండే ప్రేమ నాకొద్దు - అంటే ఎవరైనా ఆమె పక్షానే సమర్ధించడాని కొస్తారు. సింపుల్. దీని గురించి అనవసరంగా తండ్రి ఫ్లాష్ బ్యాక్ సీన్లు, జాలరి మరణం సీన్లు వేసి కథని గజిబిజి చేసి, బోలెడు బడ్జెట్ ని వృధా చేసినట్టే కదా?
        
ఇక రాజు వెళ్ళిపోయాక సత్యని తండ్రి స్టేషన్ నుంచి ఇంటికి తీసికెళ్తాడు. వెంటనే తనకి పెళ్ళి సంబంధం చూడమని అనేస్తుంది. రాజు మీద  కోపంతో ఈ మాటనేస్తుంది. చంద్ర (కరుణాకరన్) అనే అతను పెళ్ళి చూపుల కొస్తాడు. సినిమా చివరి దాకా ఇతను సస్పెన్స్ లోనే వుంటాడు పెళ్ళి చేసుకుంటుందా లేదాని. అంటే దాదాపు రెండేళ్ళ కథాకాలం! సత్యకే స్పష్లత లేదు ఏం చేయాలో. తండేల్ గా ఎదిగిన రాజుపట్ల గౌరవాభిమానాలు లేకపోవడమే గాక, అలాటి తండేల్ గా హోదా పెరిగిన రాజుకి కాబోయే జీవిత భాగస్వామినిగా తాను హూందాగా ప్రవర్తించాలన్న ఆలోచనే కూడా  లేదు!

5. కాన్ఫ్లిక్ట్ నిర్మాణం

    కాన్ఫ్లిక్ట్ లోంచి రాజుకి గోల్ పుట్టాలంటే 4 గోల్ ఎలిమెంట్లు కావాలి. కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. కాన్ఫ్లిక్ట్ పుట్టాలంటే సత్యతో భేదాభిప్రాయం రావాలి. ఆమె 9 నెలలు కనిపించకుండా పోయే ప్రేమా పెళ్ళీ నాకొద్దంటుందనుకుందాం. అప్పుడు తప్పదంటాడు. సరే, నీది చిన్నప్పట్నుంచీ వేట కెళ్తున్న అలవాటు కదా, ఎకాఎకీన మానుకోమని నేనూ అనను- ఇదిగో ఇది కడుతున్నాను, టైమ్ తీసుకుని ఆలోచించుకో, అప్పుడు కూడా వేటే ముఖ్యమనిపిస్తే దీన్ని తెంచి సముద్రంలో పారేయ్- అని అతడి చేతికి దారం కట్టిందనుకుందాం...

ఇరుక్కుపోతాడు. ఆడది గుర్తుగా ఏదైనా ఇచ్చిందంటే  ఇక పీక్కోలేడు మగాడు. రాజు మాటలు త్రుంచి వేయవచ్చు-ఆమె కట్టిన దారం మాత్రం తెంచి పారెయ్యలేడు. సెంటిమెంటు. సక్సెస్ ఫుల్ బాక్సాఫీసు ఫార్ములా కూడా. మొత్తం ఈ దారం అనే ప్లాట్ డివైస్ మీదే ఆధారపడి ఇక ప్రేమ కథ!
       
కాన్ఫ్లిక్ట్ లో కథ ఓ నిర్ణీత పాయింటుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తూ పాత్రలకి ఛాలెంజీ విసరకపోతే అది ఆర్గ్యుమెంట్ తో కూడిన కథగా మారదు. ఇదేలాస్ట్ వేట
, మళ్ళీ వెళ్ళను-నిన్ను పెళ్ళి చేసుకుని వేరే పని చేసుకుంటానని అతను కన్విన్సింగ్ గా ప్రామీజ్ చేయడమో, లేదా అతను వేటే ముఖ్యమనుకుంటే ఆమె దారం కట్టో, ఇంకేదో పెట్టో చాలెంజీ విసరడం చేయకుండా- రైల్వే స్టేషన్ సీన్లో రాజూ సత్యలు అసలు పాయింటుకి రాకుండా ఎంత గొడవపడి విడిపోయినా - అది గాథకి పనికొచ్చే నస అనిపిస్తుందే తప్ప- కథని పుట్టించి ముందుకి నడిపించే యాక్షనబుల్ కాన్ఫ్లిక్ట్ అవదు.
       
ఇప్పుడు సత్య కట్టిన దారాన్నే తీసుకుని రాజు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడేం చేస్తాడు- అన్న హుక్ తో
, సస్పెన్స్ తో సెకెండ్ యాక్ట్ లో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతోంది. ఇప్పుడు సత్యతో ఇలా పుట్టిన కాన్ఫ్లిక్ట్ ని ఎలా పరిష్కరించాలన్నదే అతడి గోల్. ఈ గోల్ ఎలిమెంట్స్ లో పరిష్కారం అతడి కోరిక’, దీనికి తండేల్ గా (నాయకుడిగా) తన పదవీ పరువూ పణం గా పెడుతున్నాడు (వేట కెళ్ళక పోతే నీ పదవీ పరువూ పోతాయా అని సత్యే అన్నది). పరిణామాల హెచ్చరిక కోసం బిగినింగ్ లో రాజు తల్లితోనో, మరొక బంధువుతోనో లీడ్ ని క్రియేట్ చేయాలి- శివ లో నాగార్జున అన్న కూతురిలాగా. ఇక ఈ మూడు టూల్స్ ని డ్రైవ్ చేస్తూ వాటిలోంచి ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తే గోల్ – దాంతో కథా కథనాలూ బలంగా వస్తాయి. కథలో భావోద్వేగాలనేవి గోల్ వున్న  కాన్ఫ్లిక్ట్ లొంచే పుట్టాలి తప్ప- గోల్ వున్న కాన్ఫ్లిక్ట్ ని వదిలేసి వేరే సన్నివేశాలతో క్రియేట్ చేస్తే అవి కథకి సంబంధించిన భావోద్వేగాలనిపించుకోవు. తండేల్ గా రాజు తోటి జాలర్లకి నాయకుడే గానీ, కాన్ఫ్లిక్ట్ లో నాయకుడుగా అతడికే గోలూ లేదు! ఇదీ మౌలిక సమస్య.

6. ఏది కాన్ఫ్లిక్ట్?

    పైన చెప్పిన కాన్ఫ్లిక్ట్ తర్వాత, ఇంటర్వెల్లో రాజు బృందం సహా సముద్రంలో పాక్ దళాలకి చిక్కుతాడు. ఇంటర్వెల్ సీను కాబట్టి కథకి ఇదే కాన్ఫ్లిక్ట్ అవుతుందా? కాదు, ఈ కాన్సెప్ట్ రాజూ సత్యల ప్రేమ గురించే తప్ప పాక్ లో బందీలైన జాలర్ల గురించి కాదు. కాబట్టి ఈ ఇంటర్వెల్ సీను దీనికి ముందు చూపించిన  రాజూ సత్యల మధ్య ప్రేమలో పుట్టిన కాన్ఫ్లిక్ట్ దుష్పరిణామమే అవుతుంది తప్ప కాన్ఫ్లిక్ట్ కాదు! ఇది తెలుసుకోకపోవడం వల్ల ఇదే కాన్ఫ్లిక్ట్ అనుకుని సెకండాఫ్ నడపడంతో- ప్రేమ కథ చెదిరిపోయి- పాక్ జైలునుంచి బయటపడేందుకు జాలర్లు చేసే స్ట్రగుల్ గా మారిపోయింది సెకెండాఫ్.

7. సెకెండాఫ్ సంగతులు

    సెకండాఫ్  పూర్తిగా పాకిస్తాన్ జైల్లో జాలర్ల గాథ. ఇక రొటీన్ గా పాక్ ఖైదీలతో పోరాటాలు, దేశభక్తి ప్రదర్శనలు వగైరా. అసలు రాజు సముద్రంలో ఒక పాకిస్తానీని కాపాడే ప్రయత్నంలో సరిహద్దుని దాటడం వల్ల పట్టుబడ్డాడు. ఈ విషయం ఎక్కడా చర్చకి రాదు. రాజు దీన్ని రుజువు చేసుకుంటే కేసే లేదు. కానీ కేసు గురించి ఏ ప్రయత్నాలు చేయకుండా, బృందంతో కష్టాలు అనుభవిస్తూ వుండి పోతాడు. సత్యని ఆ పరిస్థితుల్లో వదిలేసి వచ్చిన తనకి ఆమె గురించి ఆలోచనే వుండదు. ఆమె అందమైన ఉత్తరాలు రాస్తుంది. రాజు వద్దనుకుని చంద్రని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న తను ఇంకా రాజుకి ఉత్తరాలు రాయడమేమిటో. సెకండాఫ్ లో ఇంటిదగ్గర ఒక సీన్లో అంటుంది- వాడి మీద ప్రేమ చచ్చిపోయింది, నామాట ఆ వినకుండా వెళ్ళి పోయాడని. ప్రేమ చచ్చిపోయాక ఇంకేం ప్రేమ గాథ.. ఈ క్యారక్టర్లేమిటో అస్సలర్ధం గావు!
       
అయినా రాజునీ అతడి బృందాన్నీ విడిపించేందుకు అరకొర ప్రయత్నాలు చేస్తుంది. అవేమీ ఫలించవు. ఇంతలో పాక్ ప్రభుత్వం జాలర్లని ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయిస్తుంది. ఆగస్టు 15 న భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు అదేదో గిఫ్టు గా అన్నట్టు విడుదల చేయడమేమిటి
- గర్వంగా వాళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 న విడుదల చేయకుండా?
       
ఇంతలో ఆగస్టు 5 న కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఈ విడుదల ఆగిపోతుంది. ఫర్వాలేదు
, కానీ ఆర్టికల్ 370 రద్దయితే పాక్ ప్రజలు భారీ యెత్తున హింసకి పాల్పడమేమిటి? ఇలాటి చాలా అవాస్తవిక చిత్రణలతో అనుకున్న దేశభక్తి ఫార్ములాతో బాక్సాఫీసుని జయించాలన్న ప్రయత్నం ఫలించలేదు. దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ 2 లో మతభక్తితో నార్త్ ప్రేక్షకుల్ని విజయవంతంగా  ఆకట్టుకున్నట్టు -ఈ సారి దేశభక్తితో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం లాభించ లేదనడానికి ఏడు రోజుల నార్త్ కలెక్షన్స్ 40 లక్షలే సాక్ష్యం.

8. చివరికేమిటి

    'తండేల్ లాంటి సీమాతర కాన్సెప్ట్ ని దేని మీద ఫోకస్ చేయాలో తెలిపే పాకిస్థానీ మూవీ ఒకటి వుంది. 2008లో బాధిత హిందువు గురించి ఒక పాకిస్థానీ మూవీ తీశారు. మెహరీన్ జబ్బార్ దర్శకురాలు. పేరు రామ్ చంద్ పాకిస్థానీ’. అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించిన బాలుడి నిజ కథే ఇది. ఏడేళ్ళ రామ్ చంద్ సరిహద్దులో ఒక పాక్ గ్రామంలో నివసించే దళిత హిందూ కుటుంబానికి చెందిన వాడు. ఒకరోజు తండ్రితో కలిసి అనుకోకుండా సరిహద్దు దాటి భారత్ వైపు వచ్చేస్తాడు. వీళ్ళు గూఢచర్యం ఛేస్తున్నారని భద్రతా దళాలు పట్టుకుని గుజరాత్ జైల్లో వేస్తారు.
       
ఇప్పుడు ఈ కాన్సెప్ట్ దేని గురించి వుండాలి
? అంతర్జాతీయ సంబంధాల కోవకి చెందే ఈ కాన్సెప్ట్
రాజకీయంగా సరైన వైఖరితో, లౌకిక దృక్పథంతో చొరబాట్లకి సంబంధించిన చట్టాలతో న్యాయ ప్రక్రియ/పోరాటం గురించే వుండాలి. ఇలాగే వుంది. వేరే ఏ దేశభక్తి, కులం, కులంలో అంటరానితనం, మతం, ప్రాంతం మొదలైన భావోద్వేగాల, మనోభావాల జోలికి పోకుండా, న్యాయ ప్రక్రియ/ పోరాటం మీదే ఫోకస్ చేసి వుంది.       

అయితే
పాక్ దళిత తండ్రీ కొడుకుల మీద ఇండియన్ పోలీసుల దౌర్జన్యం కూడా వుంది. ఇలా చూపిస్తే ముందు నీ దేశంలో దళితుల పరిస్థితి తెలుసుకో అంటారేమోనన్నట్టు, ముందే ఇలా కౌంటర్ ఇచ్చేసినట్టుంది. 9 అంతర్జాతీయ అవార్డులు పొందిన ఈ మూవీ తండేల్ ని పూర్తిగా దాని సీమాంతర ప్రేమ కథ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి తీసి వుంటే - బాక్సాఫీసు ఫలితాలు ఇంకింత బలీయంగా వుండేవని తెలియజేస్తోంది.
        
సెకండాఫ్ లో జైల్లో వేస్తున్నప్పుడు సోదా చేసి సెల్ ఫోన్లు సహా అన్ని వస్తువులూ తీసేసుకుంటారు. ఈ సెల్ ఫోన్ల దగ్గర -ప్రేమ కథ తెగిపోయిన ఈ గాథని పూర్తి స్థాయి ప్రేమ కథగా మార్చే లవ్ ట్రయాంగిల్ ఎలిమెంట్ వుంది. అదేమిటంటే- జైలు అధికారులు సెల్ ఫోన్లు చెక్ చేయకుండా వుండరు. అప్పుడా రాజు సెల్ లో సత్యతో ఫోటోలు, వీడియోలు చూస్తే? ఇదొక్కటి చాలు జైలు అధికారి ప్రేమ కథలో దుష్టపన్నాగం పన్నడానికి. ఇంతేకాదు, రాజు చేతికి సత్య దారం కట్టి వుంటే అది కూడా తీసేయమంటారు జైలు అధికారులు. రాజుకి సత్యతో రియల్ టెస్టు ఇక్కడే. అతను దారం తీయడు, జైలు నిబంధనల ప్రకారం దారం తీయకపోతే వాళ్ళూ ఊరుకోరు. ఈ దారం కథే ప్రేమ కథని లా క్కెళ్తుంది. ఇలాకాదనీ జైలు అధికారి సత్యనే మాయోపాయంతో వాఘా బోర్డర్ కి రప్పిస్తే...??
        జస్ట్ ఇదొక పిచ్చి వూహ. టేకిటీజీ, ఆల్ ది బెస్ట్.

—సికిందర్