రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, May 22, 2023

1332 : స్పెషల్ ఆర్టికల్


 

        (డియర్ రీడర్స్, నేటి నుంచి తిరిగి అన్ని శీర్షికలూ మీ అందుబాటులో కొస్తాయి. రివ్యూలతో బాటు స్క్రీన్ ప్లే సంగతులు, స్క్రీన్ ప్లే టిప్స్, స్ట్రక్చర్ అప్డేట్స్, సందేహాలు- సమాధానాలు, రైటర్స్ కార్నర్, స్పెషల్ ఆర్టికల్స్ మొదలైన శీర్షికలు తిరిగి ఎప్పట్లాగా అందుకోగలరు. కొందరు పాఠకులు (కొత్త రచయితలు, దర్శకులు) పేరు లేకుండా వాట్సాప్ మెసేజీలు చేస్తున్నారు. పేరు, వివరాలు తెలిపితే బావుంటుంది. అయితే వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం సాధ్యం కాదు. అర్హమైన వాటికి సందేహాలు -సమాధానాలు శీర్షిక ద్వారా మాత్రమే సమాధానాలివ్వగలమని గమనించగలరు)

        ప్పుడు పరిస్థితి ఎక్కడికి దారితీసిందంటే, చూసి చూసి సినిమా ప్రదర్శనా రంగం బాలీవుడ్ నిర్మాణ రంగాన్ని బ్లేమ్ చేయడం మొదలెట్టింది. త్వరలో 50 మల్టీప్లెక్సుల్ని మూసి వేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసిన కారణం, బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడమేనంటూ ప్రకటన కూడా విడుదల చేసింది ఆ సంస్థ. అటు అమెరికాలో కూడా దివాలా తీసిన రీగల్ సంస్థ 500 థియేటర్లని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మనదేశంలో ప్రముఖ పీవీఆర్- ఐనాక్స్ లీజర్ సంస్థ గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 నికర నష్టాన్ని చవిచూడడంతో, 50 మల్టీ ప్లెక్సుల్ని మూసి వేయబోతున్నట్టు ప్రకటించింది.

        త ఏడాది మార్చిలో, పీవీఆర్ -ఐనాక్స్ లీజర్ సంస్థలు మూడవ, నాల్గవ, ఐదవ శ్రేణి సెంటర్లలో మల్టీప్లెక్సులు ప్రారంభించి,1500 కంటే ఎక్కువ స్క్రీన్‌ల నెట్వర్క్ తో  దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌ ని  రూపొందించడానికి విలీనాన్ని ప్రకటించాయి. అయితే 2023 జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికంలో పీవీఆర్ - ఐనాక్స్ గ్రూపుకి దాదాపు రూ. 333 కోట్ల నష్టాలు వాటిల్లాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 100 కోట్లకి పైగా నష్టాల్ని చవిచూసింది ఈ గ్రూపు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం, అందుకు తగ్గట్టు రెవెన్యూ లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.
        
రెవెన్యూ లేకపోవడానికి బాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత మరొకటి బాక్సాఫీసు దగ్గర చతికిల బడడం కారణం. ఈ యేడాది బాలీవుడ్‌లో ఇప్పటి వరకు హిట్ అనిపించుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి షారుఖ్ పఠాన్’. రెండోది అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ’. మూడు నెలల కాలంలో విడుదలైన 24 సినిమాల్లో ఈ రెండు సినిమాలు తప్పించి ఇంకేదీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయాయి.
       
అసలు ఆకర్షించడానికి స్టార్ సినిమాలు పెద్దగా విడుదల కూడా కాలేదు. విడుదలైన స్టార్ సినిమాల్లో షారూఖ్
పఠాన్ తప్ప ఇంకేదీ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేదు. సల్మాన్ ఖాన్ -వెంకటేష్ కిసీకా భాయ్ -కిసీకీ జాన్’, రణబీర్ కపూర్ తూ ఝూటీ -మై మక్కార్’, అజయ్ దేవగణ్ భోలా’, కార్తీక్ ఆర్యన్ షెహజాదా’, అక్షయ్ కుమార్ సెల్ఫీ - ఈ ఐదు స్టార్ సినిమాలకి ప్రేక్షక దర్శన భాగ్యం లభించలేదు.
       
ఇక చిన్న తారాగణం
, కొత్త తారాగణంతో విడుదలైన 18 లోబడ్జెట్ సినిమాల్లో ది కేరళ స్టోరీ తప్ప మిగిలినవి పీవీఆర్- ఐనాక్స్ గ్రూపుకి చుక్కలు చూపించాయి. దీంతో బాలీవుడ్ పనితీరు మీద ధ్వజమెత్తింది. బాలీవుడ్ క్రాష్ అయిందని కొందరు పరిశీలకులు కూడా గొంతు కలుపుతున్నారు.
       
ఇక మిగిలిన త్రైమాసికాల్లో
బాహుబలి’ ఫేమ్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’,  రణవీర్ సింగ్ -లియా భట్ నటించిన ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ , రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’, షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, డుంకీ’, సల్మాన్ ఖాన్ నటించిన  ‘టైగర్ 3’ వంటి బిగ్ స్టార్ భారీ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు.
       
ఇక
సగటు ప్రేక్షకుడు మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు రూ. 250, రూ. 350 చూసి పారిపోతున్నాడు. తినుబండారాల ధరలు చూసి సొమ్మసిల్లి పడిపోతున్నాడు. ఈ మల్టీ బాదుడు చూసి కూడా జనం మల్టీప్లెక్సులకి రావడం తగ్గిపోయింది. చిన్న పెద్ద సినిమాలన్నిటికీ ఒకే టికెట్ రేటు పడితే చిన్న సినిమాలకి ప్రేక్షకులు తగ్గి పోతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా నష్టాలు వస్తున్న 50 స్క్రీన్స్ ని వచ్చే ఆరు నెలల కాలంలో మూసివేయాలని పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ప్రకటించింది.
        
తెలంగాణలో టికెట్టు ధర రూ. 295 వుంది. అదే ఆన్‌లైన్ బుకింగ్ అయితే రూ. 329 రూపాయలు. మొన్నటి వరకు రూ. 200 గరిష్టంగా వున్న టికెట్ ధర రూ. 250 కి చేరుకుంది. పెద్ద సినిమాలకి మరో రూ. 50 రూపాయలు పెంచుకునే సదుపాయం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దాని ఫలితమే ఇప్పుడు పెద్ద సినిమాలకి రూ. 295, ఆన్‌లైన్ లో అయితే రూ. 329. హైదరాబాద్ లో ప్రైవేట్ యాజమాన్యాలు నడుపుతున్న ఒకటి రెండు మల్టీప్లెక్సుల్లో ముందు వరస రెండు లైన్లలో సీట్లకి ధర తగ్గించి రూ. 150 వసూలు చేస్తున్నారు. సగటు ప్రేక్షకుడికి కాస్త ఊరట.
        
అమెరికాలో రీగల్ సంస్థ దివాలా తీయడానికి హాలీవుడ్ సినిమాలు కారణం కాదు. మహమ్మారిలో లాక్ డౌన్ల కాలం నుంచి వాయిదా వేసిన చెల్లింపుల ద్వారా పెరిగిన అద్దె వంటి పాండమిక్ అనంతర ఖర్చులు మూసివేతలకి  ప్రధాన కారణంగా పేర్కొంది సంస్థ. 2019 నుంచి  2022 వరకు ఒక్కో థియేటర్‌కి సగటు నెలవారీ అద్దె 30 శాతం పెరిగిందని పేర్కొంది. మహమ్మారి థియేటర్ వ్యాపారంపై చాలా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ సంస్థ మీద 4.8 బిలియన్ డాలర్ల ఋణ భారముంది. మహమ్మారి కాలంలో 3 బిలియన్ డాలర్లు నష్టపోయింది. గత సంవత్సరంలో బాక్స్ ఆఫీసు మెరుగుపడింది. మార్వెల్ స్టూడియోస్ స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’, ‘షాంగ్-చీ’, టెన్ రింగ్స్’,  సోనీస్ వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్ మొదలైన హిట్స్  అనేక ఇతర వాటిలో ప్రేక్షకుల్ని తిరిగి సినిమా వైపుకు లాగాయి. అయినా పేరుకుపోయిన చెల్లింపులు దివాలా తీయించాయి.
       
ఇప్పటికే న్యూయార్క్
, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ మొదలైన నగరాల్లో 29 మల్టీప్లెక్సులు మూతబడ్డాయి.  దివాలా తీసిన సమయంలో రీగల్ దేశవ్యాప్తంగా సుమారు 500 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. 
        
మనదేశంలో మల్టీప్లెక్సులు మహమ్మారి దెబ్బని తట్టుకున్నాయి. కానీ బాలీవుడ్ దెబ్బని తట్టుకోలేకపోతున్నాయి. అందుకే అన్నారు- ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలని. బాలీవుడ్ స్థానభ్రంశం చెంది సౌత్ సినిమాలు దేశాన్ని ఆక్రమిస్తాయని. ఇకనైనా బాలీవుడ్ కళ్ళు తెరవక పోతే అంతర్జాతీయ బ్రాండింగ్ ని కూడా కోల్పోయే పరిస్థితి ఎదురుకావొచ్చు.

—సికిందర్

 


Saturday, May 20, 2023

1331 : రివ్యూ!


 

దర్శకత్వం : విజయ్ ఆంటోనీ
తారాగణం : విజయ్ ఆంటోనీ, కావ్యా థాపర్, రాధా రవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడి తదితరులు
రచన : విజయ్ ఆంటోనీ, కె పళని, పాల్ ఆంటోనీ; సంగీతం : విజయ్ ఆంటోనీ, ఛాయా
గ్రహణం : ఓం నారాయణ్
బ్యానర్ : విజయ్ ఆంటోనీ  ఫిల్మ్ కార్పొరేషన్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
విడుదల : మే 19, 2023
***

          2016 లో పిచైక్కారన్ (బిచ్చగాడు) విజయం తర్వాత , 2020లో తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ దీనికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసి పిచైక్కారన్ దర్శకుడు శశిని దర్శకత్వం వహించమని కోరాడు. అయితే శశి ఇతర సినిమాలతో బిజీగా వుండడంతో కుదరలేదు. దీంతో విజయ్ ఆంటోనీ దర్శకురాలు ప్రియాకృష్ణ స్వామిని కోరాడు. ఆమె ఒప్పుకుని తర్వాత తప్పుకుంది. ఇక విజయ్ ఆంటోనీ దర్శకుడు ఆనంద కృష్ణన్ ని కోరాడు. అతను కూడా తిరస్కరించడంతో ఇక తప్పక విజయ్ ఆంటోనీ తానే త్రిపాత్రాభినయం చేయడానికి సిద్ధపడ్డాడు : సినిమాలో నటించడానికి ద్విపాత్రాభినయం- సినిమా తీయడానికి దర్శకత్వ పాత్ర. ఇక షూటింగ్ లో పాట చిత్రీకరిస్తున్నప్పుడు తనూ, హీరోయిన్ కావ్యా థాపర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో పిచైక్కారన్ 2 కథ తన కథ నుంచి కాపీ కొట్టారని ఒక రచయిత కోర్టు కెక్కాడు. ఇలా మళ్ళీ ఇంకో బిచ్చగాడి కథ చెప్పడానికి ఇన్ని కష్టాలు గట్టెక్కిన విజయ్ ఆంటోనీ సినిమాతో ఏమిచ్చాడో చూద్దాం...

కథ

విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. అతను హేమ (కావ్య థాపర్) ని ప్రేమిస్తాడు. అతడి అపార సంపద మీద సీఈఓ (దేవ్ గిల్), ఒక డాక్టర్ (హరీష్ పేరడి), ఇంకొక అసోషియేట్ (జాన్ విజయ్) న్నేస్తారు. దుబాయ్ లో ఒక సైంటిస్టు మెదడు మార్పిడి శస్త్ర చికిత్స గురించి ప్రకటించింది చూసి, అతడ్ని సంప్రదిస్తారు. విజయ్ మెదడుని ఇంకొకడి మెదడుతో మార్పిడి చేసి, విజయ్ ని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని సైంటిస్టుతో పథకం రచిస్తారు.
          
సత్య (విజయ్ ఆంటోనీ) అనే ఒక బిచ్చగాడుంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయి బిచ్చమెత్తుకుని చెల్లెల్ని పోషిస్తూంటే, ఒక ముఠా చెల్లెల్ని ఎత్తుకుపోతుంది. ఈ క్రమంలో సత్య ఒకడ్ని చంపి 20 ఏళ్ళు జైలుకి పోతాడు. జైలునుంచి విడుదలై చెల్లెలి అన్వేషణలో వుంటాడు. ఈ సత్య దుష్టత్రయం కంటబడేసరికి- విజయ్ లాగే వున్న సత్య మెదడుని విజయ్ కి మార్పించేసి సత్యని చంపి పారేస్తారు.
          
ఇప్పుడు సత్య మెదడుతో వున్న విజయ్ సత్యలాగా బిహేవ్ చేస్తూ దుష్టత్రయం మాట వినడు. అతడికి సంపద మీద ఆసక్తి వుండదు. చెల్లెలి అన్వేషణే జీవిత లక్ష్యంగా వుంటాడు. ఈ నేపథ్యంలో దుష్టత్రయంతో ఎలాటి సమస్య లొచ్చాయి? తను విజయ్ కాదు సత్య అన్న గుట్టు రట్టయితే ఏం జరిగింది? చెల్లెలు ఎప్పుడు ఎలా దొరికింది? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా సినిమాలో.

ఎలావుంది కథ

బిచ్చగాడు లో కోమాలో వున్న తల్లిని బతికించుకోవాలంటే సంపన్నుడైన కొడుకు నెల రోజులు బిచ్చగాడిగా బతకాలన్న సాధువు మాటతో, ఒక మదర్ సెంటిమెంటు హిట్ సినిమా చూశాం. హైదరాబాద్ లో రోజూ 4 ఆటలతో 50 రోజులకి పైగా హౌస్ ఫుల్స్ ఆడింది. బిచ్చగాడు తో బయ్యర్లు రిచ్ అయ్యారు. ఇప్పుడు బిచ్చగాడు 2 లో చెల్లెలు దొరకాలంటే పేదలకి సాయపడాలన్న సీనియర్ బిచ్చగాడి మాటతో, చెల్లెలి సెంటిమెంటు సి నిమా చూస్తాం. ఇది సెకండాఫ్ లో వచ్చే కథ.
        
ఫస్టాఫ్ లో మెదడు మార్పిడి కథ వుంటుంది. మెదడుని మార్చడమేనేది ఇప్పట్లో సాధ్యమయ్యే ప్రక్రియ కాదని నిపుణులు చెప్తున్నా- సినిమాకి వినోద ఫాంటసీగా ఇది చెల్లిపోతుందనుకో వచ్చు. హాలీవుడ్ లో ఇలాటి సినిమాలు కొన్ని వచ్చాయి. ఒక ఫ్రెంచి సినిమా కూడా వుంది – ది మాన్ విత్ ది ట్రాన్స్ ప్లాంటెడ్ బ్రెయిన్ లో బ్రెయిన్ స్పెషలిస్టుకి గుండె జబ్బుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో తన బ్రెయిన్ ని కారు రేసుల్లో బ్రెయిన్ దిబ్బతిన్న 23 ఏళ్ళ రేసర్ కి అమర్చమని కోరతాడు.
       
ఐతే
బిచ్చగాడు 2 తో వచ్చిన సమస్య ఏమిటంటే, విజయ్- సత్య ఒకలాగే వున్నప్పుడు బ్రెయిన్ మార్చాల్సిన పనేముంది? విజయ్ స్థానంలో సత్యని ప్రవేశపెడితే సరిపోయే ఫార్ములా వుండగా? కనుక ఫస్టాఫ్ లో కాసేపటికి ఈ బ్రెయిన్ మార్పిడి కథ అర్ధాన్ని కోల్పోతుంది. అలాగే ఇదంతా కాకుండా, కంపెనీల సర్వర్స్ ని హ్యాకింగ్ చేసి, డేటాని ఇంక్రిప్ట్ చేసి పట్టుకుని బెదిరిస్తే, డబ్బే డబ్బు వచ్చేస్తుంది విలన్స్ కి. ఇలాకాక సంపద దోపిడీకి నాటకీయత కోసం సత్య మెదడుగల విజయ్ ని ఇంట్లోకి ప్రవేశ పెట్టినా, ఆ నాటకీయత కూడా లేకుండా పోయింది. పావుగంటలో ఇంటర్వెల్ కల్లా విలన్స్ ని చంపేసి ఫస్టాఫ్ కథ ముగించేస్తాడు.
       
సెకెండాఫ్ లో చెల్లెలి కోసం కథ మొదలవుతుంది. సత్య లక్ష్యం చెల్లెలే కాబట్టి సంపద మీద ఆసక్తి లేని తను ఇంటర్వెల్లో విలన్స్ ని చంపేశాడనుకో వచ్చు.
డబ్బు వద్దు, చెల్లెలే కావాలి అని విలన్స్ తో అంటాడు కూడా. అయితే సెకండాఫ్ లో ఆ విజయ్ డబ్బే తీసి వాడేస్తాడు సత్య. నీ చెల్లెలు దొరకాలంటే పేదలకి సాయపడమని సీనియర్ బిచ్చగాడు అనడంతో, ఆ విజయ్ కి చెందిన డబ్బుతో పేదలకి సాయపడతాడు సత్య. నైతికంగా ఇది కరెక్టేనా? ఇక ముగింపులో కోర్టు సీనులో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతాయి. మెదడు మార్పిడి విషయం కోర్టు దృష్టికే రాకుండా సత్యకి శిక్షపడుతుంది- విలన్స్ ని చంపిన కేసులో. 
       
తనని చంపి తన మెదడు విజయ్ కి అమర్చారని చెప్పాల్సింది చెప్పడు సత్య. జరిగినవి మూడు హత్యలే కాదు
, సత్య హత్యతో కలుపుకుని నాల్గు హత్యలు. చాలా చిక్కు ముడి కేసు ఇది. విలన్స్ ముగ్గురూ హత్యకి గురయ్యారంటే, వాళ్ళని సత్య మెదడుతో వున్న విజయ్ చంపినట్టా, లేక విజయ్ శరీరంతో వున్న సత్య చంపినట్టా? కోర్టు జుట్టు పీక్కోవాల్సిందే!
       
హిందీ
నెయిల్ పాలిష్  (2021) లో, వీర్ సింగ్ మీద హత్య కేసు రుజువవుతుంది. కానీ అతను వీర్ సింగ్ కాడు. స్ప్లిట్ పర్సనాలిటీతో ఆడతనంతో చారు రైనా గా మారిన అమ్మాయి. ఇప్పుడు వీర్ సింగ్ లో వీర్ సింగ్ లేడు, చారూ రైనా వుంది గనుక, వీర్ సింగ్ చేసిన హత్యకి చారు రైనా కెలా శిక్ష వేస్తారు? జడ్జి పిచ్చెత్తి పోతాడు. ఈ కేసుని చాలా ఇంటలిజెంట్ గా సాల్వ్ చేస్తారు.  ఇదే పరిస్థితి విజయ్ -సత్యలతో కూడా వుంది. కానీ దీన్ని పట్టించుకోకుండా ఏదో వంటా వార్పు తీర్పు చెప్పేశారు.
       
ఇక విలన్స్ ని చంపిన సత్య శవాల్ని మూటగట్టి సముద్రంలో పారేస్తాడు. ఆ శవాల్ని బయట పెట్టడానికి దర్శకుడు సముద్రంలో విమాన ప్రమాదాన్ని కల్పించాడు. ప్రయాణీకుల మృత దేహాల్ని గాలిస్తూంటే ఈ శవాలు దొరుకుతాయి. ఈ శవాలు జాలర్లకి దొరికినట్టుగా చూపిస్తే సరిపోయేది. విమాన ప్రమాదం చేసి ప్రయాణీకుల్ని చంపడం దేనికి
?
       
ఇలా కథ మొత్తం అనేక లొసుగులతో వుంటుంది. చెల్లెలి సెంటిమెంటు కథ కాస్తా నేరాలు ఘోరాలు కథగా మారింది. పేదలకి చేసిన మేలుతో చివరికి చెల్లెలు కన్పిస్తే
, భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. అయితే చెల్లెలు ఇన్నాళ్ళూ ఎక్కడుందో ఏమిటో వివరం వుండదు.

నటనలు - సాంకేతికాలు

సంపన్నుడుగా, బిచ్చగాడుగా విజయ్ ఆంటోనీ బాగానే నటించాడు. అతను నటనలో ఫెయిల్ కాడు. ఈ సారి పాత్రల్ని కూడా ఫీలైతే ఇంకా బాగా నటించేవాడు. తను సత్య మెదడుతో వున్న విజయ్ అన్న వొక ఎవేర్నెస్ తో పాత్రలు నటించివుంటే- ఆ అంతర్ సంఘర్షణ వేరేగా వుండేది.  ఇవి మాస్ పాత్రలే అయినా ఎంటర్ టైన్ చేయవు. సీరియస్ పాత్ర పోషణలే చేశాడు. ప్రారంభంలో తప్పితే హీరోయిన్ తో రొమాన్స్ కి కూడా అవకాశం లేదు. హీరోయిన్ కావ్యా థాపర్ రూపం శిల్పం బావున్నా పాత్ర అంతంత మాత్రం. పాటలో కాస్త ఎక్స్ పోజింగ్. విలన్లు ఓకే. ముఖ్య మంత్రి పాత్రని రాధారవి నటించాడు.
       
కథ
, రచన, సంగీతం, ఎడిటింగ్, ద్విపాత్రాభినయం, దర్శకత్వం,నిర్మాణం ఇవన్నీ విజయ్ ఆంటోనీ ఖాతాలోకి పోతాయి. తొలిసారి అయినా అనుభవమున్న వాడిలా దర్శకత్వం వహించాడు. నిర్మాణ విలువలు బిచ్చగాడికి రిచ్ గా వున్నాయి.

చివరికేమిటి?

Money is injurious to the world’ (డబ్బు ప్రపంచానికి హానికరం) ని ఆరంభంలో వేశారు. ఏ ప్రపంచానికి హానికరం? చిన్నప్పట్నుంచీ అడుక్కుతింటున్న సత్య లాంటి వాళ్ళ ప్రపంచానికా? వైభోగాలు అనుభవిస్తున్న విజయ్ లాంటి వాళ్ళ ప్రపంచానికా? కొటేషన్ కీ కథకీ సంబంధం కన్పించదు. ఆర్ధిక మాంద్యంతో ప్రపంచం, ఆర్ధిక విధానాలతో దేశం కల్లోలంగా మారి ప్రజలు అలమటిస్తూంటే, డబ్బు ప్రపంచానికి హానికరమని నెగెటివ్ భావాలు ప్రసారం చేయడం అర్ధం లేనిది. ఏ సెంటిమెంటూ లేకుండా పదేపదే లక్ష్మిని రద్దు చేస్తున్న ప్రభుత్వంతో వంత పాడుతున్నట్టుంది కొటేషన్. ఇండియా అంటే ఇదే అన్నట్టు సినిమా నిండా కడుపాకలితో బిచ్చగాళ్ళ ఆర్తనాదాలూ, మురికి కూపాల్లో నివాసాలూ చూపిస్తూ డబ్బు ప్రపంచానికి హానికరమని చెప్తే, మరి దారిద్ర్యం ఆరోగ్యకరమా? అసలు బిచ్చగాడు 2 తో ఏం చెప్పాలనుకున్నాడో అర్ధంగాదు.
       
నేటి సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ అయితే రోమాంటిక్స్
, కాకపోతే ఎకనామిక్స్ తో కూడిన జానర్లయినప్పుడు, ఇలా ఎకనామిక్స్ ని నెగెటివ్ అర్ధంలో చూపించి గ్లామరైజ్ చేయడం ఏ మాత్రం విజ్ఞత అన్పించుకోదు. ఉద్దరించడానికి బయల్దేరిన హీరో ఒక్క బిచ్చగాడికీ గౌరవనీయ జీవితం కల్పించింది లేదు.
—సికిందర్


Friday, May 19, 2023

1330 : సాంకేతికం


 

సినిమా నిర్మాతలు లొకేషన్స్ కోసం దేశంలోగానీ, విదేశాల్లోగానీ ఎక్కడికీ వెళ్ళనవసరం లేకుండా, స్టూడియోలోనే ఆయా దృశ్యాల్ని షూట్ చేసుకునే సదుపాయం ఏమైనా వుందా అంటే, దానికి అన్నపూర్ణ స్టూడియోస్ -క్యూబ్ సినిమాస్ జాయింట్ వెంచర్ వుందనే సమాధానం చెప్తోంది. ఏఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ అనే సాంకేతిక సదుపాయం దేశంలోనే సరి కొత్త అథ్యాయానికి హైదరాబాద్ లో శ్రీకారం చుట్టింది.

        క నిర్మాతలు లొకేషన్స్ గురించి వెనుకాడకుండా, కోరుకున్న లొకేషన్స్ తో కథల్ని రూపొందించుకునే వెసులుబాటు కలుగుతోంది. ఈ సదుపాయం నిర్మాతల్ని భౌతికంగా లొకేషన్స్ కెళ్ళకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో వాస్తవ- వర్చువల్ అంశాల్ని మిళితం చేయడానికి, దృశ్యాల్ని చిత్రీకరించడానికీ  అనుమతిస్తుంది. ఏఎ న్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ గా నామకరణం చేసిన ఈ టెక్నాలజీతో  సినిమా నిర్మాణంలో లొకేషన్స్ తో రాజీపడకుండా కథల్ని రూపొందించుకునే స్వేచ్ఛని పొందగల్గు తారు. దీనికి గాను అత్యాధునిక ఐసీవీఎఫెక్స్ (ఇన్-కెమెరా విజువల్ ఎఫెక్ట్స్) సౌకర్యాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ -క్యూబ్ సినిమా సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి.
        
గతేడాది అక్టోబర్ నుంచే ఈ టెక్నాలజీకి సంబంధించి ప్రయోగాలు ప్రారంభించారు. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలపై  ప్రయోగాలు సంతృప్తి నిచ్చాక సినిమాల కోసం మార్కెట్లో ప్రవేశపెట్టారు.
        
ఈ సదుపాయంలో అత్యాధునిక హై బ్రైట్‌నెస్-కర్వ్డ్ ఎల్ఈడీ వాల్, టాప్-ఆఫ్-ది-లైన్  ఏఓటీఓ ఎల్ఈడీ డిస్‌ప్లేలు, రెడ్ స్పై నుపయోగించి అత్యాధునిక కెమెరా ట్రాకింగ్- కస్టమ్-బిల్ట్ రెండరింగ్ సిస్టమ్‌లు వున్నాయి.
         
క్యూబ్ దైన సాంకేతిక పరిజ్ఞానానికి, స్టూడియోల్ని నడపడంలో అన్నపూర్ణ సంస్థ అనుభవం తోడై, ఈ వర్చువల్ స్టేజ్ సుసాధ్యమయింది. ఇది కంటెంట్ ప్రొడక్షన్‌లో కొత్త శకానికి నాంది. నిర్మాతలు అత్యంత సమర్థవంతంగా, ఖర్చుని ఆదా చేసే పద్ధతిలో పని చేయడానికి అనుమతించే పర్యావరణ వ్యవస్థని  రూపొందించడానికి ఈ స్టేజి కట్టుబడి వుంది.
        
అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా రెండూ భారతీయ మీడియా వ్యాపారంలో రెండు పేరు ప్రతిష్టలున్న సంస్థలు. స్టేజ్ కి గల సమగ్ర వర్క్ ఫ్లో సొల్యూషన్ నిర్మాతలకి  అపూర్వమైన సౌలభ్యాన్ని, నియంత్రణనూ అందజేస్తుంది, వారి సృజనాత్మక లక్ష్యాల్ని  ఎటువంటి పరిమితులు లేకుండా సాధించడానికి వీలు కల్పిస్తుంది.
         
నిర్మాతలు ఇప్పుడు వాస్తవ - వర్చువల్ దృశ్యాల్ని సజావుగా మిళితం చేయవచ్చు. వాతావరణాన్ని, వెలుతురుని తమ ఇష్టానుసారంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి వుంటారు. అంతేగాక ఎక్కువ సృజనాత్మక నియంత్రణ వారికి లభిస్తుంది.
        
అన్నపూర్ణ స్టూడియోస్ చలనచిత్ర పరిశ్రమకి అందించే మౌలిక సదుపాయాలకు,  సేవలకూ ప్రసిద్ధి చెందింది. సాంప్రదాయ ఫిల్మ్ స్టూడియోగా, ప్రొడక్షన్ హౌస్‌గా ప్రారంభమై, నేడు ఇది అన్ని మీడియా ఫార్మాట్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ సేవలతో అంతర్జాతీయ స్థాయి స్టూడియోగా రూపాంతరం చెందింది. లెగసీ బ్రాండ్‌గా 'అన్నపూర్ణ' ఉత్పత్తి, పంపిణీ, మౌలిక సదుపాయాల విషయంలో ముందుంది. మీడియా పరిశ్రమకి కొత్త సాంకేతికాల్ని, వ్యాపార నమూనాల్నీ తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది.
        
ఇక గత మూడు దశాబ్దాలుగా దేశంలోని మీడియా పరిశ్రమని మార్చడంలో క్యూబ్ సినిమా విజయం సాధించింది. ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ ఫ్లోలను బాగా మెరుగుపరచగల సాంకేతికతని గుర్తించి, అవలంబించగల సామర్థ్యానికి నిదర్శనంగా ఈ సంస్థ వుంది. కంటెంట్ ఉత్పత్తిలో తదుపరి పరిణామ దశ అయిన వర్చువల్ ప్రొడక్షన్‌తో నేటి వేగవంతమైన, డిమాండ్‌తో కూడిన వినోద వాతావరణం కోసం, ఉత్పత్తి ప్రక్రియని  మళ్ళీ రూపొందించడానికి అన్నపూర్ణ - క్యూబ్‌ల మధ్య గల ప్రత్యేకమైన సహకారం ఈ అనుభవాన్ని అందిస్తుంది.
        
ఏఎన్నార్  వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ప్రారంభాన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమకి  గేమ్-ఛేంజర్ గా, ప్రపంచ వినోద పరిశ్రమలో భారతదేశ వినోద రంగం గణనీయమైన ముందడుగు వేస్తున్న పరిణామంగా భావించ వచ్చు. వర్చువల్ ప్రొడక్షన్ స్టేజి భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ-స్థాయి శాశ్వత ICVFX సౌకర్యం. ఇది లాజిస్టిక్స్ లో, ప్రొడక్షన్‌లో గణనీయమైన ఖర్చుని ఆదా చేస్తుంది.
        
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ అత్యాధునిక టీపీఎన్ -సర్టిఫైడ్ డాల్బీ ఆమోదించిన పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలతో పాటు, సినిమా- మీడియా పరిశ్రమ కోసం 11 షూటింగ్ అంతస్తులతో, లొకేషన్ సౌకర్యాలతో  అత్యుత్తమ మౌలిక సదుపాయాల్ని  అందిస్తోంది. డేటా స్టోరేజ్, వీడియో ఎడిటింగ్, ఆడియో డబ్బింగ్, 4K కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్, మాస్టరింగ్ వంటి బహుళ సేవల్ని అందిస్తోంది.
        
అన్నపూర్ణాలో ప్రారంభమయిన వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ని ఆన్-సెట్ వర్చువల్ ప్రొడక్షన్ ( OSVP ), వర్చువల్ ప్రొడక్షన్ ( VP ), లేదా ఇన్-కెమెరా విజువల్ ఎఫెక్ట్స్ ( ICVFX ) అని కూడా పిలుస్తారు. ఇది టెలివిజన్ లేదా మూవీ ప్రొడక్షన్ కోసం ఎల్ ఈడీ ప్యానెల్స్ నుపయోగించే వినోద సాంకేతికం. ఇందులో సెట్స్ కి బ్యాక్ డ్రాప్ కోసం వీడియో లేదా సీజీ చిత్రాల్ని రియల్ టైమ్ లో ప్రదర్శించవచ్చు. ‘స్టార్ వార్స్ నిర్మాత జార్జి లూకాస్ కి చెందిన ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ (ఐ ఎల్ ఎం) స్టూడియో అభివృద్ధి చేసిన ఈ స్టేజి క్రాఫ్ట్ ని 2019 లో మాండలోరియన్ సినిమాలో ఉపయోగించిన తర్వాత, ఈ టెక్నాలజీ విస్తృతంగా వాడకం లోకి వచ్చింది.
            
2019లో ఐ ఎల్ ఎం ఆవిష్కరణ తర్వాత నుంచి  అక్టోబర్ 2022 నాటికి దాదాపు 300 సంస్థలు స్టేజిలని అందిస్తున్నాయి. కోవిడ్ లాక్ డౌన్ ల సమయాల్లో ఔట్ డోర్ షూటింగులకి అవకాశం లేని నేపధ్యంలో స్టూడియోల్లో ఈ వర్చువల్ స్టేజిలు వెలిశాయి. మన దేశంలో ఆలస్యంగా ఇప్పుడు అన్నపూర్ణాలో వెలసింది. మార్చి 2023 లోనే , ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలోని డాక్ ల్యాండ్ స్టూడియోస్ లో, ప్రపంచంలోనే అతి పెద్దడైన వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ప్రారంభమైంది.
        
ఈ టెక్నాలజీ ప్రారంభమయిన 2019 నుంచి 17 టీవీ సిరీస్, 22 హాలీవుడ్ సినిమాలు నిర్మాణం జరుపుకున్నాయి. బ్లాక్ ఆడమ్, బుల్లెట్  ట్రైన్, టాప్ గన్- మెవరిక్, రెడ్ నోటీస్, ది బ్యాట్ మాన్, స్టార్ వార్స్- ది రైజ్ ఆఫ్ స్కై వాకర్ మొదలైన సినిమాల్లోని ఔట్ డోర్ దృశ్యాల్ని ఈ టెక్నాలజీ పరంగా చూడొచ్చు


Thursday, May 18, 2023

1329 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : నందినీ రెడ్డి
తారాగణం: సంతోష్ శోభన్, మాళవికా నాయర్, షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు
స్క్రీన్ ప్లే : షేక్ దావూద్, మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం: మిక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్ : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
విడుదల : మే 18, 2023
***

        యువ హీరో సంతోష్ శోభన్ 2011 లో ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచీ నటించిన 9 సినిమాలూ సక్సెస్ కి దూరంగా వుండిపోయి స్ట్రగుల్ చేస్తున్న సందర్భంలో, 10 వ అవకాశంగా అన్నీ మంచి శకునములే విడుదలైంది. ఒక్క గత సంవత్సరమే నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, కళ్యాణం కమనీయం’, శ్రీదేవీ శోభన్ బాబు మూడూ అట్టర్ ఫ్లాపయ్యాక, ఇప్పుడు పేరున్న దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2019లో కొరియన్ రీమేక్ ఓహ్ బేబీ హిట్ తర్వాత నాల్గే ళ్ళకి నందినీ రెడ్డి  కొత్త సినిమా వెండితెర నలంకరించింది. మహానటి, సీతా రామం వంటి హిట్స్ అందించిన స్వప్న సినిమా సంస్థ నుంచి తాజాగా వస్తున్న కుటుంబ ప్రేక్షకుల సినిమా అన్పి స్తున్న  అన్నీ మంచి శకునములే ఎలా వుంది? మళ్ళీ కుటుంబ ప్రేక్షకులకి అదే పాత కాలక్షేపమా, లేక కొత్త ఉత్సాహమేమైనా వుందా పరిశీలిద్దాం...

కథ  

ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్), సుధాకర్ (నరేష్) కుటుంబాల మధ్య వాళ్ళ ముత్తాతలు సంపాదించిన కాఫీ ఎస్టేట్ గురించి తగాదాలుంటాయి. ఈ తగాదాలుండగా, సుధాకర్ కొడుకుగా రిషి (సంతోష్ శోభన్), ప్రసాద్ కూతురుగా ఆర్య (మాళవికా నాయర్) పుడతారు. ఒకే సమయంలో పుట్టిన వీళ్ళిద్దరూ హాస్పిటల్లో చేతులు మారిపోతారు. దీంతో ప్రసాద్ కొడుకుగా రిషి, సుధాకర్ కూతురుగా ఆర్య పెరిగి ప్రేమలో పడతారు. ఆర్య కాఫీని విదేశాలకి ఎగుమతి చేయాలనే బిజినెస్ మైండ్ తో వుంటుంది.రిషి ఈ క్షణం ఎంజాయ్ చేయాలన్న లేజీ మైండ్ తో వుంటాడు. మరి భావాలు కలవని వీళ్ళిద్దరి ప్రేమ ఏమైంది? తాము పుట్టుకతో చేతులు మారిపోయామని ఎప్పుడు తెలుసుకున్నారు? వీళ్ళు తారుమారైన సంగతి కుటుంబాలకెప్పుడు తెలిసింది? కాఫీ ఎస్టేట్ తగాదా ఎలా తీరింది? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఒక ప్రేక్షకుడు దీన్ని 1952 నాటి కథగా ట్వీట్ చేశాడు. నిజమే, యూట్యూబ్ లో ప్రేక్షకులు బోలెడు పాత కుటుంబ సినిమాల్ని తనివిదీరా ఎంజాయ్ చేస్తూండగా, అదే మళ్ళీ నందినీ రెడ్డి తీయడమెందుకు? ఈ కాలపు కొత్త కుటుంబ కథ చెప్పొచ్చుగా? ఒక హాస్పిటల్, ఇక్కడ ఇద్దరు పిల్లలు పుట్టడం, ఇద్దరు నర్సులు పొరబడి ఆ పిల్లల్ని తారుమారు చేయడం- వంటి కథలతో ఎన్ని తెలుగు, హిందీ, తమిళ సినిమాలు రాలేదు. బ్రిటన్ లో డినైజ్ రాబిన్స్ కూడా 50 ఏళ్ళ  క్రితం ఈ ఫార్ములాతోనే నవలలు రాసింది.
       
ఇక రెండు కుటుంబాల మధ్య తగాదాలనే ఇంకో పాత ఫార్ములా కలిపి చేసేస్తే ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా అవుతుందని దర్శకురాలు భావించింది. కానీ తెరమీద వేరేగా వచ్చింది. అక్కడక్కడా కొన్ని నవ్వించే సీన్లు మాత్రం వర్కౌట్ అయ్యాయి తప్పితే
, మొత్తం కథగా దీన్ని కొత్తగా చెప్పలేని అవే పాత సన్నివేశాల్ని చూపించే ట్రాప్ లో పడిపోవడంతో, రెండు గంటలా 34 నిమిషాల సుదీర్ఘ సహన పరీక్ష అయిందీ సినిమా. దర్శకురాలు ప్రేక్షకులతో కలిసి చూస్తే వాళ్ళు పడే బాధ తెలుస్తుంది. బోరుకైనా పరిమితి వుంటుంది.
       
తెలుగులో ఇక కుటుంబ సినిమాలు తీయకపోవడం ఉత్తమం. పాత కథలే తీసినా
, కనీసం యూట్యూబ్ పాత సినిమాల్లోని భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, నాటకీయతా కాపీ చేసైనా తీయలేనప్పుడు తీయడం వృధా!

నటనలు- సాంకేతికాలు

సంతోష్ శోభన్ టాలెంట్ వున్న నటుడు. ప్రతీసారీ టాలెంట్ ని నిరూపించుకుంటూనే వున్నాడు కానీ, సినిమాలే సహకరించడం లేదు. అతడి టాలెంట్ కి కలిసొచ్చే అంశం ఈజ్. ఎలాటి పాత్రనైనా ఈజ్ తో సహజంగా నటించేస్తాడు. ఇది మూడో సినిమా తనూ నేను తోనే మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సారికూడా పాత్ర కుదర్లేదు. కారణం కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. ముగింపులో మాత్రం భావోద్వేగాలతో కట్టి పడెసే నటన కనబర్చాడు. ఇక కుటుంబ దృశ్యాల్లో చాలా సార్లు సీనియర్ నటుల డామినేషన్ తో డ్యామేజీ అయ్యాడు. దీన్ని బ్యాలెన్స్ చేయలేదు దర్శకురాలు. మాళవికా నాయర్ తో రొమాన్స్ కూడా విషయం లేక ఫ్లాట్ గా సాగడంతో రాణించడం కష్టమై పోయింది శోభన్ కి. రెండు పాటలైనా ఆదుకుని వుంటే సినిమాలో వున్న బోరు కొంత తగ్గేది.
       
మాళవికా నాయర్ పాత్రకి వ్యాపార దృక్పథముంది గానీ దీని తాలూకు పాత్రచిత్రణ కొరవడింది. ఆదర్శాలు మాటల వరకే
, ఆలోచనలు విషయం లేని ప్రేమ గురించే అన్నట్టుగా వుంది. ఇక సహాయ పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, రావురమేష్, నరేష్, గౌతమి ఇంకా చాలా మంది నటీనటులు, వాళ్ళ కోపాలు, ఆనందాలు, పాటలూ ఏవీ ప్రేక్షకులకి తాకకుండా, తామరాకుపై నీటి బొట్టు టైపులో వుండిపోతారు.
       
మిక్కీ జె మేయర్ సంగీతం ఎవరేజ్ గా వుంది. కూనూరు
, ఇటలీ లొకేషన్స్ లో సన్నీ, రిచర్డ్స్ ల కెమెరా వర్క్ టైటిల్ కి తగ్గ మూడ్ తో వుంది. లక్ష్మీ భూపాల రాసిన మాటలు వుండాల్సిన చోట బలంగా, లేని చోట్ల తేలికగా వున్నా, మొత్తం కథని డ్రైవ్ చేసే ఫ్లో తో లేవు. ఎందుకంటే కథకే ఒక ఫ్లో లేదు. కారణం షేక్ దావూద్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే కాకుండా స్క్రీన్ ఫ్లూ అయి వ్యాపించడం. మళ్ళీ దీనికి కారణం కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఎంత స్లోగా సాగాలో అంత స్లోగా సినిమా సాగి తీరుతుంది.

చివరికేమిటి?

కథలో కాన్ఫ్లిక్ట్ మర్చిపోయి ఎవరైనా సినిమా తీస్తారా? తీస్తే ఏం కథ చూస్తున్నామో అర్ధమవుతుందా? కథంటేనే కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ). రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల కాన్ఫ్లిక్ట్ వుంది- ఇది వెనక్కి వెళ్ళిపోయి, నానా తిప్పలుపడి ఎలాగో హీరోహీరోయిన్ల మధ్య ఇంటర్వెల్లో ఇగోలకి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. దీంతో సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుకుని చూస్తే, హీరోహీరోయిన్లు ఇగోల తగాదాలే మర్చిపోతారు. దీంతో ఏ కాన్ఫ్లిక్ట్ లేని కథ - సంబంధం లేని సీన్లతో, కామెడీలతో చివరి వరకూ సహనాన్ని పరీక్షిస్తూ తీసికెళ్ళి - ఆనాడు పుట్టుకతో హీరోహీరోయిన్లు తారుమారైన విషయం బయటపడి సుఖాంత మవుతుంది.
       
కథలో ఒక చోట ఒక పాయింటు ఉత్పన్న మవుతుంది- పుట్టి తారుమారురైన హీరో ఆ పెంపుడు తల్లి స్వభావంతో పెరుగుతాడు. హీరోయిన్ ఆ పెంపుడు తండ్రి స్వభావంతో పెరుగుతుంది. అప్పుడు తాము తారుమారైన విషయం తెలిస్తే ఆ పెంపుడు తల్లి
, ఆ పెంపుడు తండ్రి స్వభావాల్ని పుణికి పుచ్చుకుని పెరిగిన తాము, వాటిని కలుషితం చేసుకోలేక-  నిజం బయటపడకుండా చేసే ప్రయత్నాలతో కాన్ఫ్లిక్ట్ పుట్టి వుంటే- ఇది యూత్ అప్పీలున్న హీరోహీరోయిన్ల కథగా కాస్త నయమన్పించుకునేది.

—సికిందర్