రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 31, 2024

1416 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : బ్లెస్సీ
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, శోభా మోహన్, కెఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్, రాబిన్ దాస్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : కెఎస్ సునీల్  
బ్యానర్స్ : విజువల్ రోమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా
నిర్మాతలు : బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
విడుదల :  మార్చి 28, 2024
***
            ప్రముఖ మలయాళ యువ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన, సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ మూవీ ఆడుజీవితం- ది గోట్ లైఫ్ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేధానికి గురై, తర్వాత కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ పొంది అనుకున్న విధంగా వరల్డ్ రిలీజ్ గా, మార్చి 28 న ప్రపంచ ప్రేక్షకుల ముందు కొచ్చింది. సౌదీ అరేబియాలో, ఇతర గల్ఫ్ దేశాల్లో నిషేధాన్ని తొలగించలేదు. అరబ్బు దేశాలకి వ్యతిరేకం అన్పించే కేరళ వలస కార్మికుడి కథతో రూపొందిన ఈ సినిమాలో అరబ్బుల కాఠిన్యాన్ని నిర్భయంగా చిత్రించారు. దర్శకుడు బ్లెస్సీ- పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ అపూర్వ సృష్టి మలయాళ సినిమా చరిత్రలో స్వర్ణ పుట అనొచ్చు. దీన్ని తెలుగు సహా ఐదు భాషల్లో విడుదల చేశారు. తెలుగులో మైత్రీ మూవీస్ పంపిణీ చేశారు. అన్ని భాషల్లో, ముఖ్యంగా యువ ప్రేక్షకుల్ని సైతం కదిలిస్తున్న ఈ ఆర్ట్ సినిమా తరహా సర్వైవల్ డ్రామాలో ఏమున్నదో ఓసారి పరిశీలిద్దాం...

కథ

ఐదవ తరగతి చదివిన నజీబ్ మహమ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) కేరళ గ్రామంలో చెరువులో ఇసుక తీసే పని చేసుకుంటూ భార్య సైనూ (అమలా పాల్) నీ, తల్లి ఉమ్మా(శోభా మోహన్) నీ పోషించుకుంటూ వుంటాడు. అయితే సౌదీ వెళ్ళి బాగా సంపాదించి అభివృద్ధిలోకి రావాలని స్నేహితుడు హకీమ్ (కెఆర్ గోకుల్) తో కలిసి సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు.        అక్కడ ఏజెంట్ మోసం చేయడంతో, వేరే అరబ్బులు వీళ్ళని తలో వైపు లాక్కువెళ్ళి ఎడారిలో గొర్రెల మంద మధ్య పడేస్తారు. గొర్రెల్ని కాయమంటారు. నజీబ్ కన్న కలలు ఒక్కసారిగా పటాపంచలవుతాయి. ఇక్కడ పరిస్థితి ఎలా వుంటుందంటే, కుక్క కన్నా హీనంగా చూస్తారు. వెళ్ళిపోతామన్నా పోనివ్వరు. గొర్రెల పెంపక కేంద్రం యజమాని ఖఫీల్‌ (తాలిబ్ అల్ బలూషి) పత్రాలు లాక్కుని చించేస్తాడు. తిండి పెట్టడు, మంచి నీళ్ళు కూడా తాగనివ్వడు. ఎర్రటి ఎడారి ఎండలో గొర్రెల్ని కాయమని తంతాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. తిండికి అల్లాడుతూ బక్కచిక్కిన నజీబ్ కి, దాదాపు ఇదే పరిస్థితుల్లో వున్న హకీం ఎడారిలో ఎదురవుతాడు. ఇద్దరూ కావలించుకుని గట్టిగా ఏడ్చేస్తారు.

హకీం పనిచేస్తున్న చోట తమలాగే ఒక ఆఫ్రికన్ బానిస ఇబ్రహీం ఖాద్రీ (నిర్మాత జిమ్మీ జీన్ లూయిస్) వుంటాడు. అతడికి ఎడారిలో తప్పించుకుని రోడ్డెక్కే మార్గం తెలుసు. ఓ రోజు ఖఫీల్ కూతురి పెళ్ళికి పోతూ, గొర్రెల్ని నజీబ్ కి అప్పజెప్పి పోతాడు. ఇదే అదునుగా భావించిన నజీబ్ పారిపోయి వాళ్ళిద్దర్నీ కలుసుకుంటాడు. ఇక్కడ్నుంచీ ముగ్గురూ ఆ ఎడారిలోంచి ఎలా బయటపడి బతికి బట్ట కట్టారన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

2008లో మలయాళంలో బెన్యామిన్ అనే రచయిత రాసిన, 100 సార్లు రీప్రింటయిన ఆడుజీవితం నవల ఈ సినిమాకాధారం. ఈ నవల సౌదీ అరేబియాలో నజీబ్ మహమ్మద్ అనే కేరళ వలస కార్మికుడి నిజ కథని చిత్రిస్తుంది. ఈ నవల 2009లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు సహా అనేక అవార్డుల్ని సంపాదించింది. ఇంగ్లీషు, హిందీతో బాటు మరికొన్ని ఇతర భాషల్లోకి అనువాదమైంది.
       
అప్పట్నుంచే దీన్ని సినిమాగా తీయాలని దర్శకుడు బ్లెస్సీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే చిత్రానువాదం చేశాక బడ్జెట్ మోపెడవుతుందని భయపడి పక్కన పెట్టేశాడు. అయినా
నిర్మాతకోసం చాలా సంవత్సరాలు వెతుకుతూ, చివరికి 2015లో ఇద్దరు విదేశీ నిర్మాతల్ని సంపాదించుకుని తానూ నిర్మాతగా మారి, 2020లో  ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. షూటింగ్ కి సౌదీ అరేబియా అనుమతి ఇవ్వకపోతే, జోర్డాన్ లో, అల్జీరియాలోని సహారా ఎడారిలో షూటింగ్ జరిపాడు. ఆ కోవిడ్ మహమ్మారి కాలంలో ఎలాగో షూటింగ్ జరిపి, 2022 నాటికి పూర్తి చేశాడు.
       
గల్ఫ్ కెళ్ళిన కార్మికుల జీవితాల గురించి చాలా సినిమాలొచ్చాయి.
ఆడు జీవితం లాంటిది రాలేదు. ఆడు జీవితం చూసిన ఏ సాధారణ వ్యక్తి అయినా గల్ఫ్ కలల్ని శుభ్రంగా తుడిపేసుకుని, ఉన్న ఊరు కన్న తల్లి ఒరేవొరే మరవకురా అని గంజి తాగి కంటినిండా నిద్రపోతాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ లా అరబ్బులతో తొక్కించుకుని, రాబందులతో పొడిపించుకుని, డొక్కెండిన బతుకు దిక్కులేని ఎడారిలో సమాధి చేసుకోవాలనుకోడు.

ఇసుక రేణువు నుంచి ఎడతెగని ఎడారి సువిశావిస్తీర్ణం వరకూ, చురుకైన గొర్రె ముఖం నుంఛీ, ఓపికైన ఒంటె కళ్ళ వరకూ -దగా పడ్డ వలస కార్మికుడి బతుక్కి సాక్ష్యాలే. ఎడారిలో ఎర్రటి ఎండలో ఈ సాక్ష్యాల్ని కెమెరా ఎత్తి పట్టుకోవడమన్నది మామూలు మాట కాదు. ఈ పరిస్థితి ఎక్కడ్నించి బదలాయింపు అయింది? కేరళ పల్లెలో  నీలం నీరు- ఆకుపచ్చ భూమి -సస్యశ్యామల తావులు- అనే ప్రకృతి దృశ్యం నుంచి తీసి బయటకి ఇసుక సముద్రంలో విసిరేస్తే ఉత్పన్నమైంది. ఈ కాంట్రాస్ట్ ని పొందుపర్చడం అంతర్జాతీయ స్థాయి తరహా స్క్రీన్ ప్లే రచనే.
       
1990 లలో ఈ కథ స్థాపించారు. పనివాడి చెమట ఆరిపోకముందే ప్రతిఫలం చెల్లించమని చెప్పే మత గ్రంధం ఉద్భవించిన దేశంలో సాటి మనిషిని గొర్రెకన్నా హీనంగా కొట్టి వెట్టి చేయించుకునే అరబ్బు నీతి ఎక్కడ్నించి వచ్చిందో మింగుడుపడని వ్యవహారమే. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన సమస్యే. అయితే ఈ కథ దీన్ని చర్చించదు. మనుగడ కోసం పనివాడి సాహసోపేత ప్రయాణాన్ని కళ్ళముందుంచి
, ప్రశ్నల్ని- వాటి జవాబుల్నీ ప్రేక్షకులకే వదిలేస్తుంది.
       
నేరుగా సౌదీ విమానాశ్రయంలో కథ ప్రారంభమవుతుంది. నజీబ్
, హకీం మిత్రులిద్దరూ తమకి ఉద్యోగాలిచ్చిన కంపెనీ కోసం ఎదురుచూస్తూంటే, ఎవరో ఇద్దరు అరబ్బులు ఇద్దర్నీ విడదీసి తలో దిక్కు లాక్కుపోయే దృశ్యం- హకీం ఆర్తనాదాలతో దద్దరిల్లుతుంది. భాష తెలియదు. భాష తెలిసిన హిందీ బానిస వుంటే నజీబ్ కి హిందీకూడా రాదు. యజమాని ఏమంటున్నాడో అర్ధంగాదు. ఎండిన రొట్టె ముక్కపడేస్తే అది పళ్ళరిగేలా నమిలినా గొంతు దిగదు. చుక్కనీళ్ళు తాగనివ్వరు. ఈ నజీబ్ కష్టాల మధ్య మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి- కేరళలో అతడి సుఖవంతమైన జీవితం గురించి. చెరువు నిండా నీళ్ళలో మునకల గురించి. భార్యతో జీవితం గురించీ. జలకాలాటల్లో వాళ్ళిద్దరి
మధ్య కొరియోగ్రఫీ చేసిన శృంగార గీతం ఈ వాస్తవిక కథలో అసాధారణ కమర్షియల్ కృతిలా కనిపిస్తుంది రెహ్మాన్ మ్యూజిక్ తో.

ఈ స్మృతులు ఎడారి జీవితం నుంచి పారిపోయేందుకు పురిగొల్పితే, తుపాకీ గుండు దెబ్బకి కుప్పకూలుతాడు. అతడి బాధని గొర్రె మాత్రమే అర్ధం జేసుకుని తోటి గొర్రెలతో కలిసి పరామర్శకి వస్తుంది. ఒంటెలూ అన్యాయాన్ని గమనిస్తాయి. రాబందులు వాటి జాతి లక్షణంతో నరమాంస భక్షణకి దిగుతాయి. గంట సేపు ఈ ఫస్టాఫ్ స్ట్రగుల్ తర్వాత, పారిపోవడంతో మొదలయ్యే సెకండాఫ్ సమరం రెండు గంటలూ సాగుతుంది. మొత్తం కలిపి మూడుగంటల సర్వైవల్ డ్రామా. యూనివర్సల్ అప్పీలున్న బాక్సాఫీసు ఫార్ములా.
       
నవల స్వగతంతో వుంటుంది. దీన్ని సినిమా దృశ్యాలుగా మార్చడానికే సంవత్సరాలు పట్టిందని చెప్పాడు దర్శకుడు. ఇక గొర్రెలు
,
ఒంటెలు వాటికి మూడ్ వచ్చినప్పుడు షాట్స్ తీయడం కూడా అంతే. ఈ జీవుల్ని నిర్దేశించలేరు. అవి మూడ్‌లోకి వచ్చేవరకూ  వేచి వుండి ఆ షాట్స్ ని పట్టుకోవాలి. సినిమాలో గ్రాఫిక్స్ జంతుల్లేవు సులభంగా చిత్రీకరించడానికి.

నటనలు – సాంకేతికాలు

పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తనని తాను శిక్షించుకుంటూ సాధించిన శారీరక పరివర్తన వొక ఆశ్చర్యపర్చే అంశం. క్రమక్రమంగా అతడి కృశించే రూపం కడుపు తరుక్కుపోయేలా చేస్తుంది. పాదాల మీద బొబ్బలు, పగిలిన పెదవులు, అట్టకట్టిన వెంట్రుకలు -సుకుమారన్ శరీరంలో ఇంకిన వేడి, ధూళీ మేకప్ విభాగపు తిరుగులేని పనితనంగా కనిపిస్తాయి. ప్యాంటు వదులైపోయి తాడుతో కట్టుకుంటున్నప్పుడు బక్కచిక్కిన అతడి కడుపు మీద తీసిన షాట్ చూసి ఒక్కసారి ఏడ్వాలన్పించని ప్రేక్షకులుండరు. పాత్ర కోసం, తదనుగుణ నటన కోసం సుకుమారన్ తనని తాను ఇంతలా శిక్షించుకోవడం నట శాస్త్రంలో ఏ పాఠం కిందికి వస్తుందో వెతకాలి. అతను ఆస్కార్ కి నూరు విధాలా అర్హుడని ఇందుకే గొంతు విప్పుతున్నారు ప్రేక్షకులు.
       
హకీం పాత్రలో
కేఆర్ గోకుల్ మాత్రం నాటకీయంగా కనిపిస్తాడు. ఆఫ్రికన్ ఇబ్రహీం ఖాద్రిగా నిర్మాత జిమ్మీ జీన్ లూయిస్ నిగూఢంగా కనిపిస్తూ, ఎడారి దాటించే మార్గం చూపే తోటి ప్రయాణికుడి పాత్రలో, మంచి చెడుల మధ్య అనేక వైరుధ్యాల్ని సూచిస్తూ ఒక ముద్ర వేస్తాడు.  అమలాపాల్, శోభా మోహన్ లు ఫ్లాష్ బ్యాకుల్లో సంక్షిప్తంగా కన్పించే పాత్రలు వేశారు. గొర్రెల యజమానిగా ఓమన్ నటుడు డాక్టర్ తాలిబ్ అల్ బలూషి క్రూరత్వంతో వూపేస్తాడు. దీనికి ముందు ఒక మలయాళ సినిమాలో నటించి మలయాళీలకి తెలిసిన నటుడే. ఇక హిందీ తెలిసిన బానిసగా రాబిన్ దాస్ కూడా గుర్తుంటాడు.

ఛాయాగ్రహకుడు సునీల్ కెఎస్ ఎడారిని, అక్కడ చిక్కుకున్న జీవితాల్నీ ఎంత కఠినంగా చూపించాడో, కేరళనీ అక్కడి జీవితాల్నీ అంత సున్నితంగానూ చిత్రీకరించాడు.   సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ఎడిటింగ్ ని ఫీల్ కాం. ఈ కళాత్మక సినిమాని ఎడిటింగ్ ఫీలవకుండా చూడలేం. ముఖ్యంగా సన్నివేశాలు మారే ట్రాన్సిషన్ షాట్లన్నీ స్మూత్ గా ట్రావెల్ అవడం శ్రీకర్ ప్రసాద్ అద్భుత ఎడిటింగ్ పనితనం. ఎడారిలో సుకుమారన్ నోటి దగ్గర చాలీచాలని నీటి ధార, అతడి జ్ఞాపకాల్లో నిండుగా ప్రవహిస్తున్న కేరళ నది దృశ్యంతో సూపర్ ఇంపోజ్ అవడం ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. షాట్స్ కూడా ఇలా అర్ధాలు చెప్తాయి.
       
ఇక రసూల్ పోకుట్టి
ఎడారిలోని డైజెటిక్ ధ్వనుల ముద్రణతో ఇంకో మ్యాజిక్ చేస్తాడు. శబ్ద ఫలితాలు కూడా ఈ సినిమాకి ఎస్సెట్. ఎఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం, పాటలు వాటికవే ఒక బాధితుడి జీవితం. బ్లెస్సీ దర్శకత్వం జీవితకాల సాఫల్యం.

చివరికేమిటి

సినిమా తెలుగు డబ్బింగ్ కి తెలంగాణ పాత్రగా మార్చారు. సాధారణంగా పాత్రలు వేరే భాష మాట్లాడుతున్నప్పుడు సబ్ టైటిల్స్ వేస్తారు. అరబ్బులు మన పాత్రలతో మాట్లాడుతున్నప్పుడు సబ్ టైటిల్స్ వేయకుండా, పాత్రలతో పాటు మనకీ అర్ధంగాకుండా చేసి- కొత్త ప్రదేశంలో ఒక మిస్టీరియస్ వాతావరణాన్ని, అయోమయాన్నీ సృష్టించడం వ్యూహాత్మక దర్శకత్వానికి నిదర్శనం. మన పాత్రలు తెలుగులో మొత్తుకుంటున్నప్పుడు, అరబ్బులు అర్ధం చేసుకోవాల్సిన ఖర్మ తమకి లేదన్నట్టుగా తన్నడం న్యాయంగానే అన్పించక మానదు. అందుకని సంపాదన కోసం గల్ఫ్ కి ఎగేసుకుంటూ  పోకుండా, మినిమమ్ అరబ్బీ నేర్చుకోవాలన్న బుద్ధి వుండాలని ఈ సినిమా పరోక్షంగా హెచ్చరిస్తుంది.
       
అయితే సినిమాలో హిందీ బానిస పాత్ర వుంది. కేరళ ముస్లింలకి ఇప్పటిలా కాక
, ఈ కథాకాలం 1990లలో హిందీ/ఉర్దూ అంతగా తెలియక పోవచ్చు. మలయాళం ఒరిజినల్ కిది సరిపోతుంది. కానీ తెలుగు వెర్షన్లో నజీబ్, హకీం తెలంగాణ ముస్లిం పాత్రలకి హిందీ/ఉర్దూ తెలియనట్టు చూపించడం సన్నివేశాల్లో భావోద్వేగాల్ని దెబ్బతీసింది. తెలంగాణా పాత్రలుగా చూపించాల్సిన అవసరమేమిటి? ఈ మధ్య తమిళ, మలయాళ తెలుగు డబ్బింగుల్లో తెలుగు పాత్రలుగా మార్చకుండా యధాతధంగానే చూపిస్తున్నారు. జైలర్ లో రజనీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ తెలుగులో ముత్తువేల్ పాండ్యనే. మంచి ముత్యం పాండు కాదు. ఆడు జీవితం టైటిల్ కూడా ఆడు జీవితమే. ఎడారి జీవితం కాదు. సినిమాలో తెలంగాణా వాళ్ళన్న డైలాగు తీసేస్తే సరిపోతుంది.

—సికిందర్

Friday, March 29, 2024

1415 : రివ్యూ!


 

దర్శకత్వం : మల్లిక్ రామ్
తారాగణం : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్, నేహా శెట్టి, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్
బ్యానర్ : సితార ఎంటర్ టైమెంట్స్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల : మార్చి 29, 2024
***

        డీజే టిల్లు (2022) తో సిద్దూ జొన్నలగడ్డగా గాక క్యారక్టర్ గా గుర్తుండిపోయిన సిద్దూ జొన్నలగడ్డ, మళ్ళీ అదే క్యారక్టర్ తో టిల్లు స్క్వేర్ గా తిరిగొచ్చాడు. తనకి పేరు తెచ్చిపెట్టిన అదే వింత క్యారక్టర్ తో మరోసారి అలా ఎంటర్ టైన్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని, దర్శకుడ్ని మార్చి, చాలావరకూ తానే దర్శకత్వం వహించి, తనకోసం తన సినిమా అనుకుని తీసుకున్నాడు. సాధారణంగా సీక్వెల్స్ ఆకట్టుకోవు. మరి తను దీంతో సాహసించి సీక్వెల్ సిండ్రోమ్ ని దాటాడా? దీన్ని అంతే హిట్ గా డీజీ టిల్లు సరసన నిలబెట్టాడా? ఏం చేశాడు? ఇది తెలుసుకుందాం...

కథ

'డీజే టిల్లు లో రాధిక (నేహాశెట్టి) విషయంలో దెబ్బతిన్న బాలగంగాధర్ తిలక్ అలియాస్ టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ), ఇప్పుడు ఈవెంట్స్ మేనేజిమెంట్స్ చేస్తూంటాడు. అలా ఓ పార్టీలో లిల్లీ జోసెఫ్ (అనుపమా  పరమేశ్వరన్) పరిచయమవుతుంది. కలిసి తిరుగుతారు, ఒకటవుతారు. ఆ తర్వాత చూస్తే ఆమె వుండదు, లెటర్ పెట్టేసి పోతుంది. ఆమెని వెతకడం మొదలుపెడతాడు. నెల తర్వాత కనిపించి ప్రెగ్నెంట్ నయ్యానని చెబుతుంది. పెళ్ళి చేసుకుంటానంటాడు. సరీగ్గా టిల్లు బర్త్ డే రోజు తన ఇంటికి పిలుస్తుంది. అక్కడికి వెళితే అది రాధిక ఫ్లాట్. డీజే టిల్లు లో సరీగ్గా టిల్లు బర్త్ డే రోజు రోహిత్ (కిరీటి దామరాజు) ఎక్కడైతే చనిపోయాడో అదే ఫ్లాట్.  రోహిత్ లిల్లీకి అన్న. వాడి శవాన్ని తనే పాతిపెట్టాడు టిల్లు.
        
ఇప్పుడు తన అన్న సంవత్సరం నుంచి కనిపించడం లేదని, అతడిని వెతకడంలో సాయం చేయమనీ కోరుతుంది లిల్లీ. రోహిత్ మర్డర్ విషయంలో ఒకసారి రాధికతో దెబ్బతిన్న టిల్లు ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? టిల్లూ లిల్లీల మధ్యకి పేరు మోసిన డాన్ షేక్ మహెబూబ్  (మురళీ శర్మ) ఎందుకొచ్చాడు? ఇప్పుడేమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
ఇది డీజే టిల్లు కి కొనసాగింపు కథ. డీజే టిల్లు లో హత్యకి గురైన రోహిత్ చెల్లెలు లిల్లీతో టిల్లూ అనుభవాల కథ. మళ్ళీ ఇది కూడా కథ కంటే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ తో నడిచే టిల్లు ఒన్ మాన్ షో. డీజీ టిల్లు ఏ క్యారక్టరజేషన్ తో, ఏ టైపు డైలాగ్ డెలివరీతో హిట్టయ్యిందో దాన్నే ప్రధానంగా చేసి, కథ మీద దృష్టి పెట్టకుండా నడిపిన కాలక్షేప బఠానీ. కాబట్టి క్యారక్టర్ ని ఎంజాయ్ చేయడానికే చూడాలి తప్ప కథ కోసం వెళ్ళకూడదు.

'డీజీ టిల్లు లో కూడా కథ మీద దృష్టి లేదు. ఈసారి అదే ఫార్ములా ఫాలో కావడం వల్ల అనాలోచితంగా వాడిన ట్విస్టులు, ఇల్లాజికల్ సీన్లూ- ఇవే కాకుండా రిపీటయ్యే సీన్లు, చీటికీ మాటికీ డీజే టిల్లు నుంచి రిఫరెన్సులూ- వీటితో నింపేశారు. ఈ కథ కూడా మొదటి కథ లాగే అమ్మాయి వలలో చిక్కుకుని దెబ్బ తినే అమాయక టిల్లు కథే. అయితే ఈ సారి లిల్లీ అనే అమ్మాయితో కుదరలేదు. దీంతో ఏం జరుగుతుందన్న సస్పెన్స్, థ్రిల్స్ కరువయ్యాయి. అలాగే క్లయిమాక్స్ కూడా తేలిపోయింది. నిడివి రెండు గంటలే అయినా చివరి అరగంట నుంచీ సహన పరీక్షగా మారుతుంది.
        
ఈ సినిమా చాలా భాగం రీ షూట్ ఇందుకే చేసినట్టున్నారు. రీ షూట్ వల్ల బాగు పడింది లేదు. కథ వదిలేసి కేవలం టిల్లు క్యారక్టరైజేషన్ తో,  అతడి వన్ లైనర్స్ తో, కామెడీ టైమింగ్ తో ఒన్ మాన్ షోగా నడిపేశారు. కథ మీద పెట్టని దృష్టి అతడి వన్ లైనర్ డైలాగుల మీద పెట్టి క్యారక్టర్ ని మాత్రం ఎంజాయ్ చేసేలా చేశారు.
       
ఫస్టాఫ్ అతడి కుటుంబం గురించి
, వృత్తి గురించి, లిల్లీతో రోమాన్స్ గురించీ ఫన్నీగా నడిపేశాక, ఒక బలహీన ఇంటర్వెల్ సీనుతో ముగించారు. ఇక సెకండాఫ్ మాఫియా డాన్ ని పట్టుకునే యాక్షన్ కథగా చేసి, కామెడీ తగ్గించి, డైలాగులతో నవ్వించడం చేశారు. డాన్ ని పట్టుకునే విషయంలో లాజిక్ నీ, సాధ్యాసాధ్యాల్నీ పట్టించుకోకుండా కథ ముగించారు. డిజేటిల్లు ప్రేక్షకులకి కొత్త కాబట్టి ఆ ఫార్మూలాతో క్యారక్టర్ని ఎంజాయ్ చేసి హిట్ చేశారు. మళ్ళీ అదే ఫార్ములాతో అలాగే ఎంజాయ్ చేసేందుకు ఇది తెలిసిన క్యారక్టరే. దీనికి వున్న కథనే సరైన విధంగా చెప్పివుంటే క్యారక్టర్ ఇంకా రాణించేది.

నటనలు –సాంకేతికాలు

సిద్ధూ జొన్నలగడ్డ కిది కొత్త సినిమానే అయినా క్యారక్టర్ అదే. ఆ నటననే రిపీట్ చేయడం సమస్య కాదు. సినిమా సాంతం గ్యాప్ లేకుండా వన్ లైనర్లు విసరడం, తను నవ్వకుండా నవ్వించడం, ఆ విచిత్ర మేకప్, కాస్ట్యూమ్స్, మ్యానరిజమ్స్, ఎక్స్ ప్రెషన్స్, వీటికి తోడు మ్యూజిక్, డాన్సులు, కెమెరావర్క్, ఇంకోవైపు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గ్లామ్ షో, ఇవన్నీ అతడ్ని యూత్ ఆరాధించగల షో మాన్ గా చేశాయి.
       
ఈ సినిమాకి పాపులర్ హీరోయిన్
అనుపమా పరమేశ్వరన్ ని తీసుకోవడం అదనపు ఆకర్షణగా మారింది. పాత్ర కన్విన్సింగ్ గా వుండదు. కేవలం గ్లామ్ షోకీ, లిప్ లాక్స్ కీ, కావలసినంత యూత్ అప్పీల్ కీ పనికొచ్చింది.
       
సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే
నేహా శెట్టికి మంచి రెస్పాన్సే. అయితే ఆమెది అతిధి పాత్రే.  ఆమె వరకు ఎపిసోడ్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక డాన్ గా మురళీ శర్మ, టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రిన్స్ నటించిన పాత్ర కంగాళీగా వుంటుంది.
       
రామ్ మిరియాల
, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియోల సంగీతం, మూడు పాటలు , వాటి చిత్రీకరణ హైలైట్ గా వుంటాయి. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం, సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బలంగా వున్నాయి.
       
ఇలా
డిజే టిల్లు’, టిల్లు స్క్వేర్ ల తర్వాత టిల్లు క్యూబ్ అని గనుక తీస్తే, కాస్త కథ ఆధారిత క్యారక్టరైజేషన్ తో తీస్తే, విధేయులైన టిల్లు ఫ్యాన్స్ కి మేలు చేసిన వాళ్ళవుతారు.

—సికిందర్

Monday, March 25, 2024

1414 : రివ్యూ

 

Sorry for the disappearence for so many days!
రచన- దర్శకత్వం : సుదీప్తో సేన్
తారాగణం : అదా శర్మ, ఇందిరా తివారీ, రైమా సేన్, విజయ్ కృష్ణ, సుబ్రతా దత్తా, యశ్పాల్ శర్మ తదితరులు
ఛాయాగ్రహణం : రాగుల్ ధరుమన్, సంగీతం : బిషాఖ్ జ్యోతి
బ్యానర్ : సన్‌షైన్ పిక్చర్స్, నిర్మాత : విపుల్ అమృతలాల్ షా
విడుదల : మార్చి 15, 2024
***
        ది కేరళ స్టోరీ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి మరో కరుడుగట్టిన సమర్పణ బస్తర్ - ది నక్సల్ స్టోరీ ని అందించారు. ఇది ప్రచార సినిమా కాదని ముందే ప్రకటించారు. కానీ ఇది ఎన్నికల్లో పోలరైజ్ చేసే ప్రయత్నంతో తీసిన ప్రచార సినిమానే. ది కాశ్మీర్ ఫైల్స్ (2022) ని అనుకరిస్తూ చూపించిన హింసతో ఎవరిని టార్గెట్ చేస్తూ ప్రచార సినిమాగా మలిచారో స్పష్టంగా తెలిసిపోయే ప్రయత్నం. ఇందులో కూడా ఎంత నిజాయితీ వుందో కూడా బయటపడే దుందుడుకుతనం. ఇవేమిటో విపులంగా చూద్దాం...

కథ

ఇద్దరు న్యాయవాదులు నీలం నాగ్‌పాల్ (శిల్పా శుక్లా), ఉత్పల్ త్రివేది (యశ్పాల్ శర్మ) ల మధ్య కోర్టులో న్యాయ పోరాటంతో కథ ప్రారంభమవుతుంది. ఐపీఎస్ నీరజా భార్గవ (ఆదా శర్మ) అమాయక గిరిజనుల్ని ఎన్ కౌంటర్ చేసి చంపిందనీ, నక్సల్ హింసకి ప్రఖ్యాత రచయిత్రి వన్యా రాయ్ (రైమా సేన్) కుట్రపూరిత సపోర్టు వున్నట్టు తప్పుడు ఆరోపణ చేసిందనీ, నీలం నాగ్ పాల్ వాదిస్తుంది. దీన్ని తిప్పి కొట్టలేక పోతాడు ఉత్పల్ త్రివేది. ఈ కోర్టు సన్నివేశం ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ గ్రామానికి మారుతుంది.
       
2010
లో బస్తర్ లో గిరిజనుల సమూహం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్ (సుబ్రతా దత్తా), భార్య రత్న (ఇందిరా తివారీ), కొడుకు, కూతురు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి అందర్నీ తమ శిబిరానికి లాక్కుపోతారు. అక్కడ కామ్రేడ్ లంకా రెడ్డి (విజయ్ కృష్ణ)  అనే పేరు మోసిన మావోయిస్టు, అతడి అనుచరురాలు లక్ష్మి (అనంగ్షా బిశ్వాస్) మిగతా దళ సభ్యులు వుంటారు. స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్  త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసినందుకు, ఐపీఎస్ నీరజా భార్గవకి ఇన్‌ఫార్మర్‌గావున్నందుకూ దేశద్రోహిగా ప్రకటించి, నరికి చంపేస్తాడు లంకా రెడ్డి.
       
లంకారెడ్డి ధ్యేయం ఒకటే- ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేయడం. కళ్ళముందే భర్త దారుణ హత్యకి గురికావడంతో చలించిన రత్న
, ఈ హంతకుల్ని నిర్మూలిస్తానని
ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమెకి తగిన ధైర్యం నూరిపోసి తన స్క్వాడ్ లో పోలీసుద్యోగం ఇప్పిస్తుంది నీరజ. దీంతో వీళ్ళిద్దరు కలిసి చేసే పోరాటం ఏ ముగింపుకి దారి తీసిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

బస్తర్- ది నక్సల్ స్టోరీ తో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో నక్సలైట్-మావోయిస్టు తిరుగుబాటు అధ్యాయాల్నిబయటకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దర్శకుడు దీని కోసం చాలా రీసెర్చి చేసినట్టు కనిపిస్తాడు. బస్తర్ కి సంబంధించి బాధాకరమైన గతాన్ని నిశితంగా వర్ణించినందుకు అతడ్ని మెచ్చుకోవాల్సిందే. అయితే బస్తర్ లో ఆ పరిస్థితులు ఏర్పడడానికి కారణమైన తెరవెనుక శక్తుల్ని దాచీ దాచిపెట్టనట్టుగా చూపించడం దగ్గరే ప్రచార సినిమా లక్ష్యం దెబ్బతింది.
       
దీని నేపథ్యాన్ని పరిశీలిస్తే
, ఈ ప్రాంతంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, మాంగనీస్ వంటి సహజ వనరులు సమృద్ధిగా వుండి, కార్పొరేట్ రంగానికి ఈ ప్రాంతాన్ని అప్పజెప్పాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్ని అడ్డుకుంటూ పుట్టిందే అక్కడి నక్సలిజం. కార్పొరేట్లతో ఈ కేంద్రబిందువుని దాచిపెడుతూ లెఫ్టిస్టులు, మీడియా, బాలీవుడ్, ఎన్జీవోలు, జేఎన్ యూ లని ఈ ప్రాంతంలో నక్సల్ సపోర్టర్లుగా, అసలు స్వదేశీ విలన్లుగా చెప్పడం చేశారు. ఇంకోవైపు లష్కర్, ఎల్ టీటీఈ, బొకోహరామ్, ఐసిస్ మొదలైన టెర్రరిస్టు సంస్థల్ని నక్సలైట్లతో చేతులు కలిపిన విదేశీ విలన్లుగా చూపించారు.
       
దేశంలోని ఆ 
స్వదేశీ విలన్లు దేనికి నక్సలిజాన్ని సపోర్టు చేస్తున్నారో చెబితే కార్పొరేట్ శక్తుల గురించి, అక్కడి సహజ వనరుల పరిరక్షణ గురించీ చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రచార సినిమాకి అనుకూలంగా వుండదు. అందుకని ఈ కథ కల్పన-వాస్తవాల, అనేక కుట్ర కోణాల కలిపికొట్టుడుగా ముగుస్తుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నలాగా మిగిలిపోతుంది.
       
పై కథలో కోర్టు సీనులో చెప్పే ప్రఖ్యాత రచయిత్రి వన్యా రాయ్ మరెవరో కాదు
, అరుంధతీ రాయే. నక్సలైట్లకి వ్యతిరేకంగా గిరిజనులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సల్వాజుడుం (శాంతి యాత్ర) దళానికి నాయకత్వం వహించిన మహేంద్రకర్మ పేరు రాజేంద్ర కర్మగా మారింది.
        
ఒక సన్నివేశంలో ప్రొఫెసర్, విద్యావేత్తల ర్యాంకుల్లోకి, బాలీవుడ్‌లోకి వామపక్ష తీవ్రవాద భావజాలాన్ని చొరబెట్టాల్సిందిగా వన్యా రాయ్ ని కోరడాన్ని చూడొచ్చు. ఇంటర్వెల్ సీనుగా వచ్చే దంతెవాడలో 76 మంది సీఆర్పీ ఎఫ్ జవాన్ల హత్యాకాండని జేఎన్ యూ విద్యార్ధులు పాటలతో సెలెబ్రేట్ చేసుకుంటూ, చనిపోయిన పోలీసుల్ని పోలీసు కుక్కలు గా పేర్కొనడం, ఎర్రకోట మీద జెండా ఎగరేస్తామనడం ప్రచార సినిమాకి పనికొచ్చేదే. కేంద్రహోమ్ మంత్రి ఐపీఎస్ నీరజని దొంగముండా అని తిట్టడం కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా పోలరైజేషన్ ని ఎగదోయడమే.
       
ఇక ఎలాటి క్రూరత్వాన్ని ఈ శక్తులు సపోర్టు చేస్తున్నాయో చెప్పి మరింత బలంగా పోలరైజ్ చేయడానికన్నట్టు
, హద్దుమీరిన హింసాత్మక దృశ్యాలున్నాయి. ప్రారంభంలో నక్సల్స్ స్కూల్ టీచర్ని చంపే దృశ్యం గగుర్పాటు కలిగిస్తుంది- గొడ్డలితో నరుకుతూనే వుంటాడు, ఎప్పుడో శవమైపోయినా, వివిధ అంగాల్ని భయంకరంగా నరుతూనే వుంటాడు. ఇది 30 సెకన్ల పాటు భయపెట్టే దృశ్యం. ఇలాటి దృశ్యాలు ది కాశ్మీర్ ఫైల్స్ లో వున్నాయి. అయితే వాటిని బ్లర్ చేశారు. ఇక్కడ మాత్రం బాహాటంగానే వదిలేసింది సెన్సార్.
       
ఒక పసిపిల్లని నక్సల్స్ మంటల్లోకి విసిరి చంపే దృశ్యం కూడా ఇలాటిదే. ఇక దంతెవాడ లో సీఆర్పీ ఎఫ్ శిబిరాన్ని రాత్రిపూట తగులబెట్టి 76 మంది పోలీసుల్ని సజీవదహనం చేసి చంపే సుదీర్ఘ భీకర దృశ్యం- స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన 
షిండ్లర్స్ లిస్ట్ లో నాజీలు యూదుల్ని అగ్నికి ఆహుతి చేసే దృశ్యాలకంటే భయానకంగా వుంటాయి. ఇవన్నీ ప్రచార సినిమా లక్ష్యాన్ని నెరవేరుస్తాయి.
       
కొన్ని జాతీయ
, అంతర్జాతీయ పత్రికల సాక్ష్యంగా గణాంకాలు ముందుంచారు ఐపీఎస్ నీరజా పాత్ర ద్వారా- వందేళ్ళ కమ్యూనిజంలో పదికోట్ల మందిని చంపేశారని, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాల్లో చనిపోయిన సైనికుల సంఖ్యకంటే, నక్సలైట్లు బలిగొన్న పోలీసుల ప్రాణాలు అధికమనీ. ఇక ముగింపులో నీరజ వాదిస్తూ- ఉరిశిక్షకి కూడా భయపడకుండా లెఫ్ట్ లిబరల్స్ ని కాల్చి చంపాలంటుంది!
       
లెఫ్ట్ లిబరల్సో మరెవరో
, అసలు కారకులైన కార్పొరేట్స్ ని కూడా ముందుంచి కథ చెబితే బావుంటుంది. ఎలక్టోరల్  బాండ్స్ లో కార్పొరేట్స్ చిట్టా లాగా దాచిపెట్టాలన్న విఫల యత్నాలెందుకు? ఇదేం సినిమా కథ?

నటనలు- సాంకేతికాలు
గర్భవతియైన కరకు పోలీసాఫీసర్ నిరజగా అదా శర్మ బాగా నటించింది. క్లయిమాక్స్ లో ఏకపాత్రాభినయం లాగా సుదీర్ఘ డైలాగులు సినిమాగా బాగానే పేలతాయి. కానీ ఎలాటి సందేశం వెళుతోంది? ఎవరికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నట్టు? ఈమెతో పోటీపడి కామ్రేడ్ లంకారెడ్డిగా విజయ్ కృష్ణ నటించాడు. ఇతర పాత్రల్లో యశ్‌పాల్ శర్మ, శిల్పా శుక్లా, రైమా సేన్, పూర్ణేందూ భట్టాచార్య నటనలు సహజత్వానికి దగ్గరగా వున్నాయి. అయితే క్రూరురాలైన నక్సల్ పాత్ర లక్ష్మిగా అనంగ్షా బిశ్వాస్, భర్తని కోల్పోయి పగబట్టిన రత్నగా ఇందిరా తివారీ హైలైట్ గా వుంటారు. అలాగే స్కూల్ టీచర్ గా సుబ్రతా దత్తా కూడా.       

సాంకేతికంగా చెప్పుకోదగ్గ సినిమా.
యాక్షన్ సీక్వెన్సులతో సహా ఛాయాగ్రహణం, వీఎఫ్ ఎక్స్, అడవుల్లో లొకేషన్లూ, నేపథ్య సంగీతం, ప్రతి డిపార్ట్ మెంటులో నిర్మాణ విలువలూ అన్నీ నాణ్యంగా వున్నాయి. నాణ్యంగా విషయం మాత్రం లేదు. విషయం సినిమాకంటే ఎక్కువ డాక్యుమెంటరీ డ్రామాలాగా వుంది. ఎమోషనల్ డెప్త్ కాకుండా హద్దు మీరిన హింసతో, రక్తపాతంతో, వక్రీకరణలతో విషయం వుంది- ప్రచార సినిమాలు అర్ధసత్యాలుగానే వుండాలి కాబట్టి.
–సికిందర్

Monday, March 11, 2024

1413 : రివ్యూ

రచన- దర్శకత్వం: ఎ. హర్ష

తారాగణం : గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ, నరేష్, ముఖేష్ తివారీ,
నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: స్వామి గౌడ
నిర్మాత: కేకే రాధామోహన్
విడుదల : మార్చి 8, 2024
***

        మాచో స్టార్ గోపీచంద్ ఒక హిట్ చూసి పదేళ్ళయింది. ఈ పదేళ్ళల్లో 10 ఫ్లాపులు తన వంతుకి సంపాదించుకున్నాడు. ఎందుకు ఫ్లాపవుతున్నాయంటే మార్పుకి అస్సలు అంగీకరించకపోవడం వల్ల. ప్రేక్షకులే మారి తన పాత మూస ఫార్ములా సినిమాల మార్గంలోకి రావాలని కోరుకోవడం వల్ల. ప్రేక్షకులు మారకుండా తమ మార్గాన కొత్త దారిని పోతున్నారు. దీంతో ప్రేక్షకులకి 10 ఫ్లాపుల దూరాన వుండి పోయాడు. ఇప్పుడు తాజాగా భీమా అనే మరో ప్రయత్నంతో వచ్చాడు. దీని పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే ఇది పద కొండవ పిడుగు అని భయం పట్టుకుంటుంది. దీనికి హర్ష అనే కన్నడ దర్శకుడ్ని నమ్మాడు. ఈ దర్శకుడితో పిడుగు కాదు పరశు రాముడి గండ్ర గొడ్డలి అన్పించేలా తయారయ్యింది వ్యవహారం. ఇక ఆఖరికి ఆ గొడ్డలితో ప్రేక్షకుల్ని సంహరించడానికే దిగాడు గోపీ చంద్ అనుకుంటూ భయపడుతూనే ఈ పదకొండవ బండ చూస్తే ఎలా వుందంటే...

కథ

అది పురాణం. ఆ పురాణంలో పరశు రాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడ్ని కోరుతాడు. సముద్రంలో గొడ్డలి విసిరితే ఆ విసిరినంత మేరకూ సముద్రం వెనక్కి వెళ్ళి భూభాగ మేర్పడుతుందని వరుణుడు చెప్తాడు. అలా ఏర్పడిన భూభాగం కేరళలోని మహేంద్రగిరిలో కథ ప్రారంభమవుతుంది. దీన్నే పరశురామ క్షేత్రమని పిలుస్తూంటారు. ఇక్కడ భవానీ అనే దుర్మార్గుడు అరాచకాలు చేస్తూ ప్రజల్ని నరక యాతన పెడుతూంటాడు. అడవిలోంచి ట్యాంకర్లలో ఏదో రవాణా చేస్తూంటాడు. ఇంకో పక్క అక్కడి ఆలయం ఆత్మల్ని ప్రేరేపిస్తోందన్నభయంతో మూతపడుతుంది. మరోపక్క రవీంద్ర వర్మ (నాజర్) అనే ఆయుర్వేద వైద్యుడు మరణించిన మనిషిని బతికించే ఔషధం కోసం మొక్కల మీద పరిశోధనలు చేస్తూంటాడు.
       
ఈ నేపథ్యంలో అక్కడికి భీమా (మాచో స్టార్ గోపీచంద్) అనే ఎస్సై వస్తాడు. అక్కడే కామెడీగా
, గల్లీ రోమియోగా విద్య (ప్రియా భవానీ శంకర్) అనే మొక్కల పరిశోధకురాలి వెంటపడి ప్రేమిస్తూంటాడు. అక్కడే భవానీ అరాచకాల గురించి తెలుసుకుని చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఇతడికేదో గతం వుంటుంది. ఏమిటా గతం? రామా ఎవరు? భవానీతో తలపడి భీమా ఏమయ్యాడు? ఆలయం అసలెందుకు మూతబడింది? భీమా వెనకున్న అసలు విలనెవరు? ఇతనెలా అంతమయ్యాడు? రామాలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? ట్యాంకర్ల రహస్యమేమిటి? ఇవన్నీ మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కలగూరగంపలా వుంది. పరశురాముడి స్థల పురాణంతో ఆర్భాటంగా ప్రారంభమై ఆలయం కథ, భవానీ కథ, రవీంద్రవర్మ కథ, పిల్లల అక్రమ రవాణా కథ, భీమా కథ. రామా కథ, రామాలోకి ప్రవేశించిన ఆత్మ కథ...ఇలా ఎన్నెన్నో కథలతో గోపీచంద్ కాపీ మజిలీ కథలా తయారైంది. తను నటించిన పాత సినిమాల్నే కాపీ చేసి చివర్లో కాంతారా టైపు క్లయిమాక్సునే అతికించి ట్రెండ్ లో వున్నానని చాటుకునేలా వుంది. వారం క్రితమే భూతద్ధం భాస్కర్ నారాయణ లో ఇదే కాంతారా టైపు క్లయిమాక్స్ చూశాం. వెనక్కిపోతే ఇంకెన్నో సినిమాల్లో చూశాం.  ఇంకెన్ని సార్లు ఇదే చూపిస్తారు? ఇలా చూపించినవన్నీ ఫ్లాపవుతున్నాయి.
       
స్థల పురాణం
, భవానీ అరాచకాలు, ఆలయ కథ చెప్పాక, దాదాపు పదిహేను నిమిషాలు వెన్నెల కిషోర్ కామెడీ నడుస్తుంది. ఇదేం సినిమా ప్రారంభమో అర్ధం గాదు. ఎస్సై భీమాగా గోపీచంద్ ప్రవేశించాక నడుం వూపులతో వాంప్ లా కనిపించే హీరోయిన్ తో లవ్ ట్రాక్ మొదలు. ఆమె బాడీగార్డ్ ని అడిగితే ఎస్సైగా గోపీచందే బాడీ గార్డు గా వెంటపడి తిరుగుతూంటాడు. ఈ లవ్ ట్రాక్ హీరోయిన్ చేసే సంజ్ఞలతో అసభ్యంగా వుంటుంది. అరగంటపాటు ఈ అసభ్య లవ్ ట్రాక్ సాగేక, విలన్ గ్యాంగ్ తో పోరాటం, ఇంటర్వెల్. ఈ మధ్య టెంప్లెట్ కథనంతో సినిమాలు రావడం లేదు. గోపీచంద్ మాత్రం మారకుండా అదే ఫార్ములా కృతక టెంప్లెట్ కథనమే వడ్డించాడు. ఫస్టాఫ్ లో ఎన్నో పాయింట్లు ఎత్తుకుని దేని మీదా నిలబడక  భీమాగా వైదొలిగాడు.
       
సెకండాఫ్ రామాగా గోపీచంద్ ఎంట్రీ. రామాతో ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ ఇంకో హీరోయిన్  మాళవికా శర్మతో ఇంకో లవ్ ట్రాక్. ఇది కూడా సహన పరీక్ష పెట్టాకా కథలోకి
, అక్కడ్నిం చి క్లయిమాక్స్ కి. ఏ మాత్రం సస్పెన్స్, థ్రిల్స్, మలుపులూ లేని, వాటికి వీలివ్వని కలగూరగంప కథతో కన్నడ దర్శకుడి 2000 నాటి సినిమా. ఈసారి ద్విపాత్రాభినయం చేసినా గోపీచంద్ కి దక్కని హిట్.

నటనలు- సాంకేతికాలు

ఈ ద్విపాత్రాభినయం ఏ పాత్రకీ బలమివ్వని వ్యవహారంగా మారింది. యాక్షన్ సీన్స్ మాత్రం విజృంభించి చేశాడు. కానీ యాక్షన్ సీన్లు మాత్రమే సినిమాని నిలబెట్టలేవు. ఇద్దరు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కూడా విఫలమైంది. హీరోయిన్లు ప్రియ, మాళవిక లవి కృత్రిమ ఫార్ములా పాత్రలు. నాజర్, ముఖేష్ తివారీ తదితరులు విలన్లుగా రొటీన్ నటనలతో సరిపెట్టారు.
        
కేజీఎఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ని తెచ్చుకున్నాడు కన్నడ దర్శకుడు హరీష్, బస్రూర్ చేసింది ప్రత్యేకంగా ఏమీ లేదు. స్వామి గౌడ
ఛాయాగ్రహణంలో కూడా ప్రత్యేకత ఏమీ లేదు. గ్రాఫిక్స్ కి బాగా ఖర్చుపెట్టారు. నృత్య దర్శకుదే అయిన దర్శకుడు పాటలకి సమకూర్చిన కొరియోగ్రఫీ అతి మామూలుగా వుంది. నృత్య దర్శకులు, ఛాయాగ్రాహకులు దర్శకులైతే ఆ సినిమాలు ఫ్లాపవుతున్నాయి. ఇటీవలే ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈగల్  కూడా ఫ్లాపయ్యింది. ఇప్పుడు నృత్య దర్శకుడు తీసిన భీమా. ఇలా గోపీచంద్ చేసిన 11వ దండయాత్ర కూడా కాలం చెల్లిన పాత మూస ఫార్మలా జాబితాలోకి చేరింది.

—సికిందర్