తారాగణం : సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షూ, మురళీ శర్మ, అజయ్, శ్రీనివాస
రెడ్డి, హైపర్ ఆది తదితరులు
కథ, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, స్క్రీన్ ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ, సాయి కృష్ణ
సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం : నిజార్ షఫీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాతలు : రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్
విడుదల : ఫిబ్రవరి 26, 2025
***
దర్శకుడు నక్కిన త్రినాథ
రావు నుంచి 'మజాకా' అనే మరో కామెడీ
ఫిబ్రవరి 26 న పోటీ లేని సోలో రన్ ని ఎంజాయ్ చేస్తూ రిలీజైంది. కానీ ఆ సోలో రన్ ని
క్యాష్ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కారణం కంటెంట్. బాక్సాఫీసుకి వెళ్ళే ముందు
రైటింగ్ టేబుల్ మీద దీనికి పని మిగిలే వుంది. కానీ సరాసరి బాక్సాఫీసు ముందే రైటింగ్
టేబులేసుకుని గబగబా రాసిచ్చేసినట్టుంది. దీంతో కంటెంట్ కి క్వాలిటీ అనేది లేకుండా
పోయింది. ఒక వైపు ప్రేక్షకులు ఇతర భాషల్లో
క్వాలిటీ కంటెంట్ కి అలవాటు పడుతూంటే ఇంకా
ఇలాటి సినిమాలు తీసే కాలంలోనే వున్నారు. ఈ కంటెంట్ క్వాలిటీ చెక్ చేయాలంటే దీని
స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళాల్సిందే.
కృష్ణ (సందీప్
కిషన్), వెంకట రమణ (రావు రమేష్) లు తండ్రీ కొడుకులు.
వెంకట రమణ భార్య చనిపోయింది. ఇప్పుడు కొడుకు పెళ్ళి చేద్దామంటే ఇద్దరు మగాళ్ళ మధ్య
మా అమ్మాయిని పంపమని చెప్పేస్తున్నారు. అయితే తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఇంట్లో
ఇంకో ఆడది వుంటుందని తెలుసుకుంటాడు వెంకటరమణ. తెలుసుకున్నదే తడవు యశోద (అన్షూ) అనే
ఏజ్ బార్ అమ్మాయి ని చూసి వెంటపడతాడు. ఇటు కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ) అనే
అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. ఇద్దరికీ ఈ ప్రేమ వ్యహారాలు అంత సులువుగా వుండవు చివరికెలాగో
ఒప్పించుకుంటారు. ఇదీ బ్యాక్ గ్రౌండ్.
ఇప్పుడు తామిద్దరూ దొంగ చాటుగా వ్యవహారాలు నడుపుతున్నట్టు తండ్రీ కొడుకులకి ఎప్పుడు తెలిసిపోయింది? తెలిసిపోయి ఏం చేశారు? అటు యశోదా మీరా ల మధ్య వున్న బంధుత్వమేంటి? ఆ బంధుత్వంలో వాళ్ళిద్దరి మధ్య ఇంకే సమస్య పెళ్ళికి అడ్డుగా వుంది? దీన్నెలా పరిష్కరించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ....ఇదీ మిగతా కథ.
రోమాంటిక్ కామెడీ కథ. తండ్రీ
కొడుకులు ఒకే కుటుంబంలోని ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం. ఇందులో ట్విస్ట్ అనుకుని
కల్పించిన కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే, ఆ ఇద్దరమ్మాయిలకి ఒకరంటే
ఒకరికి పడదు. అందుకని తండ్రీ కొడుకుల్ని పెళ్ళి చేసుకుని ఒకే ఇంట్లో ఎలా వుంటారు? ఇదీ సమస్య. దీన్నెలా పరిష్కరించుకున్నారు తండ్రీ కొడుకులనేది కథ. ఈ కథకి
చేసిన కథనంగానీ, పాత్ర చిత్రణలు గానీ పైపైన రాసేసి పైపైన
తీసేయడంతో నవ్వుల పాలయింది కామెడీ. ఇదంతా పూర్తి ఔట్ డేటెడ్ సినిమా తీయడానికి దారి
తీసింది. ఫస్టాఫ్ ప్రేమలు, ఏవో కామెడీలు చేసి నెట్టుకొచ్చినా, తీరా సెకండాఫ్ లోకొచ్చేసరికి కథకి సరైన దారీ తెన్నూలేక, నాటు- మోటు
కామెడీలతో వూపిరాడక విలవిల్లాడింది. వూపిరి కోసం కథ చేస్తున్న ఆర్తనాదాలే
సెకండాఫ్.
ఓపెనింగ్ లో బీచిలో
తాగి పడిపోయిన తండ్రీ కొడుకుల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అడుగుతాడు ఇన్స్
పెక్టర్. వాళ్ళిద్దరికీ ఎఫైర్స్ వున్నాయని తెలుసుకుని, తను నవల
రాస్తున్నానని- దాచకుండా ఎఫైర్స్ చెప్పమని దబాయిస్తాడు. ఈ ఓపెనింగే తేలిపోయింది. ఇలా
ఇప్పటికిప్పుడు ఇన్స్ పెక్టర్ నవల రాస్తున్నాని చెప్తే కన్విన్స్ అవడానికి రెడీగా
వుండరు ప్రేక్షకులు. లీడ్ ఇవ్వాలి. అంటే ఇలా పైపైన రాసేసి పైపైన తీసేయకుండా, లోతు పాతుల్లోకి వెళ్ళాలి. అతడికి నవలలు రాసే పిచ్చి వుంటే ముందు పాత్ర
పరిచయంతో ఎస్టాబ్లిష్ చేయాలి. అతను కేసుల కోసం గాక, నవల
కేదైనా ఐడియా దొరుకుతుందేమోనన్న దృష్టితో నేరస్థుల్ని టార్చర్ చేస్తున్నట్టుంటే
ఆసక్తి కల్గించే లీడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా ఐడియా కోసం తిరుగుతూ బీచికొస్తే, తాగిపడిపోయిన తండ్రీ కొడుకుల్ని చూసి ఇన్స్ ఫైర్ అయినట్టు చూపిస్తే పాత్రకి, ఓపెనింగ్ కి అందం చందం వుంటుంది.
ఇక తండ్రీ కొడుకులు ఇన్స్ పెక్టర్ కి చెప్పే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. పైన కథలో చెప్పినట్టు వెంకటరమణ కొడుక్కి సంబంధాలు చూస్తూంటే ఆడవాళ్ళు లేని ఇంట్లో పిల్లనివ్వమని వెనక్కి పంపించేస్తూంటారు. అటు కొడుకు కృష్ణ మీరాని ప్రేమిస్తూంటాడు. ఇక కొడుకు పెళ్ళి అవాలంటే తాను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని వెంకటరమణ యశోదతో ప్రేమలో పడతాడు. ఈ తండ్రీ కొడుకులకి ఆ హీరోయిన్లిద్దరూ లొంగరు. తర్వాత మెత్తబడతారు. తండ్రీ కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరు నడుపుతున్న వ్యవహారాలు బైటపడి పరస్పరం దొరికిపోతారు. అయితే మీరా యశోదా ఒకే ఇంట్లో వుంటున్న బంధువులని తెలుసుకుని షాకవుతారు. ఇదీ ఫస్టాఫ్ విషయం- కథ కాదు, కథ ఇంకా మొదలవలేదు. ఎందుకంటే హీరోయిన్ల మధ్య బంధుత్వం హీరో లిద్దరితో వావివరసలకి అడ్డు కాలేదు. కేవలం హీరోయిన్ల బంధుత్వం రివీల్ చేయడానికే ఈ ఇంటర్వెల్. ఈ బంధుత్వమే ట్విస్టు అనుకున్నారు. వావివరసలకి బంధుత్వం అడ్డు కానప్పుడు ట్విస్టు ఎలా అవుతుంది? అదొక మలుపు (టర్నింగ్) మాత్రమే అవుతుంది. ‘తూర్పు- పడమర’ లో’ వావివరసలే అడ్డు- కాబట్టి అది మతిపోగొట్టే ట్విస్టు అయింది.
అంటే ఇంటర్వెల్లో కూడా బిగినింగ్
ముగిసి ప్లాట్ పాయింటు- 1కి రాలేదు. అంటే ఫస్టాఫ్ లో ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం
కాలేదు. అంటే కథేమిటో ఇప్పుడు కూడా మనకి తెలియలేదు. కథేమిటో ఇప్పుడు సెకండాఫ్
ఓపెనింగ్ లో తెలుస్తుంది. బంధువులైన యశోదా మీరాలకి మధ్య బద్ధ వైరముందని. కాబట్టి ఈ
తండ్రీ కొడుకులని చేసుకుని ఒకే ఇంట్లో
వుండలేరని. ఇదీ వాళ్ళిద్దరితో వీళ్ళిద్దరికీ ఏర్పడ్డ కాన్ఫ్లిక్ట్. అంటే ప్లాట్
పాయింట్ -1 ఇప్పుడు ఏర్పడిందన్న మాట. ఎక్కడో ఫస్టాఫ్ లో 45 నిమిషాలకైనా రావాల్సిన ఫ్లాట్
పాయింట్-1, స్థానభ్రంశం చెంది మిడిల్ ప్రాంగణమైన సెకండాఫ్
ప్రారంభంలో వచ్చిపడింది. అంటే బిగినింగ్ వచ్చేసి మిడిల్ ని కబ్జా చేసిందన్న మాట. అంటే
బిగినింగ్ విభాగమనే ఉపోద్ఘాతమే ఇంత బారుగా సాగిందన్న మాట. అంటే సుమారు ఈ గంటా 25 నిమిషాల
సేపూ అసలీ సినిమా కథేమిటో తేలక తల్లడిల్లుతామన్న మాట!
స్ట్రక్చర్ రీత్యా కంటెంట్ ని విప్పిచూస్తే ఈ అనారోగ్యాలు కన్పిస్తాయి. ఇవి అనారోగ్యాలే కాదనుకుంటే నిరభ్యంతరంగా ఇలాగే చేసుకోవచ్చు. కథలో మిగతా సీన్లలో ఏదైనా సీనుని మధ్యలో ఆపేసి తర్వాత కలపొచ్చు. సీనస్ ఇంటరప్టస్ (దృశ్య భంగం అనొచ్చేమో) అంటారు దీన్ని. ఈ టెక్నిక్ ని ఇంటర్వెల్ సీనుకి కూడా వాడొచ్చు. అయితే ఇంటర్వెల్లో హీరోయిన్ల బంధుత్వం రివీల్ చేసినప్పుడు, అది తండ్రీ కొడుకులతో పెళ్ళిళ్ళకి అడ్డొచ్చే బంధుత్వం కాదని తెలిసి పోతున్నప్పుడు, ఈ ఇంటర్వెల్ సీనుని మధ్యలో ఆపి సెకండాఫ్ ఓపెనింగ్ లో పూర్తి చేయడం కుదరదు. ఎందుకంటే ఇంటర్వెల్లో బంధుత్వాన్ని రివీల్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడలేదు. అది కేవలం ఒక మలుపు (టర్నింగ్) మాత్రమే. దీన్నేదో ట్విస్టు అనుకుని, ఇంటర్వెల్ కి బావుందనుకున్నట్టుంది.
అజిత్ నటించిన ‘పట్టుదల’ లో త్రిషని కిడ్నాప్ చేసిన ముఠా, నిజానికి ఈ కిడ్నాప్ త్రిష పన్నిన పథకమేనని చెప్పినప్పుడు అది ఇంటర్వెల్ కి పూర్తి స్థాయి టర్నింగ్. సీనస్ ఇంటరప్టస్ జరగలేదు. కానీ సెకండాఫ్ మొదలు పెట్టగానే ఇంటర్వెల్లో చెప్పింది ఉత్తిదే అన్నప్పుడు ఇంటర్వెల్లో ప్రేక్షకుల్ని చీట్ చేసినట్టయ్యింది. అంటే ఫేక్ ఇంటర్వెల్ అయింది.
‘మత్తు వదలరా’ లో కూడా ఇలాటిదే ఫేక్ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్లో ఏదో ఘోరం జరిపోతోందన్నట్టు సీనుని ఆపి, సెకండాఫ్ లో ఓపెన్ చేసినప్పుడు - ఆ ఇంటర్వెల్ ఉత్తిదే నని చెప్పడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే. దీని బదులు ఆ తలుపు కొట్టిన వ్యక్తిగా బ్రహ్మాజీనే చూపించి ఇంటర్వెల్ వేసి వుంటే, సస్పెన్స్ క్రియేట్ అయ్యేది- చచ్చిపోయిన బ్రహ్మాజీ పాత్ర ఎలా బ్రతికి వచ్చిందన్న ప్రశ్నతో.
ఇంటర్వెల్ సీనుకి సీనస్ ఇంటరప్టస్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందంటే -ఇంటర్వెల్లో మధ్యలో ఆపిన సీను వల్ల సస్పెన్స్ పుట్టినప్పుడు. అంటే ఇంటర్వెల్లో ఎవరో బయటి నుంచి దబదబ తలుపు బాదుతున్నారనుకుందాం. అంత వరకూ నడిచిన కథ ప్రకారం హీరో కోసం పోలీసులు వెతుకుతున్నారనుకుందాం. అప్పుడు తలుపు బాదుతోంటే పోలీసులేనన్న భావం వస్తుంది, ఇప్పుడు హీరో ఏం చేస్తాడన్న సస్పెన్స్ పుడుతుంది. ఈ ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్ ఓపినింగ్ లో హీరో తలుపు తెరిస్తే- ఎదురుగా పోలీసులు గాక ఇంటి ఓనర్ నిలబడి వుంటే - అప్పుడు సీనస్ ఇంటరప్టస్ అవుతుంది.
కాబట్టి ‘మజాకా’ సెకండాఫ్ ప్రారంభంలో చూపించిన
కాన్ఫ్లిక్ట్ ని వెనక్కెళ్ళి ఇంటర్వెల్లోనే చూపించాలి. అప్పుడు స్ట్రక్చర్లో దోషం
తొలగిపోతుంది. ఏమిటా కాన్ఫ్లిక్ట్? బంధువులైన హీరోయిన్లకి
ఒకరంటే ఒకరికి పడదని, కాబట్టి తండ్రీ కొడుకులు వాళ్ళిద్దర్నీ కలిపి పెళ్ళిళ్ళు చేసుకుంటే అభ్యంతరం లేదనీ, మీరా తండ్రి (మురళీ
శర్మ) అంటాడు. ఇదేమీ కొత్త పాయింటు కాదు- ఒకరంటే ఒకరికి పడని రెండు కుటుంబాల్ని
కలిపి పెళ్ళి చేసుకునే కథలు వచ్చినవే. కాకపోతే ఇక్కడ పడకపోవడాన్ని హీరోయిన్లతో
పెట్టారు. బావుంది, పాతలోంచి ఇన్నోవేట్ చేసిన ఐడియా.
ఇదే ఇన్నోవేషన్ని కాన్ఫ్లిక్ట్ తో కూడా చూపించాల్సింది... కానీ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ మళ్ళీ పాత మూసలోకే తిరగబెట్టింది. హీరోయిన్లిద్దర్నీ కలపడమెలా అని చూసి చూసి వున్న రొటీనే హీరోలిద్దరి గోల్ అయింది. కానీ దీన్ని రివర్స్ చేసి, అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న హీరోయిన్లిద్దరి మధ్యా మరింత విద్వేష జ్వాలలు రగిలిస్తే ఎలా వుంటుందని వ్యూహాత్మకంగా గోల్ ని ఆలోచించలేదు.
అసలే విరోధంతో వున్న హీరోయిన్లని ఇంకా విడదీసే, వాళ్ళు తట్టుకోలేక ఇక చాలనుకుని వాళ్ళే కలిసిపోయే పాఠంగా వుంటే ఇందులో చాలా డైనమిక్స్ వర్కౌట్ అవుతాయి. అంటే వేల్యూ యాడెడ్ స్క్రిప్టుగా అప్ గ్రేడ్ అవుతుంది. ఇంకా విడదీసే ప్రయత్నాలతో కథనం యాక్షన్ లో వుంటుంది, కొత్త సిట్యుయేషన్స్ క్రియేటవుతాయి, హీరోలు పైకి హెల్ప్ గా, వెనుక విలన్లుగా డబుల్ గేమ్ ప్లే చేస్తారు, కథనం కొత్తగా మారితే కామెడీ కూడా కొత్తగా మారుతుంది, ఇంకా కొత్త మలుపులు కూడా ఎదురై థ్రిల్స్ పెరుగుతాయి.
ఇలా కాకుండా వాళ్ళని కలపాలన్న చాదస్తపు కథనంతో నేలబారుగా తయారయింది స్క్రిప్టు. ఇలా కలిపే ప్రయత్నాలు సిల్లీగా ఓ అయిదు సార్లు చేసి విఫలమవుతారు. వీటిలో పెళ్ళి దగ్గర ఒకటి, చావుదగ్గర ఒకటి చేసే ప్రయత్నాలు లౌడ్ కామెడీ. ఇంత కంటే క్రియేటివిటీ చేతగాలేదు. ఇక కలపలేమని తెలుసుకుని మీరా తండ్రినే అడుగుతారు. వెళ్ళి సపరేట్ గా పెళ్ళిళ్ళు చేసుకుని సపరేట్ గా కాపురాలు పెట్టమంటాడతను. ఈ ఆలోచన మనకి ముందెప్పుడో వస్తుంది. కథలో పాత్రలకి లేటుగా వస్తాయి. లేదా తండ్రీ కొడుకుల్లో ఒకరు పెళ్ళి చేసుకుని ఇంకొకరు త్యాగం చేయమంటాడు. ఇలా చెప్పి కూతురు మీరాకి వేరే సంబంధం చూస్తాడు. వెంకటరమణ యశోదని లేపుకు పోయే ప్లానేస్తాడు. యశోదా కృష్ణని కొడుకులా చూడడంతో కరిగిపోయి, తాను పెళ్ళి మానుకుని తండ్రి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇలా కథ ఎలా పడితే అలా మలుపులు పెరుగుతూ చివరి అరగంట తెచ్చి పెట్టుకున్న త్యాగాలతో సీరియస్ అయిపోతుంది సెకండాఫ్.
ఈ సెకండాఫ్ తో మెప్పించాలన్న
ప్రయత్నంతో, స్పెషల్ ఎట్రాక్షన్ అనుకుంటూ కథకి చాలా ట్విస్టు
లిచ్చామనుకున్నారు. అవి ట్విస్టులు కాదు సాధారణ టర్నింగులు. ట్విస్టులు వేరు, టర్నింగు వేరు.
ట్విస్టులో పజిల్ ఇమిడి వుంటుంది. అంటే చిక్కుముడితో వుంటుంది. ఈ చిక్కుముడిని
విప్పడమే కథగా వుంటుంది. టర్నింగు కథని ముందుకు నడిపించే సాధారణ ప్రక్రియ.
ట్విస్టు ఎలా వుంటుందో ఉదాహరణకి-
1973 లో హాలీవుడ్ నుంచి ‘40 క్యారట్స్’ అనే సినిమా వచ్చింది. ఇది బేతాళ కథలా వుంటుంది. దీన్ని తమిళంలో కె బాలచందర్ కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ, మేజర్ సౌందరరాజన్, రజనీ కాంత్ లతో 1975 లో ‘అపూర్వ రాగంగళ్’ గా తీశారు. దీన్నే దాసరి నారాయణరావు 1976 లో నరసింహ రాజు, శ్రీవిద్య, మాధవి, సత్యనారాయణ, మోహన్ బాబులతో ‘తూర్పు -పడమర’ గా తీశారు.
ఈ కథలో నరసింహ రాజు-శ్రీవిద్య ప్రేమించుకుంటారు, మరో వైపు మాధవి - సత్యనారాయణ ప్రేమించుకుంటారు. ఇలా వుండగా, మాధవి శ్రీవిద్య కూతురని, నరసింహరాజు సత్యనారాయణ కొడుకని కథ మధ్యలో రివీలై ట్విస్టు పడుతుంది.
ఇప్పుడేం చేయాలి? ఈ ట్విస్టులో పజిల్ నెలా విప్పాలి? తండ్రీ కొడుకులు తల్లీ కూతుళ్ళని ప్రేమించారు. తండ్రి కూతుర్ని ప్రేమించాడు, కొడుకు ఆమె తల్లిని ప్రేమించాడు.
ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? అని పాట. బేతాళ కథల్లో 24 వ కథ ఇదే. కొడుకు రాణిని ప్రేమిస్తాడు, తండ్రి రాకుమారిని ప్రేమిస్తాడు.
ఈ వావివరసల చిక్కు ముడిని విప్పడానికి తమిళంలో రజనీ కాంత్ పాత్రని ప్రవేశపెడతారు, తెలుగులో మోహన్ బాబు పాత్రని ప్రవేశపెడతారు.
అంటే ఇక్కడ కథ మధ్యలోపడ్డ ట్విస్టు విప్పడానికి తాళంచెవి పాత్రని వాడారు. ట్విస్టులో మలుపు వుండదు, పజిల్ వుంటుంది. ఈ పజిల్ ని విప్పే తాళం చెవిని కనుగొన గల్గితేనే కథ ముందుకెళ్తుంది.
కథ మధ్యలో ట్విస్టు వేస్తే దాన్ని విప్పే తాళం చెవి పాత్రని కనుగొని చివర్లో వాడతారు. అంతవరకు ఈ చిక్కుముడి ఎలా వీడుతుందన్న సస్పన్స్ తో కథ నడుపుతారు. కాబట్టి ‘మజాకా’ లో ట్విస్టులంటూ ప్రేక్షకుల్ని మభ్య పెట్టనవసరం లేదు. అవి సాధారణంగా కథలో వచ్చే మలుపులే. వాటిలో పజిల్ వుండదు.
ఫస్టాఫ్ లో రహస్య ప్రేమాయణాలు
నడుపుతున్న తండ్రీ కొడుకులు ఒకరి కొకరు దొరికిపోయినప్పుడు- ప్లాట్ పాయింట్ -1 ని
ఏర్పాటు చేసి కథ ప్రారంభించి వుంటే మొత్తం స్క్రిప్టు ఆర్డర్ లో వుండేది. తండ్రికి
పెళ్ళయితేనే కొడుక్కి పెళ్ళవుతుంది కాబట్టి, ముందు తండ్రి
తను పెళ్ళి చేసుకోవడానికి సహకరించమంటే, అలాగే కొడుకు రచనా
సహకారం అందించి ఈ కథని దారిలో పెడితే- అప్పుడు ముందు హీరోయిన్ల బంధుత్వంతో ఒక షాకు, తర్వాత ఇంటర్వెల్లో హీరోయిన్ల మధ్య వైరంతో ఇంకో షాకు ఇస్తే - ఈ
కాన్ఫ్లిక్ట్ ని సెకండాఫ్ లో రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోతే సరిపోయేది.
పోతే, పైపైన రాసేసి పైపైన తీసేశారనడానికి ఇంకో ఉదాహరణ- యశోద పాత్ర. ఈమె 30 దాటినా పెళ్ళి చేసుకోకుండా ఎందుకుందంటే- టీనేజిలో ప్రేమించిన వాడు మళ్ళీ వస్తానని మాటిచ్చి వెళ్ళాడుట. కానీ ఎంతకీ రాలేదట! మాటిచ్చాడు కాబట్టి తను అభిసారికలా ఎదురుచూస్తూ ఇలా భ్రహ్మచారిణిగా మిగిలిపోయిందట!
ఈమె అమోఘ మెచ్యూరిటీకి తోటి బంధువైన మీరాతో మోరల్ పోలీసింగ్ ఒకటి! నీతులు చెబుతూ మీరాని తన చెప్పుచేతల్లో వుంచుకుని స్వేచ్ఛ లేకుండా చేసే పెత్తనం. కానీ తను వెంకటరమణతో లేచిపోవా లనుకోవడానికి నీతులేం అడ్డురాలేదు. రైటింగ్ టేబులంటే ఈమెకి వొళ్ళు మంటలా వున్నట్టుంది...ముందు కానీయ్, తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చూసుకుందాం అన్నట్టుంది.
—సికిందర్