రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 11, 2024

1412 : రివ్యూ


 రచన- దర్శకత్వం : విద్యాధర్ కె

తారాగణం : విశ్వక్ సేన్, చాందినీ చౌదరి, అభినయ, హారిక, భయానంద్ రెడ్డి, మహ్మద్ సమద్ తదితరులు
సంగీతం : స్వీకార్ ఆగస్తీ, నరేష్ కుమారన్; ఛాయాగ్రహణం : విశ్వనాథ రెడ్డి, రాంపీ
నిర్మాత : కార్తీక్ శబరీష్ , శ్వేత ఏం.
విడుదల : మార్చి 8, 2024
***

        దాదాపు అయిదేళ్ళుగా నిర్మాణంలో నవున్న గామి ఈ రోజు విడుదలైంది.  రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు నటిస్తూ వచ్చిన హీరో విశ్వక్ సేన్ గామి తో తన మీద తను ఒక ప్రయోగం చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాకుండా, రెగ్యులర్ కమర్షియల్ కథ కూడా కాకుండా, హాలీవుడ్ నుంచి వచ్చే సర్వైవల్ డ్రామా లాంటిది చేశాడు. దీనికి విద్యాధర్ కొత్త దర్శకుడు. కొత్త దర్శకుడు మూసకి పోకుండా వైవిధ్యాన్ని ప్రయత్నించడమన్నది ఒక అభినందించ దగ్గ విషయం. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల కిచ్చిన ప్రత్యేక అనుభవమేమిటో చూద్దాం...

కథ

హరిద్వార్ లో శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. అఘోరాలతో కలిసి వుంటాడు. తనెవరు, ఎక్కడ్నించి వచ్చాడు గుర్తు లేవు. అతనొక వింత వ్యాధితో బాధపడుతూంటాడు. తనని ఎవరైనా ముట్టుకుంటే శరీర రంగు నీలి రంగులోకి మారి పోతుంది. స్పృహతప్పి పడిపోతాడు. దీంతో ఇతడి వల్ల ఇబ్బంది పడుతున్నామని తోటి అఘోరాలు వెలివేస్తారు. ఇక తన వ్యాధికి చికిత్స వెతుక్కుంటూ కాశీకి వెళ్తాడు. అక్కడొక సాధువు నివారణోపాయం చెప్తాడు. మాలీ పత్రాలు అనే పువ్వు వుంటుందని, అది 36 ఏళ్ళ కోసారి హిమాలయాల్లో కాస్తుందనీ, ఇప్పుడు 36 వ సంవత్సరం ప్రవేశించిందనీ, 15 రోజుల్లో వెళ్ళి దాన్ని సాధించుకోమనీ చెప్తాడు.
       
హిమాలయాలకి బయల్దేరిన శంకర్ కి జాహ్నవి (చాందినీ చౌదరి) తోడవుతుంది. ఈమె మెడికల్ రిసెర్చర్. శంకర్ కి ఓ ఇద్దరి గురించిన ఆలోచనలు వేధిస్తూంటాయి : ఉమ (హారిక)
, సీటీ 333 (మఃహ్మద్ సమద్). వీళ్లెవరో అర్ధంగాదు. అలాగే ప్రయాణం సాగిస్తాడు. ఈ మానసిక సంఘర్షణతో కూడిన ప్రయాణంలో అతను మాలీ పత్రాలు సంపాదించగలిగాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

సర్వైవల్ డ్రామా. జీవన్మరణ పోరాటం చేస్తూ సాగించే ప్రయాణపు కథ. ఇందులో ప్రకృతి వైపరీత్యాలుండొచ్చు, క్రూర మృగాలతో ప్రమాదాలుండొచ్చు. ఇవన్నీ ఎదుర్కొని  ప్రాణాలతో బయటపడే హ్యూమన్ స్పిరిట్ కథ. విశ్వక్ సేన్ నటించడానికి బాగా అవకాశమున్న కథ. పూర్తిగా అవుట్ డోర్ అడ్వెంచర్. హిమాలయాల్లో సాహసకృత్యాలు. శంకర్ కి తనెవరో తెలీదు. దీనికి సమాంతరంగా రెండు ఉప కథలు వస్తూంటాయి ఫ్లాష్ బ్యాకులుగా. గ్రామంలో ఉమ అనే అమ్మాయిని సర్పంచ్ దేవదాసిగా మార్చేందుకు ప్రయత్నిస్తూంటే ఆమె ఎలా తప్పించుకుందన్న ఉప కథ ఒకటి, ఇంకోచోట సీటీ 333 అనే నెంబరు గల  యువకుడు తన మీద చేస్తున్న అక్రమ వైద్య ప్రయోగాల నుంచి ఎలా తప్పించుకున్నాడనే ఉప కథ. ఈ రెండూ సమాంతరంగా సాగుతూ వచ్చి చివర్లో శంకర్ కథతో కలుస్తాయి. అప్పుడు శంకర్ ఎవరో తెలుస్తుంది.
       
అయితే ఈ ఉప కథల్లో బలం లేదు పాత్రలకి తగిన స్ట్రగుల్ లేకపోవడం వల్ల. పైగా ఇవి శంకర్ దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూండడంతో కంటిన్యూటీ సరిగ్గా లేక కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక శంకర్ కథ ఆసక్తికరంగా సాగేబదులు ఓపికని పరీక్షిస్తూ నిదానంగా సాగుతూంటుంది. శంకర్ స్ట్రగుల్
, అపాయాలతో పోరాటాలు మాత్రం  బావుంటాయి.
       
ఫస్టాఫ్ కథని పరిచయం చేస్తూ కాస్త వేగంగానే సాగినా
, ఇంటర్వెల్ సీను అకస్మాత్తుగా వచ్చేస్తుంది లీడ్ లేకుండా. ఆ తర్వాత సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. జాహ్నవి తనెందుకు ఈ ప్రయాణం చేయాల్సివచ్చిందో చెప్పడం, అతడి సమస్య తెలుసుకుని చలించడమూ వగైరా వుంటాయి. ఇక ఇద్దరి ప్రయాణం హిమాలయాల్లో ప్రమాదాలతో కూడి వుంటుంది సింహంతో పోరాటం సహా. ఈ రెండు పాత్రల అనుభవాలు, ఆవేదనలు, ఆక్రందనలు సినిమాని గంభీర ముద్రలోకి తీసికెళ్ళి పోతాయి. అభిరుచి గల ప్రేక్షకులకిదొక మంచి అవకాశమేగానీ సాధారణ ప్రేక్షకులకి కాదు. మమ్ముట్టికి ‘భ్రమయుగం’ ఎలాగో,  విశ్వక్ సేన్ కి ‘గామి’ అలాగ.

నటనలు- సాంకేతికాలు

నిస్సందేహంగా విశ్వక్ సేన్ కిది మంచి పాత్ర. అఘోరా పాత్రని స్టడీ చేసి నటించినట్టున్నాడు. తనలోని నటుడ్ని బయటికి తీసుకొచ్చాడు. అతడి ఫ్యాన్స్ జీర్ణించుకున్నా జీర్ణించుకోక పోయినా డోంట్ కేర్ అన్నట్టు పాత్రలోకి దూరిపోయి నటించాడు/జీవించాడు. అందులోనే సర్వస్వం ధారబోశాడు. డైలాగులు అతి తక్కువ. హావభావాలే ఎక్కువ. ముఖం కూడా పూర్తిగా, సరిగ్గా కనిపించదు. కమర్షియల్ హీరోలు ఇలా కనిపించడానికి ఒప్పుకోరు. మొహం నిండా బాగా లైటు పడాలి, బోలెడు డైలాగులు చెప్పాలి. అప్పుడే బొమ్మ పడాలి.
       
మెడికల్ రిసెర్చర్ పాత్రలో చాందినీ చౌదరికి నటించడానికి కీలక సన్నివేశాలు లేకపోయినా హీరోతో పాటు స్ట్రగుల్ బాగా నటించింది. అలాగే  ఉపకథల్లో ఉమగా హారిక
, సీటీ 333గా మహ్మద్ సమద్, ఉమ తల్లిగా అభినయ ఫర్వాలేదు.
       
సాంకేతికంగా- ఛాయాగ్రహణపరంగా ఎగుడుదిగుడుగా వుంది. ఐదేళ్ళు నిర్మాణంలో వుండడం వల్లనేమో ఏకత్వం కరువైంది. హిమాలయా దృశ్యాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. శివరాత్రికి విడుదలైన ఈ సినిమా శివుడి ప్రస్తావనలతో
, శివుడి మీద ఓ పాటతో భక్తుల్ని భక్తి సాగరంలో ముంచెత్తుతాయి.
       
గత రెండు వారాలుగా టపా కట్టేస్తున్న సినిమాల్లా కాకుండా
, ఈ సినిమా ఆడినా ఆడక పోయినా విషయమున్న చలన చిత్రంగా మాత్రం గుర్తుండి పోతుంది.
—సికిందర్