రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 11, 2024

1413 : రివ్యూ

రచన- దర్శకత్వం: ఎ. హర్ష

తారాగణం : గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ, నరేష్, ముఖేష్ తివారీ,
నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: స్వామి గౌడ
నిర్మాత: కేకే రాధామోహన్
విడుదల : మార్చి 8, 2024
***

        మాచో స్టార్ గోపీచంద్ ఒక హిట్ చూసి పదేళ్ళయింది. ఈ పదేళ్ళల్లో 10 ఫ్లాపులు తన వంతుకి సంపాదించుకున్నాడు. ఎందుకు ఫ్లాపవుతున్నాయంటే మార్పుకి అస్సలు అంగీకరించకపోవడం వల్ల. ప్రేక్షకులే మారి తన పాత మూస ఫార్ములా సినిమాల మార్గంలోకి రావాలని కోరుకోవడం వల్ల. ప్రేక్షకులు మారకుండా తమ మార్గాన కొత్త దారిని పోతున్నారు. దీంతో ప్రేక్షకులకి 10 ఫ్లాపుల దూరాన వుండి పోయాడు. ఇప్పుడు తాజాగా భీమా అనే మరో ప్రయత్నంతో వచ్చాడు. దీని పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే ఇది పద కొండవ పిడుగు అని భయం పట్టుకుంటుంది. దీనికి హర్ష అనే కన్నడ దర్శకుడ్ని నమ్మాడు. ఈ దర్శకుడితో పిడుగు కాదు పరశు రాముడి గండ్ర గొడ్డలి అన్పించేలా తయారయ్యింది వ్యవహారం. ఇక ఆఖరికి ఆ గొడ్డలితో ప్రేక్షకుల్ని సంహరించడానికే దిగాడు గోపీ చంద్ అనుకుంటూ భయపడుతూనే ఈ పదకొండవ బండ చూస్తే ఎలా వుందంటే...

కథ

అది పురాణం. ఆ పురాణంలో పరశు రాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడ్ని కోరుతాడు. సముద్రంలో గొడ్డలి విసిరితే ఆ విసిరినంత మేరకూ సముద్రం వెనక్కి వెళ్ళి భూభాగ మేర్పడుతుందని వరుణుడు చెప్తాడు. అలా ఏర్పడిన భూభాగం కేరళలోని మహేంద్రగిరిలో కథ ప్రారంభమవుతుంది. దీన్నే పరశురామ క్షేత్రమని పిలుస్తూంటారు. ఇక్కడ భవానీ అనే దుర్మార్గుడు అరాచకాలు చేస్తూ ప్రజల్ని నరక యాతన పెడుతూంటాడు. అడవిలోంచి ట్యాంకర్లలో ఏదో రవాణా చేస్తూంటాడు. ఇంకో పక్క అక్కడి ఆలయం ఆత్మల్ని ప్రేరేపిస్తోందన్నభయంతో మూతపడుతుంది. మరోపక్క రవీంద్ర వర్మ (నాజర్) అనే ఆయుర్వేద వైద్యుడు మరణించిన మనిషిని బతికించే ఔషధం కోసం మొక్కల మీద పరిశోధనలు చేస్తూంటాడు.
       
ఈ నేపథ్యంలో అక్కడికి భీమా (మాచో స్టార్ గోపీచంద్) అనే ఎస్సై వస్తాడు. అక్కడే కామెడీగా
, గల్లీ రోమియోగా విద్య (ప్రియా భవానీ శంకర్) అనే మొక్కల పరిశోధకురాలి వెంటపడి ప్రేమిస్తూంటాడు. అక్కడే భవానీ అరాచకాల గురించి తెలుసుకుని చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఇతడికేదో గతం వుంటుంది. ఏమిటా గతం? రామా ఎవరు? భవానీతో తలపడి భీమా ఏమయ్యాడు? ఆలయం అసలెందుకు మూతబడింది? భీమా వెనకున్న అసలు విలనెవరు? ఇతనెలా అంతమయ్యాడు? రామాలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? ట్యాంకర్ల రహస్యమేమిటి? ఇవన్నీ మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కలగూరగంపలా వుంది. పరశురాముడి స్థల పురాణంతో ఆర్భాటంగా ప్రారంభమై ఆలయం కథ, భవానీ కథ, రవీంద్రవర్మ కథ, పిల్లల అక్రమ రవాణా కథ, భీమా కథ. రామా కథ, రామాలోకి ప్రవేశించిన ఆత్మ కథ...ఇలా ఎన్నెన్నో కథలతో గోపీచంద్ కాపీ మజిలీ కథలా తయారైంది. తను నటించిన పాత సినిమాల్నే కాపీ చేసి చివర్లో కాంతారా టైపు క్లయిమాక్సునే అతికించి ట్రెండ్ లో వున్నానని చాటుకునేలా వుంది. వారం క్రితమే భూతద్ధం భాస్కర్ నారాయణ లో ఇదే కాంతారా టైపు క్లయిమాక్స్ చూశాం. వెనక్కిపోతే ఇంకెన్నో సినిమాల్లో చూశాం.  ఇంకెన్ని సార్లు ఇదే చూపిస్తారు? ఇలా చూపించినవన్నీ ఫ్లాపవుతున్నాయి.
       
స్థల పురాణం
, భవానీ అరాచకాలు, ఆలయ కథ చెప్పాక, దాదాపు పదిహేను నిమిషాలు వెన్నెల కిషోర్ కామెడీ నడుస్తుంది. ఇదేం సినిమా ప్రారంభమో అర్ధం గాదు. ఎస్సై భీమాగా గోపీచంద్ ప్రవేశించాక నడుం వూపులతో వాంప్ లా కనిపించే హీరోయిన్ తో లవ్ ట్రాక్ మొదలు. ఆమె బాడీగార్డ్ ని అడిగితే ఎస్సైగా గోపీచందే బాడీ గార్డు గా వెంటపడి తిరుగుతూంటాడు. ఈ లవ్ ట్రాక్ హీరోయిన్ చేసే సంజ్ఞలతో అసభ్యంగా వుంటుంది. అరగంటపాటు ఈ అసభ్య లవ్ ట్రాక్ సాగేక, విలన్ గ్యాంగ్ తో పోరాటం, ఇంటర్వెల్. ఈ మధ్య టెంప్లెట్ కథనంతో సినిమాలు రావడం లేదు. గోపీచంద్ మాత్రం మారకుండా అదే ఫార్ములా కృతక టెంప్లెట్ కథనమే వడ్డించాడు. ఫస్టాఫ్ లో ఎన్నో పాయింట్లు ఎత్తుకుని దేని మీదా నిలబడక  భీమాగా వైదొలిగాడు.
       
సెకండాఫ్ రామాగా గోపీచంద్ ఎంట్రీ. రామాతో ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ ఇంకో హీరోయిన్  మాళవికా శర్మతో ఇంకో లవ్ ట్రాక్. ఇది కూడా సహన పరీక్ష పెట్టాకా కథలోకి
, అక్కడ్నిం చి క్లయిమాక్స్ కి. ఏ మాత్రం సస్పెన్స్, థ్రిల్స్, మలుపులూ లేని, వాటికి వీలివ్వని కలగూరగంప కథతో కన్నడ దర్శకుడి 2000 నాటి సినిమా. ఈసారి ద్విపాత్రాభినయం చేసినా గోపీచంద్ కి దక్కని హిట్.

నటనలు- సాంకేతికాలు

ఈ ద్విపాత్రాభినయం ఏ పాత్రకీ బలమివ్వని వ్యవహారంగా మారింది. యాక్షన్ సీన్స్ మాత్రం విజృంభించి చేశాడు. కానీ యాక్షన్ సీన్లు మాత్రమే సినిమాని నిలబెట్టలేవు. ఇద్దరు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కూడా విఫలమైంది. హీరోయిన్లు ప్రియ, మాళవిక లవి కృత్రిమ ఫార్ములా పాత్రలు. నాజర్, ముఖేష్ తివారీ తదితరులు విలన్లుగా రొటీన్ నటనలతో సరిపెట్టారు.
        
కేజీఎఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ని తెచ్చుకున్నాడు కన్నడ దర్శకుడు హరీష్, బస్రూర్ చేసింది ప్రత్యేకంగా ఏమీ లేదు. స్వామి గౌడ
ఛాయాగ్రహణంలో కూడా ప్రత్యేకత ఏమీ లేదు. గ్రాఫిక్స్ కి బాగా ఖర్చుపెట్టారు. నృత్య దర్శకుదే అయిన దర్శకుడు పాటలకి సమకూర్చిన కొరియోగ్రఫీ అతి మామూలుగా వుంది. నృత్య దర్శకులు, ఛాయాగ్రాహకులు దర్శకులైతే ఆ సినిమాలు ఫ్లాపవుతున్నాయి. ఇటీవలే ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈగల్  కూడా ఫ్లాపయ్యింది. ఇప్పుడు నృత్య దర్శకుడు తీసిన భీమా. ఇలా గోపీచంద్ చేసిన 11వ దండయాత్ర కూడా కాలం చెల్లిన పాత మూస ఫార్మలా జాబితాలోకి చేరింది.

—సికిందర్