రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, మార్చి 2024, ఆదివారం

1416 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : బ్లెస్సీ
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, శోభా మోహన్, కెఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్, రాబిన్ దాస్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : కెఎస్ సునీల్  
బ్యానర్స్ : విజువల్ రోమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా
నిర్మాతలు : బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
విడుదల :  మార్చి 28, 2024
***
            ప్రముఖ మలయాళ యువ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన, సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ మూవీ ఆడుజీవితం- ది గోట్ లైఫ్ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేధానికి గురై, తర్వాత కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ పొంది అనుకున్న విధంగా వరల్డ్ రిలీజ్ గా, మార్చి 28 న ప్రపంచ ప్రేక్షకుల ముందు కొచ్చింది. సౌదీ అరేబియాలో, ఇతర గల్ఫ్ దేశాల్లో నిషేధాన్ని తొలగించలేదు. అరబ్బు దేశాలకి వ్యతిరేకం అన్పించే కేరళ వలస కార్మికుడి కథతో రూపొందిన ఈ సినిమాలో అరబ్బుల కాఠిన్యాన్ని నిర్భయంగా చిత్రించారు. దర్శకుడు బ్లెస్సీ- పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ అపూర్వ సృష్టి మలయాళ సినిమా చరిత్రలో స్వర్ణ పుట అనొచ్చు. దీన్ని తెలుగు సహా ఐదు భాషల్లో విడుదల చేశారు. తెలుగులో మైత్రీ మూవీస్ పంపిణీ చేశారు. అన్ని భాషల్లో, ముఖ్యంగా యువ ప్రేక్షకుల్ని సైతం కదిలిస్తున్న ఈ ఆర్ట్ సినిమా తరహా సర్వైవల్ డ్రామాలో ఏమున్నదో ఓసారి పరిశీలిద్దాం...

కథ

ఐదవ తరగతి చదివిన నజీబ్ మహమ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) కేరళ గ్రామంలో చెరువులో ఇసుక తీసే పని చేసుకుంటూ భార్య సైనూ (అమలా పాల్) నీ, తల్లి ఉమ్మా(శోభా మోహన్) నీ పోషించుకుంటూ వుంటాడు. అయితే సౌదీ వెళ్ళి బాగా సంపాదించి అభివృద్ధిలోకి రావాలని స్నేహితుడు హకీమ్ (కెఆర్ గోకుల్) తో కలిసి సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు.        అక్కడ ఏజెంట్ మోసం చేయడంతో, వేరే అరబ్బులు వీళ్ళని తలో వైపు లాక్కువెళ్ళి ఎడారిలో గొర్రెల మంద మధ్య పడేస్తారు. గొర్రెల్ని కాయమంటారు. నజీబ్ కన్న కలలు ఒక్కసారిగా పటాపంచలవుతాయి. ఇక్కడ పరిస్థితి ఎలా వుంటుందంటే, కుక్క కన్నా హీనంగా చూస్తారు. వెళ్ళిపోతామన్నా పోనివ్వరు. గొర్రెల పెంపక కేంద్రం యజమాని ఖఫీల్‌ (తాలిబ్ అల్ బలూషి) పత్రాలు లాక్కుని చించేస్తాడు. తిండి పెట్టడు, మంచి నీళ్ళు కూడా తాగనివ్వడు. ఎర్రటి ఎడారి ఎండలో గొర్రెల్ని కాయమని తంతాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. తిండికి అల్లాడుతూ బక్కచిక్కిన నజీబ్ కి, దాదాపు ఇదే పరిస్థితుల్లో వున్న హకీం ఎడారిలో ఎదురవుతాడు. ఇద్దరూ కావలించుకుని గట్టిగా ఏడ్చేస్తారు.

హకీం పనిచేస్తున్న చోట తమలాగే ఒక ఆఫ్రికన్ బానిస ఇబ్రహీం ఖాద్రీ (నిర్మాత జిమ్మీ జీన్ లూయిస్) వుంటాడు. అతడికి ఎడారిలో తప్పించుకుని రోడ్డెక్కే మార్గం తెలుసు. ఓ రోజు ఖఫీల్ కూతురి పెళ్ళికి పోతూ, గొర్రెల్ని నజీబ్ కి అప్పజెప్పి పోతాడు. ఇదే అదునుగా భావించిన నజీబ్ పారిపోయి వాళ్ళిద్దర్నీ కలుసుకుంటాడు. ఇక్కడ్నుంచీ ముగ్గురూ ఆ ఎడారిలోంచి ఎలా బయటపడి బతికి బట్ట కట్టారన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

2008లో మలయాళంలో బెన్యామిన్ అనే రచయిత రాసిన, 100 సార్లు రీప్రింటయిన ఆడుజీవితం నవల ఈ సినిమాకాధారం. ఈ నవల సౌదీ అరేబియాలో నజీబ్ మహమ్మద్ అనే కేరళ వలస కార్మికుడి నిజ కథని చిత్రిస్తుంది. ఈ నవల 2009లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు సహా అనేక అవార్డుల్ని సంపాదించింది. ఇంగ్లీషు, హిందీతో బాటు మరికొన్ని ఇతర భాషల్లోకి అనువాదమైంది.
       
అప్పట్నుంచే దీన్ని సినిమాగా తీయాలని దర్శకుడు బ్లెస్సీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే చిత్రానువాదం చేశాక బడ్జెట్ మోపెడవుతుందని భయపడి పక్కన పెట్టేశాడు. అయినా
నిర్మాతకోసం చాలా సంవత్సరాలు వెతుకుతూ, చివరికి 2015లో ఇద్దరు విదేశీ నిర్మాతల్ని సంపాదించుకుని తానూ నిర్మాతగా మారి, 2020లో  ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. షూటింగ్ కి సౌదీ అరేబియా అనుమతి ఇవ్వకపోతే, జోర్డాన్ లో, అల్జీరియాలోని సహారా ఎడారిలో షూటింగ్ జరిపాడు. ఆ కోవిడ్ మహమ్మారి కాలంలో ఎలాగో షూటింగ్ జరిపి, 2022 నాటికి పూర్తి చేశాడు.
       
గల్ఫ్ కెళ్ళిన కార్మికుల జీవితాల గురించి చాలా సినిమాలొచ్చాయి.
ఆడు జీవితం లాంటిది రాలేదు. ఆడు జీవితం చూసిన ఏ సాధారణ వ్యక్తి అయినా గల్ఫ్ కలల్ని శుభ్రంగా తుడిపేసుకుని, ఉన్న ఊరు కన్న తల్లి ఒరేవొరే మరవకురా అని గంజి తాగి కంటినిండా నిద్రపోతాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ లా అరబ్బులతో తొక్కించుకుని, రాబందులతో పొడిపించుకుని, డొక్కెండిన బతుకు దిక్కులేని ఎడారిలో సమాధి చేసుకోవాలనుకోడు.

ఇసుక రేణువు నుంచి ఎడతెగని ఎడారి సువిశావిస్తీర్ణం వరకూ, చురుకైన గొర్రె ముఖం నుంఛీ, ఓపికైన ఒంటె కళ్ళ వరకూ -దగా పడ్డ వలస కార్మికుడి బతుక్కి సాక్ష్యాలే. ఎడారిలో ఎర్రటి ఎండలో ఈ సాక్ష్యాల్ని కెమెరా ఎత్తి పట్టుకోవడమన్నది మామూలు మాట కాదు. ఈ పరిస్థితి ఎక్కడ్నించి బదలాయింపు అయింది? కేరళ పల్లెలో  నీలం నీరు- ఆకుపచ్చ భూమి -సస్యశ్యామల తావులు- అనే ప్రకృతి దృశ్యం నుంచి తీసి బయటకి ఇసుక సముద్రంలో విసిరేస్తే ఉత్పన్నమైంది. ఈ కాంట్రాస్ట్ ని పొందుపర్చడం అంతర్జాతీయ స్థాయి తరహా స్క్రీన్ ప్లే రచనే.
       
1990 లలో ఈ కథ స్థాపించారు. పనివాడి చెమట ఆరిపోకముందే ప్రతిఫలం చెల్లించమని చెప్పే మత గ్రంధం ఉద్భవించిన దేశంలో సాటి మనిషిని గొర్రెకన్నా హీనంగా కొట్టి వెట్టి చేయించుకునే అరబ్బు నీతి ఎక్కడ్నించి వచ్చిందో మింగుడుపడని వ్యవహారమే. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన సమస్యే. అయితే ఈ కథ దీన్ని చర్చించదు. మనుగడ కోసం పనివాడి సాహసోపేత ప్రయాణాన్ని కళ్ళముందుంచి
, ప్రశ్నల్ని- వాటి జవాబుల్నీ ప్రేక్షకులకే వదిలేస్తుంది.
       
నేరుగా సౌదీ విమానాశ్రయంలో కథ ప్రారంభమవుతుంది. నజీబ్
, హకీం మిత్రులిద్దరూ తమకి ఉద్యోగాలిచ్చిన కంపెనీ కోసం ఎదురుచూస్తూంటే, ఎవరో ఇద్దరు అరబ్బులు ఇద్దర్నీ విడదీసి తలో దిక్కు లాక్కుపోయే దృశ్యం- హకీం ఆర్తనాదాలతో దద్దరిల్లుతుంది. భాష తెలియదు. భాష తెలిసిన హిందీ బానిస వుంటే నజీబ్ కి హిందీకూడా రాదు. యజమాని ఏమంటున్నాడో అర్ధంగాదు. ఎండిన రొట్టె ముక్కపడేస్తే అది పళ్ళరిగేలా నమిలినా గొంతు దిగదు. చుక్కనీళ్ళు తాగనివ్వరు. ఈ నజీబ్ కష్టాల మధ్య మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి- కేరళలో అతడి సుఖవంతమైన జీవితం గురించి. చెరువు నిండా నీళ్ళలో మునకల గురించి. భార్యతో జీవితం గురించీ. జలకాలాటల్లో వాళ్ళిద్దరి
మధ్య కొరియోగ్రఫీ చేసిన శృంగార గీతం ఈ వాస్తవిక కథలో అసాధారణ కమర్షియల్ కృతిలా కనిపిస్తుంది రెహ్మాన్ మ్యూజిక్ తో.

ఈ స్మృతులు ఎడారి జీవితం నుంచి పారిపోయేందుకు పురిగొల్పితే, తుపాకీ గుండు దెబ్బకి కుప్పకూలుతాడు. అతడి బాధని గొర్రె మాత్రమే అర్ధం జేసుకుని తోటి గొర్రెలతో కలిసి పరామర్శకి వస్తుంది. ఒంటెలూ అన్యాయాన్ని గమనిస్తాయి. రాబందులు వాటి జాతి లక్షణంతో నరమాంస భక్షణకి దిగుతాయి. గంట సేపు ఈ ఫస్టాఫ్ స్ట్రగుల్ తర్వాత, పారిపోవడంతో మొదలయ్యే సెకండాఫ్ సమరం రెండు గంటలూ సాగుతుంది. మొత్తం కలిపి మూడుగంటల సర్వైవల్ డ్రామా. యూనివర్సల్ అప్పీలున్న బాక్సాఫీసు ఫార్ములా.
       
నవల స్వగతంతో వుంటుంది. దీన్ని సినిమా దృశ్యాలుగా మార్చడానికే సంవత్సరాలు పట్టిందని చెప్పాడు దర్శకుడు. ఇక గొర్రెలు
,
ఒంటెలు వాటికి మూడ్ వచ్చినప్పుడు షాట్స్ తీయడం కూడా అంతే. ఈ జీవుల్ని నిర్దేశించలేరు. అవి మూడ్‌లోకి వచ్చేవరకూ  వేచి వుండి ఆ షాట్స్ ని పట్టుకోవాలి. సినిమాలో గ్రాఫిక్స్ జంతుల్లేవు సులభంగా చిత్రీకరించడానికి.

నటనలు – సాంకేతికాలు

పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తనని తాను శిక్షించుకుంటూ సాధించిన శారీరక పరివర్తన వొక ఆశ్చర్యపర్చే అంశం. క్రమక్రమంగా అతడి కృశించే రూపం కడుపు తరుక్కుపోయేలా చేస్తుంది. పాదాల మీద బొబ్బలు, పగిలిన పెదవులు, అట్టకట్టిన వెంట్రుకలు -సుకుమారన్ శరీరంలో ఇంకిన వేడి, ధూళీ మేకప్ విభాగపు తిరుగులేని పనితనంగా కనిపిస్తాయి. ప్యాంటు వదులైపోయి తాడుతో కట్టుకుంటున్నప్పుడు బక్కచిక్కిన అతడి కడుపు మీద తీసిన షాట్ చూసి ఒక్కసారి ఏడ్వాలన్పించని ప్రేక్షకులుండరు. పాత్ర కోసం, తదనుగుణ నటన కోసం సుకుమారన్ తనని తాను ఇంతలా శిక్షించుకోవడం నట శాస్త్రంలో ఏ పాఠం కిందికి వస్తుందో వెతకాలి. అతను ఆస్కార్ కి నూరు విధాలా అర్హుడని ఇందుకే గొంతు విప్పుతున్నారు ప్రేక్షకులు.
       
హకీం పాత్రలో
కేఆర్ గోకుల్ మాత్రం నాటకీయంగా కనిపిస్తాడు. ఆఫ్రికన్ ఇబ్రహీం ఖాద్రిగా నిర్మాత జిమ్మీ జీన్ లూయిస్ నిగూఢంగా కనిపిస్తూ, ఎడారి దాటించే మార్గం చూపే తోటి ప్రయాణికుడి పాత్రలో, మంచి చెడుల మధ్య అనేక వైరుధ్యాల్ని సూచిస్తూ ఒక ముద్ర వేస్తాడు.  అమలాపాల్, శోభా మోహన్ లు ఫ్లాష్ బ్యాకుల్లో సంక్షిప్తంగా కన్పించే పాత్రలు వేశారు. గొర్రెల యజమానిగా ఓమన్ నటుడు డాక్టర్ తాలిబ్ అల్ బలూషి క్రూరత్వంతో వూపేస్తాడు. దీనికి ముందు ఒక మలయాళ సినిమాలో నటించి మలయాళీలకి తెలిసిన నటుడే. ఇక హిందీ తెలిసిన బానిసగా రాబిన్ దాస్ కూడా గుర్తుంటాడు.

ఛాయాగ్రహకుడు సునీల్ కెఎస్ ఎడారిని, అక్కడ చిక్కుకున్న జీవితాల్నీ ఎంత కఠినంగా చూపించాడో, కేరళనీ అక్కడి జీవితాల్నీ అంత సున్నితంగానూ చిత్రీకరించాడు.   సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ఎడిటింగ్ ని ఫీల్ కాం. ఈ కళాత్మక సినిమాని ఎడిటింగ్ ఫీలవకుండా చూడలేం. ముఖ్యంగా సన్నివేశాలు మారే ట్రాన్సిషన్ షాట్లన్నీ స్మూత్ గా ట్రావెల్ అవడం శ్రీకర్ ప్రసాద్ అద్భుత ఎడిటింగ్ పనితనం. ఎడారిలో సుకుమారన్ నోటి దగ్గర చాలీచాలని నీటి ధార, అతడి జ్ఞాపకాల్లో నిండుగా ప్రవహిస్తున్న కేరళ నది దృశ్యంతో సూపర్ ఇంపోజ్ అవడం ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. షాట్స్ కూడా ఇలా అర్ధాలు చెప్తాయి.
       
ఇక రసూల్ పోకుట్టి
ఎడారిలోని డైజెటిక్ ధ్వనుల ముద్రణతో ఇంకో మ్యాజిక్ చేస్తాడు. శబ్ద ఫలితాలు కూడా ఈ సినిమాకి ఎస్సెట్. ఎఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం, పాటలు వాటికవే ఒక బాధితుడి జీవితం. బ్లెస్సీ దర్శకత్వం జీవితకాల సాఫల్యం.

చివరికేమిటి

సినిమా తెలుగు డబ్బింగ్ కి తెలంగాణ పాత్రగా మార్చారు. సాధారణంగా పాత్రలు వేరే భాష మాట్లాడుతున్నప్పుడు సబ్ టైటిల్స్ వేస్తారు. అరబ్బులు మన పాత్రలతో మాట్లాడుతున్నప్పుడు సబ్ టైటిల్స్ వేయకుండా, పాత్రలతో పాటు మనకీ అర్ధంగాకుండా చేసి- కొత్త ప్రదేశంలో ఒక మిస్టీరియస్ వాతావరణాన్ని, అయోమయాన్నీ సృష్టించడం వ్యూహాత్మక దర్శకత్వానికి నిదర్శనం. మన పాత్రలు తెలుగులో మొత్తుకుంటున్నప్పుడు, అరబ్బులు అర్ధం చేసుకోవాల్సిన ఖర్మ తమకి లేదన్నట్టుగా తన్నడం న్యాయంగానే అన్పించక మానదు. అందుకని సంపాదన కోసం గల్ఫ్ కి ఎగేసుకుంటూ  పోకుండా, మినిమమ్ అరబ్బీ నేర్చుకోవాలన్న బుద్ధి వుండాలని ఈ సినిమా పరోక్షంగా హెచ్చరిస్తుంది.
       
అయితే సినిమాలో హిందీ బానిస పాత్ర వుంది. కేరళ ముస్లింలకి ఇప్పటిలా కాక
, ఈ కథాకాలం 1990లలో హిందీ/ఉర్దూ అంతగా తెలియక పోవచ్చు. మలయాళం ఒరిజినల్ కిది సరిపోతుంది. కానీ తెలుగు వెర్షన్లో నజీబ్, హకీం తెలంగాణ ముస్లిం పాత్రలకి హిందీ/ఉర్దూ తెలియనట్టు చూపించడం సన్నివేశాల్లో భావోద్వేగాల్ని దెబ్బతీసింది. తెలంగాణా పాత్రలుగా చూపించాల్సిన అవసరమేమిటి? ఈ మధ్య తమిళ, మలయాళ తెలుగు డబ్బింగుల్లో తెలుగు పాత్రలుగా మార్చకుండా యధాతధంగానే చూపిస్తున్నారు. జైలర్ లో రజనీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ తెలుగులో ముత్తువేల్ పాండ్యనే. మంచి ముత్యం పాండు కాదు. ఆడు జీవితం టైటిల్ కూడా ఆడు జీవితమే. ఎడారి జీవితం కాదు. సినిమాలో తెలంగాణా వాళ్ళన్న డైలాగు తీసేస్తే సరిపోతుంది.

—సికిందర్