రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 16, 2024

1424 : రివ్యూ



రచన-దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
తారాగణం : సూర్య తేజ ఏలే, మీనాక్షీ గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
విడుదల : ఏప్రిల్ 5, 2024
***
        తెలంగాణ పీరియడ్ సినిమా దొరసాని (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే ధని  కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ భరతనాట్యం అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన కీడాకోలా అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది. లాజిక్ ని కామెడీ చేసే మెంటల్ పాత్రలతో కొత్తదనం సంతరించుకుని ఓవర్సీస్ లో కూడా హిట్టయ్యింది. మరి ఈ క్రైమ్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వుంది? దీన్ని ఒకసారి చూడొచ్చా?  చాలా కాలం తర్వాత దర్శకుడి రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

రాజు సుందరం (సూర్యతేజ) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూంటాడు. రొటీన్ గానే ఇంట్లో కష్టాలకి, గర్ల్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) ని ఒప్పించడానికీ డబ్బులుండవు. డైరెక్టర్ అయిపోదామని కథలు చెప్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటాడు. కథల కోసం మైక్రోఫోన్లు ఏర్పాటు చేసి మనుషుల మాటలు రహస్యంగా వింటూ వాటిని కథలుగా రాస్తూంటాడు. మరోపక్క దివాకర్ (హర్షవర్ధన్) అనే పెద్ద క్రిమినల్ డ్రగ్స్ దందా చేస్తూంటాడు. ఓ రోజు రెండు కోట్ల దందా గురించి మైక్రోఫోన్లో విని, డబ్బు సంపాదనకి ఇదే మార్గమని వాళ్ళ అడ్డాకి వెళ్తాడు రాజు సుందరం. అక్కడ భగతనాట్యం అనే కోడ్ నేమ్ తో డ్రగ్స్ డీల్ జరుగుతూంటే బ్యాగు లాక్కుని పారిపోతాడు. ఆ బ్యాగులో డబ్బులుండవు, డ్రగ్స్ వుంటాయి. ఈ క్రమంలో శకుని (అజయ్ ఘోష్) అనే పోలీసు అధికారికి చిక్కుతాడు. ఇక్కడ్నుంచి బయటపడి డ్రగ్స్ తో ఏం చేశాడు, వాటిని తానే అమ్మి డబ్బు సంపాదించాడా, లేక ఇంకేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

తెలంగాణ ఫీల్ ఏం లేదు గానీ క్రైమ్ కామెడీకి పనికొచ్చే కథే. అయితే చేతిలో వున్నది కథలా భావించి తీయలేదు. ఏదో కాకరకాయ, ఎలా తీసినా క్రైమ్ కామెడీ అయిపోతుంద
నుకుని తీసినట్టుంది. ఇందుకే క్లయిమాక్స్ సహా విషయం ఆషామాషీగా వుంది. డ్రగ్స్ కి పెట్టిన పేరు భరతనాట్యం సెన్సారింగ్ లో భగత నాట్యం అని పలకడంగా మారిపోవడం ఈ కంటెంట్ కి తగిన న్యాయమే. ఫస్టాఫ్ అసలు కథేంటో ఎవరైనా చెప్పగలిగితే  ఈ సినిమా బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు.
       

ఫస్ట్ హాఫ్ అంతా హీరో సినిమా కథలు వినిపిస్తూ చేసే కొత్తదనం లేని కామెడీలు
, విలన్ దివాకర్, అతడి గ్యాంగ్ తో ఇబ్బంది పెట్టే కామెడీలూ సాగుతూ గంటపాటు ఓపికని పరీక్షిస్తూ- ఇంటర్వెల్ కి హీరో చేతికి డ్రగ్స్ రావడంతో ఆసక్తికర మలుపే వస్తుంది.
        
అయితే సెకండాఫ్ లో ఆ డ్రగ్స్ తో హీరో ఏం గేమ్ ఆడుకోవాలో ప్లానింగ్ లేకపోవడంతో తిరిగి సహన పరీక్షగా మారిపోయి ఆశ వదులుకునేలా చేస్తుంది. ఇందులో విలనీలు కూడా పాత సినిమాల్లో సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలనీల్లా తీరుబడి డైలాగులతో వుంటాయి. పాత హిందీ సినిమాల్లో విలన్ అజిత్ అనుచరులు మోనా డార్లింగ్, రాబర్ట్ లతో వుండే కామెడీ చాలా పాపులరైంది. ఏ సినిమాలోనైనా విలన్ అజిత్ కి మోనా డార్లింగ్, రాబర్ట్ లు వుండాలల్సిందే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అజిత్- మోనా డార్లింగ్- రాబర్ట్ లతో కొత్త కొత్త జోకులు పుట్టిస్తున్నారు. వాళ్ళని సజీవంగా వుంచుతున్నారు.
       
ఇలాటి క్రియేటివిటీని ఈ క్రైమ్ కామెడీలో మిస్సయ్యారు.
ముత్యాలముగ్గు లో రావు గోపాలరావుని, జస్టిస్ చౌదరి లో సత్యనారాయణనీ తీసుకుని వాళ్ళ స్టయిల్ విలనీతో ఎంటర్ టైన్ చేసివుంటే ఈ కథ లేని సినిమాకి ఇదే పెద్ద ఆకర్షణ అయ్యేది.  కథ లేని సినిమాగా తీయాలనుకుని వుంటే, కథ లేకుండా  కేవలం క్యారక్టర్లతో ఎలా నడిపారో ఎల్ డొరాడో (1966) అనే కౌబాయ్ క్లాసిక్ చూసి తెలుసుకుని వుండొచ్చు.
        
ఇక షరా మామూలుగా సెకండ్ హాఫ్ ఆ డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం అందరూ వెంటబడడం చూసి చూసి వున్నఅరిగిపోయిన  సీన్లే. ఇంతకంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ హీరో పాత్రకి క్రియేటివిటీ తెలియకుండా పోయింది. క్వెంటిన్ టరాంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు కోసం వేట వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో పాత్రలకి తప్ప ప్రేక్షకులకి తెలీదు. చివరికా బ్రీఫ్ కేసు చేజిక్కుంచుకున్న పాత్ర మూత తెరిచి చూస్తే, బ్రీఫ్ కేసులోంచి అతడి మొహం మీద వెలుగు పడుతూంటుంది. తృప్తిగా చూస్తూంటాడు. ఆ ముగింపులో కూడా బ్రీఫ్ కేసులో ఏముందో ఆడియెన్స్ కి చూపించరు. చూపిస్తే డబ్బులో. డ్రగ్సో, వజ్రాలో వుంటే సర్ప్రైజ్ ఏముంటుంది? అందుకే ఇంకేదో గొప్పది వున్నట్టు ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు. ఇది కథనంలో ఉపయోగపడే ఒక ప్లాట్ డివైస్ అనీ, దీన్ని మెక్ గఫిన్ అనాలనీ, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టి చెప్పాడు.

మొత్తానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కథ ఇలా నడిపిస్తే, ఇక సినిమాలేం తీస్తాడో వూహించాల్సిందే. కొసమెరుపేమిటంటే,  దీనికి పార్ట్ 2 వుంటుందని సూచించారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరోగా సూర్యతేజ యాక్టింగ్ ఫర్వాలేదు, స్పీడుంది. స్పీడుతో ఓవరాక్షన్ చేయకుండా నిగ్రహింఛుకున్నాడు. హీఓయిన్ మీనాక్షి గోస్వామి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ హిందీ, తెలుగు కాలిపి మాట్లాడుతూంటుంది. షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ లా వుంది. సినిమా హీరో అవ్వాలనే పాత్రలో వైవా హర్ష తన అనుభవంతో కామెడీని బాగా హేండిల్ చేశాడు. పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, విలన్ గా హర్షవర్ధన్ లది పాత కాలపు విలనీ.
        
చాలా పరిమిత బడ్జెట్ తో తీసినట్టున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చూడకూడదు. పాటలు ఒక్కటి కూడా కనెక్ట్ కావు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు భరతనాట్యం చేయిస్తుందని చెప్పడం కవి హృదయమేమో.  దీన్ని సెన్సార్ ఖండించి, భగతనాట్యం గా పాత్రల చేత పలికించింది.
—సికిందర్

1423 : రివ్యూ

 

రచన -దర్శకత్వం: చిదంబరం
తారాగణం : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, ఖాలిద్ రెహమాన్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం :             షైజూ ఖాలీద్
నిర్మాతలు : సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ
బ్యానర్ : పరవ ఫిలిమ్స్
తెలుగు పంపిణీ : మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : ఏప్రిల్ 6, 2024
***
        టీవల రెండు మలయాళం సినిమాలు వసూళ్ళలోనూ సంచలనం సృష్టించాయి.  వాటిలో ఒకటి ప్రేమలు’. ఇది 135 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వసూలు చేసింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్  230 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్  ఈ రోజు విడుదలైంది. దీని గొప్పదనమేమిటో ఓసారి చూద్దాం...

కథ
కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు. ఒకర్నిమించిన పనులు మరొకరు చేయాలని పోటీలు పడుతూంటారు. 2006 లో వీళ్ళల్లో ఆర్ట్స్ క్లబ్ గ్రూపు కొడైకెనాల్ విహార యాత్ర ప్లాన్ చేస్తారు. కొడైకెనాల్‌ అంతా తిరిగి ఎంజాయ్ చేశాక, గుణ గుహలు చూడాలని ఉత్సాహ పడతారు. కమలహాసన్ నటించిన గుణ షూటింగ్ ఇక్కడే జరగడంతో గుహల కీ పేరొచ్చింది. ప్రమాదకరమైన ఈ గుహాల్లోకి ప్రవేశాన్ని నిషేధించి  ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దూకి సాహసం ఛేస్తారు మంజుమ్మల్ బాయ్స్. అలా గుహలు చూస్తూ తిరుగుతూంటే బాయ్స్ లో ఒకడైన సుభాష్ (శ్రీనాథ్ భాసి) మనిషి వెడల్పుగల లోతైన రంధ్రం లో పడిపోతాడు. ఇది ప్రాణాంతక బిలం. ఇందులోకి ఇంతవరకూ 16 మంది పడిపోతే శవాల్ని కూడా బైటికి తీయలేక పోయారు.
       
ఇప్పుడు సుభాష్ పడిపోవడంతో మిత్రబృందం భయంతో కేకలు వేస్తారు. పోలీస్ స్టేషన్ కి పరిగెడతారు. గ్రామస్థులకి చెప్పుకుంటారు. పోలీసులు ఉల్టా కేసు బనాయిస్తారు. కాళ్ళావేళ్ళా పడ్డాక పోలీసు
,లు, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారు. తాడు సాయంతో లోపలికి వెళ్ళి బాధితుడ్ని పైకి తీసుకు రావడానికి సిబ్బంది ముందుకు రారు. మంజుమ్మల్ బాయ్స్ లో ఒకడైన కుట్టన్ (
సౌబిన్ షాహిర్) ముందుకొస్తాడు.
       
కుట్టన్ ఈ సాహసం చేయడానికి కారణముంది. ప్రాణాలు పణంగా పెట్టి  స్నేహితుడ్ని కాపాడేందుకు అతను పూనుకోవడానికి ప్రేరేపించిన ఆ కారణమేంటి
? అలా స్నేహితుడ్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఇందుకు అధికార్లు అందించిన సహాయక చర్యలేమిటి? అసలు వందల అడుగుల లోతులో పడిపోయింది గాక, భారీగా కురిసిన వర్షం నీళ్ళల్లో సుభాష్ బతికున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ. 

యదార్థంతో ప్రయోగం
ఇది యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సర్వైవల్ డ్రామా.  యదార్థ సంఘటనలతో మలయాళంలో వరుసగా మూడు సర్వైవల్ డ్రామాలు హిట్టయ్యాయి. కేరళ వరద బీభత్సం మీద ’2018’ (2023), గుణ గుహల మీద మంజుమ్మల్ బాయ్స్ (2024), సౌదీ వలస కార్మికుడి మీద ఆడు జీవితం (2024).  గుణ గుహలు  అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది. 2016 వరకూ ఈ బిలంలో పడిపోయిన వ్యక్తుల కేసులు 16 నమోదయ్యాయి. కేవలం మంజుమ్మల్ బాయ్స్ ఘటనలో ఒక్కడే బతికి బయట పడ్డాడు.
       
ఈ సినిమా చూస్తూంటే ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. అంత మంది ఆ రంధ్రం లో పడిపోతున్నప్పుడు ఇనుప మెష్ తో ఆ రంధ్రాన్ని ఎందుకు మూసేయలేదు
? కేవలం అక్కడికి చేరుకోకుండా ఎక్కడో ఫెన్సింగులు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు? ఈ విషయం తట్టే కాబోలు-

సినిమా చివర్లో ఇదే చూపించాడు దర్శకుడు- ఆ రంధ్రం మీద ధడేలుమని ఇనుప మెష్ పడేసి! కానీ క్రోనాలజీ ప్రకారం చూస్తే ఇది కరెక్ట్ కాదు. మంజుమ్మల్ బాయ్స్ ఉదంతం 2006 లోనే జరిగింది. అప్పుడు ధడేలుమని ఇనుప మెష్ పడేస్తే
, 2016 వరకూ ఇంకొన్ని మరణాలు ఎలా జరిగినట్టు? ఇంతకీ ఇప్పుడైనా మూసి వుందా లేదా? ఎవరైనా గూగుల్ చేసి కనుక్కోవాలి.

       
ఈ సర్వైవల్ డ్రామా 2 గంటల పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్. హ్యూమన్ డ్రామా.  అడ్వెంచర్స్ లో ఒక లెసన్. పర్యాటకులు నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు
? ఈ గుహల్లో తేళ్ళు పాములైనా వుంటే? నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సర్వైవల్ డ్రామా.
        
అందుకే దీన్ని హార్రర్ కామెడీలా తీసి ఎంటర్ టైన్ చేయాలనుకోలేదు. తెలుగు చేతులైతే ఈ పనే చేసి సినిమా తీస్తాయి. వాడు రంధ్రంలో పడిపోయి ఆర్తనాదాలు చేస్తూంటే అక్కడ దెయ్యాల్ని కూడా జొప్పించి కామెడీ చేస్తారు. చివరికి ఏ వేపమండల అమ్మవారి ముందో కాంతారా డాన్సులు చేసి బిలంలో దెయ్యాల్ని చంపి అర్భకుడ్ని కాపాడతారు.

1. క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (స్టీవెన్ స్పీల్ బెర్గ్ -1977),
2.
 ‘మంజుమ్మల్ బాయ్స్’ (మలయాళం- 2024)
 
బిలం అంతర్భాగాన్ని సెట్ వేసి షూటింగు జరిపారు. ఈ కథని కేవలం బిలంలో పడిపోయిన మిత్రుడి రెస్క్యూ ఆపరేషన్ గా చూపిస్తే ఇది సినిమా అయ్యేది కాదు. డాక్యుమెంటరీ అయ్యేది. ఈ ప్రమాదానికి సమానాంతరంగా  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ బాయ్సే అప్పటి పిల్ల మూక. వాళ్ళల్లో ఒకడు (సుభాష్) తన మీద ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ వుంటాడు. ఆవిప్పుడు బిలంలో పడిపోవానికి సింబాలిక్ గా వుంటాయి. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సీన్స్ తో సందర్భానుసారంగా ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఒకసారి అంతా నదిలో దూకేసి ఈత కొడుతూంటారు. సుభాష్ నీ దూకెయ్యమంటారు. భయపడుతూ దూకేసిన సుభాష్ ఏమయ్యాడు? అప్పుడు వాడ్నిఎవరు కాపాడారు. ఇది ఇప్పటి  ప్రమాదంతో ఎలా లింకప్ అయింది? ఇప్పుడు కుట్టన్ రంధ్రంలోంచి సుభాష్ ని కాపాడ్డానికి ప్రేరణ ఏమిటి? లోనైన ఎమోషన్స్ ఏమిటి?

కదిలించే ఎమోషనల్ డ్రామా కూడా ఇది.  ఫ్రెండ్ షిప్ స్టోరీ కూడా. యువనటులతో యూత్ ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్న ప్రయోజనాత్మక సినిమా. నిడివి కేవలం రెండు గంటలు. తారాగణ బలం లేని సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో వచ్చేదాకా ఆగకుండా బిగ్ స్క్రీన్ మీద చూస్తే దీని బలం పదింతలు తెలుస్తుంది. ఆడు జీవితం తర్వాత బలమైన సినిమా చూడాలనుకుంటే ఇదే.

2024 లో సందర్శకుల్ని ఆకర్షించడానికి గుహకు వెళ్ళే రహదారిని  తిరిగి తెరిచారు. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేసే వుంచారు. ఈ సినిమా ప్రారంభ ముగింపుల్లో గుణ లో కమల హాసన్ వెంటాడే పాట ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఇళయరాజా స్వరకల్పనలో వస్తూంటుంది. గుహ బాధితుల్ని పరామర్శిస్తున్నట్టు.

—సికిందర్

Sunday, April 14, 2024

1422 : రివ్యూ!

 

ర్శకత్వం : ఫిలిప్ మార్టిన్
తారాగణం : రూఫస్ సెవెల్, గిలియన్ ఆండర్సన్, కీలీ హవేస్, బిల్లీ పైపర్ తదితరులు
రచన : పీటర్ మోఫాట్, జియోఫ్ బుస్సేటిల్
సంగీతం : అన్నే నికితిన్, హన్నా పీల్; ఛాయాగ్రహణం : నానూ సెగల్
బ్యానర్స్ : ది లైట్‌హౌస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, వోల్టేజ్ టీవీ
నిర్మాతలు : రాడ్‌ఫోర్డ్ నెవిల్లే, హిల్లరీ సాల్మన్
విడుదల : నెట్‌ఫ్లిక్స్
***
        2019 నాటి ఒక బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని విడుదలైన నెట్ ఫ్లిక్స్ మూవీ స్కూప్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది. ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా వుంది. బిబిసి జర్నలిజం నోయిడాలో కొలువుదీరిన మన గోదీ భజన మీడియా జర్నలిజానికి అందనంత సుదూరంగా, అందుకోలేని ఎత్తులో జర్నలిజం విలువలతో వుంటుంది. అందుకే ఎంత భారీ కూపీ లాగినా టీఆర్పీల కోసమని సొంత బాకా వూదుకుంటూ హంగామా చేయదు. వార్తల్లో ఆ దోషి వుంటాడు, తనుండదు. అందుకే బ్రిటన్ యువరాజు భాగోతాన్నిబట్టబయలు చేసి, అతడ్ని పదవీచ్యుతుడ్ని చేసిన విస్ఫోటక టెలివిజన్ ఇంటర్వ్యూని ప్రసారం చేస్తూ- ఇది విమానంవచ్చి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొన్న పేలుడు కాదు, సునామీ ఉత్పాతం కాదు, అణుబాంబు విస్ఫోటం అంతకన్నా కాదు- ఇది కేవలం కారు ప్రమాదం కంటే తక్కువ రకం మామూలు ప్రసారం అని నిరాడంబరంగా చెప్పుకుంది. ఈ కొటేషన్ బాగా పాపులరైంది.
        ఇంతకీ ఎవరా బ్రిటన్ యువరాజు? అతనేం చేశాడు? తర్వాత ఏమయ్యాడు? ఏమా కథ? ఈ వివరాల్లోకి వెళ్దాం...

2010-2019 రెండే ఆధారాలు
2010 లో న్యూయార్క్ లో సిటీలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ (రూఫస్ సెవెల్), జెఫ్రీ ఎప్‌స్టీన్ (కొలిన్ వెల్స్) అనే అతడితో కలిసి నడుచుకుంటూ పోతూంటే, ఒక ఫోటోగ్రాఫర్ వెంబడించి ఫోటోలు  తీస్తాడు. డ్యూక్ ఆఫ్ యార్క్ బ్రిటన్లో ప్రభువుల బిరుదు. దీన్ని పాలిస్తున్న చక్రవర్తి రెండవ కుమారుడికి ఇస్తారు. తొమ్మిదేళ్ళ తర్వాత, 2019 లో లండన్లో బిబిసి న్యూస్ నైట్ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్‌అలిస్టర్ (బిల్లీ పైపర్), పత్రికలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ ఆండ్రూ స్పాన్సర్ చేసిన యువ వ్యాపారవేత్తల ఈవెంట్‌లోని ఫోటోల పక్కన ఫోటోని చూస్తుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ప్రిన్స్ ఆండ్రూ కలిసి వెళ్ళడం. న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికర్. అతడిమీద మైనర్ బాలికలతో పాల్పడిన లైంగిక నేరాల ఆరోపణలున్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ కోసం అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూంటాడు. ఎందరో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అతను పలుకుబడిగల ధనిక అమెరికన్ ఫైనాన్షియర్.
       
ప్రిన్స్
ఆండ్రూ, ఎప్‌స్టీన్ లు చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా వున్నారు. 2006లో లైంగిక నేరాలకి పాల్పడిన తర్వాత కూడా ఎప్‌స్టీన్ తో యువరాజు స్నేహాన్ని కొనసాగించినట్టు ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది సామ్ కి. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ ని కాంటాక్టు చేసి ఎప్‌స్టీన్ వివరాలు మరిన్ని రాబడుతుంది. ఎప్‌స్టీన్ ఇంటికి వస్తూ పోతున్న చాలా మంది మైనర్ బాలికల ఫోటోలు ఆమె చేతికొస్తాయి.

   
రియల్ సీన్ 
ఇక ప్రిన్స్ ఆండ్రూని ఈ విషయంపై ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయిస్తుంది సామ్.
న్యూస్‌నైట్ ప్రోగ్రాం ప్రెజెంటర్ ఎమిలీ మైట్లిస్ (గిలియన్ ఆండర్సన్) ఇంటర్వ్యూల్ని ఎరేంజ్ చేస్తూంటుంది. ఆమె యువరాజు పర్సనల్ సెక్రెటరీ అమండా థిర్స్క్(కీలీ హవేస్) ని కలిసి ఇంటర్వ్యూని పిచింగ్ చేస్తుంది. ప్రిన్స్ ఆండ్రూ తేలిగ్గా తీసి పారేస్తాడు. సామ్ పట్టుదల వదలదు. కానీ ఆమె టీం ఇక దీనిపై ఆసక్తి చూపదు. సామ్ నిరాశగా గడుపుతూంటే, న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ అరెస్టవడం, జైల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోతాయి.
       
ఇదే
సమయంలో, వర్జీనియా గుఫ్రే అనే ఎప్‌స్టీన్ బాధితురాలు యువరాజు తనతో మూడుసార్లు గడిపాడని బయట పెడుతుంది. దీంతో యువరాజు ఆండ్రూ, సామ్ కి ఇంటర్వ్యూ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
       
ఆ ఇంటర్వ్యూలో అతనేం చెప్పాడు
? 2010 లో ఆ
రోజు ఎప్‌స్టీన్ ని ఎందుకు కలిశాడు? వర్జీనియా చేసిన ఆరోపణలకి ఏం సమాధానం చెప్పాడు? ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇంటర్వ్యూ బాగా వచ్చింది కదూ అని ఎందుకు సంతృప్తి చెందాడు? అసలు తన మీద ఆరోపణల్ని ఖండించి ఇంటర్వూని నిరాకరించకుండా ఎందుకు మొత్తం తన చిట్టా విప్పాడు? ఈ ఇంటర్వ్యూ ప్రసారమయ్యాక అతడి పరిస్థితి ఏమిటి? అతడిపై బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఏం నిర్ణయం తీసుకుంది? ఇవన్నీ ఈ 103 నిమిషాల పాటు సాగే ఈ మూవీ చూస్తే తెలుస్తాయి.

జర్నలిజపు ఝలక్
2022 లో బిబిసి మాజీ ‘న్యూస్‌ నైట్’ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్అలిస్టర్ రాసిన స్కూప్స్ : బిహైండ్ ది సీన్స్ ఆఫ్ ది బిబిసీస్ మోస్ట్ షాకింగ్ ఇంటర్వ్యూ  అన్న పుస్తకం ఆధారంగా ఈ మూవీ నిర్మించారు. ప్రిన్స్ ఆండ్రూ పతనానికి కారణమయిన స్కూప్ కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌ సిబ్బందితో చర్చలు జరిపిన ముగ్గురు బిబిసి మహిళా జర్నలిస్టుల తెర వెనుక కథ ఇది.  మూవీ కోసం కథని బిబిసి న్యూస్‌నైట్ బృందం స్కూప్ ని ఎలా లాగింది, ఆండ్రూ అసలు  ఇంటర్వ్యూకి ఎందుకు అంగీకరించాడన్న రెండు అంశాల చుట్టూ కేంద్రీకరించా మని రచయితల్లో ఒకడైన పీటర్ మఫాట్ చెప్పాడు.
        
నిజ జీవితంలో ఇంటర్వ్యూ యువరాజు ఆండ్రూ పబ్లిక్ ఇమేజ్‌ని తుడిచిపెట్టేసింది.  ఇంటర్వ్యూలో 59 ఏళ్ళ ఆండ్రూతో అతడి ఇగోని ముక్కలు చేసే ఒక మాట అంటుంది సామ్- ఇది మీ బ్రాండ్ కి దెబ్బ కాదు, ఇది మాత్రమే మీ బ్రాండ్- అని! మనకేదో బ్రాండ్ వుందని మనసు లోపల అనుకుంటాం. బయటినుంచి చూసేవాళ్ళకి ట్రోలింగ్ మెటీరియల్ లా కనపడతాం. నా బ్రాండే నాకు రక్ష అని ఆండ్రూ చేయరాని పనులు చేశాడు. బహుశా ఈ కారణంగానే ఇవ్వరాని ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంతో ట్రోలింగ్ మెటీరీయల్ గా మారాడు.

     
మూవీ సీన్ 
2010 లో ఓ ఫోటో
, 2019 లో ఆ ఫోటో ఆధారంగా ఇంటర్వ్యూ ఈ రెండే అతడ్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు దారితీశాయి. అసలు రాజవంశంలో ఎంతో ప్రముఖుడైన అతను
అటువంటి ఇంటర్వ్యూకి ఆసలెందుకు అంగీకరించాడన్న ప్రశ్నకి ఈ మూవీ సమాధానమిస్తుంది. స్కూప్’ కథ రెండు పార్శ్వాల్ని అందిస్తుంది: బిబిసి మహిళా జర్నలిస్టులు ముగ్గురు ఒకవైపు, రాజ కుటుంబంలో ఆండ్రూ, అతడి కూతురు, సెక్రెటరీ మరోవైపు. అలాగని ఇదేమీ పెద్ద హై టెన్షన్ డ్రామాగా ఏమీ వుండదు. నాటకీయత వుండదు. అసలు రెండు పార్శ్వాల మధ్య సంఘర్షణే వుండదు. అన్ని సినిమా నియమాలకూ  విరుద్ధంగా డాక్యుమెంటరీలా కూడా వుండదు. రియలిస్టిక్ సినిమా అనడానికి కూడా లేదు. ఇదో వింత రూపం.
       
జర్నలిస్టుల వైపు నుంచి కథ సాగుతుంది. వాళ్ళలో టెన్షన్ ఏమీ వుండదు. పరుగులుండవు. బ్యాంకు ఉద్యోగులు తలవంచుకుని పని చేసుకుంటున్నట్టు డెస్కుల్లో కూర్చుని ప్రశాంతంగా పని చేసుకుంటూ వుంటారు. ఆండ్రూ మొదట ఇంటర్వ్యూకి ఒప్పుకోకపోతే భారీగా ఇంటర్వెల్ బ్యాంగేమీ పడదు. తెలుగు దర్శకుడు ఈ ఛాయాల్లో కనిపించడు. ఇంకెలా ఇంటర్వ్యూ సంపాదించాలన్న గోల్ కూడా వుండదు. విధివశాత్తూ జైల్లో
ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకుంటే, వర్జీనియా అనే బాధితురాలు ఆండ్రూ మీద ఆరోపణలు చేస్తే అలా కలిసి వస్తుంది.
       
ఇంటర్వ్యూ లో సామ్ ఆండ్రూని ప్రశ్నలతో అదరగొట్టదు.
మీరు మామిడిపండు ఎలా తీసుకుంటారు? చీకుతారా? లేక కోసుకు తింటారా? అని అభిమానంతో అడిగినట్టు, మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఏం డ్రింక్ తీసుకుంటారు? అని ప్రేమగా అడిగినట్టు, ప్రశ్నలు అడుగుతుంది.

కుతూహలమే బలం
గొప్ప తారాగణం లేకపోతే ఈ రకమైన మూవీ పని చేయదు. కల్పిత కథయితే ఎంత గొప్ప తారాగణ బలమున్నా పనిచేయదు. ఇది నిజ కథ. అందుకని ఏం జరిగి వుంటుందన్న సహజ ఆసక్తి, కుతూహలమే తారాగణానికి కలిసి వచ్చాయి. ప్రతి ఒక్కరికి బిబిసి గురించి తెలుసు. ప్రజల సొమ్ముతో నడిచే దానికో గౌరవముంది. అది ఇతర వార్తా సంస్థల్లాగా, సోషల్ మీడియాలాగా లాభార్జన దృష్టితో పోటీపడదు. సమగ్రతతో కూడిన బ్రాండ్‌ నేమ్ ని కాపాడుకునే ఔచిత్యం దానికవసరం- స్కూప్’ లోని పాత్రల్ని ఈ సూత్రమే నడిపిస్తుంది. అందుకే ఈ శతాబ్దంలో మీడియా స్వేచ్ఛ గురించి, విలువ గురించి, దాని ఆవశ్యకత గురించీ చాలా నిరాడంబరంగా, అంతర్లీనంగా మెసేజీనిచ్చే ఈ కథని రెగ్యులర్ జర్నలిజం థ్రిల్లర్ లా తీయలేదు దర్శకుడు ఫిలిప్ మార్టిన్.
        
ఇంటర్వ్యూ తర్వాత పరిణామాల్ని కొన్ని చిన్న చిన్న  సన్నివేశాలతో, టైటిల్ కార్డ్స్ తో, అలాగే సోషల్ మీడియా రియాక్షన్స్ తో కలిపి, ప్రిన్స్ ఆండ్రూ స్కాండల్ కి ముగింపు నిచ్చాడు. రాణి ఎలిజబెత్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులోనే వచ్చేస్తునది. ఆఖర్న వర్జినియా విషయంలో ఆండ్రూ లో వచ్చిన మార్పు కూడా. ఇది జర్నలిస్టులు తప్పక చూడదగ్గ మూవీ.
—సికిందర్ 

Friday, April 12, 2024

1421 : రివ్యూ

 

దర్శకత్వం : శివ తుర్లపాటి
తారాగణం : శ్రీనివాస రెడ్డి, అంజలి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు
రచన : కోనవెంకట్, భాను; సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ
నిర్మాత : ఎంవీవీ సత్యనారాయణ
విడుదల ; ఏప్రిల్ 11, 2024
***
          2014 లో హిట్టయిన 'గీతాంజలి' కి సీక్వెల్ గా 'గీతాంజలి  మళ్ళీ వచ్చింది' తో తిరిగొచ్చింది అంజలి. ఇది కూడా హార్రర్ కామెడీ. దీనికి కోనవెంకట్ రచయిత. శివ తుర్లపాటి కొత్త దర్శకుడు. మరి ఇది కూడా హర్రర్ తో భయపెట్టిందా, బోలెడు మంది కమెడియన్లతో నవ్వించిందా తెలుసుకుందాం...
కథ
సినిమా దర్శకుడుగా శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాప్స్ తీసి ఇక ఛాన్సులు రాక యాతన పడుతూంటాడు. ఇలాంటప్పుడు హీరో అవ్వాలనుకుంటున్న ఫ్రెండ్ అయాన్ (కమెడియన్ సత్య) ని బుట్టలో వేసుకుంటాడు. హీరో చేస్తానంటూ డబ్బులు గుంజుతూంటాడు. అయాన్ కి ఈ మోసం తెలియడంతో ఇరకాటంలో పడ్డ శ్రీనుకి ఊటీ నుంచి ఆఫర్ వస్తుంది. విష్ణు (రాహుల్ మాధవ్) అనే ప్రొడ్యూసర్ సినిమా తీద్దాం రమ్మని కాల్ చేస్తాడు. ఊటీలో అంజలి (అంజలి) కాఫీ షాప్ నడుపుతూంటుంది. శ్రీనుకి సినిమా ఆఫరిచ్చిన విష్ణు ఇక్కడ సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలనీ కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో ఒక శాస్త్రి (రవిశంకర్), అతడి భార్య(ప్రియా), కూతురూ దెయ్యాలుగా వుంటారు.
        
వీళ్ళు దెయ్యాలెలా అయ్యారు? ఈ దెయ్యాల మహల్లో సినిమా తీయాలన్న విష్ణు ఉద్దేశమేమిటి? అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? ఈ సినిమాలో అయాన్ హీరోగా నటించాడా? పూర్వం అంజలి అక్క గీతాంజలి ఆత్మ ఏమైంది? ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందా? అసలీ మొత్తం వ్యవహారమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
హార్రర్ కామెడీలని వదిలిపెట్టడం లేదు. మూడు వారాల క్రితమే ఓం భీమ్ బుష్ అనే హార్రర్ కామెడీ విడుదలైంది. ఇప్పుడు ఇది మరో హార్రర్ కామెడీ. ఇది 2014 లో హిట్టయిన హార్రర్ కామెడీ గీతాంజలి కి సీక్వెల్. దీనికి కూడా కోన వెంకట్ రచయిత. అయితే హార్రర్ కామెడీల్లో హార్రర్ కి భయపడ్డం ఎప్పుడో మానేశారు ప్రేక్షకులు. కేవలం అందులో  కామెడీనే పట్టించుకుంటున్నారు. ఇందులో మొదటిది ఎలాగూ వర్కౌట్ కాలేదు, రెండోది సెకండాఫ్ లో కాసేపు వర్కౌట్ అయింది.
       
అంటే నవ్వించడం కూడా కష్టమైపోతోంది. నవ్వించే కళ కనుమరుగైపోతోంది. మహల్లో దెయ్యాలతో కామెడీకి వాటితో నటించాల్సిన సినిమా షూటింగుకి సంబంధించిన సీన్లు అవి వున్నంత వరకే నవ్విస్తాయి. దర్శకుడుగా శ్రీనివాస రెడ్డి దెయ్యాల్ని జూనియర్ ఆర్టిస్టులుగా నమ్మించి సత్యా
, అంజలీలతో నటింపజేయడం, సత్య చాలా ఫన్నీ సిట్యుయేషన్లు క్రియేట్ చేయడం తెగ నవ్వించే అంశాలే. అలాగే కెమెరామాన్ కిల్లర్ నానిగా సీనియర్ కమెడియన్ సునీల్ దెయ్యాలతో హిలేరియస్ కామెడీ క్రియేట్ చేస్తాడు. దీనికి పదే పదే నవ్వుకోవచ్చు. అతడి స్కిల్స్ అలాటివి. ఈ రెండు ఎపిసోడ్స్ తర్వాత క్లయిమాక్స్ లో, మొదటి భాగంలోని గీతాంజలి ఆత్మ రావడం దగ్గర మాత్రం కథ కుదరక అసంతృప్తిగా ముగింపుకి చేరుకుంటుంది.
       
ఇక ఫస్టాఫ్ చూస్తే శ్రీనివాస రెడ్డి సినిమా చాన్సు ప్రయత్నాలు
, సత్యాని బకరా చేసి వాడుకోవడం, అతడి రచయితలుగా సత్యం రాజేష్, షకలక శంకర్ చేసే  కామెడీ వగైరాలతో చాలా బలహీనంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఊటీ నుంచి ఆఫర్ వచ్చాకే బోరు తొలగి ఆసక్తి పెరుగుతుంది. ఇక మహల్లో దెయ్యాలతో ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వా లేదు. ఇలా మొత్తంగా చూస్తే, హార్రర్ తో భయపెట్టడం పూర్తిగా విఫలమై, కామెడీతో నవ్వించడం సెకండాఫ్ లో రెండు ఎపిసోడ్లలో మాత్రమే సఫలమైందని చెప్పాలి.

నటనలు –సాంకేతికాలు
అంజలి, గీతాంజలి ఆత్మ పాత్రలు రెండిటినీ అంజలి మామూలుగానే నటించేసింది. షరా మామూలుగా ఈ సినిమాలో కూడా ఎమోషన్లు లేకపోవడం వల్ల నటనలు పైపైనే వుంటాయి. దాదాపు ప్ర్తఈ తెలుగు సినిమాలో ఎమోషన్లనేవి కరువైపోతున్నాయి. ఇక కమెడియన్ల శ్రేణి  బారుగానే వుంది - శ్రీనివాస్ రెడ్డి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్ తదితరులు. సునీల్, సత్యలకి మాత్రమే  నవ్వించడానికి బాగా కుదిరింది. మిగిలిన వారి స్కిల్స్ వృధా అయ్యాయి. రవిశంకర్, ప్రియా దెయ్యాలుగా వాళ్ళ కథేమిటో కూడర్లేదు. విలన్ గా రాహుల్ మాధవ్ ఫర్వాలేదు.
       
ఛాయాగ్రహణం
, మహల్ సెట్, గ్రాఫిక్స్,ఇతర సాంకేతికాలు రిచ్ గా వున్నాయి గానీ సంగీతం బలహీనంగా వుంది కథా కథనాల్లాగే. కొత్త దర్శకుడు శివ తనదైన ఒక శైలి అంటూ, ముద్ర అంటూ ఏమీ క్రియేట్ చేసుకోకుండా యావరేజీ దర్శకత్వంతో సరిపెట్టేశాడు.
—సికిందర్