రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, జులై 2015, సోమవారం

సాంకేతికం- కెమెరా


ఛోటా కె. నాయుడు 
సాంకేతిక ఔన్నత్యం ఆత్మిక దాహాన్ని కూడా తీర్చగలిగే సాధనమైనప్పుడు, ఒక ‘అవతార్’ లా, ఇంకో ‘రోబో’ లా కాసుల కుంభవృష్టి కూడా కురుస్తుంది. పౌరాణిక ఛాయలున్న సమకాలీన పాత్రలే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చగల్గుతాయని ఎప్పుడో రుజువైంది. ఇలా ఆత్మిక దాహాన్ని తీర్చిన నాటి ‘మేజర్ చంద్రకాంత్’,  ‘కొండవీటి సింహం’ లాంటివి ఇప్పుడు తీస్తే, ఇంకింత భారీస్థాయిలో అత్యాధునిక సాంకేతిక హంగులన్నీ కలుపుకుని అదరగొట్టేట్టు వుండాలని నవతరపు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

          దీన్ని కరెక్టుగా గుర్తించారు సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు. ఏ వెండితెర మీద దృశ్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందో, అదింకా కాస్సేపుంటే బావుండన్పిస్తుందో, ఆ దృశ్యంలోని ప్రతీ అంశం తేటగా కళకళ లాడుతూ వుంటుందో, ఆ దృశ్యకారుడి పేరే  ఛోటా కె. నాయుడు. ఆయన చేతిలో కెమెరా ఓ మంత్ర దండం లాంటిది. ఈ రంగుల మంత్రదండపు మాయాజల్లులో తడిసి తరించని సూపర్ స్టార్ లేరు.  ఆ స్టార్స్ కి దాసోహం కాని ప్రేక్షకులూ లేరు...  ‘అడ్వాన్స్ అయిపోయారు ప్రేక్షకులు!’ అని కామెంట్ చేశారాయన. ‘ ప్రేక్షకుల కోసం ఇప్పుడింకెలా తీస్తే సక్సెస్ అవుతామో సరిగ్గా ఊహించి, రిస్కు చేసి, ఒక ‘అవతార్’ నీ, ఇంకో ‘రోబో’నీ తీశారు ప్రసిద్ధ దర్శకులు జేమ్స్ కామెరూన్, ఎన్. శంకర్ లు. డిస్కవరీ ఛానెళ్ళల్లో, ఇతర మీడియాల్లో ఎన్నోఆశ్చర్య గొలిపే ప్రోగ్రాముల్ని చూస్తున్న ప్రేక్షకులు,  సినిమాల్లోనూ ఆ స్థాయి దృశ్య వైభవాల్నే  కోరుకుంటున్నారు..’ అన్నారాయన.


     సినిమా అనేది ఎంత హైటెక్ హంగుల్ని కలుపుకున్నప్పటికీ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకూదదన్నారు. లేటెస్ట్ ‘బృందావనం’  సక్సెస్ ని మనసారా ఎంజాయ్ చేస్తున్న ఛోటా, ఆ సినిమాలో బ్రహ్మానందం దగ్గర్నుంచీ తారాగణమంతా తమని ఎంతో అందంగా ఛోటా గారు చూపించారని కురిపిస్తున్న ప్రశంసలకి స్పందిస్తూ- ‘అందంగా చూపించక పోతే ఇక నేనెందుకు? కెమెరామాన్ గా అది నా డ్యూటీ. అలా అందంగా చూపించడంతో బాటు, దర్శకులు ఏం కోరుకుంటున్నారో ఆ సన్నివేశ ఫీల్ ని రాబడుతూ పిక్చరైజ్ చేస్తాను’ అన్నారు.


             ఫీల్డులో అత్యధిక పారితోషికం పొందుతున్న ఛాయాగ్రాహకుడెవరైనా వుంటే అది తనే. ఐతే కెమెరామాన్ వేగంగా పనిచేయలేకపోతే నిమిష నిమిషానికీ నిర్మాత డబ్బు కోల్పోవాల్సి వస్తుందన్నారు. 


           ఇప్పుడు సినిమాలు ముడి ఫిలిం నుంచి డిజిటల్ కి మారుతున్న సంధి కాలంలో వున్నాయి. దీన్ని తాను తప్పక ఆహ్వానిస్తానన్నారు. కొంత సమయం తీసుకుని  చిన్న బడ్జెట్ లో డిజిటల్ సినిమా తీస్తానన్నారు. శబ్దాని కెప్పుడో డీటీఎస్ తో డిజిటలీకరణ జరిగిపోయింది, కెమెరాకీ డిజిటల్ తో అలాటి అవసరం లాగా, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీఐ) ప్రక్రియ వచ్చిందన్నారు. ఈ డీఐ తో కూడా వెండి తెర మీద తనదైన ముద్ర ఏమాత్రం దెబ్బతినకుండా, దగ్గరుండి కలర్, లైటింగ్ కరెక్షన్స్ చేయించు కుంటానన్నారు. ఇక డెప్త్ విషయానికొస్తే, దాన్ని కాపాడే కలరిస్టులు మనకున్నారన్నారు. పోతే, మామూలు దృశ్యాల్ని కెమెరాతో చూస్తామనీ, గ్రాఫిక్స్ కయితే మనోనేత్రంతో చూడాల్సి వస్తుందనీ, గ్రాఫిక్స్ మెదడుకి మేత లాంటిదనీ  చమత్కరించారు.


         మరి కెమెరామానే దర్శకుడైతే అన్న ప్రశ్నకి, అప్పుడు తొంభై శాతం ఫెయిల్యూరే అన్నారు. అదెలా? ‘స్వార్ధం! సహజంగా కెమెరా మాన్ కుండే స్వార్ధం కొద్దీ సరౌండింగ్స్ అందంగా రావాలని దాని మీదే దృష్టి పెడతాడు. దర్శకుడైతే మొదటి నుంచీ స్క్రిప్టు మీద అవగాహనతో ఉంటాడు. సినిమా మూడ్, ఫీల్, ఫ్లో ల మీద అతడికి మంచి పట్టు వుంటుంది. కానీ నిత్యం పిక్చరైజేషన్ తోనే తలమునకలయ్యే కెమెరామాన్ ఆ మూడ్, ఫీల్, ఫ్లోలని కూడా పరిగణనలోకి తీసుకోవడంలో కొంత వెనుక బడతాడు. దీనివల్ల తను దర్శకుడిగా రాణించే లేక పోవచ్చు ‘ – అని వివరించారు.



             శ్యాం కె. నాయుడు తో బాటు, మరో ఐదారుగురు తన శిష్యుల్ని కెమెరామాన్లుగా తయారుచేసిన ఛోటా, 1991 లో ‘అమ్మ రాజీనామా’ తో డాక్టర్ దాసరి నారాయణ రావు స్కూల్ ల్ నుంచి సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. ముందు విడుదలైన సినిమా ఇదే అయినా, పని చేయడం మొదలెట్టింది అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలోని ‘రగులుతున్న భారతం’ కి. ఇప్పటికి ఆయన చేసిన సినిమాల సంఖ్య 56 కి చేరింది. ప్రస్తుతం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ‘ప్రేమ కావాలి’ కి పని చేస్తున్నారు. ‘భారీ సినిమాల మెగా బడ్జెట్లతో, టెక్నాలజీలతో పని చేసిన అనుభవమున్న మీరు, ఒక సాధారణ  ప్రేమ సినిమాకి ఎలా న్యాయం చేయగలరు? ఇది కూడా అంతేసి బడ్జెట్ భారంతో పాటు టెక్నాలజీ హంగామా కూడా మోయాల్సిందేనా?’ అన్న మరో ప్రశ్నకి, అదేం కాదన్నారు. దీని బడ్జెట్ నీ, పనిదినాలనీ దృష్టిలో పెట్టుకుని, క్వాలిటీతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీ కరిస్తున్నానన్నారు. రామానాయుడు స్టూడియోలో ‘ప్రేమ కావాలి’ లోని ఓ పాటని చిత్రీకరిస్తూ గ్యాప్ లో ఈ కబుర్లన్నీ చెప్పిన ఛోటా, ఈ సినిమాకి రెగ్యులర్ 435 కెమెరానే వాడుతున్నానన్నారు. అయితే మాస్టర్ ప్రైమ్ లెన్స్ తో షూట్ చేస్తున్నానన్నారు. ఈ లెన్స్ ప్రత్యేకత  మండుటెండల్లో షూట్ చేసినా కూడా దృశ్యాన్ని చెక్కుచెదర నివ్వదన్నారు ఛోటా కె. నాయుడు.



సికిందర్ 

నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’