రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, February 26, 2025

1368 : సందేహాలు - సమాధానాలు

 

Q : మీ బ్లాగు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. స్క్రీన్ ప్లేకి సంబంధించి కొత్త సమాచారం అందిస్తూ నాలాంటి వారికి తోడ్పడుతున్నందుకు కృతజ్ఞతలు. అయితే ఇది వరకు  సందేహాలు - సమాధానాలు శీర్షిక రెగ్యులర్ గా వచ్చేది. ఈ మధ్య రావడం లేదు. ఈ శీర్షిక నా వరకు చాలా ముఖ్యమైనది. ఇది ఇక ముందు వస్తుందా రాదా తెలుపగలరు.
ఎంపీఆర్, అసోసియేట్

A : 2020, 21 రెండేళ్ళు కోవిడ్ లాక్ డౌన్ తో సినిమా రంగం చిన్నాభిన్నమైంది. ఆ పరిస్థితుల్లో పాఠకులు చెల్లాచెదురయ్యారు. సందేహాలు అడిగేవాళ్లే లేరు సమాధానాలివ్వడానికి. అప్పుడాగిపోయిన శీర్షిక ఇప్పటికీ పుంజుకోలేదు. నెలకి ఒకటీ అరా ప్రశ్నలు వస్తే వాట్సాప్ లోనే వ్యక్తిగతంగా సమాధానమిస్తున్నాం. ఎక్కువ ప్రశ్నలొస్తే వారం వారం కాకపోయినా నెలలో రెండు సార్లు ఇవ్వొచ్చు. గత వారం మూడు ప్రశ్నలొచ్చాయి. వీటికి బ్లాగు ముఖంగానే సమాధానమిస్తున్నాం. మీరు ప్రశ్నలు పంపుతూ వుండండి-శీర్షికని రెగ్యులర్ గా నిర్వహిద్ధాం. ఒక సమస్యేమిటంటే, చాలా మందికి ప్రశ్నలు అడగడం రావడం లేదు. అందుకని ప్రశ్నలు పంపలేకపోతున్నారు. బ్లాగులో ఆర్టికల్స్ మొక్కుబడిగా చదివి వదిలేస్తే విషయం మీద పట్టు సాధించలేరు. అలా ప్రశ్నలడగడం రాదు. తాముంటున్న రంగంలో తమ మీద స్కిల్స్ పరంగా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తేనే ఎదగ గలుగుతారు. ఇన్వెస్ట్ చేయడమంటే డబ్బులు పెట్టుబడి పెట్టి నేర్చుకోవడమని కాదు. అలా కూడా చేయొచ్చు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ లో కోర్సు తీసుకుని. ఇన్వెస్ట్ చేయడమంటే జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి నేర్చుకోవడం. దీనికి ఈ ఉచిత బ్లాగు ఎల్లప్పుడూ తోడుంటుంది.

Q : మీ తండేల్ స్క్రీన్ ప్లే సంగతులు చదివాను. You are right. Conflict సరిగా లేదు. నేనైతే director కు ఈ  విధంగా చెప్పే వాడిని- హీరో ఒక చిన్న ఫైట్ తో కాకుండా, సినిమా పరిచయంలోనే అతను తండేల్, అంటే నాయకుడు. హీరోయిన్ కోరిక మేరకు  వేటకు వెళ్లనని, ఇదే చివరి సారని, వచ్చిన డబ్బుతో కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ చేస్తానని, దానితో మిగతా వాళ్లకు కూడా మేలు జరుగుతుందని చెప్పేవాడు (స్టోర్ చేసి రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్మడం ద్వారా).

ఇక హీరో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ గుజరాత్ లో నేల మీద కూర్చుని ధర్నా చేయడం, మంత్రి ఇంటి ముందు పెళ్లి చీర కట్టుకునే  చీప్ సీన్ ల కన్నా కూడా, ఢిల్లీ వెళ్లి కోర్టు ద్వారా లీగల్ పోరాటం, ఉద్యమం ద్వారా (social media and on the street etc) ప్రజల్లో ఒక మూవ్ మెంట్ తీసుకు రావడం  లాంటివి చేయాలి (రోజా సినిమాతో పోలిక వచ్చినా సరే).

ఇక పొతే director కు హీరో oriented  సినిమా చేయాలా, హీరోయిన్ oriented చేయాలా స్పష్టత లేదు. కామెడీ ఏమిటంటే, సుష్మా స్వరాజ్ కూతురు మంత్రి కాదు.  సాయి పల్లవి కొత్త ఫారిన్ మినిస్టర్ ను కలవాలి. నిజానికి ఆమె ఎవరినీ కలవ కూడదు. ఉద్యమం చేస్తే వాళ్లే సాయిపల్లవి దగ్గరికి రావాలి.
—సీఎస్సార్, దర్శకుడు

A : అసలు తండేల్ కాన్సెప్ట్ ఏమిటి? బలమైన ప్రేమ కథ చెప్పడమా, లేక పాక్ లో బందీల్ని విడిపించడమా? దేనికి మార్కెట్ వుంటుంది? ప్రేమకా, ఉద్యమనికా? దీని మీద స్క్రీన్ ప్లే సంగతుల్లో స్పష్టత నిచ్చాం. అయినా మీరు హీరోయిన్ ఉద్యమం చేసి హీరోని విడిపించాలంటున్నారు. హీరోయిన్ కోరిక మేరకు  వేటకు వెళ్లనని, ఇదే చివరి సారని, వచ్చిన డబ్బుతో కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ చేస్తానని, దానితో మిగతా వాళ్ళకి కూడా మేలు జరుగుతుందని చెప్పాలంటున్నారు. ఇలాటి మాటలతో కథ ముడిపడదు. అందుకని అతడెన్ని మాటలు చెప్పినా, అతడి చేతికి దారం కట్టి ఆమె ప్రేమో వేటో తేల్చుకో పొమ్మనాలని అన్నాం. ఒకే సినిమాలో రెండు కథలు చెప్పబోతే ఈ సినిమాలో జరిగినట్టే వుంటుంది. హీరోయిన్ కట్టిన దారం కోసం ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి పాక్ అధికారుల గుండెల్ని కదిలించేలా హీరో గనుక చేస్తే విడుదల దానికదే జరిగి పోతుంది. విడుదల కోసం అంత రభస రచ్చ పూర్తిగా అప్రస్తుతం. ప్రేమ కథలో ప్రేమతో గెలవాలి.

సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా వున్నప్పుడు విదేశాల్లో ఇరుక్కున్న ఎందర్నో ఒక ట్వీట్ చేసినా, ఫోన్ కాల్ చేసినా తక్షణ చర్యలు  తీసుకుని విడుదల చేయించేవారు. అందుకని ఆవిడ స్థానంలో కూతురు, ఎంపీ అయిన బాసురీ స్వరాజ్ ని మంత్రిగా చూపించి వుంటారు.

Q : మీమీద నా కంప్లెయింట్ ఏంటంటే మీరు బ్లాగుని పట్టించుకోవడం మానేశారు. రెగ్యులర్ గా రివ్యూలు లేవు, ఇతర ఆర్టికల్స్ లేవు. ఇక ఇంతేనా? ఏదైనా మార్పు వస్తుందా?
—ఏవీఎం,  టెక్సాస్

A : వస్తుంది. ఈ మధ్య నెలకి ఇద్దరికీ సినాప్సిస్ లు సెటప్ చేయడంతో సరిపోతోంది. ఒక్కో సినాప్సిస్ కి 15 రోజులైనా పడుతోంది. కథ ఒక్క రోజులో వచ్చేసినా డీటెయిల్డ్ సినాప్సిస్ కి టైము ఎక్కువ పడుతోంది. అందుకని బ్లాగులో కంటెంట్ మిస్సవుతోంది. ఈ వారం నుంచి ఇలా జరక్కుండా చూద్దాం. మీ యూఎస్ నుంచి గత రెండు రోజులుగా వ్యూస్ తాకిడి విపరీతం గా వేలల్లో పెరిగింది. ఓ వారం రోజులుగా  ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, వియత్నాం, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంగ్ కాంగ్, ఐర్లాండ్, బాంగ్లాదేశ్, బెల్జియం ...ఇలా చాలా దేశాల నుంచి విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో ఎన్నారై లున్నారు. మిగతా దేశాల నుంచి వస్తున్న వ్యూస్ స్పామ్ అనుకోవాలా? ఈ వ్యూస్ ని చూస్తే బాగా రాయాలి, చాలా రాయాలి, రెగ్యులర్ గా రాయాలని ఆవేశం వచ్చేస్తోంది... కానీ ఏం చేస్తాం, పరిస్థితులిలా వున్నాయి.
—సికిందర్